7, మార్చి 2026, శనివారం

మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief

 మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief


మనతో ఏదీ శాశ్వతంగా వెంట రాకపోయినా, నిశ్శబ్దంగా అడుగులు కలిపేది మృత్యువే. సాధారణంగా మృత్యువును భయపెట్టే శత్రువుగా ఊహిస్తాం. కానీ నిజానికి అది మన అహంకారాన్ని కరిగించి, మనిషిని మనిషిగా మిగిల్చే ఒక సత్యం. అందుకే మహాత్మ గాంధీ “మృత్యువు మనల్ని నమ్ముకుని ఎప్పుడూ వెంట ఉండే ప్రేయసి” అని అన్నారు. మృత్యువు మనకు శత్రువు కాదు; మన జీవితమంతా మన పక్కనే నడుస్తూ, చివరికి చేయి పట్టుకుని తీసుకెళ్లే ఏకైక నిజమైన తోడు.

ఈ తాత్విక దృష్టికోణాన్ని సాహిత్య రూపంలో అద్భుతంగా ఆవిష్కరించిన నవల ఆంగ్ల రచయిత మార్కస్ జుసాక్ రచించిన The Book Thief. ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే మృత్యువునే కథ కారుడిగా ఎంచుకోవడం. అందువల్ల ఇది సాధారణ మానవ దృష్టితో చెప్పబడిన కథ కాదు; మృత్యువు దృష్టితో చెప్పిన కథ.

ఇది బాల సాహిత్యంగా పరిగణింపబడిన The Book Thief అసలు అర్థం మానవత్వ సాహిత్యం. ఈ కథ పుస్తకాలు దొంగిలించే పన్నెండేళ్ల అమ్మాయి లీసెల్ మెమింగర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. యుద్ధం మధ్యలో పెరిగిన ఒక చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూడమని మనల్ని బలవంతం చేస్తుంది ఈ నవల.

సిరియాలో జరిగిన అంతర్యుద్ధం ప్రతిరోజూ జరిగే బాంబు దాడులు, వాటిలో ప్రాణాలు కోల్పోతున్న వందల మంది చిన్నారులు, కళ్ల ముందే ఒక కొత్త తరాన్ని కోల్పోతున్నా. యుద్ధాల్లో అసలైన బాధితులు సైనికులు కాదు, పిల్లలే. రోజురోజుకు పెరుగుతున్న చిన్నారుల మరణాలు, దేశం విడిచి పారిపోతున్న పిల్లలు, భవిష్యత్తేంటో తెలియని పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎంత అమానుషమో స్పష్టంగా ఈ నవల బోధిస్తుంది.

ఇలాంటి బీభత్సం మధ్య, తన వాళ్లను కోల్పోయి, హింసను చూస్తూ, అయినా మానవత్వాన్ని మర్చిపోని మనుషుల్ని గమనిస్తూ పెరిగిన పిల్లగా లీసెల్ నిలుస్తుంది. అందుకే ఆమె కేవలం కల్పిత పాత్ర కాదు; యుద్ధాల్లో నలిగిపోయిన ప్రపంచంలోని లక్షలాది పిల్లలకి ఒక ప్రామాణిక ప్రతినిధి.

అందుకే The Book Thief కేవలం ఒక బాలల నవల కాదు. అది యుద్ధం పిల్లలపై మోపిన మౌనమైన, అత్యంత ఘోరమైన అభియోగ పత్రం.

లీసెల్ కథలో ఇదొక పెద్ద మలుపు. తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడం, తల్లి కమ్యూనిస్ట్ నేపథ్యం కారణంగా పిల్లలను తన దగ్గర ఉంచుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో లీసెల్‌-తమ్ముడిని పేదవాళ్ల బస్తీలో నివసించే హాన్స్ హబ్బర్‌మాన్  ఫాస్టర్ దంపతులకు అప్పగించేందుకు తల్లి బయలుదేరుతుంది.

ఆ ప్రయాణంలో విధి మరో దెబ్బ కొడుతుంది. నిమోనియా తో లీసెల్ తమ్ముడు శ్వాస ఆగి, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు. పిల్లలను అప్పగించేందుకు వచ్చిన తల్లి, ఏదోలా చిన్నారిని సమాధి చేసి, లీసెల్ చేయి పట్టుకుని ఊర్లో అడుగుపెడుతుంది.

తమ్ముడిని కోల్పోయిన దుఃఖం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాని వయసులోనే, శ్మశానంలో తన తమ్ముడిని మట్టిలో పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తుంది లీసెల్. అదే సమయంలో, తడి మట్టిలో పడివున్న ఒక పుస్తకం ఆమె కంటపడుతుంది. ఏ ఆలోచన లేకుండా, చటుక్కున దాన్ని తన స్కర్టులో దాచేసుకుంటుంది.
బహుశా… తమ్ముడి జ్ఞాపకంగా.

అదే లీసెల్ చేసిన మొదటి దొంగతనం.
అదీ మృత్యువును చూసిన తొలి దొంగతనం.
అందుకే మృత్యువు ఆమెను “పుస్తకాల దొంగ”గా పిలుస్తూ ఉంటుంది.

ఆ పుస్తకం పేరు “A Grave Diggers’ Handbook.”

కొడుకును కోల్పోయిన అగాధమైన దుఃఖం, కూతురిని వేరే ఇంట్లో వదిలి వెళ్లాల్సిన బాధ ఇవన్నీ గుండెల్లో దాచుకుని, ముఖం మీద ధైర్యం ధరించి కర్తవ్య బాట పట్టిన ఆ తల్లిని చూసి మృత్యువు కూడా క్షణం ఆగిపోతుంది.

కథ చివర్లో, మృత్యువూ - లీసెల్ మళ్లీ కలుస్తారు. ఈ సంగతులన్నింటినీ నెమరువేసుకున్నారు.
అది ఒక మైమరపించే, తాత్వికమైన క్షణం.

అప్పుడు లీసెల్ మృత్యువును అడుగుతుంది 
“అందరూ మృత్యుముఖంలో నిలిచినప్పుడు, జీవితం మొత్తం ఒకే క్షణంలో స్పష్టంగా కనిపిస్తుందంటారు… నీకవన్నీ గుర్తున్నాయా?”

ఇది చదివితే The Book Thief కేవలం కథ కాదు,
మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ అనిపిస్తుంది.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది… కనబడదు… కానీ మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది. పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు, మనసుల్లో దాగి ఉం...