విమర్శ:
విమర్శ అనేది ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి దారి తీస్తుంది. ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని చెడగొడుతుంది. విమర్శించే వారిని కొంతమంది ఇష్టపడరు. విమర్శించేవారు లేకపోతే మనిషి ఏమి సాధించ లేడన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు. నేను సున్నిత విమర్శకుడినే. కొన్నిసార్లు విమర్శ కుసంస్కారికి ఆయుధం లాగా పనిచేస్తుంది. ప్రతి స్పందన సంస్కారి సవరణ.
యధార్థ సంఘటన;
నేను సుభాష్ నగర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, సంస్థ యజమాని ఒక రోజు డిజైన్ చేయమని దాని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విని అందులో ఉన్న లోపాన్ని ఆయనకు అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన యజమాని అనే గర్వంతో నేను చెప్పిన విషయాన్ని గ్రహించక వాగ్వాదానికి దిగాడు. అతనికి చాలామంది నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు వితండవాదానికి దారి తీసింది. ఆ తర్వాత నేను జాబ్ కోల్పోవడం జరిగింది. నేను మానేసిన తర్వాత వేరే అతనికి కూడా అదే పరీక్షా అతను ఎవరో కాదు నా మిత్రుడే. అతను ఓపికగా ఆయన చెప్పిన దాన్ని చేసి చేతులు దులుపుకున్నాడు. అతను చేసిన డిజైన్ ప్రాక్టికల్ గా చేసి చూస్తే అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు అందుకు కంపెనీ యజమాని 20 లక్షలు నష్టపోయాడు. నష్టపోయిన సరే యజమాని గర్వం దిగలేదు. నా మిత్రుడు మాత్రం నెల నెల జీతం తీసుకుంటూ యజమాని చెప్పిన పని చేసేవాడు. అలా ఎన్నో ప్రాజెక్టులు చేసి నష్టపోతూ నష్టపోతూ మొన్న ఈమధ్య కంపెనీ మూతపడింది. కంపెనీలో పనిచేసే వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఒక విమర్శకుడి వల్ల లాభమే తప్ప నష్టం మాత్రం ఉండదు అనేది నిజం. అసలు విమర్శ లేకపోతే మనిషి వృద్ధి చెందలేడనేది ముమ్మాటికీ నిజం. అందుకు పైన చెప్పిన ఉదాహరణ ఒకటి. నేను విమర్శించి చెడ్డవాడిని అయ్యాను కానీ నేను నష్టపోలేదు. విమర్శకుడు ఎప్పుడు నష్టపోడు. విమర్శకుడి మాటను అర్థం చేసుకోలేకపోతే ఎదుటివారి నష్టపోతారు. నేను విమర్శించడం వల్ల జాబ్ కోల్పోయాను అందుకు ఒక సంవత్సరం పాటు జాబ్ కొరకు చాలా ఇబ్బందులు పడ్డాను కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి నాది. ఒకరోజు హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా లో ప్రభుత్వ ఉద్యోగి అయినా జగదీశ్ సార్ ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ లో ఒక చిన్న పని చేయమని వర్క్ ఇచ్చారు అలా పరిచయం ఏర్పడి నేను కోల్పోయిన జాబ్ గురించి అసలు జరిగిన విషయం గురించి చెప్పాను. ఆయన నా బాధను అర్థం చేసుకొని నీకు జాబ్ వచ్చేవరకు నేను రూమ్ రెంట్ కడతాను జాబ్ వచ్చాక నాకు జాబ్ వచ్చిందని చెప్తే చాలు బాబు నువ్వు ఏమి బాధపడకు అన్నారు. అన్నట్లే ఆయన నా జాబ్ వచ్చేవరకు రూమ్ రెంట్ కట్టినారు. నాకు జాబ్ వచ్చాక మొదటి సారి ఆయనకు ఫోన్ చేసి చెప్పాను సంతోషించాడు. ఆయన కట్టిన రూమ్ రెంట్ డబ్బులు ఇవ్వబోతే అస్సలు వద్దన్నాడు. జగదీశ్ సార్ చేసిన మేలు నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను. ఇప్పటికి జగదీశ్ సార్ కి అప్పుడప్పుడు కాల్ చేస్తే జాబ్ ఎలా ఉంది ఏమైనా సహాయం కావాలంటే అడుగు దామోదర్ అంటారు. ఇలాంటివారికంటే నా జీవితంలో కావాల్సింది ఏముంది. విమర్శ వల్ల నేను కోల్పోయింది ఏముంది ఏమీ లేదు జాబ్ మాత్రమే కానీ విమర్శను అర్థం చేసుకోలేని యజమాని మాత్రం కంపెనీ కోల్పోయాడు. అతను కంపెనీ కోల్పోవడమే కాకుండా అందులో ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు కారకుడయ్యాడు. యజమాని ధనవంతుడు, శక్తివంతుడు కావొచ్చు కానీ కాలం అంతకంటే శక్తివంతమైనది. ఒక చెట్టు నుండి లక్ష అగ్గిపుల్లలు తయారవుతాయి కానీ ఒక అగ్గి పుల్లతో లక్షల చెట్లు బూడిద అవుతాయి అన్నట్లుగా విమర్శకుడి వల్ల మంచి జరుగుతుంది కానీ మౌనం గా ఉండే వారి వల్ల అన్ని కోల్పోవాల్సి వస్తుంది.
మరో యదార్థ సంఘటన:
మౌనంగా ఉండే నా మిత్రుడికి మరో మిత్రుడొకరు ఫోన్ చేసి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని అడిగారు. ఆయన రెండు మూడు కోర్సులు చెప్పి మిత్రుడి సలహా కోరారు. నా మిత్రుడు బయట ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దొరకని ఒక కోర్సు పేరు చెప్పి చేయమన్నారు. పాపం అతని మిత్రుడు గుడ్డిగా నమ్మి వారి అబ్బాయిని మిత్రుడు చెప్పిన కోర్స్ చేయించారు. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయి రెండు సంవత్సరాలు అయింది ఉద్యోగం లేదు. నా మిత్రుడి కంటే ముందు ఒకతను సలహా అడిగారట ఆయన సున్నితంగా విమర్శించి ఆయన చెప్పిన కోర్స్ ఏవి బాగాలేవు ఇంకా ఏమైనా కోర్స్ చేయించు అన్నారంట. ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా ఇంకో మిత్రుడి సలహా తీసుకొని ఆయన ఇబ్బంది పడటమే కాకుండా అబ్బాయి ఇబ్బందికి కారకుడైనాడు.
విమర్శ ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది, విమర్శ ఒక గొప్ప స్నేహాన్ని బంధుత్వాన్ని నేలరాసే ఆయుధం. విమర్శ అనేది మోటార్ సైకిల్ కి ఇంధనం లాంటిది. ఇంధనం లేకపోతే ముందుకు పోవడం అసాధ్యం, మనిషి కూడా విమర్శ లేకపోతే పైకి ఎదగలేరు. మంచి విమర్శ, మానవులకు ఎదగడానికి కాకుండా సంపూర్ణంగా జీవించడానికి తోడ్పడుతుంది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి