మురికివాడ నుంచి మహా నాయకుడిగా... పుతిన్ ప్రస్థానం
ఒకప్పుడు నలుగురితో కలిసి ఒకే వంటగదిని, ఒకే బాత్‌రూమ్‌ను పంచుకున్న బాలుడు... నేడు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అగ్రరాజ్యాధినేత. చిన్నతనంలో వేధింపులు, జీవితంలో ఒడుదొడుకులు, గూఢచారి ఉద్యోగం, రాజకీయాల్లో అనూహ్య ఎదుగుదల... ఇలా ఎన్నో మలుపులతో సాగిన వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానం ఆసక్తికరం మాత్రమే కాదు.. ప్రపంచ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. అయితే ఆయన విజయాల వెనుక వివాదాలూ అంతే తీవ్రంగా ఉన్నాయి. అసలు ఎవరీ పుతిన్? ఎలా ఎదిగారు? ప్రపంచ రాజకీయాల్లో ఆయన ఎందుకింత కీలకంగా మారారు?
1952 అక్టోబరు 7. అప్పటి సోవియట్ యూనియన్‌లోని లెనిన్‌గ్రాడ్ (ప్రస్తుత సెయింట్ పీటర్స్‌బర్గ్). రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ముట్టడి కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆ నగరంలో ఓ బాలుడు జన్మించాడు. అతడే వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్.
తండ్రి వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్, తల్లి మారియా. పుతిన్‌కు ఇద్దరు అన్నలు ఉన్నప్పటికీ, ఆయన పుట్టకముందే వారిద్దరూ మరణించారు. ఒకరు చిన్నతనంలోనే కన్నుమూయగా, మరొకరు లెనిన్‌గ్రాడ్ ముట్టడి సమయంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పుతిన్ ఒంటరి సంతానంగా పెరిగారు.
వారి కుటుంబం నివసించింది ఓ సామూహిక నివాసంలో. ఒకే భవనంలో అనేక కుటుంబాలు. అందరికీ ఒకే వంటగది, ఒకే బాత్‌రూమ్. వ్యక్తిగత గోప్యతకు తావులేని జీవితం. ఉదయం స్నానం చేయాలన్నా, వంట చేసుకోవాలన్నా ఇతరుల కోసం వేచి చూడాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు, పరిమితమైన సౌకర్యాల మధ్యే బాల్యం గడిచింది.
తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. యుద్ధ గాయాలు ఆయనను వెంటాడేవి. తల్లి కుటుంబ పోషణ కోసం చిన్నాచితకా పనులు చేసేవారు. సోవియట్ ప్రభుత్వం మత విశ్వాసాలను ప్రోత్సహించని కాలంలోనూ తల్లి రహస్యంగా పుతిన్‌కు బాప్టిజం చేయించడం గమనార్హం.
చిన్నప్పుడు పుతిన్ శారీరకంగా బలహీనంగా, సన్నగా ఉండేవారు. దీంతో చుట్టుపక్కల పిల్లలు ఆయన్ను వేధించేవారు. అయితే ఆ అవమానాలను భరిస్తూ వెనక్కి తగ్గడం ఆయనకు ఇష్టం లేదు. తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
12 ఏళ్ల వయసులో సాంబో అనే రష్యన్ యుద్ధకళను నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత జూడోలోనూ శిక్షణ పొందారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేశారు. పడిపోయినా మళ్లీ లేచేవారు. ఓటమిని ఎదుర్కొన్నా సాధన ఆపేవారు కాదు. క్రమంగా జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించే స్థాయికి ఎదిగారు.
జూడో తనకు నేర్పిన ముఖ్యమైన పాఠం గురించి పుతిన్ తరచూ ప్రస్తావిస్తుంటారు. పడిపోయినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో తెలుసుకోవాలని, ప్రతి ఓటమి తర్వాత తిరిగి లేవాలని ఆయన అభిప్రాయం.
పుతిన్ మనసులో మరో విచిత్రమైన కల ఉండేది. గూఢచారి కావాలి! సోవియట్ యూనియన్ నిఘా సంస్థ అయిన కేజీబీ (KGB)లో పనిచేయాలని చిన్నప్పటి నుంచే ఆశపడేవారు.
ఒకసారి నేరుగా కేజీబీ కార్యాలయానికి వెళ్లి అందులో ఎలా చేరాలని అడిగారు. అక్కడి అధికారి.. వీధి నుంచి వచ్చిన వారిని నియమించుకోమని, విశ్వవిద్యాలయ విద్యతో పాటు సిఫారసు కూడా అవసరమని చెప్పారు.
ఆ మాటలతో నిరుత్సాహపడకుండా తన చదువుపై దృష్టి పెట్టారు. లెనిన్‌గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. జర్మన్ భాషను నేర్చుకున్నారు. 1975లో పట్టభద్రులైన తర్వాత కేజీబీలో చేరారు.
పుతిన్‌కు తొలి కీలక నియామకం తూర్పు జర్మనీలోని డ్రెస్డెన్‌లో లభించింది. అప్పట్లో ప్రపంచం అమెరికా, సోవియట్ యూనియన్ అనే రెండు శక్తుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో ఉంది. నిఘా అధికారులు రహస్యంగా సమాచారం సేకరించడం, సంబంధాలు ఏర్పరచుకోవడం, తమ దేశ ప్రయోజనాలను కాపాడటం వంటి బాధ్యతలు నిర్వహించేవారు.
జర్మన్ భాషపై పట్టు, ప్రశాంతంగా వ్యవహరించే స్వభావం, పరిస్థితులను నిశితంగా పరిశీలించే గుణం పుతిన్‌కు ఉపయోగపడ్డాయి.
