31, మే 2026, ఆదివారం

బుల్లెట్ల మధ్య గర్జించిన మహిళా ధైర్యం – లీ ఆన్ హెస్టర్

బుల్లెట్ల మధ్య గర్జించిన మహిళా ధైర్యం – లీ ఆన్ హెస్టర్


బయట ఏ చిన్న గొడవ జరిగినా… “మనకెందుకులే” అని పక్కకు తప్పుకోవడం సాధారణ మనుషుల మనస్తత్వం.
రోడ్డు మీద ఏ  కాస్త హడావిడి కనిపించినా… గుండెల్లో భయం పుట్టి, అడుగులు వెనక్కి పడతాయి. అది మన సహజ స్వభావం.
మనకు కావాల్సింది మన బ్రతుకులు … మన రక్షణ … అంతే.... లోకం ఏమైపోయినా ఫరవా లేదు ...

కానీ ఒక క్షణం ఆలోచించండి!

ఆకాశం చిల్లులు పడే బాంబుల మోతలు, గాలిని చీల్చుకుంటూ వచ్చే బుల్లెట్లు,
మరణం కళ్ల ముందే నర్తించే భీకర యుద్ధభూమి. అలాంటి రణరంగంలో మనం ఉంటే? మన ఒక్క అడుగైనా ముందుకు పడుతుందా? లేదా భయంతో కాలికి బుద్ధిచెప్పి వెనక్కి పారిపోతామా? మనమైతే ఖచ్చితంగా వెనక్కే పారిపోతాం... అది మాత్రం నిజం. అత్యంత విలువైన మన ప్రాణం ముందు ఎంత యుద్దమైన చిన్నదే అనిపిస్తుంది.

“బతికుంటే బలుసాకు తినొచ్చు” అనే సామెత లాగా  … మన లాంటి సగటు జీవులకు నాకెందుకు ఈ యుద్ధం?” అని మనసు బ్రతకాలని కేకలు వేస్తుంది. కానీ… అదే ఆలోచన ఒక సైనికుడి మదిలో మెదిలితే...?
ఒక్క క్షణం అయినా, “నాకెందుకు ఈ యుద్ధం?” అని అతను వెనక్కి తగ్గితే?

మన పరిస్థితి ఏంటి? మన దేశ పౌరుల పరిస్థితి ఏంటి?

మన ఇళ్లలో ఉన్న నిశ్శబ్దం, మన పిల్లల నవ్వులు, మనం ముందు తరాలకోసం సంపాదించిన సంపాదన, ఇవన్నీ ఒక్క క్షణంలో కూలిపోవా?

మన భయం మనల్ని కాపాడుతుందేమో, కానీ వారి ధైర్యమే రక్షణ కవచంలా నిలిచి దేశాన్ని కాపాడుతుంది.

అదే మరి సామాన్య ప్రజలకు మరియు దేశాన్ని కనురెప్పలార్పకుండా రేయింబవళ్ళు కాపు కాసే సైనికులకు తేడా ... మనమేమో మన ప్రాణాల కోసం వెనక్కి తగ్గితే, వాళ్లు మన ప్రాణాలను రక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కదనరంగంలో దూసుకెళ్తారు.

దేశ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు కేవలం 19 ఏళ్ల ఒ యువతి చేసిన 25 నిమిషాల భీకర పోరులో 27 మంది తీవ్రవాదులు మట్టి కరిచారు.
ఆ యుద్ధంలో తీవ్రవాదులు  మాత్రమే మరణించారు తప్ప ఆమె బృందంలోని ఒక్క సైనికుడూ ప్రాణాలు కోల్పోకపోవడం అత్యంత ఆశ్చర్యకర విషయం. అదే ఆమె నాయకత్వ పటిమకు, ధైర్యానికి నిదర్శనం. మరణం కళ్లముందు నాట్యం చేస్తుంటే ఏమాత్రం వెరవక ధైర్యంగా ముందుకు లంఘించిన ఆ యువతి ఎవరో తెలుసుకోవాలనిపిస్తుందా? ఆమె పేరు — లి ఆన్ హెస్టర్. యుద్ధభూమిలో ఆమె ప్రదర్శించిన అసాధారణ శౌర్యపరాక్రమాలకు సిల్వర్ స్టార్ అందుకున్న U.S. Army తొలి మహిళా సైనికురాలిగా ఆమె చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

లీ ఆన్ హెస్టర్ జనవరి 1982లో అమెరికా కెంటకీలోని బౌలింగ్ గ్రీన్ లో జన్మించింది. నవ యౌవనంలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, జీవితంలో ఎన్నో కలలు కంటూ, ఆశల సౌధాలు  నిర్మించుకునే వయసులో,  2001 ఏప్రిల్ 3న, కేవలం 19 సంవత్సరాల వయస్సులో ఇతర యువతీ యువకులు తమ భవిష్యత్తు కోసం కళాశాలలు, ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్న సమయంలో హెస్టర్ మాత్రం దేశ సేవ కోసం కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆమె "కెంటకీ ఆర్మీ నేషనల్ గార్డ్" లో చేరింది. అందులో ఆమె ఎంచుకున్నది సాధారణ ఉద్యోగం కాదు. దేశాన్ని కాపాడే బృహత్తర బాధ్యత. 617th మిలిటరీ పోలీస్ విభాగంలో చేరిన హెస్టర్, దేశానికి తన వంతు సేవ చేయాలనే అచంచల సంకల్పంతో ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఆమె సైన్యంలో చేరే సమయానికే ప్రపంచం ఉగ్రదాడుల భయానక నీడలోకి అడుగుపెడుతోంది.
ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట రక్తపాతం, భయం, అనిశ్చితి వార్తలుగా వినిపిస్తున్న కాలం అది. అయినా హెస్టర్ వెనక్కి తగ్గలేదు. “దేశం కోసం నిలబడాలి… అవసరం వస్తే ప్రాణం అర్పించాలి” అనే నిశ్శబ్ద ప్రతిజ్ఞతో ఆమె యూనిఫాం ధరించింది. చాలామంది యువత తమ భవిష్యత్తు, ఉద్యోగాలు, కలల గురించి మాత్రమే ఆలోచించే వయస్సులో హెస్టర్ మాత్రం దేశ భద్రతను తన భుజాలపై మోసేందుకు ముందుకు వచ్చింది.

చిన్ననాటి నుంచే ఆమె తండ్రి నేర్పిన తుపాకీ వినియోగం ఆమెకు కేవలం ఆయుధాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా భయాన్ని ఎదుర్కోవడం, ప్రమాదం ముందు నిలబడడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పింది. అందుకే చిన్న వయస్సులోనే ఆమెలో సాధారణ యువతిలో కనిపించని ధైర్యం, క్రమశిక్షణ, బాధ్యత అనే లక్షణాలు బలంగా పెరిగాయి.
ఒక అబ్బాయిలాగా ధైర్యంగా, చురుకుగా పెరిగిన ఆమెకు క్రమశిక్షణ, సాహసం, బాధ్యత అనే విలువలు ఎంతో దగ్గరయ్యాయి. అంతేకాకుండా యూనిఫాంలో ఉన్న వారిని చూసినప్పుడల్లా ఆమెకు గౌరవభావం కలిగేది. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న మహిళలను చూస్తే తాను కూడా అలా దేశానికి సేవ చేయాలనుకునేది. ఆమె ఎంచుకున్న 617th మిలిటరీ లోని పోలీస్ పాత్ర కూడా ఆమె ఆలోచనకు ఎంతో దగ్గరగా అనిపించాయి. శిక్షణ పూర్తయ్యాక ఆమె "ఫోర్ట్ లియోనార్డ్ వుడ్" లోని యు.ఎస్. ఆర్మీ మిలిటరీ పోలీస్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. అక్కడ ఆమె కేవలం ఆయుధాలు ఉపయోగించడం మాత్రమే కాకుండా, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం, సహచరులను రక్షించడం, భయాన్ని జయించడం కూడా నేర్చుకుంది. ఆతర్వాత కొంతకాలం గ్రాడ్యుయేషన్ అనంతరం ఆమె తిరిగి 617th మిలిటరీ లో చేరింది.
ఆమె క్రమశిక్షణ, బాధ్యత, నాయకత్వ లక్షణాలు చాలా త్వరగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అదే ఆమెను సార్జెంట్ హోదా వరకు తీసుకెళ్లింది. ఇక్కడ కాన్వాయ్ ఎస్కార్ట్ శిక్షణలు, ఖైదీల నిర్వహణ, అత్యవసర వ్యూహాత్మక స్పందనలు ఇవన్నీ ఆమెను మానసికంగా, శారీరకంగా మరింత దృఢంగా తీర్చిదిద్దాయి. ఆతర్వాత జూలై 2004 లో, హెస్టర్ ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ కు మద్దతుగా మోహరింపు కోసం సమీకరణ ఉత్తర్వులను మిలిటరీ సంస్థ జారీచేసింది.

నవంబర్ 2004 హెస్టర్ జీవితంలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది.
617th మిలిటరీ పోలీస్ బృందంతో కలిసి ఆమె ఇరాక్ నేలపై అడుగుపెట్టింది.
అది ప్రతి క్షణం ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న యుద్ధభూమి. ఆపరేషన్ సమయంలో ఇరాక్ లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. బాగ్దాద్ చుట్టుపక్కల సరఫరా మార్గాలు తిరుగుబాటుదారుల ప్రధాన లక్ష్యాలయ్యాయి. మరణదేవత అనునిత్యం నర్తించే అలాంటి పరిస్థితుల్లోనే హెస్టర్ తన విధులను నిర్వర్తించాల్సి వచ్చింది.

హెస్టర్ సార్జెంట్‌గా, వాహన కమాండర్‌గా బృందాన్ని ముందుండి నడిపించింది.
ఆమె డ్యూటీ ఏమిటంటే ఆహారం, మందులు, ఆయుధాలు తీసుకెళ్తున్న కాన్వాయ్ లను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం. కానీ సల్మాన్ పాక్ వంటి ప్రాంతాలు అత్యంత భయంకరమైనవి. ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయానక వాతావరణంతో కూడిన భీకర యుద్ధభూమి అది. రోడ్డు పక్కన దాచిన బాంబులు, అకస్మాత్తుగా ప్రారంభమయ్యే కాల్పులు, చెట్ల మధ్య దాగిన తీవ్రవాదులతో ప్రతి క్షణం సైనికులను భయాందోళనలకు గురిచేసేది. ఆ ప్రాంతంలో ప్రయాణించడం అంటే మరణపు నీడలో అడుగులు వేయడమే. అలాంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలను రక్షించడం హెస్టర్ బృందం భుజాలపై ఉన్న బాధ్యత. పగలు మండే ఎడారి వేడి, రాత్రిళ్లు భయంతో నిండిన ప్రయాణాలు. బతికి తిరిగి వస్తామో లేదో తెలియని అనిశ్చితి. అయినా హెస్టర్ వెనక్కి తగ్గలేదు. 2005 మార్చి 20 ఇరాక్ నేలపై యువ సైనికురాలి ధైర్యాన్ని చరిత్ర శాశ్వతంగా గుర్తుంచుకున్న రోజు. సుమారు 30 పౌర ట్రాక్టర్-ట్రైలర్ల కాన్వాయ్ కు 617th మిలిటరీ పోలీస్ బృందం భద్రత కల్పిస్తోంది. ఆ కాన్వాయ్‌లో ఉన్నవి  సైనికులకు అవసరమైన సరఫరాలు. హెస్టర్ తన “రావెన్-42” స్క్వాడ్ కు నాయకత్వం వహిస్తూ కాన్వాయ్ మధ్యలో హమ్వీలో ప్రయాణిస్తోంది. రోడ్డు పక్కన ఉన్న తోటల మధ్య దాగిన స్థావరాలు, సమీప నిర్మాణాల వెనుక పొంచి ఉన్న తీవ్రవాదులు ఒక్కసారిగా  ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. ఆ సమయంలో 50 మందికిపైగా తిరుగుబాటుదారులు కాన్వాయ్‌ను పూర్తిగా చుట్టుముట్టారు. తుపాకీ గుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ప్రతి క్షణం మరణం దగ్గరపడుతున్నట్టే అనిపిస్తోంది.

ఆ క్షణంలో ప్రతి మనిషికి భయం సహజం, వెనక్కి తగ్గడమూ సహజమే కానీ హెస్టర్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన భయాన్ని పక్కనపెట్టి, తన వెనుక ఉన్న ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే సంకల్పంతో ముందుకు అడుగు వేసింది. ఆమె వెంటనే తన వాహనాన్ని ఆపి, స్క్వాడ్ లీడర్ టిమొతీ నేయిన్‌తో సమన్వయం చేసింది. చేతిలోని M4 కార్బైన్, M203 గ్రెనేడ్ లాంచర్‌తో శత్రువుల కందకాలపై ఎదురుదాడి ప్రారంభించింది. గ్రెనేడ్ రౌండ్లు శత్రువుల మధ్య పేలిపోతుండగా, హెస్టర్ ముందుకు కదులుతూ నిరంతరం కాల్పులు జరిపింది. ఆ భీకర పోరాటంలో ఆమె కనీసం నలుగురు తీవ్రవాదులను స్వయంగా నిర్వీర్యం చేసింది. కానీ హెస్టర్ బృందం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ఈ కీలక సమయంలో హెస్టర్ తన వద్ద ఉన్న గ్రెనేడ్‌ను సహచర సైనికుడు టిమొతీ నేయిన్‌కు అందించింది. ఆ చిన్న నిర్ణయమే యుద్ధ దిశను పూర్తిగా మార్చేసింది. కానీ హెస్టర్ బృందానికి అచంచల ధైర్యం “ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు” అనే ఉక్కు సంకల్పం. అందుకే వారు మరణాన్నే ఎదుర్కొంటూ నిరంతర కాల్పులతో తిరుగుబాటుదారుల స్థావరాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ ముందుకు సాగారు. చివరికి శత్రువుల ప్రతిఘటన పూర్తిగా చిద్రమైంది. ప్రతిఘటనను పూర్తిగా ఛేదించారు. మరణం అంచుల దాకా వెళ్లిన ఆ కాన్వాయ్ చివరికి సురక్షితంగా బయటపడింది.

ఆమె చూపించిన అచంచల ధైర్యం, మరణాన్ని ఎదుర్కొంటూ సహచర సైనికుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన అసాధారణ సాహసం. యుద్ధభూమిలో చూపించిన అపూర్వ నాయకత్వానికి అమెరికా ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవాల్లో ఒకటైన సిల్వర్ స్టార్ అవార్డుతో ఆమెను సత్కరించింది. యు.ఎస్. ఆర్మీ లో సిల్వర్ స్టార్ అందుకున్న తొలి మహిళా గా "లీ ఆన్ హెస్టర్" చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి…
ఎవరో ఒకరు తమ నిద్రను, తమ భయాన్ని, కొన్నిసార్లు తమ ప్రాణాన్నే త్యాగం చేస్తుంటారు.

లీ ఆన్ హెస్టర్ అలాంటి అరుదైన యోధురాలు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

  ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. ...