5, ఏప్రిల్ 2026, ఆదివారం

వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి

 వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి 


ఆర్చరీ లేదా విలువిద్యలో రాణించాలంటే శారీరక సమతుల్యత, కచ్చితమైన ప్రణాళిక, సాధించాలనే పట్టుదల ఇవన్నీ తప్పనిసరి. ముఖ్యంగా చేతులు లేని వారు ఈ క్రీడలో రాణించడం అసాధ్యం అనిపించడం సహజం. కానీ అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగా మార్చిన స్ఫూర్తిదాయకమైన యువ క్రీడాకారిణి జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి.

రెండు చేతులు లేకపోయినా, మొక్కవోని పట్టుదలతో ఆమె తన కాళ్లతో, భుజాల సహాయంతో విల్లు ఎక్కించి బాణాలు సంధించడం నేర్చుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సంకల్పబలం ఎంత శక్తివంతమైనదో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం శీతల్ దేవి జీవన గాధ.

వైకల్యం ఒక అవరోధం అయినప్పటికీ, ఆ అవరోధాన్నే ఆమె అవకాశంగా మార్చుకుంది. అదే అవరోధం ఆమెకు ప్రేరణగా మారింది. తన శారీరక పరిస్థితిని ఒక దుర్బలంగా  భావించకుండా, తన లక్ష్యాన్ని చేరుకునే ఉద్దేశంతో ఆమె దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన శీతల్ దేవి “చేతులు లేని” ఏకైక మహిళా ఆర్చర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

రెండు చేతులు లేకపోయినప్పటికీ, తన కాలి వేళ్లు మరియు భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ఆమె ప్రతిభను చూసి ప్రేక్షకులు తమ కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆమె క్రీడా నైపుణ్యం మరియు సంకల్పబలం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ప్రాంగణానికి తరలి వచ్చే అభిమానులు కోకొల్లలు. ఆమె వదిలే ప్రతి బాణం లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ప్రేక్షకుల హృదయాలనూ తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ అద్భుత ప్రతిభతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధిస్తున్న శీతల్ దేవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో వార్షిక అవార్డులలో ఆమెను “పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకు ఎంపిక చేస్తూ ప్రపంచ ఆర్చరీ సంస్థ గౌరవించింది.

ప్రపంచ క్రీడా రంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రేరణాత్మక వ్యక్తుల్లో ప్రముఖుడు 'మాట్ స్టట్జ్మాన్' ఒకరు. ఆయనను “Armless Archer” అని కూడా పిలుస్తుంటారు. చేతులు లేకపోయినా, తన కాళ్ల సహాయంతో విల్లు పట్టి బాణం సంధిస్తూ ప్రపంచస్థాయిలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు ఆయన. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి, ప్రపంచం గర్వించదగిన విలుకాడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

అలాగే మహిళా విభాగంలో శీతల్ దేవీ ఒక గర్వించదగిన క్రీడాకారిణిగా ఆవిర్భవించారు. ఆమె చిన్న వయసులోనే విలువిద్యలో చేరి, కఠిన సాధనతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఆమె విజయాలు భారతదేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తన దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గొప్ప విలువిద్యా క్రీడాకారిణిగా నిలిచింది.

'మాట్ స్టట్జ్మాన్' మరియు 'శీతల్ దేవీ' వంటి మహోన్నత క్రీడాకారుల జీవితాలు ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. వీరిద్దరూ శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, దానిని ఒక ప్రతిబంధకంగా భావించకుండా ఒక సవాలుగా తీసుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. వారి విజయాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. మనిషికి శారీరక పరిమితులు ఉన్నా, మనస్సుకు మాత్రం పరిమితులు ఉండకూడదు.

వారి జీవితాలను పరిశీలిస్తే, దృఢ సంకల్పం, కష్టపడే స్వభావం, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగకుండా, నిరంతరం సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించాలంటే కష్టపడటం తప్పనిసరి అనే సూచననిస్తుంది.

అలాగే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం కూడా వీరి నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తమ వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా, అదే తమ ప్రత్యేకతగా మార్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం ఒక్కరోజులో రాదు. నిరంతర సాధన, కృషి ఉంటేనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అనే అక్షర సత్యాన్ని వారి జీవితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

కాబట్టి ప్రతి విద్యార్థి వీరి జీవితాల నుండి స్ఫూర్తి పొందుతూ, ఏ పరిస్థితులైనా ఎదుర్కొని, తమ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఘన విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
 
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*

  "*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*!   మూడో కన్ను తెరవగానే ప్రపంచం మొత్తం మన కళ్లముందే ప్రత్యేక్షమైనట్లు. మూస...