29, మార్చి 2025, శనివారం

మేలుమరువని "బికాష్ చౌదరి"

మేలుమరువని "బికాష్ చౌదరి"


ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు అతనికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. వారు అందించిన సహాయాన్ని గుర్తుంచుకొని వారిని చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటాం. సహాయం అందించిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడమనేది విద్యుక్త ధర్మం అనుకునేవారు కొందరైతే, కనీసం వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయని వారు మరి కొందరు. సాయం చేసినంత మాత్రాన వారికి ధన్యవాదాలు చెప్పి వారిని గుర్తుపెట్టుకుంటామా, మన జీవితంలో ఎంతో మంది  సాయం  చేస్తుంటారు ఎంతమందినని గుర్తుపెట్టుకుంటామనేవారు కూడా ఉంటారు. కొందరైతే సాయం పొందిన వెనువెంటనే మర్చిపోతుంటారు. అతి కొద్దిమంది మాత్రమే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాకుండా సమయం వచ్చినప్పుడు వారిపట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటారు. ఈ తరహా కోవకు చెందిన వ్యక్తే JSW ఎనర్జీ లిమిటెడ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ "బికాష్ చౌదరి". 

భారత మాజీ క్రికెటర్ అయిన అరుణ్ లాల్, భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు, 1982లో అరంగేట్రం చేసి 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 93 అత్యధిక స్కోరుతో 729 పరుగులు చేశాడు. కాగా అరుణ్ లాల్ ఇంటి పక్క వీధిలో చిన్న గుడిసెలో చాకలి వృత్తిలో నిమగ్నమైన బికాష్ చౌదరి తండ్రి నివసించే వాడు. అతను అరుణ్ లాల్ కుటుంబం యొక్క బట్టలు ఉతికే వాడు. తన తండ్రితో పాటు బికాష్ చౌదరి అరుణ్ లాల్ ఇంటికి తరచుగా బట్టలు ఉతకడానికి వెళ్లేవాడు. కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న బికాష్ కి టీచర్స్ చెప్పే పాఠాలు సరిగా అర్థం కాకపోవడంతో ఆంగ్లంలో కొంత శిక్షణ అవసరం అని తెలుసుకొని, ఆంగ్లంలో నిష్ణాతులుగా ఉన్న అరుణ్ లాల్ భార్య దేబ్జాని వద్దకు ట్యూషన్ కోసం అతను రోజుకు ఒక గంట పాటు వచ్చేవాడు. దేబ్జాని బికాష్ కి ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా మెళకువలు నేర్పించి తరగతిలో ఉత్తమ ర్యాంక్ పొందడానికి శిక్షణ ఇచ్చింది. ఆమె మార్గదర్శనం లో  బికాష్ 10వ తరగతి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అరుణ్ లాల్ దంపతులకు సంతానం లేకపోవడం మరియు దేబ్జానికి పిల్లలంటే చాలా ఇష్టం కావడంతో, వారు బికాష్ ను తమ సొంత కుమారుడిగా చూసుకోవడంతో పాటు అతని చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. బికాష్ కూడా వారితో ఒక కుటుంబ సభ్యుడిగా గడిపేవాడు. సాయంత్రం వారింట్లో అందరితో కలిసి భోజనం చేసేవాడు. దేబ్జాని శిక్షణలో బికాష్ స్కూల్ విద్య ముగిసే నాటికి ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించాడు. అరుణ్ లాల్ దంపతులు అతనికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని అందుకు ఆర్ధికంగా ఎంతైనా సాయం అందిస్తామని  ప్రోత్సహించడంతో బికాష్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత సెయింట్ జేవియర్స్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ఐఐటీ కలకత్తా లో పూర్తి చేశారు. చదువు పూర్తియైన తర్వాత ఉద్యోగ అవకాశాలు బికాష్ ను  వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన  డ్యూయిష్ బ్యాంక్, HDFC బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ లకు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం JSW ఎనర్జీ లిమిటెడ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అతను తన విజయం కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంతో ఉన్నత  ఉద్యోగం చేస్తున్నప్పటికీ తనకు ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా తనని ఒక కుటుంబ సభ్యుడిగా అక్కున చేర్చుకున్న అరుణ్ లాల్ దంపతులను అతను ఎప్పటికి మరిచిపోలేదు. అరుణ్ లాల్ బికాష్ సోదరీమణుల చదువుకు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధపడ్డప్పటికీ, అది వారికి భారమవుతుందని  భావించిన బికాష్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. 

