ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్నది ఒక అసాధారణ మేధస్సు
ప్రతిభకు పట్టాలు అవసరం లేదు... ఆలోచనలకు హద్దులు ఉండవు... జిజ్ఞాసకు వయసుతో పనిలేదు! ఈ మూడు సత్యాలకు సజీవ నిదర్శనం లియోనార్డో డా విన్సీ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'మోనాలిసా' చిత్రాన్ని గీసిన కళాకారుడిగానే చాలామందికి ఆయన పరిచయం. కానీ ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్నది ఒక అసాధారణ మేధస్సు. చిత్రకారుడిగానే కాకుండా శాస్త్రవేత్తగా, శరీర నిర్మాణ పరిశోధకుడిగా, ఇంజినీర్‌గా, ఆవిష్కర్తగా, ప్రకృతి పరిశీలకుడిగా ఆయన సాగించిన ప్రస్థానం మానవ చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం. సుమారు ఐదు శతాబ్దాల క్రితమే విమానాలు, హెలికాప్టర్లను తలపించే యంత్రాలు, నీటి అడుగున శ్వాస తీసుకునే పరికరాలు, నీటి నిర్వహణ వ్యవస్థల గురించి ఆలోచించిన దార్శనికుడు ఆయన.
1452 ఏప్రిల్ 15న ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో విన్సీ అనే చిన్న పట్టణంలో లియోనార్డో జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టలేదు. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించలేదు. విశ్వవిద్యాలయ పట్టా లేదు. పలుకుబడి కలిగిన కుటుంబ నేపథ్యమూ లేదు. అయినా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న అపారమైన తపన ఆయనలో ఉండేది. చిన్నతనం నుంచే ప్రకృతిని నిశితంగా పరిశీలించేవారు. ఆకాశంలో పక్షి ఎగురుతుంటే దాని అందాన్ని ఆస్వాదించి ఊరుకునేవారు కాదు. రెక్కలు ఎలా కదులుతున్నాయి? గాలి దానికి ఎలా సహకరిస్తోంది? ఎగురుతున్నప్పుడు దిశను ఎలా మార్చుకుంటోంది? అనే ప్రశ్నలతో ఆలోచించేవారు. నదిలో నీరు ప్రవహించే తీరును గమనించేవారు. కాంతి, నీడల మధ్య సంబంధాన్ని అన్వేషించేవారు. ప్రకృతిలో కనిపించే ప్రతి అంశంలో ఓ విజ్ఞాన సూత్రాన్ని వెతికేవారు.
ఇక్కడే లియోనార్డో ప్రత్యేకత దాగి ఉంది. చాలామంది చూస్తారు. కొందరు గమనిస్తారు. కానీ అతి కొద్దిమందే చూసిన దానిలోని అంతరార్థాన్ని అన్వేషిస్తారు. లియోనార్డో ఆ మూడో కోవకు చెందినవారు. ఆయనకు ప్రపంచమే ఓ ప్రయోగశాల. ప్రకృతే ఓ పాఠశాల. ప్రతి సంఘటనే ఓ పరిశోధనాంశం.
యుక్తవయసులో ఫ్లోరెన్స్‌లోని ప్రముఖ కళాకారుడు ఆండ్రియా డెల్ వెరోక్కియో వద్ద శిక్షణ పొందారు. అక్కడ చిత్రలేఖనం, శిల్పకళ, రంగుల మేళవింపు, దృక్పథ చిత్రణ వంటి ఎన్నో అంశాలను నేర్చుకున్నారు. అయితే ఇతర విద్యార్థుల మాదిరిగా కేవలం పద్ధతులను అనుసరించలేదు. ప్రతి పనిలోనూ 'ఎందుకు?' అనే ప్రశ్నను సంధించేవారు. మనిషి చేయి అలా ఎందుకు కదులుతుంది? నీరు అలా ఎందుకు ప్రవహిస్తుంది? కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు నీడ ఎందుకు మారుతుంది? ఈ ప్రశ్నలే ఆయనను కళాకారుడి స్థాయి నుంచి పరిశోధకుడి స్థాయికి తీసుకెళ్లాయి.
ఒకసారి వెరోక్కియో రూపొందిస్తున్న 'ది బాప్టిజం ఆఫ్ క్రైస్ట్' చిత్రంలో ఓ దేవదూతను చిత్రించే అవకాశం లియోనార్డోకు లభించింది. ఆ యువకుడు గీసిన చిత్రంలోని సహజత్వం, సౌందర్యం చూసి గురువే ఆశ్చర్యపోయినట్లు ఓ ప్రసిద్ధ కథనం చెబుతుంది. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.
లియోనార్డో జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఆయన నోట్సు పుస్తకాలు ఒకటి. జీవితాంతం ఆయన వేలాది పేజీల్లో తన పరిశీలనలు, ఆలోచనలు, ప్రయోగాలు, చిత్రాలు నమోదు చేశారు. మానవ శరీర నిర్మాణం నుంచి యంత్రాల రూపకల్పన వరకు, పక్షుల ఎగరడం నుంచి నదుల ప్రవాహం వరకు, సంగీతం నుంచి గణితశాస్త్రం వరకు... ఆయన ఆలోచనలకు అంతులేదు.
మరో విశేషం ఏమిటంటే ఆయన ఎడమచేతితో రాయడంతోపాటు చాలావరకు కుడి నుంచి ఎడమకు అద్దంలో కనిపించే విధంగా రాసేవారు. ఈ ప్రత్యేకమైన రచనా పద్ధతిని 'మిర్రర్ రైటింగ్' అంటారు. ఆయన ఇలా ఎందుకు రాశారన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. అయితే ఆ నోట్సులోని విజ్ఞానం మాత్రం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తూనే ఉంది.
నేటి ప్రపంచంలో విమాన ప్రయాణం అత్యంత సాధారణమైంది. కానీ ఒకప్పుడు మనిషి గాలిలో ఎగరడం అసాధ్యమనే భావన ఉండేది. అలాంటి కాలంలోనే పక్షుల రెక్కల నిర్మాణాన్ని అధ్యయనం చేసి ఎగిరే యంత్రాల నమూనాలను రూపొందించారు లియోనార్డో. రెక్కల సహాయంతో మనిషి ఎగరగలడా? గాలిని ఉపయోగించి యంత్రాన్ని పైకి లేపగలమా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. పక్షుల రెక్కలను పోలిన యంత్రాలతోపాటు, హెలికాప్టర్‌ను తలపించే 'ఏరియల్ స్క్రూ' నమూనాను కూడా రూపొందించారు.
అవి అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతమైన విమానాలుగా మారకపోయినా, మానవ విమానయాన చరిత్రలో ఆలోచనాపరమైన మైలురాళ్లుగా నిలిచాయి. రైట్ సోదరులు విమానాన్ని విజయవంతంగా ఎగరేయడానికి శతాబ్దాల ముందే మానవుడి ఎగరాలన్న కలకు రూపురేఖలు ఇచ్చిన మేధావి ఆయన.
వైద్య విజ్ఞానానికి వెలుగునిచ్చిన పరిశోధనలు!
మానవ శరీర నిర్మాణంపై లియోనార్డో చేసిన పరిశోధనలు మరింత ఆశ్చర్యకరమైనవి. మానవ శరీరాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్న తపనతో శవపరీక్షలు నిర్వహించి, అంతర్గత అవయవాలను పరిశీలించారు. గుండె గదులు, కవాటాలు, కండరాలు, ఎముకలు, నరాలు, వెన్నెముక వంటి అనేక భాగాలను అత్యంత నిశితంగా చిత్రించారు. తల్లి గర్భంలోని పిండం నిర్మాణాన్ని కూడా అద్భుతమైన వివరాలతో చిత్రించారు.
ఆయన రూపొందించిన శరీర నిర్మాణ చిత్రాలు నేటికీ వైద్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. వైద్య విద్యలో అధికారిక పట్టా లేకపోయినా, పరిశీలన, పరిశోధన, నిరంతర అధ్యయనం ద్వారా ఎంతటి విజ్ఞానాన్ని సంపాదించవచ్చో ఆయన నిరూపించారు. ఆయన ఆలోచనల్లో ఒక గొప్ప సత్యం ఉంది. ఏ రంగంలోనైనా లోతైన అవగాహన రావాలంటే పైపై జ్ఞానం సరిపోదు. మూలాలను తెలుసుకోవాలి. విషయాన్ని స్వయంగా పరిశీలించాలి.
మోనాలిసా చిరునవ్వులో దాగిన మేధస్సు!
ప్రపంచంలో అత్యధికంగా చర్చించబడిన చిత్రాల్లో 'మోనాలిసా' ఒకటి. 1503 ప్రాంతంలో ఈ చిత్రాన్ని ప్రారంభించిన లియోనార్డో దానిపై అనేక సంవత్సరాలు పనిచేశారు. ఆ చిత్రంలోని మహిళ చిరునవ్వు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేరుగా ఆమె పెదవుల వైపు చూస్తే చిరునవ్వు స్పష్టంగా కనిపించదు. ముఖంలోని ఇతర భాగాలను గమనిస్తే మాత్రం నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. కాంతి, నీడలు, రంగుల మేళవింపుతో మానవ దృష్టిని ఎంత సున్నితంగా ప్రభావితం చేయవచ్చో ఆయన ఈ చిత్రంతో చూపించారు.
మరోవైపు 'ది లాస్ట్ సప్పర్' చిత్రంలో యేసుక్రీస్తు తన శిష్యుల్లో ఒకరు ద్రోహం చేయబోతున్నారని ప్రకటించిన క్షణాన్ని భావోద్వేగభరితంగా చిత్రించారు. ప్రతి శిష్యుడి ముఖంలో భిన్నమైన స్పందన కనిపించేలా రూపొందించారు. మనిషి అంతరంగంలోని భావాలను చిత్రకళ ద్వారా ఎంత అద్భుతంగా వ్యక్తీకరించవచ్చో ప్రపంచానికి చాటారు.
నేటి యువత నేర్చుకోవాల్సిన పాఠం!
ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి, ప్రతి పరిశోధకుడికి ఓ దిక్సూచి. నేటి సమాజంలో ప్రతిభను తరచూ మార్కులు, ర్యాంకులు, పట్టాలు, ఉద్యోగాలతో కొలుస్తున్నాం. ఇవన్నీ అవసరమే. కానీ అవే జీవితానికి అంతిమ ప్రమాణాలు కావు. నేర్చుకోవాలన్న తపన, ప్రశ్నించే ధైర్యం, సృజనాత్మక ఆలోచన, పట్టుదల, నిరంతర పరిశీలన ఉన్నప్పుడే నిజమైన ప్రతిభ వికసిస్తుంది.
లియోనార్డోకు ఆధునిక ప్రయోగశాలలు లేవు. కంప్యూటర్లు లేవు. ఇంటర్నెట్ లేదు. ఆధునిక పరిశోధనా పరికరాలు లేవు. అయినా తన చుట్టూ ఉన్న ప్రకృతినే ప్రయోగశాలగా మార్చుకున్నారు. నేటి తరానికి ఇంతకంటే గొప్ప సందేశం ఏముంటుంది? సాంకేతికత అందుబాటులో లేకపోవడం కంటే, ఆలోచించే తపన లేకపోవడమే అసలైన అడ్డంకి.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదు. ప్రతి విషయాన్నీ ప్రశ్నించాలి. ఉపాధ్యాయులు చెప్పింది నేర్చుకోవడంతోపాటు స్వయంగా పరిశీలించాలి. తల్లిదండ్రులు పిల్లల్లో ప్రశ్నించే స్వభావాన్ని ప్రోత్సహించాలి. విద్యాసంస్థలు మార్కుల పోటీతోపాటు పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలి. సమాజం ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి.
కోట దామోదర్
మొబైల్ 9391480475
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి