29, ఆగస్టు 2022, సోమవారం

స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.


స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.

స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.

స్నేహం విలువ గురించి ఎంత చెప్పిన తక్కువే అనడంలో సందేహం లేదు. ఎందరో కవులు, వాగ్గేయకారులు అనేక భాషల్లో స్నేహం గురించి వందలాది పాటలు రాసిన కొన్ని మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజాదరణ పొందిన పాటల్లో తెలుగు పాటలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్నేహం విలువను పాటల రూపంలో అద్భుతంగా చిత్రించిన గేయ రచయితలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో మన తెలుగు తేజం బహు భాష కోవిదుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రే గారు రచించిన నిప్పులాంటిమనిషి చిత్రంలో స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..స్నేహమేరా నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి అనే పాట అనే పాట పలు భాషల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా 1988 లో దర్శకుడు వి. మధుసూదనరావు గారి సమర్పణలో "ప్రాణ స్నేహితులు' సినిమాలోని గేయ రచయిత భువనచంద్ర గారు రాసిన "స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా" అనే పాట ప్రతి తెలుగువాడి హృదయాన్ని దోచుకుంది మరియు స్నేహితుల హృదయాలను దోచుకుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు మరియు ప్రాణ స్నేహితులను మరచిపోరు.

అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది శాంతి సంస్కృతి విలువలు, వైఖరులు మరియు ప్రవర్తన సమితిగా నిర్వచిస్తూ, హింసను తిరస్కరించడం మరియు సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో వాటి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా సంఘర్షణలను నిరోధించడానికి ప్రయత్నించే ప్రతిపాదనను అనుసరించే ఒక చొరవ. దీనిని 1997లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

ప్రజలు, దేశాలు, సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించ గలదని మరియు సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.

"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల'

ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనిక మరియు పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే.    

బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు (స్నేహితుడు).

మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం.  స్నేహానికి ఎల్లలు, కులం, మతలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర  ఉంటుంది. అహానికి స్నేహం దగ్గర  చోటే ఉండదనడంలో అతిశయోక్తి లేదు. స్నేహంలో ఎక్కువ తక్కువ లుండవు. పేదవాడు గొప్ప ధనవంతునితో స్నేహంతో కలుపవచ్చు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.

అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది
తెలిసీ తెలియక క్లాసురూం లో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.

ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం.

ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.

* ఖాళీ అగ్గిపెట్టెలను చించి స్నేహితులతో కలిసి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.

* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా  తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది.

*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.

* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడు మూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,
ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.

ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.

*  వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం
ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.

* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో . ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటలతో చెప్పలేము అని అనుభవిస్తేగానీ స్నేహం తెలియదు.

* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం స్నేహితులతో కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.

* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.

* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.
 
కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది.
దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా..

ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!  

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475 






28, ఆగస్టు 2022, ఆదివారం

మన బడి


మన బడి
= = = = =
ఎనకటి నా బడి ఎట్లుండెనో నాకింకా గుర్తున్నది....
ఇప్పుడు నాఒడిలో చదివే పిల్లలేరని బడి దిగులుతో ఉన్నది ..
చాలీ చాలక జాగ లేదని బడిని రెండుగా విడదీసిన రోజులవి..
తెలుగు, ఇంగ్లీష్ మీడియాలంటూ నా బడిని మరిచిన రోజులివి..
ఆనాడు టీచర్ల కొరత, ఈనాడు పిల్లల కొరత, 
ఆనాడు ప్రైవేట్ టీచర్లతో బోధించిన రోజులవి.
ఈనాడు ప్రభుత్వ టీచర్లురాక నా బడి నే మూసిన రోజులివి.
ఆనాడు నా బడికి తుర్పుగూడెం , కుక్కడం , మాణపురం, పప్పులతండాలనుండి వచ్చిన రోజులవి.
ఈనాడు మనమే ఆ ఊర్లల్లకి పోయి చదువుకునే రోజులివి. 
ఆనాడు ఆరోగ్యమే మహాభాగ్యం అని బోధించే ఆనాటి గురువులు.
ఈనాడు  తెలుగు లో చదివే కరువైన  రోజులివి
ఆనాడు భారతదేశము నా మాతృభూమి, అని నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేసిన రోజులవి.
ఈనాడు విద్యకోసం తల్లిని, దేశాన్ని మరిచి విదేశాలకు మొగ్గుచూపే రోజులివి.

1990 సంవత్సరం అంతకుముందు గుమ్మడవెల్లి లో ఒకటే స్కూల్ ఉండేది. అది కూడా ఒకటవ తరగతి నుండి ఆరొవ తరగతి వరకే, పిల్లల సంఖ్య మరియు పైతరగతుల కొరత వలన ఉపాద్యాయుడు మురళీధర్ రెడ్డి సర్ సమక్ష్యంలోవారి కృషివల్ల 1 -  10 వ తరగతి వరకు ఏర్పడింది. రెండు స్కూల్స్ గా విభజించి విద్యార్థుల పట్ల యెనలేని కృషి చేసిన అప్పటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పాలిసిందే. అప్పట్లో చుట్టుప్రక్కల గ్రామాల వారు ( కుక్కడం, తుర్పుగూడెం,  హైస్కూల్స్ లేక గుమ్మడవెల్లికి వచ్చి చదువుకునేవారు) అలా చాల సందడిగా ఉన్న స్కూల్ ఇప్పుడు కొన్నికారణాల వాళ్ళ ( పిల్లలు లేరని టీచర్లని నియమించకపోవడం మరియు టీచర్లు లేరని తల్లిదండ్రులు పిల్లలను పంపిచకపోవడం వలన) మూతపడింది. ఇంగ్లీష్ మీడియం మోజులో పడి తెలుగు మీడియంకి ఆదరణ తగ్గింది. ఇంగ్లీష్ చదవటం తప్పులేదు గానీ మాతృభాషా అయినటువంటి తెలుగు ని ఆదరించకపోవటం తప్పు.  
ఈరోజు మనమే పక్కన ఊర్లో చదివే పరిస్థితి ఏర్పడింది. సదుపాయలేక పక్క ఊర్లో చదివితే తప్పులేదు కానీ ఊర్లో ఉండికూడా పక్కన ఊర్లో చదవడమే వింతగా ఉంది - విడ్డురంగా ఉంది. 


మీ 
కోట దామోదర్
మొబైల్ నెంబర్ : 9391480475

24, ఆగస్టు 2022, బుధవారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఆయుధం కన్న అక్షరం గొప్పది. కత్తి కన్న కలం గొప్పది.

అక్షరం, కలం విలువలు  ప్రసాదించే గురువు ఈ రెండింటికన్నా గొప్పవాడు. ఎందుకంటే గురువులేనిది అక్షరం లేదు. అక్షరం లేనిదే కలం లేదు.

గురువు అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేవాడు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.  దానికి ఆధారం గురువు.

దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది - కీర్తించదగినది. ఆచార్యదేవోభవ అన్నారు

తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే . తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు ఆ జన్మని సార్ధకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి మరియు ఎదగడానికి సహాయపడతాయి - మనం ఎదగాలని వారు కోరుకుంటారు.

గురువు స్థానం ఎంత గొప్పదంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ ఇంకాకొంతమంది డాక్టర్స్ ని చేస్తాడేమో కానీ ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, ఉపాధ్యాయుల వల్లే మంచి వ్యక్తులు (ప్రముఖులు) తయారువుతారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం..

గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది.

 అర్జునుడిని అత్యుత్తమ  మేటి విలుకాడిని చేయ ప్రతినభూని తన ప్రతిజ్ఞ  నెరవేరడానికి  తన ప్రతిమను మాత్రమే పూజించి అపూర్వమైన విలువిద్య పొందిన ఏకలవ్యుడి కుడి బొటన వేలిని గురు దక్షిణగా స్వీకరించి ఏకలవ్యుడి ప్రతిభను అనగదొక్కిన  ద్రోణాచార్యుల సంఘటన  మహాభారతంలో ఎంతవరకు నిజమో కల్పితమో కానీ  ఇప్పటికీ  గురు స్థానం మారలేదు ఎందుకంటే గురు లక్ష్యం మారలేదు గురువుకు పర్యాయపదంగా ద్రోణుడి పేరును ఉటంకిస్తాము  అందుకే   అత్యుత్తమ గురువులను నేడు ద్రోణాచార్య పురస్కారం చేత గౌరవిస్తున్నాము.

నిజమైన గురువు అంటే..

ఈమధ్య కాలంలో జరిగిన యదార్ధ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి జిల్లాలో రాయ్‌ఘడ్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు శివేంద్ర సింగ్ అనే ఉపాద్యాయుడు నాలుగేళ్ల క్రితం వచ్చారు.అప్పటినుండి విద్యార్థులకు శివేంద్ర సింగ్ చెప్పే పాఠాలు మరియు నైతిక నిలువలు గురుంచి చెప్పేవారు. శివేంద్ర సింగ్ అంటే ఎంతగానో ఇష్టపడేవారు. అందుకు ప్రతి విద్యార్థి తప్పని సరిగా ఆయన క్లాస్‌కు వెళ్లేవారు. శివేంద్ర సింగ్ ప్రభుత్వం వేరే స్కూల్ కి బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న సమయంలో చాలా మంది విద్యార్థులు అతనిని కౌగిలించుకుని ఏడ్చేశారు. కొంతమంది విద్యార్థులు అతనిని గట్టిగా పట్టుకుని.. ప్లీజ్ సార్ వెళ్లొద్దంటూ బతిమాలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం ఉద్వేగానికి గురియైనారు. విద్యార్థులపట్ల స్నేహభావంతో ప్రేమానురాగాలను పంచుతు వారికీ విలువైన విద్యనందిచిన గురువు పట్ల విద్యార్థుల భాధ వర్ణణాతీతం.  నిజమైన గురువు అంటే శివేంద్ర సింగ్ లాగా ఉండాలి .

ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రవేట్ వివిధ రంగాలలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులు, ప్రతిఒక్కరం గురువులకు శిష్యులమే.

అందుకే ఏస్థాయికి ఎదిగిన మనకు విద్యనందిచిన ఉపాధ్యాయులను మరువకూడదు. సంవత్సరానికి ఒకసారైనా మన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటూ వారికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేద్దాం..
నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం
దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ..
గురువులందరికీ వందనం.. అభివందనం.      

మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475


23, ఆగస్టు 2022, మంగళవారం

మాతృభాష


మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే  గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.
తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.  పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం.
భారత దేశం లో  ఎన్నో భాషలు ఉన్నాయి.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని  ఆస్వాదించ గలిగితే,  వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు.  ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు.  ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి.  కానీ  తెలుగు భాషని గౌరవించాలి.
“మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.
ఈ రోజుల్లో మాతృభాషకన్నా ఆంగ్లభాషే మిన్న అన్నట్లుగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రలు తెలుగు భాషకి తీరని ద్రోహం చేస్తున్నారు. అందుకే కాళోజి గారు 1942 సంవత్సరంలో నిజం రాష్టంలోని ప్రజలు తెలుగు భాష పట్ల చూపే వివక్షత కు స్పందించి రాసిన కవిత ఇది. 1942 లోనే కాళోజి గారు రాబోయే కాలంలో తెలుగు పూర్తిగా అంతరిస్తుందేమో ఆ ఆలోచనతోనే రాసినట్లు అనిపిస్తుంది. కాళోజి గారు రాసిన ప్రతి అక్షరం అర్ధంతోపాటు తెలుగు భాషపట్ల దేశం పట్ల ధైర్యాన్నిస్తుంది అదే కాళోజి గారి గొప్పతనం.
తెలుగు భాషపట్ల ఏమన్నారంటే.....

ఏ భాషరా నీది ఏమి వేషమురా ?
ఈ భాష ఈవేష మెవరి కోసమురా?
ఆంగ్లమందున మాటలాడ గలుగగానే 
ఇంతగా గుల్కెదవ్ ఎందుకోసమురా?
సూటుబూటు హ్యటు షోకుగా దోడుగ
ఘనతేమీ వచ్చెరా గర్వమేటికిరా?
ఉర్దూ మాటలాడి యుబ్బుబ్బిపడుటకు 
కారణమేమిటో కాస్త చెప్పుమురా?
లాగుషేర్వాణీలు బాగుండుననుచు
మురిసిపోయెదమంత మురిపమేమిటిరా?
నీ వేషభాషలిలా నిగ్గుదేలినవన్న 
విషయంబు నీవేల విశ్వసింపవురా?
నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి 
కారకుడవివయని కాంచవెందుకురా?
నీ వేషభాషలను నిర్లక్షంగా జూచు 
భావదాస్యంబెపుడు బాసిపోవునురా?
నీ భాషయందును నీ వేషమందును 
స్వాభిమానముడిగిన చవటవీవెరా?
తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచును 
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?
దేశ భాషలయందు తెలుగులెస్సయటంచు 
తెలుగు బిడ్డా! యెపుడు తెలుసుకొందువురా?
తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి అంద్రంబురాదనుచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?

తెలుగు భాషగురుంచి ఇంత గొప్పగా రాసిన కాళోజి గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే 
మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది.
గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు అది అక్షర సత్యమే. 

మీ
కోట దామోదర్

21, ఆగస్టు 2022, ఆదివారం

ఆశ్రమాలలో అమ్మనాన్నలు



 ఆశ్రమాలలో అమ్మనాన్నలు
= = = = = = = = = = = = = = =
పిల్లలు చిన్నపుడు అన్నం తినకుండా ఏడిపిస్తే..
పెద్దయ్యాక అన్నం ముద్ద పెట్టకుండా ఏడిపిస్తారు..
అప్పుడు.. ఎప్పుడు ఏడ్చేది అమ్మానాన్నలే!
ప్రతి తల్లి కడుపులో తన బిడ్డను తొమ్మిది నెలలుమోసి చావు అంచుదాకా చేరుకొని బిడ్డకి జన్మనిస్తుంది.
ప్రతి తండ్రి తన కొడుకు భవిష్యత్హుకోసం కలలు కంటాడు. తన కొడుకు తన కల నెరవేర్చటం కోసం తపిస్తాడు.
తల్లికి సంతానం పదిమందైన తాను పెంపకంలో అందరిని ఒకేలా చూస్తుంది వారిని పెళ్లి అయేంతవరకు కంటికిరెప్పలా కాపాడుకుంటుంది అది తల్లి గొప్పతనం.
అదే పెద్దయ్యాక తన తల్లిని పోషించడంలో నెలలు వారీగా ఆపసోపాలు పడుతూ అయినాసరే   అందరూ ఒకేలా చేసుకోలేరు, కనిపెంచిన వారినే కాదు పొమ్మంటారు..
భార్యలు అత్తకి సేవచేయలేక తల్లితండ్రులను హృద్దాశ్రమంలో చేర్చుతున్న కొడుకులు కొంతమందైతే , కొందరు తల్లి ఖర్చులు భరించలేక .. మరికొందరు పొట్టకోసం ఊరు దాటుతూ వదిలేస్తున్నారు..   
మరికొందరైతే అమ్మనాన్నలు చనిపోయిన కడచూపు చూడని కఠినాత్ములు ఎందరో..
అనాధల ఖాతాలో అంత్యక్రియలు జరుగుతున్న దౌర్భాగ్యం ఎందరిదో.. మానవత్వవిలువల ఫలితం ఇది.
ఏ గ్రామాలకైనా , పట్టణాలకైనా వెళ్లి వృద్ధులను పలకరిస్తే మొదటగా వారి మోహములో చిరునవ్వు కంటే బాధనే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రపంచంలో 100 కి 80 శాతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి..
కోట్ల ఆస్తులు ఇచ్చిన కొడుకులు మంచిగా చూసుకుంటారు అనే నమ్మకం లేదు. కొంతమందైతే ఆస్తులుంటేనే చూసుకునేటోళ్లు కొంతమంది. ఒకప్పుడు తల్లితండ్రులు కొడుకు పెళ్లి చేస్తే ఒక ఇంటివాడు అయితాడు అని అనుకునేవాళ్లు.. కానీ నేటితరం తల్లితండ్రులు ఎప్పుడు పెళ్లి చేస్తే ఒంటరిఅవుతామనే భయంలో ఉన్నారు. అయినా తల్లితండ్రులు కొడుకు కోసం అన్ని త్యాగం చేస్తారు. వాళ్ళ త్యాగానికి పాదాభివందనం..
కొడుకుని ప్రయోజకుడిని చేయాలనే ఆశతో తండ్రి తపిస్తాడు..కానీ కొడుకు పెడతాడు అనే ఆశతో కాదు..
తల్లితండ్రులు ఎప్పుడు ఆశావాధులు కాదు.. ఎప్పుడు నిరాశా వాదులే... నిరాశ చెందిన శపించని దేవుళ్ళే తల్లితండ్రులు..
తల్లితండ్రులకు రూపాయి పెట్టనివాడు! గుడికిపోయి కట్నం కానుకలు దేవుడికి అర్పించే ధర్మాత్ములు ఉన్నంతవరకు ఈ దేశం బాగుపడదు.. జన్మనిచ్చిన వాళ్ళని మరిచి ఎన్ని చేసిన శూన్యం.
ప్రతి కొడుకు గుర్తుచేసుకోవాలిసిన విషయం మనం మన తల్లితండ్రులను ఎలా పోషిస్తున్నామో! రేపు మన పరిస్థితి కూడా ఇంతే అన్న విషయం కూడా మరవొద్దు..
ప్రతి కోడలు గుర్తుచేసుకోవాలిసిన విషయం తన అత్తమామలను ఎలా చూసుకుంటున్నారో రేపు వారి తల్లితండ్రుల పరిస్థితి అంతే అన్న విషయం మరువొద్దు..
గాయమైతేగాని నొప్పివిలువ తెలువదన్నట్లు తనదాకా వస్తేగాని తెలియదు ప్రళయమెంత విలయమో. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులను ఎందుర్కుంటున్న నేటి సమాజం వాట్సాప్ప్ ఫేస్బుక్ ప్రచారానికే తప్ప ఆచరించడానికి ఆమడదూరం. 
ప్రతి ఒక్కరు అందరిలో మార్పు రావాలని కోరుకునేవారు అంతేతప్ప నేను మారితే ప్రపంచం మారుతుందని అలాయితేనే మార్పు సహజమనేది జగమెరిగిన సత్యం. అయినా ఎవరు పాటించారు అనునిత్యం. 

చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు...
రాయలేని తనముంటే కాగితాన్ని నిందించకు.
కష్టపడనితనముంటే జీవితాన్ని నిందించకు..
మారలేనితముంటే మందిని నిందించకు..
   

కాలమిస్ట్ 

కోట దామోదర్
మొబైల్ 9391480475  

    
   
     

15, ఆగస్టు 2022, సోమవారం

చిన్ననాటి జ్ఞాపకాలు


 చిన్ననాటి జ్ఞాపకాలు :
= = = = = = = = = = = = = = = = = = = 
అప్పట్లో మా ఊరికి (గుమ్మడవెల్లి) ఒకేఒక బస్సు వస్తుండేది. అది సూర్యాపేట నుండి రాత్రి 10.30 వచ్చి పొద్దున్నే 5.30 కి మళ్ళీ సూర్యాపేట కి వెళ్ళేది.
అప్పట్లో బస్సు లో ప్రయాణం అంటే అంతులేని ఆనందం ఇప్పట్లో విమానంలో ప్రయాణం చేసిన దొరకని ఆనందం అప్పట్లో దొరికేది ఇప్పట్లో అంత ఆనందం అనిపించటంలేదో అంతుచిక్కని రహస్యం..
ఎప్పుడైనా అమ్మనాన్న ఊరెళ్ళి వస్తున్నారంటే రాత్రి ఆ బస్సు ఎప్పుడొస్తుందో అని ఎదురుచూసేవాళ్ళం అమ్మనాన్న తెచ్చే అరటిపళ్లకోసం, అంగుర పళ్లకోసం అవి తిని ఎంతగానో ఆనందపడేవాళ్ళం. 
  • ఆరోజుల్లో వారానికి ఒక సినిమా దూరదర్శన్ లో వచ్చేది. 
ఆ సినిమా చూసి ఇంటికొచ్చాకా 
ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే.
మర్నాడు స్కూల్ లో కూడా... 
ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది..
  • ఆరోజుల్లో కొంతమంది ఇళ్లలోనే రేడియో ఉండేది. 
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం
ఆదివారం నాడు రేడియో లో వచ్చే పాటల కోసం రేడియో ఉన్నవాళ్ళింట్లో కూర్చొని ఓపికగా వినేవాళ్ళం మనసు ప్రశాంతంగా ఉండేది 
మా ఇంట్లో కూడా రేడియో ఉంటె బాగుండు అనే ఆశ ఉండేది ..
  • ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. 
చేతిలో రూపాయో... 
అర్ధరూపాయో పెడితే
ఎంత ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో.. ఇప్పుడు ఆనందం ఏమో గాని ఎప్పుడు పోతారా అన్నట్లుగా చూస్తున్నారు.
  • ఎగురుతున్న విమానం
కింద నుండి 
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం..
  • జాతరలో కొన్న బొమ్మలను చూసుకొని మురిసే ఆనందం 
కోట్లు పెట్టిన కొనలేని ఆనందం.
  • అన్నంలో చింత చిగురు ఒట్టి చాపల కూర 
ఏమి రుచి...
ఏమి ఆనందం కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయేవాళ్ళం..  ఈరోజుల్లో ఆ చింతచెట్లు అంతరించాయి.. ఆ కూరని మరిచారు ...
  • కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, ఆటలు, ఈతకు పోయేవాళ్ళం ఆ ఆనందం వేరు 
సర్కస్ లు, దాగుడు మూతలు...
చింత పిక్కలు
ముక్కు గిచ్చుడు 
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...☺️
  • చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
 డ్రెస్ కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
మళ్ళీ ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఈరోజుల్లో ఎన్నో జతల బట్టలున్న 
మనిషికి సరిపడా డబ్బు ఉన్న ..
పెద్ద పెద్ద విలాసవంతమైన  ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
అరచేతిలో స్వర్గం చూపించే ఫోన్లు ఉన్నపటికీ 
మనిషి కావాలనుకుంటే  క్షణాలలో వచ్చే సౌకర్యం ఉన్నపటికీ 
మనం చిన్నప్పుడు
పొందిన  ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు ...?
మీ 
కోట దామోదర్ 
మొబైల్ : 9391480475

ఆదర్శం కోల్పోయిన కళాశాల

 


ఆదర్శం కోల్పోయిన కళాశాల 

= = = = = = == = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =


నేను పాలిటెక్నిక్ చదివిన కళాశాల పేరు "ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్" భద్రాచలం (ఎటపాక). ఈ కళాశాలలో చదివిన నాలాంటి పూర్వ విద్యార్థులందరికీ ఒక ఆదర్శనంగా నిలిచింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయిలలో ఎదిగారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో   అన్నిపాలిటెక్నిక్ కళాశాలల్లోకెల్లా  అత్యధికంగా విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాలదే. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కళాశాల ఇప్పుడు శిథిలావస్థ కి చేరుకుంది. మరో బాధాకరమైన విషయం ఒకప్పుడు తెలంగాణాలో ఉన్న ఈ కళాశాల తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రవిభజన సందర్భంలో ఈ కళాశాల ఆంధ్ర రాష్ట్రము వారికీ పరిగణించబడింది. విభజనకు ముందు ఈ కళాశాలలో సీట్ దొరకక చాలామంది నిరుపేద విద్యార్థులు భాధపడేవాళ్లు అలాంటిది రాష్ట్ర విభజన తదనంతరం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల అధ్యాపకుల కొరత  మరియు విద్యార్థుల కొరతవల్ల కళాశాల మూతబడింది.ఈ విషయం తెలియక ఈమధ్య భద్రాచలం వెళ్ళినపుడు కళాశాలని చూడాలనిపించి వెళ్ళాను. అక్కడవున్న పరిస్థితులను చూసి చాల భాధ అనిపించింది. ఎందుకంటే మూడు సంవత్సరాలు హాస్టల్ మరియు తిండి, చదువుతోపాటు అన్నివసతులు కల్పించి నన్ను ఈ స్థాయికి చేర్చిన కళాశాల మూతబడిందన్న విషయం జీర్ణించుకోలేక బాధపడిన సందర్భం అది. నేనున్నాహాస్టల్ గదికి వెళ్లిన అప్పుడు నాకు పాతకాలం జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి నన్నునేనే మరిచిన సందర్భం. అది ఒక తీపి జ్ఞాపకం లాటింది. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే నా ప్రాణ స్నేహితుడైన (ప్రభు కుమార్) నేను కలిసివెళ్లడం. నాకు అత్యంత సంతోషకరమైన విషయం. మా స్నేహం అల అల్లుకుంది. మేమిద్దరం కలిసి పాతకాల సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటూ సరదాగా గడిపిన సందర్భంలో మా ఫోన్లో ఫొటోస్ తీసుకొని చాలాసేపు అక్కడే గడిపాము. ఆ క్రమంలో మాకొచ్చిన జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి..
* మొదటగా కళాశాల్లో జాయిన్ అవ్వాలంటే ఒకరకమైన ర్యాగింగ్ భయం ఉండేది. అది ఒక మొదటి సంవత్సరం వరకే. అలా ఒకసంవత్సరం గడిచిన తరువాత మేము నేర్చుకున్న పాఠం: సీనియర్స్ ని గౌరవించాలి, కలిసినపుడు నమస్తే పెట్టాలి, సీనియర్స్ ఏదైనా సహాయం కోరితే తప్పకుండ చేయాలి అన్నదే ర్యాగింగ్ అర్ధం అంతే తప్ప అంత్యంగా బాధించే సంఘటనలు ఏమి ఉండేవి కాదు..
* కొంత మంది సీనియర్స్ ర్యాగింగ్ సమయంలో వింత విచిత్రమైన ఆంక్షలు ప్రవేశపెట్టేది. అవేంటంటే "జనగనమన" ఒకరిని పాడమనేది ఇంకొకరిని డాన్స్ చేయమనేది. ఆ సమయంలో నాకు డాన్స్ రాక  సీనియర్ల వితండవాదానికి అప్పుడు ఏడ్చినా సందర్భం అయితే ఇప్పుడు మాత్రం నవ్వుకునే సందర్భం.
* హాస్టల్ డైనింగ్ హాళ్లలో కూరలు రుచిలేక, సాంబారులో పురుగులు పడిన సందర్భంలో విద్యార్థుల ఆవేశం ఓ విలయతాండవం, వితండవాదం.
* హాస్టల్ పైన అందరం ఒకేదగ్గర ముచ్చటిస్తూ స్థానం చేసిన క్షణం అదొక తీపి జ్ఞాపకం..
* సినిమా చూడటానికి దగ్గర్లో థియేటర్స్ లేక ఇబ్బంది ఉన్నపటికీ సీనియర్స్ కొంతమంది అయిదు రూపాయలు తీసుకొని టీవీ హాల్లో సినిమాలు వేసేది. ఆ సినిమాలు చూసి ఎంతగానో ఆనందపడేవాళ్ళము. స్నేహితులమధ్య చూడటం అనేది నిజంగా అదొకరకమైన అనుభూతి.
* పరీక్షల సమయంలో టీ కోసం లైన్లో నిలబడి తాగిన సందర్భం, క్లాస్ ఎగ్గొట్టి పక్కన పరిసరప్రాంతాల (బొజ్జికుప్ప) పర్యవేక్షించిన సందర్భం ఓ మధురజ్ఞాపకాలే.
* హాస్టల్ లో ఉన్న స్నేహితులమంతా ఎంతబాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళమంటే అది మాటల్లో చెప్పలేనంత స్నేహబంధం. ప్రాణానికి ప్రాణం ఇచ్చేంత. ఆప్యాయత అనురాగాలు, ఆపదలో ఆపన్నహస్తాలు. మాకు ఏమైనా అయితే అక్కడ అమ్మానాన్న ఉండరుగాని వారులేని లోటు మా స్నేహితులు తీర్చేవారు అంతమంచి హాస్టల్ స్నేహబంధం నన్ను ఎంతగానో ఆకర్షించింది.
* నాకు కొన్ని సందర్భంలో హాస్టల్ ఫుడ్ పడక తినడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నా ప్రాణ స్నేహితుడు ప్రభు కుమార్ ఆదుకున్న   క్షణాలు నా జీవితంలో మరిచిపోలేనిది. అమ్మ సమానులైన ప్రభు అమ్మగారు (జాస్లిన్ గారు) నాకోసం సారపాక నుండి వాటర్, మధ్యాహ్నం భోజనం ప్రభుతో పంపించి నా ఆరోగ్యంపట్ల చదువుపట్ల శ్రద్ధ చూపిన  జాస్లిన్ అమ్మగారికి పాదాభివందమ్.
* సాయంకాలం స్నేహితులతో శ్యామలరావు గుడిసెలో టీ తాగిన సందర్భాలు జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం.
* నా మిత్రుడు హాస్యపండితుడు బోడపాటి ఆనంద్ మా అందరిని ఎంతగానో నవించి నవ్వుతు కాలక్షేపం చేసేవాడు. నిజానికి ఆనంద్ లాంటివాళ్లు కూడా ఉండాలి ప్రతి బ్యాచ్లో.
* కష్టాలలో, సుఖాలలో తోడుగా నీడగా ఉండే స్నేహబంధాన్ని అందించిన ఈ ఆదర్శ కళాశాలని అందరూ ఆదర్శనంగా తీసుకోవాలని కోరుకుంటున్న.
మా కళాశాల అధ్యాపకులు చెప్పే విధానం ఒక అద్భుతం. st మైనార్టీ కళాశాల అయినందున ఎక్కువగా తండాలనుండి, గ్రామాలనుండి వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. పాలిటెక్నిక్ సబ్జక్ట్స్ అన్ని ఇంగ్లీషులోనే ఉండేవి కాబట్టి ప్రతిఒక్కరికి అర్ధమయేరీతిలో బోధించేవారు. నిజానికి వారికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంచి పేరున్న ఈ కళాశాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల మూతపడేస్తాయికి చేరుకుందంటే నిజంగా అత్యంత బాధాకరమైన విషయం.
దయచేసి ఆంధ్ర ప్రభుత్వం ఈ కళాశాల మూతపడకుండా యధావిధంగా కొనసాగించటానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా కోరుకుంటున్న..
✍️
మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475

6, ఆగస్టు 2022, శనివారం

అండలేని "చేనేత" జెండా !

 



ప్రాచీన సంప్రదాయాలన్ని అంతరించిపోతున్నప్పటికీ తన సంప్రదాయ వారసత్వ వృత్తిని, కళను   కాపాడుకుంటు వస్తున్న నేతన్న,  కళ  తప్పిపోయిన బతుకీడుస్తున్నాడు. మొదటినుండి ఎందరో నేతలు చేనేత గొప్పదని ఒప్పుకొంటున్నారే గాని నేతన్నజీవితాలు మెరుగు పరిచే బాధ్యత  నుండి తప్పుకుంటున్నారు. మూడు పూటలు కష్టపడే నేతన్న తన బిడ్డలకు ఒక్క పూట కూడా  కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలోనే దాదాపు స్వాతంత్ర్య ఆనంతరం కుటుంబాలను వదిలి నేతన్నలు పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని షోలాపూర్, బిమండి, బొంబాయి నగరాలు కూడా దాటి గుజారాత్ రాష్ట్రంలోని సూరత్, అహ్మదాబాద్ పట్టణాలలో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేసి ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. పిల్లలను చదివించడానికి స్తోమత లేక అదే పనిలో కొనసాగిస్తున్న కుటుంబాలెన్నో. ఎప్పటి నుండైతే వీరి వలసలు కొనసాగినాయొ పల్లెటూళ్ళలో మగ్గం శబ్దాలతో లయ బద్దంగా నాట్యమాడిన నేతన్నల వీధులు అప్పటి నుండే నిశ్శబ్ధంగా రోధిస్తున్నాయి. అటు తర్వాత జరిగిన పరిణామమే కొంత మంది నేతన్నలు అప్పులు చేసి మర మగ్గాలను తెప్పించుకున్నారు. కానీ వారికి ముడి సరుకు అందుబాటులో లేదు, వున్నా కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితులలో చేసిన అప్పులు తీర్చలేక తమ కుటుంబాల ఆకలి బాధ నుండి చూడలేక చాలా మంది నేతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
ఇంకా మర మగ్గం మీద నేసిన సరుకు సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక, గిట్టుబాటు ధరలేక తప్పనిసరి పరిస్థితులలో  మధ్య ధలారీల దోపిడికి గురు అయి మర మగ్గానికి కూడా దూరంకావలిసిన దుస్థితి ఏర్పడింది. మన చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నపటికీ మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్తానం ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. మొదటగా ఇక్కత్ వస్త్రాలు నేసిన పోచంపల్లి నేతకార్మికులు వారి కళానైపుణ్యాన్ని తెలంగాణలోని పలు జిల్లాలోని గ్రామాలకు వ్యాపింపజేయటం చేనేతకు కొంత అండగా నిలిచింది. ఇక్కత్ వస్త్రాలు తెలంగాణ నుండి పలు విదేశాలు ఎగుమతి చేస్తున్నారు అంటే మన చేనేత కార్మికుడి కళానైపుణ్యం ఎలాంటిదో నేరుగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా నేతన్న కల చెదిరినట్లయింది. అనేక నేత పరిశ్రమలు మూతపడటం వలన వృత్తినే నమ్ముకున్న నేతన్న వేరే పనిచేయలేక సతమతపడుతున్నాడు, చావుకైనా సిద్ధపడుతున్నాడు.
 అయినా తన వృత్తిని కాపాడటంకోసం నేతన్న అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే భారత దేశానికి గర్వకారణమైన చేనేత కళాసంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమున్నది. ప్రస్తుతం పెరు గుతున్న పెట్టుబడి వ్యయం, తగిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో కారణాలచేత చేనేత రంగం ఇబ్బందులు పడుతున్నాయి మన చేనేత కుటుంబాలు. రోజురోజుకి నేతన్నల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అగ్గిపెట్టలో పటేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుడి జీవితం దుర్భరంగా మారకుండా   ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిస్కారం చేయాలని  కోరుకుంటున్న.
✍️
కోట దామోదర్
మొబైల్: 9391480475

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...