అయితే 1989లో బెర్లిన్ గోడ కూలిపోవడంతో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. తూర్పు యూరప్‌లో సోవియట్ ప్రభావం క్షీణించడం ప్రారంభమైంది. డ్రెస్డెన్‌లోని కేజీబీ కార్యాలయం చుట్టూ నిరసనకారులు చేరినప్పుడు పుతిన్ మాస్కో నుంచి ఆదేశాల కోసం ఎదురుచూశారు. కానీ స్పష్టమైన ఆదేశాలు అందలేదు. తాను నమ్మిన వ్యవస్థ కళ్లముందే కూలిపోతుండటం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత రష్యాకు తిరిగి వచ్చారు.
రాజకీయాల్లోకి అనూహ్య ప్రవేశం
1990లో స్వదేశానికి వచ్చిన పుతిన్‌కు భవిష్యత్తు అనిశ్చితంగా కనిపించింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవుతోంది. రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నేరాలు ప్రజలను వేధిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో లెనిన్‌గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో నగర మేయర్‌గా ఎదుగుతున్న అనటోలీ సోబ్‌చాక్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనకు నమ్మకమైన సహాయకుడిగా మారారు.
అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు, నగర పరిపాలన, కీలక రాజకీయ వ్యవహారాల్లో బాధ్యతలు నిర్వహించారు. తెర వెనుక ఉండి పనులు చక్కబెట్టే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
1996లో సోబ్‌చాక్ ఎన్నికల్లో ఓడిపోవడంతో పుతిన్ మాస్కోకు వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు బోరిస్ యెల్త్సిన్ పరిపాలనా విభాగంలో పనిచేసే అవకాశం లభించింది. క్రమంగా కీలక పదవులను అధిరోహించారు. 1998లో రష్యా నిఘా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ (FSB) అధిపతిగా నియమితులయ్యారు.
1999 ఆగస్టులో యెల్త్సిన్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.
ఆ సమయంలో రష్యా తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చెచ్న్యా ప్రాంతంలో యుద్ధం, ఉగ్రవాద దాడులు దేశాన్ని కలవరపరిచాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్ కఠినమైన నాయకుడిగా తనను తాను ప్రజలకు పరిచయం చేసుకున్నారు.
1999 డిసెంబరు 31న బోరిస్ యెల్త్సిన్ అనూహ్యంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో పుతిన్‌కు బాధ్యతలు అప్పగించారు. 2000 జనవరి 1న పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. అదే ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
లెనిన్‌గ్రాడ్‌లోని సామూహిక నివాసంలో పెరిగిన బాలుడు రష్యా అత్యున్నత అధికార పీఠాన్ని అధిష్ఠించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
రష్యాకు మళ్లీ పూర్వవైభవం తేవాలనే లక్ష్యం
పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రష్యా పరిస్థితి దయనీయంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. కొద్దిమంది సంపన్న వ్యాపారవేత్తలు అపారమైన సంపదతో పాటు రాజకీయ అధికారాన్నీ శాసించే స్థాయికి చేరుకున్నారు. వీరినే ఒలిగార్క్‌లుగా వ్యవహరిస్తారు.
పుతిన్ వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి మించిన శక్తి ఎవరికీ ఉండకూడదనే సందేశాన్ని ఇచ్చారు. కొందరు దేశం విడిచి వెళ్లగా, మరికొందరు తమ వ్యాపార సామ్రాజ్యాలను కోల్పోయారు.
మరోవైపు చమురు, సహజవాయువు వనరులపై ప్రభుత్వ నియంత్రణను పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రష్యా ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆ నిధులతో అప్పులు తగ్గించడం, సైన్యాన్ని ఆధునికీకరించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టారు.
సాధారణ ప్రజల ఆదాయాలు పెరిగాయి. పేదరికం తగ్గింది. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కనిపించింది. దీంతో దేశీయంగా పుతిన్ ప్రజాదరణ గణనీయంగా పెరిగింది.
ప్రపంచానికి కఠినమైన నాయకుడిగా కనిపించే పుతిన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని భిన్నమైన అభిరుచులూ ఉన్నాయి. కుక్కలంటే ఆయనకు ఎంతో ఇష్టం. పియానో వాయించడం, సంగీతం వినడం, చరిత్ర, తత్వశాస్త్రం, సాహిత్యం చదవడం ఆయనకు ఆసక్తికరమైన విషయాలు.
1983లో ల్యూడ్మిలాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. 2013లో మూడు దశాబ్దాల వైవాహిక జీవితం అనంతరం విడిపోతున్నట్లు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులను ప్రజల దృష్టికి దూరంగా ఉంచడానికే ఆయన ప్రాధాన్యమిస్తారు.
రోజువారీ జీవితంలో ఈత, వ్యాయామం, అధికారులతో సమావేశాలు, వ్యూహాత్మక చర్చలకు ప్రాధాన్యమిస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రమశిక్షణ అవసరమని ఆయన భావిస్తారు.
లెనిన్‌గ్రాడ్‌లోని సామూహిక నివాసంలో పెరిగిన ఓ బాలుడు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. అందుకు క్రమశిక్షణ, పట్టుదల, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం, అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యం తోడయ్యాయి.
అయితే ఒక నాయకుడి గొప్పతనాన్ని కేవలం ఆయన ఎంతకాలం అధికారంలో ఉన్నారు, ఎంతటి సైనిక శక్తిని సమకూర్చుకున్నారు, ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశారు అనే అంశాలతోనే కొలవలేం. ప్రజల స్వేచ్ఛ, మానవ హక్కులు, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనవి.
పుతిన్ జీవితం మనకు పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసాధన గురించి ఎన్నో విషయాలు చెబుతుంది.
కోట దామోదర్
మొబైల్ 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి