'ముసలమ్మ నేర్పిన బతుకు పాఠం'.
అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లె చివర పెద్ద మర్రిచెట్టు ఒకటుండేది. సాయంత్రం అయితే చాలు... ఊరి జనాలంతా ఆ మర్రిచెట్టు కింద చేరేటోళ్లు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకునేటోళ్లు, పిల్లలు మాత్రం చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకునేవాళ్లు.
ఆ మర్రిచెట్టుకు కాస్త దూరంలో ఓ చిన్న గుడిసె ఉండేది.
ఆ గుడిసెలో ఓ ముసలమ్మ ఒంటరిగానే ఉండేది. జుట్టంతా తెల్లగా, ముఖం నిండా వయసు తెచ్చిన ముడతలు. కానీ ఆ ముడతల మధ్య నుంచి కనిపించే ఆమె నవ్వు మాత్రం చిన్న పిల్లల నవ్వులా స్వచ్ఛంగా ఉండేది.
ఊళ్లో అందరూ ఆమెను “ముసలమ్మ” అని పిలిచేవాళ్లు. ఆమెకు పిల్లలు లేరు. మొగుడు కూడా ఏళ్ల కిందటే చచ్చిపోయిండు. అయినా సరే... “నా బతుకే నాశనం అయిపోయింది... నా కర్మ ఇంతే...” అంటూ ఎప్పుడూ ఎవరి దగ్గరా ఏడ్చేది కాదు.
పైగా ఎవడైనా బాధలో కనిపిస్తే... “ఏందిరా బిడ్డా... మొహం అట్లా పెట్టుకున్నవ్? నవ్వితే పైసలు ఖర్చవుతయా?” అంటూ నవ్వించేది.
అందుకే ఆ ముసలమ్మంటే ఊరంతా అభిమానం.
ఆ ఊర్లో అందరూ కస్టపడి ఏదొక పనిచేసేవాళ్ళే, రైతులు పొద్దున్నే లేచి పొలానికి పోయేవాళ్లు. చేతివృత్తుల పనిచేసేవారు. కొందరు సంతలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతికేవాళ్లు.ఇది ఆ పల్లె బతుకు తీరు. వాన పడకపోతే పంట ఎండిపోతుంది. పంట ఎండిపోతే రైతు గుండె ఎండిపోతుంది.
ఇంట్లో ఎవరికైనా జబ్బు వస్తే చేతిలో ఉన్న నాలుగు పైసలు ఆసుపత్రికే పోతాయి. అందుకే ఊళ్లో చాలామంది ఏదో ఒక దిగులుతోనే తిరిగేవాళ్లు.
కానీ ఆ ముసలమ్మ మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది.
ఒకరోజు మధ్యాహ్నం. ముసలమ్మ మర్రిచెట్టు కింద కూర్చుని పొగాకు సుట్ట తాగుతుంది . అప్పుడే ఒకావిడ ఏడుస్తూ అక్కడికి వచ్చింది. ఆమె పేరు జయమ్మ. ఏడ్చుకుంటూ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ముసలమ్మ దగ్గరికి వచ్చింది.
“ఏందమ్మా... ఏమైంది?” అని ముసలమ్మ అడిగింది.
జయమ్మ ఏం మాట్లాడకుండా కాసేపు ఏడ్చింది.
“అయ్యో ముసలమ్మా... నా బతుకు ఏం అవుతదో అర్థం కావట్లేదు,” అంది జయమ్మ.
“బిడ్డా ముందు కూర్చో. నిల్చొని ఏడిస్తే సమస్య చిన్నదవుతుందా? కూర్చొని ఏడిస్తే పెద్దదవుతుందా?” అంటూ ముసలమ్మ నవ్వింది.
జయమ్మకు నవ్వాలో ఏడవాలో అర్ధంగాక ఏడుపులోనే చిన్న నవ్వొచ్చింది.
“అదిగో! ఇదే కావాలి నాకు,” అంది ముసలమ్మ.
“ఏం జరిగిందో చెప్పు.” రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ...
“నా మొగుడు పని కోసం సిటీకి పోయిండు. పోయి చాలా రోజులైంది. డబ్బులు పంపలేదు. ఇంట్లో పిల్లలకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆయనకు పని దొరికిందో లేదో కూడా తెల్వదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ముసలమ్మా...” అంది.
ముసలమ్మ కాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయింది.
“అయితే నువ్వు ఏం అవుతుందని అనుకుంటున్నావు?” అని అడిగింది.
“ఏమో... ఏదో చెడు జరుగుతుందేమో అనిపిస్తంది. ఆయనకు పని దొరకకపోతే? ఇక్కడ నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏం అవుతది?” అంది జయమ్మ.
ముసలమ్మ నవ్వింది.
“అదే నీ అసలు సమస్య.” జయమ్మ ఆశ్చర్యంగా చూసింది.
“ఏంటి ముసలమ్మా?” అప్పుడు ముసలమ్మా అంది “నీ మొగుడు సిటీలో ఏం చేస్తున్నాడో నీకు తెల్వదు. కానీ నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని అతని గురించి వంద రకాలుగా ఊహించుకుంటున్నావ్. జరిగిందేంటి? నీకు తెల్వదు. జరగబోయేది ఏంటి? అదీ తెల్వదు. కానీ భయపడటం మాత్రమే తెలుసు అంది!”
జయమ్మ మౌనంగా ఉండిపోయింది. ముసలమ్మ మెల్లగా అంది... “బిడ్డా మనసు కూడా మన ఇంటి గడప లాంటిది. దాంట్లోకి ఏది పంపిస్తే అదే లోపల తిరుగుతుంటది. చెడు ఆలోచన పంపిస్తే భయం తిరుగుతది. మంచి ఆలోచన పంపిస్తే ధైర్యం తిరుగుతది.”
జయమ్మ నెమ్మదిగా అడిగింది. “కానీ ముసలమ్మా... పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మంచి ఆలోచన ఎలా వస్తది?”
“అదే నేను నీకు ఓ కథ చెబుతా. విను.”
“ఒక పేదవాడు ఉండేవాడు. అతని దగ్గర డబ్బు లేదు. ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. తోడుగా ఉండే మనిషి కూడా లేడు.
ఒకరోజు నది ఒడ్డున కూర్చుని పిచ్చోడిలా ఏడుస్తున్నాడు.
‘నా బతుకు ఇంతే... దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించిండు?’ అంటూ ఏడుస్తున్నాడు.
అప్పుడొక ముసలావిడ అక్కడికి వచ్చింది. ‘ఏందిరా బిడ్డా, ఎందుకేడుస్తున్నావ్?’ అని అడిగింది. ఆ పేదవాడు ‘నా దగ్గర ఏమీ లేదు అవ్వా... నేనెలా సంతోషంగా ఉండాలి?’ అన్నాడు.
ఆ ముసలావిడ చుట్టూ చూసి... ‘ఏమీ లేవా?’ అంది.
‘ఏం లేవు.’ అన్నాడు ఆ పేదవాడు..
‘అదిగో ఆ నది కనిపిస్తుందా?’ ‘కనిపిస్తంది.’‘అది నీదే కదా...’ ‘అది నాదెలా అవుతుంది?’
‘నీ కళ్ల ముందు ఉంది కదా! దాన్ని చూసి ఆనందించలేవా?’
అని అడిగింది.
తర్వాత...
‘అదిగో చెట్లు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి. ఆకాశం ఉంది. సూర్యుడు ఉన్నాడు. గాలి ఉంది. నీకు ప్రాణం ఉంది. ఇవన్నీ ఉన్నా “నా దగ్గర ఏమీ లేదు” అంటున్నావ్.
నీ దగ్గర లేనిదాన్నే లెక్కపెడుతూ కూర్చుంటే బతుకంతా బాధే.
నీ దగ్గర ఉన్నదాన్ని ఒక్కసారి లెక్కపెట్టి చూడు... నీ గుండెకు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది’ అంది.
ఆ పేదోడు మొదటిసారి తన చుట్టూ చూశాడు.
నది కనిపించింది. చెట్లు కనిపించాయి. పక్షుల కిలకిలరావాలు వినిపించాయి.
సూర్యుడు కనిపించాడు. అతను మెల్లగా ఏడుపు ఆపేశాడు. ఆ రోజు అతని చేతిలో డబ్బు రాలేదు. ఇల్లు రాలేదు.
తిండి కూడా రాలేదు. కానీ... అతని మనసులో మాత్రం ఓ కొత్త ఆశ పుట్టింది.
ఆ ఆశతోనే మరుసటి రోజు పని కోసం బయలుదేరాడు.
అలా అతని బతుకు మెల్లగా మారడం మొదలైంది.”
ఆ తరువాత మెల్లగా ముసలమ్మ కథ ఆపింది.
జయమ్మకు కథ అర్ధం అయింది వెంటనే “అయితే ముసలమ్మా... ఆ పేదోడికి మంచి ఆలోచన వచ్చిందని అతని సమస్యలన్నీ మాయమైపోయినయా?” అని జయమ్మ ముసలమ్మను అడిగింది.
ముసలమ్మ నవ్వింది.
“అయ్యో పిచ్చి పిల్లా!
సమస్యలు మాయమైపోలేదు.
సమస్యలను చూసే అతని చూపు మారింది.
అదే అసలు విషయం.
ఎవరికీ కష్టం రాకుండా ఉండదు.
కానీ కష్టం వచ్చినప్పుడు... ‘అయ్యో అయిపోయింది... నా బతుకు ఇంతే...’ అని కూర్చుంటే మనలోని ధైర్యం కూడా పోతది.
‘సరే... కష్టం వచ్చింది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి?’ అని ఆలోచిస్తే మనలో ఓ దారి కనిపిస్తది.”
జయమ్మ మౌనంగా ముసలమ్మ మాటలు వింటూ ఉంది.
“అంటే నేను కూడా నా ఆలోచనలు మార్చుకోవాలా?” అని అడిగింది.
“అవును బిడ్డా.
రేపు పొద్దున్నే లేచి మొదటగా...
‘ఈరోజు ఏదో మంచి జరుగుతది’ అని చెప్పుకో.
పిల్లలను చూసుకో. నీకు చేతనైన పని చేసుకో. నీ మొగుడు తిరిగి వస్తాడని నమ్మకం పెట్టుకో.
రేపు ఏం జరుగుతుందో రేపు చూసుకుందాం.
ఈరోజు జరగని చెడు విషయాన్ని ఊహించుకుని ఈరోజే ఎందుకు ఏడవాలి?”
జయమ్మ భయం కాస్త తగ్గింది.
“నిజమే ముసలమ్మా...”
“అదిగో! ఇప్పుడు నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావ్,” అంటూ ముసలమ్మ నవ్వింది.
జయమ్మ కూడా నవ్వింది.
“సరే ముసలమ్మా... ఇక నుంచి మంచి ఆలోచనలు చేస్తా.”
“అదే మొదటి అడుగు బిడ్డా.”
కొన్ని వారాల తర్వాత...
జయమ్మ నిజంగానే మారిపోయింది.
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే...
“ఈరోజు మంచి రోజు అవుతది,” అని తనకు తానే చెప్పుకునేది.
పిల్లలకు తిండి పెట్టేది.
తనకు చేతనైన పని చేసేది.
మొగుడి కోసం ఎదురుచూస్తూనే ఉండేది.
కానీ ఈసారి భయంతో కాదు...
ఆశతో.
ఒకరోజు...
మధ్యాహ్నం వేళ. ఊరి పోస్టుమ్యాన్ రాధ ఇంటి ముందు ఆగాడు.
“రాధమ్మా! నీకు ఉత్తరం వచ్చింది!” అని అరిచాడు. రాధ గుండె ఒక్కసారిగా గుబులు మంది. వణుకుతున్న చేతులతో ఉత్తరం తీసుకుంది.
తెరిచి చదివింది.
ఆమె మొగుడికి సిటీలో పని దొరికింది.
మొదటి జీతం కూడా పంపించాడు.
ఆ వార్త చదివిన రాధ కళ్లలో నీళ్లు వచ్చాయి.
కానీ అవి ఈసారి బాధ కన్నీళ్లు కాదు...
సంతోషం కన్నీళ్లు.
ఆమె ఉత్తరం పట్టుకుని నేరుగా ముసలమ్మ దగ్గరకు పరుగెత్తింది.
“ముసలమ్మా!”
“ఏమైంది బిడ్డా?”
“నా మొగుడికి పని దొరికిందమ్మా! డబ్బులు కూడా పంపించిండు!”
ముసలమ్మ నవ్వింది.
“చూశావా?”
జయమ్మ నవ్వుతూ,
“నీ మాట నిజమైంది ముసలమ్మా!”
ముసలమ్మ వెంటనే అంది...
“నా మాట కాదు బిడ్డా...
నీ ఆలోచన మారింది. అదే నీ బలం.”
జయమ్మ ముసలమ్మ చేతులు పట్టుకుంది.
ఆ తర్వాత...
ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది.
ఎవరికైనా కష్టం వస్తే...
“ముసలమ్మ దగ్గరకు పోయి రా,” అనేవాళ్లు.
రైతు పంట గురించి బాధపడితే ముసలమ్మ ఓ మాట చెప్పేది.
“పంట నీ చేతిలో లేదు. కానీ పొలంలో కష్టపడటం నీ చేతిలో ఉంది.”
ఎవరైనా అప్పుల గురించి బాధపడితే...
“అప్పు గురించి ఏడుస్తూ కూర్చుంటే అప్పు తగ్గుతుందా? రేపటి దారి గురించి ఆలోచించు,” అనేది.
అలా ఆ ముసలమ్మ మాటలు ఊరంతా పాకిపోయాయి.
ఆమె దగ్గర మందు లేదు. డబ్బు లేదు. పెద్ద చదువు లేదు.
కానీ...
మనిషి మనసుకు ధైర్యం ఇచ్చే మాటలు ఉన్నాయి.
అందుకే ఊళ్లో ఎవరైనా నిరాశగా ఉంటే...
“ముసలమ్మ దగ్గరకు పోదాం రా,” అనేవాళ్లు.
ముసలమ్మ మాత్రం ఎప్పటిలాగే మర్రిచెట్టు కింద కూర్చుని నవ్వుతూ ఉండేది.
ఎవరైనా,
“ముసలమ్మా... నువ్వెప్పుడూ ఇంత సంతోషంగా ఎలా ఉంటావ్?” అని అడిగితే...
ఆమె నవ్వి ఒక్కటే మాట చెప్పేది.
“బతుకులో కష్టం మనం ఎంచుకోలేం బిడ్డా...
కానీ ఆ కష్టాన్ని ఎట్లా ఎదుర్కోవాలో మాత్రం మనమే ఎంచుకోవచ్చు.”
అంతే...ఆమె మాట విన్నవాళ్ల ముఖాల్లో మళ్లీ చిన్న చిరునవ్వు కనిపించేది.
ఆ పల్లెలో అందరూ ఒక్క విషయం మాత్రం బాగా నేర్చుకున్నారు...
కష్టం వచ్చినప్పుడు భయపడటం సహజం.
కానీ ఆ భయానికే లొంగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
మంచి ఆలోచన సమస్యలను మాయం చేయకపోవచ్చు.
కానీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.
అందుకే...
ఎంత కష్టం వచ్చినా ఆశను వదులుకోకూడదు.
ఎందుకంటే చీకటి ఎంత పెద్దదైనా...
చిన్న దీపం వెలిగితే దారి కనిపిస్తుంది.
రచయిత
కోట దామోదర్
మొబైల్ 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి