31, డిసెంబర్ 2024, మంగళవారం

వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :

వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణవార్త ప్రపంచ సంగీత ప్రియులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందిన తబలా పై కమనీయ ధ్వనులు పలికించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన గొప్ప కళాకారుడు.

తబలా పై తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తాయి.
తబలా పై అతని చేతి మునివేళ్ళు అలల్లా ఓలలాడుతూ మధుర మృదంగాలై మోగుతుంటాయి.

అతని మనం ఎలా మర్చిపోగలం:

తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే తబలా విద్వాంసుడు గుర్తుకు రాకపోవచ్చు కానీ తాజ్ మహల్ టీ యాడ్ లో తబలా వాయించిన వ్యక్తి అంటే అందరికీ తెలుసు. నిన్న ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో, అతను ఎవరా అని చాలా మంది సందేహించారు. కాసేపటి తర్వాత జాకీర్ హుస్సేన్ మరణాన్ని తెలియజేస్తూ తాజ్ మహల్ టీ యాడ్ చూపించింది అప్పటివరకు ఆయన పేరు  చాలా మందికి తెలియదు. చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు తన పేరుతో అందరికి పరిచయమవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం తన పేరుతో కాకుండా తన ప్రతిభతో  పరిచయమయ్యేవారు అతి కొద్దిమంది ఉంటారు అందులో జాకీర్ హుస్సేన్ ఒకరు. మొదటగా మన దేశంలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీని 1966లో కోల్‌కతాలో నటీనటులు జీనత్ అమన్ మరియు మాళవిక తివారీ తాజ్ మహల్ టీ యాడ్ తో ప్రారంభించారు కానీ తయారీదారులు ఆశించినంత ప్రజాధారణ పొందలేకపోయిందని గమనించారు. ఆతర్వాత హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ (HTA) ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడానికి భారతీయతను పాశ్చాత్య ఎక్స్‌పోజర్‌తో సమతుల్యం చేసే బ్రాండ్ అంబాసిడర్ అవసరం వచ్చింది. తబలా అభిమాని అయినా (HTA) కాపీ రైటర్ KS చక్రవర్తి జాకీర్ హుస్సేన్ పేరు ఎంపిక చేశారు. ఎంపిక సమయానికి హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండటంతో KS చక్రవర్తి అతన్ని సంప్రదించి తాజ్ మహల్ టీ యాడ్ మీరే చేయాలనీ పట్టుపట్టడంతో అందుకు హుస్సేన్ విముఖత చూపలేక సరే అని తాజ్ మహల్ టీ దేశ నలుమూలల వ్యాప్తిచెందాలనే సంకల్పంతో యాడ్ కొరకు తన సొంత ఖర్చుతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ కి వచ్చారు. ప్రకటన యొక్క స్క్రిప్ట్  కొరకు గంటల తరబడి సాధన అనంతరం విజయవంతంగా పూర్తి చేశారు. దీన్నిబట్టి దేశంపై జాకిర్ హుసేన్ ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ వాణిజ్య ప్రకటన తర్వాత తాజ్ మహల్ టీ బ్రాండ్ హుస్సేన్ ఇంటి పేరుగా మారింది. అయితే ఈ ప్రకటనలో హుస్సేన్ కప్పు టీ తాగుతూ కనిపిస్తున్న దృశ్యాన్ని మరియు తబలా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ప్రసిద్ధ స్వరకర్త హరీష్ “వాహ్ ఉస్తాద్, వాహ్!” చెబుతుండటం దానికి బదులుగా పెర్కషన్ వాద్యకారుడు, "అర్రే హుజూర్, వాహ్ తాజ్ బోలియే"  ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది. తాజ్ మహల్ టీ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అంతేకాకుండా "వాహ్ తాజ్" అనే పదం చాలా సందర్భాలలో తరచుగా ఉపయోగించే బజ్‌వర్డ్‌గా మారింది. ప్రతి రోజు ఉదయాన్నే తాజ్ మహల్ టీ తాగే ప్రేమికులు మాత్రం ఆయనను ఎలా మరిచిపోగలరు. సంగీత ప్రియుడైన నేను తన మధురమైన ధ్వనులను ఎలా మరిచిపోగలను చెప్పండి. ఆయన ప్రతిభకు ఎవరైనా “వాహ్ ఉస్తాద్, వాహ్ అనాల్సిందే.

నాలుగు గ్రామీ అవార్డు లతో పాటు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, USA నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ మరియు ఫ్రాన్స్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌లో అధికారితో సహా లెక్కలేనన్ని అవార్డులు మరియు గౌరవాలు అందుకున్నారు.
2024 లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్‌ చరిత్ర సృష్టించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో, మన దేశంతోపాటు ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది.

ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం:

మన నిత్యజీవితంలో ఒక చిన్న అవార్డు వస్తే ఉప్పొంగి పోయే వాళ్ళని చూస్తుంటాము. కానీ కొంతమంది ఎన్ని అవార్డులు సంపాదించినా నేనే గొప్ప అనే భావన ప్రస్తావించరు అలాంటి వారిలో జాకిర్ హుస్సేన్ ఒకరు. "ఎన్ని అవార్డులు వచ్చినా, ఎప్పుడూ నేర్చుకోగలగడం ఎంతో ముఖ్యం అని చెపుతుంటారు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన ఒకేఒక మాట "మనల్ని మనం బెస్ట్‌ అని అనుకోకూడదని" తండ్రి చెప్పిన మాటే ఇప్పటివరకు  ఈస్థాయిని చేర్చగలిగిందని పలు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు.

అసలు సిసలు హిందుస్తానీ రాగాల ఉస్తాద్ హుస్సేన్ ఇక లేడన్న విషయం సంగీత ప్రియులందరికీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తూనే ఉంటాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...


ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఒక నాయకుడిగా ఎదగాలంటే అసాధారణమైన విషయం, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే తన ప్రతిభా పాటవాలతో అత్యున్నత పదవులు అధిష్టించి అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) మరణ వార్త యావత్ దేశాన్ని  దిగ్భ్రాంతికి గురి చేసింది. గొప్ప  ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినప్పటికీ, తన విజయాన్ని తన ఘనతగా చెప్పుకోకుండా, పేరు ప్రతిష్టలకు పాకులాడకుండా, అప్పగించిన పనిని నిబద్దతతో చేసి సాదాసీదా జీవితాన్ని గడిపిన నాయకులలో మన్మోహన్ సింగ్ ఒకరు. చేసినవి చెప్పుకోలేదు. హంగు ఆర్భాటాలకు పోలేదు. అవమానాలు, అడ్డంకులు అన్నీ సమానంగా స్వీకరించగలిగిన  గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం:

ఆయన దేశ ఆర్థిక మంత్రి పదవిలో ఉండగా, ఒక సారి ఆయన భార్య, గురుశరణ్ కౌర్ చపాతీ పిండి తీసుకురమ్మని  సింగ్ వ్యక్తిగత సిబ్బందిని పురమాయించడంతో ఆ విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ వెంటనే తన భార్యను పిలిచి సిబ్బంది ఉన్నది ఇంటి అవసరాల కోసం కాదని, కేవలం ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మాత్రమే అని  చెప్పారట. ఇలాంటి నాయకులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? అలంటి వారిని మనం చేతి వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఈ రోజుల్లో మండల మరియు జిల్లా స్థాయి నాయకులు ప్రభుత్వ సిబ్బందిని తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి అయినప్పటికీ వ్యక్తిగత అవసరాలకు వారిని వినియోగించుకోకపోవడం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటివి విషయాలు ఎక్కడా బహిర్గతం కాకపోవడం ఆయన నిరాడంబర జీవితానికి నిదర్శనం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఆయన కూతురు కాలేజీకి వెళ్ళడానికి ప్రభుత్వ బస్సు లోనే వెళ్ళేదన్న విషయం. ఈ రోజుల్లో చిన్న స్థాయి నాయకుడైన తమ పిల్లలకు మంచి ఖరీదైన కార్లు కొనేస్తున్నారు అంతేకాకుండా వారికి ప్రత్యేక సెక్యూరిటీ ని కూడా నియమిస్తున్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారు మాత్రం తన పిల్లలను క్రమశిక్షణ తో పాటు నిజాయితీగా జీవించమని సూచనలు ఇచ్చే గొప్ప మానవతావాది.

మన్మోహన్ సింగ్ ఎక్కువ కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుండి లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు, ఆతర్వాత అతను ట్యాక్సీలు అద్దెకు తీసుకున్నందుకు రచయిత కుష్వంత్ సింగ్ నుంచి తీసుకున్న రూ.2 లక్షలు తాను ఉపయోగించలేదని చెప్పి వెంటనే తిరిగి ఇచ్చాడట. మన్మోహన్ సింగ్ దగ్గర 2 లక్షల రూపాయలు లేకపోవడమేంటని ఆశ్చర్యపోయిన ఖుష్వంత్ సింగ్, ఇదే విషయాన్నీ తాను రాసిన "Absolute Khushwant: The Low-Down on Life, Death and Most Things in-Between" అనే పుస్తకంలో డా. మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధి ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఉన్న ప్రధానులలో మన్మోహన్ సింగ్ గొప్ప ప్రధాని, ఎలాంటి మచ్చలేని నాయకుడు అని ప్రత్యేకంగా రాశారు.

నిబద్ధత కలిగిన నాయకుడు:

ఇప్పటి వరకు ఏ దేశ ప్రధాని కూడా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మనం కనీ, వినీ ఉండకపోవచ్చు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం తన లంచ్ బాక్స్ ఇంటి నుండి తెచ్చుకొని తినేవారట. ఈ విషయాన్నీ అప్పటి లోక్ దళిత్ ఫోరమ్ సెక్రటరీ ఆర్ రవికుమార్ ప్రత్యేకంగా చూశానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా తాను తీసుకున్న నిర్ణయాలు ఆయన నిబద్ధతకు నిదర్శనం. మనను ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయమేమిటంటే, మన్మోహన్ సింగ్ లండన్ లో చదువుకునే రోజుల్లో తన తండ్రి సర్దుబాటు కాక సమయానికి డబ్బులు పంపించని సందర్భాలలో ఆయన తన వద్ద ఉన్న మొత్తం డబ్బులతో ఫేజు చెల్లించి కేవలం  మంచినీళ్ళు తాగేవారని ఆయన కూతురు తెలిపింది.

దారి చూపిన దార్శనికుడు:

దేశం ఆర్థిక సంక్షేమంతో కొట్టుమిట్టాడుతున్న వేళ, అత్యంత సాహసోపేతంగా విప్లవాత్మకంగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, జవసత్వాలుడిగిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దార్శనికుడు మన్మోహన్ సింగ్. భారత్‌తో అమెరికా అణు ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య కొన్ని అడ్డంకులు వచ్చినా మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం దృష్ట్యా అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో డాక్టర్ మన్మోహన్ సింగ్ చర్చల అనంతరం పౌర అణు ఒప్పందంలో సహకరిస్తామని ప్రకటించారు. అణు ఒప్పందం ప్రకటన తర్వాత మన్మోహన్ సింగ్ యొక్క ప్రధాన మంత్రిత్వానికి కీర్తి కిరీటం గా నిలిచింది. రెండు దేశాల మధ్య ఒప్పందం అణు వర్ణవివక్ష అంతం చేయడమే కాకుండా అనుకూలమైన భౌగోళిక రాజకీయ ఆకృతీకరణ సృష్టించింది. విదేశీ వ్యవహారాల్లో, ముఖ్యంగా అమెరికా తో సంబంధాలు మెరుగుపరచడంలో మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధానికి అమెరికాలో గౌరవం లభించింది:
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌ను అధికారిక పర్యటనకు ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు చెప్పబోతుంటే, "మీరు నాకు గురువులాంటి వారు మీలాంటి వారిని కలవడం నా అదృష్టం" అని వినమ్రంగా చెప్పారు ఒబామా. 
అంతేకాదు అణు ఒప్పందం కుదుర్చుకున్న రెండేళ్ల తర్వాత కెనడాలోని టొరంటోలో జరిగిన జీ20 కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ. మన్మోహన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేసారని కొనియాడుతూ, ఆయన రాసిన ‘ఎ ప్రామిస్ ల్యాండ్’ పుస్తకంలో మన్మోహన్ గురించి ప్రస్తావిస్తూ, భారత ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ తన సంస్కరణలతో అనేక మందిని పేదరికం నుంచి బయట పడేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనాపరుడు మరియు నిజాయితీపరుడు అని కొనియాడారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో అత్యున్నత విలువలు పాటిస్తూ వ్యక్తిగత దూషణలకు ఆమడ దూరంలో ఉన్న అతి కొద్ది మంది ప్రముఖులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంజలి ఘటిద్దాం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

29, నవంబర్ 2024, శుక్రవారం

కరెంట్ కార్మికుల కన్నీటి గాథలు

కరెంట్ కార్మికుల కన్నీటి గాథలు:

విశాఖపట్నం రోడ్డు ప్రమాద ఘటన మరిచిపోకముందే మరో ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. గురువారం అంటే 21.11.24 సాయంత్రం వాట్సాప్ చూస్తుండగా ఓ మిత్రుడు పంపిన వీడియో చూసి ఓపెన్ చేశాను. అది ఒళ్లు గగుర్పొడిచే వీడియో. సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న విద్యుత్తు ఉద్యోగి ఒక్కసారిగా షాక్‌కు గురై శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ  ధైర్యంతో ప్రాణాలతో బయటపడిన ఘటన అది. మరో విషయం చెప్పడం మరిచిపోయాను ఆ వీడియో లో ఉన్న వ్యక్తి మరెవరోకాదు నా స్నేహితుడే. శరీరం కాలిపోవడం వల్ల నా స్నేహితుడే అని తెలుసుకోవడానికి కూడా చాల సమయమే పట్టింది. తెలిసిన మరోక్షణమే మిత్రుడొకరు కాల్ చేసి తెలియజేసిన వార్త పని ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని. కరెంట్ పని అంటేనే ప్రాణాలతో చెలగాటం. అందులో ఉద్యోగి కి పని ఒత్తిడి అంటే మరణంతో కుస్తీ చేయాల్సిందే.

కరెంట్ కార్మికుల కన్నీటి గాధ. వెలుగులు అందించే అన్నలకు బతుకంతా బాధ. ప్రపంచానికి వెలుగునందిస్తారు కానీ వారి జీవితాలలో వెలుగులు నింపుకోలేని నిస్వార్ధ కార్మికులు "కరెంటు కార్మికులు".

ఒక్క క్షణం కరెంటు లేకపోతేనే అల్లాడిపోయే మనం. మన సుఖం కోసం కరెంటు కార్మికులు పడే కష్టం. ఎండనక వాననకా, పగలనక రాత్రనక ఎల్లవేళలా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి వెలుగునందించడం కోసం కరెంటు ఉద్యోగుల కష్టాల గురుంచి ప్రతిఒక్కరు తెలుసుకోవడం తప్పని సరి.

అసలు 21వ తేదీన ఏం జరిగిందంటే. ప్రమాద బాధితుడి పేరు కృష్ణ. నర్సంపేట 132 కేవీ సబ్ స్టేషన్‌లో గ్రేడ్ 1 ఉద్యోగి. అంటే సబ్ స్టేషన్‌లో విద్యుత్ సంబంధిత పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారుల పని ఒత్తిడి కారణంగా కృష్ణ ఆ రోజు పెయింటింగ్ పని చేశాడు. పెయింటింగ్‌ పని చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అతని శరీరం (చర్మం) 70 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. చేసేపని ఒకటైతే చేయించేపని మరొకటి అన్నట్లు ఆయన విద్యుత్ ఉద్యోగి అయితే అతనితో పెయింటింగ్ పని చేయించడమేంటి? పెయింటింగ్‌లో ప్రావీణ్యం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యుత్ కార్మికులు చెప్పడం నిజం కాదా? అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రమాదానికి కారణం ఎవరు? బాధ్యులెవరు? అనే విషయం పైనే మనం మాట్లాడుకోవాలి.  అతనికి సంబంధంలేని పని చేయించడానికి కారణం ఏంటి? పెయింటింగ్ పని అతనికి సంబంధంలేనప్పుడు అతనిపై పై అధికారులు ఒత్తిడి చేయాల్సిన అవసరమేంటి?.

కరెంటు ఉద్యోగుల కష్టాలు:

వానాకాలం వచ్చిందంటే కరెంటు ఉద్యోగుల గుండెల్లో గుబులు, ఎందుకు అంటారా? అధికారులు ఎప్పుడు విధుల్లోకి పిలుస్తారో తెలియని పరిస్థితి. అయినా ఎలాంటి ఆటంకం లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. వర్షాకాలంలో 12 గంటలు, పదమూడు గంటలకు పైగా శ్రమించినా పనులు పూర్తి కానీ పరిస్థితులెన్నో విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఏఈ, ఏడీలపై భారం పడటమేకాకుండా. సిబ్బంది కొరతతో ఉన్న ఉద్యోగులపై పెనుభారం పడుతోంది. ఇంకో విషయం ఏమిటంటే విద్యుత్ ఉద్యోగుల్లో రెండురకాల రూల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూల్, ఆర్టిజెన్స్ ఉద్యోగులకు ఒక రూల్ (పర్మినెంట్ కానీ ఉద్యోగులు). పని విషయానికివస్తే అంత ఆర్టిజెన్స్ ఉద్యోగులపైనే భారం. పైనపటారం  లోన లొటారం అన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎక్కువ పని తక్కువ. అదే ఆర్టిజెన్స్ ఉద్యోగులకు జీతం తక్కువ పనిమాత్రం చాల ఎక్కువ. జీతంలోనే కాదండోయి, సెలవులలో కూడా రెండు రూల్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు పెడితే జీతం కటింగ్ ఉండదు. అదే ఆర్టిజెన్స్ వారికీ మాత్రం జీతం కట్ చేస్తారు. ఇదేమి రూల్ అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా అని సందేహం ప్రతిఒక్కరికి రావొచ్చు కానీ ఇదంతా ప్రభుత్వం చేయాల్సిన పని. అందరికి సమాన అవకాశాలు, అందరికి ఒకటే రూల్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ వేర్వేరు రూల్స్ వల్ల ఆర్టిజెన్స్ వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్న కార్మికుల గురుంచి పట్టించుకునే నాధుడు లేదు. ఒక్కో సబ్ స్టేషన్ లో నలుగురు ఆర్టిజెన్స్ ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిఉన్నప్పటికీ ఇద్దరు ముగ్గురితో పని చేయించడంవల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురివుతున్నారు.  రూల్స్ విషయమే కాకుండా ఐదేండ్లు దాటినా పదేండ్లు దాటినా వారికీ ప్రమోషన్లు ఉండవనేది జగమెరిగిన సత్యం. విద్యుత్ కార్మికులకు పనిభారం పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాకు ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. రాత్రనక పగలనక ఎంతో కష్టం చేస్తున్నాగాని సరైన జీతం రాక కుటుంబాన్ని పోషించలేక సతమతపడుతున్నారు. అంతేకాదు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబానికి దిక్కు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఒకవైపు ఉద్యోగం పర్మినెంట్ గాక మరోవైపు పని భారంతో తట్టుకోలేక కరెంటు కార్మికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

ఒకేరకమైన పని చేసేవారికి రెండు రకాల సర్వీస్ రూల్స్ అవసరమా? అనే విషయం పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి సేవలందిస్తున్న ఆర్టిజెన్స్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



 



16, నవంబర్ 2024, శనివారం

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్"

అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రపంచ బాక్సింగ్ క్రీడా రంగానికి రారాజు. సింహం వేటాటడం మొదలెడితే ఎంత పెద్ద జంతువైనా వణికిపోవాల్సిందన్నట్లుగా, ఆయన రింగ్ లోకి అడుగు పెడితే  ఎంతటివారైనా వణికిపోవాల్సిందే. ఆయన కొట్టే పంచులకు ప్రత్యర్థుల గుండెలు అదరాల్సిందే, బాక్సింగ్ పంచ్ లకు పాఠం నేర్పిన గురువు ఆయన. ప్రపంచ ఛాంపియన్ గా తిరుగులేని బాక్సర్ గా చరిత్ర సృష్టించి ఎంతో మంది ఆటగాళ్లను మట్టికరిపించిన యోధుడు. బాక్సింగ్ చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తిగా పేరుగాంచిన వరల్డ్ హెవీ వెయిట్ బాక్సర్ " మైఖేల్ గెరార్డ్ టైసన్ (మైక్ టైసన్)".

మైక్ టైసన్ ఆటంటే అభిమానులకు పెద్ద వేడుక. టైసన్ బరిలోకి దిగగానే స్టేడియం ఈలలు మరియు ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. టైసన్‌ని చూస్తే ప్రత్యర్థుల్లో భయం ఏమోగానీ అభిమానుల చేసే హర్షధ్వానాలు వింటుంటే ప్రత్యర్థుల గుండెల్లో ఒక రకమైన భయం పుడుతుంది. టైసన్ పంచ్ పులి పంజాలా శక్తివంతమైనది. ఓ పంచ్ వేస్తే ప్రత్యర్థుల ఆశలు గల్లంతైనట్లే అలా మొదటి రౌండ్ లోనే వెనుదిరిగిన వారెందరో ఉన్నారు. అంతేకాదు ఆయన వేసిన పంచ్‌ల వల్ల ఎముకలు విరిగి రక్తం కారడంతో కొందరు కోమాలోకి వెళ్ళిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టైసన్‌తో ఆట అంటే మృత్యువును ఎదుర్కోవడం లాంటిది.

1985లో అరంగేట్రం చేసిన టైసన్ 2005 వరకు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత 58 ఏళ్ల వయసులో నవంబర్ 15, 2024న 59వ సారి పోటీ చేయనున్నాడని తెలిసి అభిమానులు అతని విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అతను ప్రత్యర్థి 27 ఏళ్ల జేక్ పాల్‌తో 7 రౌండ్ల పాటు వీరోచితంగా పోరాడాడు మరియు 8వ రౌండ్‌లో, అతని శరీరం సహకరించక ఓటమిని చవిచూశాడు. అతని ఓటమి టైసన్ కంటే అభిమానులకే ఎక్కువ భాద కలిగించింది. 39 సంవత్సరాల పాటు ప్రపంచ ఛాంపియన్ గా ఎన్నో రికార్డులు సృష్టించి బాక్సింగ్ క్రీడారంగంలో ధీరుడిగా నిలిచిన టైసన్ ఓడిపోవడమేంటి ఇది కలా లేదా నిజమా అని అభిమానులకు నమ్మశక్యం కానీ  విషయం. కానీ ఇది నమ్మలేని నిజం.

గెలిచిన ప్రతివాడికి ఏదో రోజు ఓటమి తప్పదన్నట్లు 59 సార్లు పోటీలో పాల్గొని 50 సార్లు  ఎదురులేని విజయాలు సాధించి బాక్సింగ్ రారాజుగా చరిత్ర సృష్టించాడు కానీ 59 వ పోటీలో ఓటమిపాలై అభిమానులకు గెలుపు ఎప్పుడు ఓటమి కొరకే అనే పాఠాన్ని నేర్పాడు.

ప్రపంచంలోని బాక్సింగ్ క్రీడాకారుల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన టైసన్ ఓటమి అనంతరం అభిమానులతో ఇలా అన్నారు "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒకరోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతివాడికి ఏదో ఒకరోజు గెలుపు తప్పదు, నేను ఓటమితో కుంగిపోను గెలుపుతో పొంగిపోను అని అభిమానులకు ఒక గొప్ప సందేశం అందించారు.

ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ, తుమ్ముకు తమ్ముడు లేడన్నట్లు గెలిచిన ప్రతివాడిని భుజాన ఎత్తుకొని ఉరేగించేవారున్నారుగాని, ఓడిపోయినవారి భాదను అర్థం చేసుకొని ఓదార్చే వారు ఉండరు. టైసన్ గురించి తెలియని పిల్లకాయలు కూడా టైసన్ ఓడిపోయాడని తెగవాగేస్తున్నారు కానీ మనం గమనించాల్సింది ఒకటి. టైసన్ వయసుకు ప్రత్యర్థి వయసుకు సగం తేడా 58 సంవత్సరాల వయసులో కూడా 27 వయసులో ఉన్న బాక్సర్ తో పోటీకి సిద్దమయ్యాడంటే, ఒకరకంగా చెప్పాలంటే టైసన్ గెలిచినట్లు.  

చిన్నతనంలో ఎన్నో కష్ట నష్టాలను చవిచూసిన టైసన్ 13 ఏళ్ల వయసులో 38 సార్లు బాల నేరస్థుడిగా అరెస్టయ్యాడనే విషయం ఎంతమందికి తెలుసు? మైక్ టైసన్ నేరస్థుడి నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడో తెలుసుకోవాలంటే ఈ కథనం తప్పక చదవాల్సిందే.

1966లో న్యూయార్క్ నగరంలో జన్మించిన మైక్ టైసన్ బాల్యం కష్టాలు, కన్నీళ్లతో సాగింది. పేదరికం మరియు వ్యక్తిగత కారణాలతో ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరిగేది. ఎప్పుడు గొడవలు జరిగినా టైసన్‌కు కోపం వచ్చేది. ఓ రోజు పెద్ద గొడవ రావడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడం తో కుటుంబ భారం అంతా తల్లిపైనే పడింది. కుటుంబ పోషణ కోసం తల్లి ఆర్థికంగా, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. టైసన్ చూడటానికి అసహ్యంగా ఉండటంవల్ల అతని స్నేహితులందరూ అతన్ని ఏడిపించేవారు. అందువల్ల అతనికి అంతులేని కోపం వస్తుంటుంది. స్కూల్ లో జరిగిన విషయాలేమి తల్లితో చెప్పకుండా ఎదురు దాడికి దిగి స్నేహితులను రక్తం వచ్చేలా కొట్టాడు అంతే తప్ప ఇతరులకు చెప్పి బాధ పడేవాడు కాదు. తండ్రి భయం లేనందున తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎప్పుడు  స్నేహితులతో గొడవ పడేవాడు. అతనికి ఎప్పటినుంచో పావురాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు, టైసన్ తన కంటే పెద్ద వ్యక్తి పావురాన్ని హింసించడాన్ని చూడకుండా ఉండలేకపోయాడు. చివరకు అతనితో గొడవపడి చితకబాదారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులో చిన్న చిన్న నేరాలకు పాల్పడి 38 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒకరోజు మాజీ బాక్సర్ బాబీ స్టీవర్ట్ అతని కోపాన్ని మరియు అతను విసిరిన పంచ్‌లను చూసినప్పుడు అతని బాక్సింగ్ సామర్థ్యాన్ని గమనించాడు. చిన్నచిన్న దొంగతనాలు చేసే టైసన్‌ని గొప్ప క్రీడాకారుడిని చేయాలనే ఆలోచన వచ్చింది. స్టీవర్ట్ టైసన్‌ను అద్భుతమైన బాక్సర్‌గా భావించాడు. అతనికి కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చి బాక్సింగ్ ట్రైనర్ కస్ డి'అమాటోతో పరిచయం చేశారు. 16 సంవత్సరాల వయస్సులో అతని తల్లి మరణించిన తరువాత, అతను అమాటో వద్ద ఉంటూ బాక్సింగ్ శిక్షణలో మెలకువలను నేర్చుకున్నాడు. టైసన్ తన బాక్సింగ్ అరంగేట్రం 1985లో న్యూయార్క్‌లోని అల్బానీలో చేశాడు అప్పుడాయన వయసు 18 సంవత్సరాలు. తొలి ఆటలోనే TKO ద్వారా హెక్టర్ మెర్సిడెస్‌ను మొదటి రౌండ్లో ఓడించాడు. KO లేదా TKO ద్వారా నిర్వహించిన 28 పోటీలలో 26 గెలవడమే గాక అందులో 16 పోటీలలో మొదటి రౌండ్లోనే ఓడించి ప్రేక్షకులను దిగ్భ్రాంతుల్ని చేసి, అభిమానులను ఆనందోత్సాహాలతో ఉర్రుతలూగించారు. అతి తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

గొరిల్లా తో పోటీకి సిద్ధపడిన టైసన్:

1980 లో న్యూయార్క్ లోని ఓ జూ పార్క్ సందర్శించినప్పుడు జూలో చాలా గొరిల్లాలు ఉండగా అందులో ఒక గొరిల్లా ఇతర గొరిల్లాలను కొడుతుండటం చూశారు. జంతు ప్రేమికుడైన టైసన్ ఎలాగైనా ఆ గొరిల్లా అంతు చూడాలని పట్టుబట్టి అక్కడ ఉన్న సిబ్బందితో ఎంత డబ్బైనా ఇస్తాను కానీ నేను ఆ గొరిల్లాతో పోరాడాలని చెప్పగా అతనికి టైసన్ గురించి తెలిసి ఏమాత్రం ఒప్పుకోలేదట. చావుకు కూడా భయపడని వ్యక్తిత్వం ఆయనది. చిన్నతనంలో పావురం కోసం పోరాడి చివరకు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌గా ఎదగడం గొప్ప విషయం కదా!

ప్రమాదకరమైన జంతువుల పట్ల మైక్ టైసన్‌కు ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఎవరైనా పులిని చూడగానే వణికిపోతారు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ టైసన్ మాత్రం పెంపుడు కుక్కలు పెంచుతున్నట్లు పులులను పెంచుకుంటాడు. వాటితో సరదాగా ఆడుకుంటాడు కూడా. ఒకసారి మూడు పులులను కొనుగోలు చేశాడంట, వాటికోసం ఏకంగా ఎక్స్ఛేంజ్లో దాదాపు $71,000 ఖర్చు చేశాడంట అంతేకాకుండా ఆయన బెడ్ రూంలో    పులులతో నిద్రించిన సందర్భాలు ఉన్నాయంట దీన్నిబట్టి టైసన్ ఎంతటివాడో తెలుస్తుంది కదూ!. కొన్నాళ్ళకు పులులను పెంపుడు జంతువులుగా చూడకూడదని గ్రహించి, 14 సంవత్సరాల తర్వాత వాటిని అభయారణ్యంలో వదిలేశాడు. కానీ పులులంటే ఆయనకు అమితమైన ప్రేమేనంట.

ఆయన సాధించిన విజయాలు:

WBC, WBA మరియు IBF ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన బాక్సర్‌గా టైసన్ చరిత్ర సృష్టించారు. అతను WBA, WBC మరియు IBF టైటిళ్లను ఏకకాలంలో సాధించిన మొదటి హెవీ వెయిట్ బాక్సర్.

టైసన్ స్ఫూర్తి ఎవరంటే:

టైసన్ యొక్క ప్రేరణ మహమ్మద్ అలీ అని చాలా మంది అనుకుంటారు, అయితే టైసన్

ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్న పేర్లను విని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. అలీ నాకు బాక్సింగ్‌పై ఆసక్తి కలిగించాడు కానీ నాకు స్ఫూర్తిని కలిగించలేదని టైసన్ చెప్పాడు. రాబర్టో డ్యూరాన్ మరియు షుగర్ రే లియోనార్డ్ నన్ను గొప్ప బాక్సర్‌గా మార్చడానికి ప్రేరేపించారని అన్నారు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

10, నవంబర్ 2024, ఆదివారం

సరిగస్తు గమ్మత్తు

మాఊరి పీర్ల పండుగ (సరిగస్తు గమ్మత్తు):

చాలా సంవత్సరాల తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు హైద్రాబాదులోని ECIL బస్టాండ్లో కలిశాడు. కాసేపు ఇద్దరం బస్టాండ్లో కూర్చొని ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఉండగా మిత్రుడు చిన్నప్పుడు ఊళ్ళో జరిగిన పీర్ల పండుగ గుర్తుచేస్తూ కడుపుబ్బా నవ్వించిండు. గుమ్మడవెల్లి వారందరికీ ఈ సంఘటన తెలిసే ఉంటుంది కానీ మరోసారి తెలుసుకొని నవ్వడంలో మాత్రం  తప్పులేదు.

ఆరోజు శనివారం పొద్దుగూకాల అందరూ ఇంటిముందు అరుగులమీద కూసోని   ముచ్చటపెడుతుండ్రు. కచ్చిరు దగ్గర సరిగస్తు ఉంది అందరూ రారండయ్యో అని ఊరంతా డప్పుసాటింపు జేసిండ్రు. సరిగస్తుందని విన్నాక మాలాంటి పోరగాళ్లకు ఎక్కడాలేని ఆనందం, ఉత్సాహం ఉప్పొంగింది. ఎక్కడాలేనివిధంగా మా ఊళ్ళో సరిగస్తు ఓ గమ్మత్తుగా ఉంటది, తీరొక్క తీరు వేషాలు వేసి పీర్లకొట్టం గుండం దగ్గర డప్పుదరువులకు కాళ్లకు గజ్జెలుకట్టుకొని   అందరూ ఎగిరెగిరి నృత్యం చేసేటోళ్లం. సరిగస్తు ఉందంటే ఆరోజు ఊళ్ళో అందరూ నడిరేత్రివరకు నిద్రపోకుండా సరిగస్తు ఆట చూసేందుకు పీర్లకొట్టంకాడనే కూసునేది. సరిగస్తుందని డప్పుసాటింపు విన్నాక ఊళ్ళో కొందరు ఇయ్యాల ఎవేశం వేయాలని గుసగుసలాడుకుండ్రు మరికొందరైతే గుండంలో మంటకాలాడానికి కట్టెలు మొద్దులు, తడకలు యెడ ఎదుర్కరావాలన్న ఆలోచనపడ్డారు. కొద్దిసేపైనకా గుండం దగ్గర ఒక్కొకరుగా  అందరూ పోగయిండ్రు, డప్పుదరువులతో సరిగస్తు మొదలైంది. ఒక్కొక్కరు గుర్తుపట్టని వేషాలు యేసుకొని గుండంసుట్టు ఎగురుతుంటే అందరూ గీయన ఎవరో ఉండే తోట బక్కయ్య కదూ? అని కొందరు కాదు కాదు ఆయన ఎందుకైయే తోట బక్కయ్య కాదు. హే ఎవరో అని మరికొందరు అట్లా గుర్తుపట్టరాకుండా వేషాలేసుకొని వచ్చిండ్రు. గుండం చుట్టూ గమ్మత్తయిన స్టెపులేసుకుంటూ నృత్యం చేస్తుంటే కాళ్ళాడనోళ్ళకుకూడా లేసి ఓ స్టెప్పేయాలనిపించేటట్లుండేది సరిగస్తు సంబురం. వేషం వేసుకొని గుర్తుపట్టనొల్లను  తెల్లారిగట్ల వాళ్లమొహానికి రంగులు పూసుకున్నట్లు మొహమ్మీద అక్కడక్కడా కలర్ ఉండేది గప్పుడు గాని తెలిశేది రాత్రి ఏదో వేషం వేశాడని. ఆరోజు తోట బక్కయ్య ఒంటినిండా గడ్డికప్పుకొని వేషం వేయడంవల్ల ఆయన్ని ఎవరు గుర్తుపట్టలేదు ఒక్కొకరిదగ్గరకు వచ్చి సరదాగా స్టెప్పులేస్తూ అందరిని ఆటపట్టించేది. ఆయన వేసే స్టెప్పులకు నవ్వు ఆగకపొయ్యేది కొందరికి. దూదేకుల లతీఫ్ వింతైన వేషంతో నోట్లో నూకలు నములుకుంటూ గుండం సుట్ఠు నృత్యం చేస్తుంటే ఆ గమ్మతే వేరు. పీర్ల పండుగ వచ్చిందంటే లతీఫ్ తాత తీరొక్కతీరు వేషాలేసేది. లతీఫ్ తాత లేకపోతే పీర్ల పండుగ లేదు అన్నట్లుగా ఉండేది. పీర్ల పండుగ పెద్దమనిషి దూదేకుల లతీఫ్. ఇంకో గమ్మతైనా వేషం ఏంటంటే చినిగిపోయిన గుడ్డపేలుకలతో నడుంచుట్టూ కట్టుకొని పాత చీపురుకట్ట చేత పట్టుకొని గుండం సుట్ఠు రెండురౌండ్లు తిరిగి  అక్కడ కనపడ్డవాళ్ళని మెడలోంచి వీపున చీపురుకట్టతో రెండు అంటించిండు కుమ్మరి రామయ్య. ఎక్కడ దెబ్బలుపడుతాయో అని కొంతమంది ఉరికిండ్రు కొంతమంది పాత చీపురుకట్టతో కొట్టించుకుంటే దయ్యాలు, బూతులు దరిచేరవని నమ్మి మరి మరి కోటించుకుండ్రు.  కుమ్మరి రామయ్య వేషం ఎప్పటికి మరచిపోలేము. అట్లా చాలామంది వేషాలేసుకొని ఎగురుతుంటే అనుకోకుండా ఒక గమ్మత్తయిన ముసలాయన వేషంతో వచ్చి గుండం కాడ సుట్టా కలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచిండు. అందరూ ఆశ్చర్యపోయి గుండంకాడ సుట్ట కలుస్తుండు అంతదైర్యం ఎవ్వడికుందని ఎవరీ ముసలాయనని అందరూ గుసగుస కానీ అక్కడ ఎవ్వరు గుర్హ్తుపట్టలేకుండా వేషం వేసుకుండు గంభీరమైన నల్లని మీసాలతో నడుమువంగినట్లు చేతికర్ర పట్టుకొని గుండం చుట్టూ తిరిగి ఇంటికి పోయిండు. అక్కడ ఎవరో వేషం వేసుకుంటుంటే చూసినాయన హే ఆయన కోట సోమయ్య అని చెప్పిండు అప్పుడుగాని గుర్తుకురాలే ఆయన కోట సోమయ్య (మా నాన్న) అని. అలా ఎంతోమంది పోతరాజు వెంకన్న, ఇంకా చాలామంది వింతైన వేషాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ సరిగస్తు చేసిండ్రు. ఆరోజు గుండంలో మంట పెట్టడానికి మొద్దులు, తుంటలూ ఇంటిముందుండే తడికలు ఎదురుకొచ్చి అన్ని గుండంలో పడేసిండ్రు. సరిగస్తు సంబరంలో  అక్కడఉన్నోళ్లకు ఇంటికాడ తడికలు మాయమవుతాయేమో అనే భయము ఉండేది. సరిగస్తు అయినాక ఇంటికిపోయినంక తెలిసేది ఇంటిముందు తడిక మాయమైందని. ఆరోజు చాలా తడికలు ఊళ్ళో ఎదుర్కొచ్చి గుండంలో పడేసిండ్రు సరిగస్తు సంబరమున జనాలుంటే తడికలు, మొద్దులు ఊళ్ళో ఎదుర్కొచ్చే పనిలోకొందరున్నారు. తెల్లారి ఆదివారం కాబట్టి ఆరోజు చాలా పెద్దగా జరిగింది అందరూ మస్తు ఎంజాయ్ చేసిండ్రు. సరిగస్తు అయిపోయినాక అందరూ ఎవరి ఇండ్లల్లకు వాళ్ళు పోయిండ్రు.

తెల్లారి ఆదివారం పొద్దుగాల బడికాడ గొల్లోల్ల ముసలమ్మా నోటికొచ్చినట్టు ఒకటే తిడుతుంది తడికలెత్తుకుపోయినోడి కడుపుడుకా, వాడి బొందమీద మన్నుబొయ్యా, వానిల్లు నాశనంగాను అని ఒకటే తిట్టుడు. సరిగస్తు సంబురాన తడికలు ఎత్తుకబోయినోళ్లు గొల్లోల్ల ముసలమ్మా తిట్లు విని ఒకనవ్వుకునుడు కాదు ఓవైపు పాపం అనుడు ఒకవైపు నవ్వుడు. ఎంతైనా సరిగస్తు గమత్తే వేరబ్బా.  

పీర్ల పండుగ అయిపోయిన మరునాడు అతిభయంకరమైన బేతాళుడి వేషం వేసేది ఇతరాజు బుచ్చయ్య.  నాకుతెలిసి బుచ్చయ్య వేషం చూసి బయపడనివారుండరనేది ముమ్మాటికీ నిజం. అసలైన బేతాళుడు కూడా బుచ్చయ్య వేషం చూసి బయపడుతాడేమో బహుశా. నల్లని శరీరం పొట్టిగా భారీ బొర్ర తో నోట్లో కత్తిపొడుసుకొని ఒంటినిండా రక్తంతో వేపమండలు చేతబట్టుకొని, వెనకాల పగ్గాలతో కట్టి ముగ్గురునాలుగురు అదిమి పట్టుకునేది అయినా ఆయన  ఉరికేటప్పుడు వెంట ఉన్నోళ్లు ఆయన్ని ఆపలేక శానా ఇబ్బంది పడేటోళ్లు. బదార్ల నిలబడ్డోడిని వేపమండలతో ఉరికిచ్చుకుంటూ కొట్టేది. బుచ్చయ్య భేతాళుడి వేషం వస్తున్నదంటే చిన్న పోరగాళ్ళు తలుపులసంధులనుండి చూసేది తప్ప బయటకు రాకపోతుండే. ఆయన్ని చూస్తే చిన్నపిల్లలు అదురుకే బెదురుతరు. బేతాళుడి వేషం వేయడంలో ఇతరాజు బుచ్చయ్య ను మించినోడు లేడు ఇక రాడు కూడా వేషానికి తగ్గట్టుగా నటన, నడక, ఆ నృత్యం అందరికి రాదనే చెప్పాలి. 

పీర్ల పండుగ ప్రత్యేకత ఏంటో ఏమి తెలియదుగాని సరిగస్తు ఆట, బేతాళుడి వేషం వేస్తారని మస్తు గమ్మత్తుగా ఉంటుందనిమాత్రమే తెలుసు.. సరిగస్తు ఆట నాడు ఇంటిముందున్న తడికలు భద్రంగా దాసుకుంటారనేది తెలుసు.

ఈరోజుల్లో చేసే పీర్ల పండుగ అసలైన పీర్ల పండుగ అన్నట్లుగా లేదు. ఆరోజుల్లో ఉన్న సరిగస్తు గమ్మత్తు వేరు.. 


కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

29, అక్టోబర్ 2024, మంగళవారం

చెత్తశుద్ధి

 చెత్తశుద్ధి:

ఈరోజు పేపర్ తెరవగానే ఒక ఫోటో నా దృష్టిని నిలిపేసింది. ఆదివారం రోజు విజయనగరంలో జరిగిన రోడ్ ప్రమాద సంఘటన నన్నెందుకో తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్న కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు నన్నెందుకో తీవ్రంగా కలిచివేసింది.  ఈ వార్త పేపర్లో చాలామంది చదివే ఉండవచ్చు కానీ మరోసారి చదివిన తప్పులేదు. విజయనగరం రైల్వే ప్రాంతానికి చెందిన కే గంగాధరరావు తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళ్తూ, మార్గమధ్యలో పని ఉందని దిగాడు. ఒక రెండడుగులు ముందుకు వెళ్లాడోలేదో ఇంతలో అటువైపు నుంచి వస్తున్నా ట్రాక్టర్ ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్ మీద పడిపోయాడు గంగాధర్ ను చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగున వచ్చి లేపేందుకు ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. చుట్టుపక్కన చాలామంది ఉండడంతో  అయ్యా బాబు రండయ్యా హాస్పిటల్ కి తీసుకెళదాము అంటూ దారిన పోయేవారందరిని  వేడుకున్నారు, చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవ్వరు కనికరించలేదు. తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతూ రోడ్ పై పడి ఉన్న ఎవరు కనికరించలేదు. 5 నిముషాలలో చేరుకోగలిగే దూరంలోనే హాస్పిటల్ ఉన్నప్పటికీ చుట్టుపక్కల వారు మౌనంగా చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు సహాయం చేయలేదు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ లో ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకుంటున్నారే తప్ప సహాయం చేయాలనే ఆలోచన చేయలేదు. ఇంతలో ఎవరో 108  కాల్ చేయగా అంబులెన్సు వచ్చేసరికి గంగాధర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన నన్నెందుకో తీవ్రంగా కలిచివేసింది.

చరవాణి మోజులో చలించని వారు కొందరైతే, ఎవరికి ఏమైతే మనకెందుకులే అని పట్టించుకొనువారు కొందరు. కన్న కొడుకు కళ్ళముందే కొట్టుమిట్టాడుతున్న హృదయవిదారక ఘటన చూసి చూడనట్లు వెళ్తున్న జనాలకు మన చాపకిందికి నీరు వస్తేగాని మనం చెమ్మను గుర్తు పట్టం అన్నట్లుంది. ఈ మధ్య కాలంలో పక్కవాడి ప్రాణాలు పోతున్న మొబైల్ మోజులో పట్టించుకునేవారే లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. మొబైల్ ఫోన్స్ రాకతో ఎవడి పిచ్చివాడికే ఆనందం అన్నట్లు వ్యవరిస్తుండటం అత్యంత బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటన మనకు కూడా జరిగితే ఆ బాధ ఎలాఉంటుందో అర్ధం చేసుకున్నవారికే మాత్రమే అర్ధమవుతుంది అంతేతప్ప అర్ధంచేసుకోనివారికి ఇది కేవలం వార్తే.. ఈ దేశంమీద పరాయిదేశం దండయాత్ర చేసిన అర్ధంచేసుకోనివారికి అది కేవలం వార్త గానే అనిపిస్తుంది..

10 పక్కన సున్నా లేకపోతే 10 కి అర్ధమే లేదు. అది కేవలం ఒకటిగానే మిగిలిపోతుంది.

అలాగే 100 పక్కన రెండు సున్నాలు లేకపోతే కూడా ఒకటిగానే మిగిలిపోతుంది.

ఇలా వెయ్యి, పదివేయ్యిలు, లక్షలు, కోట్ల రూపాయలకు కూడా సున్నా లేకపోతే అర్ధం లేదు.

మనకు వెయ్యికోట్ల రూపాయలున్న మనం పక్కోడికి పనికిరానప్పుడు మనం ఎప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఆ ఒంటరితనానికి అర్ధం లేదు.. ఆ బతుకు వ్యర్ధమే..

ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి, వారి ప్రాణాలను కాపాడండి..


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475   

22, అక్టోబర్ 2024, మంగళవారం

తరగతి మరిచిన లింగన్న

తరగతి మరిచిన లింగన్న:

నా క్లాసుమెంట్ లింగన్న అంటే నాకే కాదు క్లాసుమెంట్స్ అందరికి చాలా ఇష్టం. లింగన్న నాతోపాటు ఐదోతరగతి నుండి పదవతరగతి వరకు గుమ్మడవెల్లి స్కూల్ లో చదివిండు. నేను లింగన్న కలిసి లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాళ్లం. లింగన్న పక్కన కూర్చుంటే నాకు సార్ చెప్పే పాఠం కంటే లింగన్న చేసే పనులమీదే ఎక్కువ ద్రుష్టి ఉండేది. లింగన్న చూడటానికి బందబస్తుగ ఉంటాడు కానీ మనుసు సున్నితం. లింగన్న పెదాలపై హాస్యం ఎప్పుడు నాట్యమాడుతూనే ఉంటది. అందుకే లింగన్న అంటే అందరికి ఇష్టం. లింగన్న చేసే పనులు అందరిని నవ్వించడమేగాక జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ఐదోతరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు టీచర్ పాఠం చెబుతూ అనుకోకుండా వెనుక బెంచ్ లో కూర్చున్న విజయ్ ని లేచినిలబడమన్నాడు. విజయ్ వెంటనే సార్ ఏదైనా ప్రశ్న అడుగుతాడేమో అని నిలబడ్డాడు. సార్ దగ్గరకు వచ్చి ఒరేయ్ జుట్టు ఏంది ఆ  అవతారమేంది రా.. కటింగ్ చేయించుకోక ఎన్ని నెలలు అయిందిరా, ఏందిరా నీ అవతారం, ఇది జుట్టా లేక వరిగడ్డినా, గుడ్డెలుగులాగా పెంచినవ్. నువ్వు ఏమి చేస్తావో నాకు తెల్వదు గానీ ఈరోజు మధ్యాహ్నం అన్నం బెల్లుకు ఇంటికి పోయి కటింగ్ చేయించుకొని రా లేకపోతే నీ వీపు విమానమోతమోగుద్ది అని సార్ విజయ్ కి చెప్పిండు. సరే సార్ అన్నాడు విజయ్. కటింగ్ చేయించుకోవడం అసాధ్యమే అని సార్ కు తెలుసు విజయ్ కూడా తెలుసు మధ్యాహ్నం అర్ధగంట టైం ఉంటది అన్నం తినడానికి సరిపోదు ఆ టైం. అంత తక్కువ టైం లో చేయించుకోవడం కష్టమే కానీ విజయ్ సరే అన్నాడు. ఇక విజయ్ కి ఏమి చేయాలో అర్ధం గాక నాయి బ్రాహ్మణుడు అయినా లింగన్నను బతిలాడిండు కటింగ్ చేయమని, లింగన్న వయసు అప్పటికి 10 సంవత్సరాలే అయినా తండ్రి విద్యను అలవోకగా నేర్చుకోగలిగిన నేర్పరి. ఆరోజు విజయ్ అన్నం తిన్నాడోలేదో గాని లింగన్న కటింగ్ కోసం ఎదురుచూపు రానే వచ్చే లింగన్న విజయ్ మెడ వంచి కత్తెరతో నెత్తి అంత కట్ చేసిండు. పనిలేని మంగలాయన పిలిచి తలకొరిగినట్లు అడ్డదిడ్డంగా కటింగ్ చేసిండు. ఇక కటింగ్ అయిపొయింది ఇటు స్కూల్ టైం అయింది. స్త్రానం చేయకుండా పోతే సార్ ఏమంటాడో అని విజయ్ భయంతో అక్కడ పక్కనే ఉన్న బకెట్ లో తలపెట్టి శుభ్రం చేసుకుండు. ఈ విషయం వారిద్దరికే తెలుసు. విజయ్ క్లాస్ కు వస్తుండగానే అందరికి ఆశ్చర్యం కలిగింది ఇంత తక్కువ టైం లో కటింగ్ చేయించుకున్నాడని మాకే కాదు సార్ కూడా ఆశ్చర్యం కలిగింది. అడపాదడపా చేసిన కటింగ్ చూసి సార్ నవ్వుతు కటింగ్ ఎవ్వడు చేసిండు రా కట్టింగ్ నీకు అన్నాడు. ఏమి చెప్పాలో తెల్వక మన లింగన్న నే చేసిండు సార్ అన్నాడు. ఆ రోజు లింగన్న పనిమంతుడు అని అందరికి అర్ధం అయింది. అప్పటినుండి ఎవ్వరు జుట్టు పెంచిన లింగన్న కాడికిపోయి చేయించుకోరా అనేది సార్. ఆరోజు జరిగిన సంఘటన నన్నే కాదు మా క్లాసుమెంట్స్ అందరిని నవ్వేలా చేసింది. 

అంతేకాకుండా ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఓరోజు పరీక్షలు జరుగుతున్నాయి లింగన్న బాగా ప్రిపేర్ అయిండు పరీక్షకు ఈ సారి ఎలైన మంచి మార్కులు రావాలని. పరీక్షా టైం అయింది అందరం కూర్చున్నాం ఎవరి సీట్లో వాళ్ళం. సార్ అందరికి పేపర్ ఇచ్చిండు కొద్దిసేపటికి అందరికంటే ముందే లింగన్న వైట్ పేపర్ ఎక్స్ట్రా అడిగిండు ఇగ రాస్తూనే ఉన్నాడు లింగన్న పేపర్ల దాదాపుగా 10 రాసిండు. సార్ కు ఎందుకో డౌట్ వచ్చింది ఎన్నలేనిది లింగన్న గిన్నిగానం పేపర్లు తీసుకుండు మంచిగా రాస్తున్నాడు అని చూద్దామని లింగన్న దగ్గరకు వచ్చిండు తీరా సార్ పేపర్ చూస్తే లింగన్న రాసె పేపర్ పదవ తరగతి పేపర్. ఒక్కసారిగా సార్ షాక్ అయిండు ఏందిరా లింగన్న నువ్వు ఎనిమిదవ తరగతి కదరా పదవ తరగతి పేపర్ అని చెప్పొద్దా అని సార్ అరిసిండు. ఇగ లింగన్న ఏమి చెప్పాలో తెల్వక నేను చూడలేదు సార్ రాస్తానే ఉన్న అన్నాడు సార్ నవ్వుతు నీకు తెల్వది ఏమి రాశినవ్ రా లింగన్న అన్నాడు అప్పుడు లింగన్న చెప్పిన సమాధానం "నేను చదివింది రాసిన సార్" అందులో ఏముందో కూడా చూడలేదు సార్ అన్నాడు' సార్ నవ్వు ఆపుకోలేక నలుగురిని పిలిచి లింగన్న చేసిన ఘనకార్యం అందరికి చెప్పిండు. అయితే నాకు లింగన్న గురుంచి బాగా తెలుసు ఎందుకంటే నా పక్కనే కూర్చునేది కదా,  పాపం లింగన్న బాగానే చదువుతాడు కానీ గుర్తుకు ఉండదు ఏది అంతేతప్ప చదవక కాదు. పాపం లింగన్నకు చదువైతే అబ్బలేదేమో గాని కటింగ్ షాప్ పెట్టుకొని స్థిరపడ్డాడు.

నేను అప్పుడప్పుడు లింగన్న ను గుర్తు చేసుకొని నవ్వుకుంట ఎంతైనా నా దోస్తు కదా. 


కోట దామోదర్ 

మొబైల్ : 9391480475    

1, అక్టోబర్ 2024, మంగళవారం

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్:

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...