అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది
మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి…
ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి…
కానీ…
అల ఎంత ఉప్పొంగినా చివరికి ఒడ్డునే ఒదిగిపోతుంది,
కల ఎంత ఎత్తుకు ఎగిరినా చివరికి కాలగర్భంలోనే కలిసిపోతుంది.
కలలన్నీ కరిగిపోతాయి,
కాలపు కెరటాల్లో కొట్టుకుపోతాయి.
ఆశలన్నీ అలసిపోతాయి,
అనుభవాల ఒడ్డున ఆగిపోతాయి.
నిన్నటి కోరిక నేడు జ్ఞాపకమవుతుంది,
నేటి స్వప్నం రేపటి కథనమవుతుంది.
మనిషి పరిగెత్తిన దారులన్నీ
కాలం కాళ్లకింద మట్టిగా మారిపోతాయి.
అలకు ఒడ్డు శాశ్వతం కాదు,
కలకు గెలుపు శాశ్వతం కాదు.
జీవితం అనే సముద్రంలో
ప్రయాణమే నిజం, గమ్యం కాదు.
అందుకే…
కల నెరవేరినా వినయంగా ఉండు,
కల చెదిరినా ధైర్యంగా నిలువు.
ఎందుకంటే కాలం ముందు
కిరీటమూ ఒక జ్ఞాపకమే,
కన్నీటిబొట్టూ ఒక జ్ఞాపకమే.
అల ఒడ్డున కలిసినట్లు,
కల కాలంలో కలిసినట్లు,
మనిషి జీవితం కూడా
చివరికి ఒక కథగా మిగిలిపోతుంది.
✍️
కోట దామోదర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి