30, ఏప్రిల్ 2026, గురువారం

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

 ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి


మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. సంకల్పం అంటే కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనసులో దృఢమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయడం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన సంకల్పం.

సంకల్పం ఉన్న వ్యక్తి తాను పయనించే మార్గంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు చూసి భయపడడు. వాటిని ఓటమిగా భావించకుండా, అవి తనను మరింత బలంగా మార్చే అవకాశాలుగా భావిస్తాడు. అడ్డంకులను అవకాశాలుగా మలుచుకొని, ధైర్యంగా ముందుకు సాగుతూ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.

ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సంకల్పం వల్లే సాధ్యమయ్యాయి. దీనికి చక్కటి ఉదాహరణగా ఈశ్వరీ పాండే ను చెప్పవచ్చు. ఆమెకు కళ్ళు కనిపించకపోయినా (అంధురాలు), సముద్రంలో ఈదుతూ శ్రీలంక నుండి రామేశ్వరం వరకు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. సంకల్పం గట్టిగా ఉండాలే గానీ, అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది.

నాగపూర్‌కు చెందిన కమలేష్ మరియు అరుణ పాండే దంపతుల కుమార్తె ఈశ్వరీ పాండే. ఆమె పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ, చిన్న వయసు నుంచే ఆమెలో ఉన్న పట్టుదల, ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఈతలో ప్రోత్సహించారు. 10 సంవత్సరాల వయస్సు నుండి కోచ్ సంజయ్ పురుషోత్తమన్ పడ్వే వద్ద ఆమెకు శిక్షణ ప్రారంభమైంది.

మొదట్లో ఈత నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మరింత సవాళ్లు ఎదురైనప్పటికీ, నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఆమె కఠినమైన శిక్షణను ధైర్యంగా ఎదుర్కొంది. క్రమంగా ఈతలో మెళుకువలు నేర్చుకుని అనేక పోటీలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. కోచ్ మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక శిక్షణ పద్ధతుల ద్వారా ఆమె ప్రతిభ రోజురోజుకు మెరుగుపడింది.

అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సాధన వల్ల ఆమె అనేక విజయాలను సాధించింది. అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించాలన్నదే ఆమె ప్రధాన లక్ష్యంగా మారింది. అందుకోసం ఆమె అంతర్జాతీయ స్థాయి పోటీలపై దృష్టి సారించి, తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

దృష్టి లోపం ఉన్న ఈతగాళ్లకు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించాలనే లక్ష్యంతో, ఆమె అత్యంత కఠినమైన సవాల్‌ను స్వీకరించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సుమారు 25 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈత కొట్టింది. బలమైన గాలులు, భారీ అలలు, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, ఆమె తెల్లవారుఝామున 4 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి 30 నిమిషాలకు ఆమె వేగాన్ని కొనసాగించడానికి కఠినమైన పోషక నియమావళిని ఆమెకు కోచ్ అందిస్తూ విజయం సాధించే దిశగా ప్రోత్సహించారు. ఆమె దాదాపు 11 గంటల 15 నిమిషాల పాటు ఎలాంటి విరామం లేకుండా ఈత కొట్టి, మధ్యాహ్నానికి ధనుష్కోడి తీరాన్ని విజయవంతంగా చేరుకుంది. అయితే ఆమె అంధురాలు అయినందున విజయం సాదించామనే విషయం తన కోచ్ చెప్పేంతవరకు కూడా ఆమెకు తెలియదంటే ఆమెకు సాధించాలనే పట్టుదల ఎంతగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.  

ఇది కేవలం ఒక సాధారణ విజయంగా మాత్రమే చూడకుండా ఆమె సంకల్పం, అచంచల ధైర్యం, మరియు కఠినమైన శిక్షణకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సంక్లిష్టమైన  సవాల్‌ను పూర్తి చేసిన అంధ ఈతగాళ్లలో ఈశ్వరీ పాండే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
 
ఈశ్వరి సాధించిన ఈ ఘన విజయంతో ఆమె స్వస్థలం నాగపూర్ నగరం గర్వంతో స్పందించింది. భారీ ర్యాలీ, బాణాసంచా ప్రదర్శనల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ జీప్‌లో ప్రారంభమైన ఈశ్వరీ విక్టరీ పరేడ్‌లో భాగంగా, దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (IDCPe)కు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ స్క్వేర్ వద్ద డప్పులు మోగిస్తూ, రంగులు చల్లుతూ, బాణాసంచా పేలుస్తూ ఆమెను గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ వేడుక అంతటా ఉత్సాహం, ఆనందం, గర్వభావం వెల్లివిరిసింది.

మొదట్లో ఈశ్వరి ఈత నేర్చుకునే సమయంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది. అయినప్పటికీ నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఓపికగా సాధన చేస్తూ ముందుకు సాగింది. ప్రపంచ విజేతగా గుర్తింపు పొందడానికి ఆమెకు దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టింది.

నేటి యువత ఈశ్వరి పాండే జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టుదల లేకుండా వెంటనే ఫలితం రావాలని తొందరపడటం, ఫలితం రాకపోతే నిరాశ చెందటం, ఇవే యువతలో కుంగుబాటుకు ప్రధాన కారణాలు.

ఒక రైతు పంట పండించాలంటే నేలను దున్ని, విత్తనం వేసి, నారు పోసి, నీళ్లు పోసి, పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పక్వానికి వచ్చేదాకా ఓపికగా ఎదురుచూడాలి. అప్పుడు మాత్రమే పంట చేతికి వస్తుంది.

అలాగే, జీవితంలో కూడా సరైన ప్రణాళిక, నిబద్ధతతో కూడిన ప్రయత్నం, క్రమశిక్షణగల జీవనశైలి మన విజయానికి దారి తీస్తాయి. ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాకపోతే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాలి. నిరాశకు తావివ్వకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

complete vs finish

  ఒక సాయంత్రం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు భార్యకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది. భర్త దగ్గరకు వచ్చి అడిగింది. “ఏవండీ … ఒక విషయం అడ...