10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ఉత్తరం



ఊసేలేని ఉత్తరం 

తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగిందనే పొడుపుకథ వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది “ఉత్తరం”.

పురాతన కాలంలో రాజులు తమ సందేశాలను పంపడానికి పావురాలను ఉపయోగించేవారని. పావురాలు తమ కాళ్ళకి సందేశాన్ని కట్టుకొని వేరే దేశం వెళ్లి అందించేవని. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే నిఘా సమాచార సేకరణకు మరియు ప్రేమ సందేశాలను పంపడానికి కూడా వీటిని ఉపయోగించారని మనందరికీ తెలుసు. 

మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని విషయాలు అదృశ్యం కావడం మరియు వాటి స్థానంలో కొత్తవి ఆవిష్కృతం కావడం సహజం. గతంలో సమాచార మార్పిడికి క్షేమ సమాచారం అందించేందుకు "ఉత్తరం" ప్రధాన పాత్ర పోషించింది. 

నాటి తరానికి ఉత్తరానికి అవినాభావ సంబంధం ఉందనడంలో అతిశయోక్తిలేదు. మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తరం ఎంతో ఉపయోగపడింది. ఒకప్పుడు విదేశీ సమాచారాన్ని అందించడంలో అపూర్వమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసింది. పట్టణాల్లో ఉంటున్న తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు పల్లె ప్రజలు ఉత్తరం కోసం ఎదురుచూసిన క్షణాలు అలనాటి తరానికి ఖర్చులేని మధురానుభూతిని పంచాయి. ప్రేమికుల ప్రేమను వ్యక్తపరిచేందుకు ఉత్తరం (ప్రేమలేఖలు) వారధిగా మారి ప్రేమికుల మస్తిష్కాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. పోస్టుమాన్ ఇచ్చిన ఉత్తరాన్ని చదువుకుని పొడవాటి ఇనుప కమ్మీకి గుచ్చి భద్రపరిచేవాళ్ళు, అవసరమైనప్పుడు మళ్లీ తిరిగి చదువుకోవడం అదొక మధురానుభూతి. అంతేకాదు విద్య, వైద్యం, వ్యాపార, ప్రభుత్వ రంగాలకు విస్తృత సేవలు అందిస్తూ ఉత్తరం నేడు ప్రజాధారణ పొందలేకపోతుంది.    

స్వాతంత్య్ర ఉద్యమంలో ఉత్తరాలు ఉద్యమానికి ఊపిరీగా నిలిచాయి. మహనీయులు రాసిన ఉత్తరాలు ప్రజలను చైతన్యం కలిగించేలా చేసాయి. తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకు మరియు టెలిగ్రామ్ సేవలద్వారాకూడ ప్రజలకు విస్తృత సేవలందించింది. ఆధునిక కాలంలో సాంకేతికత అందుబాటులోకి రావడంతో  ఈమెయిల్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ సేవల కారణంగా  తపాలా సంస్థ సేవలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకు, సివిల్ కోర్టులకు సంబంధించిన లేఖలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. అయినా తపాలా సంస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రజలకు సేవలందిస్తుండటం గర్వించదగిన విషయం. 

తపాలా చరిత్ర:

మన దేశంలో మొదటిసారిగా 1764-1766 మధ్య ముంబై, చెన్నై, కలకత్తా నగరాల మధ్య ఉత్తరాలను చేరేవేసే ప్రక్రియను చేపట్టింది. అప్పటి కలకత్తా గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ తపాలా సేవలను  అందుబాటులోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. తరువాత, లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చట్టం ఆమోదించబడింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ 1854 పోస్టల్ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా స్థాపించబడింది. అప్పటి నుండి 1947 వరకు పోస్టల్ శాఖ బ్రిటిష్ పాలనలో ఉంది, కానీ తరువాత అది భారత ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. మొదట్లో లేఖలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. తర్వాత అనేక కొత్త అంశాలకు శ్రీకారం చుట్టింది. మనీ ఆర్డర్లు, టెలిగ్రామ్‌లు మరియు తరువాత పొదుపు వ్యవస్థలు ప్రవేశపెట్టబడ్డాయి. పోస్ట్‌కార్డ్, ఇన్‌ల్యాండ్ లెటర్, కవర్ ఇలా మూడు రకాల లెటర్స్ అందుబాటులో ఉన్నాయి.. 

