13, డిసెంబర్ 2022, మంగళవారం

రైతుని రాజుల చూడాలి




దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవాడు జవాన్.. (సైనికుడు),

మనిషి ఆకలిని తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించేవాడు కిసాన్ (రైతు)..

దేశాన్ని కంటికి రెప్పలా రక్షించే జవాన్ ఎంత ముఖ్యమో, దేశ ప్రజల క్షుద్బాధ (ఆకలి) నుండి మనల్ని రక్షించే అన్నదాతకూడా అంతే ముఖ్యం.

ఈ ఇద్దరి శ్లాఘనీయ సేవలకు గుర్తింపుగా“జై జవాన్”, “జై కిసాన్”నినాదాలతో మన దేశం వారిని కీర్తిస్తుంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు. మనిషి జీవనానికి ఆహారం అత్యవసరం, ఆహారాన్ని సృష్టించే రైతన్నే లేకుంటే మనిషి జీవించడం అసాధ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక అని రైతుల‌ను అభివ‌ర్ణిస్తారు. అందుకే  'రైతే రాజు' అన్నారు.

రైతు నాయకుడు (రైతు బంధు):  

భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత కర్షక నాయకుడు చౌదరి చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1902న ఉత్తరప్రదేశ్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం జరిపిన అహింసా పోరాటంలో చరణ్ సింగ్ మహాత్మా గాంధీని అనుసరించడమే కాక అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1930లో, ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ వారు అతన్ని 12 సంవత్సరాలు జైలుకు పంపారు. స్వాతంత్య్రానంతరం అయన రైతు ప్రయోజనాలకోసం, రైతు చట్టాలకోసం ఎనలేని కృషిచేశారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై పరిభ్రమించేవి. ఆయన ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో కీలకపాత్ర పోషించి రైతులకు మేలు చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కరణ చట్టాలలో మార్పుల కొరకు జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలనీ అనేక ఉద్యమాలు చేపట్టి జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని చౌదరి చరణ్ సింగ్.  రైతు చట్టాల మార్పు కోసం కృషి చేసిన చరణ్ సింగ్ “రైతు బంధు” గా పేరుగాంచిరైతుల మనస్సులలో ప్రత్యేక ముద్ర వేశారు.  రైతుల కోసం చరణ్‌సింగ్ చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం “జాతీయ రైతు దినోత్సవం" గా ప్రకటించింది. కర్షక లోకానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనసమాధికి“కిసాన్ ఘాట్”గా నామకరణం చేసారు.

హరిత విప్లవం:

హరిత విప్లవం 1961లో ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్న సమయంలో ఈ విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని "రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్" ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించేందుకు కృషి చేసింది. అప్పటి భారత వ్యవసాయ మంత్రి MS స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. భారత ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉన్నప్పటికీ, గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుండి దిగుమతి చేసుకున్నారు మరియు పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. అది భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.

హరిత విప్లవంలోని ప్రధానాంశాలు:

1 . అధిక దిగుబడి వంగడాల వినియోగం.

2 . రసాయన ఎరువుల క్రిమిసంహారక మందుల వినియోగాన్ని పెంచడం.

3 . నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి.

4 . వ్యవసాయ యాంత్రికీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్దతులను అమలు చేయడం.

ఇవే కాకుండా భూసంస్కరణల అమలు, గ్రామీణ విద్యుతికరణ, మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపనలాంటివి కూడా హరిత విప్లవంలో భాగమే..  
హరిత విప్లవం కారణంగా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులతోపాటు పంటల దిగుబడి పెరిగింది. ఆహారధాన్యాలల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.

బ్రహ్మ కంటే గొప్ప:

రైతుని చిన్నచూపు చూస్తున్న ప్రతిఒక్కరు అన్నంలేనిదే మనం బ్రతకలేమన్న విషయాన్నీ గమనించాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మనిషికి ఎన్ని కోట్లరూపాయలున్నాఅన్నంతినే బ్రతకాలి తప్ప అన్నంలేనిది బ్రతకలేడు. మనిషి బ్రతికున్నంతవరకు అన్నం తప్పనిసరి. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నం పండించే రైతులు బ్రహ్మ కంటే గొప్పవారు. ప్రపంచానికి అన్నం పంచే రైతును "అన్నదాత" గా అభివర్ణించారు మన పూర్వీకులు.

రైతు చట్టాలు మారినా, రైతు కష్టాలు మారలే..

మన దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తున్నాయి కానీ ఒక వ్యవసాయరంగం మాత్రమే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయం. సారవంతమైన భూములు, తగినంత నీరు, సకల సౌకర్యాలన్నీ ఉన్నా గిట్టుబాటు ధరలేక రైతు మనుగడ సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వాలు చెబుతున్నా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో మాత్రం క్రియాశూన్యంగా ఉంటున్నాయి.  ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణమాఫీలు కేవలం వ్యవసాయం చేయని భూస్వాములకుఅందుతున్నాయి తప్ప భూమిలేక ప్రత్యక్షంగా దుక్కి, దున్ని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు మాత్రం అందడంలేదు. 10 ఎకరాలకంటే ఎక్కువఉన్న రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలు అందుతున్నాయి కానీ గుంట భూమిలేని కౌలురైతుకి రుణాలందకపోవడం శోచనీయం. ఒక వైపు గిట్టుబాటు ధరలేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వంనుండి వచ్చే రుణాలందక కౌలురైతు వ్యవసాయంపట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాణ్యమైన విత్తనాల కొరత వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. రైతు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతుధర గిట్టుబాటుధరలేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చడంకొరకు రైతులు  కూలీలుగా మారుతున్నారు.  కొందరు ఇతర పనులమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరికొందరు రైతులు భూములను కౌలుకిచ్చి పట్టణప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది రైతులు ప్రభుత్వ రుణాలందక పంట పండించడానికి  అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 

 

కోట దామోదర్

మొబైల్ : 9391480475


కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...