5, ఆగస్టు 2023, శనివారం

స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.

 స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.


స్నేహం విలువ గురించి ఎంత చెప్పిన తక్కువే అనడంలో సందేహం లేదు. ఎందరో కవులు, వాగ్గేయకారులు అనేక భాషల్లో స్నేహం గురించి వందలాది పాటలు రాసిన కొన్ని మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజాదరణ పొందిన పాటల్లో తెలుగు పాటలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్నేహం విలువను పాటల రూపంలో అద్భుతంగా చిత్రించిన గేయ రచయితలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో మన తెలుగు తేజం బహు భాష కోవిదుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రే గారు రచించిన నిప్పులాంటిమనిషి చిత్రంలో స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..స్నేహమేరా నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి అనే పాట అనే పాట పలు భాషల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా 1988 లో దర్శకుడు వి. మధుసూదనరావు గారి సమర్పణలో "ప్రాణ స్నేహితులు' సినిమాలోని గేయ రచయిత భువనచంద్ర గారు రాసిన "స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా" అనే పాట ప్రతి తెలుగువాడి హృదయాన్ని దోచుకుంది మరియు స్నేహితుల హృదయాలను దోచుకుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు మరియు ప్రాణ స్నేహితులను మరచిపోరు.


అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది శాంతి సంస్కృతి విలువలు, వైఖరులు మరియు ప్రవర్తన సమితిగా నిర్వచిస్తూ, హింసను తిరస్కరించడం మరియు సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో వాటి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా సంఘర్షణలను నిరోధించడానికి ప్రయత్నించే ప్రతిపాదనను అనుసరించే ఒక చొరవ. దీనిని 1997లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.


ప్రజలు, దేశాలు, సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించ గలదని మరియు సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.


"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల'


ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనిక మరియు పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే.    


బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు (స్నేహితుడు). 


మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం.  స్నేహానికి ఎల్లలు, కులం, మతలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర  ఉంటుంది. అహానికి స్నేహం దగ్గర  చోటే ఉండదనడంలో అతిశయోక్తి లేదు. స్నేహంలో ఎక్కువ తక్కువ లుండవు. పేదవాడు గొప్ప ధనవంతునితో స్నేహంతో కలుపవచ్చు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.


అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది

తెలిసీ తెలియక క్లాసురూం లో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.


ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం.


ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.


* ఖాళీ అగ్గిపెట్టెలను చించి స్నేహితులతో కలిసి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.


* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా  తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది. 


*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.


* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడు మూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,

ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.


ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.


*  వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం

ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.


* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో . ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటలతో చెప్పలేము అని అనుభవిస్తేగానీ స్నేహం తెలియదు.


* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం స్నేహితులతో కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.


* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.


* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.

  

కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది.

దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా..


ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 











22, జులై 2023, శనివారం

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

పూర్వం ప్రజలు వ్యవసాయం మరియు చేతి వృత్తుల పైనే ఆధారపడి జీవించేవారని మనందరికీ తెలుసు. మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయి మరియు వాటి స్థానంలో కొత్త పద్ధతులు కనుగొనబడుతున్నాయి. కనుమరుగవుతున్న చేతివృత్తులలో కుమ్మరి వృత్తి ఒకటి.
కుమ్మరి మట్టితో ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసి మానవ జాతికి తొలి సాధనాన్ని అందించడమే కాక దానిని నిత్యావసర వస్తువుగా మార్చిన ఘనత కుమ్మరి కే దక్కుతుంది. గతంలో ఈ వృత్తి కి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ నేడు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి ని వదిలి అనేక కుటుంబాలు ఇతర పనులు చేసుకుంటుండగా మరికొందరు కుమ్మరి వృత్తి నే నమ్ముకుని దిన దిన గండంగా బతుకీడుస్తున్నారు.

"మన్నును నమ్ముకున్నోడు ఏనాటికి చెడిపోడు" అనే నానుడి నిజం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన తాత, తండ్రి చేసే కుమ్మరి వృత్తినే వారసత్వ సంపదగా పుణికిపుచ్చుకుని నేర్చుకున్నాడు. కుమ్మరి వృత్తి అంతరించిపోతున్నప్పటికీ మన్ను నే నమ్ముకుని  వృత్తి ని బతికించడం కోసం బతుకీడుస్తున్న "భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ" నిజ జీవిత గాథ ఎందరికో ఆదర్శం.

జననం, విద్యాభ్యాసం:

హైదరాబాద్‌లోని చార్మినార్‌, రెయిన్‌ బజార్‌ కుమార్‌వాడి కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమిళ్ళ యాదయ్య మరియు నర్సమ్మ దంపతులకు 23.05.1991 న జన్మించారు. తన చిన్ననాటి నుండి తండ్రి పడుతున్న కష్టాలు చూసి తండ్రికి సాయం చేస్తూ వృత్తిని నేర్చుకోగలిగాడు. భాను చందర్ పదేళ్ల వయసులో తండ్రి అనారోగ్య కారణాలతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఆరో తరగతి మధ్యలోనే చదువు మానుకొని భాను చందర్ తన తండ్రి వృత్తిని అనుసరించడం ప్రారంభించాడు.

మానవజాతి మనుగడకు మట్టి కుండ మరువలేని సేవలందించింది.

మానవజాతి మనుగడకు మట్టి కుండ ఎంతో మేలు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే కాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా సేవలందించిన మట్టి కుండ మాయమవుతుండటం బాధాకరమైన విషయం. ఎప్పుడైతే మార్కెట్లోకి ఫ్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటు పడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు. అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారు చేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్లలో నివసించే వారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాల్లో సైతం పెంకుటిళ్ళు అంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్లాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులో నుంచి తామే స్వయంగా మట్టి తెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినా సరే వృత్తి పై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండటం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల పై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యం తో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపుతో వెలవెల బోతోంది. కాలచక్రం తో పోటీ పడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

మట్టి కోసం ఎన్నో ప్రయత్నాలు:  

గతంలో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు తప్పనిసరిగా ఉండేవి. ఆ రోజుల్లో కుమ్మరికి కుండ తయారీకి ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామ సమీపంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి దొరికేది. ఎండా కాలంలో చెరువుల నుంచి ఒండ్రుమట్టిని సేకరించి కుండను తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి, ఆ మట్టిని నీటితో తడిపి కాళ్లతో మట్టిని మెల్లగా తొక్కి ముద్దలుగా చేసి ఎంతో ఓపికతో కుండను తయారు చేస్తారు. ఆ తర్వాత కుండను కాల్చడానికి కూడా అనేక పద్ధతులు ఉపయోగిస్తారు. ఎంతో ఓర్పు మరియు నైపుణ్యం లేనిదే కుండ తయారు చేయడం అసాధ్యం. ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన మట్టి కుండ మానవాళికి తొలి వస్తువుగా ఉపయోగపడడం గొప్ప విషయం.

కానీ నేడు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై మట్టి కోసం కుమ్మరి అల్లాడుతుండటం బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఉచితంగా లభించే మట్టి నేడు అందుబాటులో లేదు. మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి మట్టిని కొనుగోలు చేసి కుండలు తయారు చేసిన గిట్టుబాటు ధర లేక కుటుంబాన్ని పోషించుకోలేక కుమ్మరి వృత్తికి దూరమవుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఉంటున్న భాను చందర్.. తాను నమ్ముకుని బతుకుతున్న వృత్తినే కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. భాను చందర్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ వృత్తి పూర్తిగా అంతరించి పోకుండా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

భాను చందర్ కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా, అనేకమంది ఆధునిక పరికరాలు, ఆధునిక యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ మట్టి కుండ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భాను చందర్ నగరంలో పలుచోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. మట్టి కుండ మానవ ఆరోగ్యానికి మంచిదని, మట్టి కుండను ఉపయోగించకపోవడం వల్ల మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అందరికీ వివరిస్తున్నారు. అంతేకాకుండా, అతని కుండ తయారీని చూసి చాలా మంది ప్రముఖులు, నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ తారల చే ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్లాస్టిక్ వాడకం వద్దు. మట్టి కుండలు ముద్దు.

ప్లాస్టిక్ వస్తువులు అత్యంత అందంగాను, కళ్లు చెదిరే రంగులతో మరియు అత్యంత చౌకగా చౌకగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. విచక్షణా రహితంగా రసాయనాలు వాడడం, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను విపరీతంగా వాడడంతో పర్యావరణం ప్రశ్నార్థకంగా మారింది. ఇలాగే కొనసాగితే భావి తరాలు అనారోగ్యకరమైన సమాజంలో జీవించాల్సి వస్తుంది.

పూర్వం మట్టి కుండలో ఆహారాన్ని వండుకుని తినే వారు. కాబట్టి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాకుండా మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫైయర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులలో నీటిని నిల్వ ఉంచుకుని తాగే బదులు మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని ప్లాస్టిక్ ను నిషేధించి మట్టి కుండలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

కుమ్మరి వృత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందించాలి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''స్వదేశీ ఉత్పత్తుల'' అభివృద్ధికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమైంది అనడంలో సందేహం లేదు. కుమ్మరి వృత్తి డిమాండ్ తగ్గడంతో గ్రామీణ వృత్తులపై ఆధారపడిన కార్మికులు ఈ వృత్తిని వదులుకుని పట్టణాలకు వలస వెళ్లి లేబర్ మార్కెట్‌లో రోజువారీ కూలీలుగా ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.

భాను చందర్ ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కిన్నెర కళాకారులు అంతరించిపోతున్న తరుణంలో కళనే నమ్ముకుని బతుకీడుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య కు భారత ప్రభుత్వం 2022 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించడం గొప్ప విషయం. అలాగే అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి కళాకారులను కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం. కుండ విశిష్టతను తెలియజేస్తూ కళను బతికిస్తున్న భాను చందర్ లాంటి వారిని ప్రభుత్వం సత్కరించి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

12, జులై 2023, బుధవారం

దైర్యసాహస వీరుడి కథ.

భగవంతుడు ఎలా ఉంటారో మనం చూడలేము, ఆపదలో మనకు సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ, ఆపదలో మనకు సహాయం చేసే వారు భగవంతుని తో సమానం అనేది నిజం.

ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు అవసరం లేదు. మనసుంటే చాలు.

మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా సాటి మనిషికి సాయం చేయాలనే మానవత్వం, తపన ఉంటే ఎలాగైనా చేయగలడు. సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. అయినా సాటిమనిషికి సహాయం చేయలేని స్వార్ధపరులెందరో.

సాటి మనిషి చనిపోయే స్థితిలో ఉన్నా సహాయం చేయాలనే చలనం లేని వారెందరో. 

అత్యవసర పరిస్థితుల్లో, సాధారణంగా నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను రక్షించడం మనందరి కర్తవ్యం. కొన్ని సందర్భాల్లో అంబులెన్సుకు దారి ఇవ్వాలనే అవగాహన లేని వారి కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వడం చాలా కష్టమైన పని. అలాంటి సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు మరియు మానవత్వం ఉన్నవారు ధైర్యసాహసాలతో  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మార్గనిర్దేశం చేసే స్పూర్తిదాయకమైన ప్రాణదాతలు ఎందరో ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన 12 ఏళ్ల బాలుడు వెంకటేష్ అనే ధైర్య సాహస వీరుడి కథ.

వెంకటేష్ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా హిరేరాయనకుంపి గ్రామానికి చెందినవాడు. హిరేరాయనకుంపేలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. వెంకటేష్‌కి స్నేహితులతో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. వెంకటేష్ తన స్నేహితులతో కలిసి తరచూ హిరేరాయనకుంపి లోని వాగు పరిసర ప్రాంతాల్లో ఆదుకునేవాడు. అలా స్నేహితులతో కాలక్షేపం చేస్తూనే తల్లిదండ్రులకు సహాయపడుతుండేవాడు. ఆగస్టు 2019లో, వరదల కారణంగా వాగు పరిసర ప్రాంతాలు నీట మునిగి, నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న వంతెన నీట మునిగింది. యాద్గిర్ జిల్లా వడగెర తాలూకాలోని మాచనూర్ గ్రామానికి అంబులెన్స్ డ్రైవర్ ఆరుగురు పిల్లలతో పాటు మహిళ మృతదేహాన్ని తీసుకెళ్తున్నాడు. బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న నీరు కారణంగా అంబులెన్స్ మునిగిపోయిన వంతెన వద్ద ఆగిపోయింది.డ్రైవర్ సహాయం కోసం సమీపంలో ఆడుకుంటున్న పిల్లల గుంపు ను పిలిపించి, వంతెనపై మార్గం సరైనదని తెలుసుకొని  అంబులెన్స్‌కు మార్గం చూపించమని అడిగాడు. అప్పుడు అక్కడున్న పిల్లలు ఎవరు ఆ సాహసం చేయమని చెప్పారు. వెంటనే వెంకటేష్ నేను దారి చూపిస్తాను అంటూ ధైర్యంగా ముందుకు వచ్చాడు. వెంకటేష్‌ స్నేహితులు అతడ్ని హెచ్చరించినా వినకుండా, డ్రైవర్‌ని అనుసరించమని కోరాడు. అంతటా పారుతున్న నీరు కారణంగా దారి కనిపించని పరిస్థితి, వెంకటేష్ బ్రిడ్జి పై తరుచుగా ఆడుకునే వాడు కావడం వల్ల బ్రిడ్జిపై దారి సులభంగా కనిపెట్టగలను అనే నమ్మకంతో ఆ డ్రైవర్ కి సూచనలిస్తూ మెడ లోతు ప్రవహిస్తున్న నీటిలో ముందుకు అడుగులేస్తూ సాహసోపేతమైన ధైర్యంతో అంబులెన్స్ కి మార్గనిర్దేశం చేయగలిగాడు. దారి చూపిన సాహస  వీరుడికి డ్రైవర్ కృతజ్ఞతాభావం తెలిపారు. 

అంతేకాకుండా వెంకటేష్ 10 ఏళ్ల వయసులో నది ప్రవాహం లో పడిపోయిన మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు. అతి చిన్న వయసులోనే సాహసోపేతమైన విన్యాసాలు చేసినవారిని చూస్తుంటాము కానీ ప్రాణాలకు తెగించి ప్రాణాలను రక్షించే వారిని చూడటం అరుదు.   

ధైర్య సాహసాలకు "జాతీయ శౌర్య పురస్కారం":

వరదలున్న ప్రాంతంలో అంబులెన్స్‌కి మార్గనిర్దేశం చేయడం అంటే మామూలు విషయం కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అంబులెన్స్ సజావుగా వెళ్లేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అంబులెన్స్ కి దారి ఇవ్వడం నిజంగా వెంకటేష్ ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంబులెన్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో పాటు బాలుడి ధైర్యసాహసాలు జాతీయ వార్తగా మారడమే కాకుండా, ప్రశంసలు వెల్లువెత్తాయి. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సాహస పురస్కారాలను అందజేస్తోంది.

సహాయం, సాహసం చేయడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన వెంకటేష్ ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అతని ధైర్య సాహసాలకు గుర్తింపుగా 26 జనవరి 2020 , న్యూ ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి చేతులమీదుగా జాతీయ శౌర్య పురస్కారాన్ని అందజేశారు. 

బాలలకు ప్రదానం చేసిన సాహస పురస్కారాల అవార్డులు వారికి ప్రత్యేక గుర్తింపును తేవడమే కాకుండా వారి నైపుణ్యాన్ని వెలికితీస్తుంది. వారు సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.  

విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగేలా ప్రోత్సహించాలి.

పిల్లలలో ప్రతి ఒక్కరికి సృజనాత్మకత ఉంటుంది. వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే సృజనాత్మకత మరింత పెరిగి అవధులు లేని ఆవిష్కరణలు చేస్తారు. పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శిక్షణ అవసరం. ప్రస్తుతం విద్యార్థి తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పాఠ్యపుస్తకంలోని పాఠాలకే పరిమితమై, సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై అవగాహన ఉండటం లేదు. పాఠశాల స్థాయిలో, ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంలో మానవతా విలువలపై సరైన అవగాహన కల్పించి, ఇతరులకు సహాయపడే కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగి నవ సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. పిల్లలు వారికి తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లకు గురవుతుంటారు అలా జరగకుండా వారిపై తల్లిదండ్రులు, గురువుల పర్యవేక్షణ తప్పనిసరి. తల్లిదండ్రులు పిల్లలలో ధైర్యాన్నిచ్చే సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుటుంబ సమస్యలపై కాకుండా సమాజంలోని సమస్యలపై అవగాహన కల్పిస్తే పిల్లలలో సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు వెంకటేష్ లాంటి ధైర్య సాహస వీరుడి వంటి స్టోరీస్ తెలియజేయడం ద్వారా వారిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ధైర్యసాహసాలు చేయడానికి వెనకడుగు వేయకుండా ముందుకు సాగేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475  

 





  

8, జులై 2023, శనివారం

పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?

పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవంలోకి వస్తే చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం.

అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు. "చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు" నానుడి నేటికీ నిజం. మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు అన్నట్లుగా ప్రతిభావంతులు, తెలివైన పద్మశాలీల మౌనం వల్ల మానవతావాదం లేని వారు రాజ్యమేలుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితి ని ఎదుర్కొంటున్నారన్నారు.

పద్మశాలి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ వారి ఎదుగుదల కోసమే తప్ప చేనేత కార్మికుల చేయూత కోసం కాదన్నది ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి తెలిసిన విషయం. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకు గా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వారికి  ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం. పద్మశాలీల మౌనమే నేడు చేనేత కార్మికుల శాపంగా మారింది. ఇకనైనా చేనేత కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది.

ఫలితాలు ఇవ్వని పథకాలు:

1 . చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ,  నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గత కొన్ని నెలల క్రితం పేపర్లో వచ్చిన విషయం అందరికి తెలిసిందే. పేపర్ లో వచ్చే ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. నేతన్న బీమా పథకం ప్రస్తుతం అమలులో ఉందో లేదో కూడా చేనేత కార్మికులకు తెలియదంటే దీనిబట్టి అర్థం చేసుకోవాలి పథకాలు పబ్లిసిటీ కోసమే తప్ప పబ్లిక్ కోసం కాదు అనేది.

2 . ముద్ర పథకం:

 పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల అభ్యున్నతికి ముద్ర రుణాలు  అందజేస్తున్నారు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముద్ర లోన్ల ఊసే లేదు. ముద్ర లోన్లు ఉన్నాయన్న విషయం ప్రచారానికే పరిమితం అంతే తప్ప ఏ ఒక్కరు తీసుకున్నట్లు, ముద్ర లోన్స్ అమలులో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అసలు ముద్రా రుణాలు ఉన్నాయా అనే సందేహం నెలకొంది.

3 . నేతన్న బీమా పథకం:

మరణించిన చేనేత కార్మికుల కుటుంబం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం "నేతన్న బీమా పథకం". ఏ కారణం చేతనైనా 18-59 సంవత్సరాల వయస్సు గల నేత కార్మికులు మరణిస్తే 10 రోజుల్లోగా నామినీకి ఎల్‌ఐసి నుండి 5 లక్షల బీమా పరిహారం అందించేలా పథకం రూపొందించబడింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 2022 ఆగస్టు 8 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని ప్రెవేశపెట్టినందుకు ఎంతో సంతోషించిన చేనేత కార్మికులకు ఈ పథకం అందని ద్రాక్షలాగే మిగిలింది. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి అనేక మంది చేనేత కార్మికులు మరణించగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందజేసినట్లు ఎక్కడ  సమాచారం లేదు. బ్రతికుండగా సరైన పథకాలు లేవు మరణించిన తర్వాత కూడా నేతన్న బీమా పథకం లేదు. ఈ పథకాన్ని ప్రారంభించి చేనేత కార్మికులకు నగదు అందజేయడంలో విఫలం కావడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర కులాలకు ఇస్తున్నారు తప్ప చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకం అందకపోవడం శోచనీయం.

4 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచితంగా మగ్గాలు అందించిన మాట వాస్తవం. మరి మన రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచిత మగ్గాలు ఏవి? వాటి స్థానంలో ఇంకేమైనా ఇచ్చారా  అది లేదు.  అది చేస్తాం ఇది చేస్తాం అనడమే తప్ప ఏమి ప్రయోజనం లేదు.

5 . బీసీ కులాలందరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశ చూపి చివరి దశలో 15 కులాలకు మాత్రమే వర్తిస్తుంది అని పేపర్ ప్రకటన చేయడం తీవ్ర బాధను కలిగించింది. ఈ పథకం కోసం ప్రతి చేనేత కార్మికుడు 4 రోజులు పని చెడగొట్టుకొని మండలం ఎం ఆర్ ఓ ఆఫీస్, మీ సేవల చుట్టూ తిరిగి అలసిపోయిన చేనేత కార్మికులు ప్రకటన చేయడం వరకే పరిమితమైన పథకాలు మాకొద్దు అంటూ చేతి వృత్తుల అభివృద్ధికి పాటు పడే ప్రభుత్వాన్ని ఈసారి ఎన్నుకుంటామని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.. 

నేతన్నకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోందని, దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అతి కొద్దిమందికి ఇస్తూ మిగతా వారికి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జి ఐ టాగ్ నమోదు కానీ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారికి జి ఐ టాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు వారు జి ఐ టాగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. 

అత్యధిక ఓటర్లు పద్మశాలీలకు నాయకులు ఎలక్షన్ సమయంలో ఎదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతి ఎలక్షన్స్ సమయంలో జరిగేదే. నాయకులు ప్రతిసారి పద్మశాలీలను మోసం చేయడం వారి ఓట్ల ద్వారా గెలుపొందడం ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. 

చేనేత కార్మికులందరూ ఐక్యతగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది.

ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని అండగా నిలవాలి.


వ్యాసకర్త. 

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475


   

5, జులై 2023, బుధవారం

డ్రైవర్ వృత్తి



సమాజంలో నేటికీ డ్రైవర్ల వృత్తి కూలీలగానే పరిగణించబడుతుంది. వారు చేసే పని ఎంతో విలువైనది అయినా వారికీ సరైన జీతం, సరైన వసతి, గౌరవం, గుర్తింపు లభించకపోవడం బాధాకరమైన విషయం. డ్రైవర్ వృత్తి ప్రపంచంలో చాలా ప్రధానమైనవి. వీరు రాత్రి, పగలనక అహర్నిశలు శ్రమించిన కష్టానికి ఫలితం అంతంత మాత్రమే. ఈ వృత్తుల వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయని అతి కొద్దిమందికి తెలుసు. సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ శ్రమను గుర్తించి శ్రమకు తక్కువ గౌరవం ఇస్తున్నారు.


డ్రైవర్ వృత్తి గురుంచి తెలుసుకుందాం:


విలాసవంతమైన భవనాలు, కోట్ల ఖరీదైన కార్లు ఉన్నపటికీ గౌరవం కోసం కొందరైతే, కొందరు నడపగలిగే సామర్థ్యం ఓపిక లేక, నిత్యం బిజీ గా ఉండే రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు ఎంతోమంది నెలవారీ జీతంతో డ్రైవర్లుగా నియమించుకుంటారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడుగా పరిగణిస్తారు తప్ప వారి శ్రమను గుర్తించారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడు అనుకునే వారికీ డ్రైవర్ అనే పదానికి అసలు నిర్వచనం తెలియదని కూడా గమనించాలి. సమయానికి మనందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే దేవుడే నిజమైన డ్రైవర్. డ్రైవర్ కంటి మీద కునుకు లేకుండా ఎంతో నిబద్ధతతో మనల్ని గమ్యస్థానానికి తీసుకెళతాడు. అనివార్యమైన సంఘటన ఏదైనా జరిగిన మన ప్రాణాలకంటే ముందు తన ప్రాణాలను వదలడానికైనా సిద్దపడి ముందుండి నడుపుతాడు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న వాస్తవాన్ని మరిచిపోయి వారిని ఒక కూలీగానే చూడటం శోచనీయం. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు వంటి అనేక డ్రైవర్ సంబంధిత ప్రమాదాలు కనురెప్పపాటులో జరిగే ఘోర ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మన కుటుంబ క్షేమం కోసం డ్రైవర్ తన కుటుంబానికి దూరమై అవసరమైతే మనతోపాటే ప్రాణాలర్పించడానికి వెనుకాడని డ్రైవర్ వృత్తి ఎంత ప్రధానమైనదో ఒకేసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు వారికి సరైన ఆహారం, నిద్ర, సరైన జీతం, అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేయాలి. డ్రైవర్ అంటే మన కుటుంబ సభ్యుడిగా చూడాలి. మనం తినే ఆహారమే తనకు పెట్టాలి. అంతే తప్ప కూలివాడుగా చూడరాదు. మనం నిత్యం వార్తలలో చూస్తూనేవుంటాం బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణం అయినా ప్రయాణికులు సురక్షితమని లేదా ప్రమాదం నుండి రక్షించిన డ్రైవర్ అని ఇలా ఎన్నో వార్తలు వస్తుంటాయి. బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో మనం నిద్రపోయినా ప్రశాంతంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల మనమంతా క్షేమంగా ప్రయాణించడం గొప్ప విషయం. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా అంబులెన్స్ వాహన డ్రైవర్లు కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ చివరకు కూలి డ్రైవర్ గానే చూస్తాం. అంబులెన్స్ డ్రైవర్ అతివేగంతో నడపడంతో తన ప్రాణాలకు కూడా ప్రమాదమని తెలిసినప్పటికీ మన ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా బ్రతికిస్తాడన్న కృతజ్ఞత భావం కలిగినవారు అతితక్కువ మంది ఉంటారు.


డ్రైవర్ మృతి పట్ల కృతజ్ఞత భావం తెలిపిన "జవేరి పూనావాలా":


కరోనా వాక్సిన్లలో ఒకటైన కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఆధార్ పూనావాలా సోదరుడు జవేరి పూనావాలా దగ్గర కారు డ్రైవర్ గా 30 సంవత్సరాలుగా పనిచేసిన గంగాదత్త అంటే జవేరి పూనావాలాకు అమితమైన ప్రేమ అయన అతన్ని డ్రైవర్ కాకుండా సొంత తమ్ముడిగా చూసుకునేవారు. ఒకరోజు జవేరి పూనావాలా ముంబై పర్యటనలో ఉండగా పూణే లో గంగాదత్త అకాలమరణం పొందారన్న విషయం తెలిసింది. వెంటనే అన్ని పనులు రద్దుచేసుకొని హుటాహుటిన పూణెకి చేరుకొని అంతిమ యాత్ర జరిగే సమయంలో గంగాదత్త నడిపిన కారు ను పూలతో అలంకరించి దానిలో పార్థివ దేహాన్నుంచి గంగాదత్త అంతిమ యాత్రను అయన నివాసం నుండి శ్మశానవాటిక వరకు స్వయంగా తాను కారు నడుపుకుంటూ తీసుకెళ్లారు.

ఇదే విషయాన్నీ ఆయనతో ప్రస్తావించగా అయన విషణ్ణ వదనంతో " గంగాదత్త నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించారు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్న" అని అన్నారు.


డ్రైవర్ల సమస్యలెన్నో:


డ్రైవర్లకు సరైన జీతం లేదు, వారానికోసారి సెలవు లేదు, వైద్య బీమా లేదు, ఇఎస్‌ఐ లేదు, పిఎఫ్ లేదు. డ్రైవర్ అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి బీమా లేదు.

చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ల శ్రమను గుర్తించి న్యాయమైన వేతనం ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. ఓలా, ఉబర్, ఇతర క్యాబ్‌లను అనుమతించడం వల్ల చిన్న వాహనాల డ్రైవర్లకు సరైన గిరాకీ లేక ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖల్లో అవినీతి, వేధింపులు ఇలా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ల అభ్యున్నతికి తగిన చట్టాలు రూపొందించి డ్రైవర్లకు ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.




















 

2, జులై 2023, ఆదివారం

అంతరించి పోతున్న కుమ్మరివృతి 2

 అంతరించి పోతున్న కుమ్మరివృతి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

కుండల ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం 'సిరామిక్ సిటీ' :

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఖుర్జా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణీయమైన ప్రాంతం. అక్కడ తయారయే రంగు రంగుల కుండలు పర్యాటకులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఖుర్జా కుండలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని 'సిరామిక్ సిటీ' అని కూడా పిలుస్తారు, 

ఆధునిక సాంకేతిక అవసరం:

ప్రభుత్వం కుమ్మరి వృత్తిదారులకు నూతన ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనావుంది. లక్షలాది కుటుంబాలు ఈ వృతిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్లోకి స్టీల్ వంటి పాత్రలు వచ్చాయో అప్పటినుండి వీరి జీవితాలు అగమ్యగోచరంగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, కుమ్మరి వృత్తికి కావాల్సిన బడ్జెట్ ని పెట్టాలి. అంతేకాకుండా కుండలు అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలి. కుమ్మరి వృత్తి ని బలోపేతం చేయడానికి వారికీ ప్రత్యేకమైన వడ్డీలేని రుణాలను అందజేయాలి.  అంతరించిపోతున్న కుమ్మరి వృత్తిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.


వ్యాసకర్త 

కోట దామోదర్

మొబైల్ : 9391480475

30, జూన్ 2023, శుక్రవారం

ambulance

కోట్ల రూపాయల ఆస్తులున్న ఆయుష్షును పెంచుకోలేమనేది జగమెరిగిన సత్యం. అందుకే మన పూర్వికులు ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యంలేదనడంలో అతిశయోక్తిలేదు.

"వైద్యో నారాయణో హరి" వైద్యుడు దేవుడితో సమానమని మనందరికీ తెలుసు. ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించే వారు కూడా దేవుడితో సమానం అనడంలో సందేహం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెంటనే సరైన వైద్యం అందిస్తే బతికే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు మన దేశంలో తొలిసారిగా 1984లో అత్యవసర వైద్య సేవలు (అంబులెన్స్ సేవలు) ప్రారంభించారు.



25, జూన్ 2023, ఆదివారం

రాజారామ్ శాస్త్రి:

వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు

వృద్ధాప్యం మానవ జీవితంలోని దశలలో ఒకటి. ఈ వృద్ధాప్య దశలో మానవ శరీరం అనేక శారీరక మరియు మానసిక మార్పులకు లోనవుతుంది మరియు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వృద్ధాప్యం అనేది అపారమైన అనుభవాలతో నిండిన జీవితం. వారు చెప్పే ప్రతి మాట నిజమని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతారు. అందుకే "పెద్దల మాట చద్దన్నం మూట" అనే నానుడి పుట్టింది.

మన దైనందిన జీవితంలో చాలామంది 60 యేండ్లు నిండకముందే అనేక వ్యాధులతో పోరాడుతూ వారి శరీరం ఏ పని చేయడానికి కూడా సహకరించలేనటువంటి పరిస్థితులను చూస్తూనే ఉంటాము. మానసిక స్థైర్యం మానసిక సమతుల్యత ను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచడమే దీనికి కారణం. అంతేకాకుండా మానసిక స్థైర్యం ఉన్నవారు వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నవారు తారసపడుతుంటారు. బహుశా అలాంటి వారిని చూసే " వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు" అనే నానుడి పుట్టుకొచ్చిందనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన 91 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు, వేద పండితులు రాజారామ్ శాస్త్రి యదార్ధ జీవిత కథ. 

జననం, విద్యాభ్యాసం:

సూర్యాపేట జిల్లాలోని మిర్యాల అనే మారుమూల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బయ్య శాస్త్రి, లక్ష్మి భాగ్యమ్మ దంపతులకు 06-10-1932  న జన్మించారు.. అయన తండ్రి సుబ్బయ్య గారు ప్రముఖ వేదపండితులు. చుట్టుపక్కల గ్రామాలలో జరిగే శుభ కార్యాలన్నీ ఆయనే జరిపేవారు. రాజారామ్ శాస్త్రి గారు చదువుకునే రోజుల్లో పదవయేట అయన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తాను కూడా పురోహితం నేర్చుకొని తండ్రికి సహాయం అందించాలనే ఆలోచన కలిగింది. మొదటగా తన తండ్రి దగ్గర గాయత్రి మంత్ర శ్లోకాలతో ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే అన్ని కార్యాలను నిర్వహించే విధంగా వేద మంత్రాలు నేర్చుకోగలిగారు. గ్రామంలోని చిన్న చిన్న కార్యాలను నిర్వహిస్తూనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తీవ్రమైన ఏకాగ్రత, అంకితభావంతో చదువు ప్రారంభించి మంచి విద్యా ప్రతిభ ఉన్న విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.

ఉద్యోగ ప్రస్థానం:

చదువుతోపాటు, పురోహితం లో మంచి నైపుణ్యం సంపాదించడమే గాక అయన 27 .04 .1954 న ప్రభుత్వ టీచర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం సూర్యాపేట మారుమూల గ్రామాలలో ఉద్యోగం చేసి బదిలీ అయిన తర్వాత గుమ్మడవెల్లి గ్రామానికి ప్రైమరీ స్కూల్ టీచర్ గా నియమితులైనారు. అప్పుడే గుమ్మడవెల్లి లో పాఠశాల ప్రారంభమైంది. అతి తక్కువ విద్యార్థులతో సాగుతున్న పాఠశాలకు రాజారాం సార్ రాకతో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలే కాకుండా క్లాసురూం లో నవ్వులు పువ్వులు పూయించేవారు. ఆయన నోట పాఠాలే కాకుండా అప్పుడప్పుడు పాటలందుకునే  పాటల పూదోట రాజారామ్ శాస్త్రి. కచ్చితమైన సమయాన్ని పాటిస్తూ, మంత్రముగ్ధులను చేసే ఆయన బోధనకు ఆకర్షితులైన విద్యార్థులు ఆయన చెప్పే పాఠాలకు గైర్హాజర్ కారంటే అతిశయోక్తి కాదు. ఆయన బోధన తీరు ఓ అద్భుతం పాఠానికి తగ్గట్టుగా ఉదాహారణలతో బోధించేవారు. తన సబ్జెక్ట్ తెలుగు అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కారణంగా ఇతర సబ్జెక్టులను కూడా బోధించేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజారామ్ శాస్త్రి గారు అందించిన శ్లాఘనీయమైన సేవలు గుమ్మడవెల్లి విద్యార్థులు ఎప్పటికి మరిచిపోలేనివి, మరుపురానివి. ఆయన వద్ద శిష్యరికం చేసిన విద్యార్థులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజారామ్ శాస్త్రి గారు 1990 సంవత్సరంలో గుమ్మడవెల్లి లో పదవి విరమణ పొందారు.

పురోహితం లో 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం: 

పదేళ్ల వయసులో తండ్రి వద్ద నేర్చుకున్న పురోహితం ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా జీవన ఉపాధి కోసం కొనసాగుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 91 ఏళ్ల వయసులో 80 ఏళ్ల అర్చక అనుభవం కలిగి ఉండటం మరో గొప్ప విషయం. చుట్టుపక్కల గ్రామాల్లో పూజారులు లేకపోవడంతో ఆ గ్రామాల్లో జరిగే కార్యములన్నిటిని కూడా శాస్త్రి గారు నిర్వహిస్తారు. ఆయన చేతుల మీదుగా ఇప్పటి వరకు కొన్ని లక్షలకు పైగా వివాహాలు జరిగిపోయాయంటే అతిశయోక్తి కాదు.  గుమ్మడవెల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పెళ్లి ఆయన చేతుల మీదుగా జరిగినవే. అంతేకాకుండా గుమ్మడవెల్లి లో ఉన్న ప్రతి కుటుంబంలో 1960 నాటి నుంచి ఇప్పటివరకు అన్ని కార్యాలు రాజారామ్ శాస్త్రి గారు నిర్వహిస్తుండటం ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. 91 ఏళ్ల వయసులో ఉన్న శాస్త్రి గారు ఇప్పటికీ స్వయంగా వంట, ఇంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు అన్నట్లుగా ఆయన ఇప్పటికి పూజలు నిర్వహించే కార్యక్రమాలలో వేద మంత్రాలు 2 గంటలకు పైగా ఆపకుండా చదివే శక్తి ఆయనకు ఉంది. జన్మనామం ప్రకారం భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడంలో రాజారామ్ శాస్త్రి గారి తరువాతే ఎవరైనా కాబట్టి వాస్తు శాస్త్రం,జ్యోతిష్యం, ఆలస్య  వివాహాలు మరియు అనేక ఇతర సమస్యల పరిష్కారం కోసం పలు జిల్లాల నుంచి ప్రజలు అతనిని సంప్రదిస్తారు, ఇది అతని పనికి నిదర్శనం. ఆయన నిరుపేదల పట్ల దయ, కరుణ, ప్రేమ చూపే వ్యక్తి. అందుకే శాస్త్రి గారు పేదల కార్యక్రమాలకు వారి స్థాయికి తగ్గట్టుగా డబ్బులు తీసుకొని, కట్టలేని వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. పేదల పట్ల మానవత్వం చూపే గొప్ప మనసున్న వ్యక్తి. గుమ్మడవెల్లి గ్రామంలో జరిగే ప్రతి పండుగలో ప్రజలను మంత్రముగ్ధులను చేసే వేద మంత్రాలను పఠిస్తూ భక్తులకు వేద మంత్రాల అర్థాన్ని విపులంగా వివరిస్తారు. 

వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు:

వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పే వాళ్ళని మనం చూశాం కానీ, వయసు శరీరానికి దూరం అన్నట్లుగా రాజారాం శాస్త్రి దినచర్య అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వృద్ధాప్యాన్ని జీవితంలో అత్యంత నీచమైన దశగా భావించి అసలు వాస్తవాన్ని గుర్తించలేని వారికి శాస్త్రి జీవితం ఆదర్శప్రాయం. ప్రతి మనిషికి సమస్యలు రావడం సహజమే అనడంలో సందేహం లేదు. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఆలోచనే ఉత్తమమైన మార్గమని కొద్ది మందికి తెలుసు. మనం నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలపై అనవసర ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఒక సందర్భంలో శాస్త్రి గారిని తన ఆరోగ్య రహస్యం గురించి అడిగినప్పుడు, అతను ఇలా సమాధానమిచ్చాడు. ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే దైర్యం మనలో ఉంటె ఏ శక్తి ఆపలేదు. ధైర్యంతో ముందడుగు వేసినపుడే నువ్వు ప్రపంచాన్ని జయించి గలుగుతావు అని అన్నారు ఆయన. ఉద్యోగం రాక ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఆయన మనోధైర్యాన్ని అందిస్తారు. 91 సంవత్సరాల శాస్త్రి గారు ఇప్పటికి పాఠ్య పుస్తకం లోని అంశాల గురించి చాలా చక్కగా వివరించడం గొప్ప విషయం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆయన అందించిన శ్లాఘనీయమైన వైద్యసేవలు మరువలేనివి. జీవితంలో ఏదైనా సాధించాలంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన మార్గంలో ముందుకు సాగాలని, లక్ష్య సాధనకు ఎలాంటి అడ్డంకులు ఉండవనేది ముమ్మాటికీ నిజం. రాజారామ్ శాస్త్రి గారి నిజ జీవితం ఎందరికో ఆదర్శం.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



      

11, జూన్ 2023, ఆదివారం

అవరోధాలే అవకాశాలు

 అవరోధాలే అవకాశాలు


"అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు" స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే.

మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక ఉన్నత ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన అంధురాలు పూర్ణ సుందరి ఐ ఏ ఎస్ యదార్థ జీవిత కథ తెలుసుకుందాం.


తమిళనాడు రాష్ట్రం, మదురై జిల్లా, మణినగరం ప్రాంతానికి చెందిన పూర్ణ సుందరి. ఆమె తండ్రి ఓ సాధారణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి, తల్లి హోమ్ మేకర్, పూర్ణ సుందరి పుట్టుకతోనే అంధురాలిగా జన్మించలేదు. ఆమె 5 సంవత్సరాల వరకు సాధారణ పిల్లల్లాగే చదువుకుంది, కానీ ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల ఆమె కంటి చూపు క్షీణించడం ప్రారంభించింది. పూర్ణ సుందరి  తల్లిదండ్రులు ఆమె చూపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక ఆమె 5 సంవత్సరాల వయసులోనే చూపును కోల్పోయింది . కూతురు చూపు కోల్పోవడం పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

అంధకారం అలుముకున్న తమ కూతురి జీవితాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తల్లిదండ్రులు మనోస్థైర్యం తో బిడ్డను ధైర్యంగా ప్రోత్సహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అంధత్వం తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదని కన్నతల్లే స్వయంగా పుస్తకాలు చదివి వినిపిస్తుండగా విషయాలను ఆకళింపు చేసుకునేది. ఆమె తల్లి ఆలోచనకు అభినందనీయం. పూర్ణ సుందరి స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. అవరోధాలే అవకాశాలుగా మార్చుకొని చదువులో ఫస్ట్ ర్యాంకులు సాదించింది. సగాయం IAS అధికారి మరియు మాజీ ఐ ఏ ఎస్ ఉదయ చంద్రన్ ప్రేరణ పొందిన ఆమె ఇంటర్మీడియట్ లో ఉండగానే ఐ ఏ ఎస్ కావాలనే ఆలోచనకు బీజం పడింది. తమ కూతురు సామర్థ్యాన్ని నమ్మి తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా తోటి స్నేహితులు కూడా చదువుల్లో ఆమెకు అర్థం కాని పాఠాలను ఆడియో ద్వారా అందజేసేవారు. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారంతో డిగ్రీ పూర్తి చేయగలిగింది. అయినప్పటికీ ఆమెకు ఐ ఏ ఎస్ కావాలనే కోరిక ప్రబలంగా ఉండేది. తన కలలను సహకారం చేసుకునేందుకు ఆమె మొదటి ప్రయత్నం చేసి UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా కూడా కలత చెందకుండా పూర్ణ సుందరి కఠినమైన ప్రయత్నంతో రెండోసారి కూడా విజయం సాధించలేకపోయింది. అయినా ఆమె పట్టుదలతో తన ఆకాంక్షను నెరవేర్చేందుకు మూడోసారి కూడా ప్రయత్నించి ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అంతటితో తన ప్రయత్నం ఆపకుండా తాను ప్రిపేర్ అయ్యే విధానంలో లోపాలు గమనించి లోతుపాతులు తెలుసుకొని తనకు తెలియని అంశాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటూ,అంతేకాక కంప్యూటర్ నుండి చదవడానికి ఆమె అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ (JAWS) సాఫ్ట్ వెర్ ఉపయోగించేది. కూతురిపై ఉన్న నమ్మకంతో ఎన్ని ప్రయాసలనైనా ఎదుర్కొని ఆమె కోరుకున్న పుస్తకాలను తండ్రి అందజేసేవారు. బ్రెయిలీ లిపి లో లేని పుస్తకాలను ఆమె తల్లి మరియు స్నేహితులు గంటల తరబడి వివిధ పుస్తకాలు చదివి వినిపించేవారు. యూట్యూబ్ లో లభించే ఆడియో పాఠాల సహాయంతో కఠోర దీక్షతో, నిరంతర కృషితో నాలుగోసారి ఉత్తీర్ణత సాధించగలిగింది. ఈ మహోత్కృష్ట యజ్ఞంలో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రుల కృషి అత్యంత శ్లాఘనీయం.  
   
అంధత్వంతో బాధపడుతున్నా చదువుకునేందుకు ఆటంకం కాదని అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటున్నారు. నేటి యువతకు సౌకర్యాలు ఉన్నా అందుబాటులో లేని వనరుల గురించి ఆలోచిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దైనందిన జీవితంలో సమస్యలు అందరికీ సాధారణమే అయినా వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్నవారికే విజయం వరిస్తుందనడంలో అతిశయోక్తిలేదు.

అంధత్వం కారణంగా చాలా మంది ప్రతిభావంతులైన ఔత్సాహికులకు సివిల్ సర్వీసెస్‌లో చేరే అవకాశం లేకపోవడంతో గతంలో వారి కలలు సాకారం చేసుకునేందుకు అవకాశం లేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ చూపి వంద శాతం అంధత్వం గలవారికి సివిల్ సర్వీసులో చేరే అవకాశాన్ని కల్పించడం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో అంధుల కలలు సాకారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నో అవరోధాలను అధిగమించి అంకుఠిత దీక్షతో విజయాన్ని సాధించిన పూర్ణ సుందరి ఐ ఏ ఎస్ నేటి అంగవికలురు యువతకు అద్భుత సందేశాన్ని అందించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే అంగవికలురు స్వీయం సానుభూతిని పక్కన పెట్టి అడ్డంకులను  అధిగమించాలి తప్ప అడ్డంకులు వచ్చాయని ఆగిపోయే ప్రయత్నం చేయకూడని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆశయ సాధనకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

సామాన్య విద్యార్థులతో సమానంగా అంధులకు మెరుగైన విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. అంతేకాకుండా, వారి విద్యకు తగిన బ్రెయిలీ పుస్తకాలు మరియు ఆడియో పాఠాలు అందుబాటులో ఉంచాలి. అంధుల విద్య బలోపేతానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంధుల విద్య కోసం ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలో ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి.

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవరోధాలుగా భావిస్తూ...

కొందరు ఉన్న చోటే ఉంటారు, అంటే ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుంటారు.

మరియు కొందరు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది ఆ అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు.

అధిగమించేవారు అవకాశాలను ఎదుర్కొంటారు, వారు అనుభవ సామర్థ్యాలతో నిండి ఉంటారు, ఈ ప్రక్రియలో వారు అనేక విలువలను అలవరచుకుంటారు, నైపుణ్యాలను నేర్చుకుంటారు, జీవిత విలువను తెలుసుకుంటారు మరియు ఇతరులకు మార్గనిర్దేశం చేసే దాతృత్వాన్ని పొందుతారు.


వ్యాసకర్త / జె సి ఐ వి సంఘం ప్రధాన కార్యదర్శి
కోట దామోదర్
మొబైల్ : 9391480475


7, జూన్ 2023, బుధవారం

గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి,

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం - తెలంగాణ 


గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి, 

జౌళి శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా.


విషయం: ఇతర వృత్తి పని వారితో పాటు చేనేత పని వారికి కూడా లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయగలరని విజ్ఞప్తి.

తెలంగాణలో వివిధ కుల వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వృత్తి పనివారి జీవన ప్రమాణాల పెంపు కోసం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రేవు గారి ఆలోచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన వృత్తి పని వారికి పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం అభినందనీయం. 

మన దేశంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. ఎన్నో  వ్యయప్రయాసలకోర్చి లాభసాటి కాకపోయినప్పటికీ, తరతరాలుగా మగ్గాలనే నమ్ముకుని తమ కుల వృత్తిని ఎంతో  నిబద్ధతతో నిర్వహిస్తున్న చేనేత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాకపోవడం శోచనీయం. చేనేత కళాకారులు అత్యధికంగా ఉండే సిరిసిల్ల నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మీకు వారి వెతల గురించి వివరించడమంటే “మేనమామ కు అమ్మమ్మ గురించి చెప్పడం” లాంటిదే. 

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని అందించిన నేతన్నల పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సినీ గేయ రచయిత “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా - చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు” అని వాపోయారు. దురదృష్టవశాత్తూ నేతన్నల పరిస్థితి నేటికీ ఏమాత్రం భిన్నంగా లేదన్న విషయం మీకు తెలియంది కాదు.    మానవాళికి వస్త్రాన్ని అందించిన రెక్కాడితే కానీ డొక్కాడని నేతన్నల బతుకు కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేత జీవితం, అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను ఎంతో నైపుణ్యంతో నేసిన చేనేత కళాకారుల జీవితాలు కన్నీళ్ల కలబోత అయ్యింది. ఈ రంగంలో కాలానుగుణంగా యాంత్రీకరణతో పాటు పెను  మార్పులు వస్తున్నా చేనేత కార్మికుల ఆకలి తీరడం లేదు. భారత దేశంలోనే అత్యధిక ఓటర్లుగా ఉన్న పద్మశాలీలకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందని ద్రాక్షగా మిగలడం బాధాకరమైన విషయం. 

సహృదయులు మరియు మానవతకు మారు పేరైన మీరు ఆకలితో అలమటిస్తున్న చేనేతల కుటుంబాలకు సానుభూతితో ఇతర కుల వృత్తి పని వారితో సమానంగా గుర్తించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్ధిక సహాయం వర్తింపచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉండి వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి, వంటి నిండా బట్ట కల్పించాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

భవదీయ, 

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475




22, మే 2023, సోమవారం

శంకర్ గౌడ “MBBS”

శంకర్ గౌడ “MBBS”

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, వైద్యులు మనకు పునర్జన్మనిస్తారు, అందుకే "వైద్యో నారాయణ హరి" అని అంటారు. వైద్యులు దేవుడితో సమానమని అర్ధం.

ఈరోజుల్లో పేదవాడికి జబ్బు వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. 
పూర్వకాలంలో రోగాలు వస్తే సరైన వైద్యం అందుబాటులో లేక భయపడే వారు కానీ నేడు అన్ని రోగాలకు వైద్య సదుపాయాలున్నప్పటికీ పేదవాడు మాత్రం రోగాలకు అయ్యే ఖర్చుని చూసి భయపడుతున్నారు.  అతి చిన్న రోగానికి కూడా లక్షలలో ఖర్చవుతుండటం మన నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. వైద్యాన్ని వ్యాపారంగా చూడడమే అందుకు కారణం. కొందరు వైద్యాన్ని వ్యాపారంగా భావిస్తుంటే మరికొందరు మాత్రం వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజానికి మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో ఎంతో మందికి సేవలందిస్తూ స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తూ ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వైద్యుడు  "డాక్టర్ శంకర్ గౌడ"  కేవలం 5 రూపాయలకే వైద్యం అందిస్తూ నిరుపేదల పాలిట దేవుడయ్యారు.

వ్యాపార దృక్పథంతో పనిచేసే వైద్యులను చూసి అసహ్యించుకునే నేటి కాలంలో, డాక్టర్ శంకర్ గౌడ లాంటి వైద్యులను చూస్తుంటే ఆశ్చర్యం కలుగకమానదు.

కర్ణాటక రాష్ట్రం మాండ్యా లోని శివల్లికి చెందిన డాక్టర్ శంకర్ గౌడ ఒక నిరుపేద రైతు కుటుంబానికి చెందినవారు. కుటుంబ పోషణకోసం తన తండ్రి పడే కష్టాన్ని చూసి చిన్నతనంనుండే తండ్రి వ్యవసాయ పనికి సాయం చేసేవారు. మొదటినుండి చదువుల్లో ముందుండేవారు. తాను నివసిస్తున్న గ్రామానికి ఎలాంటి వైద్యసదుపాయాలు లేనందున గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన శంకర్ గౌడకు చిన్నప్పటినుండే డాక్టర్ కావాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో తాను పెరిగేకొద్దీ తన ఆలోచన డాక్టర్ చదువు వైపే ఉండేది. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుండి తన ఎం బి బి ఎస్ పూర్తిచేసిన తరువాత వెనిరియాలజీ మరియు డెర్మటాలజీ లో డిప్లొమా కూడా అభ్యసించారు.

5 రూపాయలకే వైద్యం చేయడానికి కారణం:

వందలాది మంది రోగులకు వైద్యం చేస్తూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మైసూరు మెడికల్ కాలేజీ రీసెర్చ్ అండ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కె గోవింద సేవ మరియు అంకితభావంతో డాక్టర్ గౌడ స్ఫూర్తి పొందారు. డాక్టర్ శంకర్ గౌడ వైద్య సలహా కోసం డాక్టర్ గోవిందను సందర్శించిన సమయంలో అయన నిరుపేదలకు చేస్తున్న సేవలు డాక్టర్ శంకర్ గౌడ ను ఎంతగానో ఆకర్శించాయి. అంతేకాకుండా డాక్టర్ కె గోవింద నుండి  ప్రేరణ పొందిన శంకర్ గౌడ ఎం బి బి ఎస్ పూర్తి చేసిన తర్వాత తన విద్యను తన గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఒక విన్నూతమైన ఆలోచనే నిరుపేదలకు 5 రూపాయల వైద్యం చేయడానికి బీజంవేసింది.

ప్రజా సేవకుడు "డాక్టర్ శంకర్ గౌడ":

వైద్య సదుపాయాలు లేని తన గ్రామంలో పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో 5 రూపాయలకే వైద్యం అందించడం గొప్ప విషయం. అతికొద్ది మందితో వైద్యం ప్రారంభించి నేడు కొన్ని వేల మందికి 5 రూపాయలకే వైద్యసేవలందించడం అభినందనీయం. 5 రూపాయల చికిత్సతో పాటు, డాక్టర్ గౌడ తన రోగులకు నాణ్యమైన మరియు సరసమైన మందులను సూచించేవారు. అంతేకాకుండా తన హాస్పిటల్ ఖరీదైన బంగ్లాలో కాకుండా చిన్న క్లినిక్ లోనే చికిత్స అందిస్తుంటారు. కొన్ని సందర్భాలలో వీధుల్లో కూడా వైద్య సేవలందిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా వైద్యవృత్తిలో సేవలందిస్తున్న ఆయనకు సొంత వాహనం కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యం. ప్రతిరోజూ అతను తన గ్రామం నుండి మాండ్య సిటీ (క్లినిక్)కి ప్రజా రవాణాలో వెళ్తాడు. డాక్టర్ గౌడకు ఇప్పటికీ ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు మరియు ఇంటర్నెట్ సదుపాయం లేదు. అయితే, ఆయనకు వ్యాధులపై అత్యాధునిక పరిజ్ఞానం ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్లో నయంకాని చర్మ వ్యాధులను అతి తక్కువ ఖర్చుతో నయం చేయగలిగే నైపుణ్యం కలిగిఉన్నాడు. 38 ఏళ్ల అనుభవం ఉన్న చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ గౌడ చికిత్సకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దేశం నలుమూలలనుండి అనేక మంది ప్రజలు సందర్శిస్తున్నారు.

ప్రతిభావంతమైన సేవలకు అనేక అవార్డులు:

డాక్టర్ గౌడ శ్లాఘనీయమైన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2022' ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించింది. అవార్డు అందుకున్న సందర్బంగా డాక్టర్ గౌడను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రత్యేకంగా అభినందించారు. మానవతా భావజాలం ఉన్న గౌడ లాంటి వైద్యులు ప్రతి గ్రామంలో, దేశంలో అవసరమని, గ్రామీణ ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని సూచించారు.

డాక్టర్ గౌడ రాజకీయ ప్రస్థానం:

మాండ్య పార్లమెంటు స్థానానికి డాక్టర్ గౌడ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజాసేవకుడిగా, ప్రజా నాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా గౌడ తన వైద్య సేవలను కొనసాగించడం ఆయన లోని మానవత్వానికి నిదర్శనం. ఇప్పటికి 5 రూపాయలతో కుల, మత, మతాలకు అతీతంగా లక్షలాది మందికి వైద్యం చేస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. గౌడ లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగితే కొంతైనా అవినీతి నిర్ములన జరుగుతుందని, ఈ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని భావిస్తూ గౌడ లాంటి వ్యక్తులు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను.

గౌడలాంటి డాక్టర్లు ఈ దేశానికి ఎంతో అవసరం:

నిరంతరం నిరాడంబరమైన సేవలందిస్తున్న నిస్వార్ధ ప్రజా సేవకుడు డాక్టర్ శంకర్ గౌడ.

గౌడ లాంటి మానవత్వం ఉన్న వైద్యులు ఈ దేశంలోనే కాదు ప్రతి పల్లెకు అవసరం. అంతేకాకుండా, ప్రతి వైద్య విద్యార్థికి కనీసం 6 నెలల పాటు గ్రామాల్లో ఉచిత వైద్యం అందించే ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వైద్య విద్యార్థులకు అవగాహన ఏర్పడి కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

వ్యాసకర్త, JCIV ప్రధాన కార్యదర్శి 
కోట దామోదర్
మొబైల్ 9391480475




20, ఏప్రిల్ 2023, గురువారం

మే డే

దేశ శ్రేయస్సు కోసం ఎండనకా, వాననకా, కాలాలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికులు ఈ దేశ ప్రగతికి మూలాలు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశం ప్రగతిశీల మార్గంలో నడవబోదనడంలో అతిశయోక్తి లేదు..

గుండు పిన్ను నుంచి విమానం వరకు ప్రతి వస్తువు తయారీకి శ్రామికుల శ్రమ ఎంతో అవసరం. 

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికులే, శ్రమనే నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికులే. దేశ భవిష్యత్తు నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది.

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా అమెరికా మరియు ఐరోపాలో అనేక పెద్ద పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పని చేయడానికి అసంఖ్యాక కార్మికులు అవసరం. దీంతో ఉత్పత్తి రంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను విచక్షణారహితంగా దోపిడీ చేయడం ప్రారంభించారు. కార్మికులతో రోజుకు కనీసం 16 గంటల నుంచి 20 గంటల వరకు పని చేయించేవారు. కర్మాగారాలకు సరైన వెంటిలేషన్ మరియు లైటింగ్ వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. అందువల్ల కొందరు కార్మికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు తమ శ్రమను మరచిపోవడానికి పాటలు పాడినా లేదా విశ్రాంతి తీసుకున్న యజమానులు కోపోద్రిక్తులైయేవారు. ఈ క్రూరమైన చర్యల నేపథ్యంలో కార్మికుల్లో క్రమంగా తిరుగుబాటు మొదలైంది. కార్మిక సంఘాల ఏర్పాటు ప్రారంభమైంది. 1764-1800 మధ్యకాలంలో, బ్రిటన్‌లో మరియు తరువాత ఐరోపాలో ట్రేడ్ యూనియన్లు ఏర్పడ్డాయి. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ప్రేరణ పొందిన కార్మికులు మెకానిక్స్ యూనియన్ పేరుతో మొదటి ట్రేడ్ యూనియన్‌ను స్థాపించారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్‌ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు అన్ని దేశాల ప్రాంతాలకు వ్యాపించాయి. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 18 గంటల పని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఎందరో కార్మికులు మరణించి తమ హక్కులు సాధించుకున్నారు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరవీరుల స్పూర్తికి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే.

నేటికీ ఫలించని కార్మిక హక్కులు:

దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువును ఉత్పత్తి చేస్తూ వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. నేటికీ శ్రామికశక్తి అసంఘటిత రంగంలోనే ఉండడం మరింత బాధాకరం. కార్మికుల చట్టాల్లో ఎన్నో మార్పులు వస్తున్నా వారి వేతనాలు, జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చట్టాలు అమలవుతున్న, ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. తత్ఫలితంగా కార్మికుల శ్రమకి తగ్గ వేతనం ఇవ్వకుండా, పనిలో రక్షణలు లేకుండా, సమ్మె హక్కులు లేకుండా, కనీసం వారు ఆరోగ్యంగా ఉండడానికి కనీసం భద్రత కల్పించకుండా వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. 

చట్టాలు మారిన కార్మికుల కష్టాలు తీరలేదు:

బ్రిటిష్‌ పాలనలోని అమానవీయ కార్మిక విధానాలను, బానిస చట్టాలను స్వాతంత్య్రానంతరం అనేక మంది కార్మికులు పోరాడి కార్మిక సంక్షేమమే ధ్యేయంగా 44 కార్మిక చట్టాలను రూపొందించుకున్నారు. ఈ 44 కార్మిక చట్టాలవల్ల కొంతమేరకు కార్మికులకు లాభం చేకూరిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం 44 చట్టాలు రద్దు చేస్తూ కొత్త 4 లేబర్‌ కోడ్‌లు రూపొందించింది. ఈ 4 చట్టాల వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోయే అవకాశముందని మరియు జీతాలతో వ్యత్యాసముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

4 లేబర్‌ కోడ్‌లు:

  • పారిశ్రామిక సంబంధాల కోడ్‌.
  • వేతనాల కోడ్‌.
  • సామాజిక భద్రత కోడ్‌.
  • భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌.

పారిశ్రామిక సంబంధాల కోడ్‌:

పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక హక్కులను దెబ్బతీస్తుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల డిమాండ్లపై సమ్మె నోటీసు ఇవ్వడానికి కేంద్రం ఒకప్పుడున్న  14 రోజుల గడువును 60 రోజులకు పొడిగించింది. సమ్మెకు వ్యతిరేకంగా న్యాయస్థానికి  వెళ్లేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. దీంతో న్యాయస్థానం లో కేసు ఉన్నంత వరకు కార్మికులు సమ్మెకు దిగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలను పరిశ్రమలుగా పరిగణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 20కి పెంచగా చిన్న పరిశ్రమల కార్మికులు చట్టబద్ధమైన ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమ పథకాల నుండి మినహాయించబడే ప్రమాదం ఉంది. పాత చట్టం ప్రకారం, యాజమాన్యం యూనియన్‌లను గుర్తించే నిబంధన లేదు. ఏ యూనియన్ అయినా కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నట్లైయితేనే యూనియన్‌గా పరిగణించబడుతుంది. 

వేతనాల కోడ్‌:

వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగుల వేతన విధానంలో పలు మార్పు సంతరించుకున్నాయి. తత్పలితంగా కార్మికుడి టేక్ హోమ్ పే తగ్గుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోడ్‌ చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక జీతం (CTC) కంపెనీ ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ వేతనాన్ని తగ్గించి పై నుంచి ఎక్కువ అలవెన్సులు ఇస్తూ కంపెనీపై భారాన్ని తగ్గించుకుంటున్నాయి. దీంతో ఉద్యోగికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. బేసిక్ వేతనం తగ్గడంవల్ల   

కార్మికుడి రిటైర్మెంట్ తరువాత జీవన ఉపాధికి చెల్లించబడే  గ్రాట్యుటీ, పీఎఫ్‌, పెన్షన్ లు భారీగా తగ్గే అవకాశముంది. ఈ వేతనాల కోడ్ వల్ల కార్మికుడికి తీవ్ర నష్టమే తప్ప లాభం లేదు.

ఎందరో త్యాగాల ఫలితంగా  కొట్లాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి స్వస్తి చెప్తూ యాజమాన్యం కోరితే 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాలని, అం దుకు ఎలాంటి ఓటీ (ఓవర్‌ టైమ్‌) వేతనాలను చెల్లించాల్సిన అవసరం లేదని చట్టం పేర్కొన్నది.

అతి తక్కువ పెన్షన్ తో రిటైర్డ్ కార్మికుల జీవితం:

ప్రవేట్ రంగంలో 40 ఏళ్లు పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను 2500 లోపే, అది కూడా 30000 జీతంతో పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటం వల్ల మనిషి జీవన వ్యయం పెరిగింది. పెన్షన్ మాత్రం పెరగటంలేదు. 2500 తో రిటైర్డ్ కార్మికులు ఏ విదంగా జీవనం కొనసాగించాలి?.ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అతనికి సగం జీతం పెన్షన్ వస్తుంది. ఈ దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రైవేట్ కార్మికుడికి మాత్రం 2500 పింఛన్. దేశంలోని ప్రజాప్రతినిధులు వారి జీతాలు మరియు పెన్షన్స్ పెంచుకుంటున్నారు తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటు రంగంలోని కార్మికులకు సరైన పింఛను, కనీస వేతన పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనావుంది. 

కరోనా కారణంగా పెరగని కార్మికుల జీతాలు:

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు మానవాళిని విపత్తులోకి నెట్టింది. ఈ మహమ్మారిని నియంత్రించే ప్రయత్నంలో మన దేశంతో పాటు అనేక దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాల్లో పారిశ్రామిక రంగం ఒకటి. పరిశ్రమలకు ఐటీ సంస్థల లాగా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించే వెసులుబాటు ఉండదు. దీంతో ఉత్పత్తితో పాటు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా కారణంగా ఇప్పటికి కోలుకొని పరిశ్రమలున్నాయనే చెప్పొచ్చు. కరోనా ప్రభావం వల్ల నష్టాలలో ఉన్న పరిశ్రమలు కార్మికులకు ఏటా జీతాలు పెంచలేమని కొన్ని పరిశ్రమలు వెల్లడించాయి. అయితే కొన్ని లాభదాయక పరిశ్రమలు కూడా కరోనా ప్రభావం సాకుతో జీతాలు పెంచలేమని చెబుతూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కరోనా ప్రభావంతో పరిశ్రమలు కాకుండా కార్మికులు ఎక్కువగా నష్టపోయారన్నది నమ్మలేని నిజం. 

ఉద్యోగ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి:

పారిశ్రామిక రంగాలలో పని చేసే కార్మికులకు ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తమకు వచ్చే జీతం తక్కువగా ఉండడంతో పిల్లలను చదివించేందుకు, కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనుకోకుండా అనారోగ్య సమస్యలు ఎదురైతే కుటుంబ సభ్యులకు ఈఎస్ ఐ దిక్కు. వేరే మార్గం లేదు. ఉద్యోగం ఉన్నంత కాలం ఇఎస్‌ఐపైనే ఆధారపడుతున్నారు. ఇక రిటైర్మెంట్ తర్వాత కార్మికుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ అన్నీ తక్కువ, కార్మికుడు ఎలా బతకగలడు? కావున ప్రభుత్వం కార్మికుల గురించి ఆలోచించి పదవీ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475











 






9, ఏప్రిల్ 2023, ఆదివారం

చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు.

చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు. 


ఏ సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యూహాలు, ఆచరణ, నాయకత్వం మరియు సామాజిక అంగీకారాన్ని నిర్వహించే 

తత్వశాస్త్ర (తాత్విక సిద్ధాంతం) సూత్రాలను శాస్త్రీయ పద్ధతుల్లో వివరించిన గొప్ప ఉద్యమ నాయకుడు 'డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్'.


డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అసమాన విద్యావేత్త, దళిత హక్కుల పోరాట యోధుడు, మేధావి, దార్శనికుడు, గొప్ప దేశభక్తుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, పరిపాలన ప్రవీణుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రచయిత, భారత రత్న, న్యాయ నిపుణుడు, బహుభాషావేత్త, సామాజిక అసమానతలను రూపుమాపడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. అంటరానితనం పై, అగ్రకుల దురహంకారం పై గొంతెత్తిన స్వరం. బడుగు బలహీన  వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు.


డా.బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం.


 ఓటు హక్కు ప్రదాత:


ప్రజాస్వామ్య పౌరసత్వానికి ఓటు హక్కు అత్యంత ప్రాథమిక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు సార్వత్రిక ఓటు హక్కును పొందలేదు.  సామాన్యులు తమపై ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారని ఉన్నత వర్గాలు భావించాయి. సార్వత్రిక ఓటు హక్కుకు అడ్డంకులు ప్రపంచంలోని అనేక దేశాల్లో, మహిళలు, ఆస్తి లేనివారు మరియు జాతి మైనారిటీలకు ఓటు హక్కు నిరాకరించబడింది. చరిత్రకారుడు అలెగ్జాండర్ KSR "ఓటు హక్కు" పుస్తకంలో పేర్కొన్న ప్రకారం, అమెరికాలో కూడా సార్వత్రిక ఓటు హక్కు అనేక ఉద్యమాల తర్వాత కూడా ప్రజలకు చేరలేదు.
అన్ని దేశాల్లాగే భారతదేశంలో కూడా మొదటగా అందరికీ ఓటు హక్కు లభించలేదు. పన్ను చెల్లించే వారికి మరియు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) సహా కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది.  ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన అంబేద్కర్ 1919లో సౌత్ బోరో కమిటీకి తన పిటిషన్‌లో "ప్రాతినిధ్య హక్కు మరియు రాజ్యాంగ హోదా హక్కు పౌర హక్కులలో అత్యంత ముఖ్యమైనవి పౌరసత్వం మరియు రాజకీయాల్లో సభ్యత్వం కోసం ఓటు హక్కు అని పేర్కొన్నాడు. ఓటు హక్కు వల్ల బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ చైతన్యాన్ని తెస్తుందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ జీవితాల జోలికి వెళ్లని వారి విముక్తికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంబేద్కర్ పేర్కొన్న ఈ రెండు అంశాలు భారత రాజ్యాంగం ఇచ్చిన సార్వత్రిక ఓటు హక్కుకు వెన్నెముక. అంబేద్కర్ 1930లో మరియు తరువాత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్‌ను లేవనెత్తడానికి తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించారు. ఓటు హక్కు అనేది స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి అవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేద్కర్ సృష్టించగలిగారు. 
నిరక్షరాస్యత ఆధారంగా ఓటు హక్కు కల్పించడాన్ని అంబేద్కర్ రాజ్యాంగ సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అగ్రనేతల సహాయంతో అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ప్రవేశపెట్టడం వల్ల  వర్గ, లింగ, కుల, కులాలకు అతీతంగా ప్రజలందరికీ ఓటు హక్కు లభిస్తుంది. ఈరోజు మనం ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నకుంటున్నామంటే ఇది అంబేద్కర్ కృషి ఫలితం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఓటు ప్రాముఖ్యతను గుర్తించి దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం మరియు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటే ఆధారం. ఓటును డబ్బుకు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనే రెండక్షరాలు దేశ భవిష్యత్తుకి పునాది.

 పంచాయతీరాజ్ వ్యవస్థ :


భారత గణతంత్ర 70 ఏళ్ల సుదీర్ఘ పాలన లో పంచాయత్ రాజ్ వ్యవస్థ గొప్ప విజయం. ఢిల్లీ పాలన ను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్ లక్ష్యంతో ప్రారంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థ అనుకున్న లక్ష్యాలను చాలా వరకు సాధించింది. జనాభాలో సగం మంది మహిళలు మరియు ప్రస్తుతం 50% స్థానిక సంస్థలను పరిపాలిస్తున్నారు. గ్రామానికి దూరంగా..వివక్షతో జీవించే దళితులు కూడా అధికారంలో భాగమయ్యారు. ఇలా ఎన్నో విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో వాటన్నింటినీ పరిష్కరించ గలిగితే భారత్ ప్రపంచంలోనే ఆదర్శవంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుందనడంలో సందేహమే లేదు. ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయి వరకు విస్తరింప చేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీ లను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.


 అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం:

1927లో మహద్‌లో అంటరానితనానికి వ్యతిరేకంగా మంచినీరు, దేవాలయాల ప్రవేశం కోసం పెద్ద ఎత్తున మంచినీటి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. 1927 డిసెంబర్ 25న తన వేలాది మంది అనుచరులతో కలిసి దేశంలో కుల వ్యవస్థకు పునాదులు వేసిన సామాజిక అసమానతలకు మూలమైన మనుస్మృతిని తగులబెట్టాడు. 1930లో 15,000 మంది వాలంటీర్ల సహాయంతో మిలటరీ బ్యాండ్ స్కౌట్ బృందం కాలారామ్ ఆలయ ఉద్యమాన్ని ప్రారంభించగా, మహిళలంతా క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని చేసి తొలిసారిగా దేవుడిని దర్శించుకున్నారు. ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని చట్టపరంగా పూర్తిగా నిషేధించారు.

 భారత రాజ్యాంగ నిర్మాత:

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మనం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అనేక సాయుధ పోరాటాలు మరియు అహింసా పద్ధతిలో అనేక ఇతర ఉద్యమాల తరువాత, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆగష్టు 14, 1947 అర్ధరాత్రి, భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. అప్పుడు మనకు సమగ్రమైన, లిఖితపూర్వకమైన రాజ్యాంగం లేనందున, ఏ మార్గాన్ని అనుసరించాలనేది ప్రశ్నగా మారింది. అయితే నియంతృత్వమైనా, సైనిక పరిపాలన, సార్వభౌమాధికారమైనా, రాచరికమైనా.. స్వపరిపాలనపై అనేక ప్రశ్నలు తలెత్తాయి, వీటన్నింటికీ సమాధానమే భారత రాజ్యాంగం. జనవరి 26, 1950 న సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.     

అసమానతలు, అవమానాలు మరియు అన్యాయాలను ఎదుర్కొంటున్న అట్టడుగు కులాలు మరియు అణగారిన వర్గాల సామాజిక గౌరవం మరియు భద్రతకు ప్రధాన ప్రాతిపదిక అయిన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ క్రియాశీల పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ఆయన, సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దుర్భర జీవితం గడిపిన వారికి అన్ని రకాల రక్షణ, భద్రత కల్పించారు.

కుటుంబ నేపథ్యం:

అంబేద్కర్ మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలోని అంబవాడే గ్రామంలో భీమాబాయి మరియు రాంజీ మలోజీ సక్వాల్ దంపతులకు 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అంబేద్కర్ తండ్రి భారత సైన్యంలో అధికారి. వారి ఇంటిపేరు "అంబవడేకర్". బ్రాహ్మణుడైన అతని గురువు మహదేవ్ అంబేద్కర్ అతనిపై అభిమానంతో అతని ఇంటి పేరును 'అంబవడేకర్' నుండి అతని ఇంటి పేరు అంబేద్కర్ గా మార్చారు ఆ పేరే ఆయనకు స్థిరనామమయింది.

 విద్యాబ్యాసం మరియు ఎదుర్కున్న సమస్యలు:

సమాజంలో నిమ్న కులం గా భావించే మహర్ (దళిత) కులంలో జన్మించిన అంబేద్కర్ బాల్యంలో అనేక అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలాన  కూర్చోబెట్టేవారు. మంచినీళ్లు తాగే సందర్భంలో కూడా అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో తనను ఇబ్బంది పెట్టిన సమాజంలో అందరికన్నా గొప్ప మేధావిగా, విద్యావంతునిగా ఎదగాలనే పట్టుదలతో రాత్రీ పగలు తేడాలేకుండా నిరంతరం చదువులోనే జీవితాన్ని గడిపిన అంబేద్కర్. తండ్రి రామ్‌జీ పదవీ విరమణ తరువాత   అంబేద్కర్ కుటుంబం సతారాకు వెళ్లి అక్కడ నివాసం ఉంది. అయితే కొంతకాలానికి తల్లి మరణించడంతో అంబేద్కర్ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది.

  •  1907లో ముంబైలోని ఎల్‌ఫన్‌స్టోన్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యారు.
  • 1908లో అదే కాలేజీలో చేరి కాలేజీ విద్యను పూర్తిచేశారు.
  • 1912లో బాంబే యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు.
  • 1913 లో బరోడా మహారాజ్ అందించిన సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. అదే సమయంలో భారతదేశం వాణిజ్యం, భారతదేశంలోని మతాలు, పుట్టుపూర్వతరాలు అనే పరిశోధన వ్యాసాలు వ్రాసారు అంతేకాకుండా 'భారతదేశం జాతీయాదాయం చారిత్రక పరిశీలన' సిద్ధాంత గ్రంధం వ్రాసి పి. హెచ్. డి పట్టా పొందారు. ఆ తర్వాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అయ్యారు.
  • 1916లో లండన్ వెళ్లి ఎంఏ (నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ) పూర్తిచేయడమే కాకుండా ఎకానామిక్స్‌లో పీహెచ్‌డీ కూడా సంపాదించారు.
  • 1918లో ముంబైలోని సైదన్‌హమ్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో పొలిటికల్ ఎకానమీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
  • 1921లో మాస్టర్ డిగ్రీని (ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్).
  • 1923లో ఎకనామిక్స్‌లో డీఎస్సీ పూర్తిచేశారు. ఆ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన అంబేద్కర్ బరోడా సంస్థానం లో మిలిటరీ సెక్రటరీగా నియామకమయ్యారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. చివరకు కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేశాడు.
  • 1952  లో ఎల్‌ఎల్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, గౌరవపట్టా) పొందారు.
  • 1953  లో డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, గౌరవపట్టా) పొందారు.

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా.. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీడిత వర్గాల విముక్తి, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475




1, ఏప్రిల్ 2023, శనివారం

అసమాన యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా"

అసమాన యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా"

"మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేలా ఉండాలి" అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే. 

ప్రతి ఒక్కరి పుట్టుక సాధారణమే కానీ కొందరి మరణం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది, చరిత్ర సృష్టిస్తుంది, వారి జ్ఞాపకాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

ఆనాటి యోధుల త్యాగాల వల్ల ఈ రోజు భారతదేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.

1971 భారత్‌ - పాక్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా" స్ఫూర్తివంతమైన విజయగాథను ఒకసారి మననం చేసుకుని అతని దేశభక్తికి నివాళులర్పిద్దాం. 

"కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా" ​​1926 మే 15వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించారు. అతని తండ్రి, శ్రీ తేజ్ నారాయణ్ ముల్లా, హైకోర్టు న్యాయమూర్తి మరియు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతని కుటుంబ సభ్యులందరూ న్యాయవాద వృత్తికి చెందిన వారు. మొదట్లో మహేంద్ర నాథ్ ముల్లా కూడా న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉండేది, అయితే అతను పెద్దయ్యాక అతని ఆసక్తి సాయుధ దళాల వైపు మళ్ళింది. 

20 సంవత్సరాల వయస్సులో, అతను ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత జనవరి 1946లో రాయల్ ఇండియన్ నేవీలో క్యాడెట్‌గా చేరాడు. అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లో శిక్షణ పొందిన తరువాత తిరిగి మే 1, 1948 న రాయల్ ఇండియన్ నేవీలో నియమించబడ్డాడు. భారత నావికాదళంలో ఉన్నతాధికారులు ముల్లా ప్రతిభను గుర్తించి 16 సెప్టెంబర్ 1958న లెఫ్టినెంట్ కమాండర్‌గా పదోన్నతి కల్పించారు. ఆపై ఏప్రిల్ 1961లో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) వెల్లింగ్‌టన్‌కు ఎంపికయ్యారు. అతను 1964 జూన్ 30న కమాండర్ స్థాయి పదోన్నతి పొందారు. ఐఎన్‌ఎస్‌ కృష్ణాలో మూడేళ్లపాటు సేవలందించారు. కెప్టెన్ ముల్లా తన సేవా జీవితంలో నావికాదళ ప్రధాన కార్యాలయంలో ఆఫీసర్-ఇన్-చార్జ్ ఆఫ్ నేవల్ నియామకాలు, మూడు సంవత్సరాల పాటు లండన్‌లోని భారత హైకమిషనర్‌కు డిప్యూటీ నావల్ అడ్వైజర్ మరియు బొంబాయిలోని నేవల్ షోర్ స్థాపన ఐఎన్‌ఎస్ ఆంగ్రే యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంటి అనేక ముఖ్యమైన నియామకాలను నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ప్లాన్స్‌లోని నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో పదవీకాలం పాటు డిస్ట్రాయర్ INS రాణాకు కమాండింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడు. ఆ తరువాత  డిఫెన్స్ కౌన్సెల్‌గా నియమించబడ్డాడు. ఫిబ్రవరి 1971లో, అతను INS ఖుక్రీలో చేరి  కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 

1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో కెప్టెన్ ముల్లా INS ఖుక్రీ (F-149), INS కుతార్ (F-146) మరియు INS కిర్పాన్ (F-144) లకు ఫ్లోటిల్లా కమాండర్‌గా ఉన్నారు. ఉత్తర అరేబియా సముద్రంలో శత్రు జలాంతర్గాములను వేటాడడం మరియు తటస్థీకరించడం కొరకు ఈ మూడు జలాంతర్గాములను ఉపయోగించేవారు. 03 డిసెంబర్ 1971న డయ్యూ నౌకాశ్రయానికి సమీపంలో ఇండియన్ నేవల్ రేడియో డిటెక్షన్ పరికరాలు ఒక శత్రు జలాంతర్గామిని గుర్తించాయి. అదేసమయంలో INS కుతార్‌లో ఒక సాంకేతిక సమస్య ఏర్పడటంవలన డిసెంబర్ 05న దానిని తిరిగి నౌకాశ్రయానికి తీసుకెళ్లారు. ఆ తరువాత శత్రు జలాంతర్గామి ముప్పును ఎదుర్కొనడానికి  INS కిర్పాన్‌తో పాటు INS ఖుక్రీని పంపించారు. దురదృష్టవశాత్తూ డిసెంబర్ 9 వ తేదీ సాయంత్రం 20 :46 సమయంలో  టార్పెడోలను ప్రయోగించి పాకిస్థానీ జలాంతర్గామి PNS హంగూర్ INS ఖుక్రీ ని బలంగా ఢీ కొట్టడం వల్ల ఖుక్రీ లోపల రెండు భారీ పేలుళ్లు సంభవించాయి అందువల్ల వెనుకభాగం దగ్ధమైంది కెప్టెన్ ముల్లా నిమిషాల వ్యవధిలో పరిస్థితిని పరిశీలించి, ఒడనుండి లైఫ్ బోట్‌లు, తెప్పలు మరియు బోయ్‌లను సముద్రంలోకి విసిరేయమని అతను తన సెకండ్-ఇన్-కమాండ్‌ని ఆదేశించాడు,

INS ఖుక్రీ 176 మంది నావికులు మరియు 18 మంది అధికారులను మరియు ఓడ కెప్టెన్‌ను అరేబియా సముద్రంలో కొంత దూరం తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో మునిగిపోయింది. కానీ కెప్టెన్ ముల్లా అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు, అతను ప్రాణాపాయ స్థితిలో తన డ్యూటీ ని మరువకుండా వీలైనంత మందిని రక్షించడంలో గొప్ప సాహసం చేశారు. మొత్తం 67 మందిని రక్షించగలిగారు, ఇందులో 05 మంది అధికారులు, 01 మిడ్‌షిప్‌మ్యాన్ మరియు 61 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సంక్షోభ సమయంలో కెప్టెన్ ముల్లా యొక్క ధైర్యసాహసాలు నేవీ మరియు సాయుధ బలగాల మనోధైర్యాన్ని పెంచింది. 

కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లాకు భారత నౌకాదళం యొక్క మొదటి మరియు దేశం యొక్క రెండవ అత్యున్నత "శౌర్య పురస్కారం" లభించింది, 

అతని అద్భుతమైన ధైర్యం, నాయకత్వం మరియు అత్యున్నత త్యాగం కోసం "మహా వీర్ చక్ర". లభించింది. అంతేకాకుండా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను భారత నౌకాదళం డయ్యూలో స్మారక చిహ్నం తో సత్కరించింది.

 ముంబైలోని కొలాబాలోని నేవీ నగర్‌లో ఉన్న "కెప్టెన్ MN ముల్లా ఆడిటోరియం" అతని గౌరవార్ధం పేరు పెట్టబడింది.

28 జనవరి 2000న, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, కెప్టెన్ ఎంఎన్ ముల్లాకు నివాళులు అర్పిస్తూ ఇండియా పోస్ట్ విడుదల చేసిన స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 

ఆయన త్యాగం మరువలేనిది :

ఓడ మునిగిన క్షణాలలో, కెప్టెన్ ముల్లా సులభంగా తనను తాను రక్షించుకోగలరు. కానీ తోటి సైనికులను కాపాడుకోవాలనే ఆలోచనతో దైర్యంగా తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా 67 మంది ప్రాణాలు రక్షించడమనేది అసాధారణమైన విషయం. కెప్టెన్ ముల్లా ధైర్యసాహసాలకు దేశంలోని ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిందే. 

ఈ వీరోచిత చర్యలో, కెప్టెన్ ముల్లా మనకు ఎలా జీవించాలో మాత్రమే కాకుండా, ఎలా చనిపోవాలి అనేది ఆయన మరణంతో మనకు తెలియజేయడం శోచనీయం.    

కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా లాంటి సైనికులు మరణించడం ఈ దేశానికి తీరని లోటు. ఈ వీర యోధుని త్యాగాన్ని దేశం కృతజ్ఞతతో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475






అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి… ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి… కానీ… అల ఎంత ఉప్పొంగినా...