7, ఏప్రిల్ 2024, ఆదివారం
ఈశాన్య రాష్ట్రంలో ఉద్భవించిన గొప్ప శాస్త్రవేత్త "సోనమ్ వాంగ్ చుక్".
9, మార్చి 2024, శనివారం
మత్తడి దునికిన కోపుల నీళ్లు
కష్టజీవి కన్నీటి చిరునామా.. "మత్తడి దునికిన కోపుల నీళ్లు" నవల.
సాహిత్య ప్రక్రియలలో కథలు, వ్యాసాలు మరియు నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. వివరంగా చెప్పాలనుకున్న ప్రతి కూలంకషంగా నివేదన నవలల ద్వారానే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
“పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం నీ తప్పు” అన్నఅబ్దుల్ కలాం మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ విజయం సాధించలేకపోయామని వాపోయే చాలా మంది యువత మనకు నిజ జీవితంలో తారసపడుతుంటారు. మరి కొందరు మాత్రం తమ తల్లిదండ్రుల మాటలను ఆదర్శంగా తీసుకుని ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్యం ముందు లక్ష సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారే లక్ష్యాన్ని సాధిస్తారనేది జగమెరిగిన సత్యం.
నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది విద్యార్థులు తమకంటూ ఓ ఆశయం పెట్టుకుని సమాజంలో ఎదురైన అవమానాలను అవకాశాలుగా మలచుకొని ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అయితే వారిలో కొందరు తమ లక్ష్యసాధనలో ఎదురైన ఆటుపోట్లను భావి తరాలకు లేదా ప్రస్తుత యువతకు ఎలాంటి సందేశాన్ని అందించలేకపోతున్నారు. కాగా మరి కొందరు తమ స్వీయానుభావాలను రచనలు, నవలల రూపంలో నేటి యువతకు స్ఫూర్తిగా అందిస్తున్నారు. రచయితలు ఇప్పటివరకు అనేక చిత్రాల నవలలు వెలువరించిన యువతను ఉత్తేజపరిచే అంశాలతో విడుదలైన నవలలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ "డాక్టర్ వెన్నం ఉపేందర్ (IPoS)" కలం నుండి జాలువారింది యువతకు స్ఫూర్తి దాయకమైన నవల "మత్తడి దునికిన కోపుల నీళ్లు".
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వెన్నం ఉపేందర్ గారి స్వగ్రామం సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం లోని మారుమూల పల్లె గుమ్మడవెల్లి. ఆయన జీవితంలో తినడానికి తిండి లేక పస్తులున్న సందర్భాలెన్నో. కాలే కడుపుకి కాసిన్ని నీళ్లు, సలిపించే గాయానికి కాసింత పశుమూత్ర పూత అన్నట్లుగా ఆయన ఆకలి ఆర్తనాదానికి కాసిన్ని నీళ్ళే ఊరట, పేదోడికి గాయాలైతే కన్నా పైసల కోసం తండ్లాడే నొప్పి ఎక్కువ. పైసలు లేక పశు మూత్రం తో గాయంపై రాసుకుని ఉపశమనం పొందిన జీవితం ఆయనది. అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆశయం కోసం ఆకలిని అదిమిపెట్టి, ఆశయమనే నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలంటే అకుంఠిత దీక్షతో పుస్తకాల పురుగయిండు. పేద జీవితం గట్టెక్కాలంటే చదువే మార్గమని భావించాడు. ఉపేందర్ చూపు చదువుపైనా, ఆకలి అటకపైనా సాగిన ఆయన జీవన ప్రస్థానం ఇతివృత్తంగా అక్షరీకరించిన నవల ఈ "మత్తడి దునికిన కోపుల నీళ్లు".
సాధారణంగా కొన్ని నవలలో ఒక ప్రదర్శన రాస్తారు. కానీ వెన్నం ఉపేందర్ నవలలు భిన్నంగా ఉంటాయి. పాఠకులకు కృతజ్ఞతా భావాన్ని కలిగించేలా మరియు వారి హృదయాలను కదిలించేలా చాలా అంశాలు అద్భుతంగా వివరించబడ్డాయి. ఈ నవలలోని ఇతివృత్తాలు అక్షరీకరించబడిన జీవితం, అనాథల జీవనం - చితికిన పసితనం, హైస్కూల్ చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు, సినిమా చూడామా - అయ్యో శని మామ, మా ఊరు మా ఇల్లు - ఎప్పటికి ఒడవని ముచ్చట. తెగి అతికిన ఇంటర్-కంట అలుగు పోసిన కన్నీరు, కలలతో ములకాతు, రంగులు వెలిసిపోయిన ఓ తాత కల, కుండ పలిగిన కల, చెదిరిన పెళ్లి పల్లకి కల, చచ్చి మర్లబతికిన కల, మా నాయన ఖలినపడ్డ కల, తెలిగిపోతున్న తల్లివేళ్ల కల, మా జీవితాలే అప్పు పడ్డయి,
ఆయన వెలువరించిన "అక్షరీకరించబడిన జీవితం" ఇతివృత్తం ద్వారా గ్రామీణ యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. గ్రామీణ యువత ఎదగాలంటే, ఒదిగి చదువుకోవాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును నిర్లక్ష్యం చేయొద్దని, "నీ వల్ల గాదన్న నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలి. ఆకలి భౌతికం - ఆవేదన మానసికం" అని ఈ నవలలోని నేపథ్యం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా అమ్మతనంలో ఉన్న కమ్మతనాన్ని ఒక కవిగా వర్ణించిన తీరు అత్యద్భుతం. అమ్మతనం ఆగి పోవద్దు - భార్య అని మనం అనుకుంటాం కానీ. భార్య అమ్మ రూపంలో అమ్మే భార్య (స్వప్న) అని పాఠకుల హృదయాలను కదిలించారు.
"హైస్కూల్ చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు" ఇతివృత్తాన్ని పరిశీలించినప్పుడు ఆయన స్వగ్రామంలో 8వ తరగతి లేకపోవడంతో చదువుకోసం కాలినడకన రోజుకు 16 సంవత్సరాల పాటు ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువును కొనసాగించే తీరు పాఠకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటూ పాఠకులకు తన బాల్య స్మృతులను పరిచయం చేస్తూ అక్షరీకరించారు. ఆయనది చెప్పులు కొనలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని దుస్థితి. ఆయన నడక ప్రయాణంలో కాలికి కసితీరా గుచ్చుకున్న తుమ్మ ముండ్లు , అపుడప్పుడు బాటకు అడ్డంగా ఎదురయ్యే తాసుపాములు, రోజుకోసారి వచ్చిపోయే ఎర్రబస్సులను చూస్తూ సాగిన హైస్కూల్ సదువు ఆమ్లపు చినుకుల సుఖాన్ని తెలియజేసినట్లు పేర్కొన్నారు. పూట గడవని పరిస్థితి వారిది. 8వ తరగతిలో చేరిన కొన్ని నెలలకే హాస్టల్ సీట్ వచ్చినప్పటికీ గొడ్ల కొట్టంతో కూడిన హాస్టల్ లో సాయంకాలమైతే పక్కనే పశువుల మంద, హాస్టల్ చుట్టూ దోమలు స్వైరవిహారం చేస్తుండేవి. ప్రతిరోజు పచ్చిపులుసు, వంకాయ, గోంగూర కూరలు. సుఖమెరగని హాస్టల్ జీవితం. హాస్టల్ లో పురుగులు పడిన అన్నం తిని నెలకోసారి జ్వరం. హాస్టల్ కి నాయన తెచ్చిన పుస్తకాన్ని అతిమధురమైన జ్ఞాపకంగా గుర్తించుకోవడం గొప్ప విషయం. ఒకరోజు వాళ్ళ నాన్న రెండు కోరికలు కోరిండు. ఒక్కటి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపిస్తూ "నువ్వు ఇలాంటి గాలిమోటార్లల్ల తిరగాలి అది నా కల. రెండోది నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చూడాలని ఉంది. నాయనంటే ఏడాదికోమారు వికసించే జ్ఞాపకం. .
ఈ ప్రపంచంలో అమ్మ కష్టం ముందు ఏది సరితూగదు అంటే తన అమ్మ పడిన కష్టాన్ని "కలలతో ములాకాతు" లో ఎంతో వివరంగా కనుగొన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు అందరిలాగే తన అమ్మ కూడా గునుగు పూలు, బంతి పూలతో బతుకమ్మ పేర్చడం చూసేది కానీ చెరువు దగ్గరకు బతుకమ్మ ఆడేందుకు వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. పేర్చిన బతుకమ్మ ఇంటి పక్కన వారికి ఎవరికో ఇచ్చేది ఒక రోజు అమ్మను అడిగాడు "అమ్మ నువ్వు ఎందుకు బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గరకు రావు అని అడగగా అడగగా ఓ రోజు అమ్మ చెప్పిన సమాధానం "బోసి మెడ, కాళ్లకు మెట్టెలు లేవు యెట్లా రాను కొడుకా" అది విన్న కొడుకు కళ్ళలో మత్తడి దూకిన కోపుల నీళ్లు లాగా కళ్లలో నీళ్లు దునికినై.లోకమంతా సదువు బందు చేసి, నాలుగు రూపాయలు వచ్చే పని చేయమన్నప్పుడు అమ్మ ఒక్కతే నువ్వు చదువుకోవాలి బిడ్డ, నువ్వు సదివి సదివి పెద్ద కొలువులు జెయ్యాలి నీ కష్టాలు నేను చూసుకుంటా బిడ్డ అని అమ్మ చెప్పిన మాటలను అక్షరీకరించి పాఠకులను ఉద్వేగానికి గురి చేశారు.
కష్టపడని తనముంటే కష్టాలను నిందించకు!
కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు!
ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఆటంకాలు ఎదురవడం సహజమే కానీ, ఆశయం దిశగా అడుగులు వేస్తూ, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే విజయం మీ వద్ధకు చేరుతుందనేది అక్షర సత్యం. చదవాలనే కోరిక బలంగా ఉంది, చదవడానికి డబ్బు లేని నిరుపేద యువతకు ఈ "మత్తడి దునికిన కోపుల నీళ్లు" ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందడంలో ఎలాంటి సందేహం లేదు.
వెన్నం ఉపేందర్ రచనలు కర్రు పుట్టింది, నారుమడి, నివేదనగా కవిత్వం, నెమలిక బరువు, ఎండమావి, కొన్ని వెలుగు నీడలు, మహాత్మాగాంధీ మంచి మాటలు ప్రతి రచనలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం వెన్నం ఉపేందర్ రచన నైపుణ్యానికి కలికితురాయిగా నిలుస్తుంది. వాస్తవిక ఘటనలను కథావస్తువుగా ఎంచుకుని తనలోని భావాలను కథలోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నేటి యువతకు ఉపయోగపడే మరిన్ని నవలలు వెన్నం ఉపేందర్ కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
1, మార్చి 2024, శుక్రవారం
పరిచయం:
పరిచయం:
నా పేరు కోట దామోదర్. నేను తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలో పుట్టి పెరిగాను. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో “ఎల్మోట్ ఆల్టర్నేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్” లో డిజైన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. ఒకటి నుండి పదవ తరగతి వరకు నా విద్యాభ్యాసం గ్రామీణ ప్రాంతంలో జరిగినందున, నేను ప్రకృతి సౌందర్యం మరియు గ్రామీణ నేపధ్యంలోని సంప్రదాయాలు మరియు నిబంధనలకు ఆకర్షితుడనయ్యాను. పల్లె వాతావరణంలో పెరిగిన నేను పల్లె జీవితం ఎలా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మొదటగా “మా ఊరి జ్ఞాపకాలు” అనే వ్యాసం రాసాను. అలా నా వ్యాసరచనగ ప్రస్థానం “మా ఊరి జ్ఞాపకాలు” నుంచి మొదలైంది. వ్యాస రచనతో పాటు “కాలిగ్రఫీ ఆర్ట్” నా అభిరుచులు. గత నాలుగేళ్ల నుంచి వివిధ పత్రికల్లో విభిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాస్తున్నాను. చాలా వ్యాసాలు రాయాలనే కుతూహలం ప్రత్యక్ష సమయాభావం వలన ఇప్పటివరకు దాదాపు 70 వ్యాసాల వరకు రాసాను. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన నాకు సహజంగానే చేతి వృత్తులతో పాటు ఆయా శ్రామికుల కష్టాలు, కడగండ్లపై కూడా అవగాహన ఉండటంతో ఇతివృత్తంగా నేను రాసిన వ్యాసాలకు పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది. గతంలో చేతివృత్తులు సమాజానికి ఎలా ఉపయోగపడ్డాయి మరియు ఆధునీకరణ నేపథ్యంలోనేడు అవి ఎలా కనుమరుగవుతున్నాయి అనే అంశాలను నా వ్యాసాల్లో ప్రస్తావించాను. భుక్తి కోసం జీవనోపాధి తప్పని సరి అయినా నా మదిలోని భావాలను అక్షరీకరించి సమాజ హితం కోసం ఎంతో కొంత చేయాలన్నది నా తపన. ఆ తపనకు కార్యాచరణ నా రచనావ్యాసంగం. నా ఈ ప్రయత్నంలో ఎవరికి ఉపయోగపడినా నా కృషి ఫలించినట్లే.
కోట దామోదర్
మొబైల్: 9391480475
ఈమెయిల్: kota.damodar @gmail.com
7, ఫిబ్రవరి 2024, బుధవారం
తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన "లొట్టపీసు పూలు".
తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన "లొట్టపీసు పూలు".
తెలంగాణ నేలలోని ప్రతి అణువణువులోనూ ఓ స్ఫూర్తి, పోరాట పటిమ, మేధస్సు మిళితమై అసంఖ్యాక శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే సాహిత్యానిది ఒక ప్రత్యేక స్థానం. నేటి సాహిత్య ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కథలు చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే కథలోని పాత్రలో లీనమై గొప్ప అనుభూతిని పొందుతాడు. కొన్ని కథలు చదువుతున్నపుడు రచయిత మన పక్కనే కూర్చుని కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులకు చదవాలని అనురక్తి కలిగించే కథలు ఉత్తమమైనవి. అలాంటి ఆసక్తికరమైన కథల్లో "శీలం భద్రయ్య" రాసిన "లొట్టపీసు పూలు" ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది.
ఆయన వెలువరించిన కథ కథను పరిశీలించగా అందులో ఒక్కో కథను నడిపించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. ఒక్కో కథ చదువుతున్నప్పుడు శీలం భద్రయ్య స్వయంగా కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులను మంత్రముగ్దులను చేసే ఛలోక్తులు కథలలో రాయడమంటే అది శీలం భద్రయ్యకే సాధ్యం అనే భావం ఏర్పడుతుంది.
ఈ కథల్లో తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పాఠకుల హృదయాలను హత్తుకునే విధంగా వివరించారు. అట్టడుగు వర్గాలు, సామాన్యుల భాషను, కథా వస్తువులుగా ఎంచుకుని తెలంగాణ భాష ఖ్యాతిని విస్తృతం చేసే కృషి చేసారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల తిరుగుబాట్లు ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, సహజత్వాన్ని ఈ కథల్లో చిత్రించిన తీరు అభినందనీయం. కొన్ని కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులను రచయిత హృద్యంగా వివరించారు.
ఈ పుస్తకంలోని పదిహేను కథలు అచ్చమైన తెలంగాణ భాష మాండలికంలో సామాన్య పాఠకులకు కథలపై ఆసక్తి కలిగించే విధంగా వ్రాయబడ్డాయి.
"ఇసపురుగు" కథను పరిశీలిస్తే ఆనాటి అణగారిన వర్గాల జీవన విధానాన్ని విశ్లేషిస్తూ, దొంగతనం నేరం మీద జైలు కి వెళ్లిన భర్తను విడిపించడానికి అప్పు కొరకు నారాయణ పటేల్ దొర దగ్గరికి వెళ్తే దొర అనే అహంకారంతో నిమ్నజాతి మహిళపై అకృత్యానికి పాల్పడిన సందర్భంలో నర్సమ్మ పెద్దయ్య చెప్పిన సలహాను పాటించి చాకచక్యంగా తప్పించుకున్న తీరును అద్భుతంగా విశ్లేషించిన తీరును గమనించవచ్చు. ఎందరో ఆడబిడ్డలను బలిమి చేసి, వాళ్ళ చావుకి కారణమైన దొర మరణంతో గ్రామ ప్రజలు సంతోషించిన తీరు పాఠకులకు కథల పట్ల ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది.
"కేంపు చెరువు" కథను పరిశీలిస్తే తెలంగాణ పల్లెల్లో పంట చేతికొచ్చిన తరువాత కోతపెట్టుకొవడమనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయంగా విశ్లేషిస్తూ, ఆడవాళ్ళు వడ్లు దంచే సమయంలో పాడుకునే పాట ఇప్పటి తరం వారికి తెలియజేయడం మరియు ఆ పాటను కథ రూపంలోకి తీసుకు రావడం శీలం భద్రయ్య పడిన తపన చెప్పకనే చెబుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. రజాకార్ల కాలం నాటి భయంకర సంఘటనలు కళ్లముందు చూసినట్టుగా కథను రాయడం,అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల భూములు జలాశయం (రిజర్వాయర్) నిర్మాణానికి తక్కువకు విక్రయించేందుకు గ్రామ ప్రజల నుంచి సంతకాలు తీసుకుని ఊరు వదిలి వెళ్లాలని దొర హుకుం జారీ చేయడం, ఆ తర్వాత ఊరి జనం చేసేదేమీలేక ఊరు విడిచి వెళ్తున్న విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై ఊరి జనానికి అసలు విషయం చెప్పి ఆయుధాలతో దొర పై యుద్దానికి తెరలేపి దొర గడి పై దండయాత్ర చేసి దొరనే ఊరినుండి వెళ్లగొట్టిన తీరును ఎంతో ఓర్పుతో కథకు జీవం పోశారు శీలం భద్రయ్య. మూసీనది చరిత్రను ఈతరం వారికి తెలియజేసే క్రమంలో తన కథలను ప్రత్యేకమైన శైలితో, చమత్కారమైన సూక్తులతో కొత్త రూపును ఇచ్చారు రచయిత.
"బంచెర్రాయి" కథలో రజాకార్లు కాసోళ్లగూడెం సమీపాన బంచెర్రాయి దగ్గర ఎలాంటి అకృత్యాలకు, దారుణాలకు పాల్పడ్డారో విపులంగా వివరించారు. రాజారెడ్డి బిడ్డ పెళ్లి సంబరాలలో రజాకార్లు గ్రామం మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను, బంచెర్రాయి దగ్గర కొత్తగా పెళ్ళైన రాజారెడ్డి బిడ్డ లచ్చువమ్మను రాజిరెడ్డి కళ్ళ ఎదుటే రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీసి బంచెర్రాయి వల్లకాడుగా మార్చిన తీరును పాఠకుల హృదయాలు కలుక్కుమనేలా శీలం భద్రయ్య ఎంతో చక్కగా రాశారు. అర్ధరాత్రి కాసోళ్లగూడెంపై రజాకార్లు దాడి చేస్తున్నారని రాజిరెడ్డికి సమాచారం అందించడంతో రాజిరెడ్డి కండ్లు నిప్పులు కక్కినై. దుఃఖం కట్టలు తెంచుకుని ఊరి ప్రజలకు ధైర్యంతో పాటు కాక పుట్టించి జనం తిరుగుబాటుతో రాజిరెడ్డి కన్న బిడ్డను చంపిన చోటే రజాకార్లను చంపి పాతిపెట్టిన ఘటనను అద్భుతంగా వివరించారు. రజాకార్లపై పోరాటం చేసి, వారిని తరిమికొట్టిన కాసోళ్లగూడెం పేరుని పాఠకులకు గుర్తుండేలా చేశారు. బంచెర్రాయి కథలో భద్రయ్య రాసిన కొన్ని చమత్కారమైన మాటలు ఈ కథకు కొత్త రూపాన్నిచ్చాయి. “పావురంగా సాదుకున్న బిడ్డ లచ్చువమ్మ అసువులు బాసినై. రాజిరెడ్డి నవ్వులూ బాసినై” అని రాశారు. పాఠకుడు ఈ కథ చదువుతున్నంత సేపు ఆ సంఘటన తమ కళ్లముందు జరుగుతున్నట్లు భావించేలా రాయడం రచయిత పరిణతికి అద్దం పడుతుంది.
"కర్తవ్యం" కథలో, అప్పటి రోజుల్లో ఆదివారం రోజు పిల్లలు ఆటలాడుకునే తీరుని వివరిస్తూ, రాముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ఎంకమ్మ ఎక్కెక్కి ఏడుస్తూ ఎట్లైనా తల్లిదండ్రులు లేని పిల్లగాడిని బతికించుకోవాలని నాయనమ్మ పడ్డ కష్టాన్ని పొందుపరిచిన విధం పాఠకుల గుండెలు బరువేక్కించక మానదు. అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులకు రాఘవయ్య సార్ చేసిన సహాయం తో బతికి, పై చదువులు చదివి, పెద్ద ఆఫీసర్ అవ్వడం, ఆ తరువాత రాముడు రాఘవయ్య సార్ ను కలవడానికి వచ్చినప్పుడు ఆ రోజే సార్ చనిపోవడం సార్ చేసిన త్యాగాలను తలుచుకుంటూ, సార్ రాసిన డైరీ తిరగేస్తుంటే రాముడికి ఆయన నడిచిన త్యాగపు గుర్తుల అడుగుజాడలు గోచరమవుతాయి. రాఘవయ్య కర్తవ్యాన్ని రాముడే కాదు మనమందరం సెల్యూట్ చేయాల్సిందే అనే విధంగా ఈ కథలో గురుశిష్యుల అనుబందాన్ని చాలా బాగా విశ్లేషించారు.
"లొట్టపీసు పూలు" కథలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే “బతుకమ్మ పండుగ” ను తెలంగాణ ఆడపడుచులు పల్లెలలో సంబరంగా జరుపుకునే విధానాన్ని, వారి బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించేలా చాలా బాగా విశ్లేషించారు. ఈ కథలో ఊరి పెద్దమనిషి ఎల్లయ్య పంతులు తడుకలు అల్లే శివుడు భార్య అడివమ్మ ఇద్దరిమధ్య పంచాయితిని పరిష్కరించి పండుగ పూట ఊరి చెరువులో శవమై తేలిండు. ఎల్లయ్య పంతులిని శివుడు చంపాడని ఊరి ప్రజలు ఎలా అనుమానించారో శీలం భద్రయ్య చాలా చమత్కారంగా వ్రాసారు "నరంలేని నాలుక ఎటైనా మల్తది" అని ఆసక్తికరమైన చమత్కారాలు ఉన్నాయి. బతుకమ్మ పేర్చడానికి పనికి రాని లొట్టపీసు పూలు ఎల్లయ్య పంతుల్ని ఎవ్వరు చంపినారో పట్టించాయి. అన్యం పుణ్యం ఎరుగని శివుడిని కాపాడినాయి. బతుకుదెరువు కోసం లొట్టపీసు చెట్లతో తడికలు అల్లుకునే శివుడు లొట్టపీసు చెట్లే గండం నుంచి గట్టెక్కిచ్చాయని దండంపెట్టుకుండు.
"వేగుచుక్క" కథలో తండ్రి దేశభక్తిని చూసి కొడుకు సైనికుడు అవ్వడం. మేజర్ కిరణ్ చేసిన సాహసాలను వివరిస్తూ శత్రువులను ఓడించిన తీరుని ఎంతో విపులంగా వివరించారు. తెలంగాణ బిడ్డ తెగువ తెలివి ముందు శత్రువులు నిలవలేకపోయారని ఈ కథలో మేజర్ కిరణ్ ధీరత్వం మరియు కిరణ్ తండ్రి వెంకట్రామిరెడ్డి పటేల్ చేసిన సేవలను అక్షర బద్దం చేయగలిగారు.
ఒక కథ పాఠకుడిని మెప్పించాలంటే రచయిత ఎంచుకున్న వస్తువు, ఆ కథ ఎత్తుగడ, రచన శైలి, అసాధారణమైన ముగింపు, చమత్కారమైన పద విన్యాసం ఉంటేనే పాఠకుడు ఆ కథను చివరిదాకా చదివి ఆనందించడంతో పాటు మధురానుభూతి చెందుతాడు.
శీలం భద్రయ్య రాసిన 15 కథలలో ప్రతి కథా దేనికది ప్రత్యేకమే. ప్రతి కథలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం శీలం భద్రయ్య రచనా నైపుణ్యానికి కలికితు రాయిగా నిలుస్తాయి. ఈ అద్భుతమైన కథలను చదివిన తరువాత పాఠకుడు సైతం కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది శీలం భద్రయ్య “లొట్టపీసు పూలు”. వాస్తవిక ఘటనలను కథా వస్తువుగా ఎంచుకుని తన లోని భావాలను కథ లోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పించిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కథలు శీలం భద్రయ్య కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.
కోట దామోదర్
మొబైల్: 9391480475
24, జనవరి 2024, బుధవారం
చేతివ్రాత
బ్రహ్మ రాసిన రాతను మార్చడం అసాధ్యమని తెలిసిన విషయమే. కానీ చేతిరాత అనేది మన జీవితాన్ని మార్చే అంశం అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జోశ్యం చెప్పేవారు మన చేతుల్లోని రేఖల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. అది ఎంతవరకు నమ్మశక్యమో దేవుడెరుగు.. కానీ ఎలాంటి చేతి గీతల ఆధారం లేకుండా కేవలం చేతి వ్రాత ఆధారంగా వ్యక్తియొక్క వ్యక్తిత్వ లక్షణాలు, భావోద్వేగ స్థిరత్వం, అభిజ్ఞా సామర్ధ్యాలు మరియు వారి ఆరోగ్యం గురించి కూడా అంతర్దృష్టిని పొందవచ్చని నమ్ముతారు. విశేషమేమిటంటే, అక్షరాల పరిమాణం, అక్షరాల మధ్య అంతరం, రాసే వాలు, కాగితంపై ప్రయోగించే ఒత్తిడి మరియు అక్షరాల ఆకృతితో సహా చేతివ్రాత యొక్క వివిధ భౌతిక అంశాలను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చని గ్రాఫాలజిస్టులు విశ్వసిస్తారు.
ప్రతి విద్యార్థి భవిష్యత్తులో విద్యార్థి చేతిరాత ప్రముఖ పాత్ర పోషిస్తుందంటే అతిశయోక్తి కాదు.
10, జనవరి 2024, బుధవారం
ప్రపంచం మెచ్చిన ఆటగాడు "ఉసేన్ బోల్ట్".
26, నవంబర్ 2023, ఆదివారం
సిరి వెన్నెల పాటకు మరణం లేదు.
"సిరి వెన్నెల" పాటకు మరణం లేదు.
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం"
సమాజంలోని అసమానతలు, అక్రమాలు మరియు అన్యాయాలను బహిర్గతం చేయడానికి పోరాడే నిజాయితీగల పౌరులు లేరని మరియు ఈ ప్రపంచం ఎప్పటికీ మారని తీరును తన కలం నుండి జాలువారిన అక్షరాలను అద్భుతమైన పాటగా మలిచి ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి, తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత, పాటల పూదోటలో విరిసిన పారిజాతం "సిరి వెన్నెల సీతారామశాస్త్రి".
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల పాటు మధురమైన పాటలు అందించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాతో పాట ప్రారంభించి ఎన్నో తెలుగు సినీ పాటలకు సిరుల జల్లు కురిపించారు. అంతేకాదు తన మొదటి పాట "విధాత తలపున"కి నంది అవార్డు రావడం అభినందనీయం. మొదటి పాట నుంచి చివరి పాట వరకు పాటల్లోని అభినయం ఎందరో తెలుగు పాటల ప్రియులను ఆకట్టుకుంది. ప్రతి పాట ప్రతి పదం మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆయన రాసిన ప్రేమ యుగళగీతాలు ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సాహిత్య శిఖరం సిరి వెన్నెల. సిరి వెన్నెల సాహిత్యానికి మసకబారిన హృదయాలను సైతం కదిలించే సామర్థ్యం ఉందంటే అతిశయోక్తి కాదు. సిరి వెన్నెల తెలుగు పదాలతో అలవోకగా ఆడుకోగల సాహితీవేత్త. సిరి వెన్నెల శాస్త్రి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరకాలం పదిలంగా ఉంటాయనేది ముమ్మాటికీ నిజం.
ఆయన రాసిన పాటలన్నీ పాటల పూదోటలో వికసించిన గులాబీల్లా ఉంటాయి. పాటలన్నీ అద్భుతం. అర్ధవంతం. ఆణిముత్యం..పాటలో వైవిధ్యం..ప్రతి పాటలో మానవత్వానికి బాటలు వేసే ఎన్నో భావాలు..ఒక్కో పదంలోనూ అద్వితీయమైన వ్యక్తిత్వపు జాడలు.
ఆణిముత్యం వంటి కొన్ని పాటలు గుర్తుచేసుకుందాం:
1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలోని "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని" ఈ పాట పలు భాషల్లోకి అనువదించడమేగాక ఎంతోమందిని ఆలోచింపజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట వినని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. నేటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంది. ఏనాటికి మారదు లోకం, మారదు కాలం అంటూ రాసిన ప్రతి పదం ఆలోచనాత్మకంగా ఉంది. ఆయన పాటతోనే యావత్ దేశాన్ని ప్రశ్నించాడు. కుర్రకారును ఉర్రూతలూగించే పాటల నుంచి సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల వరకు ప్రతి ఒక్కటీ.. గుండెను హత్తుకొనేలా రాయడం సిరి వెన్నెల కే సాధ్యం.
హిందూ సంప్రదాయంలో మంగళ సూత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తు ఈ మంగళ సూత్రం. పుట్టింటి వారిని,మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళ సూత్రంలో రెండు తాళి బొట్లు ఉంటాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ విడాకుల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారు ముందుగా మంగళసూత్రం విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1994 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం అందించిన శుభలగ్నం చిత్రంలోని
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ సిరి వెన్నెల గారు రాసిన ఈ పాట కోట్లాది ప్రజలను ఆలోచింపజేసింది.
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో... అంటూ ప్రేమను కొనగలిగే డబ్బు ఈ ప్రపంచంలో ఉందా? ధన వ్యామోహం లో ఉన్న కలియుగ ధనరాశులకు తన పాటతో జ్ఞానోదయం చేశారు మహానుభావుడు సిరి వెన్నెల.
కొన్ని పాటలు మన వ్యవస్థని, మన సమాజంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తాయి... అలాంటి పాటే 1997 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం "సింధూరం" లోని
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ!
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే!
ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు లభించింది.
సమాజంలో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ప్రశ్నించే రచన సిరి వెన్నెల కలం.
ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సిరి వెన్నెలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
ఆయన రాసిన పాటల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిలో
రుద్రవీణ లో "నమ్మకు నమ్మకు ఈ రేయిని"
స్వర్ణకమలం లో "ఆకాశంలో ఆశల హరివిల్లు"
నువ్వే కావాలి లో "ఎక్కడ ఉన్న పక్కన నీవే"
చక్రం లో "జగమంత కుటుంబం"
అమ్మ రాజీనామా లో "ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం "
ఇలాంటి ఎన్నో కమనీయమైన పాటలతో తెలుగు ప్రజల మనసులను దోచుకున్న గేయరచయిత సిరి వెన్నెల.
మనిషికి మరణం తప్ప పాటకు మరణం లేదనడం లో అతిశయోక్తి లేదు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475
4, నవంబర్ 2023, శనివారం
ప్రజా సేవకుడు "మండల పరశురాములు".
ప్రజా సేవకుడు "మండల పరశురాములు".
'బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో.
రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో.
పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు.
పేదను గుర్తించగ మారబోవునదెన్నడో' కవి ముత్తువేల్ కరుణానిధి గారు రాసిన ఈ కవిత ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది. బిడ్డల పాలకొరకు బిచ్చమెత్తుకుంటున్న దేశంలో పసిబిడ్డలకు పాలు అందించరు కానీ..రాళ్లనే దేవుడిగా భావించి క్షీరాభిషేకం చేస్తారు, కుబేరులున్న దేశంలో కూటికి లేనివాడికి కూడు కరువు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు నశిస్తాయో అని తన ఆవేదనను కవిత ద్వారా అందించారు. కానీ నేటికీ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండటం బాధాకరమైన విషయం.
ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతువుంటాడు జీవుడు.
ఎవరన్నారో గాని ఆనాడు మానవసేవయే మాధవసేవనే ఓ మహనీయుడు.
సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా అనే సిద్ధాంతాన్ని సేవా మార్గంగా ఆచరించి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాతూ పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ,దయ కలిగి ఉండడం మరియు సేవా తాత్పరత యొక్క నిజమైన అర్ధమని సూచించారు. ఆమె మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మానవుడే మహనీయుడు అనే నానుడిని నిజమని నిరూపించిన మహిళా మాతృమూర్తి. మదర్ థెరిసా స్ఫూర్తి పొంది ఎంతోమంది సామజిక సేవ కార్యక్రమాలు చేపడుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 1988లో మదర్ థెరిసా వరంగల్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి నేతృత్వంలో పరశురాములు సేవలకు గుర్తింపు లభించింది. మదర్ థెరిసా చేతులమీదుగా బెస్ట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. మదర్ థెరిసా స్పూర్తితో సామజిక సేవ రంగంలో 35 సంవత్సరాలుగా సేవలందిస్తూ అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్న తెలంగాణ బిడ్డ ప్రజా సేవకుడు "మండల పరశురాములు ".
ప్రజా సేవకుడు పరశురాములు :
నిరుపేద కుటుంబంలో పుట్టిన పరశురాములు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు. చిన్నప్పటి నుంచి తనకి ఎదురైన సమస్యలు జీవితంలో ఇతరులకు రాకూడదని భావించి చిన్నతనం నుంచే మూర్తీభవించిన మానవత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. 8 వ తరగతి చదివే సమయంలో గురువుల స్పూర్తితో సమాజ సేవ పట్ల ఆసక్తితో 1981లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ లో చేరాడు. అందులో క్రమశిక్షణ మరియు అంకితభావ నిబద్ధత అలవర్చుకున్నారు. సామజిక సేవ చేయాలంటే విద్యయే సరైన మార్గమని తెలుసుకుని ఒకవైపు చదువు కొనసాగిస్తూనే పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన చేసిన సేవలను గుర్తించి 1985 లో అప్పటి భారత రాష్ట్రపతి గియాని జైల్ సింగ్ చేతులమీదుగా ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. ఆతర్వాత అభ్యుదయ సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి అక్షరాస్యత, బాల కార్మికుల వ్యవస్థ నిర్ములన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణ, అక్రమ దత్తత నిలుపుదల, బాలల హక్కుల ఉల్లంఘన నిరోధం వంటి అంశాలలో ఎనలేని కృషి చేశారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహాలు నిలిపివేయాలని అనేక జిల్లాలో విస్తృత ప్రచారం చేయడమేగాక మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా పరిషారా ప్రాంతాలలో అనేక బాల్య వివాహాలను నిలిపివేయించారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 1989 లో వరంగల్ జిల్లాలోని నెహ్రు యువ కేంద్రంలో జాతీయ సేవా వలంటీర్‌గా చేరి యువజన సంఘాలను ఏర్పాటు చేసి క్రీడా కార్యక్రమాలు, చెట్లు నాటించడం కొరకు శ్రమదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు, రాత్రి బడులు నిర్వహించి నిరక్ష్యరాసులకు చదువు నేర్పించారు. అక్షరాస్యత కోఆర్డినేటర్‌గా సమర్ధవంతమైన సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అతని సేవలకు చిహ్నంగా, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి యువజన పురస్కారాలు, నిఖిల్ కొయితారా ఆంతర్జాతీయ అవార్డు, గాడ్ ప్రే ఫిలిప్స్ బాల కార్మికుల నిర్ములన అవార్డు , ప్రపంచ శాంతి శిఖరాగ్ర పురస్కారం వంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నారు. నిరుపేద కుటుంభంలో పుట్టి సామజిక సేవ కార్యక్రమాలు చేయటం అనేది గొప్ప విషయం. ఆయన సేవలు ప్రశంశనీయం, ప్రభంజనం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
కుటుంబ నేపథ్యం, విద్యాబ్యాసం:
పరశురాములు గారు మార్చి 04, 1968న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ అర్బన్ జిల్లా, రంగసాయిపేట రైల్వే గేట్ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో రాములు మరియు ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఏజే మిల్లుల్లో దినసరి కూలీ. తల్లి ఎల్లమ్మ బీడీ కార్మికురాలు.
ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రంగశాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది. కుటుంబ పోషణ కొరకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక తల్లికి తోడుగా బీడీలు తయారు చేసి సహాయం అందించేవారు. గురువులు ఆయనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి పై చదువులు చదవాలని ప్రోత్సహించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఉన్నత చదువులను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌లోని శంభుంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదివాడు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. ఆయన చదువుకునే సమయంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా చదువే లక్ష్యంగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. 1993లో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో యం. ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశారు. ఎల్.ఎల్.బి. 2002లో వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. యం .ఎస్.డబ్ల్యూ (సోషల్ వర్క్) 2010లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.
అవార్డులు:
1985లో అప్పటి భారత రాష్ట్రపతి జైల్‌సింగ్ చేతులమీదుగా రాష్ట్రపతి స్కౌట్ అవార్డు అందుకున్నారు.
1988లో మదర్ థెరిసా చేతులమీదుగా బెస్ట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు
1991వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడలు రంగంలో యువజన పురస్కారం అందుకున్నారు.
1996లో ఇంటర్నేషనల్ యూత్ సెంటర్, న్యూ ఢిల్లీ వారిచే అక్షరాస్యత కొరకు చేసిన కృషికి చిహ్నంగా నిఖిల్ కోయితారా అవార్డును అందజేశారు.
భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి ద్వారా 1997 సంవత్సరంలో జాతీయ యువజన పురస్కారం అందుకున్నారు.
2006 ద్వారా అప్పటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిచే రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డును అందుకున్నారు.
అభ్యుదయ సేవా సమితిలో పనిచేస్తున్నప్పుడు అత్యుత్తమ సామాజిక సేవకు గాను జిల్లా స్థాయి అవార్డులు (6) ఆరు అందుకున్నాను.
సందర్శించిన దేశాలు:
1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కొరకు కొలంబో, శ్రీలంక (25 రోజులు) సందర్శించారు.
1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కొరకు కెనడాలోని వాంకోవర్ (4 నెలలు) సందర్శించారు.
మానవ సేవే మాధవ సేవ:
"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలిచే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్నవారే గొప్పవారు అవుతారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసేవారిని ఇష్టపడతాడు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.
సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్నీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరముంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో భాగస్వాములు కావడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసేవారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా సేవ చేస్తున్నట్లే. 35 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పరశురాములు ప్రతిఒక్కరికి ఆదర్శం కావాలని కోరుకున్నాను..
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
2, నవంబర్ 2023, గురువారం
కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్)
కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్):
“కోటి విద్యలు కూటి కోరకే” అని మన పూర్వీకులు అప్పుడప్పుడు ఒక సామెత చెప్పేవారు. ఇలాంటి సామెతలు మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనుభవాలను వ్యక్తీకరించడం ద్వారా జీవిత సత్యాలను వ్యక్తపరుస్తారు. మనిషి ఎంత చదువు చదివిన, ఎన్ని కోట్లరూపాయలు సంపాదించినా కడుపు నింపుకోవడానికే తప్ప చనిపోయిన నాడు చిల్లిగవ్వ తీసుకొనిపోలేము అని ఈ సామెత సూచిస్తోంది.
దేశంలో రోజు రోజుకు సంపన్నుల సంపద రెట్టింపై కోటీశ్వర్లుగా మారుతున్నప్పటికీ పేదలు మాత్రం మరింత పేదలై కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తున్నారు. రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదల కన్నీళ్లు తుడిచే దెవరు? వారి కడుపు నింపే దెవరు?
నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బోడుప్పల్ మేడిపెల్లి ప్రాంతంలో రోడ్ పక్కన జనాలు గుమికూడారు. అందరూ ఆసక్తితో చూస్తుండగా నేను కూడా బండి ఆపి చూడగా అక్కడ సర్కస్ ఆడుతున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు గుమ్మడవెల్లి లో చూసిన సర్కస్ ఆట మళ్లీ చూసినప్పుడు అద్భుతమైన ప్రదర్శన చూసిన అనుభూతి కలిగింది. భార్య భర్త మరియు ఇద్దరు పిల్లల సాయంతో సర్కస్ నిర్వహిస్తున్నారు. తండ్రి ఒక ఇనుప రాడ్ ను గొంతుకు అదిమి పెట్టుకొని గట్టిగా ఆ ఇనుప రాడ్ ను వంచడం ప్రారంభించాడు. అక్కడ జనాలందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తుండగానే రాడ్ ను గొంతులో దిగకుండా వంచాడు. గొంతుకు అదిమి పట్టి రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం. పట్టు తప్పితే ప్రాణం ఉండదని తెలిసి కూడా కుటుంబాన్ని పోషించాలనే తండ్రి తపన అందరినీ ఉద్వేగానికి గురి చేసింది. అంతేకాదు పొడవాటి వెదురు కర్రను తీసుకుని ఆ చిన్న పాపని కర్ర చివరన ఉంచి నోటి సహాయంతో పాపా కింద పడకుండా కర్రను పట్టుకొని ఇలాంటి ఎన్నో విస్మయాన్ని కలిగించే విన్యాసాలు చేశారు. ఎత్తైన కర్రలకు తాడు కట్టి ఆ తాడుపై చిన్న పాపని నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతరించిపోతున్న కళలను కుటుంబ పోషణ కొరకు నేటికీ సర్కస్ వంటి ప్రదర్శనలు చేస్తుండటం బాధాకరమైన విషయం. అయినా వారికి సర్కస్ జీవన ఉపాధి. రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్లుగా వారు ప్రదర్శనలు చేస్తేనే కడుపు నింపుకో గలరు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలతో చేయించడం విచారకరం.
సర్కస్ ఆటని కొనసాగించడానికి కారణం అంతరించిపోతున్న కళను బ్రతికించడం. తనని తాను బ్రతికించుకోవడం.
నేటి తరం పిల్లలకు సర్కస్ గురించి వివరించడం అవసరం:
తిండి కోసం మనిషి పడే తపన మరియు తల్లిదండ్రులు పడే కష్టం గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వారికి సర్కస్ లో చిన్న పిల్లలు చేసిన విద్య ఏ విధంగా నేర్చుకో సాగారనేది వారికీ వివరంగా వివరించాలి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ. పుట్టిన మనిషి మట్టి బొమ్మ కాదు. మనిషి మరొక బ్రహ్మ అన్నట్లు ఆచరిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని వారు తెలుసుకోవాలి.
చిన్న పాప తాడుపై ఎలా నడవగలిగింది అనే సందేహం కలుగకమానదు.
సాధన చేయుమురా నరుడా సాదించనిదే లేదురా అన్నట్లుగా సాధన చేస్తే సాదించనిది ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. చేయాలనే తపన తాలిమి తపస్సు ఉంటే సాధ్యం కానిది ఉండదు. గొంతులో దిగకుండా రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం అయినప్పటికీ ఆయన చేసిన సాధనకు రాడ్ వంగక తప్పదు. ప్రతి మనిషి కష్టాలను దీటుగా ఎదుర్కోగలిగితే కష్టాలు వెనుదిరగక తప్పదు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475
29, అక్టోబర్ 2023, ఆదివారం
ఎన్ని"కలలు"
ఎన్ని"కలలు":
తరాలు మారినా పేదోడి తలరాత మారడం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వం వైఫల్యమా లేదా ప్రజల వైఫల్యమనేది అతికొద్ది మందికి తెలిసిన విషయం.
నీతి, నిజాయితీ, న్యాయం పట్ల నిబద్ధత ఉన్న వారిని ఎన్నుకోకుండా, డబ్బులు ఇచ్చినవారినే ఎన్నుకోవడమే దీనంతటికి కారణం. దీన్నిబట్టి మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రజలు అభివృద్ధి కోరుతున్నారా! అవినీతి కోరుతున్నారనేది అర్ధం కానీ ప్రశ్నగా మారింది. ప్రజలు అభివృద్ధి కోరుకున్నట్లైతే అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలి, అవినీతి కోరుకున్నట్లైతే అవినీతిపరుడైన నాయకున్ని ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో అన్ని పార్టీలు డబ్బులు పంచడం మామూలే. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడిక లేదా డబ్బులు తక్కువ ఇచ్చేవాడిక లేదా అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి వేయాలనేది ప్రజల నిర్ణయం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అన్నట్లుగా ఓటు వేసే సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యత అవగాహన తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎన్ని"కలలు":
ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలు సంతోషంగా ఓటు వినియోగించడానికి ముందడుగు వేసేవారు. ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నిరుపేదలకు చేయూత అందుతుందని, ఎన్నికల సమయంలోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే కలలు కంటారు. అప్పట్లో నాయకులు ఇచ్చే హామీలు నమ్మదగినవిగా ఉండేవి. అందులో కొంతైనా హామీలు నెరవేరేవి. కానీ నేడు నాయకులిచ్చే హామీలు అమలు అవుతాయనేది పైనున్న దేవుడికే తెలియాలి హామీలిచ్చిన నాయకుడికి తెలియాలి. అంత నమ్మశక్యంగా ఉంటాయనేది ప్రతి ఓటరుకు తెలిసిందే. ఒకాయన ఈసారి మేము గెలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువే ఇస్తామని, మరొకాయన మేము గెలిస్తే అంతకంటే తక్కువకు ఇస్తామని హామీలిస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా అనేది ఓటరు ఆలోచన చేయాల్సిన అవసరముంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలు అయోమయం అవడమే తప్ప అవసరానికి ఒక పథకం కూడా పేదోడికి అందదు. నిత్యావసర వస్తువుల ధరలు మండుతూనే ఉంటాయి. ధరలు పెరగడానికి కారణాలు వెతుకుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. అది నాయకుల కనికట్టు మంత్రం. ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ఉపయోగపడే ఉపన్యాసం ఒకటి ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. ఓట్లు దగ్గరపడ్డాక జనాలలో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గించి ఓట్లు అయినాక అంతకంత పెంచడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా ఓట్లకు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. తాగనివాడికి కూడా తాగడం నేర్పుతారు ఫ్రీ గానే వస్తుంది కదా అలా మద్యానికి అలవాటు చేసి ఓట్లయినాక మద్యం రేట్లు పెంచుతారు తాగుడుకు బానిసైన వారు అప్పుచేసి అయినా తాగుతారు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారు ఇది నాయకులకు తెలుసు మందు ఫ్రీగా పోస్తే మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి డబ్బులు వస్తాయని. ఓట్లేసే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటారేమోగాని జనాలు తిరగబడితే అదోలా ఉంటుందన్న సంగతి నాయకులు ఎరుగరు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రజలకు అవసరం అంతేగాని పెన్షన్ పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నారు. ఏ పని చేయక అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా నాయకుల నటన అత్యంత అద్భుతంగా ఉంటాయి. నిజ జీవితంలో సినిమా నటుడు కూడా నటించనిది నాయకులు నటించి నటనలో జీవిస్తారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుందనేది ముమ్మాటికీ నిజం.
నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది ప్రజలకు పెద్ద సవాలే.. నిజాయితీ నాయకుడిని గుర్తించడం ఎలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఓటరు మదిలో...
ప్రజాధనాన్ని వృధా చేయకుండా చర్యలు తీసుకోవాలి:
ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రజా ధనం వృధా చేయడం వల్ల రానున్న రోజుల్లో పేదలు తినడానికి తిండి లేని పరిస్థితి చూడాల్సి వస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉండాలి. సోషల్ మీడియా ప్రచారాలు కూడా చాలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు ను సక్రమంగా వినియోగించుకునేలా ఎన్నికల సమయానికి రెండు నెలల ముందు మద్యాన్ని నిషేధించాలి. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలి.
చట్టాలు మారాలి:
ప్రజా ప్రతినిధుల నేరచరిత్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేర్చడమే కాకుండా, ఓటర్లు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండేలా ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో అన్ని అంశాలను పొందుపరచాలి. అప్పుడే ఓటరు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. అంతేకాకుండా అభ్యర్థి గెలిచిన తర్వాత అవినీతికి పాల్పడినట్లైతే ఆ సమయంలో ఓటర్లు రీకాల్ చేసుకొని మరొకరిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల అవినీతిని అరికట్టే అవకాశముంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ అమలులో ఉంది. ఇలాంటి దేశాలలో మాత్రమే సుపరిపాలన పరుగులు పెడుతుంది. ఇలాంటి చట్టాల కోసం యువత కృషి చేయాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.
నిజాయితీ గల నాయకులు ఉన్నారా?
90 శాతం మంది నాయకులు అవినీతిపరులు అయితే 10 శాతం మంది నిజాయితీ గల నాయకులు అని చెప్పవచ్చు. ఉదాహరణకు గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికి సాధారణ జీవితం కొనసాగించడం గొప్ప విషయం. సమాజానికి గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు అవసరం. ఈరోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరాలకు సరిపడా సంపాదన వెనకేసుకుంటున్నారు. గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు సంపాదన కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు ఎన్నుకోరు? ప్రజలే మోసపోతున్నారు కానీ నాయకులు మోసం చేయడం లేరన్న విషయం గమనించాలి.
గుమ్మడి నర్సయ్య తో పాటు జయ ప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని ప్రజలు గుర్తించకపోవడం విచారకరం. సమాజంలో మార్పు రావాలంటే సమస్యలపై పోరాడే నాయకుడు కావాలి. అప్పుడే పేదలకు సరైన సంక్షేమ పథకాలు అందుతాయి.
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి సరైన నాయకుడిని సరైన సమయంలో ఎన్నుకోవాలి..
పేదోడి కల నెరవేరాలంటే. ఓటు ఆయుధం గా ఉపయోగించిన నాడే సాధ్యపడుతుంది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475
5, అక్టోబర్ 2023, గురువారం
పల్లె నుండి ప్రపంచ ఆర్ధికవేత్తగా తెలంగాణ బిడ్డ
సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా!
అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా!
దాశరథి గారు రచించిన ఈ పాట భక్తులకు భగవంతుని పట్ల మరింత భక్తిని కలిగించింది. ఎంతోమంది నిరాశ ప్రజలను ఉత్సాహ పరిచింది. నిరుపేద విద్యార్థులను ప్రభావితం చేస్తూ వారిని ప్రయోజకులను చేసింది. చదువుకు పేదరికం అడ్డంకి కాదని, అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా స్ఫూర్తినిచ్చింది. ఈ చదువులు మనకెందుకులే అనుకున్న నిరుపేద విద్యార్థుల మదిలో చదవాలనే ఆశను రేకెత్తించాయి వారి ప్రతిభను ఖండాంతర ఖ్యాతి గడించేలా చేసింది. పల్లె వాసులను పట్నం వైపు వెళ్లేలా ప్రభావితం చేసింది. పల్లెటూరి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది.
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ! అన్నట్టుగా ప్రతి మనిషికి సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం, తపన, తపస్సు ఉంటే మనిషి సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదనడంలో సందేహం లేదు. ప్రతి మనిషి జీవితంలో అవరోధాలు, ఆటంకాలు సహజమే కానీ వాటిని అవకాశాలుగా మలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని మరోసారి నిరూపించిన ఉస్మానియా లో వికసించిన పేదింటి విద్య కుసుమం, సర్కార్ బడి నుంచి అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఎదిగిన తెలంగాణ వ్యక్తి, స్నేహాశీలి, మృదుస్వభావి, విద్యావేత్త, అనన్య ప్రతిభ కలిగిన రచయిత, సంపాదకుడు, సలహాదారు, బహుభాషా కోవిదుడు, "రవీందర్ రేనా".
"రవీందర్ రేనా" గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయం కృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా బోధన మరియు పరిశోధన రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి ఆయా దేశాలు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
రవీందర్ రేనా ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
విద్యార్హతలు:
తెలంగాణ, హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పిఎచ్. డి (గోల్డ్ మెడల్), ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఏ పూర్తి
చేశారు.
తెలంగాణ, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో ఎల్ ఎల్ బి. (బ్యాచిలర్ ఆఫ్ లీగల్ లాస్) పూర్తి చేశారు.
తమిళనాడు అన్నామలై విశ్వవిద్యాలయం లో బి.ఇడి. (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) పూర్తి చేశారు.
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో ఎకనామిక్స్‌లో బి ఏ పూర్తి చేసారు.
అవార్డులు:
2011లో నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ పరిశోధకుడి అవార్డును అందుకున్నారు.
2012లో అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది అవార్డు అందుకున్నారు.
2012 నుంచి 2022 వరకు విద్య రంగంలో ఆయన అందించిన సేవలకు పలు అవార్డులు అందుకున్నారు.
2022 లో డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వారిచే ఉత్తమ పరిశోధకుడిగా గుర్తింపు లభించింది.
2023 లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ICERT) వారిచే ఏకలవ్య అవార్డు అందుకున్నారు.
2023 ఒలింపస్ ఇంటర్నేషనల్ అవార్డు (OIASA) అందుకున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు
ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (UA) అవార్డును అందుకున్నారు.
అతని పరిశోధన, రచనల ఆధారంగా, అమెరికన్ హిస్టారికల్ సొసైటీ, USA వరల్డ్ హూ ఈజ్ హూ ఇంటర్నేషనల్‌లో అతని ప్రొఫైల్‌ను నమోదు చేసింది.
అతను ప్రపంచంలోని టాప్ 01% పరిశోధకులలో ఒకడు.
డబ్లిన్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (UA) అవార్డు మరియు గ్లోబల్ ఎకనామిక్స్ జడ్జిస్ ప్యానెల్ చైర్మన్ గా ఎంపిక చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం.
ప్రచురణలు:
పరిశోధన పుస్తకాలు - 10; పాఠ్యపుస్తకాలు - 5; స్టడీ మెటీరియల్ - 4, జర్నల్ పబ్లికేషన్స్ (పీర్ రివ్యూడ్ ) - 150, అంతర్జాతీయ -120; జాతీయ -31, సవరించిన పుస్తకాలలో అధ్యాయాలు- 50, వార్తా పత్రికలు, మ్యాగజైన్‌లు మరియు వెబ్‌సైట్‌లలో కథనాలు – 125 కంటే ఎక్కువ.
బి సి రిజర్వేషన్ కోసం పోరాటం :
1995లో ఉస్మానియాలో చదువుతున్న సమయంలో వెనుకబడిన బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య తదితరులు నేతృత్వంలో విద్యార్థి నాయకుడిగా రవీందర్ రేనా పోరాడారు. ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుతో బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించాలని అనేక చర్చలు జరిపారు. రవీందర్ రేనా నిరుపేదలకు న్యాయం కోసం తీవ్రంగా పోరాడిన విద్యార్థి నాయకుడు.
కుటుంబ నేపథ్యం, విద్యాబ్యాసం:
రవీందర్ రేనా గారు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ఎర్రబెల్లి గ్రామంలో నిరుపేద రైతు కుటుంబానికి చెందిన చంద్రమౌళి, రాజమ్మ దంపతులకు సెప్టెంబర్ 18, 1969 నాడు జన్మించారు. 1975 నాటి కాలంలో ఎర్రబెల్లి గ్రామం ఎలాంటి సౌకర్యాలు నోచుకోని పల్లె కనీసం బస్సు, కరెంటు, త్రాగు నీరు సౌకర్యం లేని గ్రామం. ఎర్రబెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. గురువులు రవీందర్ గారికి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని మన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ప్రోత్సహించేవారు. గురువుల ప్రోత్సాహమే ఆయనలో పట్టుదల పెంచింది. కనీసం చదవడానికి కరెంట్ సౌకర్యం లేనప్పటికీ మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా కిరోసిన్ దీపం సహాయంతో మొక్కవోని దీక్షతో చదివారు. ఆ తర్వాత ఎనిమిదొవ తరగతి చదువుకునేందుకు తన గ్రామంలో పాఠశాల లేనందున ఎర్రబెల్లి నుండి భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల వరకు ప్రతి రోజు కాలినడకన వెళ్లి ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పూర్తి చేశాడు. అంతేకాదు 10వ తరగతి చదువుతున్నప్పుడు పుస్తకాలు, పరీక్ష ఫీజులు కట్టేందుకు డబ్బులు లేని సమయంలో తల్లి వద్ద డబ్బులు లేవని గ్రహించి ఊళ్ళో కూలి పనులు చేసి పుస్తకాలు కొని చదివి పాసయ్యాడు. చదువుపై ఆయనకున్న ఆసక్తికి ఇది నిదర్శనం. హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి మరియు ప్రాథమిక పాఠశాలలో శ్రీ సోమలింగం వంటి చాలా మంది ఉపాధ్యాయుల నుండి ప్రేరణ పొందారు. హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో బట్టల దుకాణంలో నెలకు 80 రూపాయల జీతంతో దినసరి కూలీగా పనిచేస్తూ డిగ్రీ పాసయ్యారు. బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతోనే గడిచింది. తల్లి గ్రామంలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తల్లి కష్టాలు చూడలేక చలించిపోయాడు, తనను నమ్ముకున్న కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చదువు సరైన మార్గమని, కష్టాలను అధిగమించేందుకు చదువు ఆయుధమని భావించాడు. తర్వాత పై చదువుల కొరకు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ పిఎచ్. డి పూర్తి చేశారు. ఆయన ప్రతిభకు పిఎచ్. డి లో గోల్డ్ మెడల్ రావడం విశేషం, ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఏ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ నుంచి బీఈడీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పటికీ ఆయనది ఎంతెత్తు ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వం. బాల్యమంతా బాధల తోనే గడిచిన ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టుసడలని పట్టుదలతో ప్రయత్నించి విజయాలను సొంతం చేసుకున్నారు. మూర్తీభవించిన మానవత్వానికి మరో పేరు రవీందర్ రానే. పలు దేశాలలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ స్వదేశం పై మమకారంతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా శ్రీశ్రీ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా మరియు న్యూఢిల్లీలోని స్పర్ష్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, తన కొడుకు మరియు కుమార్తెను కూడా స్వదేశంలోనే చదివిస్తుండడం ఇది దేశంపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. అతని విద్యాభ్యాసమంతా భారతదేశంలోనే కొనసాగింది. బోధన మరియు పరిశోధనలో 31 సంవత్సరాల అనుభవం. భారతీయ సేవా 5 సంవత్సరాలు; 26 ఏళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను 40 కంటే ఎక్కువ దేశాలు సందర్శించాడు మరియు ఎరిట్రియా, పాపువా న్యూ గినియా, నమీబియా, దక్షిణాఫ్రికా, రష్యా, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో పనిచేశాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీందర్ రానే గారి జీవితం నిరుపేద విద్యార్థులకు ఆదర్శం.
యువతకు సందేశం:
ఆశయ సాధనకు పేదరికం అడ్డు కాజాలదని, ప్రతి విద్యార్థి తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకునే దిశగా పట్టుసడలని ప్రయత్నం చేస్తూ సాధించేవరకు శ్రమించాలి. అప్పుడే విజయం మన సొంతం.
అసాధ్యమనే పదంలో "అ" అనే అక్షరాన్ని పక్కన పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధ్యమే. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం. సమస్యలు వచ్చాయని సతమత పడకుండా అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని పలు అంతర్జాతీయ సదస్సుల్లో యువతకు ఆయన సందేశాన్ని అందించారు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
24, సెప్టెంబర్ 2023, ఆదివారం
మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..
మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..
గాంధర్వ లోకాలనుండి భూలోకానికి దిగి వచ్చిన పాటల పూదోట. ఆ తోటలో విరబూసిన పసిడి పంట ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతు విప్పితే అమ్మ జోల పాడినట్లుగా పసిపాప కూడా హాయిగా నిద్రలోకి జారుకోవాల్సిందే అంత అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులకు పసందైన వీణుల విందునందించారు. ఆయన స్వరం అద్భుతం, ప్రభంజనం అనన్య సామాన్యం. ఆయన పాట వింటే గాయపడిన హృదయాలు సైతం ప్రశాంతంగా తన్మయత్వంలో మునిగిపోవాల్సిందనడంలో అతిశయోక్తి లేదు. విభిన్న స్వరాలతో పాటలు పాడుతూ తన గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. బాలు గారి గొంతులో పలుకని తెలుగు పదం లేదు. పాడనీ రాగం లేదు. సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఘనుడు గానగంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం.
బాలు గారి పాట తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన శ్రావ్యత మరియు ఆ స్వరంలో స్పష్టత నిజానికి బాలు గారి స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సన్నివేశానికి అనుగుణంగా ఎమోషనల్ గా, సహజంగా పాటకు ప్రాణం పోయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మించిన వారు లేరనే చెప్పాలి. దైవభక్తి, దేశభక్తి గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, అనేకము సందార్భాను సారముగా రాగయుక్తముగా భావ యుతముగా వైవిధ్యభరితమైన వేల పాటలు పాడి తెలుగు వారి మదిలో శాశ్వత స్థానాన్ని పొందిన అమరగాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు.
ఐదు దశాబ్దాల పాటు సాగిన ప్రస్థానంలో తెలుగు పాటలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తిరుగులేని గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, 16 భాషల్లో 50,000కు పైగా అత్యధిక సంఖ్యలో గీతాలను ఆలపించిన గాయకుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
ఆయన ఆలపించిన గీతాలు మరియు ఆయన చేసిన కృషికి ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 25 తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వం నుండి అనేక ఇతర రాష్ట్ర అవార్డులు అంతేకాకుండా ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఎఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోవడం గొప్ప విషయం. తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగిన విషయం. 8 ఫిబ్రవరి 1981 న కన్నడలో 24 గంటల సమయంలో ఎలాంటి విరామం తీసుకోకుండా ఏకంగా 27 పాటలు ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. కన్నడంలో కాకుండా తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు రికార్డు చేసి రికార్డు సృష్టించారు.
కుటుంబ నేపథ్యం:
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరికథా కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు 4 జూన్ 1946 నాడు జన్మించారు.
ఆయన తండ్రి హరికథా కళాకారుడు అవడంవల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతంపై ఆసక్తి కలిగింది. తన తండ్రికి కూడా సంగీత కళాకారుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. బాలసుబ్రహ్మణ్యం చిన్నతనంలోనే సంగీత సంజ్ఞామానాలను అభ్యసించి, తన స్వయంకృషితో సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనం నుండే పాటల పోటీలో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఇంజనీర్ కావాలనే ఉద్దేశ్యంతో అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. బాలు గారికి మొదటగా సంగీత కళాకారుడిగా కాకుండా తన తండ్రి ఆశయం మేరకు ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది కానీ ఇంజనీరింగ్ చదివే సమయంలో అనారోగ్య కారణంగా మధ్యలోనే చదువు మానేశాడు. ఆ తర్వాత గాయకుడిగా రాణించడానికి నిర్విరామ కృషి చేశారు.
సినీరంగ ప్రవేశం:
ఎస్పీ కోదండపాణి స్వరపరిచిన తెలుగు సినిమా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న లోని 'ఏమియే వింత మోహం' పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా 1966 డిసెంబర్ 15న అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1968 లో కోదండపాణి స్వరపరిచిన సుఖదుఃఖాలు చిత్రంలో "మేడంటే మేడ కాదు" పాట తెలుగు చిత్రసీమలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతున్న శంకరాభరణం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం బాలసుబ్రహ్మణ్యం గారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఆయన కృషికి ఉత్తమ నేపధ్య గాయకుడిగా జాతీయ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత సంవత్సరం 1981 లో "ఏక్ దుయుజే కే లియే" హిందీ చిత్రానికి మరో జాతీయ అవార్డు లభించింది. ఆయన గాత్రం అందించిన ఉత్తమ చిత్రాలు స్వాతిముత్యం, సాగర సంగమం, రుద్రవీణ, మాతృదేవోభవ, కే విశ్వనాధ్ గారు నిర్మించిన చిత్రాలన్నీ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవే, అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువ బాలు గారు పాడినవే.
1989లో సల్మాన్ ఖాన్ నటించిన హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" లో దిల్ దీవానా పాట కు బాలు గారు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన చాల చిత్రాలలో ప్లేబాక్ సింగర్ పనిచేసారు. బాలు గారు మరియు లతా మంగేష్కర్ కలిసి పాడిన హిందీ చిత్రం "ఆప్కే హై కౌన్" లోని "దీదీ తేరా దేవర్ దీవానా " పాట అత్యంత ప్రజాధారణ పొందడమే కాక హిందీ చలన చిత్రంలో తనకంటూ మంచి గుర్తింపు లభించింది.
బాలు గారు కమల్ హాసన్, రజనీకాంత్ , విష్ణువర్ధన్ , సల్మాన్ ఖాన్ , కె. భాగ్యరాజ్ , మోహన్ , అనిల్ కపూర్ , గిరీష్ కర్నాడ్ , జెమినీ గణేశన్ , అర్జున్ సర్జా , నగేష్ , కార్తీక్ మరియు సహా పలు కళాకారులకు వాయిస్ ఓవర్ కూడా అందించారు.
సాధించిన అవార్డులు:
2001లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
2012లో బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు.
2015లో, అతను కేరళ ప్రభుత్వం నుండి హరివరాసనం అవార్డును అందుకున్నారు.
2016 లో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించబడ్డాడు.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 25 సెప్టెంబర్ 2020 న అందుకోవాల్సిన పద్మ విభూషణ్ అవార్డు కోవిడ్-19 కారణంగా ఆలస్యమవడం మరియు కోవిడ్-19 కారణంగా ఆయన 25 సెప్టెంబర్ 2020 న మరణించడం బాధాకరం ఆయన మరణానంతరం 2021 పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.
ఎందరో నటీనటులకు వారి హావభావాలకు, అభినయ రీతులకు అనుగుణంగా పాటలకు ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటకు అసలైన వారసుడు అయ్యాడు. పదాల సరళిని జాగ్రత్తగా గమనిస్తూ అతని విరామ చిహ్నాలు అతని పాటను పండితులకు దగ్గర చేశాయి శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.
మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదనడంలో అతిశయోక్తి లేదు. భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచాయి. చరిత్రలో నిలిచిపోయారు. బాలు గారి పాట చిరస్మరణీయం.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475
21, సెప్టెంబర్ 2023, గురువారం
చరవాణి రెండు పార్శ్వాలు
చరవాణి రెండు పార్శ్వాలు
నేడు మనిషి కనిపెట్టిన సాంకేతిక సాధనాల్లో ఒకటైన మొబైల్ ఫోన్ మానవాళికి ఒక పక్క విలువైన సమాచారాన్ని అందజేస్తున్నప్పటికీ మరో పక్క యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తోందని, వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ లాభ,నష్టాలు అనేవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం ఉపయోగించే పద్ధతి పై ఆధారపడి ఉంటుందన్న విషయం మాత్రం సుస్పష్టం. మార్టిన్ కూపర్ అనే అమెరికన్ ఇంజనీర్ ఎన్నో మంచి ఆలోచనలతో మరియు గొప్ప ఆశయంతో అవిశ్రాంతంగా పనిచేసి ఏప్రిల్
3, 1973 న మొబైల్‌ని అందుబాటులోకి తెచ్చారు. అప్పటినుండి మొబైల్ ఫోన్
కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ మానవాళికి అనేక విధాలుగా సేవలందిస్తుంది.
మొబైల్ యొక్క ప్రధాన లక్ష్యాలు దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకొనుటకు వైద్యం, విద్య బ్యాంకింగ్ సేవలు మరియు రైలు మరియు రవాణా సేవల సమాచారాన్ని అందించడంతోపాటు సందేశాలు పంపడం,సంగీతం వినడం, సినిమాలు చూడటం,చరిత్రలను తెలియని విషయాలను తెలుసుకోవడం,లాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఓ సర్వే వెల్లడించింది. నవంబర్ 2022 సర్వే గణాంకాల ప్రకారం, ప్రపంచ జనాభా
8 బిలియన్లు, అందులో 5.44 బిలియన్లు మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది ప్రతి
ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది మరియు మొబైల్ లేకుండా జీవించలేము అనే
స్థాయికి చేరుకుంది.
నేటి తరంవారు మాత్రం మొబైల్స్ కి
బానిసై నిద్ర లేచినప్పటి నుండి పడుకునే దాకా గంటల తరబడి అవసరం లేని విషయాల కోసం
అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ, పనికిరాని విషయాలమీద పట్టు సంపాదించి, అవసరం లేని తగాదాలలో తలదూర్చి, పనికొచ్చే విషయాలను పక్కనపెట్టి తమ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచన
చేయకుండా మొబైల్స్ తో కాలక్షేపం
చేస్తున్నారు. మొబైల్ ఇప్పుడు కౌమారదశలో ఉన్న వారి దైనందిన జీవితంలో అంతర్భాగం గా
ఉంది.
ఎన్నో మంచి ఆలోచనలతో దూరంగా ఉన్న వారి
సమాచారం తెలుసుకునేందుకు మార్టిన్ కూపర్ మొబైల్స్ కనిపెడితే. నేడు అందుకు భిన్నంగా
దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకుంటూ, ప్రేమ, ఆప్యాయత,అనురాగాలతో కూడుకున్న మానవ సంబంధాలను మరిచి అయినవారికి
దూరమవుతున్నారు, దూరం వారికి
దగ్గరవుతున్నారు. కొంతమంది వారి వ్యక్తిగత
విషయాలను ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ మరియు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ప్రచారం చేసుకుంటూ
అనవసరమైన గొడవలకు దారి తీస్తూ మరియు సైబర్ బెదిరింపుల వలన ఆర్థిక వనరులను కోల్పోయి
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. మొబైల్ సాంకేతిక సాధనం
నుండి సామాజిక సాధనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొబైల్ యువతపై తీవ్ర ప్రతికూల
ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, కొంతమంది యువత మొబైల్ ఆధారంగా విద్యార్థులకు తెలియని విషయాలను
తెలుసుకోవడానికి ఒక అభ్యాస సాధనంగా ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు.
నిరుపేదల
సమస్యల పరిష్కారం కొరకు ట్విట్టర్:
ఒడిశాకు చెందిన డిజిటల్ కార్యకర్త
ఉపేంద్ర మహానంద్ ట్విట్టర్ సాయంతో పలు గ్రామాల్లోని పేదలకు పెన్షన్లు,రేషన్ కార్డులు, తాగునీరు అందించేందుకు శక్తి వంచన
లేకుండా కృషి చేస్తున్నారు. 41 ఏళ్ల అతను ఈ విధంగా ఇప్పటివరకు 50 కి పైగా కేసులను పరిష్కరించాడంటే అతన్ని అభినందించాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.మధ్యతరగతి కుటుంబం నుంచి
వచ్చిన ఉపేంద్ర తన తల్లిదండ్రుల కష్టాలను చూసి అభాగ్యులకు సహాయం చేయాలనే తపనతో ఈ
మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియా గురించి తెలుసుకోవడానికి, ఉపేంద్ర 2020లో ఫిర్యాదుల పరిష్కారం కోసం ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ అయిన 12baje12minuteనిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌కు
హాజరయ్యాడు. ఇక్కడ, అతను సోషల్ మీడియా ను ఎలా ఉపయోగించాలి మరియు ప్రజల సమస్యలను త్వరగా
మరియు పారదర్శకంగా ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల
ద్వారా లేవనెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ఒడిశా
ప్రభుత్వం యొక్క5T మోడల్ గురించి కూడా అతను తెలుసుకున్నాడు. తరువాత, అతను కంటెంట్ రైటింగ్‌లో శిక్షణ
పొందాడు, లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా
చేరుకోవడానికి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సరైన ట్యాగ్‌లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను
ఉపయోగించడం నేర్చుకున్నాడు మరియు వెనుకబడిన వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రావీణ్యం
సంపాదించాడు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వారు
నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ప్రముఖుల, విద్యావేత్తల నుండి ఆర్థిక సహాయం కొరకు ట్విట్టర్ ద్వారా సమాచారం
అందించి సహాయాన్ని పొందుతున్నారు. మొబైల్ ద్వారా పేదల సమస్యలకు సత్వర పరిష్కారం
అభినందనీయం.
విద్య, ఉద్యోగ, ఎమర్జెన్సీ
సేవలు అందిస్తున్న ఇంటర్నెట్:
కమ్యూనికేట్ చేయడంతో పాటు, ఆన్‌లైన్‌లో ప్రశ్నను శోధించడం, ఆన్‌లైన్‌లో వార్తలపై సమాచారాన్ని
పొందడం మరియు ఆన్‌లైన్‌లో విద్యా వీడియోలను చూడటం వంటివి. మొబైల్ ఫోన్‌లతో అభ్యాస
శైలి యొక్క ప్రభావాన్ని పెంచడమే కాకుండా, టీనేజ్ వారికీ సులభంగా
అధ్యయనం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. కరోనా సమయంలో విద్య. ఉపాధి కల్పనలో అనేక
మార్పులు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలు
విద్యార్థులకు ఇంటి నుండి చదువుకునే అవకాశాన్ని అందించాయి మరియు ఉద్యోగులు కూడా కరోనా
నుండి బయటపడటానికి ఇంటి నుండి పని చేసారు మరియు బ్యాంక్ సేవలు మరియు ఇతర ప్రభుత్వ
సేవలు కూడా అందించబడ్డాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ సేవలు బాగా అభివృద్ధి
చెందాయి. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపాధి
కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
ఉద్యోగావకాశాల కోసం కోచింగ్ ఫీజులు కట్టలేక యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న
ఎడ్యుకేషనల్ వీడియోలను చూసి సన్నద్ధమై ఉన్నత స్థాయికి చేరుకున్న పేద విద్యార్థులు
ఎందరో ఉన్నారు.
విద్యార్ధులపై
మొబైల్ ప్రభావం:
కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ ఆవిష్కరణకు ముందు పిల్లలపై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన
ప్రభావం లేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన గణిత లెక్కలు ఎలాంటి ఆధారం లేకుండా
అవలీలగా చేసేవారు. కానీ కాలక్రమేణా కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ రాకతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి లోపంతో పాటు
బద్దకస్తులుగా తయారువుతున్నారు. అంతేకాకుండా మొబైల్ ఆవిష్కరణకు ముందు పిల్లలు
మరియు యువకులు ఇతరుల కంటే ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉండేవారు. అలాంటిది మొబైల్
వచ్చాక సృజనాత్మకతను కోల్పోతున్నారు. ఈ విషయాన్నీ తాజాగా అధ్యయనం చేసిన పరిశోధకులువెల్లడించారు.
తల్లిదండ్రులు, గురువుల పర్యవేక్షణ లేనందున అతి చిన్న వయసు నుండే
మొబైల్ వ్యసనంగా మారింది. ఆ వ్యసనం పిల్లల మెదడుపై ప్రభావం చూపి సృజనాత్మకతను
తగ్గిస్తుందని పరిశోధకులు నిర్వహించిన న్యూరోఇమేజింగ్ అధ్యయనంలో వెల్లడైంది.
యువతతో పాటు యువకులు కూడా ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. మరికొందరు సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలు, సామాజిక స్పృహ కలిగిన సంఘటనలను షార్ట్ ఫిల్మ్‌లుగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్య కాలంలో ఫోటోల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫోన్‌లో ఫొటోలు దిగడం అలవాటుగా మారింది. అంతే కాకుండా రోడ్లపై ఫొటోలు దిగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మార్పు రాకపోవడం బాధాకరం.
ఆరోగ్యంపై మొబైల్ ప్రభావం:
ఎక్కువసేపు మాట్లాడటం వల్ల వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెవి, ముక్కు, గొంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య ఫుడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ రావడంవల్ల చాల మంది బయట నుండి ఫుడ్ ఆర్డర్స్ చేస్తూ ఇంట్లో వంటకి ప్రాధాన్యత ఇవ్వటంలేదు అందువల్ల అనారోగ్యాలకు గురిఅవుతున్నారు.
ఒకప్పుడు పిల్లలు అన్నం తిననని ఏడుస్తుంటే, తల్లి చందమామను చూపిస్తూ, వారికి ఊసులు చెబుతూ అన్నం తినిపించే వారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో
ఉన్న అమ్మలు పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో చందమామ లేకపోతే, స్మార్ట్ ఫోన్ లో పిల్లల వీడియోలు పెడుతూ, అన్నం తినిపించడం జరుగుతుంది. దీని వలన పిల్లలకు చిన్ననాటి నుండే
స్మార్ట్ ఫోనే అంటే ఆసక్తి పెరుగుతుంది. మొదటగా పిల్లలకు ఫోన్ ఆసక్తి పెంచేలా
చేస్తుంది తల్లిదండ్రులే.
మానవ
సంబంధాల పై మొబైల్ ప్రభావం:
మొబైల్
ఆవిష్కరణకు ముందు, మానవ సంబంధాలు విలువలు ప్రజా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. అన్నదమ్ములందరూ
ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆత్మీయత అనురాగాలతో ఉమ్మడి కుటుంబంలోజీవించేవారు.
అంతేకాదు గ్రామాల్లో సాయంత్రం వేళల్లో ఇంటి చుట్టుపక్కల వారందరూ కలిసి కష్టసుఖాలు
మాట్లాడుకునే వారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు
చెప్పేవే వార్తలు అనుకునేవారు. కానీ నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ
స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడుపుతున్నాయి. గ్రామాల్లో కూడా వీధుల్లో కూర్చుని
మాట్లాడుకునే వారు కరువయ్యారు. దీంతో పెద్దవాళ్లు కూడా సాయంత్రం అయితే చాలు టీవీలు ముందు, లేదా ఫోన్ పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ
మొబైల్స్‌తో సమయం వృధా చేసుకుంటూ మానవ సంబంధాలను దూరంచేసుకుంటున్నారు. ఒకే ఇంటి
సభ్యులు కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని మరిచిపోయి స్మార్ట్ ఫోన్ కారణంగా
మాట్లాడాలంటేనే విముఖత చూపుతున్నారు . ఆ రోజుల్లో పిల్లలు ప్రతి పండుగ మరియు వేసవి
సెలవులను గ్రామాల్లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనుండి బయటకు రావటంలేదు టీవీ, మొబైల్ తోనే కాలం గడుపుతున్నారు.
ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా పట్టించుకోకుండా పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి.
సెల్ ఫోన్ల అప్లికేషన్లు మనిషికి అన్ని సౌకర్యాలు కల్పించి క్షణాల్లో ఇంటి నుంచి
అన్నీ పొందే అవకాశం కల్పించి బద్దకస్తులుగా
చేశాయి. అందుకే మనిషికి ఫోన్ ఉంటే ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదన్న భ్రమలో ఉంటున్నారు.
స్నేహితులకు, బంధువులకు
దూరమవుతున్నాడు. ఫోన్లు లేనప్పుడు మనిషి ఎంత దూరమైనా వెళ్లి కలుసుకుని ఆప్యాయంగా
మాట్లాడేవాడు కానీ ఫోన్ రాకతో మనిషిలో ఆప్యాయతతో పలకరించే మనస్తత్వం మాయమైపోతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచాలి - వారిని సరైన మార్గంలో ఉంచడానికి. సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ కాకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి. తద్వారా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.
వ్యాసకర్త
కోట
దామోదర్
మొబైల్ : 9391480475
జీవితం ఆశ-నిరాశల సంగమం:
జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...






















