5, ఏప్రిల్ 2026, ఆదివారం

నేతన్నలపై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?

 నేతన్నలపై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?


ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అంతేకాకుండా సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీకి ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇటు టెస్కో, అటు చేనేత కార్మికులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తోంది. ఒకవైపు నేతన్న అప్పులబాధతో సతమతమవుతుండగా, ఈ నిర్ణయాలు “పుండుమీద కారం చల్లినట్లు” వారి బాధను మరింతగా పెంచుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ నిర్ణయం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘కంచంలోని కూడును లాక్కున్నట్లుగా’ ఉంది. ఆర్డర్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిన ప్రభుత్వమే చేతికందిన పనిని లాక్కుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏంటి?  

అయితే, ఇలాంటి సంక్షోభాలే చేనేత వర్గం సహనాన్ని, పోరాటస్ఫూర్తిని పరీక్షించే సందర్భాలు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, చేనేత కార్మికులు ఎప్పుడూ వెనుదిరగలేదు. ప్రభుత్వం గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం రాకముందు చేనేత రంగం దేశానికి వెన్నుముకగా పనిచేసిందన్న విషయాన్ని విస్మరించడం సమంజసం కాదు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో కూడా చేనేత వర్గం ఎనలేని సేవలు అందించింది. స్వరాష్ట్రం కోసం చేనేత కార్మికులు ప్రాణత్యాగాలు చేశారన్న విషయం ప్రభుత్వం మరిచిందేమో గానీ, ప్రజలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా చేనేత ఉద్యమం ఉవ్వెత్తున ఒక జ్వాలలా వ్యాపించింది. మహత్మా గాంధీ ఇచ్చిన స్వదేశీ పిలుపుతో ప్రతి ఇంట్లో చరఖా తిరిగింది. ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని మహాత్మా గాంధీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. చేనేత రంగం ద్వారా దేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ప్రతిఘటనగా మారిందన్న విషయం ప్రభుత్వం విస్మరించింది.

ఏళ్లు గడిచినా మహాత్ముడి ఆకాంక్షలు నెరవేరకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే, కొత్త హామీలు గురించి పక్కన పెడితే, ఉన్నవే క్రమంగా కనుమరుగవుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇచ్చిన హామీలను ఒకసారి గమనిస్తే—

1. స్కూల్ యూనిఫార్మ్స్, దుప్పట్లు, ఇతర ప్రభుత్వ అవసరాలకు చేనేత వస్త్రాల వినియోగం పెంచుతూ ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
2. “నేతన్నకు చేయూత” వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి, కార్మికుల ఆదాయం పెంచుతామని చెప్పారు.
3. ముడి సరుకులైన నూలు, రంగులను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు.
4. తక్కువ వడ్డీ రుణాలు, అప్పుల భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
5. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించి, ఆన్‌లైన్ అమ్మకాలకు సహాయం చేస్తామని ప్రకటించారు.

అయితే, ఈ హామీల్లో నిజంగా ఎన్ని అమలయ్యాయి అన్నది ప్రతి నేత కార్మికుడికి బాగా తెలుసు. హామీలు కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోకపోవడం చేనేత వర్గంలో నిరాశను మరింతగా పెంచింది.

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రజల్లో ఆశలను రగిలిస్తాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అవి అమలు కావు, ఆవిరి అయిపోతాయి. హామీల అమలు అనే అంశం నేటి రాజకీయాల్లో ఒక చేదు వాస్తవంగా మారింది. “చెప్పేది ఒకటి, చేసేది మరోటి” అన్న భావన ప్రజల్లో బలపడుతోంది.

ఈమధ్య కాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. కానీ అవి అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టకపోవడం ఫలితంగా హామీలు కాగితాలపైనే మిగిలిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు అనేక రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి, ఇచ్చిన హామీల అమలును వాయిదా వేస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఇతర ప్రాధాన్యాలపై ఖర్చులు కొనసాగుతుండడం ప్రజల్లో సందేహాలు కలిగిస్తుంది. హామీల అమలుపై సరైన మానిటరింగ్ లేకపోవడం బాధ్యతా లోపం అని చెప్పక తప్పదు. ఎవరు బాధ్యత వహించాలన్న స్పష్టత లేకపోవడం వల్ల అవి క్రమంగా మరుగున పడుతున్నాయి. ఎన్నికల తర్వాత నాయకులపై ఉన్న ఒత్తిడి తగ్గిపోవడంతో, హామీల ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది.
హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని అమలు చేయడం నిజమైన నాయకత్వం. నేటి రాజకీయాల్లో మాటలకు మించి కార్యాచరణకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది.

ఊకదంపుడు ఉపన్యాసాలతో నోటికొచ్చిన హామీలు ఇస్తూ, నేత కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే భావన బలపడుతోంది. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కృషి కనిపించకపోవడం ఆవేదనకరమైన విషయం. "దయలేని అత్తకి దండం పెట్టినా తప్పే" అన్నట్లు  దయలేని ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా ఏమి లాభం, చేనేత కార్మికుడికి కన్నీరే తప్ప!  

ఇకనైనా నేత కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి సరైన న్యాయం అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

కామెంట్‌లు లేవు:

*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*

  "*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*!   మూడో కన్ను తెరవగానే ప్రపంచం మొత్తం మన కళ్లముందే ప్రత్యేక్షమైనట్లు. మూస...