27, జులై 2025, ఆదివారం

చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

 చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

26, జులై 2025, శనివారం

సంకల్ప బలం

సంకల్ప బలం:

ఒక్కప్పుడు నా దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉండుంటే కలెక్టర్ అయ్యేవాడిని లేదా మంచి ఉద్యోగం చేసేవాడిని. పేదరికం, ఆటంకాల వల్లే ఉన్నత ఉద్యోగాలు సాదించలేకపోయాను అంటూ చాలామంది అంటుంటారు. కానీ నిజానికి వారికి లేనివి అవేవీ కావు, ఒక్క దృఢ సంకల్పం మాత్రమే. దృఢ సంకల్పం లేనప్పుడు ఏదైనా సాధించడం అసాధ్యమే. పట్టుదలతో ప్రయత్నం చేయలేనప్పుడు పరిస్థితులను నిందించడం సరికాదు. అందుకే సినారె గారు రాసిన కవిత్వం  గుర్తుకొస్తుంటుంది "చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు.. కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు" అని. అవును నిజమే కదా! చదవచేతగానప్పుడు పేదరికాన్ని, డబ్బును నిందించడం ఎందుకు? సంకల్పబలం లేనివాడు సమస్యలంటూ నిందించడం ఎందుకు? లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష ఉంటే విజయం కచ్చితంగా మనదే అవుతుంది. అందుకు తాజా తార్కాణం ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ రోణంకి, ఐఏఎస్  విజయగాథ. 

గోపాలకృష్ణ రోణంకి చదివింది ఎక్కడో పట్టణంలోనో లేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనో కాదు. ఆయన చదివింది ఆంద్రప్రదేశ్ లోని పలాస మండలం పరసంబ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియం చదువు. అతని తల్లిదండ్రులు నిరుపేదలు, వారు వ్యవసాయం, కూలి పనులకెళ్లి జీవనం కొనసాగిస్తారు. అతన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించే స్థోమత లేనందున అతను ఎలాగోలా ప్రభుత్వ పాఠశాలలో చదివి  పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో ఫార్మసీ చదివి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా దూబచర్లలో రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేసి 2006లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే   విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఎస్సీ (ఎంపీసీ) పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ కావాలన్నది ఆయన కల. ఆ కల నెరవేరడం కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోరదీక్ష చేశారు. కల నెరవేరడం కోసం ప్రతి రోజు 8 గంటలకుపైగా ఎంతో దీక్షతో  చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదటగా ప్రయత్నించి విఫలమయ్యాడు అయినా సరే లక్ష్యం చేరేదాకా ప్రయత్నం ఆపకూడదనే సంకల్పంతో అవరోధాలు, ఆటంకాలను లెక్క చేయకుండా రెండోసారి కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే నిరాశ చెందకుండా లోపం ఎక్కడ ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు పరీక్షకు సిద్ధమయ్యేవాడు. అలా మూడో ప్రయత్నం కూడా విఫలమయ్యాడు. అయినప్పటికీ నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తాననే  నమ్మకంతో నాలుగోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. చాలామంది ఒకటి లేదా రెండు ప్రయత్నాలతో ఇక నావల్లకాదని ప్రయత్నించడం మానుకుంటారు. కానీ ఎవరైతే దృఢ సంకల్పముతో పోరాడుతారో వారికి కచ్చితంగా విజయం వరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంకల్పంతో సాధించిన విజయం అతన్నే కాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే అతను అందరిలా కాకుండా సివిల్స్ (మెయిన్స్)లో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని ఆయన యూపీఎస్సీ పరీక్షను తెలుగు భాషలో రాశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది వంద శాతం నిజం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తెలుగులో పర్సనాలిటీ టెస్ట్ రాసేందుకు యూపీఎస్సీ అనుమతించడం. 2016లో ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా మూడవ ర్యాంక్ సాధించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. తన గ్రామంలో కనీసం కరెంటు మరియు బస్సు సౌకర్యం లేకున్నా పట్టుదలతో చదివి అత్యంత కఠినమైన పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించడమనేది చాలా గొప్ప విషయం. ఏదైనా విజయం సాధించాలంటే ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొంటే గానీ సాధ్యపడదు. “డబ్బులు ఎవరికీ  ఊరికే రావు” అన్నట్లు మరి విజయం ఊరికేవస్తుందా, కష్టపడితేనే కదా! గోపాలకృష్ణ కూడా కష్టపడకుండా విజయం సాధించలేదు. అతను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన తల్లిదండ్రులు చిన్నవయసులోనే దళిత కులాంతర వివాహానికి పాల్పడిన కారణంగా 25 సంవత్సరాల పాటు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దీంతో వారి జీవితాల్లో ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ అందరూ అది సాధించలేరు. ఎందుకంటే విజయం అనేది ఎవరికీ ఊరికే రాదు కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ కొంత మంది ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే గెలుపు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన చేస్తారు కానీ ఆచరణలో పెట్టరు. అలాంటివారు ఎప్పుటికీ విజయం సాధించలేరు. గోపాల కృష్ణ లా లక్ష్యం పెట్టుకోవాలి మరియు ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 




13, జులై 2025, ఆదివారం

తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు

 తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు

12, జులై 2025, శనివారం

నిబంధనలు సామాన్యులకేనా?...

 నిబంధనలు సామాన్యులకేనా?...


ప్రభుత్వాలు ప్రవేశపెట్టే నిబంధనలు సామాన్యులకు, పేదలకేగాని ధనికులకు, పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు వర్తించవనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు వారు అన్నింటికీ అతీతులు. అందుకు తాజా తార్కాణం ఈ ఫొటోలో కనిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారి. 04 .06 .20025 ఉదయం హైదరాబాద్ లోని బోడుప్పల్ నుండి మాణిక్ చంద్ రోడ్ మార్గంలో వెళ్తున్న సందర్భంలో కనిపించిన దృశ్యం. హెల్మెంట్ లేకపోతే లేదేమో మరిచిపోయాడేమో అనుకోవచ్చు కానీ ఉన్న హెల్మెంట్ ఉండి ఉన్న హెల్మెంట్ ని బండికి తగిలించి నన్ను ఎవడు ఏమి చేస్తాడు అన్న చందంగా మరియు ఒక ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నించదగిన విషయం. ఒక సామాన్యుడు హెల్మెంట్ లేకుండా రోడ్ మీద వెళ్తే పట్టుకొని బలవంతంగా బండి తాళాలు లాక్కొని ఫైన్ వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాలు కోకొల్లలు అంతేకాదు మరికొందరైతే 50 - 100 రూపాయలకు ఆశపడి డబ్బులు తీసుకొని వదిలేసే అధికారులు కొంతమంది. సామాన్యుడు ఫైన్ కట్టనిపరిస్థితిలో బండి లాక్కొని నానా ఇబ్బందులకు గురిచేస్తారు తప్ప వదిలేసే పరిస్థితి చాల తక్కువ. అదే రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా అడిగే నాథుడు ఉండడు ఎందుకంటే సామాన్య ప్రజలకు భయమని కాదు సామాన్యుడిలో ఉండే సంస్కారం.  అంతేకాదు పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినా ఊరుకుంటారు. కాని సామాన్యుడు కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తారు. సామాన్యులపై పన్నుల భారం మోపుతారు. కాని సామాన్యులు చిన్న నిబంధన ఉల్లంఘించినా నానా రచ్చ చేస్తారు. మన దేశంలో పెద్దలు ఏం చేసినా చెల్లుతుంది. వారు పెట్టుకున్న నిబంధనలు వారే పాటించరు. వారు చేసే చట్టాలు సామాన్యులు అనుసరించడానికి తప్ప వారికి వర్తించవు.

పోలీస్ అధికారి బండి నడపడం తప్పు కాదుకానీ ఆయన హెల్మెంట్ పెట్టకపోవడమే తప్పు. మనం సామాన్యులమైన తప్పును తప్పే అని తీరాల్సిందే. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రోడ్ల మీద పోయే ప్రతిఒక్కరు తమ రక్షణకొరకు హెల్మెంట్ పెడుతున్నారో లేదో తెలియదు గాని మీ నిబంధనలు తూచాతప్పకుండా పాటించాలనే నిబద్దతతో హెల్మెంట్ వాడుతున్నారు కాబట్టి పోలీస్ అధికారులు కూడా నిబద్దతతో హెల్మెంట్ వాడాలనేది ఒక సామాన్యుడిగా నా ప్రశ్న..

✍️ Columnist
కోట దామోదర్
మొబైల్ 9391480475

మరపురాని యోధులు

మరపురాని యోధులు

2008లో ముంబైలో జరిగిన 26/11మారణహోమం భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద మచ్చగా మిగిలిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో  174 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డ విషయం దేశ ప్రజలెన్నటికీ మర్చిపోలేరు. భారత భద్రతా బలగాలు 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10 మంది ఉగ్రవాదులలో 9మందిని మట్టుబెట్టి ఒక్క అజ్మల్ కసబ్‌ను మాత్రమే ప్రాణాలతో పట్టుకున్న విషయం, ఆ ఉగ్రవాదిపై ఏప్రిల్ 20, 2009న ప్రారంభమైన విచారణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నవంబర్ 21, 2012న ఉరి తీసిన విషయం అందరికి గుర్తుంది. కానీ సుప్రీంకోర్టు విచారణలో నిర్భయంగా వాంగ్మూలం ఇచ్చి కసబ్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రత్యక్ష సాక్షిగా నిరుపమాన ధైర్యం ప్రదర్శించిన అతి పిన్న వయస్కురాలైన దేవికా రోటావన్ విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరొక్క మాటలో చెప్పాలంటే గుర్తుకులేదు. దాడి జరిగిన సమయంలో దేవికా రోటావన్ వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే. దుర్ఘటన సందర్భంలో అక్కడ చాలామంది ఉన్నప్పటికీ అందులో ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పడానికి సాహసం చేయకపోవడం విచారకరమైన విషయం. దేశభక్తి మూర్తీభవించిన  ఒక 9 ఏళ్ళ అమ్మాయి ఉగ్రవాదికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం ఏంటి అనే సందేహం ప్రతిఒక్కరికి కలుగుతుంది. కనీసం అంతటి తెగువకు సాహసించిన ఆ అమ్మాయి  పేరు మనలో ఎంత మందికి గుర్తుంది? “అన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ అసలోడిని మాత్రం మర్చిపోతాం” అనే సామెత లాగా ప్రస్తుత సమాజం తీరు ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న “26/11 నెవర్ అగైన్” అని కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప సభలు నిర్వహిస్తుంటాం కానీ ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాదికి ఉరిశిక్ష పడేందుకు ప్రాణాలకు తెగించి వాంగ్మూలం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి దేవికా రోటావన్ ను మాత్రం అందరం మర్చిపోయాం.

కళ్ళముందు నేరం జరిగినా చూసీచూడనట్లు పట్టించుకోకుండా పోయేవారు కొందరైతే, అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ప్రాణాలకే ముప్పని భావించేవారు మరికొందరు ఉంటారు. సాక్ష్యం చెప్పడం అంటే చావుకు ఎదురుపోయినట్లే అనే ఉద్దేశంతో అక్కడ జరిగిన సంఘటనను చూసినప్పటికీ చూడలేదని చెప్పి తప్పించుకుంటారు. కొన్ని సంఘటనల్లో సాక్ష్యులను హతమార్చిన సందర్భాలు కూడా ఉండడమే ఇందుకు కారణం. ఏదైనా నేరం జరిగినప్పుడు, సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే కదా నేరం రుజువై నేరస్థుడికి సరైన శిక్ష పడేది. మరి సాక్షాలే లేనప్పుడు కోర్టు నేరస్థులను  శిక్షించేది ఎలా? నేరాలు జరుగకుండా ఆపేది ఎలా? ఇలాంటి సంఘటనలలో నేరస్థులను శిక్షించడం న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న చిన్న నేరాలకు సైతం సాక్ష్యాలు చెప్పడానికి ప్రజలు వెనకాడుతున్న సమయంలో దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడి ఘటనలో 9 ఏళ్ళ అమ్మాయి ప్రత్యక్ష సాక్షిగా ముందుకు రావడం యావత్ దేశం గర్వించదగిన విషయమే కదా! ఇది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే. అంతేకాదు దేవికను అభినందించాల్సిన విషయం కూడా. ఇంతటి సాహసానికి ఒడికట్టిన  దేవికా రోటావన్ ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.

భారత చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రవాద చర్యల్లో ఒకటైన 26/11 ముంబై దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటికి తొమ్మిదేళ్ల వయసు గల  దేవికా రోటావన్ కు ఆ ఘటనా సమయంలో కుడి కాలిపై బుల్లెట్ గాయం కాగా కాల్పులు జరిపిన కసబ్‌ను స్వయంగా  చూసింది. 65 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన దేవికాను ఆ తర్వాత ప్రభుత్వం కోర్టులో సాక్షిగా ప్రవేశ పెట్టింది. దేశం కోసం, దేశ రక్షణ కోసం ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిర్భయంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకువచ్చింది. ఆమె సాక్ష్యం చెప్పకుండా ఉండటానికి ఉగ్రవాదుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఆమె బంధువులు కూడా ఉగ్రవాదులవల్ల తమకు ప్రాణహాని కలుగుతుందేమోనని భావించి వారికి దూరంగా ఉన్నారు. దీనికి తోడు, పాఠశాలలో దేవికాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీని వల్ల ఇతర విద్యార్థులకు ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని పాఠశాల యాజమాన్యం ఆమెను పాఠశాల నుండి బహిష్కరించారు. దేవిక ఉగ్రవాదుల లక్శ్యంగా ఉన్నందున అద్దె ఇంటివారు కూడా వెళ్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే దేవిక మాత్రం దేశం పట్ల తనకు  ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఇసుమంతైనా భయపడలేదు. కోర్టు విచారణలో సాక్ష్యం చెప్పడమే కాకుండా కసబ్ ను గుర్తించి, ఆరోజు దాడిలో అతనే తనపై కాల్పులు జరిపాడని సాక్ష్యం చెప్పడంతో, కోర్టు మే 2010లో, కసబ్ కు మరణశిక్ష విధించి, నవంబర్ 21, 2012న ఉరి తీసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ దేవిక అనేక అవరోధాలను, అవమానాలను ఎదుర్కొంటోంది. ఉండటానికి సరైన ఇల్లు లేక, అద్దెకు దొరక్క ఎన్నో సార్లు ప్రభుత్వానికి తన బాధను మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. సాక్ష్యం చెప్పే సమయంలో ఎందరో నాయకులు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి ఏవీ నెరవేరలేదు. ఆమె కూడా మనలో చాలా మంది లాగా ‘నాకెందుకులే’ అనుకుని ఉండి ఉంటే కసబ్ కి ఉరి శిక్ష పడేది కాదేమో! తన మరియు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం ఆమె చేపట్టిన సాహసోపేతమైన చర్యను గుర్తించుకోకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.

కసబ్ ను పట్టుకున్న సబ్ ఇన్స్పెక్టర్ గుర్తున్నాడా?
దేవికా రోటావన్ పేరుతో పాటు కసబ్ ను పట్టుకునేందుకు కేవలం చేతిలో లాఠీతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న కసబ్ సహా మరో ఉగ్రవాదిపై విరుచుకుపడి కసబ్ సజీవంగా పట్టుబడడంలో కీలకంగా వ్యవహరించిన  సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే పేరు దేశ పౌరులు మరిచిపోయారు. తుకారాం ఒంబ్లే 26/11 ముంబై దాడుల సమయంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు అమూల్యమైన విజయాన్ని సాధించాడు. ఆయన అసమాన ధైర్యసాహసాలు దేశం కోసం త్యాగానికి ప్రతీకగా నిలిచాయి. పోలీసు శాఖలో చేరడానికి ముందు, ఓంబ్లే 16 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో పనిచేశారు. ఇది తన కర్తవ్య భావాన్ని మరియు దేశం పట్ల ప్రేమను పెంచింది. ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఆయన అలుపెరగని సేవాభావంతో ముంబై పోలీస్ శాఖలో చేరారు. ముంబై దాడుల తర్వాత స్కోడా కారును హైజాక్ చేసి సీఎస్టీ వద్ద విధ్వంసం సృష్టించి పారిపోతున్న ఇద్దరు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తుకారాం ఓంబ్లే అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరుపుతున్నప్పటికీ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఓంబ్లే లాఠీ (లాఠీ) తప్ప మరేమీ లేకుండా కసబ్ వద్ద ఉన్న ఏకే-47 బారెల్ ను పట్టుకుని మరింత కాల్పులు జరపకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతటి దైర్యవంతుడిని కూడా మనం మరిచిపోవడం ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో!

"పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని శ్రీశ్రీ అన్నట్లు కళ్ళఎదుట జరిగిన సంఘటనకు మనం సాక్ష్యం చెప్పలేకపోతున్నామంటే నిజానికి మనం బానిస సంకెళ్ళు వేసుకున్నట్లే.. మన దేశంలో ఎంతోమంది దేశం కోసం పోరాడుతున్న యోధులు ఉన్నారు కానీ వారిని గుర్తించుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ :9391480475

రేవంత్ రెడ్డి మానవీయ కోణం

రేవంత్ రెడ్డి మానవీయ కోణం:

తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తున్న వారి జీతాల్లో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించిన విషయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. దేశంలో వృద్ధుల సంరక్షణ, సంక్షేమ పరిస్థితుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మనాన్నలు పిల్లలతో పేగు బంధాన్ని పెనవేసుకుంటుంటే వారు పెద్దయ్యాక కని పెంచిన వారిని కాదు పొమ్మంటున్నారు. మరికొందరైతే ఆస్తుల కోసం అమ్మానాన్నలను క్రూరంగా కడతేర్చిన కసాయి కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారిని రోడ్డున పడేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకరు ఖర్చులు భరించలేక ఒకరు సేవ చేయలేక దూరం పెడితే, మరొకరు పొట్టకోసం ఊరు దాటుతూ వదిలేస్తున్నారు, కొందరు కోడలు అత్తమామల్ని చూడకపోవడం కారణాలవల్ల కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది సంపన్న కుటుంబానికి చెందిన వృద్ధులు తమ ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేశామని కానీ తమను వారు చూసుకోవడం లేదని వృద్ధాశ్రమాలకు  కాసులు విదిల్చి చేతులు కడిగేసుకుంటున్నారని బాధపడుతూ ఫిర్యాదులు చేయడం లేదా, రోడ్డున పడి తమ గోడు వెళ్లబోసుకోవడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై సీఎం రేవంత్ ఓ ప్రత్యేకమైన ఆలోచన చేసి తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ఉద్యోగుల జీతాల్లో పది శాతం వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే ఆలోచన అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు

పట్టణీకరణ ఆధునీకరణ ల సౌక్యాలతో తగ్గుతున్న మానవత్వం విలువల ఫలితమే ఇది.

ఒక తల్లికి అయిదుగురు కొడుకులు ఉంటే అందరిని ఒకే విధంగా పెంచుతుంది. కానీ ఆ అయిదుగురు కొడుకులు ఒక్క తల్లిని పెంచాలంటే ఎంత ఈసడించుకుంటారో ప్రపంచానికి అర్ధం కానీ వింత. కోట్ల రూపాయల ఆస్తులున్న కన్న కొడుకు కడుపునిండా అన్నం పెడతారన్న నమ్మకం లేదు. పెళ్ళైన కొన్నాళ్లకే ఆస్తులు తమ పేరున రాసుకొని తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేస్తున్నారు. అంతేకాదు వారు అసువులుబాస్తే కడ చూపు చూడని కఠినాత్ములు ఎందరో. అనాధల ఖాతాలో అంత్యక్రియలు జరుగుతున్న దౌర్భాగ్యం ఎందరిదో. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ చాలా మంది తల్లిదండ్రులను పోషించడం భారంగా చూస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉండాలని చాలా కాలంగా అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు వృద్ధాశ్రమంలో చేర్పించడంతో వారు ఆవేదనకు గురై వృద్ధాశ్రమంలో  భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటన అధికారుల సామాజిక స్పృహను తట్టి లేపింది. తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ఉద్యోగుల జీతాల్లో పది శాతం వారి ఖాతాల్లో జమ చేసేలా చూస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. మంచి ఆలోచనకు మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

జీతంలో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశంపై పలు సందేహాలు:

ఉద్యోగికి ఎక్కువ జీతం ఉంటే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గాని, తక్కువ జీతం ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వారు కుటుంబ పోషణ, పిల్లల చదువుల కొరకు చాలా ఇబ్బందులు పడుతుంటారు మరి వారికి ఇది ఒక పెద్ద సమస్య అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటివారైనా తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఆర్ధికంగా లేనప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపలేకపోవచ్చు. మరి తక్కువ జీతం ఉన్నవారు ఈ అంశాన్ని సమర్థిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. అంతేకాదు అస్సలు కొడుకులు లేని వారి పరిస్థితి ఏంటి? వారి బాగోగులు ఎవరు చూడాలి? వారికి ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేస్తుందా? ఇదే కాకుండా కూతురు మాత్రమే ఉంటే వారి తల్లిదండ్రులను ఎవరు చూడాలి? అల్లుడు చూడకపోతే అల్లుడు జీతం నుండి పది శాతం కట్ చేస్తారా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఈ వార్త కొంత ఊరట కలిగిస్తుందేమో కానీ మిగిలిన వారి పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సి ఉంది. కొడుకులు బిడ్డలు లేనివారికి ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తే వారికి కొంత ఊరట కలుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకోవాలనే  నైతిక భాద్యత ఉండాలి అంతేతప్ప ఈ చట్టాలవల్ల సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ముమ్మాటికీ  ఉండదు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా అందరికి వర్తిస్తుందా అనేది చాలామందికి సందేహం ఎందుకంటే అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్, చట్టం 43 ప్రవేశపెట్టింది.

అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్:

ప్రభుత్వం కన్నవారిని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి , తగ్గించిన సొమ్మును తల్లిదండ్రుల ఖాతాలో వేయడానికి అనుమతి ఇస్తూ 2017 లో ప్రత్యేక బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదించడం పై పలు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుందనడంలో చాలామంది అభ్యంతరం తెలియజేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని మిగిలిన వారిని ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించారు. అయినా సరే అస్సాం ప్రభుత్వం బిల్లు కొనసాగిస్తుంది. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా చర్యలను 2021లోనే చేపట్టింది.

ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వర్తించకపోవడం, వృద్ధులకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ కూడా రాని ఈ పరిస్థితులలో తగిన చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు కొడుకులు ఉండి  అనాధలుగా మిగులుతున్న వారికి కూడా ఈ చట్టం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనచేయాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ 9391480475

15, జూన్ 2025, ఆదివారం

శూన్యం

3, మే 2025, శనివారం

కవన చంద్రికలు – సమీక్ష

కవన చంద్రికలు

స్వర్గాన్ని దివి నుండి భువికి చేర్చే శక్తి సంగీతానికి ఉందని నానుడి. ఆంగ్ల రచయిత  "ఎమిల్ లుడ్విగ్" చెప్పినట్లుగా భూలోక వాసులను స్వర్గానికి ఎగరేసుకుపోయే శక్తి సంగీతానికి ఉందన్న నిజం సంగీత ప్రియులకు మాత్రమే తెలుస్తుంది.  *సంగీతమే కాదు కవిత్వం* కూడా ఆ కోవకు చెందినదనే విషయం కవితాప్రియులకు మాత్రమే తెలుస్తుంది. అన్ని కవిత్వాలకు ఆ శక్తి ఉంటుందో లేదో తెలియదు గానీ పాఠకుల హృదయాలను దోచుకునే కవిత్వాలకు అలాంటి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. భావాత్మక కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే అందులో లీనమై అలౌకికానందాన్ని, తాదాత్మ్యాన్ని పొందుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నే ‘రసానందం’ అంటారు. సంగీతానికే కాదు భూలోక పాఠకులను స్వర్గంలొ విహరింపజేసేశక్తి కవిత్వానికి కూడా ఉందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

 కవిత్వం (కవిత) చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్లు కవితా వస్తువు ఏదైనా, అమ్మజోల పాట పాడితే చంటిపాప నిద్రలోకి జారుకున్నట్లుగా పాఠకుడు కవిత్వాన్ని తనివితీరా ఆస్వాదించేలా కవి ప్రతిభాశైలి ఉండాలి. అలాంటి కవిత్వం రాసేవారు ఈమధ్యకాలంలో చాల అరుదుగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వేలకొద్దీ కవితా సంపుటులు వెలువడుతున్నా వాటిలో కొన్ని మాత్రమే పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. కవిత్వం పట్ల పాఠకుడికి రసజ్ఞత కలగాలంటే, కవి సందర్భానుసారంగా కథావస్తువును  కళ్లకు కట్టే విధంగా , మనసును రంజింపజేసే విధంగా కవిత్వీకరించాలి. అప్పుడే కవి పాఠకుల హృదయాంతరాలాల్లోకి చేరుకోగలడు. ఇటీవల “మహతీ  సాహితీ కవిసంగమం”, కరీంనగరం వారి “ధనుర్మాస కవితోత్సవం 2024-25” సందర్భంగా వైవిధ్య వ్యాస రచయిత యేచన్ చంద్ర శేఖర్ మస్తిష్కం నుండి పురుడుపోసుకున్న "కవన చంద్రికలు" ఆ కోవకు చెందినవే. కమ్మనైన అమ్మపాట ఎంత మధురమో "కవన చంద్రికలు"లో  రచయిత "యేచెన్ చంద్రశేఖర్" రాసిన  అమ్మ కవిత్వం కూడా అంతే మధురంగా అనిపిస్తుంది. చంటిపిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ అమ్మ చందమామను చూపించగానే కడుపు నిండా భోజనం చేసినట్లు, చందమామ పాటవలె మృదుమధురంగా అమ్మ కవితకు అక్షరరూపం కల్పించారు చంద్ర శేఖర్.  ఈ పుస్తకంలో “జీవన సౌరభాలు”  మరియు “స్వాతంత్ర్య సమరయోధులు” అని రెండు భాగాలున్నాయి.

“జీవన సౌరభాలు” లోని "సకల సౌభాగ్యాల పరమావధి కన్నతల్లి" అన్న కవితలో "అడగకుండా బిడ్డ ఆకలిని తెలుసుకునేది తల్లి.. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులుండేది తల్లి" అని, ప్రపంచంలో అడగకుండానే బిడ్డ ఆకలిని గుర్తించే ఏకైక వ్యక్తి కన్నతల్లి మాత్రమే అనే అక్షర సత్యాన్ని అందమైన పదాల పొందికతో పాఠకుడికి పసందైన విందును అందించారు. ఈ కవిత చదివిన ప్రతి పాఠకుడి మదిలో కన్నతల్లిపై మమకారం ఉప్పొంగేలా, తల్లిప్రేమను వివరించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. మరో కవితలో "జీవం పోసేది అమ్మ అయితే.. జీవితం ఇచ్చేది నాన్న", "జీవితపు నాణేనికి అమ్మ బొమ్మ అయితే.. బొరుసు నాన్న" అని కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించే ‘నాన్న’ గురుంచి ఎంతో అద్భుతంగా చెప్పారు. కవన చంద్రికలు లోని ఒక్కో కవిత చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా కవిత్వం రాయాలన్న ఉద్విగ్నతకు లోనవుతాడు. పాఠకులను మంత్రముగ్దులను చేసే ప్రాసతో కవిత్వం రాయడమంటే అది యేచెన్ చంద్రశేఖర్ గారికే సాధ్యం అనే భావన ఏర్పడుతుంది. ఈ పుస్తకంలోని 49 కవితలు సరళమైన తెలుగు భాషలో సామాన్య పాఠకులకు సైతం కవిత్వంపై అనురక్తి  కలిగించే విధంగా ఉన్నాయి.

"సుఖం మరిగిన మనిషి" కవితను గమనిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఆధునికత’ పేరుతో మనిషి సుఖాలకు అలవాటుపడుతూ యాంత్రికంగా మారుతున్న విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మనిషి సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక రోగాల పాలవుతున్నాడు. సమాజంలో మార్పు రావాలి. కానీ, ఆ మార్పు వలన మనిషికి ప్రయోజనం కలగాలి తప్ప పరాభవం, పతనం కాకూడదన్న విషయాన్నీ కవిత రూపంలో చెప్పడమనేది చాల గొప్ప విషయం. "కాయకష్టం మరిచాడు మనిషి.. సోమరిగా మారిపోయాడు మనిషి" అని అయన వాపోవడం ముమ్మాటికీ వాస్తవమే కదా! ఒకానొకప్పుడు మనిషి మూడుపూటల అన్నంకోసం కష్టపడి పనిచేసేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.  ఉచితాలకు అలవాటుపడి కష్టాన్ని మరిచిన మాట వాస్తవమే. సుఖం మరిగిన మనిషి గురుంచి ఎన్నో విషయాలను  ఈ కవితలో ప్రస్తావించారు.

"ఛిద్రమవుతున్న బతుకు చిత్రం" కవితలో , ‘కరోనా’ నేపథ్యంలో బడుగుల బతుకు కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ రచయిత ఇలా అన్నారు ...

"ఛిద్రమవుతున్నాయి బడుగుల బతుకులు..
మానలేదింకా కరోనా రేపిన గాయాలు"
"అంతలోనే విరుచుకుపడ్డ ధరల శరాఘాతాలు.. ఆకాశాన్నంటే ధరలతో తప్పట్లేదు వెతలు"

కరోనా ప్రభావంతో సామాన్యుడు చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని, అరకొర సంపాదనతో జీవితాలు కుదేలవుతున్నాయని అయినా బడుగు జీవులు సంసారసాగరమీదడానికి భగీరథప్రయత్నాలు చేస్తున్నారని ఈ కవిత ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.

"స్నేహం" ఈ కవితలో "అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తమే స్నేహం.. చెమర్చిన కన్నులలో చెదిరిపోని జ్ఞాపకమే స్నేహం" అంటూ, ఈ సృష్టిలో స్నేహానికి మించిన గొప్ప వరం మరొకటి లేదంటాడు రచయిత. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషికి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. అందుకే మంచి స్నేహితున్ని మించిన ఆస్తి లేదంటారు. మన జీవితంలో లక్షలు, కోట్ల సంపదకన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప వరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతాలుండవు.  “స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా” అనే అక్షర సత్యాన్ని స్పష్టంగా వివరించారు.

రెండవ భాగం “స్వాతంత్ర్య సమరయోధులు”లో 37 కవితలు చరిత్రలో అట్టడుగు పుటలలో శిధిలావస్థలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గురుంచి రాశారు. వారిలో చాలా మంది గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. చరిత్ర మరిచిన అలాంటి మహనీయుల గాధలను భవిష్యత్‌ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా, ఆ యోధుల త్యాగాలను విశ్లేషిస్తూ క్లుప్తంగా వివరించారు.

"కవన చంద్రికలు" లోని ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవిత కూడా పాఠకుడిని భావుకతకు గురిచేసేలా రాయడం  ఆయన రచనాశైలికి కలికితురాయిగా నిలుస్తాయి. చదివిన ప్రతి పాఠకుడు, కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది యేచెన్ చంద్రశేఖర్ “కవన చంద్రికలు”. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు యేచెన్ చంద్ర శేఖర్ గారి కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ  ఆకాంక్ష.

“కవన చంద్రికలు” ప్రతుల కోసం రచయితను నేరుగా మొబైల్ నెంబర్ +91 8885050822 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా లేదా chandrashekar.achen@gmail.com కు ఈమెయిల్ పంపడం ద్వారా సంప్రదించవచ్చు. 

వ్యాస రచయిత
కోట దామోదర్
మొబైల్: 9391480475



12, ఏప్రిల్ 2025, శనివారం

జలం వినా జీవం నాస్తి:

 జలం వినా జీవం నాస్తి:


నీరు లేకుండా ఏ జీవి కూడా బ్రతకజాలదు, అందుకనే “జలం వినా జీవనం నాస్తి” అంటారు. మనం నీటిని పొదుపుగా ఉపయోగిస్తే, ప్రతి నీటి చుక్క మన భవిష్యత్తు తరాలను కాపాడుతుంది. మనం నీటిని వృధా చేస్తే, మన భవిష్యత్తు తరాలు అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిపోతున్న నీటి ఎద్దడికి నిదర్శనం గత సంవత్సరం బెంగళూరులో జరిగిన తీవ్ర నీటి కొరత పరిస్థితులు. జనాభాకు తగినట్టు నీటి సరఫరా ఉండడంతో,  కొన్నేళ్ళ క్రితం వరకు  ప్రధాన నగరాల్లో నీటి కొరత అంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యధికంగా భూగర్భ జలాల వినియోగం, పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ కారణంగా యధేచ్చగా అటవీ నిర్మూలన వంటి అంశాలతో  నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. పర్యావరణ అసమతుల్యత కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, వర్షపు నీటి సంరక్షణ మరియు మెరుగైన సరస్సు నిర్వహణ లేకపోవడం వల్ల నీటి సమస్య గణనీయంగా పెరిగింది. నీటి సమస్యను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సుజల దీప్తికి బాటలు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాల్యం నుంచే నీటి పొదుపు జీవన శైలిలో ఒక భాగంగా మార్చాల్సి ఉంది. బెంగళూరు నీటి సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు “రెయిన్ రీచ్” కార్యక్రమం ద్వారా పర్యావరణవేత్త హరిహరన్ చంద్రశేఖర్ చేప్పట్టిన చొరవ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.

చాలా నగరాలలో ఏటా కురిసే వర్షపాతంలో దాదాపు 90 శాతం వృధా అవుతుంది. నగరాలలో సరస్సులు కనుమరుగవడం, వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్ల నిర్మాణం చేపట్టడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నగరాలలో కురిసే వర్షపునీరు డ్రైనేజీ గుండా నేరుగా నదుల్లోకి చేరడం వల్ల భూగర్భజలాల పునరుద్ధరణకు అవకాశం లేదు. నీటిని సంరక్షించడానికి మన జీవనశైలిలో మార్పులు అవసరమని భావించి, పిల్లలలో సరైన అవగాహన కల్పిస్తే తద్వారా నీటిని ఆదా చేయడం చిన్నప్పటి నుండే అలవాటుగా మారుతుందని పర్యావరణవేత్త డాక్టర్ హరిహరన్ చంద్రశేఖర్ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి “రెయిన్ రీచ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బెంగళూరు నీటి సంక్షోభం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం వంటిది. నీటి సమస్యను అధిగమించడానికి పొదుపు మంత్రాన్ని జపించాల్సిందేనని రెయిన్ రీచ్ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పాఠశాలల్లో వర్షపు నీటిని సురక్షితమైన తాగునీటిగా మార్చడానికి వడపోత వ్యవస్థతో కూడిన వర్షపు నీటి సేకరణ (RWH) వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది కాకుండా, వర్షపాతాన్ని మరియు డేటా-లాగ్‌ను ఎలా కొలవాలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం, వర్షపు నీరు శుద్ధి చేసే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడే “రెయిన్ గేజ్” వాతావరణ స్టేషన్‌ను ఏర్పాటు చేసి తద్వారా పిల్లలకు పూర్తి అవగాహన ఏర్పడేలా అనుభవం కలిగిన నిపుణులతో వారికి శిక్షణ ఇస్తారు. ప్రతి నెలా పిల్లలకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ, నీటి దుర్వినియోగంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థమయ్యేలా, వ్యవస్థలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పిస్తారు. ఈ కార్యక్రమం ఫలితంగా బెంగళూరులోని 40 పాఠశాలలు ఇప్పటివరకు 34 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయడం గర్వించదగిన విషయమే. విద్యార్థుల ఈ కృషిని స్ఫూర్తిగా తీసుకుని దీనిని  ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే నీటికి డోకా ఉండదు.

రెయిన్ రీచ్ సిస్టమ్ మాత్రమే కాదు, మిలియన్ వెల్స్ ఫర్ అనే సంస్థ కూడా బెంగళూరులో నీటి సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో కీలకమైన చొరవను చేపట్టింది. బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల బోర్డుకు మద్దతుగా ఉన్న ఈ ప్రాజెక్ట్, సాంప్రదాయ బావి మైనింగ్ పద్ధతులను ఉపయోగించి నగరం అంతటా పది లక్షల లోతు బావులు నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. బావి నిర్మాణం యొక్క పురాతన పద్ధతులను ఉపయోగించడం ద్వారా, భూగర్భజల వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది, 2025 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిన మిలియన్ వెల్స్ ఫర్ బెంగళూరు ప్రాజెక్ట్ బెంగళూరుకు నీటి భద్రతను నిర్ధారించే దిశగా ప్రయత్నిస్తోంది.

బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ లో కూడా  నీటి సంక్షోభం ఏర్పడే అవకాశం లేకపోలేదు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడానికి ఎన్నో కారణాలున్నప్పటికీ, అధిక నీటి వినియోగంతో పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకింపచేయడంలో నగర వాసులు విఫలం కావడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే వర్షం నీటిని భూమిలోకి ఇంకింపచేయడంలో  నగరవాసుల అలసత్వం ఒక కారణమైతే, ఈ అంశంపై ప్రభుత్వం తగిన ఆసక్తిని చూపకపోవడం మరో కారణం. ప్రతిచోటా సిసి రోడ్ల నిర్మాణం కారణంగా నగరంలో ఏటా కురిసే వర్షం నీరు  భూమిలోకి ఇంకే అవకాశం చాలా తక్కువ. వర్షం నీరు భూమిలోకి ఇంకాలంటే అందుకు ఇంకుడు గుంత ద్వారానే సాధ్యం అని గ్రహించి మొదటిసారిగా ఇంకుడు గుంతల ఆలోచన ద్వారా జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసిన వ్యక్తి బాకారం వద్ద గల పద్మశాలి కాలనీ వాస్తవ్యులు రాజాపేట ఆంజనేయులు. 1997లో ఒకసారి ఆయన అధికారిక పనుల నిమిత్తం గుజరాత్ లోని రాజ్ కోట్ సందర్శించిన సందర్భంగా అక్కడ కొందరు స్త్రీలు రోజంతా తలపై బిందెలు పెట్టుకుని నీళ్లు మోసే దృశ్యం ఆయనకు తీవ్ర బాధ కలిగించింది. అంతేకాక అప్పటికే తమ కాలనీలో కూడా భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడి ట్యాంకర్లపై ఆధారపడవలసి రావడంతో ఆయన మస్తిష్కంలో మొదటి సారి “ఇంకుడు గుంతల” ద్వారా జలయజ్ఞం చేపట్టాలనే సంకల్పానికి బీజం పడింది. వెంటనే ఆయన తమ కాలనీలోని భావసారూప్యత గల ఐదుగురు మిత్రులతో కలిసి 31 జూలై 1997 న ప్రయోగాత్మకంగా పూర్తి శాస్త్రీయ ప్రమాణాలతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. తొలి ప్రయత్నంలోనే ఆంజనేయులు శ్రమ ఫలించి భూగర్భజల మట్టం పెరగడంతో కాలనీలోని మిగతా వారు కూడా ఆయన సారధ్యంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందారు. భూగర్భ జలాలు పెరగడానికి, నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంత తప్పనిసరని నిరూపించిన రాజాపేట ఆంజనేయులు ఇంకుడు గుంత ఆలోచనను ప్రతి ఒక్కరూ పాటిస్తే నగరంలో నీటి చింత ఉండబోదు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ IAS అధికారిణి శాంతా షీలా నాయర్ యొక్క వ్యూహాత్మక ప్రణాళిక మరియు విధాన రూపకల్పన నైపుణ్యం వల్ల చెన్నై తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దోహదపడింది. 2001లో ఆమె తమిళనాడు బోర్డు కార్యదర్శిగా ఉన్నప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్షపు నీటి సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించి, మొత్తం బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె అన్ని భవనాల్లో వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. నాయర్ సూచనమేరకు  చెన్నైలోని ప్రజలందరూ ఇంటి అవసరాల కోసం ప్రత్యేక ట్యాంకులు మరియు పైపులను ఏర్పాటు చేసుకొని వర్షపు నీటి సంరక్షణకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ చొరవ నీటి సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా నగరంలో స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులకు ఒక ఉదాహరణగా నిలిచింది.

నీటి కొరత పరిస్థితులు మరింత తీవ్రరూపందాల్చకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ  ఇంకుడు గుంతల నిర్మాణం మరియు నిర్వహణ ఒక ఉద్యమంలా చేపడితే, భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

29, మార్చి 2025, శనివారం

మేలుమరువని "బికాష్ చౌదరి"

మేలుమరువని "బికాష్ చౌదరి"


ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు అతనికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. వారు అందించిన సహాయాన్ని గుర్తుంచుకొని వారిని చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటాం. సహాయం అందించిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడమనేది విద్యుక్త ధర్మం అనుకునేవారు కొందరైతే, కనీసం వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయని వారు మరి కొందరు. సాయం చేసినంత మాత్రాన వారికి ధన్యవాదాలు చెప్పి వారిని గుర్తుపెట్టుకుంటామా, మన జీవితంలో ఎంతో మంది  సాయం  చేస్తుంటారు ఎంతమందినని గుర్తుపెట్టుకుంటామనేవారు కూడా ఉంటారు. కొందరైతే సాయం పొందిన వెనువెంటనే మర్చిపోతుంటారు. అతి కొద్దిమంది మాత్రమే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాకుండా సమయం వచ్చినప్పుడు వారిపట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటారు. ఈ తరహా కోవకు చెందిన వ్యక్తే JSW ఎనర్జీ లిమిటెడ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ "బికాష్ చౌదరి". 

భారత మాజీ క్రికెటర్ అయిన అరుణ్ లాల్, భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు, 1982లో అరంగేట్రం చేసి 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 93 అత్యధిక స్కోరుతో 729 పరుగులు చేశాడు. కాగా అరుణ్ లాల్ ఇంటి పక్క వీధిలో చిన్న గుడిసెలో చాకలి వృత్తిలో నిమగ్నమైన బికాష్ చౌదరి తండ్రి నివసించే వాడు. అతను అరుణ్ లాల్ కుటుంబం యొక్క బట్టలు ఉతికే వాడు. తన తండ్రితో పాటు బికాష్ చౌదరి అరుణ్ లాల్ ఇంటికి తరచుగా బట్టలు ఉతకడానికి వెళ్లేవాడు. కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న బికాష్ కి టీచర్స్ చెప్పే పాఠాలు సరిగా అర్థం కాకపోవడంతో ఆంగ్లంలో కొంత శిక్షణ అవసరం అని తెలుసుకొని, ఆంగ్లంలో నిష్ణాతులుగా ఉన్న అరుణ్ లాల్ భార్య దేబ్జాని వద్దకు ట్యూషన్ కోసం అతను రోజుకు ఒక గంట పాటు వచ్చేవాడు. దేబ్జాని బికాష్ కి ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా మెళకువలు నేర్పించి తరగతిలో ఉత్తమ ర్యాంక్ పొందడానికి శిక్షణ ఇచ్చింది. ఆమె మార్గదర్శనం లో  బికాష్ 10వ తరగతి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అరుణ్ లాల్ దంపతులకు సంతానం లేకపోవడం మరియు దేబ్జానికి పిల్లలంటే చాలా ఇష్టం కావడంతో, వారు బికాష్ ను తమ సొంత కుమారుడిగా చూసుకోవడంతో పాటు అతని చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. బికాష్ కూడా వారితో ఒక కుటుంబ సభ్యుడిగా గడిపేవాడు. సాయంత్రం వారింట్లో అందరితో కలిసి భోజనం చేసేవాడు. దేబ్జాని శిక్షణలో బికాష్ స్కూల్ విద్య ముగిసే నాటికి ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించాడు. అరుణ్ లాల్ దంపతులు అతనికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని అందుకు ఆర్ధికంగా ఎంతైనా సాయం అందిస్తామని  ప్రోత్సహించడంతో బికాష్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత సెయింట్ జేవియర్స్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ఐఐటీ కలకత్తా లో పూర్తి చేశారు. చదువు పూర్తియైన తర్వాత ఉద్యోగ అవకాశాలు బికాష్ ను  వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన  డ్యూయిష్ బ్యాంక్, HDFC బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ లకు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం JSW ఎనర్జీ లిమిటెడ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అతను తన విజయం కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంతో ఉన్నత  ఉద్యోగం చేస్తున్నప్పటికీ తనకు ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా తనని ఒక కుటుంబ సభ్యుడిగా అక్కున చేర్చుకున్న అరుణ్ లాల్ దంపతులను అతను ఎప్పటికి మరిచిపోలేదు. అరుణ్ లాల్ బికాష్ సోదరీమణుల చదువుకు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధపడ్డప్పటికీ, అది వారికి భారమవుతుందని  భావించిన బికాష్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. 

దైనందిన జీవితంలో ఒకరి సాయం లేకుండా ముందుకు సాగడమనేది అసాధ్యం. ఎవరి నుండి అయినా చిన్న సాయం పొందినా వెంటనే కృతజ్ఞతలు చెప్పడం విజ్ఞత. మనకు సహాయం చేసిన వారు మనల్ని మరచి పోయినా ఫర్వాలేదు, మనం వారిని మరువకూడదు,  నిజమైన కృతజ్ఞత అంటే ప్రయోజనం పొందిన వారు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా జీవితాంతం గుర్తుంచుకుని, అవసరమైనప్పుడు తిరిగి వారికి చేతనైన సాయం చేయడమే. అరుణ్ లాల్ దంపతుల పట్ల బికాష్ చౌదరి నిజమైన కృతజ్ఞత చాటుకున్నారు. అత్యంత హృదయ విదారక పరిస్థితులలో ఆ దంపతులకు సొంత ఇల్లు కూడా లేదని తెలుసుకొని వారు ఇల్లు కొనుగోలు చేయడానికి అతను ఆర్థికంగా సహాయం అందించారు. అంతేకాకుండా అతను సాధారణమైన వోక్స్వ్యాగన్ కారు వాడుతూ వారికి మాత్రం మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఎవరైనా మనకు సహాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో, మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుకుంటాం. జీవితాంతం గుర్తు పెట్టుకునేవారు అతి తక్కువ మంది అందులో బికాష్ చౌదరి ఒకరు అని చెప్పొచ్చు. అరుణ్ లాల్ కుటుంబం పట్ల తన కృతజ్ఞతను జీవితాంతం చాటుకునేలా తన కుమార్తెకు ‘అరుణిమ’ అని అరుణ్ పేరు పెట్టుకున్నాడు.

మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం బికాష్ చౌదరి లాంటి వ్యక్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని నేటి యువతరం కృతజ్ఞతాభావంతో నడుచుకుంటే వారు కూడా తమ తమ జీవితాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.  ఒక సందర్భంలో, బికాష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అరుణ్ లాల్ దంపతులు నాకు సహాయం చేయడమే కాక మరియు జీవితంలోని ప్రధాన విలువలు నేర్పించారు. ప్రతి అడుగులోనూ, ఆయన నన్ను మంచి వ్యక్తిగా ఎదగడానికి ప్రేరేపించారు. వారి సహాయం లేకుండా, నేను ఈ రోజు ఉన్న స్థితిలో నిలబడే వాడిని కాదు, అని బికాష్ భావోద్వేగంతో పంచుకున్నాడు.  కష్టకాలంలో మీకు సహాయం చేసినవారు సామాన్యుడే కావచ్చు కానీ మనకు దేవుని తో సమానం. చేసిన సాయం, దానం ఎప్పటికీ వృధా కాదనటానికి చక్కటి ఉదాహరణ బికాష్ చౌదరి జీవితం.   

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

7, మార్చి 2025, శుక్రవారం

ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".

 ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".

అదొక మావోయిస్టుల ఉనికి ఉండే అత్యంత కఠినమైన దండకారణ్యం. సాధారణంగా దండకారణ్యంలోకి అడుగుపెట్టాలంటేనే ఒకరకమైన వణుకు పుడుతుంది. అందులోనూ అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఏ క్షణాన ఎటువైపునుండి తూటాల వర్షం కురుస్తుందో తెలియని అతి భయంకరమైన ప్రాంతమది. మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కీలక స్థావరం అయిన అబుజ్‌మర్ ప్రాంతం 21 అక్టోబర్ 2024న మావోయిస్ట్ మరియు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణంలో కాల్పులతో ఎనిమిది గంటలపాటు దద్దరిల్లిపోయింది. ఆ కాల్పుల్లో క్షతగాత్రుడైన C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోగా, తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు కొట్టుమిట్టాడుతున్న ఆయనను ధైర్యవంతురాలైన మహిళా హెలికాప్టర్ పైలట్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నిలిపి అందులో నుండి దూకి సమయస్ఫూర్తితో, అత్యంత సాహసోపేతంగా ఆ కమాండో ప్రాణాలను కాపాడింది. ఆ ధీరవనిత పవన్ హన్స్ హెలికాప్టర్ పైలట్ "కెప్టెన్ రీనా వర్గీస్" నిబద్ధతను మరియు అసామాన్య ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది.  

బూబీ-ట్రాప్డ్ మావోయిస్టు ప్రధాన కార్యాలయమైన అబుజ్‌మర్ ముట్టడిలో అక్టోబర్ 21, 2024 న పక్కా వ్యూహంతో పోలీస్ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లతో దాడులు, బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆ భీకరపోరులో C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు అడివిలో ఎలాంటి సదుపాయంలేక తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కమాండో ను కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసినప్పటికీ సీఆర్పీఎఫ్‌ బలగాలకు అండగా బ్యాకప్‌ ఫోర్స్‌ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎటు వెళ్లలేని పరిస్థితి కావడంతో, ఆ సమయంలో తోటి జవాన్లు అత్యవసర SOS కి కాల్ చేశారు. కెప్టెన్ వర్గీస్ SOS కాల్‌కు స్పందించి, తన సిబ్బందితో కలిసి గడ్చిరోలి నుండి తన 13 సీట్ల డౌఫిన్-ఎన్ పవన్ హన్స్ హెలికాప్టర్‌ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) 100 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 35 నిమిషాల్లో చేరుకుంది. అటవీ ప్రాంతంలో గాయపడిన కమాండో ను వెతకడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కెప్టెన్ వర్గీస్ ప్రాణాంతక పరిస్థితుల్లో భూమికి చాల తక్కువ ఎత్తులో నావిగేట్ చేస్తూ గాయపడిన జవాన్‌ ఆచూకీ కనిపెట్టింది. దట్టమైన అడవిలో లాండింగ్ చేసే అవకాశం లేదు. ఒకవైపు మావోయిస్టుల కాల్పులు మరోవైపు పోలీసుల కాల్పుల మధ్య గాయపడిన కమాండో ను హెలికాప్టర్‌ లోకి ఎక్కించడం అసాధ్యమని భావించింది. ఎలాగైనా జవాన్ ప్రాణాలు రక్షించాలనే సంకల్పంతో తన కో ఫైలట్ సహాయంతో కాప్టర్‌ను భూమికి వీలైనంత దగ్గరగా దించి కాప్టర్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో తిరుగుతుండగా ఆమె కాక్‌పిట్ నుండి దూకింది. కమాండోల సహాయంతో గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లోకి వేగంగా ఎత్తగలిగారు. ప్రమాద స్థలం నుండి కేవలం 30 నిమిషాల్లోనే గడ్చిరోలి కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ సరైన సమయంలో హాస్పిటల్ కి చేర్చడంతో కమాండో ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా ఆమె ఓఖీ విపత్తు సమయంలో కూడా సహాయక చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం. కోవిడ్ కాలంలో లక్షద్వీప్ నుండి చాలా మందిని విమానంలో తరలించడంలో కూడా ఆమె సహాయపడింది.

ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అంత సులభం కాదన్న విషయం మనందరికీ తెలిసిందే, ఆమె ధైర్యసాహసాలు ప్రదర్శించి కమాండో ప్రాణాన్ని కాపాడిన ధీర వనితగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో కెప్టెన్ రీనాను సత్కరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఆమె సాహసోపేత సేవను అభినందించారు.

కూంబింగ్ ఆపరేషన్ లలో పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా  దైర్యంగా పోరాడగలగడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో కాపాడగలరనే విషయాన్ని "కెప్టెన్ రీనా వర్గీస్" నిరూపించారు. భయమే అత్యంత క్రూరమైన శత్రువు. భయంతో వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతుంది గానీ ముందుకు పోలేము. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే వారికి ఏదైనా సాధ్యమే.  


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్: 9391480475  



4, మార్చి 2025, మంగళవారం

అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".

అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".

సరిగ్గా పాతికేళ్ళక్రితం నర్సంపేట బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సందర్భం. కొద్దిసేపటికి ఓ బస్సు ఫ్లటుఫార్మ్ మీదకు వచ్చింది. అప్పటికి బస్సు కోసం ఎదురుచూస్తున్న జనం సీట్ దొరకాలన్న ఆశతో ఎగబడి బస్సు ఎక్కేస్తున్నారు. కాలు పెట్టేంత స్థలం కూడా లేదు. బస్సు నిండా మగవారే తప్ప, మహిళ ప్రయాణికులు లేరు. ఇంతలో బస్సులోనుండి ఒక మహిళ  రైట్ రైట్ అని అరుస్తూ డ్రైవర్ గారికి సూచనలిస్తుంది. ఎవరిది ఆ ఆడ గొంతు బస్సులో మహిళలు లేరు కదా అని అందరూ ఆశ్చర్యపోతూ ఎవరని అటుఇటు చూస్తున్నారు ప్రయాణికులు. కొద్దిసేపటికి ప్రయాణికుల మధ్యలోనుండి సైడ్ ఇవ్వండి , సైడ్ ఇవ్వండని అనుకుంటూ ఆరడుగులు ఎత్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమె ఎవరో కాదు నర్సంపేట డిపోలో మొదటి మహిళ కండక్టర్ "గోరుకంటి జయప్రద".

ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కొన్ని రంగాలలో మాత్రమే జాబ్ చేయడానికి ఇష్టపడేవారు. అందులో ఆర్టీసీ బస్సు కండక్టర్ గా పనిచేయుటకు మాత్రం చాలామంది ఇష్టపడేవారుకాదు. ఎందుకంటే వారికి అసౌకర్యం ఉంటుందన్న భావన ఒక కారణమయితే మరోకారణం బస్సులో రద్దీ కారణంగా ఎక్కువసేపు నిల్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న భయం, సాహసోపేతమైన సంఘటనలు కూడా ఎదురవుతాయన్న అపోహ. అందుచేత మహిళ కండక్టర్ జాబ్స్ కి దరఖాస్తు చేసేవారు కూడా చాల తక్కువనే చెప్పొచ్చు. అలాంటి సమయంలో సాహసోపేతమైన జాబ్ ను ఎంచుకొని మహిళ కండక్టర్లు లేని  నర్సంపేట బస్సు డిపోలో మొదటి మహిళ కండక్టర్ గా పనిచేస్తూ 25 సంవత్సరాల విధి నిర్వహణలో ఎన్నో బదిలీలు అయినా పిల్లల భవిష్యత్ కోసం, వారిని ఉన్నత విద్య చదివించాలనే పట్టుదలతో, మొక్కవోని దీక్షతో మహిళలలో చైతన్యాన్ని కలిగించేలా ఆమె ఉద్యోగ ప్రస్థానం కొనసాగింది. "గోరుకంటి జయప్రద" గారు గత రెండురోజులక్రితం పదవి విరమణ పొందారు. ఈ సుదీర్గ ప్రయాణంలో మహిళ కండక్టర్గా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె అవరోధాలను అవకాశాలుగా మార్చుకున్నారు అంతేతప్ప వెనుతిరగలేదు. 1988 లో డిగ్రీ పూర్తి చేసిన జయప్రద గారు 2000 సంవత్సరము లో 90/- రూపాయలకే డేలీ వైజ్ కండక్టర్ గా ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేయడమేంటని అందరికి అశ్వర్యం కలుగకమానదు. 

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం:  

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో గోరుకంటి సుశీల - సత్యనారాయణ దంపతులకు జయప్రద గారు 1 మార్చి 1965లో జన్మించారు. వృత్తిరీత్యా తండ్రి సత్యనారాయణ ఉపాధ్యాయుడు, వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. జయప్రద గారు గుమ్మడవెల్లి స్వంత గ్రామంలోనే 1వ, తరగతి నుండి 7వ, తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆతర్వాత పై చదువులు చదవడానికి  గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ప్రతిరోజు గుమ్మడివెళ్లి నుండి గోరెంట్లకు 8 కి.మీ. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన 8 నుండి 10వ, తరగతి వరకు గోరెంట్ల గ్రామంలో 1981లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంకా పై చదువులు చదవాలనే కోరిక బలంగా కలిగింది. తండ్రి సంపాదనతో ఐదుగురు అక్కచెల్లెలను చదివించడం ఎంత కష్టమో, ఇల్లు గడవడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు తన చిన్నతనంలోనే ఎదుర్కొంది. అయినా పట్టుసడలని ప్రయత్నంతో పై చదువులు చదవాలనే కోరికతో    జయప్రద గారి పెద్ద సోదరి నిర్మల మహబూబాబాద్ మల్యాలలో ఉంటుండగా అక్కడే ఉంటూ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో 1983లో CEC కోర్సు పూర్తి చేశారు. ఆతర్వాత ఇంకా చదవాలనే పట్టుదలతో హనుమకొండ పట్టణంలో ఉంటున్న నాలుగవ అక్క అనంతలక్ష్మి  ప్రోత్సాహంతో వరంగల్ ఆంధ్ర బాలిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1988లో B.Com., పూర్తి చేశారు.

ఆతర్వాత వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిగాల వెంకటేశ్వరరావుతో 18 ఫిబ్రవరి 1989లో వివాహం జరిగింది. భర్త వెంకటేశ్వరరావు గారు ఓ ప్రవైట్ కళాశాలలో అడ్మిన్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. వారికీ ఇద్దరు అమ్మాయిలు, భర్త కు వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడవడం అతికష్టంగా భావించి జయప్రద కూడా భర్తకు సహాయం అందించాలనే ఆలోచనతో ఓ ప్రవైట్ స్కూల్ లో చాలాకాలం పాటు టీచర్ గా పనిచేశారు. ఐదుగురు అక్కచెల్లల్ను చదివించడానికి తండ్రి పడ్డ కష్టాన్ని భవిషత్తులో మేము కూడా పడకూడదు అనే గొప్ప ఆలోచనతో తన పిల్లల చదువుకోసం 22 జనవరి 2000 సంవత్సరంలో డైలీ వైజ్ 90/- రూపాయలతో క్యాజువల్ కండక్టర్ గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆమె ఉద్యోగంలో చేరేనాటికి వారి పిల్లలది చిన్న వయస్సు అయినాసరే ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రారంభించారు. ఒకవైపు పిల్లలను చూసుకునేవారు లేక మరోవైపు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. నర్సంపేట డిపోలో మహిళలకు కనీస సదుపాయాలు లేకపోయినప్పటికీ స్టాఫ్ మెంబెర్స్ ఎంతో గౌరవిస్తూ, తన ఉద్యోగానికి ఎలాంటి ఆటకం కలుగకుండా అందరూ సహకరించడంతో జయప్రద గారికి ఇక ఉద్యోగం కొనసాగించవచ్చు అన్న నమ్మకం కలిగింది. 7 సంవత్సరాల తరువాత ఉద్యోగం రెగ్యులర్ కావడం. ఆతర్వాత మహిళ కండక్టర్ గా ఉండి సంస్థ ఆదేశాల మేరకు ఏకంగా 7 డిపోలలో తన సేవలను అందించడం అభినందనీయం.

7 డిపోలలో సేవలు అందించడం గొప్పవిషయం.

ఎలాంటి రిమార్క్స్ లేకుండా తమ ఉద్యోగాన్ని కొనసాగించడం కొందరికే సాధ్యం. అలాంటి వారిలో జయప్రద గారు ఒకరు. నర్సపేట్ డిపోలో ఉత్తమ కండక్టర్ గా పేరుపొందిన ఆమెకు బదిలీలు బాధ తప్పలేదు. ఎప్పుడు బదిలీలతో పిల్లల చదువులకు కూడా తీవ్ర ఆటంకం కలిగినప్పటికీ డ్యూటీ మాత్రం సక్రమంగా నిర్వహించింది. 

ఆమె పని చేసిన డిపోలు: నర్సంపేట, కామారెడ్డి, రాణిగంజ్, హుజురాబాద్, మేడ్చల్, వరంగల్, పరకాల. 

అమ్మ కష్టం వర్ణించలేనిది:

రిటైర్మెంట్ సందర్బంగా వారి పిల్లలు అమ్మ పడిన కష్టాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ మాతో ఎప్పుడు గడిపేది కాదు. పండగొచ్చిన సమయంలో కూడా డ్యూటీ అంటూ వెళ్ళేది మా స్నేహితులందరూ వారి తల్లిదండ్రులతో గడిపితే మేము మాత్రం ఒంటరిగా అమ్మ వచ్చేంతవరకు దిగులుగా కూర్చున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అమ్మ మాకోసం మా భవిష్యత్తు కోసం తన విలువైన సమయాన్ని మాకోసం త్యాగం చేసింది. అమ్మ కష్టానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని వారి పిల్లలు అంటుంటే జయప్రదగారి తోటి ఉద్యోగులు చలించిపోయారు.

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్న జయప్రద ఎంతోమంది మహిళలకు  ఆదర్శం.

కాలంతో కలిసి నడిస్తే కానిది ఏముంది. ధైర్యంతో ముందడుగు వేస్తె సాదించనిది ఏముంది.

సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో ప్రతిఒక్కరు తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 


21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్:

అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్:

కోర్టు లో క్లాస్ ఫోర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల బాలుడి జీవిత కథ ఇది.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అతను ఓ జానపద గాయకుడు, రచయిత, "ఇక్ తారా" తుంబి అని పిలువబడే పంజాబీ సాంప్రదాయ సంగీతకారుడు కూడా. చిన్నతనం నుండే రచనలపై ఆసక్తి కారణంగా ఎన్నో రచనలు చేస్తూ, జానపద గాయకుడిగా, సంగీత కళను భారతీయ రేడియో మరియు టెలివిజన్ లో ప్రదర్శించేవాడు.  కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 9 వ తరగతి వరకు మాత్రమే చదివి, ఉన్నత విద్యనభ్యసించ లేక ప్రదర్శనల ద్వారా వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో ఏదో ఒక పని చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. తన మొదటి ప్రయత్నం తో కోర్టులో అటెండర్ ఉద్యోగం సంపాదించాడు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి న్యాయమూర్తి వద్ద ఎంతో కష్టించి పనిచేస్తున్నప్పటికీ, తన స్థాయి కారణంగా న్యాయమూర్తి తనకు సరైన గౌరవం ఇవ్వడంలేదన్న భావన కలిగింది. రోజంతా విధినిర్వహణలో సమయం వెచ్చిస్తున్నందున తన నైపుణ్యాలను కోల్పోతున్నాన్న భాద ఉన్నప్పటికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాడు. ఓరోజు న్యాయమూర్తి ప్రవర్తనతో విసుగుచెంది, అటెండర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ సంఘటన తర్వాత ఆ బాలుడు తన ఆత్మకథను "మై సాన్ జడ్జ్ డా అర్ధాలి" అని తన మాతృ భాష అయిన పంజాబీ భాషలో రాసుకున్నాడు. అతనే "నిందర్ ఘుగియాన్వి". నిందర్ ఘుగియాన్వి ఒక అటెండర్ స్థాయి నుండి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, ఘుగియాన్వి 69 పుస్తకాలు రాశారు. తన ఆత్మకథలో భారత న్యాయ వ్యవస్థలో క్లాస్ ఫోర్ ఉద్యోగులను వ్యక్తిగత సేవకులుగా ఎలా ఉపయోగిస్తారో చిత్రీకరించబడింది. ఈ పుస్తకం ప్రజాదరణ పొందడమే కాదు అతని ఆత్మకథ "ఐ వాజ్ ఏ సెర్వెన్ట్  టు ఏ  జడ్జ్" అని ఆంగ్లంతో పాటు 15 భారతీయ భాషలలోకి అనువదించబడింది. గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, పంజాబీ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం తో సహా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను వారి పాఠ్యాంశాల్లో చేర్చాయి. 12 విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్ మరియు పిహెచ్‌డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు నిర్వహించారు.

అటెండర్ నుంచి ప్రొఫెసర్ గా ఎలా ఎదిగారు తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా చదవాల్సిందే..

కోర్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ భాషా విభాగంలో తోటమాలి గా చేరారు. అక్కడ అతని పని మొక్కలకు నీరు పెట్టడం తోటను చూసుకోవడం మాత్రమే. ఘుగియాన్వి "ఇక్ తారా" తుంబి వాయించడంలో ప్రావీణ్యత కలిగినందున సాహిత్య విభాగంలో జరిగే కార్యక్రమాలలో ఇక్ తారా వాయించేవాడు. అతి తక్కువ సమయంలోనే సంగీత వాయిద్య కళాకారుడిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఒక తోటమాలి ఇంత ప్రజాదరణ పొండటమేంటని కొంతమంది అధికారులు అసూయపడి అతన్ని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించారు. టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేరు అన్నట్లు అతనికి పంజాబీ భాషపై పట్టున్నందున కాలక్రమేణా అతను ప్రభుత్వ భాషా శాఖ సభ్యుడిగా ఎంపికైనారు. మొదటిసారిగా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనిని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించిన అదే అధికారి, అతన్ని మిస్టర్ నిందర్ ఘుగియాన్వి జీ అని పిలవడం ప్రారంభించాడు. నిందర్ ఘుగియాన్వి సాధారణ జీవితం నుండి సాహిత్య ఔన్నత్యానికి ఎదగడం పంజాబీ సంస్కృతి, భాష మరియు సాహిత్యం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. పంజాబీ సంస్కృతికి ఆయన చేసిన కృషి ని గుర్తించి పంజాబ్ విశ్వవిద్యాలయం 'సాహిత్య రతన్' అవార్డుతో సత్కరించింది.

అటెండర్ గా తన కెరీర్‌ను ప్రారంభించి, తన ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాడు, చివరికి పంజాబీ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచి, 69 కంటే ఎక్కువ పుస్తకాలు రాయడానికి దోహదపడింది. ఆయన రచనలపై అనేక లఘు చిత్రాలు నిర్మించబడ్డాయి మరియు ఆయన పంజాబ్ జానపదాలు మరియు సంస్కృతిపై పరిశోధనలు చేశారు. ఆయన నైపుణ్యాన్ని గుర్తించి, IAS మరియు PCS అభ్యర్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి ఆయనను ఆహ్వానించారు. ఇటీవల, ఆయన బటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిందర్ ప్రపంచవ్యాప్తంగా USA, UK, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటించి విదేశీ సంస్కృతుల గురించి నేర్చుకుంటూనే తన సొంత సంస్కృతిని విదేశాలకు ప్రచారం చేశారు.

1994లో భారత రాష్ట్రపతి ఎస్.గియాని జైల్ సింగ్, 2001లో కెనడా ప్రధానమంత్రి శ్రీ జి. క్రెచియన్ మరియు 2005లో యుకె ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ వంటి ఉన్నత స్థాయి ప్రముఖులచే సత్కరించబడిన గౌరవం నిందర్ ఘుగియాన్వికి లభించింది.

నిందర్ ఘుగియాన్వి యొక్క ఆత్మకథను ‘‘నేను జడ్జిగారి సేవకుడ్ని’’ అన్న పేరుతో డా. రహీమ్ పఠాన్ ఖాన్ తెలుగులోకి అనువదించారు.

జీవితం తరచుగా ఊహించని మలుపులు తీసుకుంటుంది మరియు విజయం కొన్నిసార్లు తీవ్ర ప్రతికూల క్షణాల నుండి ఉద్భవిస్తుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. 

 

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475



6, ఫిబ్రవరి 2025, గురువారం

ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"


విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్నికూడా మించి పోయాడు.

అలాంటి అభినయ ఏకలవ్యుడిలాంటి స్ఫూర్తిదాయకమైన యధార్థ విజయ గాథ నిజామాబాద్, నాందేవ్ గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతుల కుమార్తె హారికది.

హారిక తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.చిన్నప్పటినుండి చదువులో అందరికంటే ముందుండే హారిక ఏడవతరగతిలో ఉన్నపుడే తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పట్టుదలతో చదివిన ఆమె పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. తన చిన్ననాటి ఆశయ సాధన కోసం నీట్ పరీక్ష రాయాలనుకుంది. కానీ నీట్ కోచింగ్ కోసం ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ నిరుత్సాహం చెందక తల్లి ప్రోత్సహంతో ముందడుగు వేసింది.  నిరుపేదరాలైనప్పటికీ,మనుసుంటే మార్గాలెన్నో అన్నట్లు హారిక పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ప్రతిరోజూ యూట్యూబ్ లో దీక్షగా వీడియో క్లాసులు చూస్తూ పరీక్షకు సిద్ధమైంది. కోచింగ్ కు  డబ్బులు లేవని ఆగిపోకుండా తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకొని ఘోర తపస్సు చేసి నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కాలేజీలో సీట్ వచ్చిన తరువాత ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కలిపి మొత్తం 2 లక్షలవరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలేనిరుపేదరాలైన హారిక  డబ్బు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతూ తన చదువుకోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకోగా  అందుకు ఎంతోమంది దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.

నేటి యువతకు ఇంటర్నెట్ (మొబైల్) నిత్యవసర వస్తువులా మారిపోయింది.కొంతమంది ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా వృధాచేసుకుంటున్నారు.సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభం, నష్టం అనేది వినియోగదారుడిమీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని మంచికి వాడితే మాత్రం ఈ భూమిమీద తెలియని విషయాలెన్నోతెలుసుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలల్లో దొరకని సమాచారం కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో క్లాసులు వింటూ నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్ సాధించిన హారిక విజయమేఇంటర్నెట్ ని మంచికి ఉపయోగిస్తే విద్యార్థులకు ఎంత ప్రయోజనకరమో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ.       

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్నిఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్నహారిక ఎందరికో ఆదర్శం.

సాధించాలనే తపన ఉంటేఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

అసాధ్యమనే పదంలో"అ" అనే అక్షరాన్ని పక్కనే పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

ప్రతి విద్యార్థి అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.

 

మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com


https://www.ntnews.com/editpage/a-mind-has-a-way-when-you-constantly-work-towards-an-ambition-what-you-think-will-come-true-858966

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

విమర్శ

విమర్శ:

విమర్శ అనేది ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి దారి తీస్తుంది. ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని చెడగొడుతుంది. విమర్శించే వారిని కొంతమంది ఇష్టపడరు. విమర్శించేవారు లేకపోతే మనిషి ఏమి సాధించ లేడన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు. నేను సున్నిత విమర్శకుడినే. కొన్నిసార్లు విమర్శ కుసంస్కారికి ఆయుధం లాగా పనిచేస్తుంది. ప్రతి స్పందన సంస్కారి సవరణ.

యధార్థ సంఘటన;

నేను సుభాష్ నగర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, సంస్థ యజమాని ఒక రోజు డిజైన్ చేయమని దాని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విని అందులో ఉన్న లోపాన్ని ఆయనకు అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన యజమాని అనే గర్వంతో నేను చెప్పిన విషయాన్ని గ్రహించక వాగ్వాదానికి దిగాడు. అతనికి చాలామంది నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు వితండవాదానికి దారి తీసింది. ఆ తర్వాత నేను జాబ్ కోల్పోవడం జరిగింది. నేను మానేసిన తర్వాత వేరే అతనికి కూడా అదే పరీక్షా అతను ఎవరో కాదు నా మిత్రుడే. అతను ఓపికగా ఆయన చెప్పిన దాన్ని చేసి చేతులు దులుపుకున్నాడు. అతను చేసిన డిజైన్ ప్రాక్టికల్ గా చేసి చూస్తే అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు అందుకు కంపెనీ యజమాని 20 లక్షలు నష్టపోయాడు. నష్టపోయిన సరే యజమాని గర్వం దిగలేదు. నా మిత్రుడు మాత్రం నెల నెల జీతం తీసుకుంటూ యజమాని చెప్పిన పని చేసేవాడు. అలా ఎన్నో ప్రాజెక్టులు చేసి నష్టపోతూ నష్టపోతూ మొన్న ఈమధ్య కంపెనీ మూతపడింది. కంపెనీలో పనిచేసే వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఒక విమర్శకుడి వల్ల లాభమే తప్ప నష్టం మాత్రం ఉండదు అనేది నిజం. అసలు విమర్శ లేకపోతే మనిషి వృద్ధి చెందలేడనేది ముమ్మాటికీ నిజం. అందుకు పైన చెప్పిన ఉదాహరణ ఒకటి. నేను విమర్శించి చెడ్డవాడిని అయ్యాను కానీ నేను నష్టపోలేదు. విమర్శకుడు ఎప్పుడు నష్టపోడు. విమర్శకుడి మాటను అర్థం చేసుకోలేకపోతే ఎదుటివారి నష్టపోతారు. నేను విమర్శించడం వల్ల జాబ్ కోల్పోయాను అందుకు ఒక సంవత్సరం పాటు జాబ్ కొరకు చాలా ఇబ్బందులు పడ్డాను కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి నాది. ఒకరోజు హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా లో ప్రభుత్వ ఉద్యోగి అయినా జగదీశ్ సార్ ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ లో ఒక చిన్న పని చేయమని వర్క్ ఇచ్చారు అలా పరిచయం ఏర్పడి నేను కోల్పోయిన జాబ్ గురించి అసలు జరిగిన విషయం గురించి చెప్పాను. ఆయన నా బాధను అర్థం చేసుకొని నీకు జాబ్ వచ్చేవరకు నేను రూమ్ రెంట్ కడతాను జాబ్ వచ్చాక నాకు జాబ్ వచ్చిందని చెప్తే చాలు బాబు నువ్వు ఏమి బాధపడకు అన్నారు. అన్నట్లే ఆయన నా జాబ్ వచ్చేవరకు రూమ్ రెంట్ కట్టినారు. నాకు జాబ్ వచ్చాక మొదటి సారి ఆయనకు ఫోన్ చేసి చెప్పాను సంతోషించాడు. ఆయన కట్టిన రూమ్ రెంట్ డబ్బులు ఇవ్వబోతే అస్సలు వద్దన్నాడు. జగదీశ్ సార్ చేసిన మేలు నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను. ఇప్పటికి జగదీశ్ సార్ కి అప్పుడప్పుడు కాల్ చేస్తే జాబ్ ఎలా ఉంది ఏమైనా సహాయం కావాలంటే అడుగు దామోదర్ అంటారు. ఇలాంటివారికంటే నా జీవితంలో కావాల్సింది ఏముంది. విమర్శ వల్ల నేను కోల్పోయింది ఏముంది ఏమీ లేదు జాబ్ మాత్రమే కానీ విమర్శను అర్థం చేసుకోలేని యజమాని మాత్రం కంపెనీ కోల్పోయాడు. అతను కంపెనీ కోల్పోవడమే కాకుండా అందులో ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు కారకుడయ్యాడు. యజమాని ధనవంతుడు, శక్తివంతుడు కావొచ్చు కానీ కాలం అంతకంటే శక్తివంతమైనది. ఒక చెట్టు నుండి లక్ష అగ్గిపుల్లలు తయారవుతాయి కానీ ఒక అగ్గి పుల్లతో లక్షల చెట్లు బూడిద అవుతాయి అన్నట్లుగా విమర్శకుడి వల్ల మంచి జరుగుతుంది కానీ మౌనం గా ఉండే వారి వల్ల అన్ని కోల్పోవాల్సి వస్తుంది.

మరో యదార్థ సంఘటన:

మౌనంగా ఉండే నా మిత్రుడికి మరో మిత్రుడొకరు ఫోన్ చేసి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని అడిగారు. ఆయన రెండు మూడు కోర్సులు చెప్పి మిత్రుడి సలహా కోరారు. నా మిత్రుడు బయట ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దొరకని ఒక కోర్సు పేరు చెప్పి చేయమన్నారు. పాపం అతని మిత్రుడు గుడ్డిగా నమ్మి వారి అబ్బాయిని మిత్రుడు చెప్పిన కోర్స్ చేయించారు. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయి రెండు సంవత్సరాలు అయింది ఉద్యోగం లేదు. నా మిత్రుడి కంటే ముందు ఒకతను సలహా అడిగారట ఆయన సున్నితంగా విమర్శించి ఆయన చెప్పిన కోర్స్ ఏవి బాగాలేవు ఇంకా ఏమైనా కోర్స్ చేయించు అన్నారంట. ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా ఇంకో మిత్రుడి సలహా తీసుకొని ఆయన ఇబ్బంది పడటమే కాకుండా అబ్బాయి ఇబ్బందికి కారకుడైనాడు. 

విమర్శ ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది, విమర్శ ఒక గొప్ప స్నేహాన్ని బంధుత్వాన్ని నేలరాసే ఆయుధం. విమర్శ అనేది మోటార్ సైకిల్ కి ఇంధనం లాంటిది. ఇంధనం లేకపోతే ముందుకు పోవడం అసాధ్యం, మనిషి కూడా విమర్శ లేకపోతే పైకి ఎదగలేరు. మంచి విమర్శ, మానవులకు ఎదగడానికి కాకుండా సంపూర్ణంగా జీవించడానికి తోడ్పడుతుంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 

        


  

    

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...