30, డిసెంబర్ 2022, శుక్రవారం

శాంతమ్మ ఇంజమూరి

చేయాలనే తపన ఉంటె వయస్సుతో సంబంధంలేదనడానికి ఉదాహరణ   "ఇంజమూరి శాంతమ్మ" . 90  ఏళ్ళ వయసులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అంతేగాక ఆమె ఇంకా ఆరోగ్యాంగా ఉండటం చాల గొప్ప విషయం. ఇప్పటికీ శాంతమ్మ కంటిచూపు మందగించలేదు. బీపీ, షుగర్‌ వ్యాధులు ఆమెకి  దరికి చేరలేదు. ప్రస్తుత కాలంలో 60  ఏళ్ళు పైబడితేనే ఏ పనిచేయలేని పరిస్థితి మరి 90  ఏళ్ళ శాంతమ్మ పని ఎలా చేస్తుందనే సందేహం అందరికి కలగక మానదు. ఆమె ఆత్మస్థైర్యమే ముందుకు నడిపిస్తుంది . ఆమెలోని తపనే పనిచేసుకునేందుకు సహకరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. 

స్ఫూర్తివంతమైన శాంతమ్మ జీవితంగురుంచి మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.


మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పెద్దముప్పారం గ్రామం పద్మశాలికి చెందిన ఇంజమూరి శాంతమ్మ. ఆమె వయస్సు దాదాపు 90 సంవత్సరాలు. శాంతమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సహా 7 మంది సంతానం. మనువళ్లు, మనువరాళ్లు మునిమనువళ్లు కూడా.  కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మనువళ్లు, మనువరాళ్లు సహా అందరూ ఆమెను నవ్వులు పువ్వులు పూయించివారే. ఆమెను చూసుకోవడానికి ఎలాంటి పొరపొచ్చాలు లేని కొడుకులు.  అమ్మంటే అమితమైన ప్రేమ వారికీ. అయినా సరే శాంతమ్మకు కొడుకుల దగ్గర ఉండటంకన్నా తన సొంతూరైన పెద్దముప్పారంలోనే ఉన్నాడటానికి ఆసక్తి చూపుతుంది. పల్లె ప్రాంత పలకరింత, పల్లెప్రజల పులకరింత అన్నట్లుగా. ఎందుకో శాంతమ్మ కు ఊరంటే అంత ప్రేమ.  ఆమెకు 90 ఏళ్ళు నిండిన కర్ర సహాయంతో తడబడని అడుగులు, ఆమెవి అద్దాలు లేకుండా టీవీ చూడగలిగే నేత్రాలు, ఎంతదూరమున్నవారినైనా గుర్తుపట్టే కంటిచూపు, స్వతహగా వంట వండుకొని తినే శక్తి సామర్థ్యం. అంతేగాక మూడుపూటలు తిని అరిగించుకొనే చక్కని ఆరోగ్యం ఆమెది.  ఆమెకు ఎలాంటి కాళ్ళ నొప్పులు లేవు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆమె ఇంజక్షన్ వేసుకోక ఎన్నో ఏళ్ళు గడిచాయి. నిజాం మరియు రజాకార్లు ఆకృత్యాలకు, హింసకు ఎదురొడ్డి నిలిచిన సంఘటనల గురుంచి సవివరంగా ఆమె ఇప్పటికి చెప్పడం గొప్ప విషయం అంతేగాక ఆమెయొక్క అద్భుతమైన జ్ఞాపక శక్తిని మనమందరం అబినందించాలిసిన అవసరం ఉంది. బస్సు, ఆటోల సౌకర్యం లేని ఆ రోజుల్లో ఏ ప్రాంతానికైనా వెళ్లాలంటే కాలినడకే మార్గం అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు శాంతమ్మ ఇప్పటికి వివరించడం చాల గొప్ప విషయం.   

శాంతమ్మ ఇంత ఆరోగ్యాంగా ఉండటానికి కారణం రహస్యమే అనుకుంటే మాత్రం పొరపాటే. ఆరోగ్యాంగా ఉండటానికి ముఖ్య కారణం ఆమె పాటించే ఆహార నియమ నిబంధనలు. అంతకంటే ముఖ్యకారణం ప్రశాంతత వాతావరణంలో ఉండటానికి ఇష్టపడటం మరియు అప్పట్లో రసాయనాలు వాడకంలేని ఆహారం అందింది. కానీ ఈరోజుల్లో అసాధ్యం అనిచెప్పాలి. కోట్లరూపాలున్న ఆరోగ్యాంగా ఉంటామనే గ్యారంటీలేని జీవితాలు ఈ రెండింటి వల్ల అనారోగ్యంపాలవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము అంతేతప్ప ఆహార నియమాలు పాటించడానికి విముఖుత చూపుతాం అందుకే ఆరోగ్యాంగా ఉండాలనే తపన ఉండాలి, ఆరోగ్య నియమాలు పాటిస్తుండాలి. అప్పుడే చక్కని ఆరోగ్యం మన సొంతం.


గత రెండురోజులక్రితం పెద్దముప్పారంలో తన ఇంట్లో ఎలాంటి కర్ర సహాయం లేకుండా  ఇల్లు ఊడుస్తూ కనిపించిన వీడియో నాకెందుకో ఆశ్చర్యమనిపించింది, ఆనందమనిపించింది.   


మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475      



24, డిసెంబర్ 2022, శనివారం

క్రిస్మస్



ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జన్మించి నేటికీ రెండు వేల సంవత్సరాలు గడిచినా భక్తుల మనుసులో ఇంకా  ఆయన అనంత కరుణామయుడిగా, అపార కృపాశీలుడు, లోక రక్షకుడిగా, ప్రపంచ శాంతి దూతగా క్రైస్తవుల ఆరాధనను అందుకుంటున్నాడు.

క్రిస్మస్ డిసెంబర్ 25 న ఎందుకు జరుపుకుంటారు? 

రోమన్ సామ్రాజ్యంలోని నజరేత్ నగరంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒకరోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనిపించి 'ఓ మేరీ! మీరు దేవునిచే ఆశీర్వదించబడ్డారు. నువ్వు కన్యగా గర్భం దాల్చి కొడుకును కంటావు. మీ బిడ్డకు ఏసు అని పేరు పెట్టండి. తాను దేవుని కుమారుడనని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పినట్లే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక రాత్రి అతనికి కలలో దేవదూత కనిపించి, 'మేరీని పెళ్లిచేసుకోవాలి అని చెపుతారు. దేవుడి దీవెనతో ఆమె గర్భవతి అయింది. కనుక ఆమెకు పుట్టిన కొడుకు భగవంతుడు. తనను నమ్ముకున్న ప్రజలందరినీ పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పారు. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకు రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడు అగస్టస్ సీజర్ తన రాజ్య జనాభాను లెక్కించడానికి  మరియు గణాంకాలను సులభంగా సేకరించేందుకు వీలుగా ప్రజలందరూ డిసెంబర్ 25లోగా స్వగ్రామాలకు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. రాజు ఆజ్ఞను అనుసరించి, జోసెఫ్ మరియు మేరీ వారి స్వస్థలమైన బెత్లెహేముకు బయలుదేరారు. తీరా అక్కడికి చేరుకునే సరికి ఆమెకు వసతి దొరకలేదు. చివరకు ఒక సత్ర యజమాని తన గోశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఊరి పక్కనే ఉన్న పొలాల్లో గొర్రెల మందకు కాపలా కాస్తున్నారు కొందరు. ఆ సమయంలో, ఒక దేవదూత వారి ఎదురుగా ఆకాశం నుండి దిగివచ్చింది. దూత చుట్టూ కాంతి వ్యాపించడంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వారితో, 'భయపడకండి, మీకు శుభవార్త తీసుకురావడానికి నేను ఇక్కడకు వచ్చాను' అని చెప్పాడు. ఈరోజు బేత్లెహేములోని ఒక తొట్టిలో మీ అందరికీ ప్రభువు అయిన లోక రక్షకుడు జన్మించాడు. ఒక పసికందును బట్టలతో చుట్టి, తల్లి కడుపులో తొట్టిలో పడుకోబెట్టారు. ఇవే మీకు సంకేతాలు. లోక రక్షకుడని చెప్పాడు. అతను ఈ విషయం గొర్రెల కాపరులకు చెబుతుండగా, ఆ ప్రాంతమంతా పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు భగవంతుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ అదృశ్యమయ్యారు. కాపరులు దేవదూత చెప్పిన గొర్రెల దొడ్డి వద్దకు పరుగెత్తారు. అక్కడ మేరీ, జోసెఫ్‌లు తొట్టిలో పడి ఉన్న శిశువును చూశారు. దేవదూత తమకు చెప్పినట్లు వారు అందరికీ చెప్పారు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల తర్వాత జన్మించాడు. అంటే డిసెంబర్ 25న పుట్టిన రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు.

క్రిస్మస్ చెట్టు కథ ఏంటి?..

చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టిన రోజున, ప్రజలు చర్చికి వెళ్లి ఏదో ఒక రకమైన బహుమతి ఇచ్చేవారు. ఒకరోజు ప్లాబో అనే బాలుడికి పేదరికం కారణంగా ఏమి ఇవ్వాలో తోచక తనకు కనిపించిన ఒక అందమైన మొక్కను తీసుకొని చర్చిలో క్రీస్తు ముందు ఉంచాడు. కొద్దిసేపటికే ఆ చిన్న మొక్క ఏపుగా పెరిగి అందరి కళ్ల ముందు బంగారు రంగును సంతరించుకుంది. ఇది క్రీస్తు ద్వారా లభించిందని నమ్మిన ప్రజలు క్రిస్మస్ చెట్టును పెట్టడం ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు అబుదాబిలోని ఓ హోటల్‌లో ఉంది. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన దీని విలువ ఒక మిలియన్ పది మిలియన్ డాలర్లు. ఇది 181 వజ్రాలు, ముత్యాలు మరియు విలువైన రాళ్లతో అలంకరించబడింది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475


19, డిసెంబర్ 2022, సోమవారం

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట 
 
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు.

మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. 

కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.

మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. అవయవ లోపం ఉన్నా ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధిస్తున్న వారు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి స్ఫూర్తివంతమైన అంధ మహిళల సంకల్ప బలం ముందు అంధత్వం ఓడిపోయింది.  "లక్ష్మీ మీనన్" లోని అచంచలమైన ఆత్మవిశ్వాసమే ఆమెను కొందరు అంధ మహిళల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముందుకు నడిచేలా చేసింది. అంతేగాక కళ్లులేవనే ఆత్మన్యూనతా భావంతో వారు చింతించకుండా వారికి నైపుణ్యమైన శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా చేశారు. ఆమె అందించిన ప్రోత్సాహంతో వారు అంధత్వాన్ని లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసంతో జీవనం కొనసాగిస్తున్నారు.   

కేరళలోని కొచ్చిన్ కి చెందిన లక్షి మీనన్ వృత్తిరీత్యా డిజైనర్ మరియు వ్యాపారవేత్త. ఆమె కొచ్చిన్‌లో 'ప్యూర్ లివింగ్' అనే సంస్థను నడుపుతుంది. హరిత జీవన ప్రాముఖ్యత గురించి సమాజంలో అవగాహనను ప్రచారం చేయడం మరియు నిరుపేదలకు జీవనోపాధి కల్పించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. లక్షి మీనన్ రూపొందించిన అమ్మూమ్మతిరి / విక్స్‌డమ్‌ ప్రాజెక్ట్ క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా కేరళ రాష్ట్రంలోని వృద్ధాశ్రమాలు మరియు అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న ఎంతోమంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. 
లక్షి మీనన్ కళాత్మక ఆలోచనతో "పెన్ విత్ లవ్" అనే ప్రాజెక్ట్ ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఏకైక ఉద్దేశ్యంతో కాగితంతో పెన్నుల తయారీకి శ్రీకారం చుట్టారామె. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 మంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు చేపట్టిన ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రమంతటా విజయవంతమైంది. 
రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉండటం కోసం  "ఆరెంజ్ అలర్ట్" హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు.
ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు పొందారు.   
లక్షి మీనన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం నిరుపేదల జీవనోపాధికి వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. 

అవార్డులు మరియు విజయాలు:

• 'ఆజ్ కీ రాత్ హే జిందగీ' షోలో BBC వరల్డ్ నిర్మించిన స్టార్ ప్లస్‌లో అమితాబ్ బచ్చన్ ద్వారా సత్కారం పొందారు.
• అపెక్స్ సంస్థ అయిన “ఎర్త్ డే నెట్‌వర్క్ గ్లోబల్” ద్వారా అక్టోబర్ 2018లో “ఎర్త్ డే నెట్‌వర్క్ స్టార్‌”గా గౌరవింపబడ్డారు . సీడ్ పెన్‌కు ప్రత్యేక ప్రస్తావనతో పర్యావరణం & జీవావరణ శాస్త్రంలో చేసిన సహకారాల కోసం 195 దేశాలలో 50,000 అనుబంధ సమూహాలు.
• 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు.
• ఆమె ప్రతిష్టాత్మక వనిత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా లెక్కలేనన్ని అవార్డులు  గెలుచుకున్నారు. 
• ప్రఖ్యాత మేరీ క్లైర్ మ్యాగజైన్ యొక్క 'జీనియస్' జాబితాలో చేర్చబడ్డారు
• 2017లో, ఒక ఆన్‌లైన్ మీడియా సంస్థ ఆమెను వారి '10 మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్' జాబితాలో చేర్చింది.

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట:

ఒకరోజు లక్షి మీనన్ సెలవుదినంలో త్రిస్సూర్‌లోని ఆయుర్వేద బీచ్ రిసార్ట్‌ సందర్శన సందర్భంగా  అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు కొబ్బరిచెట్లు ఆమెని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తుండగా తోటమాలి ఎండిపోయిన కొబ్బరి ఆకులను తొలిగించడం ఆమె మదిలో ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది.  పల్లెటూళ్ళలో ఎండు కొబ్బరి ఆకులతో చీపురు తయారుచేయడం సాధారణ విషయం. ఆమె తన చిన్నతనంలో తన తల్లి మరియు అమ్మమ్మతో చీపుర్లు తయారు చేసిన సంఘటనలను గుర్తుచేసుకొని అక్కడున్న కొబ్బరి ఆకు పుల్లలతో చీపురు తయారుచేసే ప్రక్రియను ప్రారంభించారు. అలా ఆమె రోజుకు ఐదు చీపుర్లను సులభంగా తయారు చేయగలమన్న విషయాన్ని గ్రహించింది. అయితే చీపురు కట్ట మొదళ్ళను దగ్గరగా అదిమిపెట్టి ఉంచడానికి సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్‌కు బదులుగా టైలర్ షాపులోని తుక్కు గుడ్డ ముక్కలను ఉపయోగిస్తే బాగుంటుందని నిర్ణయించుకుంది. దీని వెనుక ప్రధాన కారణం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడడం. ఇలా తయారైన ఒక్కో చీపురు 250 రూపాయలకు అమ్మగలమనిపించింది ఆమెకు.  
ఆమె తయారుచేసిన మొదటి రెండు చీపురుర్లనూ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిని తన ఇంటి ఆవరణంలోని గోడకు అమర్చి ఆ చీపురు కట్టల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా తన మిత్రులకు, బంధువులతో పంచుకున్నారు. అవి చూసిన ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అనుచరులు వెంటనే వాటికోసం ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత కేరళ అంధుల ఫెడరేషన్ గురించి తెలుసుకున్న ఆమె అంధ మహిళలకు సహాయపడే కార్యాచరణ గురించి ఆలోచన చేయమని తన స్నేహితురాలు చేసిన సూచనపై దృష్టి సారించింది. ఆ మరుసటి రోజే ఫెడరేషన్ ను  సందర్శించి చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి తన ప్రతిపాదనను వారికి సవివరంగా వివరించగా చూపులేకపోయినప్పటికీ వారు దృఢసంకల్పంతో సానుకూలంగా స్పందించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. "చూల్" అంటే మలయాళం భాషలో చీపురు అని అర్థం. అలా సంగీతపరంగా సరికొత్త అక్షరాన్ని జోడించి "చూలాల" అని పేరు పెట్టారు.  దంలోని ప్రతి వ్యక్తి సగటున ర్లను తయారుధీమా ఏర్పడ్డాక అందుకుకల్పించడం ముమ్మరంగా ప్రయత్నించి ఈ చీపురు కట్టలను ఆర్టిసానల్ చీపురు విభాగంలో భాగంగా ఉంచాలని నిర్ణయించుకుంది. 
చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి ఆమె చొరవ తీసుకుని కేరళలోని విమానాశ్రయ అధికారులతో పాటు ఇతరులతో చర్చలు జరిపి అన్ని షాపుల్లో ఈ చీపుర్లు అందుబాటులో ఉండేలా చూసి "ఇది మన రాష్త్రం నుండి మీకు ఇవ్వబడుతున్న ఉత్తమ జ్ఞాపకం" అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజానికి ఇవి దృష్టి లోపం ఉన్న మహిళలచే ఎంతో కళాత్మకంగా తయారుచేయబడిన వెలకట్టలేని చీపురుకట్టలు. వైకల్యం మనిషికి తప్ప మనుసుకు కాదని నిరూపించిన ఈ మహిళా బృందానికి మరియు ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన లక్ష్మి మీనన్ కృషి బహుదా ప్రశంసనీయం.     

