9, ఆగస్టు 2026, ఆదివారం

ఆమె జడలో ఒదిగిన మల్లెలు

ఆమె జడలో ఒదిగిన మల్లెలు కురులకే అందం.. 
ఆ మల్లెలు సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటే,
అందరి చూపులు ఆమెవైపే మళ్ళినా…
ఆ ఆకర్షణ మాత్రం ఆ మల్లెల మాధుర్యానికే.

ఆమె అందం కన్నులను ఆకర్షిస్తుందేమో గానీ,
మల్లెల పరిమళం మాత్రం మనసులను మైమరపిస్తుంది.
రూపం నయనానందకరంగా  రంజింపజేస్తుంది,
పరిమళం మదిలో మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది.

ఆమె అడుగుల సవ్వడి వినకముందే మల్లెల మాధుర్యమే ఆమె రాకను ప్రకటిస్తుంది.
ఆమె పలకరింపుకుముందే పూల పరిమళమే హృదయాన్ని హత్తుకుంటుంది.

అందుకే…
ఆమె జడలో విరిసిన ఆ మల్లెలు,
ఆమె సోయగానికి ప్రకృతి అందించిన సుగంధ పరిమళాలు.

కన్నులు రూపాన్ని వెతుకుతాయి…
హృదయం మాత్రం పరిమళాన్ని వెతుకుతుంది.
అందం కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ పరిమళం మాత్రం
జ్ఞాపకాల గుండెల్లో నిత్యవసంతమై నిశ్శబ్దంగా వికసిస్తూనే ఉంటుంది.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

వీది అరుగులు

 ఆవేదన అలలై అంతరంగాన్ని అతలాకుతలం చేసినప్పుడల్లా,

అలసిన అడుగులకు ఆలంబనైనవి ఆ వీధి అరుగులే.

మాటల్లో చెప్పలేని మనోవేదనను,
మౌనంగా చెక్కిలి నుండి జారే కన్నీళ్లను, ఓర్పుతో ఆలకించే
శక్తి ఆ అరుగులకే సొంతం.

కన్నవారు కాదుపొమ్మంటే వారి కళ్లలో వెలుగు కరిగిన కథలు,
ఒంటరి గుండెల్లో  వేదన మిగిల్చిన జ్ఞాపకాలు, ఎన్నో నిరీక్షణల నిశ్శబ్ద నిట్టూర్పులు అన్నీ ఆ అరుగుల మీదే ఆశ్రయం పొందాయి.

బంధాలు దూరమై బాధలో ఉన్నప్పుడు ఆ బాధలు పంచుకునే ఆత్మీయ వేదికలు ఆ అరుగులే కదా!

నేడు బాధలు చెప్పుకునే వృద్ధులే లేరా అని ఆ అరుగులెందుకో చిన్నవోయినాయి..

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

రాట్నం తిరగనంటుంది

 రాట్నం తిరగనంటుంది


మానవాళికి వస్త్రమై మర్యాదను అల్లిన చేతులవి…
మట్టి వాసనలో మమకారాన్ని నేసిన మనసులవి…
దేశమనే దేహానికి స్వదేశీ అనే శ్వాసను అందించిన చేనేత 
రాట్నమే నేడు…“తిరగనంటుంది…”

నేతలు రాట్నం తిప్పిన ప్రతిసారి
బానిస సంకెళ్లపై స్వేచ్ఛా శంఖం మోగేది.
ప్రతి నూలు పోగులో స్వరాజ్య స్వప్నం మొలకెత్తేది.
ప్రతి ఖాదీ వస్త్రంలో భారతమాత గుండె చప్పుడు వినిపించేది.

విదేశీ వస్త్రాలను వెలిగే మంటల్లో విసిరేసి,
స్వదేశీ దీపాన్ని వెలిగించిన విప్లవ జ్యోతి…
ఆ చేనేత రాట్నమే కదా!

నేతన్న చెమట చుక్కలు దేశభక్తి గీతాలయ్యాయి…
నూలు పోగులు జాతీయ పతాకపు రంగులయ్యాయి…
మగ్గం శబ్దమే స్వాతంత్ర్య రణభేరిగా మారింది.

కానీ నేడు…

దేశం కోసం తమ జీవితాలనే నూలుపోగులుగా అర్పించిన
ఆ చేనేత త్యాగాలను కాలమే మడతపెట్టేసిందని… 
అందుకే రాట్నం తిరగనంటుంది.

ఖాదీ వస్త్రాలు తొడిగే నేతన్నలపై నేతన్న 
కన్నీటి బరువు కనిపించడం లేదని… 
అందుకే రాట్నం తిరగనంటుంది.

జాతీయ పండుగల రోజు మాత్రమే ఖాదీని గౌరవించి,
మిగిలిన రోజుల్లో నేతన్నను మరచిపోయే నకిలీ దేశభక్తిని చూసి… 
అందుకే  రాట్నం తిరగనంటుంది.

✍️
కోట దామోదర్ 
మొబైల్ 9391480475

ఆమె జడలో ఒదిగిన మల్లెలు

ఆమె జడలో ఒదిగిన మల్లెలు  కురులకే అందం..  ఆ మల్లెలు సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటే, అందరి చూపులు ఆమెవైపే మళ్ళినా… ఆ ఆకర్షణ మాత్రం ఆ మల్లెల మాధ...