28, ఫిబ్రవరి 2023, మంగళవారం

ద‌ర్జా‌ కోల్పోతున్న ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం:

ద‌ర్జా‌ కోల్పోతున్న ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం:

దారం ఎంత ఖరీదైనదైనా.. నేతన్న లేకుండా వస్త్రం తయారుకాదు.

దారం మానవ వస్త్రానికి ఆధారం, నేతన్న లేనిదే వస్త్రం లేదు. 

బట్ట ఎంత ఖరీదయినా టైలర్ (దర్జీ) కుట్టకపోతే ఆ గుడ్డకు విలువ లేదు.

వస్త్రానికి దారం ఎంత ముఖ్యమో, మనిషికి బట్టలు తయారు చేయడంలో దర్జీ (టైలర్) కూడా అంతే ముఖ్యం.

నేతన్న, దర్జీ లేని సమాజాన్ని ఊహించలేం. శరీరాన్ని అందంగా తీర్చిదిద్దే బట్టలు, ఆడంబరమైన దుస్తుల డాంబికతను సూచించడంతో పాటు వ్యక్తి యొక్క సంస్కారాన్ని తెలియజేస్తాయి.

నాగరికత అభివృద్ధి చెందుతున్న సమయంలో అందుబాటులోకి వచ్చిన అనేక ఆవిష్కరణలు మానవ జీవితాన్ని సుఖవంతం చేశాయి. కుట్టు యంత్రం మానవజాతి చరిత్రలో ఇప్పటివరకు చేసిన అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఆవిష్కరణలలో ఒకటిగా పేర్కొనబడింది. ఎలియాస్ హోవే తన భార్య పడుతున్న శ్రమ ని తగ్గించడానికి అవిశ్రాంతంగా కృషి చేసి  ఫిబ్రవరి 28న మొదటి కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడు. అందుకే అదే రోజు వరల్డ్ టైలర్స్ డే జరుపుకుంటారు.

మొట్టమొదటిసారిగా ఎలియాస్ హోవే అనే అమెరికన్ మెషినిస్ట్ 1845లో మొట్టమొదటి కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడు. ఎలియాస్ హోవే ఒక పేద కుటుంబానికి చెందినవాడు. ఆయన పత్తి కర్మాగారంలో యంత్రం మెషినిస్ట్ గా పని చేసేవారు. హోవే జీతం తక్కువ ఉండటంవల్ల  కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉండేది. అందుకే అతని భార్య ఇంట్లో ఇతరులకు కూడా చేతితో బట్టలు కుట్టేవారు. ఆమె చేతితో కుడుతున్న పనిని చూస్తూ, ఆమె శ్రమను గుర్తించి హోవే చేతి కుట్టు ప్రక్రియను యాంత్రికీకరించే మార్గాలను దృశ్యమానం చేశారు,  ఆమె పడుతున్న శ్రమను తగ్గించడానికి ఆరు నెలలు అవిశ్రాంతంగా కృషి చేసి కుట్టు యంత్రం కనిపెట్టాడు. మొదటిసారిగా 1845లో ఫిబ్రవరి 28న కుట్టుమిషన్‌ను కనిపెట్టాడు. 1846లో యునైటెడ్ స్టేట్స్‌లో పేటెంట్ పొందింది కానీ చాలా  కాలం వరకు తన ఆవిష్కరణకు సరైన గుర్తింపు లేకపోవడంతో నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాడు. కొన్ని సంవత్సరాల తరువాత యునైటెడ్ స్టేట్స్ వారు తన పేటెంట్‌ను ఉల్లంఘించి కుట్టు మిషన్లను తయారు చేసి విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు, కోర్టులో అనేక వ్యాజ్యాల తర్వాత, అతను 1854లో తన హక్కులను గెలుచుకున్నాడు. అనేక దేశాలు అతని యంత్రాన్ని పరీక్షించి, మరిన్ని కుట్టు యంత్రాలను తయారు చేసేందుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి.  ప్రపంచ చరిత్రలో అత్యంత ఉపయోగకరమైన యంత్రంగా  ప్రపంచం మొత్తం గర్వపడేలా తన కుట్టు యంత్రాన్ని రూపొందించాడు. ఆయన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 14, 1940 న విడుదలైన ఫేమస్ అమెరికన్ ఇన్వెంటర్స్ సిరీస్‌లో హోవే 5-సెంట్ స్టాంపుతో స్మారకంగా ఉంచబడింది. అంతేకాకుండా ఆయన శ్రమకు ఫలితంగా హోవే జీవిత చరిత్రను 1965 లో బీటిల్స్ సినిమా ద్వారా తెరకెక్కించారు. ఎలియాస్ హోవే 48 సంవత్సరాల వయస్సులో అక్టోబర్ 3, 1867 న అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఎలియాస్ హోవే ఫిబ్రవరి 28న కుట్టుమిషన్‌ను ఆవిష్కరించిన రోజున ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మన దేశంలో టైలర్ వృత్తి పై ఆధారపడి జీవించే వారు  చాలా మంది ఉన్నారు. పూర్వకాలంలో మేర వారు మాత్రమే బట్టలు కుట్టేవారు కాలక్రమేపి పద్మశాలీలు కుట్టేవారు. ప్రస్తుతం అన్నివర్గాల వారు టైలరింగ్‌లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. రెడీమేడ్ బట్టలు మార్కెట్ లోకి రాకముందు టైలర్లకు చేతినిండా పని ఉండేది. ఒకప్పుడు పండుగలకు 20 రోజుల ముందే గిరాకీ ఉండేది. అందరూ పండుగ ఆనందంలో కుటుంబ సభ్యులు గడుపుతుంటే, దర్జీలు మాత్రం పండుగ ఆనందాన్ని పొందే వారు కాదు కనీసం తినటానికి సమయంలేని సందర్భాలు ఉంటాయి. దర్జీలు సుఖమెరుగని కష్టజీవులు. పెళ్లిళ్లకు, పండుగలకు, శుభకార్యాలకు, అన్ని కార్యాలకు బట్టలు కుట్టించే వారు కానీ నేడు రెడీమేడ్ బట్టలు విరివిరిగా మార్కెట్ లోకి రావడం వల్ల టైలర్స్ ఉపాధి కోల్పోతున్నారు. ఒకప్పుడు పని ఉన్నా ఆదాయం అంతంత మాత్రమే అయినా కుటుంబాన్ని పోషించడానికి ఈ వృత్తినే ఎంచుకున్నారు. రెడీమేడ్ డ్రెస్సెస్ రావడంతో గిరాకీ గణనీయంగా తగ్గింది దీంతో  టైలర్ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. టైలరింగ్‌పై ఆధారపడి జీవిస్తున్న వారు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక జీవనోపాధి పొందలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా వృత్తి కొనసాగిద్దామంటే అనుకోకుండా, కరోనా మహమ్మారి  వీరి వృత్తిని మరింత జీవనోపాధి లేకుండా చేసింది. కనీసం పూట గడవని పరిస్థితి నెలకొంది. కొందరు ఈ వృత్తిని వదిలి ఇతర వృత్తుల పై ఆధారపడి జీవిస్తుండగా మరి కొందరు మాత్రం ఈ వృత్తి మాకు జీవనాధారం కొనసాగిస్తున్నారు. రెడీమేడ్ దుస్తువుల నాణ్యతా లోపం వల్ల ఇప్పటికి  కొందరు టైలర్స్ చేత కుట్టించుకోవడం సంతోషించాల్సిన విషయమే కాక వారి యొక్క పని నైపుణ్యానికి నిదర్శనం కూడా. 

కుదేలవుతున్న కుట్టు మెషిన్:

నేడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉండేలా ఫ్యాషన్ డ్రెస్ ఉత్పత్తుల పరిశ్రమలు విస్తరించాయి. కొత్త కొత్త డిజైన్లతో టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లు, షాట్లు, రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. యువత ఆసక్తిని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పెద్ద కంపెనీలు నగరాలతో పాటు చిన్న పట్టణాలు మరియు గ్రామాలకు విస్తరించాయి. దీంతో గ్రామంలో నివసించే వారు సైతం స్టైల్ వైపు ఆకర్షితులై రెడీమేడ్ పై మక్కువ చూపుతుండటంతో టైలర్లకు  ఉపాధి కరువవుతోంది. మార్కెట్లో దొరికే బట్టలు నాణ్యత లేకపోయినా ఫ్యాషన్ డిజైన్ మోజులో పడి టైలర్ తో కుట్టించుకునేవారు గణనీయంగా తగ్గిపోయారు. నాడు పెళ్లిళ్లకు టైలర్స్ తో కుట్టించుకునే యువత నేడు షాపింగ్ మాల్స్ లో కొంటున్నారు. అంతే కాకుండా దుస్తుల తయారీకు సంబంధించిన ముడి సరుకు‌ ధరలు పెరగడంతో టైలర్స్ కి గిట్టుబాటు ధర లేక వృత్తికి తిలోదకాలు వదిలే పరిస్థితి ఏర్పడింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఫ్యాషన్ దుస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో మహిళా టైలర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారు. పిల్లలను చదివించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక టైలరింగ్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం టైలర్స్ కి సరైన ఉపాధి కల్పించాలి.

రెడీమేడ్ రాకతో ఉపాధి కోల్పోయిన టైలర్స్ కి ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్పిటల్ లో ఇతర ప్రభుత్వ రంగాలలో యూనిఫాం వంటి పనులు టైలర్స్ కి ఇచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యూనిఫామ్ వంటి పనులు చేనేత కార్మికులు మరియు టైలర్స్ కి ఇవ్వడం వల్ల రెండు రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశముంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్స్ కి ఉపాధి కల్పించడంలో సరైన ఆలోచన చేయాలి.

ఆరోగ్య సమస్యలు;

టైలర్ పనిచేసే వారు అనేక  ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరాయంగా కూర్చొని పని చేయడం వల్ల కంటి చూపుతో పాటు వెన్ను నొప్పి, మోకాళ్ళ, ఆర్థో సమస్యలు పెరుగుతున్నాయి. ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల  స్థూలకాయ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.  ముఖ్యంగా సమయానికి దుస్తులు ఇవ్వాలనే ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలతో పాటు ఇతరత్రా రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్య బీమా సదుపాయం అందకపోవడంతో టైలర్లంతా ఆందోళన చెందుతున్నారు.

రెక్కాడితే గాని డొక్కాడని టైలర్స్ కి ఎన్నికల సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రతి టైలర్ కి కుట్టు మెషిన్ అందజేస్తామని ప్రగల్భాలు పలికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నేడు టైలర్లను నిర్లక్ష్యం చేయడం బాధాకరం.

ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఉచితంగా కరెంటు, హెల్త్ కార్డు, కుట్టుమిషన్ అందించి టైలర్ల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. అంతరించిపోతున్న కళను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 







 


  


19, ఫిబ్రవరి 2023, ఆదివారం

పెళ్ళంటే నూరేళ్ల పంట..


పెళ్ళంటే నూరేళ్ల పంట.. 

పెళ్ళంటే నూరేళ్ల పంట, అది పండాలి. కోరుకున్న వారి ఇంట..

మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు..

ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు..

పెళ్లి ప్రాముఖ్యత గురించి దాశరథి గారు రాసిన మీనా చిత్రంలోని పాట అక్షరాలా నిజం.

పూర్వకాలంలో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా,  బంధుమిత్రులతో 

ఇరు కుటుంబాల వారు కలిసి పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించేవారు. కానీ నేటి పెళ్లిళ్లలో ఒకప్పటి సందడి కనిపించడం లేదు.

గతంలో పెళ్ళంటే వదువరులను ఒకటిగా చేయడమే కాకుండా రెండు కుటుంబాలు కలవడం అంతేగాక ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, ఇరు వర్గాల వారిని కలిపే ప్రత్యేక వేడుక. ఇలా పెళ్లి వేడుకలో ఒకటైన ఇరు కుటుంబాల బంధాలు విడదీయరాని సంబంధాలుగా ఏర్పడి, ఆత్మీయానురాగాలతో పెనవేసుకొని వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతుండేవి. అలా కొనసాగుతున్న బంధుత్వ ప్రక్రియలో మరికొన్ని వివాహాలు ఏర్పడి విడదీయరాని బంధాలుగా కొనసాగుతుండేవి. 

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ ప్రారంభమవుతుంది, నిశ్చితార్థం లో మరియు వధూవరుల నక్షత్ర బలాన్ని చూసి ముహూర్తం నిర్ణహించేవారు. తర్వాత ఆహ్వాన పత్రికలు (శుభలేఖలు) ముద్రించుకుని 20 రోజుల ముందే సంప్రదాయబద్దంగా బంధుమిత్రులందరికి ఇంటికి వచ్చి శుభలేఖలు పంచేవారు. వివాహ కార్యక్రమానికి బంధువులు వారం రోజుల ముందే వచ్చి పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన తాటాకు పందిళ్లు మరియు ఇంటి అలంకరణ వంటి పనులు చేసేవారు. ఇప్పుడు అయినవారికి కూడా రెండు రోజులు ఉందనగా ఇంటికి రావడానికి సమయం లేదని వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. ఇంటికి రావడానికి సమయం లేనివాడి పెళ్ళికి పోయి మన సమయం వృధా చేసుకోవడం ఎందుకని పెళ్లిళ్లకు పోనివారు కొంతమంది ఉన్నారు. కానీ ఆనాటి సంప్రదాయ పద్ధతులు నేటి పెళ్లిళ్లలో కనిపించకపోవడం శోచనీయం.

మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, అన్ని రంగాలు  మార్పులు చెందిన విషయం మనందరికీ తెలిసిందే. కాలానుగుణంగా వివాహ వేడుకల్లో కొన్ని మార్పులు వచ్చాయి. నేటితరం వారు మానవ సంబంధాలన్నీ మరిచి ఆర్ధిక సంబంధాలతో కలిసి అడుగులేస్తుండడంతో బంధుత్వాలు బలహీనపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారి పిల్లలు ఇప్పుడు కలిసి ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఒకే తల్లికి జన్మించిన పిల్లలే కలిసుండలేక కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మనిషి మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో విఫలం కావడం వలన సమాజంలో మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో బంధుమిత్రుల ద్వారానే పెళ్లి సంబధాలు కుదిరేవి.

"వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలన్నారు" మన పూర్వికులు కానీ నేడు బంధువులు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయి పెళ్లి సంబంధాలు చూడాలంటే  భయపడే పరిస్థితి వచ్చింది.

అందుచేత నేటి తరం వారు పెళ్లి సంబంధాల కొరకు మ్యారేజ్ బ్యూరో లను ఆశ్రయిస్తున్నారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత పెళ్లి చేస్తే ఓ పనై పోతుందనుకుంటే సంబంధాలు అంత తేలిగ్గా దొరకడం లేదు. 

వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?:

ఒకప్పుడు తల్లిదండ్రులు సంతానం విషయంలో ఆడ, మగ ఎవరైనా దేవుడు వరంగా  భావించేవారు. ఆర్థిక స్థోమతును కూడా దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేక ముగ్గురితో  సంతానానికి ముగింపు పలికారు. ఆ కాలంలో ఆడపిల్లలు పుడితే వారిని చదివించడం, పెంచడం, పెళ్లి చేయడం వంటివి తల్లిదండ్రులు భారంగా భావించేవారు. అదే అబ్బాయిలు అయితే ఎంత ఖర్చయినా ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తారని, అదే విధంగా వివాహం చేస్తే వచ్చే కోడలు తెచ్చే కట్న కానుకలతో కుటుంబం ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో మగ బిడ్డే కావాలని కోరుకున్నారు. మొదటి కాన్పులో అమ్మాయి పుడితే రెండవ కాన్పులో అబ్బాయి కోసం ఎదురు చూసేవారు.అదేవిధంగా మొదటి కాన్పులో అబ్బాయి పుడితే రెండవ కాన్పులో అమ్మాయి పుడుతుందనే భావంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌  చేయించునేవారు. ఫలితంగా, సాధ్యమైన ప్రతిచోటా చట్టవిరుద్ధమైన గర్భ లింగ పరీక్షలు జరిగాయి. నేడు యువతీ యువకుల నిష్పత్తిలో తేడాలు పెరగడానికి ఇదో కారణం.

యువకుల సంఖ్యకు అనుగుణంగా యువతులు లేకపోవడం, ఉద్యోగం చేసి సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకపోవడం, అమ్మాయిలు అబ్బాయిలతో రాజీ పడకపోవడం, అమ్మాయిలు కోరుకున్నట్లు యువకులు దొరకడం లేదు, ఒకే చదువు ఒకేరకమైన ఉద్యోగం ఉన్నవారు కావాలని కోరుకోవడం,  అబ్బాయికి ఆస్తితో పాటు ఉన్నత చదువు ఉండాలి మరియు లక్షల్లో జీతం ఉండాలనే ఆలోచన అమ్మాయిలలో ఉండటం అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత వివాహం చేసుకోవాలనే సంకల్పం కారణంగా అబ్బాయిల వివాహాలు ఆలస్యమవుతున్నాయనేది వాస్తవం. 

వివాహాలు ఆలస్యంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యలు:

వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. ఈ మధ్య కాలంలో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్న విషయం వాస్తవం. ఇది వరకు రెండు పదులు దాటితే పెళ్లి చేసుకునే వారు కానీ ఇప్పుడు మూడు పదులు దాటిన పెళ్లి చేసుకోవడం లేదు. ఉద్యోగంలో స్థిరపడనిదే పెళ్లి వద్దంటూ అనేక కారణాలవల్ల యువత 35 సంవత్సరాలు దాటినా పెళ్లి ప్రస్తావన మాట్లాడని వారున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఆలస్యంగానే అవుతారు. అలా జరగడం వల్ల, వృద్ధాప్యానికి వచ్చేసరికి పిల్లలు జీవితంలో సరిగ్గా స్థిరపడక. ఇంకా వారిపైనే ఆధారపడుతున్నారు. కానీ వయసు పెరిగే కొద్దీ పని చేసే శక్తి తగ్గుతుంది. అలాంటి సమయాల్లో పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ వీరికి వయస్సు మీద పడి పని చేసే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో వీరు పిల్లలపై ఆధారపడాలి. కానీ వారే సెటిల్ కాకుండా ఉంటే. పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

గణాంకాల ప్రకారం పెళ్లి కాని వారు:

ప్రభుత్వ గణాంకాల ప్రకారం పెళ్లి కాని వ్యక్తుల నిష్పత్తి 2011లో 17.2 శాతం ఉండగా, 2019లో 26.1 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ నివేదిక ప్రకారం, వివాహం చేసుకోని యువత జనాభా (15-29 సంవత్సరాలు) శాతం వాటా పురుషుల జనాభాలో 2011లో 20.8 శాతం నుండి 2019లో 26.1 శాతానికి పెరుగుతుంది. అవివాహిత స్త్రీల నిష్పత్తి 2011లో 13.5 శాతం నుంచి 19.9 శాతానికి పెరిగింది. 2019లో, జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి చేసుకోని వారి సంఖ్య అత్యధికంగా పరిగణించబడింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి.

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అత్యల్ప శాతం  స్థానాల్లో ఉన్నాయి.

పెళ్లి వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతుంది:

ప్రేమతో పెనవేసుకున్న బంధాలు కొంతకాలానికి అనూహ్య కారణాలవల్ల విడిపోతున్నవారిని ఈ సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. ఒకప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు కొంత కాలానికి ధ్వేషంతో ఎందుకు రగిలిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు అనే ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవపడుతు ఇగోలతో రగిలిపోతు విడాకులు తీసుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇలా జరుగుతున్న సంఘటనలను ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేయడం వలన యువత భయపడి పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపుతున్నారు. కోట్ల ఆస్తులున్న కూడు పెట్టని కొడుకులున్న సమాజంలో జరుగుతున్న యదార్థ  సంఘటనలను చూసి తల్లిదండ్రులు కూడా అబ్బాయిల పెళ్లిళ్లు చేయాలంటే భయపడుతున్నారు. ఆడపిల్ల వద్దు అనుకున్న నాటి సమాజం నేడు ఆడపిల్ల ముద్దనుకుంటుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా పెళ్లి వల్ల జరిగే ఇబ్బందులను చూపించడం వలన యువతలో పెళ్లి పై ఆసక్తి లేకుండా పోతుంది. దీనికి ఒక ఉదాహరణ 2002 లో విడుదలైన మన్మధుడు సినిమా లోని పాట  

ఒరేయ్ వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా

ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్

చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి

తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి

కల్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా

నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా

డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ

ఈ పాట పెళ్ళిచేసుకుంటే పడే కష్టాల గురించి ఆలోచించేలా చేస్తుంది. 40 సంవత్సరాలైనా పెళ్లి చేసుకొని వారిని ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి నోట మన్మధుడి పాటే. 

పెళ్లి వద్దని కొందరైతే మరికొందరు పెళ్లి చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటూ వధువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ఉత్తరం



ఊసేలేని ఉత్తరం 

తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగిందనే పొడుపుకథ వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది “ఉత్తరం”.

పురాతన కాలంలో రాజులు తమ సందేశాలను పంపడానికి పావురాలను ఉపయోగించేవారని. పావురాలు తమ కాళ్ళకి సందేశాన్ని కట్టుకొని వేరే దేశం వెళ్లి అందించేవని. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే నిఘా సమాచార సేకరణకు మరియు ప్రేమ సందేశాలను పంపడానికి కూడా వీటిని ఉపయోగించారని మనందరికీ తెలుసు. 

మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని విషయాలు అదృశ్యం కావడం మరియు వాటి స్థానంలో కొత్తవి ఆవిష్కృతం కావడం సహజం. గతంలో సమాచార మార్పిడికి క్షేమ సమాచారం అందించేందుకు "ఉత్తరం" ప్రధాన పాత్ర పోషించింది. 

నాటి తరానికి ఉత్తరానికి అవినాభావ సంబంధం ఉందనడంలో అతిశయోక్తిలేదు. మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తరం ఎంతో ఉపయోగపడింది. ఒకప్పుడు విదేశీ సమాచారాన్ని అందించడంలో అపూర్వమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసింది. పట్టణాల్లో ఉంటున్న తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు పల్లె ప్రజలు ఉత్తరం కోసం ఎదురుచూసిన క్షణాలు అలనాటి తరానికి ఖర్చులేని మధురానుభూతిని పంచాయి. ప్రేమికుల ప్రేమను వ్యక్తపరిచేందుకు ఉత్తరం (ప్రేమలేఖలు) వారధిగా మారి ప్రేమికుల మస్తిష్కాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. పోస్టుమాన్ ఇచ్చిన ఉత్తరాన్ని చదువుకుని పొడవాటి ఇనుప కమ్మీకి గుచ్చి భద్రపరిచేవాళ్ళు, అవసరమైనప్పుడు మళ్లీ తిరిగి చదువుకోవడం అదొక మధురానుభూతి. అంతేకాదు విద్య, వైద్యం, వ్యాపార, ప్రభుత్వ రంగాలకు విస్తృత సేవలు అందిస్తూ ఉత్తరం నేడు ప్రజాధారణ పొందలేకపోతుంది.    

స్వాతంత్య్ర ఉద్యమంలో ఉత్తరాలు ఉద్యమానికి ఊపిరీగా నిలిచాయి. మహనీయులు రాసిన ఉత్తరాలు ప్రజలను చైతన్యం కలిగించేలా చేసాయి. తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకు మరియు టెలిగ్రామ్ సేవలద్వారాకూడ ప్రజలకు విస్తృత సేవలందించింది. ఆధునిక కాలంలో సాంకేతికత అందుబాటులోకి రావడంతో  ఈమెయిల్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ సేవల కారణంగా  తపాలా సంస్థ సేవలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకు, సివిల్ కోర్టులకు సంబంధించిన లేఖలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. అయినా తపాలా సంస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రజలకు సేవలందిస్తుండటం గర్వించదగిన విషయం. 

తపాలా చరిత్ర:

మన దేశంలో మొదటిసారిగా 1764-1766 మధ్య ముంబై, చెన్నై, కలకత్తా నగరాల మధ్య ఉత్తరాలను చేరేవేసే ప్రక్రియను చేపట్టింది. అప్పటి కలకత్తా గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ తపాలా సేవలను  అందుబాటులోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. తరువాత, లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చట్టం ఆమోదించబడింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ 1854 పోస్టల్ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా స్థాపించబడింది. అప్పటి నుండి 1947 వరకు పోస్టల్ శాఖ బ్రిటిష్ పాలనలో ఉంది, కానీ తరువాత అది భారత ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. మొదట్లో లేఖలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. తర్వాత అనేక కొత్త అంశాలకు శ్రీకారం చుట్టింది. మనీ ఆర్డర్లు, టెలిగ్రామ్‌లు మరియు తరువాత పొదుపు వ్యవస్థలు ప్రవేశపెట్టబడ్డాయి. పోస్ట్‌కార్డ్, ఇన్‌ల్యాండ్ లెటర్, కవర్ ఇలా మూడు రకాల లెటర్స్ అందుబాటులో ఉన్నాయి.. 

1914 నాటికి భారతదేశంలోని అన్ని నగరాల్లో పోస్టల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

సింధ్ జిల్లాలో 1852 జూలై 1న క్వీన్ విక్టోరియా మహారాణి బొమ్మతో తపాలా బిళ్ళలు  మొదట జారీ చేయబడ్డాయి. పోస్టల్ వ్యవస్థ భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖలో భాగం. ఇది 'పోస్టల్ సర్వీస్ బోర్డ్'చే నియంత్రించబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 23 పోస్టల్ సర్కిల్‌లు ఉన్నాయి. ప్రతి సర్కిల్‌కు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థకు ప్రత్యేక సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తరాలు అందించడంలో వేగం మరియు ఖచ్చితత్వాన్ని సాధించేందుకు పిన్ కోడ్ (పి ఐ ఎన్  పోస్టల్ ఇండెక్స్ నంబర్) వ్యవస్థను ఆగస్టు 15, 1972న దేశంలో ప్రవేశపెట్టారు. పిన్ కోడ్ ఆరు అంకెలను కలిగి ఉంటుంది. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్ జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడు అంకెలు డెలివరీ పోస్టాఫీసును సూచిస్తాయి. దేశాన్ని మొత్తం 9 పిన్ కోడ్ జోన్లుగా విభ‌జించారు. 

1880లో మనీ ఆర్డర్‌ సేవలు ప్రారంభం.

1986లో నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ ప్రారంభం.

1994లో ఇంటర్నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ సేవలు ప్రారంభం.

2011 పార్సెల్‌ సేవలు ప్రారంభం.

పోస్టల్ డే అక్టోబర్ 9 నాడు ఎందుకు? 

1600-1700ల కాలంలో, అన్ని దేశాలు సమాచారాన్ని చేరవేయడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి మరియు జాతీయ తపాలా వ్యవస్థను స్థాపించడానికి మరియు దేశాల మధ్య పోస్టల్ సౌకర్యాలను అందించడానికి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 1878లో ఏర్పడింది. ఇది 1948లో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందింది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 16, 1969 వరకు, జపాన్‌లోని టోక్యోలో అనేక సమావేశాలు జరిగాయి. ఈ సదస్సులో అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతినిధులు నిర్ణయించారు.

గణాంకాల ప్రకారం:

ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ కలిగిన దేశం 'భారతదేశం". భారతదేశంలో 155,333 పోస్టాఫీసులు ఉన్నాయి. రెండవస్థానం చైనా 57,000 పోస్టాఫీసులు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో 23,344 పోస్టాఫీసులు మాత్రమే ఉన్నాయి. అందులో 19,184 గ్రామీణ ప్రాంతాల్లో , 4160  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉన్నాయి.

పోస్టల్‌ సేవలు:

ఉత్తరాల పంపిణీ. 

స్పీడ్‌ పోస్టు.

ఈ పోస్టు సర్వీసు.

ఇంటివద్దనే ఆధార్‌ నమోదు సేవలు. 

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలద్వారా ఇంటివద్దే నగదు అందజేత.

ఆలయాల ప్రసాదాల సర్వీసు.

గోదావరి జలాలు అందజేసే సర్వీసు. 

పెట్టుబడి పథకం, టైం డిపాజిట్‌, 

సుకన్య సమృద్ధి ఖాతా, 

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, 

నెలవారీ ఆదాయం వంటి పథకాలు, 

ఉపాధిహామీ వేతనాల పంపిణి

పాస్ పోర్ట్ సేవలు 

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)

ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై)

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్ బివై)

అటల్ పెన్షన్ యోజన (ఏపివై)

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ సి ఎస్ ఎస్)

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతా (అర్ డి)

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐ పి పి బి) సేవలు:

సాధారణంగా నగదు తీసుకోవాలంటే బ్యాంకులు లేదా ఏటీఎం కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐ పి పి బి) అకౌంట్ ఉన్నవారు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటివద్దే  నగదు పొందేందుకు ఈ సేవను ప్రారంభించింది. పోస్టాఫీసు ద్వారా 5000 నగదును పోస్ట్‌మ్యాన్ స్వయంగా ఇస్తారు. మీకు ఐ పి పి బి ఖాతా ఉంటే మరియు దానిలో 2000 బ్యాలెన్స్ ఉంటే, ఈ సేవలు ఉచితంగా అందించబడతాయి.

ఆధార్ సేవలు:

5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు చేసుకోవాలిసినవారు ముందుగా సమీపంలోని పోస్టాఫీసుకు తెలియజేసినట్లైతే తపాలా శాఖ వారు మీ ఇంటివద్దకు వచ్చి ఎలాంటి సర్వీస్ చార్జీలు లేకుండా ఆధార్ నమోదు చేసుకుంటారు. 5 సంవత్సరాల పిల్లలకు పూర్తిగా ఉచితంగా సేవలందిస్తారు.

టెలిగ్రామ్ సేవలు:

1850లో ప్రారంభించిన టెలిగ్రామ్‌ సేవలు, భారతదేశంలో, ఇది 163 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించడం గొప్ప విషయం. ల్యాండ్ ఫోన్‌లు ఉనికిలోకి రాకముందు చాలా మంది భారతీయులకు టెలిగ్రామ్ అత్యంత వేగవంతమైన సమాచారాన్ని అందించింది. టెలిగ్రామ్ ద్వారా మొదటి కమ్యూనికేషన్ 1850లో కోల్‌కతా మరియు ప్రధాన నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హార్బర్ మధ్య జరిగింది. టెలిగ్రాఫ్‌ను శామ్యూల్ మోర్స్ కనుగొన్నారు. టెలిగ్రామ్ సందేశాలను పంపడానికి ఉపయోగించే కోడ్ అయిన మోర్స్ కోడ్ అతని పేరు మీద పెట్టబడింది. వైర్లను అనుసంధానించడం ద్వారా ప్రసారం చేయబడిన విద్యుత్ సంకేతాలను ఉపయోగించి సందేశాలు అందించబడ్డాయి. టెలిగ్రామ్ సేవలను జులై 15 2013న రద్దు చేశారు.

వీటిపై ప్రత్యేక దృష్ఠి సారించాల్సి ఉంది:

  • మీసేవా కేంద్రాల్లో అందిస్తున్న సేవలను పోస్టాఫీసుల్లో కూడా ప్రవేశపెడితే ప్రజలకు పోస్టల్ సేవలపై అవగాహన కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అగ్రిమెంట్ పేపర్స్ పోస్ట్ ఆఫీసుల ద్వారా అందించడం మరియు డి టి డి సి కొరియర్, ప్రవైట్ కొరియర్ సంస్థల సేవలకంటే మెరుగైన సేవలను అందించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
  • పోస్టల్ పథకాల గురుంచి తగిన ప్రచారం మరియు ప్ర‌జ‌ల‌కు ప్రత్యేక అవ‌గాహ‌న కల్పించినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ తిరిగి పునర్వవైభవం సంతరించుకునే అవకాశముంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత విధానాలకు స్వస్తి చెప్పి శాస్త్ర, సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ పట్టణాలు మరియు గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు మరింత చేరువగా పోస్టల్ పథకాల సేవలను అందించాలిసిన అవసరం ఇంకా ఎంతో ఉంది.  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475






1, ఫిబ్రవరి 2023, బుధవారం

ఆదరణ కోల్పోతున్న "విలువిద్య"

ఆదరణ కోల్పోతున్న "విలువిద్య"

రామాయణం, మహాభారతంలో ధనుర్విద్య (విలువిద్య) గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించబడింది. యుద్ధాలలో శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు విలువిద్యను ప్రత్యేకంగా ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి. స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడు, శివ ధనుస్సును విరిచి సీతను పెళ్లాడిన శ్రీ రాముడు, వీరంతా విలువిద్యలో నిష్ణాతులే.

అంతేకాదు, విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్ని కూడా మించి పోయాడు. ఏడు బాణాలు ఒకేసారి సంధించి కొట్టడంలో ఏకలవ్యుడిని మించినవారులేరనడంలో అతిశయోక్తిలేదు. అకుంఠిత దీక్షతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు ఎంతో మందికి ఆదర్శం.

విలువిద్య అనేది పురాణాలలో మాత్రమే కాదు, ఆదిమ మానవుడు ఆహారం కోసం జంతువులను వేటాడేందుకు మరియు పూర్వకాలంలో రాజులు శత్రుసైన్యంతో పోరాడేందుకు యుద్ధాల్లో విలువిద్యను ఉపయోగించారన్నసంగతి మనందరికీ తెలిసిందే.

మన్యం ప్రజల హక్కుల కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్ల గుండెల్లో బాణాలు వదిలి శత్రుసైన్యాన్ని గడగడలాడించిన అసమాన పోరాట యోధుడు, మాన్యం వీరుడు. అగ్గిపిడుగు అల్లూరి. తన 27 ఏటనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్వాల అల్లూరి సీతారామరాజు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించినవారే.

అంతేకాకుండా, బాణం యొక్క ప్రతిచర్య మరియు స్ఫూర్తి ఆధారంగానే ఆధునిక క్షిపణి ఆవిష్కరింపబడిందన్న విషయం కూడా ప్రచారంలో ఉంది. . 

ఎన్నో వేల సంవత్సరాల క్రితమే విలువిద్య భారత దేశంలో ప్రాచుర్యంలో ఉందని మన దేశమే దీనికి పుట్టిల్లని భారతీయులు ప్రగాఢంగావిశ్వసించినప్పటికీ క్రీడ ఎందుకు నిరాదరణకు గురవుతుందో అర్థం కాదు. కాగా క్రీడ భూటాన్, జపాన్, ప్రాన్స్ మరియు ఇటలీ వంటి దేశాల్లో ఎంతో ప్రసిద్ధి చెందడం ఆశ్చర్యకరం.

నిరాదరణకు కారణాలు:

1 .  ఒలింపిక్ క్రీడలలో ఒకటైన విలువిద్యను ఇతర క్రీడలతో సమానంగా ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం . క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకు ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకుంటే మన దేశంలోకూడా ప్రాచుర్యంపొందే అవకాశముంది.

2 . యువతకు ఈ క్రీడపై సరైన అవగాహన లేకపోవడం, ఔత్సాహిక క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఉచిత శిక్షణా కేంద్రాలు అందుబాటు లేకపోవడం పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావన లేకపోవడంఈ క్రీడాభివృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. అందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో విలువిద్య విలువల గురుంచి విద్యార్థులకు తెలియజేయాలి.

3 . క్రీడ అధిక వ్యయంతో కూడుకున్నది కావడంతో నైపుణ్యం కలిగిన ఆర్చర్లు ఎందరో ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి యువత విముఖత చూపుతోంది.

4 . క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ల మాదిరిగానే ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా ప్రధాన సమస్య. అందుకు ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి, విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మరియు ప్రచార సాధనాలు క్రియాశీలపాత్ర పోషించాలి.

మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలలో "విలువిద్య":

పారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో భాగమైన విలువిద్య 1904, 1908 మరియు 1920లలో వరకు కొనసాగి ఆపై 52 సంవత్సరాల విరామంతర్వాత 1972 నుండి ఇప్పటి వరకు కొనసాగుతుండడం గొప్ప విషయం.

లార్స్ ఆండర్సన్ 4.9 సెకన్లలో 10 బాణాలను సంధించి అతివేగంతో కొట్టడంలో  ప్రపంచ రికార్డును సృష్టించిన ఘనుడు.

మొదటిసారిగా మన దేశంలో :

విలువిద్యను 1972 మ్యూనిచ్ గేమ్స్లో భారతదేశం మొదట ఒలింపిక్ విభాగంగా ఎంపిక చేసింది మరియు తరువాత 1973లో ప్రారంభించబడింది. అప్పటి ఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ మల్హోత్రా యొక్క ఉత్సాహంతో ఆర్చరీ భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో మొదటి సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఏప్రిల్, 1973లో ఢిల్లీలో జరిగింది, ఇందులో దాదాపు 50 మంది పురుష మరియు మహిళా ఆర్చర్లు పాల్గొన్నారు. అందులో బెంగాల్ ఆర్చర్లు తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చిఅగ్రస్థానంలో నిలిచారు.

భారతదేశ విలువిద్య క్రీడాకారుల ఘనత:

రాజస్థాన్కు చెందిన లింబా రామ్, 20 ఏళ్లలోపు జూనియర్ మరియు సీనియర్ విభాగాలలో జాతీయ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు. దేశంలోనే మొదటి విలువిద్య నైపుణ్యమున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అంతేగాక 1991లో భారత ప్రభుత్వం చేత అర్జున అవార్డు అందుకున్న మొదటి క్రీడాకారుడు కావడం విశేషం. 1987లో జాతీయ స్థాయి జూనియర్ ఆర్చరీ టోర్నమెంట్లలో ఛాంపియన్గా నిలిచి  1989 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2012లో పద్మశ్రీ ని అందుకున్నాడు.

కోల్కతాకు చెందిన డోలా బెనర్జీ భారతదేశపు ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి. బారానగర్ ఆర్చరీ క్లబ్లో చేరి తొమ్మిదేళ్ల వయసులో శిక్షణ ప్రారంభించిన ఆమె1996లో శాన్ డియాగోలో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్స్ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2005లోభారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది.

ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో మన క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. రికర్వ్ టీమ్ విభాగంలో దీపికా కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకొని తమ సత్తాచాటారు.

జయంత తాలుక్దార్, మంగళ్ సింగ్, అతాను దాస్లతో కూడిన భారత పురుషుల జట్టు ఎన్నో అవార్డులు సాధించారు. ఇలాంటి క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలిసిన అవసరం ఎంతైనావుంది.

జార్ఖండ్లోని రాంచీకి చెందిన దీపికా కుమారి చిన్నతనంలో రాళ్లతో మామిడి పళ్లను లక్ష్యంగా చేసుకుని విలువిద్యను అభ్యసించాలనుకుంది. ఆమె తన శిక్షణ కోసం కొత్త పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక పరిమితులతో రాజీపడేవారు; దీంతో దీపిక ఇంట్లోనే వెదురుతో చేసిన బాణాలను ఉపయోగించి విలువిద్యను అభ్యసించింది. ఆమెకు 2012లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా భారతదేశపు రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు లభించింది. ఫిబ్రవరి 2014లో, ఆమె FICCI స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ఆమెకు 2016లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది.

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన ప్రణీత వర్దినేని చిన్నప్పటి నుంచి విలువిద్యపై ఆసక్తి తో కల్లెడ రూరల్ పాఠశాలలో ఆర్చరీ నేర్చుకొని 2004లో జాతీయ సబ్ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది. ప్రణీత వర్ధినేని ఇప్పటి వరకు పన్నెండు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని పదకొండు పతకాలు సాధించింది.

గణాంకాలప్రకారం:

2021 గణాంకాల ప్రకారం విలువిద్య ఏడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఒలింపిక్ క్రీడగా గుర్తించబడింది. జనాదరణ పొందిన దేశాలలో ఉత్తర కొరియా, అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జపాన్ మరియు స్పెయిన్ వంటి దేశాలున్నప్పటికీ భారతదేశానికి జాబితాలో  చోటు దక్కకపోవడం చాలా విచారకరం. 2021 గణాంకాల ప్రకారం, మన దేశంలో 23 మంది మహిళా అథ్లెట్లు ఒలంపిక్ పోటీలలో పాల్గొనగా, 18 మంది పురుషులు  పాల్గొన్నారు. షార్జాలో జరిగిన ఆసియా కప్ 3 దశలో భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు మరియు రెండు కాంస్యాలతో 10 పతకాలు సాధించారు. సంఖ్యాపరంగా తక్కువ మంది ఆర్చర్లు ఉన్నప్పటికీ మన దేశానికి మంచి అవార్డులు రావడం గర్వించదగ్గ విషయం.

విలువిద్య ఆరోగ్యానికి మేలు:

·         చేతి-కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఆటగాడు బాణాన్ని గురిపెట్టి ఛేదించడం వల్ల మన కంటి దృష్టి కూడా పెరుగుతుంది. విలువిద్య సాధన చేయడంవలన సమన్వయం మెరుగుపడుతుంది. లక్ష్యం చేస్తున్నప్పుడు ఆటగాడు శరీరంపై నియంత్రణ పాటించడం వలన మెరుగ్గా ఉంటాడు.

·         ప్రాక్టీస్ చేస్తున్నపుడు శరీర భాగాలని కదిలించాలిసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చేతులు, ఛాతీ మరియు భుజాలు. స్ట్రింగ్ విడుదల కావడానికి ముందు కండరాలపై ఉద్రిక్తత చాలా సెకన్ల పాటు నిర్వహించబడుతుంది. పునరావృత కార్యాచరణ కండరాల అభివృద్ధికి దారితీస్తుంది.

·         విలువిద్య మరింత సహనాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. క్రీడకు అపారమైన ఓపిక అవసరం.

·         లక్ష్యం ఛేదించడానికి ఆటగాడు బౌస్ట్రింగ్ను స్థిరంగా విడుదల చేయడానికి ప్రధానంగా దృష్టి పైన ఆధారపడి ఉంటుంది. విలువిద్య వల్ల దృష్టి ని మేరుపరుస్తుంది. విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది

·         బాణాన్ని వదలడం మరియు అది లక్ష్యాన్ని చేధించడాన్ని చూడటం చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీరు ఒత్తిడిని వదిలించుకోవడానికి మరియు మిమ్మల్ని రిలాక్స్గా భావించడంలో సహాయపడుతుంది.

·         చేతి వశ్యత: విలువిద్యలో వేలు మరియు చేతి బలం పెరుగుతుంది. సాధన చేస్తున్నప్పుడు అవి పూర్తిగా ఉపయోగంలో ఉన్నందున ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది.

కేరళలోని 72 ఏళ్ల ' పురాతన విలుకాడు:

కేరళలోని వాయనాడ్ అడవుల్లో నివసించే కె గోవిందన్ అనే వ్యక్తి తన పూర్వీకులు ఒకప్పుడు వేట కోసం ఉపయోగించిన శతాబ్దాల నాటి విలువిద్య పద్ధతిని ఇప్పటికీ పాటిస్తుండడం అభినందనీయం. ప్రాంత ప్రజలు వాణిజ్యపరంగా కాక ఆహారాన్వేషణలో భాగంగా విలువిద్యతోజంతువులను వేటాడతారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, గోవిందన్ తాను మరియు అతని పూర్వీకులు వేటాడిన అన్ని జంతువులకు ప్రాయశ్చిత్తం చేయడానికి శాఖాహారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అంతరించిపోతున్న కళను కాపాడాలనే ఉద్దేశ్యంతో యువ తరానికి  విద్యను అందించాలని నిశ్చయించుకున్నాడు. తనను చూడటానికి, బోధనలు నేర్చుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు రావడం సంతోషంగా ఉన్నప్పటికీ తన పాత ఆర్చరీ పద్దతులను నేర్చుకోవడానికి తన సామాజికవర్గంలోని చాలా మంది యువకులు ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు.

ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాచలం, నల్లమల్ల అటవీప్రాంతాలలో నివసిస్తున్న గోండు, చెంచు, కోయ, మొదలైన అడవి జాతులవారు విలువిద్యను కొనసాగిస్తుండటం గొప్ప విషయం. విలువిద్యను ఒకప్పుడు ఆహారం కోసం జంతువుల వేటాడటం కొరకు ఉపయోగిస్తే, ఇప్పుడు వన్యమృగాల నుండి ప్రాణ రక్షణకొరకు ఉపయోగిస్తున్నారు. ఆదివాసుల ప్రాణరక్షణ కోసం ప్రభుత్వం వీరికి సరైన శిక్షణ ఇప్పించాలిసినవసరంఉంది.

లక్ష్య సాధనకొరకు ఏకలవ్యుడు చేసిన కఠోర దీక్ష ఎందరికో ఆదర్శాన్నిస్తుంది.

కానీ ఇందుకు దిశా నిర్దేశం చేసే వారు లేకపోవడం శోచనీయం. హిందూ సంప్రదాయాలలో విలువిద్య గురుంచి ఎంతోగొప్పగా  ప్రస్తావించబడిన  విలువిద్యను కాపాడుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది..


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475











మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...