విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి తల్లి ప్రేమనే.
భారతదేశంలో జన్మించి, చిన్నప్పుడే నెదర్లాండ్స్‌కు దత్తతగా వెళ్లిన ఒక బాలుడు… కాలక్రమేణా విదేశీ నేలపై పెరిగి, చదువుకుని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఒక నగరానికి మేయర్‌గా ఎదిగాడు. కానీ ఈ విజయగాథ వెనుక ఒక భావోద్వేగ కథ దాగి ఉంది. అధికారం, గౌరవం, ప్రజల ప్రశంసలు, సమాజంలో ఉన్నత స్థానం ఇవన్నీ ఉన్నా అతని మనసులో మాత్రం ఒక చిన్న లోటు ఎప్పటికీ మిగిలిపోయింది. అది “అమ్మ” అనే మధురమైన బంధం.
ఆ బాలుడే నేడు నెదర్లాండ్స్‌లోని Heemstede నగర మేయర్ ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్. మహారాష్ట్రలోని నాగపూర్ మెడికల్ కాలేజీలో 1985 ఫిబ్రవరి 10 న జన్మించిన ఆయనను, జన్మించిన మూడు రోజులకే నాగ్ పూర్ కు చెందిన సంస్థ 'మాతృ సేవా సంఘ్' (ఎం ఎస్ ఎస్) కు అప్పగించింది అతని కన్న తల్లి. తరువాత, ఒక డచ్ జంట ఆ నవజాత శిశువును దత్తత తీసుకుని నెదర్లాండ్స్ కు వెళ్లారు. ఆ బాలుడు వారి సంరక్షణలో అక్కడ పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించి, సమాజ సేవలో అడుగుపెట్టి చివరకు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
కొన్నాళ్లకు తాను దత్తతకు వచ్చానని తెలుసుకున్నప్పుడు, ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. “నా తల్లి ఎవరు? ఎందుకు నన్ను దత్తతకు ఇచ్చింది? ఇప్పుడు ఎక్కడ ఉంది?” అనే ఆలోచనలు ఆయనను వెంటాడాయి. కాలం గడిచింది, బాధ్యతలు పెరిగాయి, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాలనే తపన మాత్రం తగ్గలేదు.
చివరకు నలభై ఏళ్ల అనంతరం ఆయన తన జన్మస్థలం Nagpur కు చేరుకున్నారు. బాల్యంలో దత్తతకు సంబంధించిన పాత రికార్డులు, అనాథాశ్రమం దస్తావేజులు ఆధారంగా తన కన్నతల్లిని వెతకడం ప్రారంభించారు. ఒకసారి కాదు… రెండు సార్లు కాదు… ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్‌కు వచ్చి ప్రయత్నించారు.
ఈ అన్వేషణలో భాగంగా ఆయన Matruseva Sangh మాజీ సూపరింటెండెంట్ Mangala Bhusari ను కలిశారు. నలభై ఏళ్ల క్రితం ఆ అనాథ శిశువు కు “ఫాల్గున్” అని పేరు పెట్టింది ఆమెనే. పాత రికార్డులన్నీ వెతికినా, ఆ తల్లి ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకకపోవడం హృదయ విదారకమైన విషయం.
ఇది కేవలం ఒక వ్యక్తిగత అన్వేషణ కాదు. జన్మనిచ్చిన తల్లి హృదయంలో ఎప్పుడో మిగిలిపోయి ఉండే అపరాధ భావాన్ని తొలగించాలనే ఒక మౌన తపన. ఒక బిడ్డగా తన మూలాలను తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే కాదు, “అమ్మ” అనే బంధాన్ని గౌరవంగా ఆలింగనం చేసుకోవాలనే ఆత్మీయ ప్రయత్నం.
ఇంతకీ తల్లి అతన్ని ఎందుకు దత్తతకు ఇచ్చిందనుకుంటున్నారా? అదొక హృదయవిదారక ఘటన. అతను జన్మించిన సమయంలో ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. అవివాహితురాలిగా ఒక పసికందుకు జన్మనిచ్చిన ఆమెకు అప్పటి సామాజిక పరిస్థితులు తీవ్రమైన ఒత్తిడిని సృష్టించాయి. పరువు నష్టం, అవమానం, కుటుంబ భయం, ఇవన్నీ కలిసి మూడు రోజుల పసికందును Matru Seva Sangh కు అప్పగించేలా చేశాయి.
అయితే ఈ కథలో తప్పు ఎవరిదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వెతకడం కష్టం. వ్యక్తుల కంటే అప్పటి సామాజిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. అవివాహిత తల్లులపై ఉన్న ముద్రలు, పరువు అనే పేరుతో నిర్మితమైన భయాలు, కుటుంబాల ఒత్తిళ్లు, ఇవన్నీ కలిసి ఒక తల్లిని తన హృదయానికి భారమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి.
అందుకే ఈ కథను వ్యక్తిగత తప్పిదంగా కాక, సమాజం ఆలోచనా విధానం పై నిలిచే ప్రశ్నగా చూడాలి. ప్రేమతో చేసిన త్యాగం కాలగర్భంలో మౌన వేదనగా మిగిలిపోకూడదంటే, మారాల్సింది మన దృక్పథమే.
ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్ మాటలు ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తాయి. “నన్ను పెంచలేకపోయిందని నా తల్లి బాధపడొద్దు. నేను బాగానే పెరిగాను. మంచి జీవితం గడుపుతున్నాను” అని ఆమెకు చెప్పడానికే ఈ ప్రయాణమంతా. నా మాటల్లో కోపం లేదు… బాధ లేదు… కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది అంటారు.
పదవి, గౌరవం, సంపద, ఇవన్నీ జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చవచ్చు. కానీ “అమ్మ” అనే బంధం ముందు అవన్నీ చిన్నవే. చాలామంది దత్తతకు వెళ్లిన వారు కాలగమనంలో తమ గతాన్ని మరిచి కొత్త జీవితంలోనే మమేకమై పోవచ్చు. కన్నతల్లిని కలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండకపోవచ్చు. కానీ ఫాల్గుణ్ కథ మాత్రం భిన్నం. అది దత్తత పిల్లల హృదయాల్లో నిశ్శబ్దంగా దాగి ఉండే “నేను ఎక్కడి వాడిని?” అనే ప్రశ్న ప్రపంచానికి గుర్తు చేసింది.
తన మూలాలను తెలుసుకోవాలనే ఆత్మీయ కోరిక, తనకు జన్మనిచ్చిన తల్లిని కేవలం తెలుసుకోవడమే కాదు, ఆమె హృదయంలో అచిరకాలంగా మిగిలిపోయిన బాధ నుండి సాంత్వన పరచాలనే ప్రయత్నాన్ని ఈ కథ మనకు చెబుతుంది. విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి ప్రేమనే, ప్రత్యేకించి కన్నతల్లి ప్రేమని ...
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475