పెన్ విత్ లవ్:

 పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి చెట్లను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో “పెన్ విత్ లవ్” అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఆమె పెన్ తయారీకి ప్లాస్టిక్ బదులుగా కాగితాన్ని ఉపయోగించి పెన్ చివరభాగాన అగస్త్య చెట్ల విత్తనాలను అమర్చేలా డిజైన్ చేశారు. ఈ తరం వాళ్ళకి అగస్త్య వృక్షం గురుంచి అంతగా తెలియదనే చెప్పొచ్చు. ఆమె సుదీర్ఘ అన్వేషణ మరియు కృషి తర్వాత ఈ విత్తనాలను సేకరించారు.
అగస్త్య వృక్షాలలో ఔషధ గుణాలు అధికంగా ఉండటమే గాక ఆ చెట్టు ఆకులు మరియు పువ్వులు థైరాయిడ్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఎంతో ప్రత్యేకతలున్న ఈ పెన్ ఒకసారి వాడి పడేస్తే పెన్ చివరి భాగంలో ఉండే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయనే ఉద్దేశంతో రూపొందించారు. ఎదిగిన చెట్టు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుందని,  పర్యావరణాన్ని కాపాడడంకోసం మీరు ఒక పెన్ కొంటే సరిపోతుందని ఆమె నినాదం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మంది దృష్టి వైకల్యమున్న మహిళలు జీవనోపాధి పొందుతున్నారు.
2016 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మెగాస్టార్ మమ్ముట్టి చేత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. తొలి ఏడాది లక్ష పెన్నులు విక్రయించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, కేవలం నాలుగు నెలల్లోనే ఆ లక్ష్యాన్ని సాధించడం కొస మెరుపు.
ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది మహిళలలో ఒకరిగా ఎంపిక చేయబడటం గొప్ప విషయం. 

వరద బాధితులకు అండగా:

2018 వరదల కారణంగా అతలాకుతలమైన చేనేత కార్మికుల గ్రామమైన చేందమంగళంలో పుట్టిన 'చెక్కుట్టి' బొమ్మలు ఐక్యరాజ్యసమితి వరకు ప్రయాణించి ప్రేమ, కరుణ సందేశాన్ని ప్రపంచం నలుమూలల తెలిసేలా చేశాయి. చెందమంగళంలో వరదల కారణంగా చెడిపోయిన చేనేత వస్త్రాలతో తయారైన 'చెక్కుట్టి' బొమ్మలు భారత్‌లో రూ.25కు అమ్ముడుపోగా, విదేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా వసూలైన మొత్తాన్ని వరదలలో సర్వస్వం కోల్పోయిన నేత కార్మికులకు పంచారు. లక్షి మీనన్ వరద బాధితులకు అండగా నిలిచింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే గాక వారికి ఆర్ధిక   సహాయం అందించడం గొప్ప విషయం. 

మత్స్యకారులకు అభినందనల వెల్లువ:

వరదల సమయంలో రక్షకులుగా మారిన మత్స్యకారుల కోసం ఆమె ప్రవేశపెట్టిన బీమా పథకం విజయవంతమైంది. కేవలం రూ. 24 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా ఎవరైనా మత్స్యకారులను స్పాన్సర్ చేయవచ్చు. దీనిని ప్రోత్సహించడానికి, కేరళలోని వివిధ క్యాంపస్‌ల విద్యార్థులు మత్స్యకారులపై ప్రేమ అనురాగాలతో కూడిన సందేశాలను తెలియజేయడానికి పేపర్ బోట్‌లను తయారు చేశారు. ఆ పేపర్ బోట్‌లను ఇప్పుడు కొచ్చిలోని నిఫ్ట్ క్యాంపస్‌లో ప్రదర్శించడం గమనార్హం. 

లక్షి మీనన్ ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ద్వారా ఎందరో దృష్టి లోపం గల మహిళలు జీవనోపాధిని పొందుతున్నారంటే అందుకు కేరళ రాష్ట్రమే గాక భారతదేశం గర్వించదగ్గ విషయం.
 
రచన:
కోట దామోదర్ 
మొబైల్: ⁨+91 93914 80475⁩







13, డిసెంబర్ 2022, మంగళవారం

రైతుని రాజుల చూడాలి




దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవాడు జవాన్.. (సైనికుడు),

మనిషి ఆకలిని తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించేవాడు కిసాన్ (రైతు)..

దేశాన్ని కంటికి రెప్పలా రక్షించే జవాన్ ఎంత ముఖ్యమో, దేశ ప్రజల క్షుద్బాధ (ఆకలి) నుండి మనల్ని రక్షించే అన్నదాతకూడా అంతే ముఖ్యం.

ఈ ఇద్దరి శ్లాఘనీయ సేవలకు గుర్తింపుగా“జై జవాన్”, “జై కిసాన్”నినాదాలతో మన దేశం వారిని కీర్తిస్తుంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు. మనిషి జీవనానికి ఆహారం అత్యవసరం, ఆహారాన్ని సృష్టించే రైతన్నే లేకుంటే మనిషి జీవించడం అసాధ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక అని రైతుల‌ను అభివ‌ర్ణిస్తారు. అందుకే  'రైతే రాజు' అన్నారు.

రైతు నాయకుడు (రైతు బంధు):  

భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత కర్షక నాయకుడు చౌదరి చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1902న ఉత్తరప్రదేశ్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం జరిపిన అహింసా పోరాటంలో చరణ్ సింగ్ మహాత్మా గాంధీని అనుసరించడమే కాక అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1930లో, ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ వారు అతన్ని 12 సంవత్సరాలు జైలుకు పంపారు. స్వాతంత్య్రానంతరం అయన రైతు ప్రయోజనాలకోసం, రైతు చట్టాలకోసం ఎనలేని కృషిచేశారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై పరిభ్రమించేవి. ఆయన ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో కీలకపాత్ర పోషించి రైతులకు మేలు చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కరణ చట్టాలలో మార్పుల కొరకు జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలనీ అనేక ఉద్యమాలు చేపట్టి జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని చౌదరి చరణ్ సింగ్.  రైతు చట్టాల మార్పు కోసం కృషి చేసిన చరణ్ సింగ్ “రైతు బంధు” గా పేరుగాంచిరైతుల మనస్సులలో ప్రత్యేక ముద్ర వేశారు.  రైతుల కోసం చరణ్‌సింగ్ చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం “జాతీయ రైతు దినోత్సవం" గా ప్రకటించింది. కర్షక లోకానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనసమాధికి“కిసాన్ ఘాట్”గా నామకరణం చేసారు.

హరిత విప్లవం:

హరిత విప్లవం 1961లో ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్న సమయంలో ఈ విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని "రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్" ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించేందుకు కృషి చేసింది. అప్పటి భారత వ్యవసాయ మంత్రి MS స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. భారత ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉన్నప్పటికీ, గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుండి దిగుమతి చేసుకున్నారు మరియు పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. అది భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.

హరిత విప్లవంలోని ప్రధానాంశాలు:

1 . అధిక దిగుబడి వంగడాల వినియోగం.

2 . రసాయన ఎరువుల క్రిమిసంహారక మందుల వినియోగాన్ని పెంచడం.

3 . నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి.

4 . వ్యవసాయ యాంత్రికీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్దతులను అమలు చేయడం.

ఇవే కాకుండా భూసంస్కరణల అమలు, గ్రామీణ విద్యుతికరణ, మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపనలాంటివి కూడా హరిత విప్లవంలో భాగమే..  
హరిత విప్లవం కారణంగా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులతోపాటు పంటల దిగుబడి పెరిగింది. ఆహారధాన్యాలల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.

బ్రహ్మ కంటే గొప్ప:

రైతుని చిన్నచూపు చూస్తున్న ప్రతిఒక్కరు అన్నంలేనిదే మనం బ్రతకలేమన్న విషయాన్నీ గమనించాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మనిషికి ఎన్ని కోట్లరూపాయలున్నాఅన్నంతినే బ్రతకాలి తప్ప అన్నంలేనిది బ్రతకలేడు. మనిషి బ్రతికున్నంతవరకు అన్నం తప్పనిసరి. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నం పండించే రైతులు బ్రహ్మ కంటే గొప్పవారు. ప్రపంచానికి అన్నం పంచే రైతును "అన్నదాత" గా అభివర్ణించారు మన పూర్వీకులు.

రైతు చట్టాలు మారినా, రైతు కష్టాలు మారలే..

మన దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తున్నాయి కానీ ఒక వ్యవసాయరంగం మాత్రమే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయం. సారవంతమైన భూములు, తగినంత నీరు, సకల సౌకర్యాలన్నీ ఉన్నా గిట్టుబాటు ధరలేక రైతు మనుగడ సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వాలు చెబుతున్నా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో మాత్రం క్రియాశూన్యంగా ఉంటున్నాయి.  ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణమాఫీలు కేవలం వ్యవసాయం చేయని భూస్వాములకుఅందుతున్నాయి తప్ప భూమిలేక ప్రత్యక్షంగా దుక్కి, దున్ని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు మాత్రం అందడంలేదు. 10 ఎకరాలకంటే ఎక్కువఉన్న రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలు అందుతున్నాయి కానీ గుంట భూమిలేని కౌలురైతుకి రుణాలందకపోవడం శోచనీయం. ఒక వైపు గిట్టుబాటు ధరలేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వంనుండి వచ్చే రుణాలందక కౌలురైతు వ్యవసాయంపట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాణ్యమైన విత్తనాల కొరత వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. రైతు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతుధర గిట్టుబాటుధరలేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చడంకొరకు రైతులు  కూలీలుగా మారుతున్నారు.  కొందరు ఇతర పనులమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరికొందరు రైతులు భూములను కౌలుకిచ్చి పట్టణప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది రైతులు ప్రభుత్వ రుణాలందక పంట పండించడానికి  అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 

 

కోట దామోదర్

మొబైల్ : 9391480475


5, డిసెంబర్ 2022, సోమవారం

చెదిరిన "క్షౌరవృత్తి"




చెదిరిన "క్షౌరవృత్తి":

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి) కి ప్రాచీన చరిత్ర ఉంది.

మనుషులను జంతువులనుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తి కి ఉందనడంలో అతిశయోక్తిలేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు.
భారతదేశంలో కులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందునుండే ఈ వృత్తి ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని “నాయీ బ్రాహ్మణులు” (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి చేసే వారిని ఒక్కొక్క ప్రాంతంలోఒక్కో పేరుతో ప్రత్యేకంగా పిలుస్తారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపరంగా ఈ వృత్తిని నిర్వహించేవారిని "నాయీ" లుగా పిలుస్తుంటారు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.

తొలివైద్యుడు:

చారిత్రక ఆధారాల ప్రకారం క్షురకులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యులు శస్త్రచికిత్సప్రారంభించడానికి వైద్యుడి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లేడ్లు ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.

మొదటి వైద్యురాలు (మంత్రసాని):

గతంలో ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్టు) బదులుగా ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశువు జననం వరకు ‘మంత్రసాని’గా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం.
అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు.
కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది.
వైద్య, విద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
 
మంగళ వాయిద్యాల ప్రత్యేకత:

ప్రాచీన కాలం నుండి నాయీ బ్రాహ్మణులు(మంగళి) క్షౌరవృత్తి తో పాటు సంగీతం (మంగళ వాయిద్యాలు వాయించడం), వైద్యం కూడా వృత్తిగా నిర్వహించేవారు.
మంగళ వాయిద్యాలువాయించడంలో వీరు నిష్ణాతులు. మంగళ వాయిద్య సంగీతంలో భాగంగా వీరు సన్నాయి (నాదస్వరం),డోలు(శృంగభేరి) వాయించడం ఆనవాయితీగా వస్తోంది.
నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగంగా కొనసాగుతోంది. హిందూ దేవాలయాలలో దైవారాధనకువేదాలలోఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకుకూడా అంతే ప్రాధాన్యత ఉంది.నాదోపాసన చేయడం సాక్షాత్తూఆ పరబ్రహ్మను పూజించడమేనని భగవద్గీత పదవ అధ్యాయం 22వ శ్లోకంలో ప్రస్తావించబడింది.

హిందూ దేవాలయాలలో, నాదస్వరం వినిపించడం సర్వసాధారణ విషయం. గర్భాలయంలో ప్రతిష్టమైన దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనకు ముందు మంగళ వాయిద్యాలను వాయించడం మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహం, నూతనగృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు బ్రాహ్మణుడివేద మంత్రాలకుఎంత ప్రాముఖ్యత ఉందో మంగళ వాయిద్యాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

పుణ్యక్షేత్రాలలో నాయీ బ్రాహ్మణుల పాత్ర:

హైందవ సాంప్రదాయంలో పుట్టు వెంట్రుకల తొలగింపుకు చాలా ప్రాధాన్యముంది. ఈ ప్రక్రియను ఒక వేడుకగా నిర్వహించడం మనందరికీ తలుసు. అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం కలగడం సహజమే. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం ఒక ఆచారంగా మారింది. దైవ క్షేత్రాలలో “కళ్యాణ కట్ట” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో భక్తుల తలనీలాలను దేవునికి సమర్పించేందుకు తమ సేవలందిస్తారు కేశఖండనకారులు.
మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో అంతర్లీనంగా ఎన్నో శాస్త్రీయ అంశాలు దాగి ఉంటాయనేది నిర్వివాదాంశం. ఈ ఆచారవ్యవహారాలలో భాగమే "పుట్టువెంట్రకుల" వేడుక ఒకటి.

వివాహంలో నాయీ బ్రాహ్మణులపాత్ర:

సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత పందిట్లో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తాడు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు తొలగించి శుభ్రం చేస్తారు.

కేశాలంకరణ(క్షౌరవృత్తి):

మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉంచడానికి శుభ్రపరచడంశుభ్రంగా మరియుమరియు అందంగా మార్చడం "నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తి". పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి "కేశఖండనకేశఖండనం". మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. "ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచక తప్పదుాలి" అనేది జగమెరిగిన నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం . ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళానైపుణ్యం అనివార్యంఎంతో ప్రత్యేకం.

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో ఈ వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
 
రచయిత:

కోట దామోదర్
మొబైల్: 9391480475

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...