13, సెప్టెంబర్ 2026, ఆదివారం

సంపద కన్నా… సంస్కారం గొప్పది.

 సంపద కన్నా… సంస్కారం గొప్పది.


మనిషి జీవితంలో కొన్ని వృత్తులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావు. అవి ఇతరుల జీవితాలపై బాధ్యతను మోసేవి. అలాంటి అత్యంత బాధ్యతాయుతమైన వృత్తుల్లో డ్రైవర్ వృత్తి ఒకటి.

కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన కారును కొనుగోలు చేయవచ్చు. ఆ కారులో అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత ఖరీదైన భద్రతా ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ ఆ స్టీరింగ్‌ను పట్టుకున్న వ్యక్తి ఒక్క క్షణం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయం సంభవిస్తే, ఆ కోట్ల విలువ చేసే కారు కంటే మనిషి ప్రాణమే గొప్పదని అర్థమవుతుంది. అందుకే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణాలు దేవుడి చేతిలో ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ, ప్రయాణిస్తున్న ఆ క్షణాల్లో మాత్రం అవి డ్రైవర్ చేతుల్లో కచ్చితంగా ఉంటాయి.

అయినా సమాజంలో కొందరు డ్రైవర్‌ను కేవలం ‘ఉద్యోగి’గానే చూస్తారు. మరికొందరు వారి వృత్తిని చులకనగా భావిస్తారు. వారి చేతుల్లో తమ ప్రాణాలను పెట్టి ప్రయాణిస్తూ కూడా వారికి ఏ మాత్రం విలువ ఇవ్వరు. కానీ డ్రైవర్ అంటే కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కాదు. మనల్ని గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చే బాధ్యతను తన భుజాలపై మోసే మనిషి. మన కుటుంబ సభ్యులను, మన పిల్లలను, మన పెద్దలను తన బాధ్యతగా భావించి రోడ్డుపై అప్రమత్తంగా కాపాడే వ్యక్తి.

అందుకే ప్రతి డ్రైవర్‌ను గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి చేతిలో కేవలం స్టీరింగ్ ఉండదు… కొన్నిసార్లు ఒక కుటుంబం యొక్క ఆశలు, ఆనందం, భవిష్యత్తు, ప్రాణాలు కూడా ఉంటాయి.

అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలా ఆలోచించరు. కొందరు మాత్రం తమ వద్ద పనిచేసే వారిని డ్రైవర్ గా కాకుండా కుటుంబ సభ్యులుగా చూస్తారు. వారి శ్రమను గౌరవిస్తారు. కొన్నిసార్లు వారి కష్టాలను తీరుస్తారు. అలాంటి మనసున్న వ్యక్తుల కథలు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి.

అలాంటి అరుదైన వ్యక్తిత్వానికి నిలువెత్తు ఉదాహరణే పూణే నగరంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త "జవేరి పూణావాలా" తన డ్రైవర్ పట్ల చూపించిన ఆప్యాయత, గౌరవం, మానవత్వంతో కూడిన ఈ కథ.

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ద్వారా సుపరిచితుడైన అధర్ పూణావాలా సోదరుడు జవేరి పూణావాలా. సంపదకు, హోదాకు కొదవలేని కుటుంబంలో పుట్టిన ఆయనకు ఎందరో ఉద్యోగులు ఉండవచ్చు. కానీ వారిలో ఒకరితో ఆయనకు ఏర్పడిన అనుబంధం మాత్రం ఉద్యోగి–యజమాని సంబంధాన్ని మించింది.

జవేరి పూణావాలా వద్ద లిమోసిన్ డ్రైవర్‌గా గంగాదత్తా అనే వ్యక్తి ఏకంగా ముప్పై సంవత్సరాల పాటు సేవలందించారు. మూడు దశాబ్దాల పాటు ఒక కుటుంబంతో కలిసి ప్రయాణించడం అంటే కేవలం ఒక ఉద్యోగం చేయడం కాదు. ఆ కుటుంబంలోని ఎన్నో సంతోషాలను, బాధలను, విజయాలను, కష్టాలను దగ్గరుండి చూడడం. గంగాదత్తా కూడా జవేరి కుటుంబంలో ఒక ఆత్మీయుడిగా మారిపోయారు.

అయితే ఒకరోజు ఊహించని విషాదం చోటుచేసుకుంది. జవేరి పూణావాలా అత్యంత ముఖ్యమైన మీటింగ్ పనిమీద ముంబైలో ఉన్న సమయంలో గంగాదత్తా మరణించారనే వార్త ఆయనకు అందింది. ఆ వార్త విన్న వెంటనే జవేరి పూణావాలా తనకు ఉన్న సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. తనకు ఎంత ముఖ్యమైన పని ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాలుగా తన కోసం పనిచేసిన మనిషి చివరి ప్రయాణానికి తాను హాజరు కావడం అంతకంటే ముఖ్యమని భావించారు. తాను పూణే చేరుకునే వరకు అంత్యక్రియలను నిర్వహించవద్దని గంగాదత్తా కుటుంబ సభ్యులను కోరారు. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంతో ఆయన హుటాహుటిన హెలికాప్టర్‌లో పూణేకు బయలుదేరారు. పూణే చేరుకున్న అనంతరం ఆయన చేసిన పని అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.

ముప్పై సంవత్సరాల పాటు గంగాదత్తా నడిపిన అదే లిమోసిన్ కారును పూలతో అందంగా అలంకరించారు. అందులో గంగాదత్తా పార్థివ దేహాన్ని ఉంచారు. ఆ తర్వాత. ఆ ముప్పై సంవత్సరాల ప్రయాణానికి ఒక అపూర్వమైన ముగింపుగా, గంగాదత్తా చివరి ప్రయాణాన్ని అదే కారులో స్వయంగా గంగాదత్తా నివాసం నుంచి శ్మశానవాటిక వరకు జవేరి పూణావాలానే ఆ లిమోసిన్‌ను నడిపించారు.

ఈ ఘటన గురించి పలు మీడియావాళ్లు ఆయనను అడిగినప్పుడు, విషణ్ణ వదనంతో జవేరి పూణావాలా చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.

“గంగాదత్తా నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించాడు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.

ఒక డ్రైవర్‌ను కేవలం ‘ఉద్యోగి’గా చూడకుండా… అతని కష్టాన్ని, అతని త్యాగాన్ని, అతని కుటుంబం కోసం అతను చేసిన పోరాటాన్ని గుర్తించిన వ్యక్తి జవేరి పూణావాలా.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

అంబులెన్స్ దాదా "కరీముల్ హక్"

 అంబులెన్స్ దాదా "కరీముల్ హక్"


ప్రభుత్వ వైద్యరంగం, అంబులెన్స్ వ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా “రాశిలో ఘనం.. వాసిలో నాసిరకం” అనే నిట్టూర్పులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు దేశంలో ప్రైవేట్ వైద్యరంగం ఆధునిక సాంకేతికత, అత్యాధునిక చికిత్సా విధానాలతో ముందుకు దూసుకుపోతుంటే. మరోవైపు ప్రభుత్వ వైద్యరంగం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కనిపిస్తోంది.

సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. అంబులెన్స్ వచ్చినా, రోగిని తీసుకెళ్లేందుకు సరైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్య. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో రోగిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడానికి గంటల సమయం పడుతోంది. ఒక్కోసారి ఆ ప్రయాణమే ప్రాణాంతకంగా మారుతోంది. సమయానికి వైద్యం అందితే బతికే అవకాశమున్న వ్యక్తి.. అంబులెన్స్ ఆలస్యం, రవాణా సౌకర్యాల కొరత, సమీపంలో సరైన ఆసుపత్రి లేకపోవడం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా పరిధిలోని ఓ తేయాకు తోటలో పనిచేస్తున్న కరీముల్ హక్ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన ఆయనను అంబులెన్స్ సేవల వైపు నడిపించింది. ఓ అర్ధరాత్రి ఆయన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో అంబులెన్స్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయారు. చివరకు చికిత్స అందక ఆయన తల్లి ప్రాణాలు కోల్పోయారు.

తన కళ్లముందే జరిగిన ఈ విషాదం కరీముల్ హక్‌ను తీవ్రంగా కలచివేసింది. తాను ఎదుర్కొన్న నిస్సహాయత మరొక కుటుంబానికి ఎదురుకాకూడదనే సంకల్పం ఆయనలో బలపడింది. అంబులెన్స్ అందుబాటులో లేక ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆయన తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.

1995లో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లికి గుండెపోటు వచ్చింది. అత్యవసర సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయారు. చివరకు తల్లి ప్రాణాలు కోల్పోయింది. తన కళ్లముందే జరిగిన ఈ విషాదం కరీముల్ హక్ మనసులో చెరగని ముద్ర వేసింది. అత్యవసర వైద్యం అందక మరెవరూ తన తల్లిలా ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పం అప్పుడే ఆయనలో మొదలైంది.

ఆ సంకల్పానికి 1998లో కార్యరూపం దాల్చే అవకాశం వచ్చింది. ఓ రోజు ఆయన సహోద్యోగి ఒకరు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అంబులెన్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి లేదు. వెంటనే స్పందించిన కరీముల్ హక్. సహోద్యోగిని  తన వీపుకు కట్టుకుని, మోటార్‌సైకిల్‌పై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ క్షణమే “మోటార్‌సైకిల్ అంబులెన్స్” అనే ఆలోచన ఆయనకు వచ్చింది.

ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు తన సొంత మోటార్‌సైకిల్ కొనుగోలు చేయడానికి డబ్బు అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి మోటార్‌సైకిల్‌నే అంబులెన్స్‌గా మార్చుకుని మారుమూల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించారు. 1998 నుంచి ఇప్పటివరకు 20కి పైగా పరిసర ప్రాంతాల్లో ఆయన అందించిన ఈ సేవల ద్వారా 7,000 మందికి పైగా వైద్య సహాయం అవసరమైన వారికి అండగా నిలిచినట్లు పేర్కొనబడింది.

కరీముల్ హక్ సేవలు కేవలం రోగులను ఆసుపత్రులకు తరలించడంతోనే ఆగిపోలేదు. వైద్యుల సహకారంతో స్థానిక ప్రజలకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా సూచనలు అందిస్తున్నారు.

తల్లి అంబులెన్స్ అందక ప్రాణాలు కోల్పోయింది. ఆ విషాదం కొడుకులో సంకల్పాన్ని రగిలించింది. ఆ సంకల్పం ఒక మోటార్‌సైకిల్‌ను అంబులెన్స్‌గా మార్చింది. ఆ అంబులెన్స్ ప్రయాణం వేలాది మందికి అత్యవసర సమయంలో ఆశాకిరణంగా నిలిచింది.

60 ఏళ్ల కరీముల్ హక్ తన తల్లిదండ్రులకు జన్మించిన ఆరుగురు సంతానంలో మూడవవాడు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కరీముల్ హక్ మూడో తరగతి వరకే చదువుకోగలిగారు. అయితే పుస్తక పాఠాలు పెద్దగా నేర్చుకోకపోయినా. జీవితం మాత్రం మానవత్వం అనే గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆ పాఠాన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న హక్.. నిస్సహాయులకు అండగా నిలుస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

కరీముల్ హక్ చేసిన నిస్వార్థ సామాజిక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంబులెన్స్ అందక తన తల్లిని కోల్పోయిన ఓ సాధారణ వ్యక్తి.. అదే బాధ మరొకరికి రాకూడదనే సంకల్పంతో ప్రారంభించిన సేవ.. చివరకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ వరకు తీసుకెళ్లింది. చదువు మూడో తరగతితో ఆగిపోయినా.. కరీముల్ హక్ మానవత్వం మాత్రం వేలాది జీవితాలను తాకేంతగా విస్తరించింది. తనకు ఎదురైన బాధను ఇతరులకు సేవగా మలిచిన ఆయన జీవితం.. సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది: పరిస్థితులు మనిషిని ఆపలేవు.. సంకల్పం ఉంటే ఒక సాధారణ మోటార్‌సైకిల్ కూడా ఒక ప్రాణాన్ని కాపాడే అంబులెన్స్‌గా నిలిచింది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

సంపద కన్నా… సంస్కారం గొప్పది.

  సంపద కన్నా… సంస్కారం గొప్పది. మనిషి జీవితంలో కొన్ని వృత్తులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావు. అవి ఇతరుల జీవితాలపై బాధ్యతను మోసేవి. అలాంటి...