1914 నాటికి భారతదేశంలోని అన్ని నగరాల్లో పోస్టల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

సింధ్ జిల్లాలో 1852 జూలై 1న క్వీన్ విక్టోరియా మహారాణి బొమ్మతో తపాలా బిళ్ళలు  మొదట జారీ చేయబడ్డాయి. పోస్టల్ వ్యవస్థ భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖలో భాగం. ఇది 'పోస్టల్ సర్వీస్ బోర్డ్'చే నియంత్రించబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 23 పోస్టల్ సర్కిల్‌లు ఉన్నాయి. ప్రతి సర్కిల్‌కు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థకు ప్రత్యేక సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తరాలు అందించడంలో వేగం మరియు ఖచ్చితత్వాన్ని సాధించేందుకు పిన్ కోడ్ (పి ఐ ఎన్  పోస్టల్ ఇండెక్స్ నంబర్) వ్యవస్థను ఆగస్టు 15, 1972న దేశంలో ప్రవేశపెట్టారు. పిన్ కోడ్ ఆరు అంకెలను కలిగి ఉంటుంది. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్ జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడు అంకెలు డెలివరీ పోస్టాఫీసును సూచిస్తాయి. దేశాన్ని మొత్తం 9 పిన్ కోడ్ జోన్లుగా విభ‌జించారు. 

1880లో మనీ ఆర్డర్‌ సేవలు ప్రారంభం.

1986లో నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ ప్రారంభం.

1994లో ఇంటర్నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ సేవలు ప్రారంభం.

2011 పార్సెల్‌ సేవలు ప్రారంభం.

పోస్టల్ డే అక్టోబర్ 9 నాడు ఎందుకు? 

1600-1700ల కాలంలో, అన్ని దేశాలు సమాచారాన్ని చేరవేయడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి మరియు జాతీయ తపాలా వ్యవస్థను స్థాపించడానికి మరియు దేశాల మధ్య పోస్టల్ సౌకర్యాలను అందించడానికి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 1878లో ఏర్పడింది. ఇది 1948లో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందింది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 16, 1969 వరకు, జపాన్‌లోని టోక్యోలో అనేక సమావేశాలు జరిగాయి. ఈ సదస్సులో అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతినిధులు నిర్ణయించారు.

గణాంకాల ప్రకారం:

ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ కలిగిన దేశం 'భారతదేశం". భారతదేశంలో 155,333 పోస్టాఫీసులు ఉన్నాయి. రెండవస్థానం చైనా 57,000 పోస్టాఫీసులు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో 23,344 పోస్టాఫీసులు మాత్రమే ఉన్నాయి. అందులో 19,184 గ్రామీణ ప్రాంతాల్లో , 4160  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉన్నాయి.

పోస్టల్‌ సేవలు:

ఉత్తరాల పంపిణీ. 

స్పీడ్‌ పోస్టు.

ఈ పోస్టు సర్వీసు.

ఇంటివద్దనే ఆధార్‌ నమోదు సేవలు. 

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలద్వారా ఇంటివద్దే నగదు అందజేత.

ఆలయాల ప్రసాదాల సర్వీసు.

గోదావరి జలాలు అందజేసే సర్వీసు. 

పెట్టుబడి పథకం, టైం డిపాజిట్‌, 

సుకన్య సమృద్ధి ఖాతా, 

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, 

నెలవారీ ఆదాయం వంటి పథకాలు, 

ఉపాధిహామీ వేతనాల పంపిణి

పాస్ పోర్ట్ సేవలు 

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)

ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై)

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్ బివై)

అటల్ పెన్షన్ యోజన (ఏపివై)

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ సి ఎస్ ఎస్)

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతా (అర్ డి)

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐ పి పి బి) సేవలు:

సాధారణంగా నగదు తీసుకోవాలంటే బ్యాంకులు లేదా ఏటీఎం కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐ పి పి బి) అకౌంట్ ఉన్నవారు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటివద్దే  నగదు పొందేందుకు ఈ సేవను ప్రారంభించింది. పోస్టాఫీసు ద్వారా 5000 నగదును పోస్ట్‌మ్యాన్ స్వయంగా ఇస్తారు. మీకు ఐ పి పి బి ఖాతా ఉంటే మరియు దానిలో 2000 బ్యాలెన్స్ ఉంటే, ఈ సేవలు ఉచితంగా అందించబడతాయి.

ఆధార్ సేవలు:

5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు చేసుకోవాలిసినవారు ముందుగా సమీపంలోని పోస్టాఫీసుకు తెలియజేసినట్లైతే తపాలా శాఖ వారు మీ ఇంటివద్దకు వచ్చి ఎలాంటి సర్వీస్ చార్జీలు లేకుండా ఆధార్ నమోదు చేసుకుంటారు. 5 సంవత్సరాల పిల్లలకు పూర్తిగా ఉచితంగా సేవలందిస్తారు.

టెలిగ్రామ్ సేవలు:

1850లో ప్రారంభించిన టెలిగ్రామ్‌ సేవలు, భారతదేశంలో, ఇది 163 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించడం గొప్ప విషయం. ల్యాండ్ ఫోన్‌లు ఉనికిలోకి రాకముందు చాలా మంది భారతీయులకు టెలిగ్రామ్ అత్యంత వేగవంతమైన సమాచారాన్ని అందించింది. టెలిగ్రామ్ ద్వారా మొదటి కమ్యూనికేషన్ 1850లో కోల్‌కతా మరియు ప్రధాన నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హార్బర్ మధ్య జరిగింది. టెలిగ్రాఫ్‌ను శామ్యూల్ మోర్స్ కనుగొన్నారు. టెలిగ్రామ్ సందేశాలను పంపడానికి ఉపయోగించే కోడ్ అయిన మోర్స్ కోడ్ అతని పేరు మీద పెట్టబడింది. వైర్లను అనుసంధానించడం ద్వారా ప్రసారం చేయబడిన విద్యుత్ సంకేతాలను ఉపయోగించి సందేశాలు అందించబడ్డాయి. టెలిగ్రామ్ సేవలను జులై 15 2013న రద్దు చేశారు.

వీటిపై ప్రత్యేక దృష్ఠి సారించాల్సి ఉంది:

  • మీసేవా కేంద్రాల్లో అందిస్తున్న సేవలను పోస్టాఫీసుల్లో కూడా ప్రవేశపెడితే ప్రజలకు పోస్టల్ సేవలపై అవగాహన కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అగ్రిమెంట్ పేపర్స్ పోస్ట్ ఆఫీసుల ద్వారా అందించడం మరియు డి టి డి సి కొరియర్, ప్రవైట్ కొరియర్ సంస్థల సేవలకంటే మెరుగైన సేవలను అందించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
  • పోస్టల్ పథకాల గురుంచి తగిన ప్రచారం మరియు ప్ర‌జ‌ల‌కు ప్రత్యేక అవ‌గాహ‌న కల్పించినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ తిరిగి పునర్వవైభవం సంతరించుకునే అవకాశముంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత విధానాలకు స్వస్తి చెప్పి శాస్త్ర, సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ పట్టణాలు మరియు గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు మరింత చేరువగా పోస్టల్ పథకాల సేవలను అందించాలిసిన అవసరం ఇంకా ఎంతో ఉంది.  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475






కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...