1, అక్టోబర్ 2024, మంగళవారం

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్:

19, సెప్టెంబర్ 2024, గురువారం

హాస్యానికి చిరునామా సాకలి హనుమంతు:

హాస్యానికి చిరునామా సాకలి హనుమంతు:

నిన్న అనుకోకుండా వాట్సాప్ చూస్తుండగా స్టేటస్ లో అనుకోకుండా సాకలి హనుమంతు చనిపోయాడన్న వార్త చూసాను. హనుమంతు మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. హనుమంతు తన నవ్వుల పువ్వులతో గుమ్మడవెల్లి ప్రజలందిరికి హాస్యసుగంధాలు అందించాడు.అందరితో కలసి అందరినీ నవ్వించేవాడు. నలుగురిలో నవ్వుల రారాజు. సహజంగా సినిమాల్లో కామెడీ సీన్లు చేయాలంటే స్క్రిప్ట్ రాయాలి, ఒకరు స్క్రిప్ట్ రాస్తారు, మరొకరు కామెడీ చేస్తారు. కానీ హనుమంతు, గుడ్ల రాజమల్లు ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా సహజంగానే సందర్భానుసారంగా అలవోకగా హాస్యాన్ని పండించే భాష ప్రావీణ్యత కలిగిన వారు గుమ్మడవెల్లి లో ఇద్దరే. హనుమంతుని వయస్సు దాదాపు 75 సంవత్సరాలు. కానీ అలుపెరగని కఠోర శ్రామికుడు, అతను చేసే పనులు చూస్తే 25 ఏళ్ల యువకుడు కూడా చేయలేరేమో అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు.  వయసు కేవలం మనిషికే కానీ మనుసుకాదని నమ్మిన వ్యక్తి హనుమంతు. హనుమంతు మాటలు వింటే ఎంతటి కఠోరమైన మనసు అయినా కరిగిపోవాల్సిందే ఆయన మాటల చమత్కారం తేనె లాంటివి. కోపంలో ఉన్నవారిని సైతం నవ్వించగల శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. నేను హైదరాబాద్ నుండి ఊరికి ఎప్పుడైనా వెళ్తే  "నమస్తే పెద్దన్న" అనేది. నా వయసు ఆయన వయసులో సగం అయినా ఆయన నన్ను అన్న అనే పిలుస్తాడు. అన్న మంచిగున్నావే వదినగిట్ల అంత మంచేనా అన్న అని పలకరిస్తే నా ఊరిని విడిచి పోలేము అనే భావన కలిగేది ఇంతటి ప్రేమానురాగాలు చూపే వ్యక్తులు దొరకటం నా అదృష్టంగానే భావిస్తాను. నేను ఊరికి వచ్చానని తెలిస్తే చాలు తప్పకుండ నన్ను కలిసి చాల సేపు ముచ్చట పెట్టేది. హనుమంతు మా ఇంట్లో ఉప్పలమ్మ పండుగ జరిగిన ప్రతిసారి ఆయన ఉండాల్సిందే హనుమంతు మా ఇంటి సాకాలాయన. అయినా హనుమంతు మా ఇంటి సొంతమనిషి లాగే ఉండేవారు. ఆప్యాయతంగా మాట్లాడే హనుమంతు అన్న లేనిలోటు ఎప్పటికీ తీరదు. కల్మషం లేని వ్యక్తి, ఆపద అంటే నేను ఉన్న అనే హనుమంతు లాంటి మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమైన విషయమే. ఆయన అద్భుతమైన వాయిద్య కళాకారుడు కూడా చిరంజీవి సినిమా పాటలంటే పిచ్చి. హనుమంతు ఎవరిని కూడా పేరు పెట్టి పిలవరు అందరిని వరుసలు కలుపుతూ మర్యాదగా పిలవటం ఆయనకు అలవాటు. చిన్నపిల్లలందరిని ఓ తాత అని పిలుస్తూ ఊళ్ళో అందరి మనుసులను గెలుచుకున్న వ్యక్తి హనుమంతు తాత. ఒకానొక సందర్భంలో గుడ్ల రాజమల్లు పొలం దగ్గర హనుమంతు, గుడ్ల రాజమల్లు మాట్లాడుకునే తీరును చూసి నా జీవితంలో ఎప్పుడు నవ్వనంత నవ్వు వచ్చింది. వాళ్లిద్దరూ వరుసకు బావ భామర్దులు. ఈ ఇద్దరు ఎక్కడ కలిసి మాట్లాడుకున్న వారి మాటలువిని పక్కన ఉన్నవారు నవ్వకుండా ఉండలేరు. అంత హాస్యాస్పదంగా ఉంటాయి వారి మాటలు. చమత్కారమైన మాటలు ఛలోక్తులు హనుమంతుకు వెన్నతో పెట్టిన విద్య. గుడ్ల రాజమల్లు కూడా ఓ అద్భుతమైన హాస్య కళాకారుడే.

ఓరోజు గుడ్ల రాజమల్లు పొలం లో పని చేస్తుండగా తోట రాములు గుడ్ల రాజమల్లును చూసి "ఎందుకే రాజమల్లు నీకింత కష్టం సప్పుడుఁజేక ఇంట్లో ఇంత తిని కూసోక" అని అన్నాడు వెంటనే రాజమల్లు తోట రాములును చూసి "నువ్వుపెట్టిన బువ్వేరా రాములు" అన్నాడు అక్కడ ఉన్నవాళ్ళంతా నవ్విర్రు. ఆ విషయాన్నీ ఇప్పటికి గుర్తు చేసుకున్నపుడల్లా నవ్వుకుంటాను. నవ్వుల రారాజు రాజమల్లు మరణం కూడా బాధాకరమే. హాస్యం వీరిద్దరి చిరునామా,నవ్వించడం వీరి నైజం,మాటల్లో హాస్యాన్ని పండించడంలో వీరిద్దరిది ఒక ప్రత్యేక శైలి, ఏ విషయంపై మాట్లాడిన తన హాస్యాస్పందన పటిమతో రక్తి కట్టించే వారు. వీరిద్దరి మరణం గుమ్మడవెల్లి గ్రామానికి తీరని లోటు. 

హనుమంతు ను స్మరించుకుంటూ వారికివే మా ఘన నివాళులు.

కోట దామోదర్

మొబైల్ 9391480475 


17, సెప్టెంబర్ 2024, మంగళవారం

హైడ్రాతో హైదరాబాద్ చెరువులకు పునర్జన్మ రానుందా!

హైడ్రాతో హైదరాబాద్ చెరువులకు పునర్జన్మ రానుందా!


ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడే హైదరాబాద్ నగరంలో నేడు చిన్నపాటి వర్షానికే ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీల్లో, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు వరదకు గురికాకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి సమన్వయంతో సరైన ప్రణాళిక సిద్ధం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆదాయంపై దృష్టి సారించి మౌలిక వసతుల పెట్టుబడులపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంలో ప్రభుత్వాలు విఫలమవడం ఒక కారణమైతే చెరువులను ఆక్రమించి, నాళాలను మూసేసి అక్రమంగా  నిర్మాణాలు చేపట్టడం ప్రధాన కారణం.  హైదరాబాద్‌లో 2000 సంవత్సరానికి ముందు లేని వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటి? హైదరాబాద్ వరదలకు ప్రభుత్వాలు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి? హైదరాబాద్ చరిత్ర తెలిస్తే తప్ప వీటన్నింటికీ సమాధానం తెలుసుకోవడం కష్టం.

16, 17 శతాబ్దాలలో కుతుబ్ షాహీ కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉండేవి. 1970 నుంచి చెరువులు ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు అనేక నీటి వనరులు ఉండేవి. కానీ వాటిలో 70 నుంచి 500 మాత్రమే నేడు మనుగడలో ఉన్నాయి. తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మాసబ్ ట్యాంక్ మొదలైనవి పూర్తిగా కనుమరుగవగా, మనుగడలో ఉన్న కొన్ని చెరువులు చిన్న చెరువులుగా మరియు మురికి కాల్వలుగా కుంచించుకుపోయాయి.

అడుగంటిన భూగర్భ జలాలు:

హైదరాబాదీల దాహార్తిని తీర్చేందుకు హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్ సాగర్ తో పాటు మరెన్నో చెరువులను నీటి వనరులుగా ఉపయోగించేవారు. ఒకప్పుడు హైదరాబాద్ లో నీటి సమస్య లేదు. ఎప్పటినుండైతే చెరువులు, కుంటలు అక్రమాలకు గురవుతున్నాయో అప్పటినుండి నగరంలో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడుతోంది. గత కొంతకాలం నుంచి ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో వాటర్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం లోపల మరియు పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు లేకపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకక పోవడం, వృధాగా మూసినదిలో కలవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.     

ఒకప్పుడు హుస్సేన్‌సాగర్‌ చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. నేడు నగరం లోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చే మురుగు నీరు మరియు పరిశ్రమల నుండి వచ్చే కలుషిత వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్ సరస్సులోకి వచ్చి చేరుతుండడంవల్ల మురుగు వాసనతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చెరువుల సంరక్షణ బాధ్యతను రాజకీయ నేతలు విస్మరించి వాటిని యధేచ్ఛగా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో చినుకు పడగానే వరద కారణంగా కాలనీలు మునిగిపోతున్నాయి. నాళాలకు మరమ్మతులు చేయకుంటే భవిష్యత్తులో నగరానికి ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి చెరువులను పరిరక్షించడమే పరిష్కారమని భావించింది. నగరంలోని చెరువులను పునరుద్ధరించేందుకు ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) వ్యవస్థను తీసుకొచ్చారు.

కబ్జాకు గురైన చెరువులు:
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా నగర వాసులకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో హైడ్రా ను ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల ఆక్రమణలను అరికట్టడం, ఆక్రమణల తొలగింపు, అక్రమ నిర్మాణాలు, అక్రమ హోర్డింగ్‌లు, ప్రకటనల తొలగింపు వంటి ప్రధాన బాధ్యతలను ప్రభుత్వం హైడ్రా కు అప్పగించింది.

రోజురోజుకూ వలసలు పెరిగి రియల్‌ బూమ్‌ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, కాలువలు కనుమరుగవుతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో నగరంలోని అన్ని చెరువుల్లో దాదాపు 80 శాతం ఆక్రమణలకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. కొన్ని చెరువులు, కుంటలు పూర్తిగా ఆక్రమణలకు గురై కాలనీలుగా మారడంతో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 920 చెరువుల్లో 491 చెరువులు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ విస్తీర్ణం కేవలం 30 ఏళ్లలో ఏకంగా 499 ఎకరాలు కబ్జాకు గురై 1359 ఎకరాల నుంచి 860 ఎకరాలకు కుంచించుకు పోయింది.

శామీర్‌పేట్  చెరువు 1989లో 1200 ఎకరాలు ఉండగా 2006లో దాదాపు 568 ఎకరాలు ఆక్రమణకు గురై 632 ఎకరాలకు తగ్గింది. ఇలా ఎన్నో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి.

2010 నాటికి, 500 సరస్సులు హుడా పరిధిలో ఉండగా, మే 2018 నాటికి 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన 169 చెరువులు మాత్రమే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు.

కూకట్‌పల్లి, మూసాపేటలో అతిపెద్ద చెరువు మైసమ్మ చెరువు ఒకప్పుడు 280 ఎకరాలు ఉండగా.. ఓ నాయకుడు వెంచర్లు వేసి ప్లాట్లుగా విభజించి విక్రయించాడు. ఇలా ఆక్రమణలతో ఇప్పుడు సగానికి పైగా కుంచించుకుపోయింది. అంతేకాదు కూకట్‌పల్లి సర్వే నంబర్ల పరిధిలోని కాముని  చెరువు 50 ఎకరాలు ఉండగా, ఒకవైపు అల్లాపూర్ డివిజన్, బాలాజీనగర్ డివిజన్‌ల ద్వారా రెండు వైపులా చెరువు ఆక్రమణలకు గురై చాలా వరకు కుంచించుకుపోయింది.

నేరేడ్‌మెట్‌ డివిజన్ పరిధిలోని ఆర్కే పురం చెరువు గతంలో 70 ఎకరాల్లో విస్తరించి ఉండగా నేదు అందులో సగం కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గోల్కొండ మండల రెవెన్యూ పరిధిలోని లంగర్‌హౌస్ చెరువు విస్తీర్ణం దాదాపు 26 ఎకరాలు కాగా ప్రస్తుతం చెరువు 12.5 ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 13.5 ఎకరాల చెరువు కబ్జాకు గురైంది.

వినాయకనగర్‌, మౌలాలి, ఆనంద్‌బాగ్‌ డివిజన్లలోని బండ చెరువు గతంలో వంద ఎకరాల్లో విస్తరించి ఉండేది. చెరువు పరిరక్షణకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం, నేటికీ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిమితులు ఖరారు కాకపోవడంతో సగానికిపైగా చెరువు కబ్జాకు గురైంది.

ఒకప్పుడు 290 ఎకరాల విస్తీర్ణంలో ఉండే జీడిమెట్ల గ్రామానికి సమీపంలోని కొల్లాచెరువును రాజకీయ నేతల అండదండలతో ఆక్రమించి అక్రమ నిర్మాణాలు, పరిశ్రమలు నిర్మిస్తున్నారు. నేడు 126 ఎకరాల చెరువు మాత్రమే మిగిలి ఉంది. కబ్జాదారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలవడం సిగ్గుచేటు.

