31, అక్టోబర్ 2026, శనివారం

సంక్షోభాలను సవాళ్లుగా మార్చుకున్న క్రిస్టియానో రొనాల్డో!

 సంక్షోభాలను సవాళ్లుగా మార్చుకున్న క్రిస్టియానో రొనాల్డో!


కష్టకాలం మనిషిని కుంగదీయడానికి రాదు. అతనిలో దాగి ఉన్న అసలైన శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వస్తుంది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఓపికను ఆయుధంగా చేసుకుని, పట్టుదలను తోడుగా చేసుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన క్రీడా దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.

ప్రపంచ క్రీడాభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు అది.  పోర్చుగల్‌కు చెందిన ఈ ఫుట్‌బాల్ స్టార్‌ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ చరిత్రను తిరగరాశాడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అసాధ్యంగా కనిపించిన లక్ష్యాలను సుసాధ్యం చేసి, ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకంటూ చెరగని ముద్ర వేశాడు.

కానీ ఈరోజు ప్రపంచం చూస్తున్న ఆ మహా ఆటగాడి వెనుక. ఒకప్పుడు కన్నీళ్లతో నిండిన బాల్యం ఉంది. ఎన్నో అవరోధాలు, అవమానాలు ఉన్నాయి.  అన్నింటికంటే తన కలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని ఒక అచంచలమైన మనసు ఉంది.

చిన్నప్పటి నుంచే రొనాల్డోకు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పుస్తకాలను పక్కన పెట్టి మైదానం వైపు పరుగెత్తేవాడు. ఇతర పిల్లలకు ఫుట్‌బాల్ ఒక ఆట మాత్రమే. కానీ రొనాల్డోకు అది ఆట కాదు... అదే అతని భవిష్యత్తు. అదే అతని కల. అదే అతని జీవితం. కేవలం 12 ఏళ్ల వయసులోనే అతని జీవితాన్ని మార్చే అవకాశం వచ్చింది. స్పోర్టింగ్ అకాడమీలో చేరేందుకు తన కుటుంబాన్ని, స్నేహితులను వదిలి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది.

ఒక్కసారి ఆ వయసును ఊహించండి...

తల్లి ఒడిని వదిలి, కుటుంబానికి దూరంగా, స్నేహితుల జ్ఞాపకాల మధ్య
తెలియని ప్రదేశంలో ఒంటరిగా జీవించడం. అది ఒక చిన్న బాలుడికి ఎంతటి బాధో చెప్పడం కష్టం. ఎన్నో రాత్రులు రొనాల్డో దొంగచాటుగా ఏడ్చాడు. ఇంటి జ్ఞాపకాలు అతని హృదయాన్ని కలిచివేశాయి. ఒంటరితనం అతన్ని వెంటాడింది. అయినా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే అతని కళ్ల ముందు కన్నీళ్ల కంటే పెద్దదైన ఒక కల ఉంది. అకాడమీలో కూడా అతనికి పూలదారి కనిపించలేదు. అతని యాసను చూసి తోటి పిల్లలు ఎగతాళి చేశారు. అతని సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడారు. “నువ్వు ఎప్పటికీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు కాలేవు” అని కొందరు అన్నారు. కానీ రొనాల్డో విమర్శలకు మాటలతో సమాధానం ఇవ్వలేదు. కాలమే సమాధానం చెబుతుందని భావించాడు.

ఉదయం మైదానంలో ఇతరులు వెళ్లిపోయిన తర్వాత కూడా  ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసేవాడు. కానీ అతని జీవితంలో మరో పెద్ద పరీక్ష ఎదురైంది. అయితే విధి అతన్ని మరోసారి పరీక్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే అతని గుండెలో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఫుట్‌బాల్‌నే తన ప్రాణంగా భావించే ఆ బాలుడి కెరీర్ ఒక్క క్షణంలో ప్రశ్నార్థకమైంది. తాను కలలు కన్న ప్రపంచం తన కళ్ల ముందే కూలిపోతుందేమో అన్న పరిస్థితి.

ఆపరేషన్ జరిగింది.

కానీ రొనాల్డో అక్కడ కూడా ఓటమిని అంగీకరించలేదు. ఆపరేషన్‌ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. తన కల కోసం మరణంతో పోరాడి తిరిగి వచ్చిన ఒక యోధుడి అడుగు. 17 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసిన రొనాల్డో. మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తన అసాధారణ ప్రతిభను ప్రపంచానికి చూపించాడు. అతని ఆటను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అతని వేగం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం. ఆ యువ ఆటగాడిలో ఏదో ప్రత్యేకత ఉందని స్పష్టంగా తెలియజేశాయి. అప్పటి మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ సర్ అలెక్స్ ఫెర్గూసన్ కూడా ఆ ప్రతిభను గుర్తించారు.

ఆ క్షణం. రొనాల్డో జీవితంలో మరో మలుపు. అక్కడి నుంచి మొదలైంది ఒక ఫుట్‌బాల్ దిగ్గజం ఆవిర్భావం.

మైదానంలో ప్రతి అడుగు అతని కష్టానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రతి గోల్ అతను పడిన శ్రమకు ప్రతిఫలంగా మారింది. ప్రతి రికార్డు అతన్ని ఎగతాళి చేసిన వారికి ఇచ్చిన మౌన సమాధానంగా నిలిచింది. ఒకప్పుడు ఒంటరిగా ఏడ్చిన ఆ బాలుడిని చూసి ప్రపంచం నవ్వింది. కానీ అదే ప్రపంచం. తర్వాత అతని పేరు వింటే చప్పట్లు కొట్టింది. ఒకప్పుడు “నువ్వు సాధించలేవు” అన్నవాళ్లు ఉన్నారు. కానీ అదే రొనాల్డో, “అసాధ్యం” అనే పదానికి తన జీవితంతోనే అర్థం మార్చేశాడు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

జపాన్‌లో పాటించే 7 ఆసక్తికరమైన అలవాట్లు

  జపాన్‌లో పాటించే 7 ఆసక్తికరమైన అలవాట్లు ప్రపంచంలో ప్రతి దేశానికీ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. కానీ జపాన్‌ గురించి చ...