21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్:

అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్:

కోర్టు లో క్లాస్ ఫోర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల బాలుడి జీవిత కథ ఇది.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అతను ఓ జానపద గాయకుడు, రచయిత, "ఇక్ తారా" తుంబి అని పిలువబడే పంజాబీ సాంప్రదాయ సంగీతకారుడు కూడా. చిన్నతనం నుండే రచనలపై ఆసక్తి కారణంగా ఎన్నో రచనలు చేస్తూ, జానపద గాయకుడిగా, సంగీత కళను భారతీయ రేడియో మరియు టెలివిజన్ లో ప్రదర్శించేవాడు.  కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 9 వ తరగతి వరకు మాత్రమే చదివి, ఉన్నత విద్యనభ్యసించ లేక ప్రదర్శనల ద్వారా వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో ఏదో ఒక పని చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. తన మొదటి ప్రయత్నం తో కోర్టులో అటెండర్ ఉద్యోగం సంపాదించాడు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి న్యాయమూర్తి వద్ద ఎంతో కష్టించి పనిచేస్తున్నప్పటికీ, తన స్థాయి కారణంగా న్యాయమూర్తి తనకు సరైన గౌరవం ఇవ్వడంలేదన్న భావన కలిగింది. రోజంతా విధినిర్వహణలో సమయం వెచ్చిస్తున్నందున తన నైపుణ్యాలను కోల్పోతున్నాన్న భాద ఉన్నప్పటికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాడు. ఓరోజు న్యాయమూర్తి ప్రవర్తనతో విసుగుచెంది, అటెండర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ సంఘటన తర్వాత ఆ బాలుడు తన ఆత్మకథను "మై సాన్ జడ్జ్ డా అర్ధాలి" అని తన మాతృ భాష అయిన పంజాబీ భాషలో రాసుకున్నాడు. అతనే "నిందర్ ఘుగియాన్వి". నిందర్ ఘుగియాన్వి ఒక అటెండర్ స్థాయి నుండి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, ఘుగియాన్వి 69 పుస్తకాలు రాశారు. తన ఆత్మకథలో భారత న్యాయ వ్యవస్థలో క్లాస్ ఫోర్ ఉద్యోగులను వ్యక్తిగత సేవకులుగా ఎలా ఉపయోగిస్తారో చిత్రీకరించబడింది. ఈ పుస్తకం ప్రజాదరణ పొందడమే కాదు అతని ఆత్మకథ "ఐ వాజ్ ఏ సెర్వెన్ట్  టు ఏ  జడ్జ్" అని ఆంగ్లంతో పాటు 15 భారతీయ భాషలలోకి అనువదించబడింది. గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, పంజాబీ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం తో సహా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను వారి పాఠ్యాంశాల్లో చేర్చాయి. 12 విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్ మరియు పిహెచ్‌డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు నిర్వహించారు.

అటెండర్ నుంచి ప్రొఫెసర్ గా ఎలా ఎదిగారు తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా చదవాల్సిందే..

కోర్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ భాషా విభాగంలో తోటమాలి గా చేరారు. అక్కడ అతని పని మొక్కలకు నీరు పెట్టడం తోటను చూసుకోవడం మాత్రమే. ఘుగియాన్వి "ఇక్ తారా" తుంబి వాయించడంలో ప్రావీణ్యత కలిగినందున సాహిత్య విభాగంలో జరిగే కార్యక్రమాలలో ఇక్ తారా వాయించేవాడు. అతి తక్కువ సమయంలోనే సంగీత వాయిద్య కళాకారుడిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఒక తోటమాలి ఇంత ప్రజాదరణ పొండటమేంటని కొంతమంది అధికారులు అసూయపడి అతన్ని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించారు. టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేరు అన్నట్లు అతనికి పంజాబీ భాషపై పట్టున్నందున కాలక్రమేణా అతను ప్రభుత్వ భాషా శాఖ సభ్యుడిగా ఎంపికైనారు. మొదటిసారిగా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనిని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించిన అదే అధికారి, అతన్ని మిస్టర్ నిందర్ ఘుగియాన్వి జీ అని పిలవడం ప్రారంభించాడు. నిందర్ ఘుగియాన్వి సాధారణ జీవితం నుండి సాహిత్య ఔన్నత్యానికి ఎదగడం పంజాబీ సంస్కృతి, భాష మరియు సాహిత్యం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. పంజాబీ సంస్కృతికి ఆయన చేసిన కృషి ని గుర్తించి పంజాబ్ విశ్వవిద్యాలయం 'సాహిత్య రతన్' అవార్డుతో సత్కరించింది.

అటెండర్ గా తన కెరీర్‌ను ప్రారంభించి, తన ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాడు, చివరికి పంజాబీ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచి, 69 కంటే ఎక్కువ పుస్తకాలు రాయడానికి దోహదపడింది. ఆయన రచనలపై అనేక లఘు చిత్రాలు నిర్మించబడ్డాయి మరియు ఆయన పంజాబ్ జానపదాలు మరియు సంస్కృతిపై పరిశోధనలు చేశారు. ఆయన నైపుణ్యాన్ని గుర్తించి, IAS మరియు PCS అభ్యర్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి ఆయనను ఆహ్వానించారు. ఇటీవల, ఆయన బటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిందర్ ప్రపంచవ్యాప్తంగా USA, UK, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటించి విదేశీ సంస్కృతుల గురించి నేర్చుకుంటూనే తన సొంత సంస్కృతిని విదేశాలకు ప్రచారం చేశారు.

1994లో భారత రాష్ట్రపతి ఎస్.గియాని జైల్ సింగ్, 2001లో కెనడా ప్రధానమంత్రి శ్రీ జి. క్రెచియన్ మరియు 2005లో యుకె ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ వంటి ఉన్నత స్థాయి ప్రముఖులచే సత్కరించబడిన గౌరవం నిందర్ ఘుగియాన్వికి లభించింది.

నిందర్ ఘుగియాన్వి యొక్క ఆత్మకథను ‘‘నేను జడ్జిగారి సేవకుడ్ని’’ అన్న పేరుతో డా. రహీమ్ పఠాన్ ఖాన్ తెలుగులోకి అనువదించారు.

జీవితం తరచుగా ఊహించని మలుపులు తీసుకుంటుంది మరియు విజయం కొన్నిసార్లు తీవ్ర ప్రతికూల క్షణాల నుండి ఉద్భవిస్తుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. 

 

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475



6, ఫిబ్రవరి 2025, గురువారం

ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"


విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్నికూడా మించి పోయాడు.

అలాంటి అభినయ ఏకలవ్యుడిలాంటి స్ఫూర్తిదాయకమైన యధార్థ విజయ గాథ నిజామాబాద్, నాందేవ్ గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతుల కుమార్తె హారికది.

హారిక తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.చిన్నప్పటినుండి చదువులో అందరికంటే ముందుండే హారిక ఏడవతరగతిలో ఉన్నపుడే తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పట్టుదలతో చదివిన ఆమె పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. తన చిన్ననాటి ఆశయ సాధన కోసం నీట్ పరీక్ష రాయాలనుకుంది. కానీ నీట్ కోచింగ్ కోసం ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ నిరుత్సాహం చెందక తల్లి ప్రోత్సహంతో ముందడుగు వేసింది.  నిరుపేదరాలైనప్పటికీ,మనుసుంటే మార్గాలెన్నో అన్నట్లు హారిక పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ప్రతిరోజూ యూట్యూబ్ లో దీక్షగా వీడియో క్లాసులు చూస్తూ పరీక్షకు సిద్ధమైంది. కోచింగ్ కు  డబ్బులు లేవని ఆగిపోకుండా తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకొని ఘోర తపస్సు చేసి నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కాలేజీలో సీట్ వచ్చిన తరువాత ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కలిపి మొత్తం 2 లక్షలవరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలేనిరుపేదరాలైన హారిక  డబ్బు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతూ తన చదువుకోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకోగా  అందుకు ఎంతోమంది దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.

నేటి యువతకు ఇంటర్నెట్ (మొబైల్) నిత్యవసర వస్తువులా మారిపోయింది.కొంతమంది ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా వృధాచేసుకుంటున్నారు.సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభం, నష్టం అనేది వినియోగదారుడిమీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని మంచికి వాడితే మాత్రం ఈ భూమిమీద తెలియని విషయాలెన్నోతెలుసుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలల్లో దొరకని సమాచారం కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో క్లాసులు వింటూ నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్ సాధించిన హారిక విజయమేఇంటర్నెట్ ని మంచికి ఉపయోగిస్తే విద్యార్థులకు ఎంత ప్రయోజనకరమో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ.       

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్నిఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్నహారిక ఎందరికో ఆదర్శం.

సాధించాలనే తపన ఉంటేఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

అసాధ్యమనే పదంలో"అ" అనే అక్షరాన్ని పక్కనే పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

ప్రతి విద్యార్థి అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.

 

మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com


https://www.ntnews.com/editpage/a-mind-has-a-way-when-you-constantly-work-towards-an-ambition-what-you-think-will-come-true-858966

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

విమర్శ

విమర్శ:

విమర్శ అనేది ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి దారి తీస్తుంది. ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని చెడగొడుతుంది. విమర్శించే వారిని కొంతమంది ఇష్టపడరు. విమర్శించేవారు లేకపోతే మనిషి ఏమి సాధించ లేడన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు. నేను సున్నిత విమర్శకుడినే. కొన్నిసార్లు విమర్శ కుసంస్కారికి ఆయుధం లాగా పనిచేస్తుంది. ప్రతి స్పందన సంస్కారి సవరణ.

యధార్థ సంఘటన;

నేను సుభాష్ నగర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, సంస్థ యజమాని ఒక రోజు డిజైన్ చేయమని దాని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విని అందులో ఉన్న లోపాన్ని ఆయనకు అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన యజమాని అనే గర్వంతో నేను చెప్పిన విషయాన్ని గ్రహించక వాగ్వాదానికి దిగాడు. అతనికి చాలామంది నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు వితండవాదానికి దారి తీసింది. ఆ తర్వాత నేను జాబ్ కోల్పోవడం జరిగింది. నేను మానేసిన తర్వాత వేరే అతనికి కూడా అదే పరీక్షా అతను ఎవరో కాదు నా మిత్రుడే. అతను ఓపికగా ఆయన చెప్పిన దాన్ని చేసి చేతులు దులుపుకున్నాడు. అతను చేసిన డిజైన్ ప్రాక్టికల్ గా చేసి చూస్తే అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు అందుకు కంపెనీ యజమాని 20 లక్షలు నష్టపోయాడు. నష్టపోయిన సరే యజమాని గర్వం దిగలేదు. నా మిత్రుడు మాత్రం నెల నెల జీతం తీసుకుంటూ యజమాని చెప్పిన పని చేసేవాడు. అలా ఎన్నో ప్రాజెక్టులు చేసి నష్టపోతూ నష్టపోతూ మొన్న ఈమధ్య కంపెనీ మూతపడింది. కంపెనీలో పనిచేసే వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఒక విమర్శకుడి వల్ల లాభమే తప్ప నష్టం మాత్రం ఉండదు అనేది నిజం. అసలు విమర్శ లేకపోతే మనిషి వృద్ధి చెందలేడనేది ముమ్మాటికీ నిజం. అందుకు పైన చెప్పిన ఉదాహరణ ఒకటి. నేను విమర్శించి చెడ్డవాడిని అయ్యాను కానీ నేను నష్టపోలేదు. విమర్శకుడు ఎప్పుడు నష్టపోడు. విమర్శకుడి మాటను అర్థం చేసుకోలేకపోతే ఎదుటివారి నష్టపోతారు. నేను విమర్శించడం వల్ల జాబ్ కోల్పోయాను అందుకు ఒక సంవత్సరం పాటు జాబ్ కొరకు చాలా ఇబ్బందులు పడ్డాను కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి నాది. ఒకరోజు హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా లో ప్రభుత్వ ఉద్యోగి అయినా జగదీశ్ సార్ ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ లో ఒక చిన్న పని చేయమని వర్క్ ఇచ్చారు అలా పరిచయం ఏర్పడి నేను కోల్పోయిన జాబ్ గురించి అసలు జరిగిన విషయం గురించి చెప్పాను. ఆయన నా బాధను అర్థం చేసుకొని నీకు జాబ్ వచ్చేవరకు నేను రూమ్ రెంట్ కడతాను జాబ్ వచ్చాక నాకు జాబ్ వచ్చిందని చెప్తే చాలు బాబు నువ్వు ఏమి బాధపడకు అన్నారు. అన్నట్లే ఆయన నా జాబ్ వచ్చేవరకు రూమ్ రెంట్ కట్టినారు. నాకు జాబ్ వచ్చాక మొదటి సారి ఆయనకు ఫోన్ చేసి చెప్పాను సంతోషించాడు. ఆయన కట్టిన రూమ్ రెంట్ డబ్బులు ఇవ్వబోతే అస్సలు వద్దన్నాడు. జగదీశ్ సార్ చేసిన మేలు నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను. ఇప్పటికి జగదీశ్ సార్ కి అప్పుడప్పుడు కాల్ చేస్తే జాబ్ ఎలా ఉంది ఏమైనా సహాయం కావాలంటే అడుగు దామోదర్ అంటారు. ఇలాంటివారికంటే నా జీవితంలో కావాల్సింది ఏముంది. విమర్శ వల్ల నేను కోల్పోయింది ఏముంది ఏమీ లేదు జాబ్ మాత్రమే కానీ విమర్శను అర్థం చేసుకోలేని యజమాని మాత్రం కంపెనీ కోల్పోయాడు. అతను కంపెనీ కోల్పోవడమే కాకుండా అందులో ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు కారకుడయ్యాడు. యజమాని ధనవంతుడు, శక్తివంతుడు కావొచ్చు కానీ కాలం అంతకంటే శక్తివంతమైనది. ఒక చెట్టు నుండి లక్ష అగ్గిపుల్లలు తయారవుతాయి కానీ ఒక అగ్గి పుల్లతో లక్షల చెట్లు బూడిద అవుతాయి అన్నట్లుగా విమర్శకుడి వల్ల మంచి జరుగుతుంది కానీ మౌనం గా ఉండే వారి వల్ల అన్ని కోల్పోవాల్సి వస్తుంది.

మరో యదార్థ సంఘటన:

మౌనంగా ఉండే నా మిత్రుడికి మరో మిత్రుడొకరు ఫోన్ చేసి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని అడిగారు. ఆయన రెండు మూడు కోర్సులు చెప్పి మిత్రుడి సలహా కోరారు. నా మిత్రుడు బయట ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దొరకని ఒక కోర్సు పేరు చెప్పి చేయమన్నారు. పాపం అతని మిత్రుడు గుడ్డిగా నమ్మి వారి అబ్బాయిని మిత్రుడు చెప్పిన కోర్స్ చేయించారు. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయి రెండు సంవత్సరాలు అయింది ఉద్యోగం లేదు. నా మిత్రుడి కంటే ముందు ఒకతను సలహా అడిగారట ఆయన సున్నితంగా విమర్శించి ఆయన చెప్పిన కోర్స్ ఏవి బాగాలేవు ఇంకా ఏమైనా కోర్స్ చేయించు అన్నారంట. ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా ఇంకో మిత్రుడి సలహా తీసుకొని ఆయన ఇబ్బంది పడటమే కాకుండా అబ్బాయి ఇబ్బందికి కారకుడైనాడు. 

విమర్శ ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది, విమర్శ ఒక గొప్ప స్నేహాన్ని బంధుత్వాన్ని నేలరాసే ఆయుధం. విమర్శ అనేది మోటార్ సైకిల్ కి ఇంధనం లాంటిది. ఇంధనం లేకపోతే ముందుకు పోవడం అసాధ్యం, మనిషి కూడా విమర్శ లేకపోతే పైకి ఎదగలేరు. మంచి విమర్శ, మానవులకు ఎదగడానికి కాకుండా సంపూర్ణంగా జీవించడానికి తోడ్పడుతుంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 

        


  

    

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...