31, అక్టోబర్ 2026, శనివారం

జపాన్‌లో పాటించే 7 ఆసక్తికరమైన అలవాట్లు

 జపాన్‌లో పాటించే 7 ఆసక్తికరమైన అలవాట్లు


ప్రపంచంలో ప్రతి దేశానికీ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. కానీ జపాన్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే, అక్కడి క్రమశిక్షణ, పరిశుభ్రత, నిశ్శబ్దం, ఇతరులను గౌరవించే తీరు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే సరదాగా జపాన్‌ను “నో చెప్పే దేశం” అని కూడా అంటుంటారు. అక్కడ మనకు సాధారణంగా అనిపించే కొన్ని పనులకు కూడా "నో" అనే చెప్తారు. కొన్ని అలవాట్లను అక్కడి సంస్కృతి అంతగా ఆమోదించదు. 

జపాన్‌ జీవనశైలిలోని ఏడు ప్రత్యేక అలవాట్లు తెలుసుకుంటే… “దేశం అభివృద్ధి చెందడం అంటే కేవలం మౌలిక వసతులు పెరగడం కాదు, ప్రజల ప్రవర్తనలో బాధ్యత పెరగడం కూడా” అనే విషయం మనకు స్పష్టమవుతుంది.

1. రెస్టారెంట్‌ లేదా హోటల్‌లో మంచి సేవ అందించినప్పుడు టిప్‌ ఇవ్వడం మనకు సాధారణం. అయితే జపాన్‌లో మాత్రం టిప్‌ ఇవ్వడం సాధారణ సంస్కృతి కాదు. అక్కడ మంచి సేవ అందించడం ఉద్యోగ బాధ్యతలో భాగంగానే భావిస్తారు. అందుకే సేవకు ప్రతిఫలంగా అదనంగా డబ్బు ఇవ్వడం కంటే, తమ పనిని నిబద్ధతతో, శ్రద్ధగా చేయడాన్నే గౌరవంగా భావించే సంస్కృతి జపాన్‌లో కనిపిస్తుంది. మంచి సేవ అందించినందుకు ప్రత్యేకంగా టిప్‌ ఇవ్వాల్సిన అవసరం సాధారణంగా ఉండదు.

2. ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిశ్శబ్దంగా ఉండటానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. రైలు లేదా బస్సులో ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టుకోవడం అక్కడ సాధారణ పద్ధతి. ప్రయాణ సమయంలో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడటం లేదా గట్టిగా మాట్లాడటం ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుందని భావిస్తారు. అందుకే తమ చుట్టూ ఉన్నవారి ప్రశాంతతను గౌరవించడం అక్కడి సామాజిక సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా కనిపిస్తుంది.

3. రోడ్డుపై నడుచుకుంటూ తినడం సాధారణంగా అంతగా ప్రోత్సహించరు. తినే సమయంలో ఒకచోట ఆగి, ప్రశాంతంగా ఆహారం తీసుకోవడమే మంచిదనే భావన అక్కడ కనిపిస్తుంది. తాము తినే ఆహారం వల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనకు అక్కడి సంస్కృతిలో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే తినే విషయంలో కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటాన్ని గౌరవంగా భావిస్తారు.

4. జపాన్‌లో ఆశ్చర్యం కలిగించే విషయాల్లో ఇది కూడా ఒకటి. చాలా ప్రాంతాల్లో మనం సాధారణంగా చూసేంతగా చెత్త బుట్టలు కనిపించవు. అయినప్పటికీ అక్కడి వీధులు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. చెత్త బుట్ట కనిపించకపోతే చెత్తను రోడ్డుపై పడేయకుండా, తమతోనే తీసుకెళ్లడం అక్కడి ప్రజల్లో కనిపించే అలవాటు. అవసరమైతే గంటల తరబడి తమ చెత్తను వెంట తీసుకెళ్లినా, బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు.

5. రోడ్డుపై లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, హత్తుకోవడం వంటి ప్రేమ ప్రదర్శనలు జపాన్‌లో సాధారణంగా అంతగా కనిపించవు. వ్యక్తిగత భావాలను అందరి ముందూ బహిరంగంగా ప్రదర్శించకుండా, కొంత సంయమనంతో వ్యవహరించడం అక్కడి సామాజిక ప్రవర్తనలో సాధారణంగా కనిపిస్తుంది. అంటే ప్రేమను చూపించకూడదని కాదు. వ్యక్తిగత భావాలను వ్యక్తిగతంగానే ఉంచుకోవడం అక్కడి సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది.

6. జపాన్‌లో ఇంట్లోకి చెప్పులతో వెళ్లడం మర్యాదలేని పనిగా భావిస్తారు. ఇంటి బయట ఉన్న మురికి లోపలికి రాకుండా ఉండేందుకు, ప్రవేశ ద్వారం దగ్గరే చెప్పులు విప్పి లోపలికి వెళ్లడం అక్కడ సాధారణ పద్ధతి. ఇళ్లలోనే కాకుండా కొన్ని దేవాలయాలు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో కూడా చెప్పులు బయటే విడిచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చాలాచోట్ల లోపల వేసుకోవడానికి ప్రత్యేకమైన స్లిప్పర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

7. జపాన్‌లో లిఫ్టులోకి ఎక్కగానే మరో ఆసక్తికరమైన విషయం గమనించవచ్చు. తలుపులు మూసుకున్న వెంటనే చాలామంది నిశ్శబ్దంగా ఉంటారు. పక్కన స్నేహితులు ఉన్నా కూడా గట్టిగా మాట్లాడకుండా, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండటాన్ని మర్యాదగా భావిస్తారు. కొన్ని నిమిషాల లిఫ్ట్ ప్రయాణమే అయినా. ఇతరుల ప్రశాంతతను గౌరవించడం అక్కడి సంస్కృతిలో భాగం.

క్రమశిక్షణే జపాన్‌ ప్రత్యేకత

ఈ నియమాలను కేవలం ఒక దేశంలో పాటించే నిబంధనలుగా చూడటం కంటే, వాటి వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
“నేను చేసే పని వల్ల పక్కవాళ్లకు ఇబ్బంది కలగకూడదు” అనే సామాజిక బాధ్యత జపాన్‌ సంస్కృతిలో బలంగా కనిపిస్తుంది.

అందుకే టిప్‌ ఇవ్వకపోవడం, రైల్లో ఫోన్‌ మాట్లాడకపోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకపోవడం, చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్లడం వంటి చిన్న చిన్న అలవాట్ల ద్వారా కూడా క్రమశిక్షణ, పరిశుభ్రత, ఇతరుల పట్ల గౌరవాన్ని పాటించేందుకు ప్రాధాన్యత ఇస్తారు.

మనకు “నో” అనిపించే ఈ చిన్న చిన్న అలవాట్ల వెనుక నిజానికి చాలా పెద్ద అర్థం ఉంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

'ముసలమ్మ నేర్పిన బతుకు పాఠం'.

 'ముసలమ్మ నేర్పిన బతుకు పాఠం'.


అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లె చివర పెద్ద మర్రిచెట్టు ఒకటుండేది. సాయంత్రం అయితే చాలు... ఊరి జనాలంతా ఆ మర్రిచెట్టు కింద చేరేటోళ్లు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకునేటోళ్లు, పిల్లలు మాత్రం చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకునేవాళ్లు.

ఆ మర్రిచెట్టుకు కాస్త దూరంలో ఓ చిన్న గుడిసె ఉండేది.

ఆ గుడిసెలో ఓ ముసలమ్మ ఒంటరిగానే ఉండేది. జుట్టంతా తెల్లగా, ముఖం నిండా వయసు తెచ్చిన ముడతలు. కానీ ఆ ముడతల మధ్య నుంచి కనిపించే ఆమె నవ్వు మాత్రం చిన్న పిల్లల నవ్వులా స్వచ్ఛంగా ఉండేది.

ఊళ్లో అందరూ ఆమెను “ముసలమ్మ” అని పిలిచేవాళ్లు. ఆమెకు పిల్లలు లేరు. మొగుడు కూడా ఏళ్ల కిందటే చచ్చిపోయిండు. అయినా సరే... “నా బతుకే నాశనం అయిపోయింది... నా కర్మ ఇంతే...” అంటూ ఎప్పుడూ ఎవరి దగ్గరా ఏడ్చేది కాదు.

పైగా ఎవడైనా బాధలో కనిపిస్తే... “ఏందిరా బిడ్డా... మొహం అట్లా పెట్టుకున్నవ్? నవ్వితే పైసలు ఖర్చవుతయా?” అంటూ నవ్వించేది.

అందుకే ఆ ముసలమ్మంటే ఊరంతా అభిమానం.

ఆ ఊర్లో అందరూ కస్టపడి ఏదొక పనిచేసేవాళ్ళే, రైతులు పొద్దున్నే లేచి పొలానికి పోయేవాళ్లు. చేతివృత్తుల పనిచేసేవారు. కొందరు సంతలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతికేవాళ్లు.ఇది ఆ పల్లె బతుకు తీరు. వాన పడకపోతే పంట ఎండిపోతుంది. పంట ఎండిపోతే రైతు గుండె ఎండిపోతుంది.
ఇంట్లో ఎవరికైనా జబ్బు వస్తే చేతిలో ఉన్న నాలుగు పైసలు ఆసుపత్రికే పోతాయి. అందుకే ఊళ్లో చాలామంది ఏదో ఒక దిగులుతోనే తిరిగేవాళ్లు.
కానీ ఆ ముసలమ్మ మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది.

ఒకరోజు మధ్యాహ్నం. ముసలమ్మ మర్రిచెట్టు కింద కూర్చుని పొగాకు సుట్ట తాగుతుంది . అప్పుడే ఒకావిడ ఏడుస్తూ అక్కడికి వచ్చింది. ఆమె పేరు జయమ్మ. ఏడ్చుకుంటూ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ముసలమ్మ దగ్గరికి వచ్చింది.
“ఏందమ్మా... ఏమైంది?” అని ముసలమ్మ అడిగింది.

జయమ్మ ఏం మాట్లాడకుండా కాసేపు ఏడ్చింది.

“అయ్యో ముసలమ్మా... నా బతుకు ఏం అవుతదో అర్థం కావట్లేదు,” అంది జయమ్మ.

“బిడ్డా ముందు కూర్చో. నిల్చొని ఏడిస్తే సమస్య చిన్నదవుతుందా? కూర్చొని ఏడిస్తే పెద్దదవుతుందా?” అంటూ ముసలమ్మ నవ్వింది.

జయమ్మకు నవ్వాలో ఏడవాలో అర్ధంగాక ఏడుపులోనే చిన్న నవ్వొచ్చింది.

“అదిగో! ఇదే కావాలి నాకు,” అంది ముసలమ్మ.

“ఏం జరిగిందో చెప్పు.” రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ...

“నా మొగుడు పని కోసం సిటీకి పోయిండు. పోయి చాలా రోజులైంది. డబ్బులు పంపలేదు. ఇంట్లో పిల్లలకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆయనకు పని దొరికిందో లేదో కూడా తెల్వదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ముసలమ్మా...” అంది.

ముసలమ్మ కాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయింది.

“అయితే నువ్వు ఏం అవుతుందని అనుకుంటున్నావు?” అని అడిగింది.

“ఏమో... ఏదో చెడు జరుగుతుందేమో అనిపిస్తంది. ఆయనకు పని దొరకకపోతే? ఇక్కడ నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏం అవుతది?” అంది జయమ్మ.

ముసలమ్మ నవ్వింది.

“అదే నీ అసలు సమస్య.” జయమ్మ ఆశ్చర్యంగా చూసింది.

“ఏంటి ముసలమ్మా?” అప్పుడు ముసలమ్మా అంది “నీ మొగుడు సిటీలో ఏం చేస్తున్నాడో నీకు తెల్వదు. కానీ నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని అతని గురించి వంద రకాలుగా ఊహించుకుంటున్నావ్. జరిగిందేంటి? నీకు తెల్వదు. జరగబోయేది ఏంటి? అదీ తెల్వదు. కానీ భయపడటం మాత్రమే తెలుసు అంది!”

జయమ్మ మౌనంగా ఉండిపోయింది. ముసలమ్మ మెల్లగా అంది... “బిడ్డా  మనసు కూడా మన ఇంటి గడప లాంటిది. దాంట్లోకి ఏది పంపిస్తే అదే లోపల తిరుగుతుంటది. చెడు ఆలోచన పంపిస్తే భయం తిరుగుతది. మంచి ఆలోచన పంపిస్తే ధైర్యం తిరుగుతది.”

జయమ్మ నెమ్మదిగా అడిగింది. “కానీ ముసలమ్మా... పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మంచి ఆలోచన ఎలా వస్తది?”

“అదే నేను నీకు ఓ కథ చెబుతా. విను.”

“ఒక పేదవాడు ఉండేవాడు. అతని దగ్గర డబ్బు లేదు. ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. తోడుగా ఉండే మనిషి కూడా లేడు.

ఒకరోజు నది ఒడ్డున కూర్చుని పిచ్చోడిలా ఏడుస్తున్నాడు.

‘నా బతుకు ఇంతే... దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించిండు?’ అంటూ ఏడుస్తున్నాడు.

అప్పుడొక ముసలావిడ అక్కడికి వచ్చింది. ‘ఏందిరా బిడ్డా, ఎందుకేడుస్తున్నావ్?’ అని అడిగింది. ఆ పేదవాడు ‘నా దగ్గర ఏమీ లేదు అవ్వా... నేనెలా సంతోషంగా ఉండాలి?’ అన్నాడు.

ఆ ముసలావిడ చుట్టూ చూసి... ‘ఏమీ లేవా?’ అంది.

‘ఏం లేవు.’ అన్నాడు ఆ పేదవాడు..

‘అదిగో ఆ నది కనిపిస్తుందా?’ ‘కనిపిస్తంది.’‘అది నీదే కదా...’ ‘అది నాదెలా అవుతుంది?’

‘నీ కళ్ల ముందు ఉంది కదా! దాన్ని చూసి ఆనందించలేవా?’

అని అడిగింది.

తర్వాత...

‘అదిగో చెట్లు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి. ఆకాశం ఉంది. సూర్యుడు ఉన్నాడు. గాలి ఉంది. నీకు ప్రాణం ఉంది. ఇవన్నీ ఉన్నా “నా దగ్గర ఏమీ లేదు” అంటున్నావ్.

నీ దగ్గర లేనిదాన్నే లెక్కపెడుతూ కూర్చుంటే బతుకంతా బాధే.

నీ దగ్గర ఉన్నదాన్ని ఒక్కసారి లెక్కపెట్టి చూడు... నీ గుండెకు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది’ అంది.

ఆ పేదోడు మొదటిసారి తన చుట్టూ చూశాడు.

నది కనిపించింది. చెట్లు కనిపించాయి. పక్షుల కిలకిలరావాలు వినిపించాయి.

సూర్యుడు కనిపించాడు. అతను మెల్లగా ఏడుపు ఆపేశాడు. ఆ రోజు అతని చేతిలో డబ్బు రాలేదు. ఇల్లు రాలేదు.

తిండి కూడా రాలేదు. కానీ... అతని మనసులో మాత్రం ఓ కొత్త ఆశ పుట్టింది.

ఆ ఆశతోనే మరుసటి రోజు పని కోసం బయలుదేరాడు.

అలా అతని బతుకు మెల్లగా మారడం మొదలైంది.”

ఆ తరువాత మెల్లగా ముసలమ్మ కథ ఆపింది.

జయమ్మకు  కథ అర్ధం అయింది వెంటనే “అయితే ముసలమ్మా... ఆ పేదోడికి మంచి ఆలోచన వచ్చిందని అతని సమస్యలన్నీ మాయమైపోయినయా?” అని జయమ్మ ముసలమ్మను అడిగింది.

ముసలమ్మ నవ్వింది.

“అయ్యో పిచ్చి పిల్లా!

సమస్యలు మాయమైపోలేదు.

సమస్యలను చూసే అతని చూపు మారింది.

అదే అసలు విషయం.

ఎవరికీ కష్టం రాకుండా ఉండదు.

కానీ కష్టం వచ్చినప్పుడు... ‘అయ్యో అయిపోయింది... నా బతుకు ఇంతే...’ అని కూర్చుంటే మనలోని ధైర్యం కూడా పోతది.

‘సరే... కష్టం వచ్చింది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి?’ అని ఆలోచిస్తే మనలో ఓ దారి కనిపిస్తది.”

జయమ్మ మౌనంగా ముసలమ్మ మాటలు వింటూ ఉంది.

“అంటే నేను కూడా నా ఆలోచనలు మార్చుకోవాలా?” అని అడిగింది.

“అవును బిడ్డా.

రేపు పొద్దున్నే లేచి మొదటగా...

‘ఈరోజు ఏదో మంచి జరుగుతది’ అని చెప్పుకో.

పిల్లలను చూసుకో. నీకు చేతనైన పని చేసుకో. నీ మొగుడు తిరిగి వస్తాడని నమ్మకం పెట్టుకో.

రేపు ఏం జరుగుతుందో రేపు చూసుకుందాం.

ఈరోజు జరగని చెడు విషయాన్ని ఊహించుకుని ఈరోజే ఎందుకు ఏడవాలి?”

జయమ్మ భయం కాస్త తగ్గింది.

“నిజమే ముసలమ్మా...”

“అదిగో! ఇప్పుడు నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావ్,” అంటూ ముసలమ్మ నవ్వింది.

జయమ్మ కూడా నవ్వింది.

“సరే ముసలమ్మా... ఇక నుంచి మంచి ఆలోచనలు చేస్తా.”

“అదే మొదటి అడుగు బిడ్డా.”

కొన్ని వారాల తర్వాత...
జయమ్మ నిజంగానే మారిపోయింది.

ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే...

“ఈరోజు మంచి రోజు అవుతది,” అని తనకు తానే చెప్పుకునేది.

పిల్లలకు తిండి పెట్టేది.

తనకు చేతనైన పని చేసేది.

మొగుడి కోసం ఎదురుచూస్తూనే ఉండేది.

కానీ ఈసారి భయంతో కాదు...

ఆశతో.

ఒకరోజు...

మధ్యాహ్నం వేళ. ఊరి పోస్టుమ్యాన్ రాధ ఇంటి ముందు ఆగాడు.

“రాధమ్మా! నీకు ఉత్తరం వచ్చింది!” అని అరిచాడు. రాధ గుండె ఒక్కసారిగా గుబులు మంది. వణుకుతున్న చేతులతో ఉత్తరం తీసుకుంది.

తెరిచి చదివింది.

ఆమె మొగుడికి సిటీలో పని దొరికింది.

మొదటి జీతం కూడా పంపించాడు.

ఆ వార్త చదివిన రాధ కళ్లలో నీళ్లు వచ్చాయి.

కానీ అవి ఈసారి బాధ కన్నీళ్లు కాదు...

సంతోషం కన్నీళ్లు.

ఆమె ఉత్తరం పట్టుకుని నేరుగా ముసలమ్మ దగ్గరకు పరుగెత్తింది.

“ముసలమ్మా!”

“ఏమైంది బిడ్డా?”

“నా మొగుడికి పని దొరికిందమ్మా! డబ్బులు కూడా పంపించిండు!”

ముసలమ్మ నవ్వింది.

“చూశావా?”

జయమ్మ నవ్వుతూ,

“నీ మాట నిజమైంది ముసలమ్మా!”

ముసలమ్మ వెంటనే అంది...

“నా మాట కాదు బిడ్డా...

నీ ఆలోచన మారింది. అదే నీ బలం.”

జయమ్మ ముసలమ్మ చేతులు పట్టుకుంది.

ఆ తర్వాత...
ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది.

ఎవరికైనా కష్టం వస్తే...

“ముసలమ్మ దగ్గరకు పోయి రా,” అనేవాళ్లు.

రైతు పంట గురించి బాధపడితే ముసలమ్మ ఓ మాట చెప్పేది.

“పంట నీ చేతిలో లేదు. కానీ పొలంలో కష్టపడటం నీ చేతిలో ఉంది.”

ఎవరైనా అప్పుల గురించి బాధపడితే...

“అప్పు గురించి ఏడుస్తూ కూర్చుంటే అప్పు తగ్గుతుందా? రేపటి దారి గురించి ఆలోచించు,” అనేది.

అలా ఆ ముసలమ్మ మాటలు ఊరంతా పాకిపోయాయి.

ఆమె దగ్గర మందు లేదు. డబ్బు లేదు. పెద్ద చదువు లేదు.

కానీ...

మనిషి మనసుకు ధైర్యం ఇచ్చే మాటలు ఉన్నాయి.

అందుకే ఊళ్లో ఎవరైనా నిరాశగా ఉంటే...

“ముసలమ్మ దగ్గరకు పోదాం రా,” అనేవాళ్లు.

ముసలమ్మ మాత్రం ఎప్పటిలాగే మర్రిచెట్టు కింద కూర్చుని నవ్వుతూ ఉండేది.

ఎవరైనా,

“ముసలమ్మా... నువ్వెప్పుడూ ఇంత సంతోషంగా ఎలా ఉంటావ్?” అని అడిగితే...

ఆమె నవ్వి ఒక్కటే మాట చెప్పేది.

“బతుకులో కష్టం మనం ఎంచుకోలేం బిడ్డా...
కానీ ఆ కష్టాన్ని ఎట్లా ఎదుర్కోవాలో మాత్రం మనమే ఎంచుకోవచ్చు.”

అంతే...ఆమె మాట విన్నవాళ్ల ముఖాల్లో మళ్లీ చిన్న చిరునవ్వు కనిపించేది.

ఆ పల్లెలో అందరూ ఒక్క విషయం మాత్రం బాగా నేర్చుకున్నారు...

కష్టం వచ్చినప్పుడు భయపడటం సహజం.
కానీ ఆ భయానికే లొంగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.

మంచి ఆలోచన సమస్యలను మాయం చేయకపోవచ్చు.
కానీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.

అందుకే...

ఎంత కష్టం వచ్చినా ఆశను వదులుకోకూడదు.
ఎందుకంటే చీకటి ఎంత పెద్దదైనా...
చిన్న దీపం వెలిగితే దారి కనిపిస్తుంది.


రచయిత
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంతోషంగా జీవించడానికి ఏడు అలవాట్లు!

 సంతోషంగా జీవించడానికి ఏడు అలవాట్లు!


సంతోషం అనేది డబ్బులోనో, హోదాలోనో, పరిస్థితుల్లోనో ఉండదు. మనం ప్రతిరోజూ అలవాటు చేసుకునే చిన్న చిన్న మంచి పనుల్లోనే ఉంటుంది. అవే మన ఆలోచనలను మార్చి, మనసుకు ప్రశాంతతను అందించి, జీవితాన్ని చూసే దృక్పథాన్ని అందంగా మారుస్తాయి.

అందుకే ఈ రోజు మనం తెలుసుకోబోయే ఏడు చిన్న అలవాట్లు ఎంతో విలువైనవి. వీటిని ఆచరించడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు. ప్రత్యేకమైన ప్రతిభ అవసరం లేదు. గంటల తరబడి సమయాన్ని కేటాయించాల్సిన పనీ లేదు.

మనసును కొద్దిగా మార్చుకోవాలనే సంకల్పం ఉంటే చాలు.

1. ఉదయం నిద్రలేవగానే చాలామంది చేసే మొదటి పని ఫోన్‌ చేతిలోకి తీసుకోవడం. నోటిఫికేషన్లు చూడడం. వాట్సాప్‌ సందేశాలు చదవడం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల రీల్స్ చూడడం. ఎవరో సాధించిన విజయాన్ని చూస్తాం. మరొకరి సంతోషాన్ని చూస్తాం. ప్రపంచంలో జరుగుతున్న సమస్యలను మనసులోకి తీసుకుంటాం. ఇంకా మన రోజు ప్రారంభం కాకుండానే మన మనసు మాత్రం అప్పటికే అలసిపోయి ఉంటుంది. అందుకే ఉదయం ఒక చిన్న మార్పు ప్రయత్నం చేసి చూడండి. నిద్రలేవగానే కనీసం రెండు నిమిషాల పాటు ఫోన్‌ను పక్కన పెట్టండి. ఏ సందేశమూ చూడకండి. ఏ వార్తా చదవకండి. ఎవరి జీవితంతోనూ మీ జీవితాన్ని పోల్చుకోకండి.

2. మనిషి మనసుకు ఒక విచిత్రమైన స్వభావం ఉంది. మన దగ్గర ఉన్న పది మంచి విషయాలను మరిచిపోయి, మన దగ్గర లేని ఒక్క విషయం గురించి గంటల తరబడి ఆలోచిస్తాం. మంచి ఇల్లు ఉన్నా, ఇంకొకరికి ఉన్న పెద్ద ఇంటిని చూసి బాధపడతాం. ఉద్యోగం ఉన్నా, ఇంకొకరు సంపాదించే జీతాన్ని చూసి అసంతృప్తి చెందుతాం. మన చుట్టూ మనల్ని ప్రేమించే వాళ్లు ఉన్నా, మనకు నచ్చిన వ్యక్తి మనల్ని పట్టించుకోలేదని బాధపడతాం. ఇలా మన దగ్గర ఉన్న ఆనందాన్ని మనమే గుర్తించకుండా పోతాం. దీనికి ఒక చిన్న పరిష్కారం ఉంది. రోజులో ఒక్కసారైనా, కేవలం ఐదు సెకన్ల పాటు మీ జీవితంలో ఉన్న ఒక మంచి విషయాన్ని గుర్తించండి.

3. ఈ రోజుల్లో చాలామంది ఎవరైనా తమ కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటారు. ఎవరో తమ ప్రయత్నాన్ని అభినందించాలని ఆశిస్తారు. కానీ మనం చాలాసార్లు ఇతరుల తప్పులను వెంటనే గుర్తిస్తాం. వారి లోపాలను సులభంగా ఎత్తిచూపుతాం. వాళ్లు సరిగ్గా చేయని పనుల గురించి మాట్లాడటానికి వెనుకాడం. అయితే వాళ్లు బాగా చేసిన పనిని గుర్తించి చెప్పడానికి మాత్రం మనకు మాటలు రావు. అందుకే ప్రతిరోజూ ఒక చిన్న పని చేయండి. కనీసం ఒక్కరినైనా నిజాయితీగా అభినందించండి.

4. వ్యాయామం చేయాలని మనలో చాలామంది అనుకుంటారు. కానీ వ్యాయామం అనగానే మన కళ్ల ముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. పెద్ద జిమ్‌. గంటల తరబడి కసరత్తులు. బరువులు ఎత్తడం. వేగంగా పరుగెత్తడం. చెమటలు పట్టేంత కష్టం చేయడం. ఇవన్నీ చేయలేమని అనిపించగానే మనం ఒక నిర్ణయానికి వస్తాం. “ఇప్పుడు సమయం లేదు. వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాను.” ఆ వచ్చే నెల మళ్లీ మరో నెలగా మారుతుంది. చివరికి మనం చేయగలిగిన చిన్న పనిని కూడా చేయకుండా వదిలేస్తాం. కానీ ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. పది నిమిషాలు నడవండి. ఇంట్లోనే కొద్దిసేపు స్ట్రెచింగ్‌ చేయండి. మీకు ఇష్టమైన పాట పెట్టుకుని నృత్యం చేయండి. మీ శారీరక సామర్థ్యానికి తగిన సులభమైన వ్యాయామాలు చేయండి. ఇక్కడ ముఖ్యమైనది ఎంత కష్టమైన వ్యాయామం చేశారనేది కాదు. మీ శరీరానికి కదలికను అందించడం, మీకు సాధ్యమైన చిన్న చర్యను క్రమంగా కొనసాగించడం.

5. ఈ రోజుల్లో మనం ఒక చిన్న ఫోన్‌తో ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కానీ అదే ఫోన్ మన జీవితంలోని ప్రశాంతమైన క్షణాలను నెమ్మదిగా ఆక్రమిస్తున్నదనే విషయాన్ని మనం గుర్తించకపోవచ్చు. తింటున్నప్పుడు ఫోన్ చూస్తాం. మాట్లాడుతున్నప్పుడు సందేశాలు చదువుతాం. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వీడియోలు చూస్తాం. నిద్రపోయే ముందు కూడా తెరను వదలలేకపోతాం.

శరీరం ఒకచోట ఉన్నప్పటికీ, మనసు మాత్రం వందల విషయాల మధ్య తిరుగుతుంటుంది. అందుకే ప్రతిరోజూ కనీసం పదిహేను నిమిషాల పాటు ఫోన్‌, టీవీ, కంప్యూటర్‌ వంటి తెరలకు దూరంగా ఉండే సమయాన్ని కేటాయించండి.

ఆ సమయంలో బయట నడవండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ప్రశాంతంగా కూర్చోండి. ప్రకృతిని గమనించండి.

6. పగలంతా మనం ఎన్నో విషయాలను మనసులో దాచుకుంటాం. చేయాల్సిన పనులు, పరిష్కరించాల్సిన సమస్యలు, ఇతరులు చెప్పిన మాటలు, మనం చెప్పలేకపోయిన మాటలు, రేపటి గురించి భయాలు ఇలా మనసు తెలియకుండానే భారంగా మారుతుంది.

రాత్రి పడుకున్నప్పుడు శరీరానికి విశ్రాంతి కావాలి. కానీ మనసు మాత్రం గతాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పరుగులు తీస్తుంటుంది. ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న అవమానం కూడా గుర్తుకొస్తుంది. రేపు చేయాల్సిన పని గురించి ఆందోళన మొదలవుతుంది. అలా నిద్ర విశ్రాంతిగా కాకుండా ఆలోచనలతో చేసే పోరాటంగా మారుతుంది.

దీనికి సహాయపడగల ఒక చిన్న అలవాటు ఉంది. నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు కేటాయించి, మీ మనసులో ఉన్న విషయాలను కాగితంపై రాయండి. అలా మీ ఆలోచనలను రాసుకోవడం ద్వారా మనసులోని గందరగోళాన్ని కొంత తగ్గించుకునే అవకాశం ఉంది.

7. ఇప్పుడు ఈ ఏడు అలవాట్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. మిగిలిన అలవాట్లన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపే విషయం ఇదే. మన గురించి మనం ఏమి నమ్ముతున్నామో, ఆ నమ్మకం మన ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది.
“నా జీవితం ఎప్పటికీ మారదు” అని అనుకుంటే, మార్పు కోసం ప్రయత్నించాలనే ఆసక్తి తగ్గవచ్చు. “నేను సంతోషంగా ఉండలేను” అని నమ్మితే, సంతోషాన్ని కలిగించే చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అలాగే, “నా జీవితంలో చిన్న చిన్న మంచి మార్పులు తీసుకురాగలను” అని నమ్మడం ప్రారంభిస్తే, ఆ నమ్మకానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం సులభమవుతుంది. అందుకే ప్రఖ్యాత Atomic Habits పుస్తక రచయిత జేమ్స్‌ క్లియర్‌ ప్రస్తావించే ముఖ్యమైన ఆలోచన కూడా ఇదే. కేవలం మనం సాధించాలనుకునే ఫలితాలపైనే కాకుండా, మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామనే దానిపై దృష్టి పెట్టాలంటారు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475  

సంక్షోభాలను సవాళ్లుగా మార్చుకున్న క్రిస్టియానో రొనాల్డో!

 సంక్షోభాలను సవాళ్లుగా మార్చుకున్న క్రిస్టియానో రొనాల్డో!


కష్టకాలం మనిషిని కుంగదీయడానికి రాదు. అతనిలో దాగి ఉన్న అసలైన శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వస్తుంది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఓపికను ఆయుధంగా చేసుకుని, పట్టుదలను తోడుగా చేసుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన క్రీడా దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.

ప్రపంచ క్రీడాభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు అది.  పోర్చుగల్‌కు చెందిన ఈ ఫుట్‌బాల్ స్టార్‌ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ చరిత్రను తిరగరాశాడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అసాధ్యంగా కనిపించిన లక్ష్యాలను సుసాధ్యం చేసి, ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకంటూ చెరగని ముద్ర వేశాడు.

కానీ ఈరోజు ప్రపంచం చూస్తున్న ఆ మహా ఆటగాడి వెనుక. ఒకప్పుడు కన్నీళ్లతో నిండిన బాల్యం ఉంది. ఎన్నో అవరోధాలు, అవమానాలు ఉన్నాయి.  అన్నింటికంటే తన కలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని ఒక అచంచలమైన మనసు ఉంది.

చిన్నప్పటి నుంచే రొనాల్డోకు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పుస్తకాలను పక్కన పెట్టి మైదానం వైపు పరుగెత్తేవాడు. ఇతర పిల్లలకు ఫుట్‌బాల్ ఒక ఆట మాత్రమే. కానీ రొనాల్డోకు అది ఆట కాదు... అదే అతని భవిష్యత్తు. అదే అతని కల. అదే అతని జీవితం. కేవలం 12 ఏళ్ల వయసులోనే అతని జీవితాన్ని మార్చే అవకాశం వచ్చింది. స్పోర్టింగ్ అకాడమీలో చేరేందుకు తన కుటుంబాన్ని, స్నేహితులను వదిలి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది.

ఒక్కసారి ఆ వయసును ఊహించండి...

తల్లి ఒడిని వదిలి, కుటుంబానికి దూరంగా, స్నేహితుల జ్ఞాపకాల మధ్య
తెలియని ప్రదేశంలో ఒంటరిగా జీవించడం. అది ఒక చిన్న బాలుడికి ఎంతటి బాధో చెప్పడం కష్టం. ఎన్నో రాత్రులు రొనాల్డో దొంగచాటుగా ఏడ్చాడు. ఇంటి జ్ఞాపకాలు అతని హృదయాన్ని కలిచివేశాయి. ఒంటరితనం అతన్ని వెంటాడింది. అయినా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే అతని కళ్ల ముందు కన్నీళ్ల కంటే పెద్దదైన ఒక కల ఉంది. అకాడమీలో కూడా అతనికి పూలదారి కనిపించలేదు. అతని యాసను చూసి తోటి పిల్లలు ఎగతాళి చేశారు. అతని సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడారు. “నువ్వు ఎప్పటికీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు కాలేవు” అని కొందరు అన్నారు. కానీ రొనాల్డో విమర్శలకు మాటలతో సమాధానం ఇవ్వలేదు. కాలమే సమాధానం చెబుతుందని భావించాడు.

ఉదయం మైదానంలో ఇతరులు వెళ్లిపోయిన తర్వాత కూడా  ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసేవాడు. కానీ అతని జీవితంలో మరో పెద్ద పరీక్ష ఎదురైంది. అయితే విధి అతన్ని మరోసారి పరీక్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే అతని గుండెలో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఫుట్‌బాల్‌నే తన ప్రాణంగా భావించే ఆ బాలుడి కెరీర్ ఒక్క క్షణంలో ప్రశ్నార్థకమైంది. తాను కలలు కన్న ప్రపంచం తన కళ్ల ముందే కూలిపోతుందేమో అన్న పరిస్థితి.

ఆపరేషన్ జరిగింది.

కానీ రొనాల్డో అక్కడ కూడా ఓటమిని అంగీకరించలేదు. ఆపరేషన్‌ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. తన కల కోసం మరణంతో పోరాడి తిరిగి వచ్చిన ఒక యోధుడి అడుగు. 17 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసిన రొనాల్డో. మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తన అసాధారణ ప్రతిభను ప్రపంచానికి చూపించాడు. అతని ఆటను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అతని వేగం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం. ఆ యువ ఆటగాడిలో ఏదో ప్రత్యేకత ఉందని స్పష్టంగా తెలియజేశాయి. అప్పటి మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ సర్ అలెక్స్ ఫెర్గూసన్ కూడా ఆ ప్రతిభను గుర్తించారు.

ఆ క్షణం. రొనాల్డో జీవితంలో మరో మలుపు. అక్కడి నుంచి మొదలైంది ఒక ఫుట్‌బాల్ దిగ్గజం ఆవిర్భావం.

మైదానంలో ప్రతి అడుగు అతని కష్టానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రతి గోల్ అతను పడిన శ్రమకు ప్రతిఫలంగా మారింది. ప్రతి రికార్డు అతన్ని ఎగతాళి చేసిన వారికి ఇచ్చిన మౌన సమాధానంగా నిలిచింది. ఒకప్పుడు ఒంటరిగా ఏడ్చిన ఆ బాలుడిని చూసి ప్రపంచం నవ్వింది. కానీ అదే ప్రపంచం. తర్వాత అతని పేరు వింటే చప్పట్లు కొట్టింది. ఒకప్పుడు “నువ్వు సాధించలేవు” అన్నవాళ్లు ఉన్నారు. కానీ అదే రొనాల్డో, “అసాధ్యం” అనే పదానికి తన జీవితంతోనే అర్థం మార్చేశాడు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

*కాలాన్ని చూసి కలవరపడకు*

*కాలాన్ని చూసి కలవరపడకు*

నవ్వించేందుకు కన్నీళ్లను పరిచయం చేస్తుంది,
గెలుపు విలువను తెలిసేందుకు ఓటమిని ఎదురుపెడుతుంది,
మనుషుల్ని నమ్మడం నేర్పించి
నమ్మినవాళ్ల చేతుల్లోనే పాఠాలు నేర్పిస్తుంది!

కావాలనుకున్నవి చేతికి అందవు…
అక్కర్లేదనుకున్న జ్ఞాపకాలు మనసును వదలవు…

ఒకప్పుడు మనతో నడిచినవాళ్లు
మధ్యలోనే దారులు మార్చుకుంటారు…
మనకోసం వస్తారనుకున్నవాళ్లు
మన అవసరంలో కనిపించకుండా పోతారు…
పరిచయమే లేని కొందరు
పరిచయానికి మించిన ఆప్యాయతను పంచుతారు!

ఇదే జీవితం చేసే వింత మాయ…
ఎవరు మనవారో కాలం చెబుతుంది,
ఏది మనదో దూరం చెబుతుంది,
మనలో ఎంత బలముందో బాధ చెబుతుంది,
మనమెంత ఒంటరివారమో నిశ్శబ్దం చెబుతుంది!
కాలం గడిచేకొద్దీ
మనిషి మారుతున్నాడో,
మనిషిని అర్థం చేసుకునే మనసు మారుతుందో
తెలియని అయోమయం…
నిన్నటి కన్నీటికి కారణమైన విషయమే
రేపటి చిరునవ్వుకు కారణం కావచ్చు!

అందుకే…
జీవితాన్ని చూసి విసిగిపోకు,
మనుషుల్ని చూసి కుంగిపోకు,
కాలాన్ని చూసి కలవరపడకు…

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

జపాన్‌లో పాటించే 7 ఆసక్తికరమైన అలవాట్లు

  జపాన్‌లో పాటించే 7 ఆసక్తికరమైన అలవాట్లు ప్రపంచంలో ప్రతి దేశానికీ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. కానీ జపాన్‌ గురించి చ...