మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"
అవరోధాలను దాటుకుంటూ,
అవమానాలను ఓర్పుగా మోస్తూ,
కన్నీళ్లను ధైర్యంగా తుడుచుకుంటూ
నిలబడ్డ కొంతమంది అసాధారణ వ్యక్తుల జీవిత ప్రయాణాలే
“ఈ అవరోధాలే అవకాశాలు”.
ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం
ఒక వ్యక్తి గెలుపు కథ మాత్రమే కాదు
ఓడిపోకుండా నిలబడిన మనిషి ఆత్మవిశ్వాసానికి సాక్ష్యం.
వెనుకడుగులు వేయాలని పరిస్థితులు బలవంతం చేసినా,
ముందడుగు వేయాలని మనసు చెప్పినప్పుడు
జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఈ రచనలు తెలియజేస్తాయి.
కోట దామోదర్ గారి కలం తన అనుభవాలను, ఆవేదనలను, ఆశలను ఎంతో సూటిగా పాఠకుల హృదయాల్లో నాటుతుంది. ప్రతి వ్యాసాన్ని చదువుతుంటే, అది కేవలం ఒక కథగా కాకుండా మన జీవితానికే అద్దం పట్టినట్టుగా అనిపిస్తుంది. ఆయన రచనల్లోని నిజాయితీ, జీవన స్పర్శ పాఠకుడిలో మెల్లగా “నేనూ చేయగలను” అనే ఆత్మవిశ్వాసాన్ని మొలకెత్తిస్తుంది. ఇదే ఆయన రచనల గొప్పతనం, పాఠకులను ముందుకు నడిపించే అసలైన శక్తి.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు దృడ సంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించు అంటారు రచయిత.
అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా, పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. అవరోధాలు మనల్ని ఆపేందుకు కాదు, మనలోని శక్తిని వెలికి తీయడానికి వచ్చిన అవకాశాలు. శారీరక పరిమితులు విజయానికి అడ్డంకులు కావు; ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వైకల్యాన్నైనా జయించవచ్చు. జీవితంలో ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిరంతర కృషితో ముందుకు సాగితే విజయం తప్పక అతనిదే. జీవిత పాఠాలతో మనల్ని మనమే మలుచుకుంటూ, ఇతరులకు మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదగడమే నిజమైన విజయం అంటారు రచయిత కోట దామోదర్.
ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మహా అథ్లెట్ "ఉసేన్ బోల్ట్" జీవితాన్ని రచయిత అత్యంత స్ఫూర్తివంతంగా ఆవిష్కరించారు. అలుపెరుగని కృషి, అచంచలమైన పట్టుదలతో తొమ్మిదేళ్ల పాటు ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని ఏలిన మకుటం లేని రాజుగా బోల్ట్ నిలిచాడని వివరించారు. ఎన్నో ప్రపంచ రికార్డులు, ఒలింపిక్ విజయాలు సాధించినప్పటికీ, “నేను మీలాంటి సామాన్యుడినే” అని గర్వం లేకుండా చెప్పుకోవడం అతని మానవత్వానికి అద్దం పడుతుంది. బోల్ట్‌కు చిన్ననాటి నుంచి ఎక్కువగా నచ్చిన ఆట క్రికెట్ అయినప్పటికీ, తన కోచ్ ఇచ్చిన సలహాలు గౌరవించి రన్నింగ్ వైపు అడుగులు వేయడం అతని జీవితానికి మలుపుగా మారింది. అదే నిర్ణయం అతన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషిగా, విశ్వవిజేతగా నిలిపింది. ఈ వ్యాసం ద్వారా రచయిత తెలియజేసిన ముఖ్య సందేశం ఏమిటంటే సరైన మార్గనిర్దేశం, కష్టం, వినయం కలిసినప్పుడు అసాధ్యమనే మాట ఉండదు. ఉసేన్ బోల్ట్ జీవితం ప్రతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లినా వైనాన్ని దివ్యాంగుల తో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.
ఈ వ్యాసాలలో రచయిత సమాజంలో మార్పు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తుల జీవితాలను అద్భుతంగా వివరించారు. ఎన్నో సామాజిక అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఏడు సంవత్సరాల కఠినమైన శ్రమ తో చేనేత కార్మికుల కష్టాలు తగ్గించేందుకు “లక్ష్మీ ఆసు” యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ద్వారా ఆవిష్కరణకు పట్టుదల ఎంత ముఖ్యమో తెలియజేశారు.
ఇంకొక వ్యాసంలో, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ప్రతి మనిషి భగవంతుడితో సమానమని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికి డబ్బు కంటే మంచి మనసే అసలైన సంపద అనే సందేశాన్ని ఒక నిజ జీవిత సంఘటన ద్వారా హృద్యంగా అందించారు.
మరొక వ్యాసంలో, “ఈ దేశ పౌరుడిగా నాకు విద్యనభ్యసించే హక్కు ఉంది” అంటూ సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాడిన ఉద్యమ వీరుడి కథను వివరించి, హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో ఎంత అవసరమో బలంగా చాటారు.
ఇవి కేవలం వ్యాసాలు కావు…
జీవితానికి దారి చూపే దీపాలు.
నిరాశలో ఉన్నవారికి ఆశ్వాసం,
అలసిపోయిన వారికి ఉత్తేజం,
సంకల్పం కోల్పోయిన వారికి స్ఫూర్తి.
అవరోధాలే అవకాశాలవుతాయని
నమ్మించే శక్తి ఈ పుస్తకానికి ఉంది.
జీవితం ఎదురయ్యే ప్రతి కష్టాన్ని
ఒక పాఠంగా, ఒక మెట్టుగా మార్చుకోవచ్చని
ఈ పుస్తకం మౌనంగా చెబుతుంది.
ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని, జీవితం పట్ల ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠకులలో నింపుతుంది. పేదరికం, ఆకలి, పరిమితులు, ఓటమి విజయానికి అడ్డంకులు కావని—సంకల్పబలం, నిరంతర కృషి ఉంటే పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజయాల దాకా ఎదగవచ్చని స్పష్టంగా తెలియజేస్తుంది. గెలుపు–ఓటములు జీవితంలో సహజమని, వాటికి అతిగా పొంగిపోకుండా లేదా కుంగిపోకుండా సమతా భావంతో ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమని ఈ వ్యాసాలు బోధిస్తాయి. మొత్తం మీద, ఈ రచనలు ప్రతి పాఠకుడిలో ధైర్యం, ఆశ, లక్ష్యసాధన పట్ల విశ్వాసం పెంపొందించడమే ప్రధాన సందేశం గా నిలుస్తాయి. వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
Prof Ravinder Rena
డర్బన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ
సౌత్ ఆఫ్రికా,
Mobile: +27 847828059
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి