ఆదరణ కోల్పోతున్న "విలువిద్య"
రామాయణం, మహాభారతంలో ధనుర్విద్య (విలువిద్య) గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించబడింది. యుద్ధాలలో శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు విలువిద్యను ప్రత్యేకంగా ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి. స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడు, శివ ధనుస్సును విరిచి సీతను పెళ్లాడిన శ్రీ రాముడు, వీరంతా విలువిద్యలో నిష్ణాతులే.
అంతేకాదు, విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్ని కూడా మించి పోయాడు. ఏడు బాణాలు ఒకేసారి సంధించి కొట్టడంలో ఏకలవ్యుడిని మించినవారులేరనడంలో అతిశయోక్తిలేదు. అకుంఠిత దీక్షతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు ఎంతో మందికి ఆదర్శం.
విలువిద్య అనేది పురాణాలలో మాత్రమే కాదు, ఆదిమ మానవుడు ఆహారం కోసం జంతువులను వేటాడేందుకు మరియు పూర్వకాలంలో రాజులు శత్రుసైన్యంతో పోరాడేందుకు యుద్ధాల్లో విలువిద్యను ఉపయోగించారన్నసంగతి మనందరికీ తెలిసిందే.
మన్యం ప్రజల హక్కుల కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్ల గుండెల్లో బాణాలు వదిలి శత్రుసైన్యాన్ని గడగడలాడించిన అసమాన పోరాట యోధుడు, మాన్యం వీరుడు. అగ్గిపిడుగు అల్లూరి. తన 27వ ఏటనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్వాల అల్లూరి సీతారామరాజు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించినవారే.
అంతేకాకుండా, బాణం యొక్క ప్రతిచర్య మరియు స్ఫూర్తి ఆధారంగానే ఆధునిక క్షిపణి ఆవిష్కరింపబడిందన్న విషయం కూడా ప్రచారంలో ఉంది. .
ఎన్నో వేల సంవత్సరాల క్రితమే విలువిద్య భారత దేశంలో ప్రాచుర్యంలో ఉందని మన దేశమే దీనికి పుట్టిల్లని భారతీయులు ప్రగాఢంగావిశ్వసించినప్పటికీ ఈ క్రీడ ఎందుకు నిరాదరణకు గురవుతుందో అర్థం కాదు. కాగా ఈ క్రీడ భూటాన్, జపాన్, ప్రాన్స్ మరియు ఇటలీ వంటి దేశాల్లో ఎంతో ప్రసిద్ధి చెందడం ఆశ్చర్యకరం.
నిరాదరణకు కారణాలు:
1 . ఒలింపిక్ క్రీడలలో ఒకటైన విలువిద్యను ఇతర క్రీడలతో సమానంగా ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం . ఈ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకు ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకుంటే మన దేశంలోకూడా ప్రాచుర్యంపొందే అవకాశముంది.
2 . యువతకు
ఈ క్రీడపై సరైన అవగాహన లేకపోవడం, ఔత్సాహిక క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఉచిత శిక్షణా కేంద్రాలు అందుబాటు లేకపోవడం పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావన లేకపోవడంఈ క్రీడాభివృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. అందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో విలువిద్య విలువల గురుంచి విద్యార్థులకు తెలియజేయాలి.
3 . ఈ క్రీడ అధిక వ్యయంతో కూడుకున్నది కావడంతో నైపుణ్యం కలిగిన ఆర్చర్లు ఎందరో ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి యువత విముఖత చూపుతోంది.
4 . క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ల మాదిరిగానే ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా ప్రధాన సమస్య. అందుకు ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి, విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మరియు ప్రచార సాధనాలు క్రియాశీలపాత్ర పోషించాలి.
మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలలో "విలువిద్య":
పారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో భాగమైన విలువిద్య 1904, 1908 మరియు 1920లలో వరకు కొనసాగి ఆపై 52 సంవత్సరాల విరామంతర్వాత 1972 నుండి ఇప్పటి వరకు కొనసాగుతుండడం గొప్ప విషయం.
లార్స్ ఆండర్సన్ 4.9 సెకన్లలో 10 బాణాలను సంధించి అతివేగంతో కొట్టడంలో
ప్రపంచ రికార్డును సృష్టించిన ఘనుడు.
మొదటిసారిగా మన దేశంలో :
విలువిద్యను 1972 మ్యూనిచ్ గేమ్స్లో భారతదేశం మొదట ఒలింపిక్ విభాగంగా ఎంపిక చేసింది మరియు తరువాత 1973లో ప్రారంభించబడింది. అప్పటి ఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ మల్హోత్రా యొక్క ఉత్సాహంతో ఆర్చరీ భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో మొదటి సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఏప్రిల్, 1973లో ఢిల్లీలో జరిగింది, ఇందులో దాదాపు 50 మంది పురుష మరియు మహిళా ఆర్చర్లు పాల్గొన్నారు. అందులో బెంగాల్ ఆర్చర్లు తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చిఅగ్రస్థానంలో నిలిచారు.
భారతదేశ విలువిద్య క్రీడాకారుల ఘనత:
రాజస్థాన్కు చెందిన లింబా రామ్, 20 ఏళ్లలోపు జూనియర్ మరియు సీనియర్ విభాగాలలో జాతీయ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు. దేశంలోనే మొదటి విలువిద్య నైపుణ్యమున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అంతేగాక 1991లో భారత ప్రభుత్వం చేత అర్జున అవార్డు అందుకున్న మొదటి క్రీడాకారుడు కావడం విశేషం. 1987లో జాతీయ స్థాయి జూనియర్ ఆర్చరీ టోర్నమెంట్లలో ఛాంపియన్గా నిలిచి
1989 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2012లో పద్మశ్రీ ని అందుకున్నాడు.
కోల్కతాకు చెందిన డోలా బెనర్జీ భారతదేశపు ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి. బారానగర్ ఆర్చరీ క్లబ్లో చేరి తొమ్మిదేళ్ల వయసులో శిక్షణ ప్రారంభించిన ఆమె1996లో శాన్ డియాగోలో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్స్ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2005లోభారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది.
ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో మన క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. రికర్వ్ టీమ్ విభాగంలో దీపికా కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకొని తమ సత్తాచాటారు.
జయంత తాలుక్దార్, మంగళ్ సింగ్, అతాను దాస్లతో కూడిన భారత పురుషుల జట్టు ఎన్నో అవార్డులు సాధించారు. ఇలాంటి క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలిసిన అవసరం ఎంతైనావుంది.
జార్ఖండ్లోని రాంచీకి చెందిన దీపికా కుమారి చిన్నతనంలో రాళ్లతో మామిడి పళ్లను లక్ష్యంగా చేసుకుని విలువిద్యను అభ్యసించాలనుకుంది. ఆమె తన శిక్షణ కోసం కొత్త పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక పరిమితులతో రాజీపడేవారు; దీంతో దీపిక ఇంట్లోనే వెదురుతో చేసిన బాణాలను ఉపయోగించి విలువిద్యను అభ్యసించింది. ఆమెకు 2012లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా భారతదేశపు రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు లభించింది. ఫిబ్రవరి 2014లో, ఆమె FICCI స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ఆమెకు 2016లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది.
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన ప్రణీత వర్దినేని చిన్నప్పటి నుంచి విలువిద్యపై ఆసక్తి తో కల్లెడ రూరల్ పాఠశాలలో ఆర్చరీ నేర్చుకొని 2004లో జాతీయ సబ్ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది. ప్రణీత వర్ధినేని ఇప్పటి వరకు పన్నెండు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని పదకొండు పతకాలు సాధించింది.
గణాంకాలప్రకారం:
2021 గణాంకాల ప్రకారం విలువిద్య ఏడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఒలింపిక్ క్రీడగా గుర్తించబడింది. జనాదరణ పొందిన దేశాలలో ఉత్తర కొరియా, అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జపాన్ మరియు స్పెయిన్ వంటి దేశాలున్నప్పటికీ భారతదేశానికి ఆ జాబితాలో
చోటు దక్కకపోవడం చాలా విచారకరం. 2021 గణాంకాల ప్రకారం, మన దేశంలో 23 మంది మహిళా అథ్లెట్లు ఒలంపిక్ పోటీలలో పాల్గొనగా, 18 మంది పురుషులు
పాల్గొన్నారు. షార్జాలో జరిగిన ఆసియా కప్ 3వ దశలో భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు మరియు రెండు కాంస్యాలతో 10 పతకాలు సాధించారు. సంఖ్యాపరంగా తక్కువ మంది ఆర్చర్లు ఉన్నప్పటికీ మన దేశానికి మంచి అవార్డులు రావడం గర్వించదగ్గ విషయం.
విలువిద్య ఆరోగ్యానికి మేలు:
·
చేతి-కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఆటగాడు బాణాన్ని గురిపెట్టి ఛేదించడం వల్ల మన కంటి దృష్టి కూడా పెరుగుతుంది. విలువిద్య సాధన చేయడంవలన సమన్వయం మెరుగుపడుతుంది. లక్ష్యం చేస్తున్నప్పుడు ఆటగాడు శరీరంపై నియంత్రణ పాటించడం వలన మెరుగ్గా ఉంటాడు.
·
ప్రాక్టీస్ చేస్తున్నపుడు శరీర భాగాలని కదిలించాలిసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చేతులు, ఛాతీ మరియు భుజాలు. స్ట్రింగ్ విడుదల కావడానికి ముందు కండరాలపై ఉద్రిక్తత చాలా సెకన్ల పాటు నిర్వహించబడుతుంది. పునరావృత కార్యాచరణ కండరాల అభివృద్ధికి దారితీస్తుంది.
·
విలువిద్య మరింత సహనాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ క్రీడకు అపారమైన ఓపిక అవసరం.
·
లక్ష్యం ఛేదించడానికి ఆటగాడు బౌస్ట్రింగ్ను స్థిరంగా విడుదల చేయడానికి ప్రధానంగా దృష్టి పైన ఆధారపడి ఉంటుంది. ఈ విలువిద్య వల్ల దృష్టి ని మేరుపరుస్తుంది. విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది
·
బాణాన్ని వదలడం మరియు అది లక్ష్యాన్ని చేధించడాన్ని చూడటం చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీరు ఒత్తిడిని వదిలించుకోవడానికి మరియు మిమ్మల్ని రిలాక్స్గా భావించడంలో సహాయపడుతుంది.
·
చేతి వశ్యత: విలువిద్యలో వేలు మరియు చేతి బలం పెరుగుతుంది. సాధన చేస్తున్నప్పుడు అవి పూర్తిగా ఉపయోగంలో ఉన్నందున ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది.
కేరళలోని 72 ఏళ్ల ' పురాతన విలుకాడు:
కేరళలోని వాయనాడ్ అడవుల్లో నివసించే కె గోవిందన్ అనే వ్యక్తి తన పూర్వీకులు ఒకప్పుడు వేట కోసం ఉపయోగించిన శతాబ్దాల నాటి విలువిద్య పద్ధతిని ఇప్పటికీ పాటిస్తుండడం అభినందనీయం. ఆ ప్రాంత ప్రజలు వాణిజ్యపరంగా కాక ఆహారాన్వేషణలో భాగంగా విలువిద్యతోజంతువులను వేటాడతారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, గోవిందన్ తాను మరియు అతని పూర్వీకులు వేటాడిన అన్ని జంతువులకు ప్రాయశ్చిత్తం చేయడానికి శాఖాహారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అంతరించిపోతున్న కళను కాపాడాలనే ఉద్దేశ్యంతో యువ తరానికి
ఈ విద్యను అందించాలని నిశ్చయించుకున్నాడు. తనను చూడటానికి, బోధనలు నేర్చుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు రావడం సంతోషంగా ఉన్నప్పటికీ తన పాత ఆర్చరీ పద్దతులను నేర్చుకోవడానికి తన సామాజికవర్గంలోని చాలా మంది యువకులు ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాచలం, నల్లమల్ల అటవీప్రాంతాలలో నివసిస్తున్న గోండు, చెంచు, కోయ, మొదలైన అడవి జాతులవారు ఈ విలువిద్యను కొనసాగిస్తుండటం గొప్ప విషయం. విలువిద్యను ఒకప్పుడు ఆహారం కోసం జంతువుల వేటాడటం కొరకు ఉపయోగిస్తే, ఇప్పుడు వన్యమృగాల నుండి ప్రాణ రక్షణకొరకు ఉపయోగిస్తున్నారు. ఆదివాసుల ప్రాణరక్షణ కోసం ప్రభుత్వం వీరికి సరైన శిక్షణ ఇప్పించాలిసినవసరంఉంది.
లక్ష్య సాధనకొరకు ఏకలవ్యుడు చేసిన కఠోర దీక్ష ఎందరికో ఆదర్శాన్నిస్తుంది.
కానీ ఇందుకు దిశా నిర్దేశం చేసే వారు లేకపోవడం శోచనీయం. హిందూ సంప్రదాయాలలో విలువిద్య గురుంచి ఎంతోగొప్పగా ప్రస్తావించబడిన
విలువిద్యను కాపాడుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది..
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి