31, మే 2026, ఆదివారం

చేతిరాతలో చెరిగిపోని జ్ఞాపకాలు

 చేతిరాతలో చెరిగిపోని జ్ఞాపకాలు


ఈమధ్య కాలంలో చేతిరాత రాసేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందనడానికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్‌ఫోన్లు కోకొల్లలుగా పెరగడమే ప్రధాన కారణం. ఇవన్నీ కలిసి మనిషిని చేతిరాతకు క్రమంగా దూరం చేస్తున్నాయి. ఒకప్పుడు ఆలోచనలకు ఆత్మగా నిలిచిన చేతిరాత, ఇప్పుడు కీబోర్డ్‌ కఠోర ధ్వనుల మధ్య కనుమరుగైపోతోంది. సాంకేతికత మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, కాగితంపై అక్షరాలను ఆవిష్కరించే అలవాటు మాత్రం మసకబారుతోంది. చేతిరాతలో కనిపించే భావోద్వేగం, వ్యక్తిత్వం డిజిటల్‌ అక్షరాల్లో కనిపించడం లేదనే భావన చాలామందిలో వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు అమ్మ తన కొడుకుకి రాసిన ఉత్తరాలు. తండ్రి తన కూతురి మార్కుల మెమోపై పెట్టిన సంతకాలు. ప్రేమికుల మధ్య రాయబారిగా మారిన  ప్రేమలేఖలు. ఇవన్నీ కేవలం అక్షరాల సమాహారం మాత్రమే కాదు, మనుషుల భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా నిలిచిన సజీవ జ్ఞాపకాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తిగా మారిందనడంలో అతిశయోక్తిలేదు. చేతిలో పెన్ను కనిపించాల్సిన చోట మొబైల్ కనిపిస్తోంది. కాగితం మీద అక్షరాలు రాయాల్సిన చోట, స్క్రీన్‌లపై టైపింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు మన జీవితాల్లో వేగాన్ని పెంచాయి కానీ, చేతిరాత అనే కళను మెల్లగా అంతరించిపోయే దిశగా నెట్టేస్తున్నాయి. ప్రతి అక్షరంలో ఉండే భావోద్వేగం ఇవన్నీ క్రమంగా జ్ఞాపకాల పుటల్లోకి జారిపోతున్నాయి.

ఒకప్పుడు పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసే రోజులుండేవి. ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదివి, ప్రతి అక్షరంలో ఆప్యాయతను వెతుక్కుంటూ కన్నీళ్లు పెట్టుకునే భావోద్వేగ క్షణాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాట్సాప్‌ ఎమోజీలతోనే భావాలను వ్యక్తపరిచే స్థితికి మనం చేరుకున్నాం.

అక్షరాల్లో ఉండే ఆత్మీయతను, చేతిరాతలో దాగి ఉండే ప్రేమను టచ్‌స్క్రీన్‌లు పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయనేదే నా బాధ. ఒకప్పుడు అక్షరాలతో ఆడుకున్న బాల్యం, ఇప్పుడు కంప్యూటర్లతో కుస్తీ పడుతుంది. పెన్ను పట్టి అక్షరాలు రాయాల్సిన చిట్టి చేతులు, మొబైల్‌ స్క్రీన్‌లపై వేళ్లు నాట్యం చేస్తున్నాయి. సాంకేతికత సౌకర్యాలను పెంచినా, మనసులను తాకే చేతిరాత మాధుర్యాన్ని మాత్రం క్రమంగా మన జీవితం నుంచి దూరం చేస్తుంది.

ఒకప్పుడు చేతిరాతలో వచ్చిన ఉత్తరాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, మనుషుల భావోద్వేగాలను మోసుకొచ్చేవి. అప్పట్లో మరణవార్త , దూర ప్రాంతాల్లో ఉన్న తమవారికి ఆ విషాద వార్తను ఉత్తరాల ద్వారానే తెలియజేసేవారు. ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు, అక్షరాల్లో ఉన్న బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అక్షరాలు మనసును ఓదార్చేవి, మరికొన్ని అక్షరాలు గుండెను బరువెక్కించేవి. అంటే చేతిరాతకు మనిషి హృదయాన్ని కదిలించే అపారమైన భావోద్వేగ శక్తి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఒకప్పుడు విదేశాల్లో లేదా దూర పట్టణాల్లో చదువుకునే పిల్లలకు తల్లిదండ్రులు రాసిన ఉత్తరాలు ఇంటి ప్రేమను గుర్తు చేసేవి. “బాగా చదువు బిడ్డా… ఆరోగ్యం జాగ్రత్త” అని అమ్మ రాసిన ఒక్క వాక్యం చాలు, ఎంత దూరంలో ఉన్నా ఇంటి ఆప్యాయతను దగ్గర చేసేది. ప్రేమలేఖల్లో ప్రతి అక్షరం ఒక అనుభూతిలా ఉండేది. కొందరు ఆ ఉత్తరాలను సంవత్సరాల పాటు దాచుకుని, జీవితాంతం జ్ఞాపకాలుగా చూసుకునేవారు.

పండుగల సందర్భాల్లో బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు కుటుంబ బంధాలను మరింత బలపరచేవి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పుడు గురువులు చేతిరాతలో రాసిన అభినందనలు విద్యార్థులకు జీవితాంతం ప్రేరణగా నిలిచేవి. చేతిరాతలో మనిషి స్వభావం, ఆలోచన, ఆప్యాయత కనిపించేవి. అందుకే పాత ఉత్తరాలను చదివితే, ఆ మనుషులు మన ముందే నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.

కానీ నేడు టెక్నాలజీ వేగంలో ఆ భావోద్వేగ జ్ఞాపకాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. క్షణాల్లో మెసేజ్‌లు చేరుతున్నా, చేతిరాతలో ఉండే హృదయస్పర్శ మాత్రం కనిపించడం లేదు. అందుకే చేతిరాత జ్ఞాపకాలు ఎప్పటికీ మన జీవితాల్లో చెరగని భావోద్వేగ ముద్రలుగానే మిగిలిపోతాయి.

ఇప్పటి పిల్లల్లో చాలామందికి తెలుగు అక్షరాలు సరిగా రాయడం కూడా కష్టమైపోతోంది. పరీక్షలు తప్పితే పెన్ను పట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. డిజిటల్ యుగం మనిషిని తెలివిగా మార్చిందేమో గానీ, అక్షరాల పట్ల ప్రేమను మాత్రం తగ్గించింది.

ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి అతని మాటలు, ప్రవర్తన, ఆలోచనలు మాత్రమే కాదు, అతని చేతిరాత కూడా అంచనా వేయడానికి పనిచేస్తుందని చాలామంది నమ్ముతారు. ఒకప్పుడు ఉత్తరాలు, డైరీలు, నోట్స్ ద్వారా మనుషుల భావోద్వేగాలు బయటపడేవి. ఎవరి చేతిరాత చూసినా వారి మనస్తత్వం గురించి కొంత అంచనా వేసే ప్రయత్నం చేసేవారు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన అధ్యయన విధానమే “గ్రాఫాలజీ”.

అరచేతి గీతల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు చెప్పేదాన్ని “హస్తసాముద్రికం” లేదా  “జాతకం” అంటారు. కానీ చేతిరాత ఆధారంగా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించే విధానాన్ని “గ్రాఫాలజీ” అంటారు. “గ్రాఫాలజీ” ఒక వ్యక్తి యొక్క ఆలోచనా తీరు, భావోద్వేగ స్థితి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఒత్తిడి వంటి అంశాలను అంచనా వేయడానికి ఉపయోగించే శాస్త్రం.

అయితే కొంతమంది మేధావుల చేతిరాత మాత్రం ఎంతో అందంగా, క్రమబద్ధంగా ఉండేది.

చేతిరాత అంతరించిపోవడం అంటే కేవలం ఒక అలవాటు పోవడం కాదు…
మన సంస్కృతిలోని ఓ భావోద్వేగ అధ్యాయం మాయమవడం.
రేపటి తరాలు “ఉత్తరం” అంటే ఏమిటో, “చేతిరాతలో ప్రేమ” అంటే ఏమిటో పుస్తకాలలో మాత్రమే చదివే పరిస్థితి రావొచ్చు.

అందుకే ఇంకా ఆలస్యం కాకముందే పిల్లలకు చేతిరాత విలువను నేర్పాలి.
రోజుకు కొన్ని అక్షరాలైన స్వయంగా రాసే అలవాటు పెంచాలి.

పైన కనిపిస్తున్న ఈ చిత్రం నిజంగా ఒక విచిత్రమే… కానీ ఆ విచిత్రంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఆయనొక పోలీస్ అధికారి. పేరు శ్రీహరి. కానీ ఆయనను కేవలం పోలీస్ అని చెప్పడం సరిపోదు… ఆయన అక్షరాలను ఆరాధించే అక్షర పిపాసి.

ఆయన ఎక్కడికి వెళ్లినా చేతిలో ఒక డైరీ, ఒక పెన్ తప్పనిసరిగా కనిపిస్తాయి. పోలీస్ అధికారిగా గన్ లేకపోయినా పని సాగుతుందేమో గానీ, పెన్ మాత్రం ఆయన చేతిలో ఉండాల్సిందే. అందుకే ఆయనను “అక్షర ప్రేమికుడు” అని పిలవడం అతిశయోక్తి కాదు.

ఒకప్పుడు పెద్దలు ఒక సామెత చెప్పేవారు “అక్షరాన్ని నమ్ముకున్నోడు చరిత్రలో ఎప్పుడూ చెడిపోలేదు” అని. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆ సామెత అక్షర సత్యంలా అనిపిస్తుంది.

ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా, ఒక కఠినమైన పోలీస్ అధికారిలా కాకుండా, కాలేజీకి ఉత్సాహంగా వెళ్లే విద్యార్థిలా కనిపించడం ఆయనలోని ప్రత్యేక ఆకర్షణ. సమావేశాల్లో ఎవరైనా మాట్లాడితే, వారి మాటలను ఎంతో శ్రద్ధగా వింటారు. కానీ శ్రీహరి వినడానికే పరిమితం కారు. ప్రతి మంచి ఆలోచనను, ప్రేరణనిచ్చే మాటను తన డైరీలో నోట్ చేసుకుంటారు. అదే ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం  నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ తగ్గకుండా ఉండటం.

ఈరోజుల్లో చేతిరాత రాయడం చాలామందికి బద్దకంగా మారిపోయింది. మొబైల్‌లో టైప్ చేయడం అలవాటైపోయిన ఈ డిజిటల్ కాలంలో, ఇంకా పెన్నుతో అక్షరాలను ప్రేమగా కాపాడుకుంటూ రాయడం నిజంగా గొప్ప సంస్కారం. ఎందుకంటే చేతిరాత అనేది కేవలం అక్షరాల సమాహారం కాదు… అది మనిషి ఆలోచనలకు ప్రతిబింబం, మనసులోని భావాలకు అద్దం, జ్ఞాపకాలకు శాశ్వత నిల్వ, వ్యక్తిత్వానికి ఓ ప్రత్యేక గుర్తు.

శ్రీహరి లాంటి వారు సమాజానికి ఒక మౌన సందేశం ఇస్తున్నారు —
“టెక్నాలజీ ఎంత ఎదిగినా, అక్షరాల ఆత్మను మాత్రం కోల్పోవద్దు” అని.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

  ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. ...