రాట్నం తిరగనంటుంది
మానవాళికి వస్త్రమై మర్యాదను అల్లిన చేతులవి…
మట్టి వాసనలో మమకారాన్ని నేసిన మనసులవి…
దేశమనే దేహానికి స్వదేశీ అనే శ్వాసను అందించిన చేనేత
రాట్నమే నేడు…“తిరగనంటుంది…”
నేతలు రాట్నం తిప్పిన ప్రతిసారి
బానిస సంకెళ్లపై స్వేచ్ఛా శంఖం మోగేది.
ప్రతి నూలు పోగులో స్వరాజ్య స్వప్నం మొలకెత్తేది.
ప్రతి ఖాదీ వస్త్రంలో భారతమాత గుండె చప్పుడు వినిపించేది.
విదేశీ వస్త్రాలను వెలిగే మంటల్లో విసిరేసి,
స్వదేశీ దీపాన్ని వెలిగించిన విప్లవ జ్యోతి…
ఆ చేనేత రాట్నమే కదా!
నేతన్న చెమట చుక్కలు దేశభక్తి గీతాలయ్యాయి…
నూలు పోగులు జాతీయ పతాకపు రంగులయ్యాయి…
మగ్గం శబ్దమే స్వాతంత్ర్య రణభేరిగా మారింది.
కానీ నేడు…
దేశం కోసం తమ జీవితాలనే నూలుపోగులుగా అర్పించిన
ఆ చేనేత త్యాగాలను కాలమే మడతపెట్టేసిందని…
అందుకే రాట్నం తిరగనంటుంది.
ఖాదీ వస్త్రాలు తొడిగే నేతన్నలపై నేతన్న
కన్నీటి బరువు కనిపించడం లేదని…
అందుకే రాట్నం తిరగనంటుంది.
జాతీయ పండుగల రోజు మాత్రమే ఖాదీని గౌరవించి,
మిగిలిన రోజుల్లో నేతన్నను మరచిపోయే నకిలీ దేశభక్తిని చూసి…
అందుకే రాట్నం తిరగనంటుంది.

కోట దామోదర్
మొబైల్ 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి