అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".
సరిగ్గా పాతికేళ్ళక్రితం నర్సంపేట బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సందర్భం. కొద్దిసేపటికి ఓ బస్సు ఫ్లటుఫార్మ్ మీదకు వచ్చింది. అప్పటికి బస్సు కోసం ఎదురుచూస్తున్న జనం సీట్ దొరకాలన్న ఆశతో ఎగబడి బస్సు ఎక్కేస్తున్నారు. కాలు పెట్టేంత స్థలం కూడా లేదు. బస్సు నిండా మగవారే తప్ప, మహిళ ప్రయాణికులు లేరు. ఇంతలో బస్సులోనుండి ఒక మహిళ రైట్ రైట్ అని అరుస్తూ డ్రైవర్ గారికి సూచనలిస్తుంది. ఎవరిది ఆ ఆడ గొంతు బస్సులో మహిళలు లేరు కదా అని అందరూ ఆశ్చర్యపోతూ ఎవరని అటుఇటు చూస్తున్నారు ప్రయాణికులు. కొద్దిసేపటికి ప్రయాణికుల మధ్యలోనుండి సైడ్ ఇవ్వండి , సైడ్ ఇవ్వండని అనుకుంటూ ఆరడుగులు ఎత్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమె ఎవరో కాదు నర్సంపేట డిపోలో మొదటి మహిళ కండక్టర్ "గోరుకంటి జయప్రద".
ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కొన్ని రంగాలలో మాత్రమే జాబ్ చేయడానికి ఇష్టపడేవారు. అందులో ఆర్టీసీ బస్సు కండక్టర్ గా పనిచేయుటకు మాత్రం చాలామంది ఇష్టపడేవారుకాదు. ఎందుకంటే వారికి అసౌకర్యం ఉంటుందన్న భావన ఒక కారణమయితే మరోకారణం బస్సులో రద్దీ కారణంగా ఎక్కువసేపు నిల్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న భయం, సాహసోపేతమైన సంఘటనలు కూడా ఎదురవుతాయన్న అపోహ. అందుచేత మహిళ కండక్టర్ జాబ్స్ కి దరఖాస్తు చేసేవారు కూడా చాల తక్కువనే చెప్పొచ్చు. అలాంటి సమయంలో సాహసోపేతమైన జాబ్ ను ఎంచుకొని మహిళ కండక్టర్లు లేని నర్సంపేట బస్సు డిపోలో మొదటి మహిళ కండక్టర్ గా పనిచేస్తూ 25 సంవత్సరాల విధి నిర్వహణలో ఎన్నో బదిలీలు అయినా పిల్లల భవిష్యత్ కోసం, వారిని ఉన్నత విద్య చదివించాలనే పట్టుదలతో, మొక్కవోని దీక్షతో మహిళలలో చైతన్యాన్ని కలిగించేలా ఆమె ఉద్యోగ ప్రస్థానం కొనసాగింది. "గోరుకంటి జయప్రద" గారు గత రెండురోజులక్రితం పదవి విరమణ పొందారు. ఈ సుదీర్గ ప్రయాణంలో మహిళ కండక్టర్గా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె అవరోధాలను అవకాశాలుగా మార్చుకున్నారు అంతేతప్ప వెనుతిరగలేదు. 1988 లో డిగ్రీ పూర్తి చేసిన జయప్రద గారు 2000 సంవత్సరము లో 90/- రూపాయలకే డేలీ వైజ్ కండక్టర్ గా ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేయడమేంటని అందరికి అశ్వర్యం కలుగకమానదు.
కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం:
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో గోరుకంటి సుశీల - సత్యనారాయణ దంపతులకు జయప్రద గారు 1 మార్చి 1965లో జన్మించారు. వృత్తిరీత్యా తండ్రి సత్యనారాయణ ఉపాధ్యాయుడు, వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. జయప్రద గారు గుమ్మడవెల్లి స్వంత గ్రామంలోనే 1వ, తరగతి నుండి 7వ, తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆతర్వాత పై చదువులు చదవడానికి గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ప్రతిరోజు గుమ్మడివెళ్లి నుండి గోరెంట్లకు 8 కి.మీ. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన 8 నుండి 10వ, తరగతి వరకు గోరెంట్ల గ్రామంలో 1981లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంకా పై చదువులు చదవాలనే కోరిక బలంగా కలిగింది. తండ్రి సంపాదనతో ఐదుగురు అక్కచెల్లెలను చదివించడం ఎంత కష్టమో, ఇల్లు గడవడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు తన చిన్నతనంలోనే ఎదుర్కొంది. అయినా పట్టుసడలని ప్రయత్నంతో పై చదువులు చదవాలనే కోరికతో జయప్రద గారి పెద్ద సోదరి నిర్మల మహబూబాబాద్ మల్యాలలో ఉంటుండగా అక్కడే ఉంటూ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో 1983లో CEC కోర్సు పూర్తి చేశారు. ఆతర్వాత ఇంకా చదవాలనే పట్టుదలతో హనుమకొండ పట్టణంలో ఉంటున్న నాలుగవ అక్క అనంతలక్ష్మి ప్రోత్సాహంతో వరంగల్ ఆంధ్ర బాలిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1988లో B.Com., పూర్తి చేశారు.
ఆతర్వాత వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిగాల వెంకటేశ్వరరావుతో 18 ఫిబ్రవరి 1989లో వివాహం జరిగింది. భర్త వెంకటేశ్వరరావు గారు ఓ ప్రవైట్ కళాశాలలో అడ్మిన్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. వారికీ ఇద్దరు అమ్మాయిలు, భర్త కు వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడవడం అతికష్టంగా భావించి జయప్రద కూడా భర్తకు సహాయం అందించాలనే ఆలోచనతో ఓ ప్రవైట్ స్కూల్ లో చాలాకాలం పాటు టీచర్ గా పనిచేశారు. ఐదుగురు అక్కచెల్లల్ను చదివించడానికి తండ్రి పడ్డ కష్టాన్ని భవిషత్తులో మేము కూడా పడకూడదు అనే గొప్ప ఆలోచనతో తన పిల్లల చదువుకోసం 22 జనవరి 2000 సంవత్సరంలో డైలీ వైజ్ 90/- రూపాయలతో క్యాజువల్ కండక్టర్ గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆమె ఉద్యోగంలో చేరేనాటికి వారి పిల్లలది చిన్న వయస్సు అయినాసరే ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రారంభించారు. ఒకవైపు పిల్లలను చూసుకునేవారు లేక మరోవైపు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. నర్సంపేట డిపోలో మహిళలకు కనీస సదుపాయాలు లేకపోయినప్పటికీ స్టాఫ్ మెంబెర్స్ ఎంతో గౌరవిస్తూ, తన ఉద్యోగానికి ఎలాంటి ఆటకం కలుగకుండా అందరూ సహకరించడంతో జయప్రద గారికి ఇక ఉద్యోగం కొనసాగించవచ్చు అన్న నమ్మకం కలిగింది. 7 సంవత్సరాల తరువాత ఉద్యోగం రెగ్యులర్ కావడం. ఆతర్వాత మహిళ కండక్టర్ గా ఉండి సంస్థ ఆదేశాల మేరకు ఏకంగా 7 డిపోలలో తన సేవలను అందించడం అభినందనీయం.
7 డిపోలలో సేవలు అందించడం గొప్పవిషయం.
ఎలాంటి రిమార్క్స్ లేకుండా తమ ఉద్యోగాన్ని కొనసాగించడం కొందరికే సాధ్యం. అలాంటి వారిలో జయప్రద గారు ఒకరు. నర్సపేట్ డిపోలో ఉత్తమ కండక్టర్ గా పేరుపొందిన ఆమెకు బదిలీలు బాధ తప్పలేదు. ఎప్పుడు బదిలీలతో పిల్లల చదువులకు కూడా తీవ్ర ఆటంకం కలిగినప్పటికీ డ్యూటీ మాత్రం సక్రమంగా నిర్వహించింది.
ఆమె పని చేసిన డిపోలు: నర్సంపేట, కామారెడ్డి, రాణిగంజ్, హుజురాబాద్, మేడ్చల్, వరంగల్, పరకాల.
అమ్మ కష్టం వర్ణించలేనిది:
రిటైర్మెంట్ సందర్బంగా వారి పిల్లలు అమ్మ పడిన కష్టాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ మాతో ఎప్పుడు గడిపేది కాదు. పండగొచ్చిన సమయంలో కూడా డ్యూటీ అంటూ వెళ్ళేది మా స్నేహితులందరూ వారి తల్లిదండ్రులతో గడిపితే మేము మాత్రం ఒంటరిగా అమ్మ వచ్చేంతవరకు దిగులుగా కూర్చున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అమ్మ మాకోసం మా భవిష్యత్తు కోసం తన విలువైన సమయాన్ని మాకోసం త్యాగం చేసింది. అమ్మ కష్టానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని వారి పిల్లలు అంటుంటే జయప్రదగారి తోటి ఉద్యోగులు చలించిపోయారు.
ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్న జయప్రద ఎంతోమంది మహిళలకు ఆదర్శం.
కాలంతో కలిసి నడిస్తే కానిది ఏముంది. ధైర్యంతో ముందడుగు వేస్తె సాదించనిది ఏముంది.
సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.
ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.
అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో ప్రతిఒక్కరు తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి