7, ఫిబ్రవరి 2024, బుధవారం

తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన "లొట్టపీసు పూలు".

తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన "లొట్టపీసు పూలు".

తెలంగాణ నేలలోని ప్రతి అణువణువులోనూ ఓ స్ఫూర్తి, పోరాట పటిమ, మేధస్సు మిళితమై అసంఖ్యాక శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే సాహిత్యానిది ఒక ప్రత్యేక స్థానం. నేటి సాహిత్య ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కథలు చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే కథలోని పాత్రలో లీనమై గొప్ప అనుభూతిని పొందుతాడు. కొన్ని కథలు చదువుతున్నపుడు రచయిత మన పక్కనే కూర్చుని కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులకు చదవాలని అనురక్తి కలిగించే కథలు ఉత్తమమైనవి. అలాంటి ఆసక్తికరమైన కథల్లో "శీలం భద్రయ్య"  రాసిన "లొట్టపీసు పూలు" ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది.

ఆయన వెలువరించిన కథ కథను పరిశీలించగా అందులో ఒక్కో కథను నడిపించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. ఒక్కో కథ చదువుతున్నప్పుడు శీలం భద్రయ్య స్వయంగా కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులను మంత్రముగ్దులను చేసే ఛలోక్తులు కథలలో రాయడమంటే అది శీలం భద్రయ్యకే సాధ్యం అనే భావం ఏర్పడుతుంది.

ఈ కథల్లో తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పాఠకుల హృదయాలను హత్తుకునే విధంగా వివరించారు. అట్టడుగు వర్గాలు, సామాన్యుల భాషను, కథా వస్తువులుగా ఎంచుకుని తెలంగాణ భాష ఖ్యాతిని విస్తృతం చేసే కృషి చేసారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల తిరుగుబాట్లు ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, సహజత్వాన్ని ఈ కథల్లో చిత్రించిన తీరు అభినందనీయం. కొన్ని కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులను రచయిత హృద్యంగా వివరించారు. 

ఈ పుస్తకంలోని పదిహేను కథలు అచ్చమైన తెలంగాణ భాష మాండలికంలో సామాన్య పాఠకులకు కథలపై ఆసక్తి కలిగించే విధంగా వ్రాయబడ్డాయి.

"ఇసపురుగు" కథను పరిశీలిస్తే ఆనాటి అణగారిన వర్గాల జీవన విధానాన్ని విశ్లేషిస్తూ, దొంగతనం నేరం మీద జైలు కి వెళ్లిన భర్తను విడిపించడానికి అప్పు కొరకు నారాయణ పటేల్ దొర దగ్గరికి వెళ్తే దొర అనే అహంకారంతో నిమ్నజాతి మహిళపై అకృత్యానికి పాల్పడిన సందర్భంలో నర్సమ్మ పెద్దయ్య చెప్పిన సలహాను పాటించి చాకచక్యంగా తప్పించుకున్న తీరును అద్భుతంగా విశ్లేషించిన తీరును గమనించవచ్చు. ఎందరో ఆడబిడ్డలను బలిమి చేసి, వాళ్ళ చావుకి కారణమైన దొర మరణంతో గ్రామ ప్రజలు సంతోషించిన తీరు పాఠకులకు కథల పట్ల ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది.

"కేంపు చెరువు" కథను పరిశీలిస్తే తెలంగాణ పల్లెల్లో పంట చేతికొచ్చిన తరువాత కోతపెట్టుకొవడమనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయంగా విశ్లేషిస్తూ, ఆడవాళ్ళు వడ్లు దంచే సమయంలో పాడుకునే పాట ఇప్పటి తరం వారికి తెలియజేయడం మరియు ఆ పాటను కథ రూపంలోకి తీసుకు రావడం శీలం భద్రయ్య పడిన తపన చెప్పకనే చెబుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. రజాకార్ల కాలం నాటి భయంకర సంఘటనలు కళ్లముందు చూసినట్టుగా కథను రాయడం,అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల భూములు జలాశయం (రిజర్వాయర్) నిర్మాణానికి తక్కువకు విక్రయించేందుకు గ్రామ ప్రజల నుంచి సంతకాలు తీసుకుని ఊరు వదిలి వెళ్లాలని దొర హుకుం జారీ చేయడం, ఆ తర్వాత ఊరి జనం చేసేదేమీలేక ఊరు విడిచి వెళ్తున్న విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై ఊరి జనానికి అసలు విషయం చెప్పి ఆయుధాలతో దొర పై యుద్దానికి తెరలేపి దొర గడి పై దండయాత్ర చేసి దొరనే ఊరినుండి వెళ్లగొట్టిన తీరును ఎంతో ఓర్పుతో కథకు జీవం పోశారు శీలం భద్రయ్య. మూసీనది చరిత్రను ఈతరం వారికి తెలియజేసే క్రమంలో తన కథలను ప్రత్యేకమైన శైలితో, చమత్కారమైన సూక్తులతో కొత్త రూపును ఇచ్చారు రచయిత.

"బంచెర్రాయి" కథలో రజాకార్లు కాసోళ్లగూడెం సమీపాన బంచెర్రాయి దగ్గర ఎలాంటి అకృత్యాలకు, దారుణాలకు పాల్పడ్డారో విపులంగా వివరించారు. రాజారెడ్డి బిడ్డ పెళ్లి సంబరాలలో రజాకార్లు గ్రామం మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను, బంచెర్రాయి దగ్గర కొత్తగా పెళ్ళైన రాజారెడ్డి బిడ్డ లచ్చువమ్మను రాజిరెడ్డి కళ్ళ ఎదుటే రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీసి బంచెర్రాయి వల్లకాడుగా మార్చిన తీరును పాఠకుల హృదయాలు కలుక్కుమనేలా శీలం భద్రయ్య ఎంతో చక్కగా రాశారు. అర్ధరాత్రి కాసోళ్లగూడెంపై రజాకార్లు దాడి చేస్తున్నారని రాజిరెడ్డికి సమాచారం అందించడంతో రాజిరెడ్డి కండ్లు నిప్పులు కక్కినై. దుఃఖం కట్టలు తెంచుకుని ఊరి ప్రజలకు ధైర్యంతో పాటు కాక పుట్టించి జనం తిరుగుబాటుతో రాజిరెడ్డి కన్న బిడ్డను చంపిన చోటే రజాకార్లను చంపి పాతిపెట్టిన ఘటనను అద్భుతంగా వివరించారు. రజాకార్లపై పోరాటం చేసి, వారిని తరిమికొట్టిన కాసోళ్లగూడెం పేరుని పాఠకులకు గుర్తుండేలా చేశారు. బంచెర్రాయి కథలో భద్రయ్య రాసిన కొన్ని చమత్కారమైన మాటలు ఈ కథకు కొత్త రూపాన్నిచ్చాయి. “పావురంగా  సాదుకున్న బిడ్డ లచ్చువమ్మ అసువులు బాసినై. రాజిరెడ్డి నవ్వులూ బాసినై” అని రాశారు. పాఠకుడు ఈ కథ చదువుతున్నంత సేపు ఆ సంఘటన తమ కళ్లముందు జరుగుతున్నట్లు భావించేలా రాయడం రచయిత పరిణతికి అద్దం పడుతుంది. 

"కర్తవ్యం" కథలో, అప్పటి రోజుల్లో ఆదివారం రోజు పిల్లలు ఆటలాడుకునే తీరుని వివరిస్తూ, రాముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ఎంకమ్మ ఎక్కెక్కి ఏడుస్తూ ఎట్లైనా తల్లిదండ్రులు లేని  పిల్లగాడిని బతికించుకోవాలని నాయనమ్మ పడ్డ కష్టాన్ని పొందుపరిచిన విధం పాఠకుల గుండెలు బరువేక్కించక మానదు. అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులకు రాఘవయ్య సార్ చేసిన సహాయం తో బతికి, పై చదువులు చదివి, పెద్ద ఆఫీసర్ అవ్వడం, ఆ తరువాత రాముడు రాఘవయ్య సార్ ను కలవడానికి వచ్చినప్పుడు ఆ రోజే సార్ చనిపోవడం సార్ చేసిన త్యాగాలను తలుచుకుంటూ, సార్ రాసిన డైరీ తిరగేస్తుంటే రాముడికి ఆయన నడిచిన త్యాగపు గుర్తుల అడుగుజాడలు గోచరమవుతాయి. రాఘవయ్య కర్తవ్యాన్ని రాముడే కాదు మనమందరం సెల్యూట్ చేయాల్సిందే అనే విధంగా ఈ కథలో గురుశిష్యుల అనుబందాన్ని చాలా బాగా విశ్లేషించారు.  

"లొట్టపీసు పూలు" కథలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే “బతుకమ్మ పండుగ” ను తెలంగాణ ఆడపడుచులు పల్లెలలో సంబరంగా జరుపుకునే విధానాన్ని, వారి బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించేలా చాలా బాగా విశ్లేషించారు. ఈ కథలో ఊరి పెద్దమనిషి ఎల్లయ్య పంతులు తడుకలు అల్లే శివుడు భార్య అడివమ్మ ఇద్దరిమధ్య పంచాయితిని పరిష్కరించి పండుగ పూట ఊరి చెరువులో శవమై తేలిండు. ఎల్లయ్య పంతులిని శివుడు చంపాడని ఊరి ప్రజలు ఎలా అనుమానించారో శీలం భద్రయ్య చాలా చమత్కారంగా వ్రాసారు "నరంలేని నాలుక ఎటైనా మల్తది" అని ఆసక్తికరమైన చమత్కారాలు ఉన్నాయి. బతుకమ్మ పేర్చడానికి పనికి రాని లొట్టపీసు పూలు ఎల్లయ్య పంతుల్ని ఎవ్వరు చంపినారో పట్టించాయి. అన్యం పుణ్యం ఎరుగని శివుడిని కాపాడినాయి. బతుకుదెరువు కోసం లొట్టపీసు చెట్లతో తడికలు అల్లుకునే శివుడు లొట్టపీసు చెట్లే గండం నుంచి గట్టెక్కిచ్చాయని దండంపెట్టుకుండు. 

"వేగుచుక్క" కథలో తండ్రి దేశభక్తిని చూసి కొడుకు సైనికుడు అవ్వడం. మేజర్ కిరణ్ చేసిన సాహసాలను వివరిస్తూ శత్రువులను ఓడించిన తీరుని ఎంతో విపులంగా వివరించారు. తెలంగాణ బిడ్డ తెగువ తెలివి ముందు శత్రువులు నిలవలేకపోయారని ఈ కథలో మేజర్ కిరణ్ ధీరత్వం మరియు కిరణ్ తండ్రి వెంకట్రామిరెడ్డి పటేల్ చేసిన సేవలను అక్షర బద్దం చేయగలిగారు. 

ఒక కథ పాఠకుడిని మెప్పించాలంటే రచయిత ఎంచుకున్న వస్తువు, ఆ కథ ఎత్తుగడ, రచన శైలి, అసాధారణమైన ముగింపు, చమత్కారమైన పద విన్యాసం ఉంటేనే పాఠకుడు ఆ కథను చివరిదాకా చదివి ఆనందించడంతో పాటు మధురానుభూతి చెందుతాడు.

శీలం భద్రయ్య రాసిన 15 కథలలో ప్రతి కథా దేనికది ప్రత్యేకమే. ప్రతి కథలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం శీలం భద్రయ్య రచనా నైపుణ్యానికి కలికితు రాయిగా నిలుస్తాయి. ఈ అద్భుతమైన కథలను చదివిన తరువాత పాఠకుడు సైతం కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది శీలం భద్రయ్య “లొట్టపీసు పూలు”. వాస్తవిక ఘటనలను కథా వస్తువుగా ఎంచుకుని తన లోని భావాలను కథ లోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పించిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కథలు శీలం భద్రయ్య కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ  ఆకాంక్ష.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475 




 

24, జనవరి 2024, బుధవారం

చేతివ్రాత

 బ్రహ్మ రాసిన రాతను మార్చడం అసాధ్యమని తెలిసిన విషయమే. కానీ చేతిరాత అనేది మన జీవితాన్ని మార్చే అంశం అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జోశ్యం చెప్పేవారు మన చేతుల్లోని రేఖల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. అది ఎంతవరకు నమ్మశక్యమో దేవుడెరుగు.. కానీ ఎలాంటి చేతి గీతల ఆధారం లేకుండా కేవలం చేతి వ్రాత ఆధారంగా వ్యక్తియొక్క వ్యక్తిత్వ లక్షణాలు, భావోద్వేగ స్థిరత్వం, అభిజ్ఞా సామర్ధ్యాలు మరియు వారి ఆరోగ్యం గురించి కూడా అంతర్దృష్టిని పొందవచ్చని నమ్ముతారు. విశేషమేమిటంటే, అక్షరాల పరిమాణం, అక్షరాల మధ్య అంతరం, రాసే వాలు, కాగితంపై ప్రయోగించే ఒత్తిడి మరియు అక్షరాల ఆకృతితో సహా చేతివ్రాత యొక్క వివిధ భౌతిక అంశాలను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చని గ్రాఫాలజిస్టులు విశ్వసిస్తారు.


ప్రతి విద్యార్థి భవిష్యత్తులో విద్యార్థి చేతిరాత ప్రముఖ పాత్ర పోషిస్తుందంటే అతిశయోక్తి కాదు. 


10, జనవరి 2024, బుధవారం

ప్రపంచం మెచ్చిన ఆటగాడు "ఉసేన్ బోల్ట్".

ప్రపంచం మెచ్చిన ఆటగాడు "ఉసేన్ బోల్ట్".

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్. ఓటమెరుగని ఆటగాడని పేరుగాంచిన యోధుడు. పరుగుల ఆటకు తిరుగులేని రారాజు అతనే "ఉసేన్ బోల్ట్". తన అలుపెరగని ప్రయత్నాలతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ఆటగాడు "ఉసేన్ బోల్ట్".

అతని ఆట అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. ఆయన ఆడే ప్రతి ఆట గెలుపే కానీ ఓటమి ఉండదని అభిమానుల ఆత్మవిశ్వాసం. వరుస విజయాలతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఏకైక ఆటగాడు ఉసేన్ బోల్ట్. ఒక గొప్ప క్రీడాకారుడి విజయాలను అభిమానులు సంబరాలు చేసుకోవడం సహజమే, కానీ అతని తొలి ఓటమిని కూడా సంబరాలు జరుపుకోవడం గొప్ప విషయం. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి, ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించాడు.

బోల్ట్ 21 ఆగస్టు 1986న జమైకాలోని షేర్‌వుడ్ కంటెంట్‌లో వెల్లెస్లీ బోల్ట్ మరియు జెన్నిఫర్ బోల్ట్‌లకు జన్మించాడు. 12 సంవత్సరాల వయస్సులో, ప్రాథమిక పాఠశాలలో, అతను పాఠశాల క్రీడల లో పాల్గొనడం ప్రారంభించాడు. అతని ప్రతిభను గమనించిన అతని తల్లిదండ్రులు తను ఆల్ టైమ్ గొప్ప క్రీడాకారుడు అవుతాడని అంచనా వేశారు. అతని చిన్నతనం నుండి, బోల్ట్ చదువు కంటే క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి నుంచి క్రీడల్లో రాణించాడు.బోల్ట్‌కు క్రికెట్ అంటే ఇష్టం.13 ఏళ్ల వయసులో ఒకసారి బోల్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని క్రికెట్ కోచ్ అతని పరుగును గమనించి అథ్లెటిక్స్‌లో గట్టిగా ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అతని ప్రోత్సాహం మేరకు అతను ప్రతి రోజు  తెల్లవారుజామున 4 గంటలకు లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అలా ప్రతిరోజు పట్టుదలతో ప్రయత్నిస్తూ 16 సంవత్సరాల వయస్సులో, 2002లో, అతను ప్రపంచ జూనియర్ ఛాంపియన్ స్థాయికి ఎదిగారు. 2007 నాటికి, అతను చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యక్తి గా, అతని మొదటి 100m ప్రపంచ రికార్డు నెలకొల్పాడు మరియు ఒక సంవత్సరం తరువాత, బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడలలో, అతను అంతర్జాతీయ సూపర్ స్టార్‌డమ్‌కి ఎదిగాడు. చైనాలో, బోల్ట్ పురుషుల 100మీ స్ప్రింట్‌లో విజయం సాధించాడు, ఆపై 200మీ మరియు 4x100మీ టైటిల్‌ను జోడించి లెజెండరీ ట్రిపుల్‌ను సాధించాడు. మూడు ఈవెంట్లలో అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న బోల్ట్ అభిమానుల కోరిక మేరకు ఆఖరిసారి ఆటలో పాల్గొన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోయిన బోల్ట్ ఆట కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన కాలు లిప్తకాలం జంకింది. 

వరుస విజయాలతో అభిమానులను ఉర్రూతలూగించిన ఉసేన్ బోల్ట్ ఒకే ఒక్క సందర్భంలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పదవి ఎక్కిన ప్రతి వారికి పదవి దిగే రోజు వస్తుంది అన్నట్టుగా వరుసగా విజయాలందుకున్న వీరుడికి ఓటమి తప్పలేదు. 8 ఒలంపిక్ పథకాలు, 11 ప్రపంచ ఛాంపియన్ పథకాలు, 3 డైమండ్ లీగ్ ఫైనల్ విజేత, 2 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలుచుకుని తనని తానే జయించుకుంటూ ఎన్నో రికార్డులు సృష్టించిన ఉసేన్ బోల్ట్ తన చివరి ఆటలో ఒక మూడు సెకన్లు ఆలస్యమయ్యాడు. అది కూడా అనారోగ్య కారణాల వల్లే తప్ప  వారి సామర్ధ్యాలను అందుకోలేక కాదు. ఏనాడూ తనకంటే ముందు పరుగెత్తని వారు ఆ రోజు ఇద్దరు యువకులు అతనికంటే ముందుకు పరుగెత్తారు. బోల్ట్ తిరోగమనం చూసి అభిమానులే కాదు కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. ఏంటి ఏనాడూ వెనకపడని బోల్ట్ ఈరోజు వెనకబడటం ఏంటి? ఇది కలా నిజమా అనుకున్నాడు గెలిచిన వ్యక్తి. ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ళ మీద నిలిచి మోకరిల్లాడు. ఆ దృశ్యాన్ని చూసిన బోల్ట్ అభిమానులు అతని ఓటమిని కూడా  పండగలా జరుపుకున్నారు.

ఈ జమైకన్ వీరుడు ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని శాసించాడు. 30 సార్లు అతను ప్రపంచంలోని చాలా మంది రన్నింగ్ క్రీడాకారులతో పోటీ పడ్డాడు. అందులో 9 సందర్భాల్లో మాత్రమే కొంతమంది మారక ద్రవ్యాలు పుచ్చుకొని పరుగులు తీశారు. ఆ 9 సందర్భాలలో కూడా బోల్ట్ విజయాలే. బోల్ట్ వేగంలో గాలికి పాఠం నేర్పిన గురువు.  

ప్రపంచంలోని క్రీడాకారుల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన ఉసేన్ బోల్ట్ ఓటమి అనంతరం అభిమానులతో ఇలా అన్నారు "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒకరోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతివాడికి ఏదో ఒకరోజు గెలుపు తప్పదు, నేను మీలా మామూలు మనిషిని నాకు కూడా ఓటమి తప్పలేదు అని అభిమానులకు ఒక గొప్ప సందేశం అందించారు.

సాధించిన రికార్డులు:

ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో (2008, 2012 మరియు 2016) ఒలింపిక్ 100 మీ మరియు 200 మీటర్ల టైటిళ్లను గెలుచుకున్న ఏకైక స్ప్రింటర్. అతను రెండు 4 × 100 రిలే బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. అతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సమయాల్లో డబుల్ స్ప్రింట్ విజయంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందారు, ఇది పూర్తిగా ఆటోమేటిక్ టైమింగ్ తప్పనిసరి అయిన తర్వాత రెండు రికార్డులు కలిగి ఉన్న మొదటి వ్యక్తి గా ఉసేన్ బోల్ట్ పేరు నిలిచింది.

పదకొండు సార్లు ప్రపంచ ఛాంపియన్, అతను 2009 నుండి 2015 వరకు వరుసగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ 100 m, 200 m మరియు 4 × 100 m రిలే బంగారు పతకాలను గెలుచుకున్నాడు, 2011లో 100 m ఫాల్స్ స్టార్ట్ మినహా. అతను అత్యంత విజయవంతమైన పురుష అథ్లెట్. బోల్ట్ 200 మీటర్లలో నాలుగు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి అథ్లెట్ మరియు 100 మీటర్లలో మూడు టైటిల్‌లతో అత్యంత విజయవంతమైన వారిలో ఒకరు, సబ్-9.7 మరియు సబ్-9.6 పరుగులు సాధించిన మొదటి వ్యక్తి.

ఓటమి నేర్పిన పాఠం:

9 ఏళ్ల పాటు ప్రపంచానికి మకుటం లేని రారాజుగా నిలిచిన బోల్ట్ ఎట్టకేలకు తాను మామూలు మనిషినేనని చెప్పారు. ప్రపంచాన్ని ఏలిన ఈ జమైకా వీరుడు ఎన్నో గొప్ప విజయాలు సాధించినా నేనూ మీలాంటి సామాన్యుడిని అని గర్వం లేకుండా ప్రకటించుకోవడం బోల్ట్ మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. బోల్ట్ లాంటి మామూలు మనుషులు ప్రపంచంలో కొందరు ఉంటారు. పదవిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఓటమి తప్పదని గుర్తిస్తే అందరూ సామాన్యులే. గెలుపు ఓటములు మనిషికి కొన్ని పాఠాలు నేర్పుతాయి.

యువతకు సందేశం:

సాధన చేస్తే ఈ ప్రపంచంలో మనిషి సాదించనిది ఏదీ లేదనడానికి ఉసేన్ బోల్ట్ ఒక ఉదాహరణ. ఉసేన్ బోల్ట్ కు చిన్నప్పటి నుంచి చదువు పై కాకుండా క్రీడలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. బోల్ట్ కి ఎక్కువ నచ్చిన ఆట క్రికెట్. కానీ బోల్ట్ ఒక సందర్భంలో క్రికెట్ ఆడుతుండగా అతని రన్నింగ్ గమనించిన కోచ్ బోల్ట్ కి ఒక మంచి సలహా ఇచ్చారు "నీకు క్రికెట్ కంటే రన్నింగ్ క్రీడలోనే భవిష్యత్తు ఉంటుంది దాన్ని సరైన మార్గంలో ప్రయత్నిస్తే  నువ్వు గొప్ప క్రీడాకారుడివి అవుతావు అని కోచ్ సలహా ఇచ్చాడు. ఆయన సలహా తూచా తప్పకుండా మరుసటి రోజునుండి ప్రయత్నించి ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొంటు  ప్రపంచ విజేతగా నిలిచాడు. ఏ పనైనా కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే ప్రతి ఒక్కరు విజేతే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త
కోట దామోదర్ 
మొబైల్ 9391480475







26, నవంబర్ 2023, ఆదివారం

సిరి వెన్నెల పాటకు మరణం లేదు.

 "సిరి వెన్నెల" పాటకు మరణం లేదు.


"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం"  

సమాజంలోని అసమానతలు, అక్రమాలు మరియు అన్యాయాలను బహిర్గతం చేయడానికి పోరాడే నిజాయితీగల పౌరులు లేరని మరియు ఈ ప్రపంచం ఎప్పటికీ మారని తీరును తన కలం నుండి జాలువారిన అక్షరాలను అద్భుతమైన పాటగా మలిచి ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి, తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత, పాటల పూదోటలో విరిసిన పారిజాతం "సిరి వెన్నెల సీతారామశాస్త్రి".

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల పాటు మధురమైన పాటలు అందించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాతో పాట ప్రారంభించి ఎన్నో తెలుగు సినీ పాటలకు  సిరుల జల్లు కురిపించారు. అంతేకాదు తన మొదటి పాట "విధాత తలపున"కి నంది అవార్డు రావడం అభినందనీయం. మొదటి పాట నుంచి చివరి పాట వరకు పాటల్లోని అభినయం ఎందరో తెలుగు పాటల ప్రియులను ఆకట్టుకుంది. ప్రతి పాట ప్రతి పదం మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆయన రాసిన ప్రేమ యుగళగీతాలు ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సాహిత్య శిఖరం సిరి వెన్నెల. సిరి వెన్నెల సాహిత్యానికి మసకబారిన హృదయాలను సైతం కదిలించే సామర్థ్యం  ఉందంటే అతిశయోక్తి కాదు. సిరి వెన్నెల తెలుగు పదాలతో అలవోకగా ఆడుకోగల సాహితీవేత్త. సిరి వెన్నెల శాస్త్రి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరకాలం పదిలంగా ఉంటాయనేది ముమ్మాటికీ నిజం.

ఆయన రాసిన పాటలన్నీ పాటల పూదోటలో వికసించిన గులాబీల్లా ఉంటాయి. పాటలన్నీ అద్భుతం. అర్ధవంతం. ఆణిముత్యం..పాటలో వైవిధ్యం..ప్రతి పాటలో మానవత్వానికి బాటలు వేసే ఎన్నో భావాలు..ఒక్కో పదంలోనూ అద్వితీయమైన వ్యక్తిత్వపు జాడలు.

ఆణిముత్యం వంటి కొన్ని పాటలు గుర్తుచేసుకుందాం:

 1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలోని  "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని" ఈ పాట పలు భాషల్లోకి అనువదించడమేగాక ఎంతోమందిని ఆలోచింపజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట వినని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. నేటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంది. ఏనాటికి మారదు లోకం, మారదు కాలం అంటూ రాసిన ప్రతి పదం ఆలోచనాత్మకంగా ఉంది. ఆయన పాటతోనే యావత్ దేశాన్ని ప్రశ్నించాడు. కుర్రకారును ఉర్రూతలూగించే పాటల నుంచి సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల వరకు ప్రతి ఒక్కటీ.. గుండెను హత్తుకొనేలా రాయడం సిరి వెన్నెల కే సాధ్యం.  

హిందూ సంప్రదాయంలో మంగళ సూత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తు ఈ మంగళ సూత్రం. పుట్టింటి వారిని,మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళ సూత్రంలో రెండు తాళి బొట్లు ఉంటాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ విడాకుల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారు ముందుగా మంగళసూత్రం విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1994 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం అందించిన శుభలగ్నం చిత్రంలోని 

చిలక ఏ తోడు లేక  ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక

లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ సిరి వెన్నెల గారు రాసిన ఈ పాట కోట్లాది ప్రజలను ఆలోచింపజేసింది.

అనురాగం కొనగలిగే  ధనముందా  ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో... అంటూ ప్రేమను కొనగలిగే డబ్బు ఈ ప్రపంచంలో ఉందా? ధన వ్యామోహం లో ఉన్న కలియుగ ధనరాశులకు తన పాటతో జ్ఞానోదయం చేశారు మహానుభావుడు సిరి వెన్నెల.

కొన్ని పాటలు మన వ్యవస్థని, మన సమాజంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తాయి... అలాంటి పాటే 1997 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం "సింధూరం" లోని 

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ!

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే! 

ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు లభించింది.

సమాజంలో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ప్రశ్నించే రచన సిరి వెన్నెల కలం.

ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సిరి వెన్నెలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 

ఆయన రాసిన పాటల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిలో 

రుద్రవీణ లో "నమ్మకు నమ్మకు ఈ రేయిని"

స్వర్ణకమలం లో "ఆకాశంలో ఆశల హరివిల్లు"

నువ్వే కావాలి లో "ఎక్కడ ఉన్న పక్కన నీవే"

చక్రం లో "జగమంత కుటుంబం"

అమ్మ రాజీనామా లో "ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం "

ఇలాంటి ఎన్నో కమనీయమైన పాటలతో తెలుగు ప్రజల మనసులను దోచుకున్న గేయరచయిత సిరి వెన్నెల.

మనిషికి మరణం తప్ప పాటకు మరణం లేదనడం లో అతిశయోక్తి లేదు.  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475






4, నవంబర్ 2023, శనివారం

ప్రజా సేవకుడు "మండల పరశురాములు".

 ప్రజా సేవకుడు "మండల పరశురాములు".

'బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో.

రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో.

పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు.

పేదను గుర్తించగ మారబోవునదెన్నడో' కవి ముత్తువేల్ కరుణానిధి గారు రాసిన ఈ కవిత ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది. బిడ్డల పాలకొరకు బిచ్చమెత్తుకుంటున్న దేశంలో పసిబిడ్డలకు పాలు అందించరు కానీ..రాళ్లనే దేవుడిగా భావించి క్షీరాభిషేకం చేస్తారు, కుబేరులున్న దేశంలో కూటికి లేనివాడికి కూడు కరువు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు నశిస్తాయో అని తన ఆవేదనను కవిత ద్వారా అందించారు. కానీ నేటికీ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండటం బాధాకరమైన విషయం.

ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతువుంటాడు జీవుడు.

ఎవరన్నారో గాని ఆనాడు మానవసేవయే మాధవసేవనే ఓ మహనీయుడు.

సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా అనే సిద్ధాంతాన్ని సేవా మార్గంగా ఆచరించి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్‌ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాతూ పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ,దయ కలిగి ఉండడం మరియు సేవా తాత్పరత యొక్క నిజమైన అర్ధమని సూచించారు. ఆమె మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మానవుడే మహనీయుడు అనే నానుడిని నిజమని నిరూపించిన మహిళా మాతృమూర్తి. మదర్‌ థెరిసా స్ఫూర్తి పొంది ఎంతోమంది సామజిక సేవ కార్యక్రమాలు చేపడుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 1988లో మదర్ థెరిసా వరంగల్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి నేతృత్వంలో పరశురాములు సేవలకు గుర్తింపు లభించింది. మదర్ థెరిసా చేతులమీదుగా బెస్ట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. మదర్‌ థెరిసా స్పూర్తితో సామజిక సేవ రంగంలో 35 సంవత్సరాలుగా సేవలందిస్తూ అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్న తెలంగాణ బిడ్డ  ప్రజా సేవకుడు "మండల పరశురాములు ".

ప్రజా సేవకుడు పరశురాములు :

నిరుపేద కుటుంబంలో పుట్టిన పరశురాములు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు. చిన్నప్పటి నుంచి తనకి ఎదురైన సమస్యలు జీవితంలో ఇతరులకు రాకూడదని భావించి చిన్నతనం నుంచే మూర్తీభవించిన మానవత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. 8 వ తరగతి చదివే సమయంలో గురువుల స్పూర్తితో సమాజ సేవ పట్ల ఆసక్తితో 1981లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ లో  చేరాడు. అందులో క్రమశిక్షణ మరియు అంకితభావ నిబద్ధత అలవర్చుకున్నారు. సామజిక సేవ చేయాలంటే విద్యయే సరైన మార్గమని తెలుసుకుని ఒకవైపు చదువు కొనసాగిస్తూనే పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన చేసిన సేవలను గుర్తించి 1985 లో అప్పటి భారత రాష్ట్రపతి గియాని జైల్ సింగ్ చేతులమీదుగా ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. ఆతర్వాత అభ్యుదయ సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి అక్షరాస్యత, బాల కార్మికుల వ్యవస్థ నిర్ములన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత,  బాల్య వివాహాల నివారణ, అక్రమ దత్తత నిలుపుదల, బాలల హక్కుల ఉల్లంఘన నిరోధం వంటి అంశాలలో ఎనలేని కృషి చేశారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహాలు నిలిపివేయాలని అనేక జిల్లాలో విస్తృత ప్రచారం చేయడమేగాక మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా పరిషారా ప్రాంతాలలో అనేక బాల్య వివాహాలను నిలిపివేయించారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 1989 లో వరంగల్ జిల్లాలోని నెహ్రు యువ కేంద్రంలో జాతీయ సేవా వలంటీర్‌గా చేరి యువజన సంఘాలను ఏర్పాటు చేసి క్రీడా కార్యక్రమాలు, చెట్లు నాటించడం కొరకు శ్రమదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు, రాత్రి బడులు నిర్వహించి నిరక్ష్యరాసులకు చదువు నేర్పించారు. అక్షరాస్యత కోఆర్డినేటర్‌గా సమర్ధవంతమైన సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అతని సేవలకు చిహ్నంగా, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి యువజన పురస్కారాలు, నిఖిల్ కొయితారా ఆంతర్జాతీయ అవార్డు, గాడ్ ప్రే ఫిలిప్స్ బాల కార్మికుల నిర్ములన అవార్డు , ప్రపంచ శాంతి శిఖరాగ్ర పురస్కారం వంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నారు. నిరుపేద కుటుంభంలో పుట్టి సామజిక సేవ కార్యక్రమాలు చేయటం అనేది గొప్ప విషయం. ఆయన సేవలు ప్రశంశనీయం, ప్రభంజనం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

కుటుంబ నేపథ్యం, విద్యాబ్యాసం:

పరశురాములు గారు మార్చి 04, 1968న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ అర్బన్ జిల్లా, రంగసాయిపేట రైల్వే గేట్ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో రాములు మరియు ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఏజే మిల్లుల్లో దినసరి కూలీ. తల్లి ఎల్లమ్మ బీడీ కార్మికురాలు.

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రంగశాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది. కుటుంబ పోషణ కొరకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక తల్లికి తోడుగా బీడీలు తయారు చేసి  సహాయం అందించేవారు. గురువులు ఆయనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి పై చదువులు చదవాలని ప్రోత్సహించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఉన్నత చదువులను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌లోని శంభుంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదివాడు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. ఆయన చదువుకునే సమయంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా చదువే లక్ష్యంగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు.  1993లో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో యం.  ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశారు.  ఎల్.ఎల్.బి. 2002లో వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. యం .ఎస్.డబ్ల్యూ (సోషల్ వర్క్) 2010లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.

అవార్డులు:

1985లో అప్పటి భారత రాష్ట్రపతి జైల్‌సింగ్‌ చేతులమీదుగా రాష్ట్రపతి స్కౌట్ అవార్డు అందుకున్నారు.

1988లో మదర్ థెరిసా చేతులమీదుగా బెస్ట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు

1991వ సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడలు రంగంలో యువజన పురస్కారం అందుకున్నారు.

1996లో ఇంటర్నేషనల్ యూత్ సెంటర్, న్యూ ఢిల్లీ వారిచే అక్షరాస్యత కొరకు చేసిన కృషికి  చిహ్నంగా నిఖిల్ కోయితారా అవార్డును అందజేశారు.

భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి ద్వారా 1997 సంవత్సరంలో జాతీయ యువజన పురస్కారం అందుకున్నారు.

2006 ద్వారా అప్పటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిచే  రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డును అందుకున్నారు.

అభ్యుదయ సేవా సమితిలో పనిచేస్తున్నప్పుడు అత్యుత్తమ సామాజిక సేవకు గాను జిల్లా స్థాయి అవార్డులు (6) ఆరు అందుకున్నాను.

సందర్శించిన దేశాలు:

1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కొరకు కొలంబో, శ్రీలంక (25 రోజులు) సందర్శించారు.

1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కొరకు కెనడాలోని వాంకోవర్ (4 నెలలు) సందర్శించారు.

 మానవ సేవే మాధవ సేవ:

"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలిచే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్నవారే గొప్పవారు అవుతారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసేవారిని ఇష్టపడతాడు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.

సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి.  భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్నీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరముంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో భాగస్వాములు కావడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసేవారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా సేవ చేస్తున్నట్లే. 35 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పరశురాములు ప్రతిఒక్కరికి ఆదర్శం కావాలని కోరుకున్నాను..


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475





2, నవంబర్ 2023, గురువారం

కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్)

కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్):

“కోటి విద్యలు కూటి కోరకే” అని మన పూర్వీకులు అప్పుడప్పుడు ఒక సామెత చెప్పేవారు. ఇలాంటి సామెతలు మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనుభవాలను వ్యక్తీకరించడం ద్వారా జీవిత సత్యాలను వ్యక్తపరుస్తారు. మనిషి ఎంత చదువు చదివిన, ఎన్ని కోట్లరూపాయలు సంపాదించినా కడుపు నింపుకోవడానికే తప్ప చనిపోయిన నాడు చిల్లిగవ్వ తీసుకొనిపోలేము అని ఈ సామెత సూచిస్తోంది.

దేశంలో రోజు రోజుకు సంపన్నుల సంపద రెట్టింపై కోటీశ్వర్లుగా మారుతున్నప్పటికీ పేదలు మాత్రం మరింత పేదలై కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తున్నారు. రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదల కన్నీళ్లు తుడిచే దెవరు? వారి కడుపు నింపే దెవరు?

నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బోడుప్పల్ మేడిపెల్లి ప్రాంతంలో రోడ్ పక్కన జనాలు గుమికూడారు. అందరూ ఆసక్తితో చూస్తుండగా నేను కూడా బండి ఆపి చూడగా అక్కడ సర్కస్ ఆడుతున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు గుమ్మడవెల్లి లో చూసిన సర్కస్ ఆట మళ్లీ చూసినప్పుడు అద్భుతమైన ప్రదర్శన చూసిన అనుభూతి కలిగింది. భార్య భర్త మరియు ఇద్దరు పిల్లల సాయంతో సర్కస్ నిర్వహిస్తున్నారు. తండ్రి ఒక ఇనుప రాడ్ ను గొంతుకు అదిమి పెట్టుకొని గట్టిగా ఆ ఇనుప రాడ్ ను వంచడం ప్రారంభించాడు. అక్కడ జనాలందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తుండగానే రాడ్ ను గొంతులో దిగకుండా వంచాడు. గొంతుకు అదిమి పట్టి రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం. పట్టు తప్పితే ప్రాణం ఉండదని తెలిసి కూడా కుటుంబాన్ని పోషించాలనే తండ్రి తపన అందరినీ ఉద్వేగానికి గురి చేసింది. అంతేకాదు పొడవాటి వెదురు కర్రను తీసుకుని ఆ చిన్న పాపని కర్ర చివరన ఉంచి నోటి సహాయంతో పాపా కింద పడకుండా కర్రను పట్టుకొని ఇలాంటి ఎన్నో విస్మయాన్ని కలిగించే విన్యాసాలు చేశారు. ఎత్తైన కర్రలకు తాడు కట్టి ఆ తాడుపై చిన్న పాపని నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అంతరించిపోతున్న కళలను కుటుంబ పోషణ కొరకు నేటికీ సర్కస్ వంటి ప్రదర్శనలు చేస్తుండటం బాధాకరమైన విషయం. అయినా వారికి సర్కస్ జీవన ఉపాధి. రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్లుగా వారు ప్రదర్శనలు చేస్తేనే కడుపు నింపుకో గలరు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలతో చేయించడం విచారకరం.

సర్కస్ ఆటని కొనసాగించడానికి కారణం అంతరించిపోతున్న కళను బ్రతికించడం. తనని తాను బ్రతికించుకోవడం.

నేటి తరం పిల్లలకు సర్కస్ గురించి వివరించడం అవసరం:

తిండి కోసం మనిషి పడే తపన మరియు తల్లిదండ్రులు పడే కష్టం గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వారికి సర్కస్ లో చిన్న పిల్లలు చేసిన విద్య ఏ విధంగా నేర్చుకో సాగారనేది వారికీ వివరంగా వివరించాలి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ. పుట్టిన మనిషి మట్టి బొమ్మ కాదు. మనిషి మరొక బ్రహ్మ అన్నట్లు ఆచరిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని వారు తెలుసుకోవాలి.

చిన్న పాప తాడుపై ఎలా నడవగలిగింది అనే సందేహం కలుగకమానదు.

సాధన చేయుమురా నరుడా సాదించనిదే లేదురా అన్నట్లుగా సాధన చేస్తే సాదించనిది ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. చేయాలనే తపన తాలిమి తపస్సు ఉంటే సాధ్యం కానిది ఉండదు. గొంతులో దిగకుండా రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం అయినప్పటికీ ఆయన చేసిన సాధనకు రాడ్ వంగక తప్పదు. ప్రతి మనిషి కష్టాలను దీటుగా ఎదుర్కోగలిగితే కష్టాలు వెనుదిరగక తప్పదు.  


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ 9391480475



29, అక్టోబర్ 2023, ఆదివారం

ఎన్ని"కలలు"

 ఎన్ని"కలలు":


తరాలు మారినా పేదోడి తలరాత మారడం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వం వైఫల్యమా లేదా ప్రజల వైఫల్యమనేది అతికొద్ది మందికి తెలిసిన విషయం.
నీతి, నిజాయితీ, న్యాయం పట్ల నిబద్ధత ఉన్న వారిని ఎన్నుకోకుండా, డబ్బులు ఇచ్చినవారినే ఎన్నుకోవడమే దీనంతటికి కారణం. దీన్నిబట్టి మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రజలు అభివృద్ధి కోరుతున్నారా! అవినీతి కోరుతున్నారనేది అర్ధం కానీ ప్రశ్నగా మారింది. ప్రజలు  అభివృద్ధి కోరుకున్నట్లైతే అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలి, అవినీతి కోరుకున్నట్లైతే అవినీతిపరుడైన నాయకున్ని ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో అన్ని పార్టీలు డబ్బులు పంచడం మామూలే. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడిక లేదా డబ్బులు తక్కువ ఇచ్చేవాడిక లేదా అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి వేయాలనేది ప్రజల నిర్ణయం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అన్నట్లుగా ఓటు వేసే సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యత అవగాహన తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్ని"కలలు":

ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలు సంతోషంగా ఓటు వినియోగించడానికి ముందడుగు వేసేవారు. ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నిరుపేదలకు చేయూత అందుతుందని, ఎన్నికల సమయంలోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే కలలు కంటారు. అప్పట్లో నాయకులు ఇచ్చే హామీలు నమ్మదగినవిగా ఉండేవి. అందులో కొంతైనా హామీలు నెరవేరేవి. కానీ నేడు నాయకులిచ్చే హామీలు అమలు అవుతాయనేది పైనున్న దేవుడికే తెలియాలి హామీలిచ్చిన నాయకుడికి తెలియాలి. అంత నమ్మశక్యంగా ఉంటాయనేది ప్రతి ఓటరుకు తెలిసిందే. ఒకాయన ఈసారి మేము గెలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువే ఇస్తామని, మరొకాయన మేము గెలిస్తే అంతకంటే తక్కువకు ఇస్తామని హామీలిస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా  అనేది ఓటరు ఆలోచన చేయాల్సిన అవసరముంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలు అయోమయం అవడమే తప్ప అవసరానికి ఒక పథకం కూడా పేదోడికి అందదు. నిత్యావసర వస్తువుల ధరలు మండుతూనే ఉంటాయి. ధరలు పెరగడానికి కారణాలు వెతుకుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. అది నాయకుల కనికట్టు మంత్రం. ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ఉపయోగపడే ఉపన్యాసం ఒకటి ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. ఓట్లు దగ్గరపడ్డాక జనాలలో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గించి ఓట్లు అయినాక అంతకంత పెంచడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా ఓట్లకు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. తాగనివాడికి కూడా తాగడం నేర్పుతారు ఫ్రీ గానే వస్తుంది కదా అలా మద్యానికి అలవాటు చేసి ఓట్లయినాక మద్యం రేట్లు పెంచుతారు తాగుడుకు బానిసైన వారు అప్పుచేసి అయినా తాగుతారు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారు ఇది నాయకులకు తెలుసు మందు ఫ్రీగా పోస్తే మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి డబ్బులు వస్తాయని. ఓట్లేసే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటారేమోగాని జనాలు తిరగబడితే అదోలా ఉంటుందన్న సంగతి నాయకులు ఎరుగరు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రజలకు అవసరం అంతేగాని పెన్షన్ పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నారు. ఏ పని చేయక అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా  నాయకుల నటన అత్యంత అద్భుతంగా ఉంటాయి. నిజ జీవితంలో సినిమా నటుడు కూడా నటించనిది నాయకులు నటించి నటనలో జీవిస్తారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుందనేది ముమ్మాటికీ నిజం.
నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది ప్రజలకు పెద్ద సవాలే.. నిజాయితీ నాయకుడిని గుర్తించడం ఎలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఓటరు మదిలో...

ప్రజాధనాన్ని వృధా చేయకుండా చర్యలు తీసుకోవాలి:

ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రజా ధనం వృధా చేయడం వల్ల రానున్న రోజుల్లో పేదలు తినడానికి తిండి లేని పరిస్థితి చూడాల్సి వస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉండాలి. సోషల్ మీడియా ప్రచారాలు కూడా చాలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు ను సక్రమంగా వినియోగించుకునేలా ఎన్నికల సమయానికి రెండు నెలల ముందు మద్యాన్ని నిషేధించాలి. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలి.

చట్టాలు మారాలి:

ప్రజా ప్రతినిధుల నేరచరిత్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేర్చడమే కాకుండా, ఓటర్లు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండేలా ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో అన్ని అంశాలను పొందుపరచాలి. అప్పుడే ఓటరు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. అంతేకాకుండా అభ్యర్థి గెలిచిన తర్వాత అవినీతికి పాల్పడినట్లైతే ఆ సమయంలో ఓటర్లు రీకాల్ చేసుకొని మరొకరిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల అవినీతిని అరికట్టే అవకాశముంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ అమలులో ఉంది. ఇలాంటి దేశాలలో మాత్రమే సుపరిపాలన పరుగులు పెడుతుంది. ఇలాంటి చట్టాల కోసం యువత కృషి చేయాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.     
నిజాయితీ గల నాయకులు ఉన్నారా?

90 శాతం మంది నాయకులు అవినీతిపరులు అయితే 10 శాతం మంది నిజాయితీ గల నాయకులు అని చెప్పవచ్చు. ఉదాహరణకు గుమ్మడి నర్సయ్య  5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికి సాధారణ జీవితం కొనసాగించడం గొప్ప విషయం. సమాజానికి గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు అవసరం. ఈరోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరాలకు సరిపడా సంపాదన వెనకేసుకుంటున్నారు. గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు సంపాదన కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు ఎన్నుకోరు? ప్రజలే మోసపోతున్నారు కానీ నాయకులు మోసం చేయడం లేరన్న విషయం గమనించాలి.
గుమ్మడి నర్సయ్య తో పాటు జయ ప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని ప్రజలు గుర్తించకపోవడం విచారకరం. సమాజంలో మార్పు రావాలంటే సమస్యలపై పోరాడే నాయకుడు కావాలి. అప్పుడే పేదలకు సరైన సంక్షేమ పథకాలు అందుతాయి.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి సరైన నాయకుడిని సరైన సమయంలో ఎన్నుకోవాలి..
పేదోడి కల నెరవేరాలంటే. ఓటు ఆయుధం గా ఉపయోగించిన నాడే సాధ్యపడుతుంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475        





5, అక్టోబర్ 2023, గురువారం

పల్లె నుండి ప్రపంచ ఆర్ధికవేత్తగా తెలంగాణ బిడ్డ






సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా!
అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా!

దాశరథి గారు రచించిన ఈ పాట భక్తులకు భగవంతుని పట్ల మరింత భక్తిని కలిగించింది. ఎంతోమంది నిరాశ ప్రజలను ఉత్సాహ పరిచింది. నిరుపేద విద్యార్థులను ప్రభావితం చేస్తూ వారిని ప్రయోజకులను చేసింది. చదువుకు పేదరికం అడ్డంకి కాదని, అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా స్ఫూర్తినిచ్చింది. ఈ చదువులు మనకెందుకులే అనుకున్న నిరుపేద విద్యార్థుల మదిలో చదవాలనే ఆశను రేకెత్తించాయి వారి ప్రతిభను ఖండాంతర ఖ్యాతి గడించేలా చేసింది. పల్లె వాసులను పట్నం వైపు వెళ్లేలా ప్రభావితం చేసింది. పల్లెటూరి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది.

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ!  అన్నట్టుగా ప్రతి మనిషికి సాధించాలనే  పట్టుదల, దృఢ సంకల్పం, తపన, తపస్సు ఉంటే మనిషి సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదనడంలో సందేహం లేదు. ప్రతి మనిషి జీవితంలో అవరోధాలు, ఆటంకాలు సహజమే కానీ వాటిని అవకాశాలుగా మలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని మరోసారి నిరూపించిన ఉస్మానియా లో వికసించిన పేదింటి విద్య కుసుమం, సర్కార్ బడి నుంచి అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఎదిగిన తెలంగాణ వ్యక్తి, స్నేహాశీలి, మృదుస్వభావి, విద్యావేత్త, అనన్య ప్రతిభ కలిగిన రచయిత, సంపాదకుడు, సలహాదారు, బహుభాషా కోవిదుడు, "రవీందర్ రేనా".  

"రవీందర్ రేనా" గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయం కృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా బోధన మరియు పరిశోధన రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి ఆయా దేశాలు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

రవీందర్ రేనా ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

విద్యార్హతలు:

తెలంగాణ, హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పిఎచ్. డి (గోల్డ్ మెడల్), ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఏ పూర్తి  చేశారు.
తెలంగాణ, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో ఎల్ ఎల్ బి. (బ్యాచిలర్ ఆఫ్ లీగల్ లాస్) పూర్తి చేశారు.
తమిళనాడు అన్నామలై విశ్వవిద్యాలయం లో బి.ఇడి. (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) పూర్తి చేశారు.
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో ఎకనామిక్స్‌లో బి ఏ పూర్తి చేసారు.

అవార్డులు:

2011లో నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ పరిశోధకుడి అవార్డును అందుకున్నారు.
2012లో అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది అవార్డు అందుకున్నారు.
2012 నుంచి 2022 వరకు విద్య రంగంలో ఆయన అందించిన సేవలకు పలు అవార్డులు అందుకున్నారు.
2022 లో డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వారిచే ఉత్తమ పరిశోధకుడిగా గుర్తింపు లభించింది.
2023 లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ICERT) వారిచే ఏకలవ్య అవార్డు అందుకున్నారు.
2023 ఒలింపస్ ఇంటర్నేషనల్ అవార్డు (OIASA) అందుకున్నారు.

అంతర్జాతీయ గుర్తింపు

ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (UA) అవార్డును అందుకున్నారు.
అతని పరిశోధన, రచనల ఆధారంగా, అమెరికన్ హిస్టారికల్ సొసైటీ, USA వరల్డ్ హూ ఈజ్ హూ ఇంటర్నేషనల్‌లో అతని ప్రొఫైల్‌ను నమోదు చేసింది.
అతను ప్రపంచంలోని టాప్ 01% పరిశోధకులలో ఒకడు.
డబ్లిన్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (UA) అవార్డు మరియు గ్లోబల్ ఎకనామిక్స్ జడ్జిస్ ప్యానెల్ చైర్మన్ గా ఎంపిక చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం.

ప్రచురణలు:

పరిశోధన పుస్తకాలు - 10; పాఠ్యపుస్తకాలు - 5; స్టడీ మెటీరియల్ - 4, జర్నల్ పబ్లికేషన్స్ (పీర్ రివ్యూడ్ ) - 150, అంతర్జాతీయ -120;  జాతీయ -31, సవరించిన పుస్తకాలలో అధ్యాయాలు- 50, వార్తా పత్రికలు, మ్యాగజైన్‌లు మరియు వెబ్‌సైట్‌లలో కథనాలు – 125 కంటే ఎక్కువ.

బి సి రిజర్వేషన్ కోసం పోరాటం :

1995లో ఉస్మానియాలో చదువుతున్న సమయంలో వెనుకబడిన బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య తదితరులు నేతృత్వంలో విద్యార్థి నాయకుడిగా రవీందర్ రేనా పోరాడారు. ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుతో బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించాలని అనేక చర్చలు జరిపారు. రవీందర్ రేనా నిరుపేదలకు న్యాయం కోసం తీవ్రంగా పోరాడిన విద్యార్థి నాయకుడు.  

కుటుంబ నేపథ్యం, విద్యాబ్యాసం:

రవీందర్ రేనా గారు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ఎర్రబెల్లి గ్రామంలో నిరుపేద రైతు కుటుంబానికి చెందిన చంద్రమౌళి, రాజమ్మ దంపతులకు సెప్టెంబర్ 18, 1969 నాడు జన్మించారు. 1975 నాటి కాలంలో ఎర్రబెల్లి గ్రామం ఎలాంటి సౌకర్యాలు నోచుకోని పల్లె కనీసం బస్సు, కరెంటు, త్రాగు నీరు సౌకర్యం లేని గ్రామం. ఎర్రబెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం కొనసాగింది.  గురువులు రవీందర్ గారికి  చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని మన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ప్రోత్సహించేవారు. గురువుల ప్రోత్సాహమే ఆయనలో పట్టుదల పెంచింది. కనీసం చదవడానికి కరెంట్ సౌకర్యం లేనప్పటికీ  మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా కిరోసిన్ దీపం సహాయంతో మొక్కవోని దీక్షతో చదివారు. ఆ తర్వాత ఎనిమిదొవ తరగతి చదువుకునేందుకు తన గ్రామంలో పాఠశాల లేనందున ఎర్రబెల్లి నుండి భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల వరకు ప్రతి రోజు కాలినడకన వెళ్లి ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పూర్తి చేశాడు. అంతేకాదు 10వ తరగతి చదువుతున్నప్పుడు పుస్తకాలు, పరీక్ష ఫీజులు కట్టేందుకు డబ్బులు లేని సమయంలో తల్లి వద్ద డబ్బులు లేవని గ్రహించి ఊళ్ళో కూలి పనులు చేసి పుస్తకాలు కొని చదివి పాసయ్యాడు. చదువుపై ఆయనకున్న ఆసక్తికి ఇది నిదర్శనం. హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి మరియు ప్రాథమిక పాఠశాలలో శ్రీ సోమలింగం వంటి చాలా మంది ఉపాధ్యాయుల నుండి ప్రేరణ పొందారు. హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో బట్టల దుకాణంలో నెలకు 80 రూపాయల జీతంతో దినసరి కూలీగా పనిచేస్తూ డిగ్రీ పాసయ్యారు. బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతోనే గడిచింది. తల్లి గ్రామంలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తల్లి కష్టాలు చూడలేక చలించిపోయాడు, తనను నమ్ముకున్న కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చదువు సరైన మార్గమని, కష్టాలను అధిగమించేందుకు చదువు ఆయుధమని భావించాడు. తర్వాత పై చదువుల కొరకు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ పిఎచ్. డి పూర్తి చేశారు. ఆయన ప్రతిభకు పిఎచ్. డి లో గోల్డ్ మెడల్ రావడం విశేషం, ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఏ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ నుంచి బీఈడీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పటికీ ఆయనది ఎంతెత్తు ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వం. బాల్యమంతా బాధల తోనే గడిచిన ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టుసడలని పట్టుదలతో ప్రయత్నించి విజయాలను సొంతం చేసుకున్నారు. మూర్తీభవించిన మానవత్వానికి మరో పేరు రవీందర్ రానే. పలు దేశాలలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ స్వదేశం పై మమకారంతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా శ్రీశ్రీ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా మరియు న్యూఢిల్లీలోని స్పర్ష్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, తన కొడుకు మరియు కుమార్తెను కూడా స్వదేశంలోనే చదివిస్తుండడం ఇది దేశంపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. అతని విద్యాభ్యాసమంతా భారతదేశంలోనే కొనసాగింది. బోధన మరియు పరిశోధనలో 31 సంవత్సరాల అనుభవం. భారతీయ సేవా 5 సంవత్సరాలు; 26 ఏళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను 40 కంటే ఎక్కువ దేశాలు సందర్శించాడు మరియు ఎరిట్రియా, పాపువా న్యూ గినియా, నమీబియా, దక్షిణాఫ్రికా, రష్యా, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో పనిచేశాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీందర్ రానే గారి జీవితం నిరుపేద విద్యార్థులకు ఆదర్శం.

యువతకు సందేశం:

ఆశయ సాధనకు పేదరికం అడ్డు కాజాలదని, ప్రతి విద్యార్థి తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకునే దిశగా పట్టుసడలని ప్రయత్నం చేస్తూ సాధించేవరకు శ్రమించాలి. అప్పుడే విజయం మన సొంతం.
అసాధ్యమనే పదంలో "అ" అనే అక్షరాన్ని పక్కన పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధ్యమే. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం. సమస్యలు వచ్చాయని సతమత పడకుండా అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని పలు అంతర్జాతీయ సదస్సుల్లో యువతకు ఆయన సందేశాన్ని అందించారు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475  









 

24, సెప్టెంబర్ 2023, ఆదివారం

మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..



 మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..


గాంధర్వ లోకాలనుండి భూలోకానికి దిగి వచ్చిన పాటల పూదోట. ఆ తోటలో విరబూసిన పసిడి పంట ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతు విప్పితే అమ్మ జోల పాడినట్లుగా పసిపాప కూడా హాయిగా నిద్రలోకి జారుకోవాల్సిందే అంత అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులకు పసందైన వీణుల విందునందించారు. ఆయన స్వరం అద్భుతం, ప్రభంజనం అనన్య సామాన్యం. ఆయన పాట వింటే గాయపడిన హృదయాలు సైతం ప్రశాంతంగా తన్మయత్వంలో మునిగిపోవాల్సిందనడంలో అతిశయోక్తి లేదు.  విభిన్న స్వరాలతో పాటలు పాడుతూ తన గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. బాలు గారి గొంతులో పలుకని తెలుగు పదం లేదు. పాడనీ రాగం లేదు. సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఘనుడు గానగంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం.

బాలు గారి పాట తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన శ్రావ్యత మరియు ఆ స్వరంలో స్పష్టత నిజానికి బాలు గారి స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సన్నివేశానికి అనుగుణంగా ఎమోషనల్ గా, సహజంగా పాటకు ప్రాణం పోయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మించిన వారు లేరనే చెప్పాలి. దైవభక్తి, దేశభక్తి గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, అనేకము సందార్భాను సారముగా రాగయుక్తముగా భావ యుతముగా వైవిధ్యభరితమైన వేల పాటలు పాడి తెలుగు వారి మదిలో శాశ్వత స్థానాన్ని పొందిన అమరగాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు.


ఐదు దశాబ్దాల పాటు సాగిన ప్రస్థానంలో తెలుగు పాటలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తిరుగులేని గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, 16 భాషల్లో 50,000కు పైగా అత్యధిక సంఖ్యలో గీతాలను ఆలపించిన గాయకుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
ఆయన ఆలపించిన గీతాలు మరియు ఆయన చేసిన కృషికి ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు  మరియు 25 తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వం నుండి అనేక ఇతర రాష్ట్ర అవార్డులు అంతేకాకుండా  ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఎఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోవడం గొప్ప విషయం. తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగిన విషయం. 8 ఫిబ్రవరి 1981 న కన్నడలో 24 గంటల సమయంలో ఎలాంటి విరామం తీసుకోకుండా ఏకంగా 27 పాటలు ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. కన్నడంలో కాకుండా తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు రికార్డు చేసి రికార్డు సృష్టించారు.

కుటుంబ నేపథ్యం:

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరికథా కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు 4 జూన్ 1946 నాడు జన్మించారు.
ఆయన తండ్రి హరికథా కళాకారుడు అవడంవల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతంపై ఆసక్తి కలిగింది. తన తండ్రికి కూడా సంగీత కళాకారుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. బాలసుబ్రహ్మణ్యం చిన్నతనంలోనే సంగీత సంజ్ఞామానాలను అభ్యసించి, తన స్వయంకృషితో సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనం నుండే పాటల పోటీలో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.  ఇంజనీర్ కావాలనే ఉద్దేశ్యంతో అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. బాలు గారికి మొదటగా సంగీత కళాకారుడిగా కాకుండా తన తండ్రి ఆశయం మేరకు ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది కానీ ఇంజనీరింగ్ చదివే సమయంలో అనారోగ్య కారణంగా మధ్యలోనే చదువు మానేశాడు. ఆ తర్వాత గాయకుడిగా రాణించడానికి నిర్విరామ కృషి చేశారు.

సినీరంగ ప్రవేశం:

ఎస్పీ కోదండపాణి స్వరపరిచిన తెలుగు సినిమా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న లోని 'ఏమియే వింత మోహం' పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా 1966 డిసెంబర్ 15న అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1968 లో కోదండపాణి స్వరపరిచిన సుఖదుఃఖాలు చిత్రంలో "మేడంటే మేడ కాదు" పాట తెలుగు చిత్రసీమలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.  
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతున్న శంకరాభరణం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం బాలసుబ్రహ్మణ్యం గారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఆయన కృషికి ఉత్తమ నేపధ్య గాయకుడిగా జాతీయ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత సంవత్సరం 1981 లో  "ఏక్ దుయుజే కే లియే" హిందీ చిత్రానికి మరో జాతీయ అవార్డు లభించింది.  ఆయన గాత్రం అందించిన ఉత్తమ చిత్రాలు స్వాతిముత్యం, సాగర సంగమం, రుద్రవీణ, మాతృదేవోభవ, కే విశ్వనాధ్ గారు నిర్మించిన చిత్రాలన్నీ కూడా  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవే, అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువ బాలు గారు పాడినవే.

1989లో సల్మాన్ ఖాన్‌ నటించిన హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" లో దిల్ దీవానా పాట కు  బాలు గారు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ నటించిన చాల చిత్రాలలో ప్లేబాక్ సింగర్ పనిచేసారు. బాలు గారు మరియు లతా మంగేష్కర్‌ కలిసి పాడిన హిందీ చిత్రం "ఆప్కే హై కౌన్" లోని "దీదీ తేరా దేవర్ దీవానా " పాట అత్యంత ప్రజాధారణ పొందడమే కాక హిందీ చలన చిత్రంలో తనకంటూ మంచి గుర్తింపు లభించింది.

బాలు గారు కమల్ హాసన్, రజనీకాంత్ , విష్ణువర్ధన్ , సల్మాన్ ఖాన్ , కె. భాగ్యరాజ్ , మోహన్ , అనిల్ కపూర్ , గిరీష్ కర్నాడ్ , జెమినీ గణేశన్ , అర్జున్ సర్జా , నగేష్ , కార్తీక్ మరియు సహా పలు కళాకారులకు వాయిస్ ఓవర్ కూడా అందించారు.

సాధించిన అవార్డులు:

2001లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
2012లో బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు.
2015లో, అతను కేరళ ప్రభుత్వం నుండి హరివరాసనం అవార్డును అందుకున్నారు.
2016 లో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించబడ్డాడు.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 25 సెప్టెంబర్ 2020 న అందుకోవాల్సిన పద్మ విభూషణ్ అవార్డు కోవిడ్-19 కారణంగా ఆలస్యమవడం మరియు కోవిడ్-19 కారణంగా ఆయన 25 సెప్టెంబర్ 2020 న మరణించడం బాధాకరం ఆయన మరణానంతరం 2021 పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.

ఎందరో నటీనటులకు వారి హావభావాలకు, అభినయ రీతులకు అనుగుణంగా పాటలకు  ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటకు అసలైన వారసుడు అయ్యాడు. పదాల సరళిని జాగ్రత్తగా గమనిస్తూ అతని విరామ చిహ్నాలు అతని పాటను పండితులకు దగ్గర చేశాయి  శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.

మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదనడంలో అతిశయోక్తి లేదు. భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచాయి. చరిత్రలో నిలిచిపోయారు. బాలు గారి పాట చిరస్మరణీయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

21, సెప్టెంబర్ 2023, గురువారం

చరవాణి రెండు పార్శ్వాలు


చరవాణి  రెండు పార్శ్వాలు

 మానవ మేధస్సును ఉపయోగించి ఎప్పటికప్పుడుఅనేక కొత్త యంత్రాలు మరియు సాంకేతికతలు ఆవిష్కరింపబడుతున్నప్పటికీఅవి మనిషిపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపడం సహజమే.

నేడు మనిషి కనిపెట్టిన సాంకేతిక సాధనాల్లో ఒకటైన మొబైల్ ఫోన్ మానవాళికి ఒక పక్క విలువైన సమాచారాన్ని అందజేస్తున్నప్పటికీ మరో పక్క యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తోందనివారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ లాభ,నష్టాలు అనేవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం ఉపయోగించే పద్ధతి పై ఆధారపడి ఉంటుందన్న విషయం మాత్రం సుస్పష్టం. మార్టిన్ కూపర్ అనే అమెరికన్ ఇంజనీర్ ఎన్నో మంచి ఆలోచనలతో మరియు గొప్ప ఆశయంతో అవిశ్రాంతంగా పనిచేసి ఏప్రిల్

3, 1973 న మొబైల్‌ని అందుబాటులోకి తెచ్చారు. అప్పటినుండి మొబైల్ ఫోన్ కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ మానవాళికి అనేక విధాలుగా సేవలందిస్తుంది.

మొబైల్ యొక్క ప్రధాన లక్ష్యాలు దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకొనుటకు వైద్యంవిద్య బ్యాంకింగ్ సేవలు మరియు రైలు మరియు రవాణా సేవల సమాచారాన్ని అందించడంతోపాటు సందేశాలు పంపడం,సంగీతం వినడంసినిమాలు చూడటం,చరిత్రలను తెలియని విషయాలను తెలుసుకోవడం,లాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఓ సర్వే వెల్లడించింది. నవంబర్ 2022 సర్వే గణాంకాల ప్రకారంప్రపంచ జనాభా

బిలియన్లుఅందులో 5.44 బిలియన్లు మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది మరియు మొబైల్ లేకుండా జీవించలేము అనే స్థాయికి చేరుకుంది.

నేటి తరంవారు మాత్రం మొబైల్స్ కి బానిసై నిద్ర లేచినప్పటి నుండి పడుకునే దాకా గంటల తరబడి అవసరం లేని విషయాల కోసం అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూపనికిరాని విషయాలమీద పట్టు సంపాదించిఅవసరం లేని తగాదాలలో తలదూర్చిపనికొచ్చే విషయాలను పక్కనపెట్టి తమ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచన చేయకుండా మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్ ఇప్పుడు కౌమారదశలో ఉన్న వారి దైనందిన జీవితంలో అంతర్భాగం గా ఉంది.

ఎన్నో మంచి ఆలోచనలతో దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకునేందుకు మార్టిన్ కూపర్ మొబైల్స్ కనిపెడితే. నేడు అందుకు భిన్నంగా దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకుంటూప్రేమఆప్యాయత,అనురాగాలతో కూడుకున్న మానవ సంబంధాలను మరిచి అయినవారికి దూరమవుతున్నారుదూరం వారికి దగ్గరవుతున్నారు. కొంతమంది వారి వ్యక్తిగత విషయాలను ఫేస్బుక్వాట్సాప్ట్విట్టర్ మరియు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ప్రచారం చేసుకుంటూ అనవసరమైన గొడవలకు దారి తీస్తూ మరియు సైబర్ బెదిరింపుల వలన ఆర్థిక వనరులను కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. మొబైల్ సాంకేతిక సాధనం నుండి సామాజిక సాధనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొబైల్ యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీకొంతమంది యువత మొబైల్ ఆధారంగా విద్యార్థులకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఒక అభ్యాస సాధనంగా ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు.

నిరుపేదల సమస్యల పరిష్కారం కొరకు ట్విట్టర్:

ఒడిశాకు చెందిన డిజిటల్ కార్యకర్త ఉపేంద్ర మహానంద్ ట్విట్టర్ సాయంతో పలు గ్రామాల్లోని పేదలకు పెన్షన్లు,రేషన్ కార్డులుతాగునీరు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. 41 ఏళ్ల అతను ఈ విధంగా ఇప్పటివరకు 50 కి పైగా కేసులను పరిష్కరించాడంటే అతన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఉపేంద్ర తన తల్లిదండ్రుల కష్టాలను చూసి అభాగ్యులకు సహాయం చేయాలనే తపనతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియా గురించి తెలుసుకోవడానికిఉపేంద్ర 2020లో ఫిర్యాదుల పరిష్కారం కోసం ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ అయిన 12baje12minuteనిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌కు హాజరయ్యాడు. ఇక్కడఅతను సోషల్ మీడియా ను ఎలా ఉపయోగించాలి మరియు ప్రజల సమస్యలను త్వరగా మరియు పారదర్శకంగా ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేవనెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ఒడిశా ప్రభుత్వం యొక్క5T మోడల్ గురించి కూడా అతను తెలుసుకున్నాడు. తరువాత, అతను కంటెంట్ రైటింగ్‌లో శిక్షణ పొందాడు, లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా చేరుకోవడానికి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సరైన ట్యాగ్‌లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం నేర్చుకున్నాడు మరియు వెనుకబడిన వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రావీణ్యం సంపాదించాడు.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వారు నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ప్రముఖుల, విద్యావేత్తల నుండి ఆర్థిక సహాయం కొరకు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించి సహాయాన్ని పొందుతున్నారు. మొబైల్ ద్వారా పేదల సమస్యలకు సత్వర పరిష్కారం అభినందనీయం.

విద్య, ఉద్యోగ, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న ఇంటర్నెట్:

కమ్యూనికేట్ చేయడంతో పాటు, ఆన్‌లైన్‌లో ప్రశ్నను శోధించడం, ఆన్‌లైన్‌లో వార్తలపై సమాచారాన్ని పొందడం మరియు ఆన్‌లైన్‌లో విద్యా వీడియోలను చూడటం వంటివి. మొబైల్ ఫోన్‌లతో అభ్యాస శైలి యొక్క ప్రభావాన్ని పెంచడమే కాకుండా, టీనేజ్ వారికీ  సులభంగా అధ్యయనం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. కరోనా సమయంలో విద్య. ఉపాధి కల్పనలో అనేక మార్పులు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలు విద్యార్థులకు ఇంటి నుండి చదువుకునే అవకాశాన్ని అందించాయి మరియు ఉద్యోగులు కూడా కరోనా నుండి బయటపడటానికి ఇంటి నుండి పని చేసారు మరియు బ్యాంక్ సేవలు మరియు ఇతర ప్రభుత్వ సేవలు కూడా అందించబడ్డాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ సేవలు బాగా అభివృద్ధి చెందాయి. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపాధి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఉద్యోగావకాశాల కోసం కోచింగ్ ఫీజులు కట్టలేక యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఎడ్యుకేషనల్ వీడియోలను చూసి సన్నద్ధమై ఉన్నత స్థాయికి చేరుకున్న పేద విద్యార్థులు ఎందరో ఉన్నారు.

విద్యార్ధులపై మొబైల్ ప్రభావం:

కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ ఆవిష్కరణకు ముందు పిల్లలపై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం లేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన గణిత లెక్కలు ఎలాంటి ఆధారం లేకుండా అవలీలగా చేసేవారు. కానీ కాలక్రమేణా కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ రాకతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి లోపంతో పాటు బద్దకస్తులుగా తయారువుతున్నారు. అంతేకాకుండా మొబైల్ ఆవిష్కరణకు ముందు పిల్లలు మరియు యువకులు ఇతరుల కంటే ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉండేవారు. అలాంటిది మొబైల్ వచ్చాక సృజనాత్మకతను కోల్పోతున్నారు. ఈ విషయాన్నీ తాజాగా అధ్యయనం చేసిన పరిశోధకులువెల్లడించారు. తల్లిదండ్రులు, గురువుల  పర్యవేక్షణ లేనందున అతి చిన్న వయసు నుండే మొబైల్ వ్యసనంగా మారింది. ఆ వ్యసనం పిల్లల మెదడుపై ప్రభావం చూపి సృజనాత్మకతను తగ్గిస్తుందని పరిశోధకులు నిర్వహించిన న్యూరోఇమేజింగ్ అధ్యయనంలో వెల్లడైంది.

యువతతో పాటు యువకులు కూడా ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. మరికొందరు సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలు, సామాజిక స్పృహ కలిగిన సంఘటనలను షార్ట్ ఫిల్మ్‌లుగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో ఫోటోల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫోన్‌లో ఫొటోలు దిగడం అలవాటుగా మారింది. అంతే కాకుండా రోడ్లపై ఫొటోలు దిగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మార్పు రాకపోవడం బాధాకరం.

ఆరోగ్యంపై మొబైల్ ప్రభావం: 

మొబైల్స్ విడుదల చేసే రేడియేషన్ గుండెను దెబ్బతీస్తుందని నిపుణులు చెపుతున్నారు.
ఎక్కువసేపు మాట్లాడటం వల్ల వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెవి, ముక్కు, గొంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య ఫుడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ రావడంవల్ల చాల మంది బయట నుండి ఫుడ్ ఆర్డర్స్ చేస్తూ ఇంట్లో వంటకి ప్రాధాన్యత ఇవ్వటంలేదు అందువల్ల అనారోగ్యాలకు గురిఅవుతున్నారు. 

ఒకప్పుడు  పిల్లలు అన్నం తిననని ఏడుస్తుంటే,  తల్లి చందమామను చూపిస్తూ, వారికి ఊసులు చెబుతూ అన్నం తినిపించే వారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో ఉన్న అమ్మలు పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో చందమామ లేకపోతే, స్మార్ట్ ఫోన్ లో పిల్లల వీడియోలు పెడుతూ, అన్నం తినిపించడం జరుగుతుంది. దీని వలన పిల్లలకు చిన్ననాటి నుండే స్మార్ట్ ఫోనే అంటే ఆసక్తి పెరుగుతుంది. మొదటగా పిల్లలకు ఫోన్ ఆసక్తి పెంచేలా చేస్తుంది తల్లిదండ్రులే.

మానవ సంబంధాల పై మొబైల్ ప్రభావం:

మొబైల్ ఆవిష్కరణకు ముందు, మానవ సంబంధాలు విలువలు ప్రజా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. అన్నదమ్ములందరూ ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆత్మీయత అనురాగాలతో ఉమ్మడి కుటుంబంలోజీవించేవారు. అంతేకాదు గ్రామాల్లో సాయంత్రం వేళల్లో ఇంటి చుట్టుపక్కల వారందరూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకునే వారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవే వార్తలు అనుకునేవారు. కానీ నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడుపుతున్నాయి. గ్రామాల్లో కూడా వీధుల్లో కూర్చుని మాట్లాడుకునే వారు కరువయ్యారు. దీంతో పెద్దవాళ్లు కూడా సాయంత్రం అయితే చాలు  టీవీలు ముందు, లేదా ఫోన్‌ పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్‌తో సమయం వృధా చేసుకుంటూ మానవ సంబంధాలను దూరంచేసుకుంటున్నారు. ఒకే ఇంటి సభ్యులు కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని మరిచిపోయి స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడాలంటేనే విముఖత చూపుతున్నారు . ఆ రోజుల్లో పిల్లలు ప్రతి పండుగ మరియు వేసవి సెలవులను గ్రామాల్లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనుండి బయటకు రావటంలేదు టీవీ, మొబైల్ తోనే కాలం గడుపుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా పట్టించుకోకుండా పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. సెల్ ఫోన్ల అప్లికేషన్లు మనిషికి అన్ని సౌకర్యాలు కల్పించి క్షణాల్లో ఇంటి నుంచి అన్నీ పొందే అవకాశం కల్పించి బద్దకస్తులుగా  చేశాయి. అందుకే మనిషికి ఫోన్ ఉంటే ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదన్న భ్రమలో ఉంటున్నారు. స్నేహితులకు, బంధువులకు దూరమవుతున్నాడు. ఫోన్లు లేనప్పుడు మనిషి ఎంత దూరమైనా వెళ్లి కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడేవాడు కానీ ఫోన్ రాకతో మనిషిలో ఆప్యాయతతో పలకరించే మనస్తత్వం మాయమైపోతుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచాలి - వారిని సరైన మార్గంలో ఉంచడానికి. సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ కాకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి. తద్వారా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.

వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475

 


13, ఆగస్టు 2023, ఆదివారం

మా ఓట్లు మాకే, మా వాటా మాకే.

మా ఓట్లు మాకే,  మా వాటా మాకే.

సిరా చుక్క మౌనం వహిస్తే . మందు చుక్క రాజ్యం ఏలుతుంది అన్నట్లుగా. బీసీ కులాలు మౌనం పాటించడం వల్లే అగ్రకులాల వారు రాజ్యం ఏలుతున్నారన్న విషయం జగమెరిగిన సత్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75  సంవత్సరాలు దాటినా ఇప్పటికి బి సి కుల గణన కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపునిచ్చిన బీసీ కులాలకు రాజ్యాధికారం కలగానే మిగిలిపోయింది. దేశ జనాభాలో 75 శాతం బి సి వారు ఉండగా వారికి సరైన రాజ్యాధికారం లేకపోవడం శోచనీయం.

మన దేశంలో 1931లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది, సమయంలో మన దేశానికి అన్ని అధికారాలు లేవు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి జనాభా గణన చేపట్టాలని అంగీకరించారు. జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండగా కుల గణన అంశం చర్చకు రాకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. షేడ్యూల్డ్ కులాలు, షేడ్యూల్డ్ తెగల జనగణన సేకరణ చేపడుతున్నారు తప్ప 70 యేండ్లు గడిచిన నేటికీ బి సి కుల గణన చేపట్టడం లేదు. బీసీ కులాల గణన వివరాలు చేపట్టాలని సుప్రీం కోర్టు, బీసీ కమిషన్ ఎన్నోసార్లు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బి సి కుల గణన వివరాలు చేపట్టక పోవడానికి బలమైన కారణమేంటో ప్రతి బీసీ ఓటరు తెలుసుకోవాలి.  మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికార వ్యవస్థలు, పార్లమెంట్ వ్యవస్థలు మరియు అసెంబ్లీ, కమిషన్ అనేక రాజకీయ పార్టీల కార్యవిర్వాహక శాఖలలో పనిచేస్తున్న వారు ఎంత శాతం? అందులో బి సి శాతం ఎంత? రాజకీయ నాయకులలో అత్యధిక శాతం పదవులు అనుభవించే వారి శాతం ఎంత? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ జనాభాలో 75 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు. కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిలో 75 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారే కావడం మరింత బాధాకరం. అగ్రవర్ణాలు శాశ్వతంగా పాలించేలా బీసీ కులాలను అణిచివేతకు గురిచేస్తున్నారనడంలో సందేహం లేదు.

జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం వల్ల వారికీ సరైన రిజర్వేషన్లు దక్కుతున్నాయి. బి సి కులాలవారీగా ఎలాంటి లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ల వాటా శాతం కోల్పోవాల్సి వస్తుందనేది ముమ్మాటికీ నిజం. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఎన్నికల సమయంలో మాత్రమే సరి మేము గెలిస్తే బిసి లకు రాజ్యాధికారం ఇస్తామని మురిపించి ఓట్లు దండుకుంటున్నారు తప్ప బిసి లకు ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదు.

తెలంగాణలో బి సి లకు ప్రాధాన్యత కరువు:

 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది బి సి లు. తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరి, విద్య, వైద్య, ఉద్యోగం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని, తమ హక్కులకు రక్షణ కలుగుతుందని భావించి ఉద్యమాన్ని ఉధృతం చేయడమే కాకుండా పోలీస్ లాఠీ దెబ్బలకు వెనుతిరగకుండా, ఆత్మబలిదానాలకు కూడా లెక్కచేయకుండా అమరులైనారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్రం  సాధించుకున్నారు. అమరులంతా బీసీలే కావడం గమనార్హం. మృతుల కుటుంబాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం శోచనీయం. స్వరాష్ట్రం వస్తే తమకు సరైన న్యాయం జరుగుతుందని భావించిన బి సి లకు 2014 ఎలక్షన్ లో నాయకులు ఈసారి గెలిస్తే బి సి కుల గణన చేపడతామని హమిచ్చారు. కానీ నేటికీ హామీ నెరవేరలేదు. ఉద్యమానికి ఊపిరి గా నిలిచిన బి సి లకు ఎన్నికల్లో సరైన సీట్లు కేటాయించకుండా వివక్ష చూపింది. తొమ్మిదేండ్ల పాలనలో విసుగు చెందిన బి సి కుల సంఘాలు స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు దాటిన ఇంకెన్నాళ్లు అర్ధ బానిసలుగా బ్రతకాలి అనే ప్రశ్నలు మేధావుల్లో, యువతలో తలెత్తుతున్నాయి. అంతర్గత వివక్షను వ్యతిరేకిస్తూ రాజ్యాంగం సూచించిన తమ హక్కుల పరిరక్షణ కోసం, పాలనలో సరైన వాటా కోసం,  సమిష్టి ఉద్యమాలు ఎంతైనా అవసరమని భావిస్తూ బి సి కుల సంఘాలన్నీ ఐక్యంగా, ఇక లక్ష్యంగా రాజకీయ ఉద్యమ వేదికలను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

పద్మశాలీయులకు రాజ్యాధికారంలో మొండిచేయి:

భారతదేశంలో ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న పద్మశాలీయులు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సుమారు 2 కోట్ల 20 లక్షల మంది ఉన్నారు. పద్మశాలి సంఘం గణాంకాల ప్రకారం ఒక్క తెలంగాణలోనే 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది అనధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం 23 లక్షల మంది ఓటర్లు ఉంటారు. నేటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న పద్మశాలి రాజకీయంగా ఎదగలేక పోవడం బాధాకరం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఒక్క పద్మశాలికే ఉందంటే అతిశయోక్తి కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా అగ్రకుల నాయకుల ఎత్తుగడలకు   ముఖ్యమంత్రి కాలేకపోయారు. తర్వాత అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం పద్మశాలీల కుల సంఘాలను విచ్చిన్నం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప రాజకీయంగా ఎదగకుండా అణచివేశారు. ప్రత్యేక తెలంగాణ సాదించుకుంటే రాజకీయంగా ఎదుగుతామని భావించిన పద్మశాలీయులకు 9 ఏళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. పద్మశాలి వర్గంలో ఉన్న మేధావులు, విద్యావంతులు, యువకులు బానిస బ్రతుకు బ్రతికే కన్నా పోరాడితే పోయేది ఏమి లేదని రాజ్యాధికార సాధన కొరకు మరియు 2023 ఎలక్షన్ లో పద్మశాలీయుల సత్తా చాటడం కోసం కుల సంఘాల్లాంటిని ఒకే వేదిక గా నిలిచేందుకు   ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఈసారి అయినా అగ్రవర్ణాల నాయకులు పద్మశాలీయులను రాజకీయంగా ఎదగనిస్తారా లేదా అనేది ఎదురుచూడాల్సిన అవసరం ఉంది.

రజకులకు రాజ్యాధికారంలో మొండిచేయి:

తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో ఇతర కుల వృత్తుల వారితో పాటు రజకులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రదర్శించి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. సభ్య సమాజానికి రజకులు చేసిన సేవలు మరువలేనివి. దేశ సేవకులైన రజకులను బానిసలుగా మార్చిన పాపం అగ్రకుల నాయకులదే. ఆటు రాజ్యాధికారంలోను, మిగతా అన్నింటిలో సరైన గుర్తింపు ఇవ్వకుండా వారిని కేవలం ఓటు బ్యాంకు గానే వినియోగించుకున్నారు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనాత్మకమైన పథకాలు గానీ ప్రాధాన్యత గానీ ఇవ్వడంలేదు. ప్రతి రజకుడి ఇంటికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి యేండ్లు గడిచిన ఇప్పటికి పూర్తి స్థాయిలో అమలుకాలేదని రజక సంఘాలు వాపోతున్నాయి. ఎంతో కస్టపడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని తమ హక్కుల పరిరక్షణ కొరకు రజక సంఘాలు కూడా రాజ్యాధికారం కోసం రాజకీయ యుద్ధ భేరీ సమావేశాలు నిర్వహించాలని కోరుకుంటున్నాయి. 2023 ఎలక్షన్ లో రాజ్యాధికార దిశ గా ముందుకు అడుగులువేయాలని భావిస్తున్నారు..

రాజ్యాధికారమే లక్ష్యంగా కుమ్మరివృతి సంఘాలు:

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్సిల్వర్వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది ప్రభుత్వాల చేయూత లేక చేతి వృత్తులు కనుమరుగవుతుంటే కనీసం వారికి సరైన ఉపాధి హామీ కల్పించలేని పరిస్థితి. కుమ్మరి వృత్తికి ఎలాంటి పథకాలు లేకపోవడం శోచనీయం. కుమ్మరి వృత్తిదారులు మాకు అన్నిటిలోను అన్యాయమే జరిగిదంటూ మా హక్కులు మాకు కావాలంటూ రాజ్యాధికార దిశగా అడుగులువేస్తున్నారు. కుమ్మరి సంఘాలు ఏక తాటిపై నడవాలని భావిస్తున్నాయి.

రాజ్యాధికారమే లక్ష్యంగా గౌడ సంఘాలు:

నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్‌,బీర్‌, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్‌, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్టైజ్మెంటుల  రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో వృత్తి దెబ్బతింటోంది.  ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే  మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2023 ఎలక్షన్ లో రాజ్యాధికార దిశ గా ముందుకు అడుగులువేయాలని భావిస్తున్నారు..

తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీసీ కులాలు తమ అస్తిత్వాన్ని పక్కనపెట్టి ఎలాంటి స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ వచ్చింది. బి సి లకు టిక్కెట్ల పంపకం లో కూడా పూర్తి వ్యతిరేకత చూపింది.

గుర్తింపు నోచుకోని నాయి బ్రాహ్మణుల వృత్తి:

2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్నిబంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

మా ఓట్లు మా వాళ్ళకే, మా వాటా మాకే:

మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే అనే నినాదంతో బీసీ సంఘాలన్నీ ఏకం కావడానికి సిద్ధపడుతున్నాయి.

అగ్రవర్ణాల ఆధిపత్యంతో అణచివేతకు గురవుతున్న బీసీలంతా ఒకే గొంతుకతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలు బీసీ సంఘాలు సంకేతాలిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు కులాల వారీగా రాజకీయ పోరుబాట పట్టే సంఘాలు ఇప్పటి నుంచే సమావేశమవుతున్నాయి. ఏదిఏమైనా బీసీ ప్రజలంతా ఒక్కటిగా ఉండి హక్కుల పరిరక్షణ కోసం పోరాడితేనే రాజ్యాధికారం దక్కుతుందనేది జగమెరిగిన సత్యం.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం అంశం మరియు బీసీ కుల గణన విషయం తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. మళ్ళీ ఐదేండ్ల తర్వాత ఎదో ఒక ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారు.

ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కుల గణన ప్రక్రియను ప్రారంభించి బీసీలకు రాజ్యాధికారం అందించేలా కృషి చేయాలనీ ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కోరుకుంటున్నాయి.

 

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్
: 9391480475

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...