దైనందిన జీవితంలో ఒకరి సాయం లేకుండా ముందుకు సాగడమనేది అసాధ్యం. ఎవరి నుండి అయినా చిన్న సాయం పొందినా వెంటనే కృతజ్ఞతలు చెప్పడం విజ్ఞత. మనకు సహాయం చేసిన వారు మనల్ని మరచి పోయినా ఫర్వాలేదు, మనం వారిని మరువకూడదు,  నిజమైన కృతజ్ఞత అంటే ప్రయోజనం పొందిన వారు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా జీవితాంతం గుర్తుంచుకుని, అవసరమైనప్పుడు తిరిగి వారికి చేతనైన సాయం చేయడమే. అరుణ్ లాల్ దంపతుల పట్ల బికాష్ చౌదరి నిజమైన కృతజ్ఞత చాటుకున్నారు. అత్యంత హృదయ విదారక పరిస్థితులలో ఆ దంపతులకు సొంత ఇల్లు కూడా లేదని తెలుసుకొని వారు ఇల్లు కొనుగోలు చేయడానికి అతను ఆర్థికంగా సహాయం అందించారు. అంతేకాకుండా అతను సాధారణమైన వోక్స్వ్యాగన్ కారు వాడుతూ వారికి మాత్రం మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఎవరైనా మనకు సహాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో, మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుకుంటాం. జీవితాంతం గుర్తు పెట్టుకునేవారు అతి తక్కువ మంది అందులో బికాష్ చౌదరి ఒకరు అని చెప్పొచ్చు. అరుణ్ లాల్ కుటుంబం పట్ల తన కృతజ్ఞతను జీవితాంతం చాటుకునేలా తన కుమార్తెకు ‘అరుణిమ’ అని అరుణ్ పేరు పెట్టుకున్నాడు.

మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం బికాష్ చౌదరి లాంటి వ్యక్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని నేటి యువతరం కృతజ్ఞతాభావంతో నడుచుకుంటే వారు కూడా తమ తమ జీవితాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.  ఒక సందర్భంలో, బికాష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అరుణ్ లాల్ దంపతులు నాకు సహాయం చేయడమే కాక మరియు జీవితంలోని ప్రధాన విలువలు నేర్పించారు. ప్రతి అడుగులోనూ, ఆయన నన్ను మంచి వ్యక్తిగా ఎదగడానికి ప్రేరేపించారు. వారి సహాయం లేకుండా, నేను ఈ రోజు ఉన్న స్థితిలో నిలబడే వాడిని కాదు, అని బికాష్ భావోద్వేగంతో పంచుకున్నాడు.  కష్టకాలంలో మీకు సహాయం చేసినవారు సామాన్యుడే కావచ్చు కానీ మనకు దేవుని తో సమానం. చేసిన సాయం, దానం ఎప్పటికీ వృధా కాదనటానికి చక్కటి ఉదాహరణ బికాష్ చౌదరి జీవితం.   

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

7, మార్చి 2025, శుక్రవారం

ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".

 ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".

అదొక మావోయిస్టుల ఉనికి ఉండే అత్యంత కఠినమైన దండకారణ్యం. సాధారణంగా దండకారణ్యంలోకి అడుగుపెట్టాలంటేనే ఒకరకమైన వణుకు పుడుతుంది. అందులోనూ అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఏ క్షణాన ఎటువైపునుండి తూటాల వర్షం కురుస్తుందో తెలియని అతి భయంకరమైన ప్రాంతమది. మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కీలక స్థావరం అయిన అబుజ్‌మర్ ప్రాంతం 21 అక్టోబర్ 2024న మావోయిస్ట్ మరియు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణంలో కాల్పులతో ఎనిమిది గంటలపాటు దద్దరిల్లిపోయింది. ఆ కాల్పుల్లో క్షతగాత్రుడైన C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోగా, తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు కొట్టుమిట్టాడుతున్న ఆయనను ధైర్యవంతురాలైన మహిళా హెలికాప్టర్ పైలట్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నిలిపి అందులో నుండి దూకి సమయస్ఫూర్తితో, అత్యంత సాహసోపేతంగా ఆ కమాండో ప్రాణాలను కాపాడింది. ఆ ధీరవనిత పవన్ హన్స్ హెలికాప్టర్ పైలట్ "కెప్టెన్ రీనా వర్గీస్" నిబద్ధతను మరియు అసామాన్య ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది.  

బూబీ-ట్రాప్డ్ మావోయిస్టు ప్రధాన కార్యాలయమైన అబుజ్‌మర్ ముట్టడిలో అక్టోబర్ 21, 2024 న పక్కా వ్యూహంతో పోలీస్ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లతో దాడులు, బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆ భీకరపోరులో C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు అడివిలో ఎలాంటి సదుపాయంలేక తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కమాండో ను కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసినప్పటికీ సీఆర్పీఎఫ్‌ బలగాలకు అండగా బ్యాకప్‌ ఫోర్స్‌ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎటు వెళ్లలేని పరిస్థితి కావడంతో, ఆ సమయంలో తోటి జవాన్లు అత్యవసర SOS కి కాల్ చేశారు. కెప్టెన్ వర్గీస్ SOS కాల్‌కు స్పందించి, తన సిబ్బందితో కలిసి గడ్చిరోలి నుండి తన 13 సీట్ల డౌఫిన్-ఎన్ పవన్ హన్స్ హెలికాప్టర్‌ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) 100 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 35 నిమిషాల్లో చేరుకుంది. అటవీ ప్రాంతంలో గాయపడిన కమాండో ను వెతకడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కెప్టెన్ వర్గీస్ ప్రాణాంతక పరిస్థితుల్లో భూమికి చాల తక్కువ ఎత్తులో నావిగేట్ చేస్తూ గాయపడిన జవాన్‌ ఆచూకీ కనిపెట్టింది. దట్టమైన అడవిలో లాండింగ్ చేసే అవకాశం లేదు. ఒకవైపు మావోయిస్టుల కాల్పులు మరోవైపు పోలీసుల కాల్పుల మధ్య గాయపడిన కమాండో ను హెలికాప్టర్‌ లోకి ఎక్కించడం అసాధ్యమని భావించింది. ఎలాగైనా జవాన్ ప్రాణాలు రక్షించాలనే సంకల్పంతో తన కో ఫైలట్ సహాయంతో కాప్టర్‌ను భూమికి వీలైనంత దగ్గరగా దించి కాప్టర్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో తిరుగుతుండగా ఆమె కాక్‌పిట్ నుండి దూకింది. కమాండోల సహాయంతో గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లోకి వేగంగా ఎత్తగలిగారు. ప్రమాద స్థలం నుండి కేవలం 30 నిమిషాల్లోనే గడ్చిరోలి కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ సరైన సమయంలో హాస్పిటల్ కి చేర్చడంతో కమాండో ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా ఆమె ఓఖీ విపత్తు సమయంలో కూడా సహాయక చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం. కోవిడ్ కాలంలో లక్షద్వీప్ నుండి చాలా మందిని విమానంలో తరలించడంలో కూడా ఆమె సహాయపడింది.

ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అంత సులభం కాదన్న విషయం మనందరికీ తెలిసిందే, ఆమె ధైర్యసాహసాలు ప్రదర్శించి కమాండో ప్రాణాన్ని కాపాడిన ధీర వనితగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో కెప్టెన్ రీనాను సత్కరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఆమె సాహసోపేత సేవను అభినందించారు.

కూంబింగ్ ఆపరేషన్ లలో పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా  దైర్యంగా పోరాడగలగడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో కాపాడగలరనే విషయాన్ని "కెప్టెన్ రీనా వర్గీస్" నిరూపించారు. భయమే అత్యంత క్రూరమైన శత్రువు. భయంతో వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతుంది గానీ ముందుకు పోలేము. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే వారికి ఏదైనా సాధ్యమే.  


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్: 9391480475  



4, మార్చి 2025, మంగళవారం

అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".

అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".

సరిగ్గా పాతికేళ్ళక్రితం నర్సంపేట బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సందర్భం. కొద్దిసేపటికి ఓ బస్సు ఫ్లటుఫార్మ్ మీదకు వచ్చింది. అప్పటికి బస్సు కోసం ఎదురుచూస్తున్న జనం సీట్ దొరకాలన్న ఆశతో ఎగబడి బస్సు ఎక్కేస్తున్నారు. కాలు పెట్టేంత స్థలం కూడా లేదు. బస్సు నిండా మగవారే తప్ప, మహిళ ప్రయాణికులు లేరు. ఇంతలో బస్సులోనుండి ఒక మహిళ  రైట్ రైట్ అని అరుస్తూ డ్రైవర్ గారికి సూచనలిస్తుంది. ఎవరిది ఆ ఆడ గొంతు బస్సులో మహిళలు లేరు కదా అని అందరూ ఆశ్చర్యపోతూ ఎవరని అటుఇటు చూస్తున్నారు ప్రయాణికులు. కొద్దిసేపటికి ప్రయాణికుల మధ్యలోనుండి సైడ్ ఇవ్వండి , సైడ్ ఇవ్వండని అనుకుంటూ ఆరడుగులు ఎత్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమె ఎవరో కాదు నర్సంపేట డిపోలో మొదటి మహిళ కండక్టర్ "గోరుకంటి జయప్రద".

ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కొన్ని రంగాలలో మాత్రమే జాబ్ చేయడానికి ఇష్టపడేవారు. అందులో ఆర్టీసీ బస్సు కండక్టర్ గా పనిచేయుటకు మాత్రం చాలామంది ఇష్టపడేవారుకాదు. ఎందుకంటే వారికి అసౌకర్యం ఉంటుందన్న భావన ఒక కారణమయితే మరోకారణం బస్సులో రద్దీ కారణంగా ఎక్కువసేపు నిల్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న భయం, సాహసోపేతమైన సంఘటనలు కూడా ఎదురవుతాయన్న అపోహ. అందుచేత మహిళ కండక్టర్ జాబ్స్ కి దరఖాస్తు చేసేవారు కూడా చాల తక్కువనే చెప్పొచ్చు. అలాంటి సమయంలో సాహసోపేతమైన జాబ్ ను ఎంచుకొని మహిళ కండక్టర్లు లేని  నర్సంపేట బస్సు డిపోలో మొదటి మహిళ కండక్టర్ గా పనిచేస్తూ 25 సంవత్సరాల విధి నిర్వహణలో ఎన్నో బదిలీలు అయినా పిల్లల భవిష్యత్ కోసం, వారిని ఉన్నత విద్య చదివించాలనే పట్టుదలతో, మొక్కవోని దీక్షతో మహిళలలో చైతన్యాన్ని కలిగించేలా ఆమె ఉద్యోగ ప్రస్థానం కొనసాగింది. "గోరుకంటి జయప్రద" గారు గత రెండురోజులక్రితం పదవి విరమణ పొందారు. ఈ సుదీర్గ ప్రయాణంలో మహిళ కండక్టర్గా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె అవరోధాలను అవకాశాలుగా మార్చుకున్నారు అంతేతప్ప వెనుతిరగలేదు. 1988 లో డిగ్రీ పూర్తి చేసిన జయప్రద గారు 2000 సంవత్సరము లో 90/- రూపాయలకే డేలీ వైజ్ కండక్టర్ గా ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేయడమేంటని అందరికి అశ్వర్యం కలుగకమానదు. 

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం:  

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో గోరుకంటి సుశీల - సత్యనారాయణ దంపతులకు జయప్రద గారు 1 మార్చి 1965లో జన్మించారు. వృత్తిరీత్యా తండ్రి సత్యనారాయణ ఉపాధ్యాయుడు, వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. జయప్రద గారు గుమ్మడవెల్లి స్వంత గ్రామంలోనే 1వ, తరగతి నుండి 7వ, తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆతర్వాత పై చదువులు చదవడానికి  గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ప్రతిరోజు గుమ్మడివెళ్లి నుండి గోరెంట్లకు 8 కి.మీ. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన 8 నుండి 10వ, తరగతి వరకు గోరెంట్ల గ్రామంలో 1981లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంకా పై చదువులు చదవాలనే కోరిక బలంగా కలిగింది. తండ్రి సంపాదనతో ఐదుగురు అక్కచెల్లెలను చదివించడం ఎంత కష్టమో, ఇల్లు గడవడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు తన చిన్నతనంలోనే ఎదుర్కొంది. అయినా పట్టుసడలని ప్రయత్నంతో పై చదువులు చదవాలనే కోరికతో    జయప్రద గారి పెద్ద సోదరి నిర్మల మహబూబాబాద్ మల్యాలలో ఉంటుండగా అక్కడే ఉంటూ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో 1983లో CEC కోర్సు పూర్తి చేశారు. ఆతర్వాత ఇంకా చదవాలనే పట్టుదలతో హనుమకొండ పట్టణంలో ఉంటున్న నాలుగవ అక్క అనంతలక్ష్మి  ప్రోత్సాహంతో వరంగల్ ఆంధ్ర బాలిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1988లో B.Com., పూర్తి చేశారు.

