సంకల్ప బలం:
ఒక్కప్పుడు నా దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉండుంటే కలెక్టర్ అయ్యేవాడిని లేదా మంచి ఉద్యోగం చేసేవాడిని. పేదరికం, ఆటంకాల వల్లే ఉన్నత ఉద్యోగాలు సాదించలేకపోయాను అంటూ చాలామంది అంటుంటారు. కానీ నిజానికి వారికి లేనివి అవేవీ కావు, ఒక్క దృఢ సంకల్పం మాత్రమే. దృఢ సంకల్పం లేనప్పుడు ఏదైనా సాధించడం అసాధ్యమే. పట్టుదలతో ప్రయత్నం చేయలేనప్పుడు పరిస్థితులను నిందించడం సరికాదు. అందుకే సినారె గారు రాసిన కవిత్వం గుర్తుకొస్తుంటుంది "చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు.. కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు" అని. అవును నిజమే కదా! చదవచేతగానప్పుడు పేదరికాన్ని, డబ్బును నిందించడం ఎందుకు? సంకల్పబలం లేనివాడు సమస్యలంటూ నిందించడం ఎందుకు? లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష ఉంటే విజయం కచ్చితంగా మనదే అవుతుంది. అందుకు తాజా తార్కాణం ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ రోణంకి, ఐఏఎస్ విజయగాథ.
గోపాలకృష్ణ రోణంకి చదివింది ఎక్కడో పట్టణంలోనో లేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనో కాదు. ఆయన చదివింది ఆంద్రప్రదేశ్ లోని పలాస మండలం పరసంబ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియం చదువు. అతని తల్లిదండ్రులు నిరుపేదలు, వారు వ్యవసాయం, కూలి పనులకెళ్లి జీవనం కొనసాగిస్తారు. అతన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించే స్థోమత లేనందున అతను ఎలాగోలా ప్రభుత్వ పాఠశాలలో చదివి పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో ఫార్మసీ చదివి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా దూబచర్లలో రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేసి 2006లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఎస్సీ (ఎంపీసీ) పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ కావాలన్నది ఆయన కల. ఆ కల నెరవేరడం కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోరదీక్ష చేశారు. కల నెరవేరడం కోసం ప్రతి రోజు 8 గంటలకుపైగా ఎంతో దీక్షతో చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదటగా ప్రయత్నించి విఫలమయ్యాడు అయినా సరే లక్ష్యం చేరేదాకా ప్రయత్నం ఆపకూడదనే సంకల్పంతో అవరోధాలు, ఆటంకాలను లెక్క చేయకుండా రెండోసారి కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే నిరాశ చెందకుండా లోపం ఎక్కడ ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు పరీక్షకు సిద్ధమయ్యేవాడు. అలా మూడో ప్రయత్నం కూడా విఫలమయ్యాడు. అయినప్పటికీ నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకంతో నాలుగోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. చాలామంది ఒకటి లేదా రెండు ప్రయత్నాలతో ఇక నావల్లకాదని ప్రయత్నించడం మానుకుంటారు. కానీ ఎవరైతే దృఢ సంకల్పముతో పోరాడుతారో వారికి కచ్చితంగా విజయం వరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంకల్పంతో సాధించిన విజయం అతన్నే కాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే అతను అందరిలా కాకుండా సివిల్స్ (మెయిన్స్)లో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని ఆయన యూపీఎస్సీ పరీక్షను తెలుగు భాషలో రాశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది వంద శాతం నిజం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తెలుగులో పర్సనాలిటీ టెస్ట్ రాసేందుకు యూపీఎస్సీ అనుమతించడం. 2016లో ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా మూడవ ర్యాంక్ సాధించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. తన గ్రామంలో కనీసం కరెంటు మరియు బస్సు సౌకర్యం లేకున్నా పట్టుదలతో చదివి అత్యంత కఠినమైన పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించడమనేది చాలా గొప్ప విషయం. ఏదైనా విజయం సాధించాలంటే ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొంటే గానీ సాధ్యపడదు. “డబ్బులు ఎవరికీ ఊరికే రావు” అన్నట్లు మరి విజయం ఊరికేవస్తుందా, కష్టపడితేనే కదా! గోపాలకృష్ణ కూడా కష్టపడకుండా విజయం సాధించలేదు. అతను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన తల్లిదండ్రులు చిన్నవయసులోనే దళిత కులాంతర వివాహానికి పాల్పడిన కారణంగా 25 సంవత్సరాల పాటు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దీంతో వారి జీవితాల్లో ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ అందరూ అది సాధించలేరు. ఎందుకంటే విజయం అనేది ఎవరికీ ఊరికే రాదు కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ కొంత మంది ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే గెలుపు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన చేస్తారు కానీ ఆచరణలో పెట్టరు. అలాంటివారు ఎప్పుటికీ విజయం సాధించలేరు. గోపాల కృష్ణ లా లక్ష్యం పెట్టుకోవాలి మరియు ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి