22, జులై 2023, శనివారం

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

పూర్వం ప్రజలు వ్యవసాయం మరియు చేతి వృత్తుల పైనే ఆధారపడి జీవించేవారని మనందరికీ తెలుసు. మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయి మరియు వాటి స్థానంలో కొత్త పద్ధతులు కనుగొనబడుతున్నాయి. కనుమరుగవుతున్న చేతివృత్తులలో కుమ్మరి వృత్తి ఒకటి.
కుమ్మరి మట్టితో ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసి మానవ జాతికి తొలి సాధనాన్ని అందించడమే కాక దానిని నిత్యావసర వస్తువుగా మార్చిన ఘనత కుమ్మరి కే దక్కుతుంది. గతంలో ఈ వృత్తి కి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ నేడు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి ని వదిలి అనేక కుటుంబాలు ఇతర పనులు చేసుకుంటుండగా మరికొందరు కుమ్మరి వృత్తి నే నమ్ముకుని దిన దిన గండంగా బతుకీడుస్తున్నారు.

"మన్నును నమ్ముకున్నోడు ఏనాటికి చెడిపోడు" అనే నానుడి నిజం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన తాత, తండ్రి చేసే కుమ్మరి వృత్తినే వారసత్వ సంపదగా పుణికిపుచ్చుకుని నేర్చుకున్నాడు. కుమ్మరి వృత్తి అంతరించిపోతున్నప్పటికీ మన్ను నే నమ్ముకుని  వృత్తి ని బతికించడం కోసం బతుకీడుస్తున్న "భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ" నిజ జీవిత గాథ ఎందరికో ఆదర్శం.

జననం, విద్యాభ్యాసం:

హైదరాబాద్‌లోని చార్మినార్‌, రెయిన్‌ బజార్‌ కుమార్‌వాడి కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమిళ్ళ యాదయ్య మరియు నర్సమ్మ దంపతులకు 23.05.1991 న జన్మించారు. తన చిన్ననాటి నుండి తండ్రి పడుతున్న కష్టాలు చూసి తండ్రికి సాయం చేస్తూ వృత్తిని నేర్చుకోగలిగాడు. భాను చందర్ పదేళ్ల వయసులో తండ్రి అనారోగ్య కారణాలతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఆరో తరగతి మధ్యలోనే చదువు మానుకొని భాను చందర్ తన తండ్రి వృత్తిని అనుసరించడం ప్రారంభించాడు.

మానవజాతి మనుగడకు మట్టి కుండ మరువలేని సేవలందించింది.

మానవజాతి మనుగడకు మట్టి కుండ ఎంతో మేలు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే కాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా సేవలందించిన మట్టి కుండ మాయమవుతుండటం బాధాకరమైన విషయం. ఎప్పుడైతే మార్కెట్లోకి ఫ్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటు పడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు. అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారు చేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్లలో నివసించే వారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాల్లో సైతం పెంకుటిళ్ళు అంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్లాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులో నుంచి తామే స్వయంగా మట్టి తెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినా సరే వృత్తి పై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండటం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల పై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యం తో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపుతో వెలవెల బోతోంది. కాలచక్రం తో పోటీ పడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

మట్టి కోసం ఎన్నో ప్రయత్నాలు:  

గతంలో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు తప్పనిసరిగా ఉండేవి. ఆ రోజుల్లో కుమ్మరికి కుండ తయారీకి ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామ సమీపంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి దొరికేది. ఎండా కాలంలో చెరువుల నుంచి ఒండ్రుమట్టిని సేకరించి కుండను తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి, ఆ మట్టిని నీటితో తడిపి కాళ్లతో మట్టిని మెల్లగా తొక్కి ముద్దలుగా చేసి ఎంతో ఓపికతో కుండను తయారు చేస్తారు. ఆ తర్వాత కుండను కాల్చడానికి కూడా అనేక పద్ధతులు ఉపయోగిస్తారు. ఎంతో ఓర్పు మరియు నైపుణ్యం లేనిదే కుండ తయారు చేయడం అసాధ్యం. ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన మట్టి కుండ మానవాళికి తొలి వస్తువుగా ఉపయోగపడడం గొప్ప విషయం.

కానీ నేడు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై మట్టి కోసం కుమ్మరి అల్లాడుతుండటం బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఉచితంగా లభించే మట్టి నేడు అందుబాటులో లేదు. మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి మట్టిని కొనుగోలు చేసి కుండలు తయారు చేసిన గిట్టుబాటు ధర లేక కుటుంబాన్ని పోషించుకోలేక కుమ్మరి వృత్తికి దూరమవుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఉంటున్న భాను చందర్.. తాను నమ్ముకుని బతుకుతున్న వృత్తినే కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. భాను చందర్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ వృత్తి పూర్తిగా అంతరించి పోకుండా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

భాను చందర్ కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా, అనేకమంది ఆధునిక పరికరాలు, ఆధునిక యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ మట్టి కుండ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భాను చందర్ నగరంలో పలుచోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. మట్టి కుండ మానవ ఆరోగ్యానికి మంచిదని, మట్టి కుండను ఉపయోగించకపోవడం వల్ల మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అందరికీ వివరిస్తున్నారు. అంతేకాకుండా, అతని కుండ తయారీని చూసి చాలా మంది ప్రముఖులు, నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ తారల చే ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్లాస్టిక్ వాడకం వద్దు. మట్టి కుండలు ముద్దు.

ప్లాస్టిక్ వస్తువులు అత్యంత అందంగాను, కళ్లు చెదిరే రంగులతో మరియు అత్యంత చౌకగా చౌకగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. విచక్షణా రహితంగా రసాయనాలు వాడడం, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను విపరీతంగా వాడడంతో పర్యావరణం ప్రశ్నార్థకంగా మారింది. ఇలాగే కొనసాగితే భావి తరాలు అనారోగ్యకరమైన సమాజంలో జీవించాల్సి వస్తుంది.

పూర్వం మట్టి కుండలో ఆహారాన్ని వండుకుని తినే వారు. కాబట్టి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాకుండా మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫైయర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులలో నీటిని నిల్వ ఉంచుకుని తాగే బదులు మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని ప్లాస్టిక్ ను నిషేధించి మట్టి కుండలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

కుమ్మరి వృత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందించాలి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''స్వదేశీ ఉత్పత్తుల'' అభివృద్ధికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమైంది అనడంలో సందేహం లేదు. కుమ్మరి వృత్తి డిమాండ్ తగ్గడంతో గ్రామీణ వృత్తులపై ఆధారపడిన కార్మికులు ఈ వృత్తిని వదులుకుని పట్టణాలకు వలస వెళ్లి లేబర్ మార్కెట్‌లో రోజువారీ కూలీలుగా ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.

భాను చందర్ ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కిన్నెర కళాకారులు అంతరించిపోతున్న తరుణంలో కళనే నమ్ముకుని బతుకీడుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య కు భారత ప్రభుత్వం 2022 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించడం గొప్ప విషయం. అలాగే అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి కళాకారులను కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం. కుండ విశిష్టతను తెలియజేస్తూ కళను బతికిస్తున్న భాను చందర్ లాంటి వారిని ప్రభుత్వం సత్కరించి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

12, జులై 2023, బుధవారం

దైర్యసాహస వీరుడి కథ.

భగవంతుడు ఎలా ఉంటారో మనం చూడలేము, ఆపదలో మనకు సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ, ఆపదలో మనకు సహాయం చేసే వారు భగవంతుని తో సమానం అనేది నిజం.

ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు అవసరం లేదు. మనసుంటే చాలు.

మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా సాటి మనిషికి సాయం చేయాలనే మానవత్వం, తపన ఉంటే ఎలాగైనా చేయగలడు. సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. అయినా సాటిమనిషికి సహాయం చేయలేని స్వార్ధపరులెందరో.

సాటి మనిషి చనిపోయే స్థితిలో ఉన్నా సహాయం చేయాలనే చలనం లేని వారెందరో. 

అత్యవసర పరిస్థితుల్లో, సాధారణంగా నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను రక్షించడం మనందరి కర్తవ్యం. కొన్ని సందర్భాల్లో అంబులెన్సుకు దారి ఇవ్వాలనే అవగాహన లేని వారి కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వడం చాలా కష్టమైన పని. అలాంటి సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు మరియు మానవత్వం ఉన్నవారు ధైర్యసాహసాలతో  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మార్గనిర్దేశం చేసే స్పూర్తిదాయకమైన ప్రాణదాతలు ఎందరో ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన 12 ఏళ్ల బాలుడు వెంకటేష్ అనే ధైర్య సాహస వీరుడి కథ.

వెంకటేష్ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా హిరేరాయనకుంపి గ్రామానికి చెందినవాడు. హిరేరాయనకుంపేలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. వెంకటేష్‌కి స్నేహితులతో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. వెంకటేష్ తన స్నేహితులతో కలిసి తరచూ హిరేరాయనకుంపి లోని వాగు పరిసర ప్రాంతాల్లో ఆదుకునేవాడు. అలా స్నేహితులతో కాలక్షేపం చేస్తూనే తల్లిదండ్రులకు సహాయపడుతుండేవాడు. ఆగస్టు 2019లో, వరదల కారణంగా వాగు పరిసర ప్రాంతాలు నీట మునిగి, నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న వంతెన నీట మునిగింది. యాద్గిర్ జిల్లా వడగెర తాలూకాలోని మాచనూర్ గ్రామానికి అంబులెన్స్ డ్రైవర్ ఆరుగురు పిల్లలతో పాటు మహిళ మృతదేహాన్ని తీసుకెళ్తున్నాడు. బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న నీరు కారణంగా అంబులెన్స్ మునిగిపోయిన వంతెన వద్ద ఆగిపోయింది.డ్రైవర్ సహాయం కోసం సమీపంలో ఆడుకుంటున్న పిల్లల గుంపు ను పిలిపించి, వంతెనపై మార్గం సరైనదని తెలుసుకొని  అంబులెన్స్‌కు మార్గం చూపించమని అడిగాడు. అప్పుడు అక్కడున్న పిల్లలు ఎవరు ఆ సాహసం చేయమని చెప్పారు. వెంటనే వెంకటేష్ నేను దారి చూపిస్తాను అంటూ ధైర్యంగా ముందుకు వచ్చాడు. వెంకటేష్‌ స్నేహితులు అతడ్ని హెచ్చరించినా వినకుండా, డ్రైవర్‌ని అనుసరించమని కోరాడు. అంతటా పారుతున్న నీరు కారణంగా దారి కనిపించని పరిస్థితి, వెంకటేష్ బ్రిడ్జి పై తరుచుగా ఆడుకునే వాడు కావడం వల్ల బ్రిడ్జిపై దారి సులభంగా కనిపెట్టగలను అనే నమ్మకంతో ఆ డ్రైవర్ కి సూచనలిస్తూ మెడ లోతు ప్రవహిస్తున్న నీటిలో ముందుకు అడుగులేస్తూ సాహసోపేతమైన ధైర్యంతో అంబులెన్స్ కి మార్గనిర్దేశం చేయగలిగాడు. దారి చూపిన సాహస  వీరుడికి డ్రైవర్ కృతజ్ఞతాభావం తెలిపారు. 

అంతేకాకుండా వెంకటేష్ 10 ఏళ్ల వయసులో నది ప్రవాహం లో పడిపోయిన మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు. అతి చిన్న వయసులోనే సాహసోపేతమైన విన్యాసాలు చేసినవారిని చూస్తుంటాము కానీ ప్రాణాలకు తెగించి ప్రాణాలను రక్షించే వారిని చూడటం అరుదు.   

ధైర్య సాహసాలకు "జాతీయ శౌర్య పురస్కారం":

వరదలున్న ప్రాంతంలో అంబులెన్స్‌కి మార్గనిర్దేశం చేయడం అంటే మామూలు విషయం కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అంబులెన్స్ సజావుగా వెళ్లేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అంబులెన్స్ కి దారి ఇవ్వడం నిజంగా వెంకటేష్ ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంబులెన్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో పాటు బాలుడి ధైర్యసాహసాలు జాతీయ వార్తగా మారడమే కాకుండా, ప్రశంసలు వెల్లువెత్తాయి. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సాహస పురస్కారాలను అందజేస్తోంది.

సహాయం, సాహసం చేయడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన వెంకటేష్ ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అతని ధైర్య సాహసాలకు గుర్తింపుగా 26 జనవరి 2020 , న్యూ ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి చేతులమీదుగా జాతీయ శౌర్య పురస్కారాన్ని అందజేశారు. 

బాలలకు ప్రదానం చేసిన సాహస పురస్కారాల అవార్డులు వారికి ప్రత్యేక గుర్తింపును తేవడమే కాకుండా వారి నైపుణ్యాన్ని వెలికితీస్తుంది. వారు సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.  

విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగేలా ప్రోత్సహించాలి.

పిల్లలలో ప్రతి ఒక్కరికి సృజనాత్మకత ఉంటుంది. వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే సృజనాత్మకత మరింత పెరిగి అవధులు లేని ఆవిష్కరణలు చేస్తారు. పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శిక్షణ అవసరం. ప్రస్తుతం విద్యార్థి తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పాఠ్యపుస్తకంలోని పాఠాలకే పరిమితమై, సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై అవగాహన ఉండటం లేదు. పాఠశాల స్థాయిలో, ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంలో మానవతా విలువలపై సరైన అవగాహన కల్పించి, ఇతరులకు సహాయపడే కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగి నవ సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. పిల్లలు వారికి తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లకు గురవుతుంటారు అలా జరగకుండా వారిపై తల్లిదండ్రులు, గురువుల పర్యవేక్షణ తప్పనిసరి. తల్లిదండ్రులు పిల్లలలో ధైర్యాన్నిచ్చే సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుటుంబ సమస్యలపై కాకుండా సమాజంలోని సమస్యలపై అవగాహన కల్పిస్తే పిల్లలలో సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు వెంకటేష్ లాంటి ధైర్య సాహస వీరుడి వంటి స్టోరీస్ తెలియజేయడం ద్వారా వారిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ధైర్యసాహసాలు చేయడానికి వెనకడుగు వేయకుండా ముందుకు సాగేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475  

 





  

8, జులై 2023, శనివారం

పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?

పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవంలోకి వస్తే చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం.

అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు. "చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు" నానుడి నేటికీ నిజం. మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు అన్నట్లుగా ప్రతిభావంతులు, తెలివైన పద్మశాలీల మౌనం వల్ల మానవతావాదం లేని వారు రాజ్యమేలుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితి ని ఎదుర్కొంటున్నారన్నారు.

పద్మశాలి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ వారి ఎదుగుదల కోసమే తప్ప చేనేత కార్మికుల చేయూత కోసం కాదన్నది ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి తెలిసిన విషయం. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకు గా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వారికి  ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం. పద్మశాలీల మౌనమే నేడు చేనేత కార్మికుల శాపంగా మారింది. ఇకనైనా చేనేత కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది.

ఫలితాలు ఇవ్వని పథకాలు:

1 . చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ,  నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గత కొన్ని నెలల క్రితం పేపర్లో వచ్చిన విషయం అందరికి తెలిసిందే. పేపర్ లో వచ్చే ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. నేతన్న బీమా పథకం ప్రస్తుతం అమలులో ఉందో లేదో కూడా చేనేత కార్మికులకు తెలియదంటే దీనిబట్టి అర్థం చేసుకోవాలి పథకాలు పబ్లిసిటీ కోసమే తప్ప పబ్లిక్ కోసం కాదు అనేది.

2 . ముద్ర పథకం:

 పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల అభ్యున్నతికి ముద్ర రుణాలు  అందజేస్తున్నారు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముద్ర లోన్ల ఊసే లేదు. ముద్ర లోన్లు ఉన్నాయన్న విషయం ప్రచారానికే పరిమితం అంతే తప్ప ఏ ఒక్కరు తీసుకున్నట్లు, ముద్ర లోన్స్ అమలులో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అసలు ముద్రా రుణాలు ఉన్నాయా అనే సందేహం నెలకొంది.

3 . నేతన్న బీమా పథకం:

మరణించిన చేనేత కార్మికుల కుటుంబం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం "నేతన్న బీమా పథకం". ఏ కారణం చేతనైనా 18-59 సంవత్సరాల వయస్సు గల నేత కార్మికులు మరణిస్తే 10 రోజుల్లోగా నామినీకి ఎల్‌ఐసి నుండి 5 లక్షల బీమా పరిహారం అందించేలా పథకం రూపొందించబడింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 2022 ఆగస్టు 8 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని ప్రెవేశపెట్టినందుకు ఎంతో సంతోషించిన చేనేత కార్మికులకు ఈ పథకం అందని ద్రాక్షలాగే మిగిలింది. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి అనేక మంది చేనేత కార్మికులు మరణించగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందజేసినట్లు ఎక్కడ  సమాచారం లేదు. బ్రతికుండగా సరైన పథకాలు లేవు మరణించిన తర్వాత కూడా నేతన్న బీమా పథకం లేదు. ఈ పథకాన్ని ప్రారంభించి చేనేత కార్మికులకు నగదు అందజేయడంలో విఫలం కావడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర కులాలకు ఇస్తున్నారు తప్ప చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకం అందకపోవడం శోచనీయం.

4 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచితంగా మగ్గాలు అందించిన మాట వాస్తవం. మరి మన రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచిత మగ్గాలు ఏవి? వాటి స్థానంలో ఇంకేమైనా ఇచ్చారా  అది లేదు.  అది చేస్తాం ఇది చేస్తాం అనడమే తప్ప ఏమి ప్రయోజనం లేదు.

5 . బీసీ కులాలందరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశ చూపి చివరి దశలో 15 కులాలకు మాత్రమే వర్తిస్తుంది అని పేపర్ ప్రకటన చేయడం తీవ్ర బాధను కలిగించింది. ఈ పథకం కోసం ప్రతి చేనేత కార్మికుడు 4 రోజులు పని చెడగొట్టుకొని మండలం ఎం ఆర్ ఓ ఆఫీస్, మీ సేవల చుట్టూ తిరిగి అలసిపోయిన చేనేత కార్మికులు ప్రకటన చేయడం వరకే పరిమితమైన పథకాలు మాకొద్దు అంటూ చేతి వృత్తుల అభివృద్ధికి పాటు పడే ప్రభుత్వాన్ని ఈసారి ఎన్నుకుంటామని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.. 

నేతన్నకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోందని, దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అతి కొద్దిమందికి ఇస్తూ మిగతా వారికి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జి ఐ టాగ్ నమోదు కానీ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారికి జి ఐ టాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు వారు జి ఐ టాగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. 

అత్యధిక ఓటర్లు పద్మశాలీలకు నాయకులు ఎలక్షన్ సమయంలో ఎదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతి ఎలక్షన్స్ సమయంలో జరిగేదే. నాయకులు ప్రతిసారి పద్మశాలీలను మోసం చేయడం వారి ఓట్ల ద్వారా గెలుపొందడం ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. 

చేనేత కార్మికులందరూ ఐక్యతగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది.

ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని అండగా నిలవాలి.


వ్యాసకర్త. 

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475


   

5, జులై 2023, బుధవారం

డ్రైవర్ వృత్తి



సమాజంలో నేటికీ డ్రైవర్ల వృత్తి కూలీలగానే పరిగణించబడుతుంది. వారు చేసే పని ఎంతో విలువైనది అయినా వారికీ సరైన జీతం, సరైన వసతి, గౌరవం, గుర్తింపు లభించకపోవడం బాధాకరమైన విషయం. డ్రైవర్ వృత్తి ప్రపంచంలో చాలా ప్రధానమైనవి. వీరు రాత్రి, పగలనక అహర్నిశలు శ్రమించిన కష్టానికి ఫలితం అంతంత మాత్రమే. ఈ వృత్తుల వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయని అతి కొద్దిమందికి తెలుసు. సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ శ్రమను గుర్తించి శ్రమకు తక్కువ గౌరవం ఇస్తున్నారు.


డ్రైవర్ వృత్తి గురుంచి తెలుసుకుందాం:


విలాసవంతమైన భవనాలు, కోట్ల ఖరీదైన కార్లు ఉన్నపటికీ గౌరవం కోసం కొందరైతే, కొందరు నడపగలిగే సామర్థ్యం ఓపిక లేక, నిత్యం బిజీ గా ఉండే రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు ఎంతోమంది నెలవారీ జీతంతో డ్రైవర్లుగా నియమించుకుంటారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడుగా పరిగణిస్తారు తప్ప వారి శ్రమను గుర్తించారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడు అనుకునే వారికీ డ్రైవర్ అనే పదానికి అసలు నిర్వచనం తెలియదని కూడా గమనించాలి. సమయానికి మనందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే దేవుడే నిజమైన డ్రైవర్. డ్రైవర్ కంటి మీద కునుకు లేకుండా ఎంతో నిబద్ధతతో మనల్ని గమ్యస్థానానికి తీసుకెళతాడు. అనివార్యమైన సంఘటన ఏదైనా జరిగిన మన ప్రాణాలకంటే ముందు తన ప్రాణాలను వదలడానికైనా సిద్దపడి ముందుండి నడుపుతాడు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న వాస్తవాన్ని మరిచిపోయి వారిని ఒక కూలీగానే చూడటం శోచనీయం. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు వంటి అనేక డ్రైవర్ సంబంధిత ప్రమాదాలు కనురెప్పపాటులో జరిగే ఘోర ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మన కుటుంబ క్షేమం కోసం డ్రైవర్ తన కుటుంబానికి దూరమై అవసరమైతే మనతోపాటే ప్రాణాలర్పించడానికి వెనుకాడని డ్రైవర్ వృత్తి ఎంత ప్రధానమైనదో ఒకేసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు వారికి సరైన ఆహారం, నిద్ర, సరైన జీతం, అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేయాలి. డ్రైవర్ అంటే మన కుటుంబ సభ్యుడిగా చూడాలి. మనం తినే ఆహారమే తనకు పెట్టాలి. అంతే తప్ప కూలివాడుగా చూడరాదు. మనం నిత్యం వార్తలలో చూస్తూనేవుంటాం బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణం అయినా ప్రయాణికులు సురక్షితమని లేదా ప్రమాదం నుండి రక్షించిన డ్రైవర్ అని ఇలా ఎన్నో వార్తలు వస్తుంటాయి. బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో మనం నిద్రపోయినా ప్రశాంతంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల మనమంతా క్షేమంగా ప్రయాణించడం గొప్ప విషయం. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా అంబులెన్స్ వాహన డ్రైవర్లు కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ చివరకు కూలి డ్రైవర్ గానే చూస్తాం. అంబులెన్స్ డ్రైవర్ అతివేగంతో నడపడంతో తన ప్రాణాలకు కూడా ప్రమాదమని తెలిసినప్పటికీ మన ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా బ్రతికిస్తాడన్న కృతజ్ఞత భావం కలిగినవారు అతితక్కువ మంది ఉంటారు.


డ్రైవర్ మృతి పట్ల కృతజ్ఞత భావం తెలిపిన "జవేరి పూనావాలా":


కరోనా వాక్సిన్లలో ఒకటైన కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఆధార్ పూనావాలా సోదరుడు జవేరి పూనావాలా దగ్గర కారు డ్రైవర్ గా 30 సంవత్సరాలుగా పనిచేసిన గంగాదత్త అంటే జవేరి పూనావాలాకు అమితమైన ప్రేమ అయన అతన్ని డ్రైవర్ కాకుండా సొంత తమ్ముడిగా చూసుకునేవారు. ఒకరోజు జవేరి పూనావాలా ముంబై పర్యటనలో ఉండగా పూణే లో గంగాదత్త అకాలమరణం పొందారన్న విషయం తెలిసింది. వెంటనే అన్ని పనులు రద్దుచేసుకొని హుటాహుటిన పూణెకి చేరుకొని అంతిమ యాత్ర జరిగే సమయంలో గంగాదత్త నడిపిన కారు ను పూలతో అలంకరించి దానిలో పార్థివ దేహాన్నుంచి గంగాదత్త అంతిమ యాత్రను అయన నివాసం నుండి శ్మశానవాటిక వరకు స్వయంగా తాను కారు నడుపుకుంటూ తీసుకెళ్లారు.

ఇదే విషయాన్నీ ఆయనతో ప్రస్తావించగా అయన విషణ్ణ వదనంతో " గంగాదత్త నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించారు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్న" అని అన్నారు.


డ్రైవర్ల సమస్యలెన్నో:


డ్రైవర్లకు సరైన జీతం లేదు, వారానికోసారి సెలవు లేదు, వైద్య బీమా లేదు, ఇఎస్‌ఐ లేదు, పిఎఫ్ లేదు. డ్రైవర్ అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి బీమా లేదు.

చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ల శ్రమను గుర్తించి న్యాయమైన వేతనం ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. ఓలా, ఉబర్, ఇతర క్యాబ్‌లను అనుమతించడం వల్ల చిన్న వాహనాల డ్రైవర్లకు సరైన గిరాకీ లేక ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖల్లో అవినీతి, వేధింపులు ఇలా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ల అభ్యున్నతికి తగిన చట్టాలు రూపొందించి డ్రైవర్లకు ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.




















 

2, జులై 2023, ఆదివారం

అంతరించి పోతున్న కుమ్మరివృతి 2

 అంతరించి పోతున్న కుమ్మరివృతి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

కుండల ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం 'సిరామిక్ సిటీ' :

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఖుర్జా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణీయమైన ప్రాంతం. అక్కడ తయారయే రంగు రంగుల కుండలు పర్యాటకులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఖుర్జా కుండలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని 'సిరామిక్ సిటీ' అని కూడా పిలుస్తారు, 

ఆధునిక సాంకేతిక అవసరం:

ప్రభుత్వం కుమ్మరి వృత్తిదారులకు నూతన ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనావుంది. లక్షలాది కుటుంబాలు ఈ వృతిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్లోకి స్టీల్ వంటి పాత్రలు వచ్చాయో అప్పటినుండి వీరి జీవితాలు అగమ్యగోచరంగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, కుమ్మరి వృత్తికి కావాల్సిన బడ్జెట్ ని పెట్టాలి. అంతేకాకుండా కుండలు అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలి. కుమ్మరి వృత్తి ని బలోపేతం చేయడానికి వారికీ ప్రత్యేకమైన వడ్డీలేని రుణాలను అందజేయాలి.  అంతరించిపోతున్న కుమ్మరి వృత్తిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.


వ్యాసకర్త 

కోట దామోదర్

మొబైల్ : 9391480475

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...