ఆతర్వాత వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిగాల వెంకటేశ్వరరావుతో 18 ఫిబ్రవరి 1989లో వివాహం జరిగింది. భర్త వెంకటేశ్వరరావు గారు ఓ ప్రవైట్ కళాశాలలో అడ్మిన్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. వారికీ ఇద్దరు అమ్మాయిలు, భర్త కు వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడవడం అతికష్టంగా భావించి జయప్రద కూడా భర్తకు సహాయం అందించాలనే ఆలోచనతో ఓ ప్రవైట్ స్కూల్ లో చాలాకాలం పాటు టీచర్ గా పనిచేశారు. ఐదుగురు అక్కచెల్లల్ను చదివించడానికి తండ్రి పడ్డ కష్టాన్ని భవిషత్తులో మేము కూడా పడకూడదు అనే గొప్ప ఆలోచనతో తన పిల్లల చదువుకోసం 22 జనవరి 2000 సంవత్సరంలో డైలీ వైజ్ 90/- రూపాయలతో క్యాజువల్ కండక్టర్ గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆమె ఉద్యోగంలో చేరేనాటికి వారి పిల్లలది చిన్న వయస్సు అయినాసరే ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రారంభించారు. ఒకవైపు పిల్లలను చూసుకునేవారు లేక మరోవైపు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. నర్సంపేట డిపోలో మహిళలకు కనీస సదుపాయాలు లేకపోయినప్పటికీ స్టాఫ్ మెంబెర్స్ ఎంతో గౌరవిస్తూ, తన ఉద్యోగానికి ఎలాంటి ఆటకం కలుగకుండా అందరూ సహకరించడంతో జయప్రద గారికి ఇక ఉద్యోగం కొనసాగించవచ్చు అన్న నమ్మకం కలిగింది. 7 సంవత్సరాల తరువాత ఉద్యోగం రెగ్యులర్ కావడం. ఆతర్వాత మహిళ కండక్టర్ గా ఉండి సంస్థ ఆదేశాల మేరకు ఏకంగా 7 డిపోలలో తన సేవలను అందించడం అభినందనీయం.

7 డిపోలలో సేవలు అందించడం గొప్పవిషయం.

ఎలాంటి రిమార్క్స్ లేకుండా తమ ఉద్యోగాన్ని కొనసాగించడం కొందరికే సాధ్యం. అలాంటి వారిలో జయప్రద గారు ఒకరు. నర్సపేట్ డిపోలో ఉత్తమ కండక్టర్ గా పేరుపొందిన ఆమెకు బదిలీలు బాధ తప్పలేదు. ఎప్పుడు బదిలీలతో పిల్లల చదువులకు కూడా తీవ్ర ఆటంకం కలిగినప్పటికీ డ్యూటీ మాత్రం సక్రమంగా నిర్వహించింది. 

ఆమె పని చేసిన డిపోలు: నర్సంపేట, కామారెడ్డి, రాణిగంజ్, హుజురాబాద్, మేడ్చల్, వరంగల్, పరకాల. 

అమ్మ కష్టం వర్ణించలేనిది:

రిటైర్మెంట్ సందర్బంగా వారి పిల్లలు అమ్మ పడిన కష్టాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ మాతో ఎప్పుడు గడిపేది కాదు. పండగొచ్చిన సమయంలో కూడా డ్యూటీ అంటూ వెళ్ళేది మా స్నేహితులందరూ వారి తల్లిదండ్రులతో గడిపితే మేము మాత్రం ఒంటరిగా అమ్మ వచ్చేంతవరకు దిగులుగా కూర్చున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అమ్మ మాకోసం మా భవిష్యత్తు కోసం తన విలువైన సమయాన్ని మాకోసం త్యాగం చేసింది. అమ్మ కష్టానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని వారి పిల్లలు అంటుంటే జయప్రదగారి తోటి ఉద్యోగులు చలించిపోయారు.

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్న జయప్రద ఎంతోమంది మహిళలకు  ఆదర్శం.

కాలంతో కలిసి నడిస్తే కానిది ఏముంది. ధైర్యంతో ముందడుగు వేస్తె సాదించనిది ఏముంది.

సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో ప్రతిఒక్కరు తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 


హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...