31, డిసెంబర్ 2024, మంగళవారం

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...


ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఒక నాయకుడిగా ఎదగాలంటే అసాధారణమైన విషయం, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే తన ప్రతిభా పాటవాలతో అత్యున్నత పదవులు అధిష్టించి అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) మరణ వార్త యావత్ దేశాన్ని  దిగ్భ్రాంతికి గురి చేసింది. గొప్ప  ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినప్పటికీ, తన విజయాన్ని తన ఘనతగా చెప్పుకోకుండా, పేరు ప్రతిష్టలకు పాకులాడకుండా, అప్పగించిన పనిని నిబద్దతతో చేసి సాదాసీదా జీవితాన్ని గడిపిన నాయకులలో మన్మోహన్ సింగ్ ఒకరు. చేసినవి చెప్పుకోలేదు. హంగు ఆర్భాటాలకు పోలేదు. అవమానాలు, అడ్డంకులు అన్నీ సమానంగా స్వీకరించగలిగిన  గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం:

ఆయన దేశ ఆర్థిక మంత్రి పదవిలో ఉండగా, ఒక సారి ఆయన భార్య, గురుశరణ్ కౌర్ చపాతీ పిండి తీసుకురమ్మని  సింగ్ వ్యక్తిగత సిబ్బందిని పురమాయించడంతో ఆ విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ వెంటనే తన భార్యను పిలిచి సిబ్బంది ఉన్నది ఇంటి అవసరాల కోసం కాదని, కేవలం ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మాత్రమే అని  చెప్పారట. ఇలాంటి నాయకులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? అలంటి వారిని మనం చేతి వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఈ రోజుల్లో మండల మరియు జిల్లా స్థాయి నాయకులు ప్రభుత్వ సిబ్బందిని తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి అయినప్పటికీ వ్యక్తిగత అవసరాలకు వారిని వినియోగించుకోకపోవడం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటివి విషయాలు ఎక్కడా బహిర్గతం కాకపోవడం ఆయన నిరాడంబర జీవితానికి నిదర్శనం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఆయన కూతురు కాలేజీకి వెళ్ళడానికి ప్రభుత్వ బస్సు లోనే వెళ్ళేదన్న విషయం. ఈ రోజుల్లో చిన్న స్థాయి నాయకుడైన తమ పిల్లలకు మంచి ఖరీదైన కార్లు కొనేస్తున్నారు అంతేకాకుండా వారికి ప్రత్యేక సెక్యూరిటీ ని కూడా నియమిస్తున్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారు మాత్రం తన పిల్లలను క్రమశిక్షణ తో పాటు నిజాయితీగా జీవించమని సూచనలు ఇచ్చే గొప్ప మానవతావాది.

మన్మోహన్ సింగ్ ఎక్కువ కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుండి లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు, ఆతర్వాత అతను ట్యాక్సీలు అద్దెకు తీసుకున్నందుకు రచయిత కుష్వంత్ సింగ్ నుంచి తీసుకున్న రూ.2 లక్షలు తాను ఉపయోగించలేదని చెప్పి వెంటనే తిరిగి ఇచ్చాడట. మన్మోహన్ సింగ్ దగ్గర 2 లక్షల రూపాయలు లేకపోవడమేంటని ఆశ్చర్యపోయిన ఖుష్వంత్ సింగ్, ఇదే విషయాన్నీ తాను రాసిన "Absolute Khushwant: The Low-Down on Life, Death and Most Things in-Between" అనే పుస్తకంలో డా. మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధి ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఉన్న ప్రధానులలో మన్మోహన్ సింగ్ గొప్ప ప్రధాని, ఎలాంటి మచ్చలేని నాయకుడు అని ప్రత్యేకంగా రాశారు.

నిబద్ధత కలిగిన నాయకుడు:

ఇప్పటి వరకు ఏ దేశ ప్రధాని కూడా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మనం కనీ, వినీ ఉండకపోవచ్చు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం తన లంచ్ బాక్స్ ఇంటి నుండి తెచ్చుకొని తినేవారట. ఈ విషయాన్నీ అప్పటి లోక్ దళిత్ ఫోరమ్ సెక్రటరీ ఆర్ రవికుమార్ ప్రత్యేకంగా చూశానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా తాను తీసుకున్న నిర్ణయాలు ఆయన నిబద్ధతకు నిదర్శనం. మనను ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయమేమిటంటే, మన్మోహన్ సింగ్ లండన్ లో చదువుకునే రోజుల్లో తన తండ్రి సర్దుబాటు కాక సమయానికి డబ్బులు పంపించని సందర్భాలలో ఆయన తన వద్ద ఉన్న మొత్తం డబ్బులతో ఫేజు చెల్లించి కేవలం  మంచినీళ్ళు తాగేవారని ఆయన కూతురు తెలిపింది.

దారి చూపిన దార్శనికుడు:

దేశం ఆర్థిక సంక్షేమంతో కొట్టుమిట్టాడుతున్న వేళ, అత్యంత సాహసోపేతంగా విప్లవాత్మకంగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, జవసత్వాలుడిగిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దార్శనికుడు మన్మోహన్ సింగ్. భారత్‌తో అమెరికా అణు ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య కొన్ని అడ్డంకులు వచ్చినా మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం దృష్ట్యా అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో డాక్టర్ మన్మోహన్ సింగ్ చర్చల అనంతరం పౌర అణు ఒప్పందంలో సహకరిస్తామని ప్రకటించారు. అణు ఒప్పందం ప్రకటన తర్వాత మన్మోహన్ సింగ్ యొక్క ప్రధాన మంత్రిత్వానికి కీర్తి కిరీటం గా నిలిచింది. రెండు దేశాల మధ్య ఒప్పందం అణు వర్ణవివక్ష అంతం చేయడమే కాకుండా అనుకూలమైన భౌగోళిక రాజకీయ ఆకృతీకరణ సృష్టించింది. విదేశీ వ్యవహారాల్లో, ముఖ్యంగా అమెరికా తో సంబంధాలు మెరుగుపరచడంలో మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధానికి అమెరికాలో గౌరవం లభించింది:
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌ను అధికారిక పర్యటనకు ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు చెప్పబోతుంటే, "మీరు నాకు గురువులాంటి వారు మీలాంటి వారిని కలవడం నా అదృష్టం" అని వినమ్రంగా చెప్పారు ఒబామా. 
అంతేకాదు అణు ఒప్పందం కుదుర్చుకున్న రెండేళ్ల తర్వాత కెనడాలోని టొరంటోలో జరిగిన జీ20 కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ. మన్మోహన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేసారని కొనియాడుతూ, ఆయన రాసిన ‘ఎ ప్రామిస్ ల్యాండ్’ పుస్తకంలో మన్మోహన్ గురించి ప్రస్తావిస్తూ, భారత ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ తన సంస్కరణలతో అనేక మందిని పేదరికం నుంచి బయట పడేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనాపరుడు మరియు నిజాయితీపరుడు అని కొనియాడారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో అత్యున్నత విలువలు పాటిస్తూ వ్యక్తిగత దూషణలకు ఆమడ దూరంలో ఉన్న అతి కొద్ది మంది ప్రముఖులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంజలి ఘటిద్దాం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...