మాదాపూర్‌లోని దుర్గం చెరువు ఒకప్పుడు 180 ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 130 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. 50 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువు ఎఫ్‌టీఎల్‌ స్థలంలో పలు కాలనీలు ఏర్పడి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. శేరిలింగంపల్లిలోని తారానగర్‌ సర్వేనెంబర్‌ 19 వడులకుంట 1.02 ఎకరాల విస్తర్ణంలో ఉండగా, ప్రస్తుతం 200 గజాల మాత్రమే మిగిలింది.

కొన్ని చెరువులు చూద్దామన్నా కనిపించకపోవడం అంతేకాకుండా అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారడం అత్యంత  ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రేటర్‌లో చెరువుల ఆక్రమణ యధేచ్చగా సాగుతూనే ఉంది. అందుకారణంగా నగరంలో చిన్న వర్షం కురిసినా వరద పోటెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించే లక్ష్యంతో  హైడ్రా ను ఏర్పాటు చేసి ఎంతటివారినైనా ఉపేక్షించకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది.   

హైడ్రా పాత్ర ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా విభాగం గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. హైడ్రా ప్రోయాక్టివ్ విధానం కేవలం అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా  ప్రభుత్వ భూమిని పునరుద్ధరించడం మరియు హైదరాబాద్ పట్టణాభివృద్ధి చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం, చట్టానికి ఎవరూ అతీతులు కాదు మరియు పబ్లిక్ ఆస్తులను తిరిగి పొందడం మరియు రక్షించడం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. GHMC పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగులు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో హైడ్రా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేత చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెంబడి ఆక్రమణకు గురైన సుమారు 44 ఎకరాల భూమిని విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సాహసోపేతమైన చొరవ 18 అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి దారితీసింది, వాటిలో చాలా వరకు ప్రముఖ వ్యక్తులు మరియు రాజకీయ ప్రముఖులకు చెందినవి కావడం విశేషం.

హైడ్రా కూల్చివేతలు, స్వాధీనం చేసుకున్నవి:

హైదరాబాద్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఆక్రమణల పై నోటీసులు జారీ చేసింది. హెచ్చరికలు చేసినా నిర్మాణాలు చేస్తున్న వాటిని కూల్చి వేస్తోంది. హైడ్రా ఇప్పటివరకూ మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు ఒక నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78  ఎకరాలు, బుమ్రాక్ డౌలా 12 ఎకరాలు, సున్నం చెరువు 10 ఎకరాలు , గండిపేట్ లేక్ 8.75 ఎకరాలు , గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. హైడ్రా ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేయగా.. ఒక్క అమీన్‌పూర్ చెరువులోనే 51.78 ఎకరాల్లో 24 నిర్మాణాల కూల్చివేసింది. సున్నం చెరువులో 10 ఎకరాలు రికవరీ చేసింది. సున్నం చెరువులో 42 నిర్మాణాలు కూల్చివేయగా.. కత్వా చెరువు FTL, బఫర్‌జోన్‌లో 2.5 ఎకరాలు రికవరీ అయింది. కత్వా చెరువులో 13 విల్లాలు కూల్చివేసింది. గండిపేట్ చెరువులో 8.75 ఎకరాలు రికవరీ చేయగా.. గండిపేట్ లేక్‌లో చిలుకూరు వద్ద మరో 6.5 ఎకరాలు, తుమ్మిడికుంట చెరువులో 4.9 ఎకరాలు రికవరీ చేసినట్లు హైడ్రా వెల్లడించింది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

https://thebetterandhra.com/telugu/telugu-special-stories/hydra-to-extend-wide-range-of-services-with-a-lot-of-hope-to-the-future-of-hyderabad/



31, ఆగస్టు 2024, శనివారం

మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం.

 మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం.


మన నిత్య జీవితంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తాయి మరియు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. నేను చెప్పబోయేది మనందరినీ ఆశ్చర్యపరిచే మరియు ఆలోచింపజేసే అలాంటి ఒక సంఘటన. సహజంగా చెరువులు, నదులు ఎండిపోవడాన్ని మనం కొన్నిసార్లు వింటాం లేదా చూస్తాం, కానీ సముద్రం ఎండిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు కదా? కానీ ఇది ముమ్మాటికీ నిజం.

ఒకప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద అంతర్గత నీటి వనరు మరియు పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన అరల్ సముద్రం నేడు కనుమరుగైంది అనే విషయం అందరిని ఆలోచింపజేస్తుంది. కజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న అరల్ సముద్రం 26,300 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో నిత్యం చేపలతో కళకళలాడుతూ ఆర్ధిక వ్యవస్థకు ఎన్నుదన్నుగా నిలిచింది. అలాంటి సముద్రం  గ్లోబల్ వార్మింగ్ మరియు అభివృద్ధి యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా ఈ సరస్సు 1960 నుండి తగ్గిపోతూ 2010 నాటికి పూర్తిగా ఆవిరైందని పరిశోధకులు కనుగొన్నారు.

వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. 1960లో అరల్ సముద్రం యొక్క ఉపరితలం సముద్ర మట్టానికి 175 అడుగుల (53 మీ) ఎత్తులో ఉంది మరియు సుమారుగా 26,300 చదరపు మైళ్ళు (68,000 చదరపు కిమీ) విస్తీర్ణంలో ఉంది. అరల్ సముద్రం ఉత్తరం నుండి దక్షిణానికి 270 మైళ్ళు (435 కిమీ) మరియు తూర్పు నుండి పడమరకు 180 మైళ్ళు (290 కిమీ) ఉంది. అరల్ సముద్రం అదృశ్యం కావడానికి ప్రధాన కారణం సోవియట్ యూనియన్ యొక్క ఆర్థిక విధానాలు సిర్ దర్యా మరియు అము దర్యా నదుల నీటిని సాగునీటి ప్రాజెక్టుల కోసం మరియు వ్యవసాయ అవసరాల కోసం మళ్లించడం, వలన అరల్ సముద్రం యొక్క నీటి మట్టం క్రమపద్ధతిలో మరియు భారీగా తగ్గింది. ఈ రెండు నదులు అరల్ సముద్రానికి ప్రధాన నీటి వనరులు. అందువల్ల నదుల నుండి నీరు రాకపోవడంతో సముద్రం ఎండిపోవడానికి ప్రధాన కారణం. సోవియట్ ప్రభుత్వం ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో పెద్ద ఎకరాల పచ్చిక బయళ్లను లేదా సాగు చేసిన భూములను అము దర్యా, సిర్ దర్యా మరియు వాటి ఉపనదుల జలాలను ఉపయోగించడం ద్వారా సాగునీటి వ్యవసాయ భూములుగా మార్చింది. 1980ల చివరి నాటికి సరస్సు 1960కి ముందు ఉన్న దాని పరిమాణంలో సగానికి పైగా కోల్పోయింది. ఫలితంగా, సరస్సులోని ఉప్పు మరియు ఖనిజాలు మరింత కేంద్రీకృతమయ్యాయి. సముద్రం లో నీరు లేని కారణంగా ఇరు రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కున్నాయి. నీటి సమస్యను పరిష్కరించేందుకు 1994లో కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ మరియు తజికిస్థాన్‌లతో కలిపి అరల్ సముద్రాన్ని రక్షించే ప్రయత్నాలను చేపట్టినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అరల్ సముద్రం నీటిమట్టం 2006 మరియు 2009 నాటికి నాలుగైదు వంతులు తగ్గింది. సముద్రం యొక్క ఉత్తర భాగాన్ని రక్షించడానికి ప్రపంచ బ్యాంకు, కోక్-అరల్ డ్యామ్ నిర్మాణానికి సిర్ దర్యా వెంబడి ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. అయితే, దక్షిణ భాగం-తూర్పు మరియు పశ్చిమ లోబ్‌లు కానీ ముఖ్యంగా తూర్పు-ఉత్తరం-కొంత నీటి ప్రవాహం ఉన్నప్పటికీ, కుంచించుకుపోతూనే ఉంది. 2010 తర్వాత చాలా కాలం పాటు తూర్పు లోబ్ పూర్తిగా ఎండిపోయింది.

అరల్ సముద్రం ఎండిపోవడంతో మత్స్య సంపద, వాటిపై ఆధారపడిన వర్గాలు కుప్పకూలాయి. పెరుగుతున్న ఉప్పునీరు ఎరువులు మరియు పురుగుమందులతో కలుషితమైంది. వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన, బహిర్గతమైన సరస్సు అడుగుభాగం నుండి వీచే దుమ్ము ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది.

సముద్రాలు వాటి లోపల సరికొత్త ప్రపంచాన్ని కలిగి ఉన్నాయి. లోతైన సముద్రంలో ఉండే జీవులు చాలా అరుదు మరియు అందంగా ఉంటాయి. కానీ అరల్ సముద్రం ఎండిపోవడం వల్ల చమత్కారమైన సముద్ర జీవులు నష్టపోయాయి. సముద్రం ఎండిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు మరియు వారు చాలా ఆశ్చర్యపోయారు.

సంకోచానికి కారణం

ఇది ఒకప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సరస్సు. ప్రధానంగా మంచు కరగడం మరియు సుదూర పర్వతాల నుండి కురిసే అవపాతం కారణంగా, అరల్ సముద్రం విస్తృతమైన మత్స్యకార సంఘాలకు మరియు కజాఖ్స్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లోని చాలా శుష్క ప్రాంతంలోని సమశీతోష్ణ ఒయాసిస్‌కు మద్దతు ఇచ్చింది.

కానీ 1950లు మరియు 60లలో, సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని రెండు ప్రధాన నదులైన సిర్ దర్యా మరియు అము దర్యాలను మళ్లించే ప్రాజెక్టులను ప్రారంభించింది. ఎడారిని పత్తి మరియు ఇతర పంటలకు వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడానికి ఆనకట్టలు, కాలువలు మరియు ఇతర నీటి పనులు నిర్మించబడ్డాయి. అప్పటి నుండి అరల్ సముద్రం నెమ్మదిగా కనుమరుగవుతోంది.

పర్యావరణంపై ప్రభావం

అరల్ సముద్రం ఎండిపోవడంతో మత్స్య సంపద, వాటిపై ఆధారపడిన వర్గాలు కుప్పకూలడమే కాకుండా అక్కడి నేల మొత్తం ఉప్పునీరు ఎరువులు మరియు పురుగుమందులతో కలుషితమైంది. వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన, బహిర్గతమైన సరస్సు అడుగుభాగం నుండి వీచే దుమ్ము ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది.
అరల్ సముద్రం ఎండిపోవడం వల్ల ఆ ప్రాంతంలో దుమ్ము మరియు ఉప్పు తుఫానుల సంఖ్య బాగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏటా పది పెద్ద దుమ్ము తుఫానులు సంభవిస్తున్నాయని, వాటిలో ఎక్కువ భాగం ఏప్రిల్ మరియు జూలై నెలల మధ్య సంభవిస్తున్నాయని ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి.

మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం చరిత్ర మనకు ఒక పాఠం చెబుతుంది. మనం ప్రకృతిని అతిగా వినియోగించుకుంటే, దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

18, ఆగస్టు 2024, ఆదివారం

తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు

తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు

 నిజం చెప్పాలంటే కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిని, అనిర్వచనీయమైన అనుభూతిని, మరియు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తాయి డా. సి. నారాయణరెడ్డి గారు రాసిన పాటలు. ఆయన కలం నుండి దొర్లిన పాటలు ఎందరో తెలుగువారి హృదయాలను దశాబ్దాలుగా ఓలలాడిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పాటలోని ప్రతిపదం శ్రోతల హృదయ కవాటాల మీటలను సుతిమెత్తగా స్పృశిస్తుంది. ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన యుగళగీతాల ద్వారా అద్భుతమైన సాహిత్యాన్నిఅందించిన సాహిత్యశిఖరం "సినారె". సందార్భానుసారం వైవిధ్యభరితమైన దైవభక్తి, దేశభక్తి,బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, వచన కవితలు, గజల్స్, పౌరాణిక రచనలతో శ్రోతలకు వీనుల విందు చేశారు. సందర్భానుసారంగా ఏ పాటైనా అలవోకగా రాయగల ప్రావీణ్యత ఆయనకు వాగ్దేవి ద్వారా సిద్ధించిన వరం. ఆయన కలం నుంచి జాలువారిన దాదాపు ప్రతి పాట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు అప్రయత్నంగా వారి పెదవులపై నాట్యమాడేలాచేస్తుంది. పండితుల నుంచి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం. తెలుగు సినిమా పాటల్లో ఛందస్సుకు, భావానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కవి సినారె. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన శైలి అద్వితీయం. రచనలో వైవిధ్యం పాటల్లో మాధుర్యం. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప మహాకవులలో ముందు వరుసలో ఉంటారు "సినారె". పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, సోవియట్ - నెహ్రు పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిలుగా నిలిచాయి.

 సినారె గారు రాసిన ప్రతి పాటలోనూ అద్భుతమైన పద ప్రయోగం ఉంటుంది. 1962లో "గులేబకావళి" సినిమాతో గేయ రచయితగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 3,500కు పైగా పాటలకు సాహిత్యాన్ని అందించడంతో పాటు  తెలుగు సినిమా పాటలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు. రాసిన తొలి పాటతోనే తెలుగు సాహిత్యం పై తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ.. అంటూ రాసిన పాటతో అందరి మనుషులను దోచుకున్నారు. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం.. అంటూ  ప్రేమ బంధాన్ని విడదీయరాని బంధమని,  ఆ బంధాన్ని విడదీయరాని బంధంగా ఇగిరిపోని గంధం గా అభివర్ణించారు. ఎన్ని యుగాలైనా ఆయన పాట ఇగిరిపోని గంధంలా అద్భుతమైన పద విన్యాసాలతో పసందైన పాటలను అందించారు. ఈ పాట ఇప్పటికి ఎప్పటికి ప్రజాదరణ పొందుతూనే ఉంటుంది.

 1962లో వచ్చిన "ఆత్మబంధువు" సినిమాలో" చదువురాని వాడవని దిగులు చెందకు - మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు" మానవత్వం లేని చదువులు ఉన్నా. లేకున్నా ఒక్కటే అనే విషయాన్ని  ఈపాటద్వారాసుస్పష్టంగాతెలియజేశారు. "ఏమి చదవి పక్షులు పైకెగురగలిగెను..ఏ చదువువల్ల చేపపిల్ల లీదగలిగెను"అంటూకొన్నిఉదాహరణలతోచదువురాని వారికి చదువురాదని దిగులు చెందకు మంచి హృదయమున్నచాలని తెలియజేశారు. అదే సంవత్సరం వచ్చిన "కులగోత్రాలు" సినిమాలో

చిలిపికనుల తీయని చెలికాడా.. నీ నీడను నిలుపుకొందురా.
నీలికురుల వన్నెల జవరాలా.. నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల అంటూ ప్రేమికుల మదిలో చిరకాల ముద్ర వేసుకున్నారు.

 బి.ఎస్.రంగా 1964లో శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చారిత్రాత్మక చిత్రం "అమరశిల్పి జక్కన" సినిమాలోని శిల్పకళకు ప్రాణం పోసే రాతిబండలపై  రచించిన "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో – ఈబండల మాటున ఏ గుండెలు మ్రోగెనో" పాట ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ చెంది మనల్నిఆలోచింపజేస్తుంది.

1970 లో ఎ.సంజీవి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం "ధర్మదాత" సినిమాలోని "ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా" ఈ పాట ద్వారా ఓ తండ్రి తన కుటుంబంకోసం ఎంత కష్టపడతాడో వివరిస్తూ, తన పిల్లలను ప్రయోజకులను చేయడంకోసం తన ఇష్టాలను మరిచి తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. తాను ముళ్ల బాటలో నడిచి పిల్లలను పూల బాటలో నడిపేందుకు ఏ మాత్రం వేనుకాడడన్న విషయాన్ని మనసుకు హత్తుకునే విధంగా వివరించారు. "ఉన్న నాడు ఏమి దాచుకున్నావు.. లేనినాడు చేయి సాచనన్నావు". తండ్రి తన కోసం ఏమి దాచుకోకుండా  పిల్లల కోసం సర్వం త్యాగం చేస్తాడు కానీ పిల్లలు కాదు పొమ్మంటే వారిదగ్గర చేయి చాచకుండా తన భాదను గుండెల్లో పెట్టుకొని పైకి నవ్వుతో కనిపిస్తాడు కనిపించని తండ్రి ప్రేమను ఈపాట ద్వారా కనిపించేలా చేశారు సినారె గారు.

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన "తాత మనవడు" చిత్రంలోని "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం"

వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనం అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే గొప్ప సందేశాత్మక చిత్రం ఇది.

1974లో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో విడుదలైన "నిప్పులాంటి మనిషి" తెలుగు చిత్రంలోని "స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం" బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్నాబాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు. బాధలను ప్రేమించు భాయీ.. లేదు అంతకు మించి హాయ్..స్నేహమే.. హొయ్ అని గొప్పగా వర్ణిస్తూ రాసిన ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది.

2001 లో బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన "ప్రేమించు" చిత్రంలోని "కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా" ఒక తల్లి తన పిల్లలను మాత్రమే చూసుకుంటుంది కానీ పిల్లలు లేని వారు దేశంలో పిల్లలందరినీ తన బిడ్డలుగా భావిస్తారు. కేవలం తల్లిగా ఉండాలనే ఆలోచన కంటే ఎక్కువగా ఆదరించి, పెంచి పోషించిన వారు కూడా తల్లితో సమానమని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు సినారె. 

ఖసీదా ద్వారా పర్షియన్లు గజల్ ను సాహితీ లోకం లోకి తీసుకువచ్చారు. గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి, హాఫిజ్, తుర్కీ కవులు గజల్ రచించారు. మొదటి గజల్ 10వ శతాబ్దంలో ఇరాన్లో ఉద్భవించింది.  తర్వాత12వ శతాబ్దంలో ముస్లిం రాజుల పాలనలో మొఘలులు ఇరానియన్ ఆచారాలతో పాటు గజల్ ఇరాన్ నుండి భారతదేశానికి వ్యాప్తి చేశారు. ఉత్తర భారత కవులు మిర్జా గాలిబ్ (1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ మరియు ఉర్దూ భాషలలో గజల్ రచించారు. గజల్ తెలుగు సాహిత్యంలోకి1963లో అడుగుపెట్టింది. ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది/ పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’ చాలామందికి గజల్ అంటే అసలైన అర్ధం తెలియదు "గజల్" అంటే ప్రియురాలితో ఏకాంతమున జరిపే ప్రణయ సల్లాపమని నైఘంటికార్థం" . గజల్ ఒక శృంగార రసాత్మక అసలు సిసలైన భావకవిత. తెలుగు గజల్ మొదటిసారిగా, కాఫియా మరియు అంత్యానుప్రాస నియమాలను అనుసరించి, కవిత్వ శైలిని (లేదా శ్లోకం) కొంతవరకు, ఛందస్సులో లేదా వ్యక్తీకరణ పద్ధతి ఉపయోగించారు. తెలుగు గజల్‌ను మొదటిసారిగా తెలుగువారికి దాశరథి కృష్ణమాచార్యలు 1965లో పరిచయం చేస్తే ఆ తర్వాత సినారె గారు ఉర్దూ మాధ్యమంలో చదవడం వల్ల గజళ్ళలోని భాష, భావం. సౌందర్యం వంటివి తెలుగు గజళ్ళలోనూ ఉర్దూ వాతావరణాన్ని తేగలిగారు. ఎన్నో అద్భుతమైన తెలుగు గజల్ అందించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసారు.

ఆయన రచించిన గజల్స్ కొన్ని తెలుసుకుందాం..

"చిన్నదీపమని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది..
జనమేం చేస్తుందని అనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది"  చిన్నదీపమని అనుకోకు అదే లేకుంటే ఇల్లంతా చీకటే, జనం ఏమిచేస్తారు అనుకుంటే సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి గజల్స్ చదువుతుంటే పాఠకుడికి రసజ్ఞత భావం కలిగి ఇంకా చదవాలనే కోరిక కలుగుతుంది.

 1. "ఎవరో ఎదో అన్నారని మూసేయకు మాయని జీవితం..

ఏవో కలతలు పాకుతుంటే చించేయకు రాయని కాగితం" ..

2 . "పరులకోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని.. 

మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని"..

3 . "ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక..

ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక"..

సినారె గారి కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఓ అద్భుతమే.. స్వయంగా ఆయన గజళ్ళు రాయడమే కాక వాటిని అంతే ఆర్తితో స్వయంగా పాడటం మరో గొప్ప విషయం..

ప్రపంచ పదులు:

ప్రపంచపదులు అంటే విస్తరించి చెప్పడం అని అర్ధం.  సహజంగా పార్శిలోని రుబాయిలో నాలుగు పాదాలు ఉంటాయి. సినారెవాటినిఐదుపాదాలకుపెంచడమేకాకుండాఛందస్సుతోపాటుశబ్దలయ, భావస్పందనలు కలిగివుండేలా మహత్తరమైన ప్రయోగాలు చేసి ప్రపంచపదులను ప్రపంచనదులుగా విస్తరింపజేశారు. ప్రాపంచిక అన్వేషణకు అక్షర రూపంగా సినారె కలం నుండి జాలువారిన ఆణిముత్యాలే ఈ ప్రపంచపదులు.

ప్రపంచపదుల్లోని సినారె చేసిన పదప్రయోగం చూద్దాం:

జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా..
జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా..
మంచుకమ్మిన బుర్రలను విదిలించుకుని పోరెందుకో..


రాలిపోయే ఆకులను ఎవరాపిన ఏముందిలే..
ఊడిపోయే జుత్తునెంతగా ఒత్తినా ఏముందిలే..
ఒప్పుకున్నా కొన్ని మార్పులు తప్పవేమో ప్రకృతిలో..


కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది?
కత్తులు నాటిన గుడిలో భక్తి యెలా పండుతుంది?
'అంతాభద్రం' అంటూ ఎంత కాలమీ సూక్తులు.
వంచన దూరిన ఇంట్లో మంచి యెలా బతుకుతుంది?
నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది?

చూడండి సినారె గారు ఎంత అద్భుతంగా రాశారో.. చదివేకొద్దీ ఇంకా చదవాలనే రసజ్ఞతాభావం కలిగినప్పుడే అది అసలైన కవిత, అసలైన రచన.

85 ఏళ్ల జీవితకాలంలో 85 కు పైగా రచనలు చేసి ఎన్నో పదవులు చేపట్టి ఎనెన్నో పురస్కారాలు పొందిన సినారె మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన పాటకు, కవితలకు, రచనలకు మరణం లేదు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మేరునగధీరుడు... నిత్య సాహిత్య కృషీవలుడు.. మన సినారె..


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475




జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...