పేదరికంలేని స్విట్జర్లాండ్.. అభివృద్ధికి ఐదు సూత్రాలు!
స్విట్జర్లాండ్ అనగానే సంపద, మెరుగైన జీవనశైలి, అందమైన పర్వతాలు, ప్రకృతి అందాలే కాదు.. ఉద్యోగం పోయినా అండగా నిలిచే భరోసా, ప్రజల భద్రత, పరిశుభ్రమైన వీధులు కూడా గుర్తుకొస్తాయి!
ప్రపంచంలో పేదరికం అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి. అయితే అక్కడ పేదరికం పూర్తిగా లేదనడం సరికాదు. ఆ దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడంతోపాటు, వారు తిరిగి తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రభుత్వ విధానాలు తోడ్పడుతున్నాయి.
మన దగ్గర చాలా చోట్ల ఉద్యోగం పోతే కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఉన్న ఆస్తులు ఎక్కడ అమ్ముకోవాల్సి వస్తుందోననే ఆందోళన మొదలవుతుంది. కానీ స్విట్జర్లాండ్‌లో ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారకముందే ఆదుకునే సామాజిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. ఉద్యోగం కోల్పోయినవారికి నిరుద్యోగ భృతి, వృద్ధులకు పెన్షన్లు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సామాజిక సహాయం అందించే విధానాలు అమల్లో ఉన్నాయి.
స్విట్జర్లాండ్‌లో ఉద్యోగుల జీతాలు కూడా ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. 2024 గణాంకాల ప్రకారం పూర్తికాల ఉద్యోగుల స్థూల మధ్యస్థ నెలవారీ వేతనం 7,024 స్విస్ ఫ్రాంకులు. అయితే అక్కడ జీతాలు ఎక్కువగా ఉన్నాయని జీవితం సులభంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఇంటి అద్దెలు, ఆరోగ్య బీమా, నిత్యావసర సరుకులు, రవాణా వంటి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.
ఇంతకీ స్విట్జర్లాండ్‌లో పేదరికం తక్కువగా ఉండటానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండటానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
1. నాణ్యమైన విద్యా వ్యవస్థ
స్విట్జర్లాండ్‌లో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వృత్తి విద్య (Vocational Education and Training) ద్వారా విద్యార్థులకు చదువుతోపాటు పని నైపుణ్యాలను కూడా నేర్పిస్తారు. అక్కడ యువతలో దాదాపు మూడింట రెండొంతుల మంది వృత్తి విద్యా శిక్షణను ఎంచుకుంటారు. ఈ విధానంలో విద్యార్థులు తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకోవడంతోపాటు పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తూ ప్రత్యక్ష అనుభవం సంపాదిస్తారు. దీనినే అప్రెంటిస్‌షిప్ విధానం అంటారు. విద్యను కేవలం సర్టిఫికెట్లకే పరిమితం చేయకుండా ఉపాధికి అనుసంధానం చేయడం అక్కడి విద్యా విధానంలోని ప్రత్యేకత.
2. బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ
ఉద్యోగం కోల్పోయినవారికి, వృద్ధులకు, వికలాంగులకు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు స్విట్జర్లాండ్‌లో వివిధ సామాజిక భద్రతా పథకాలు అందుబాటులో ఉన్నాయి.
పెన్షన్లు, నిరుద్యోగ భృతి, కుటుంబ భత్యాలు, సామాజిక సహాయం ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి అండగా నిలుస్తారు. ముఖ్యంగా స్విట్జర్లాండ్ ఫెడరల్ స్టాటిస్టికల్ గణాంకాల ప్రకారం, 2023 సర్వేలో సామాజిక బదిలీలకు ముందు పేదరికం 16.8 శాతంగా ఉండగా, వాటి తర్వాత 8.1 శాతానికి తగ్గింది. అంటే సామాజిక భద్రతా వ్యవస్థ పేదరికాన్ని తగ్గించడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిరుద్యోగులకు కేవలం డబ్బు సహాయం చేయడమే కాదు, తిరిగి ఉద్యోగం సంపాదించుకునేందుకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా అందిస్తారు.
3. బలమైన ఆర్థిక వ్యవస్థ
స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్, ఔషధ, సాంకేతిక, యంత్రాల తయారీ రంగాలు ప్రధాన బలంగా ఉన్నాయి. అధిక విలువైన ఉత్పత్తులు, సేవలను ప్రపంచ మార్కెట్లకు అందిస్తూ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతోపాటు నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
4. అవినీతిని అదుపు చేసే పటిష్టమైన వ్యవస్థలు
స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధమైన పాలన, పారదర్శకత, ప్రభుత్వ సంస్థల జవాబుదారీతనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రజా ధన వినియోగంపై పర్యవేక్షణ ఉండటంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలు జవాబుదారీతనంతో పనిచేస్తాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 అవినీతి సూచికలో స్విట్జర్లాండ్ 100కి 81 పాయింట్లు సాధించింది. పారదర్శక పాలన, అవినీతి నియంత్రణ వల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరగడమే కాకుండా పెట్టుబడులు, వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.
5. క్రమశిక్షణ, వ్యక్తిగత బాధ్యతకు ప్రాధాన్యత
స్విట్జర్లాండ్ అభివృద్ధిలో ప్రజల క్రమశిక్షణ, సమయపాలన, చట్టాల పట్ల గౌరవం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజా ఆస్తులను కాపాడటం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పన్నులు చెల్లించడం, నిబంధనలు పాటించడం వంటి అంశాలకు అక్కడి సమాజంలో ప్రాధాన్యత ఉంది.
ప్రభుత్వం ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తూనే, వ్యక్తులు కూడా తమ బాధ్యతలను నిర్వర్తించేలా వ్యవస్థలు పనిచేస్తాయి. ప్రభుత్వ సహాయం పొందుతున్నవారిని తిరిగి ఉపాధిలోకి తీసుకురావడానికి శిక్షణ, ఉద్యోగ మార్గదర్శకత్వం వంటి చర్యలు చేపడతారు.
స్విట్జర్లాండ్ దేశాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటంటే.. పేదలకు ఆర్థిక సహాయం అందించడం అవసరమే. అదే సమయంలో వారు పేదరికం నుంచి బయటపడేందుకు నాణ్యమైన విద్య, ఉపాధి, నైపుణ్యాలు, సమాన అవకాశాలు కల్పించడం అంతకంటే ముఖ్యం.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే అభివృద్ధి కాదు. ఆ సహాయం ద్వారా ప్రజలు ఆర్థికంగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే నిజమైన సంక్షేమం.
"పేదరికాన్ని నిర్మూలించాలంటే పేదలకు డబ్బు పంచడం ఒక్కటే సరిపోదు. పేదరికాన్ని సృష్టించే పరిస్థితులను మార్చాలి. ప్రతి మనిషి తన కాళ్లపై తాను నిలబడేలా అవకాశాలు కల్పించాలి. సహాయం అందించే సమాజం గొప్పదే.. కానీ సహాయం అవసరం లేని స్థాయికి మనిషిని ఎదిగించే వ్యవస్థ అంతకంటే గొప్పది!"
ఇదే స్విట్జర్లాండ్ అభివృద్ధి నమూనా మనకు నేర్పిస్తున్న ముఖ్యమైన పాఠం.
వ్యాసకర్త:
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి