ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".
అదొక మావోయిస్టుల ఉనికి ఉండే అత్యంత కఠినమైన దండకారణ్యం. సాధారణంగా దండకారణ్యంలోకి అడుగుపెట్టాలంటేనే ఒకరకమైన వణుకు పుడుతుంది. అందులోనూ అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఏ క్షణాన ఎటువైపునుండి తూటాల వర్షం కురుస్తుందో తెలియని అతి భయంకరమైన ప్రాంతమది. మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కీలక స్థావరం అయిన అబుజ్‌మర్ ప్రాంతం 21 అక్టోబర్ 2024న మావోయిస్ట్ మరియు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణంలో కాల్పులతో ఎనిమిది గంటలపాటు దద్దరిల్లిపోయింది. ఆ కాల్పుల్లో క్షతగాత్రుడైన C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోగా, తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు కొట్టుమిట్టాడుతున్న ఆయనను ధైర్యవంతురాలైన మహిళా హెలికాప్టర్ పైలట్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నిలిపి అందులో నుండి దూకి సమయస్ఫూర్తితో, అత్యంత సాహసోపేతంగా ఆ కమాండో ప్రాణాలను కాపాడింది. ఆ ధీరవనిత పవన్ హన్స్ హెలికాప్టర్ పైలట్ "కెప్టెన్ రీనా వర్గీస్" నిబద్ధతను మరియు అసామాన్య ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది.
బూబీ-ట్రాప్డ్ మావోయిస్టు ప్రధాన కార్యాలయమైన అబుజ్‌మర్ ముట్టడిలో అక్టోబర్ 21, 2024 న పక్కా వ్యూహంతో పోలీస్ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడులు, బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆ భీకరపోరులో C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు అడివిలో ఎలాంటి సదుపాయంలేక తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కమాండో ను కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసినప్పటికీ సీఆర్పీఎఫ్ బలగాలకు అండగా బ్యాకప్ ఫోర్స్ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎటు వెళ్లలేని పరిస్థితి కావడంతో, ఆ సమయంలో తోటి జవాన్లు అత్యవసర SOS కి కాల్ చేశారు. కెప్టెన్ వర్గీస్ SOS కాల్‌కు స్పందించి, తన సిబ్బందితో కలిసి గడ్చిరోలి నుండి తన 13 సీట్ల డౌఫిన్-ఎన్ పవన్ హన్స్ హెలికాప్టర్‌ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) 100 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 35 నిమిషాల్లో చేరుకుంది. అటవీ ప్రాంతంలో గాయపడిన కమాండో ను వెతకడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కెప్టెన్ వర్గీస్ ప్రాణాంతక పరిస్థితుల్లో భూమికి చాల తక్కువ ఎత్తులో నావిగేట్ చేస్తూ గాయపడిన జవాన్ ఆచూకీ కనిపెట్టింది. దట్టమైన అడవిలో లాండింగ్ చేసే అవకాశం లేదు. ఒకవైపు మావోయిస్టుల కాల్పులు మరోవైపు పోలీసుల కాల్పుల మధ్య గాయపడిన కమాండో ను హెలికాప్టర్ లోకి ఎక్కించడం అసాధ్యమని భావించింది. ఎలాగైనా జవాన్ ప్రాణాలు రక్షించాలనే సంకల్పంతో తన కో ఫైలట్ సహాయంతో కాప్టర్‌ను భూమికి వీలైనంత దగ్గరగా దించి కాప్టర్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో తిరుగుతుండగా ఆమె కాక్‌పిట్ నుండి దూకింది. కమాండోల సహాయంతో గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లోకి వేగంగా ఎత్తగలిగారు. ప్రమాద స్థలం నుండి కేవలం 30 నిమిషాల్లోనే గడ్చిరోలి కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ సరైన సమయంలో హాస్పిటల్ కి చేర్చడంతో కమాండో ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా ఆమె ఓఖీ విపత్తు సమయంలో కూడా సహాయక చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం. కోవిడ్ కాలంలో లక్షద్వీప్ నుండి చాలా మందిని విమానంలో తరలించడంలో కూడా ఆమె సహాయపడింది.
ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అంత సులభం కాదన్న విషయం మనందరికీ తెలిసిందే, ఆమె ధైర్యసాహసాలు ప్రదర్శించి కమాండో ప్రాణాన్ని కాపాడిన ధీర వనితగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో కెప్టెన్ రీనాను సత్కరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఆమె సాహసోపేత సేవను అభినందించారు.
కూంబింగ్ ఆపరేషన్ లలో పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా దైర్యంగా పోరాడగలగడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో కాపాడగలరనే విషయాన్ని "కెప్టెన్ రీనా వర్గీస్" నిరూపించారు. భయమే అత్యంత క్రూరమైన శత్రువు. భయంతో వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతుంది గానీ ముందుకు పోలేము. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే వారికి ఏదైనా సాధ్యమే.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
.jpeg)
.jpeg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి