19, డిసెంబర్ 2022, సోమవారం

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట 
 
మనిషికి అవయవ లోపం ఉన్నా ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధిస్తున్న వారు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి స్ఫూర్తివంతమైన అంధ మహిళల సంకల్ప బలం ముందు అంధత్వం ఓడిపోయింది.  "లక్ష్మీ మీనన్" లోని అచంచలమైన ఆత్మవిశ్వాసమే ఆమెను కొందరు అంధ మహిళల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముందుకు నడిచేలా చేసింది. అంతేగాక కళ్లులేవనే ఆత్మన్యూనతా భావంతో వారు చింతించకుండా వారికి నైపుణ్యమైన శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా చేశారు. ఆమె అందించిన ప్రోత్సాహంతో వారు అంధత్వాన్ని లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసంతో జీవనం కొనసాగిస్తున్నారు.   

కేరళలోని కొచ్చిన్ కి చెందిన లక్షి మీనన్ వృత్తిరీత్యా డిజైనర్ మరియు వ్యాపారవేత్త. ఆమె కొచ్చిన్‌లో 'ప్యూర్ లివింగ్' అనే సంస్థను నడుపుతుంది. హరిత జీవన ప్రాముఖ్యత గురించి సమాజంలో అవగాహనను ప్రచారం చేయడం మరియు నిరుపేదలకు జీవనోపాధి కల్పించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. లక్షి మీనన్ రూపొందించిన అమ్మూమ్మతిరి / విక్స్‌డమ్‌ ప్రాజెక్ట్ క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా కేరళ రాష్ట్రంలోని వృద్ధాశ్రమాలు మరియు అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న ఎంతోమంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. 
లక్షి మీనన్ కళాత్మక ఆలోచనతో "పెన్ విత్ లవ్" అనే ప్రాజెక్ట్ ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఏకైక ఉద్దేశ్యంతో కాగితంతో పెన్నుల తయారీకి శ్రీకారం చుట్టారామె. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 మంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు చేపట్టిన ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రమంతటా విజయవంతమైంది. 
రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉండటం కోసం  "ఆరెంజ్ అలర్ట్" హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు.
ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు పొందారు.   
లక్షి మీనన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం నిరుపేదల జీవనోపాధికి వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. 

అవార్డులు మరియు విజయాలు:

• 'ఆజ్ కీ రాత్ హే జిందగీ' షోలో BBC వరల్డ్ నిర్మించిన స్టార్ ప్లస్‌లో అమితాబ్ బచ్చన్ ద్వారా సత్కారం పొందారు.
• అపెక్స్ సంస్థ అయిన “ఎర్త్ డే నెట్‌వర్క్ గ్లోబల్” ద్వారా అక్టోబర్ 2018లో “ఎర్త్ డే నెట్‌వర్క్ స్టార్‌”గా గౌరవింపబడ్డారు . సీడ్ పెన్‌కు ప్రత్యేక ప్రస్తావనతో పర్యావరణం & జీవావరణ శాస్త్రంలో చేసిన సహకారాల కోసం 195 దేశాలలో 50,000 అనుబంధ సమూహాలు.
• 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు.
• ఆమె ప్రతిష్టాత్మక వనిత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా లెక్కలేనన్ని అవార్డులు  గెలుచుకున్నారు. 
• ప్రఖ్యాత మేరీ క్లైర్ మ్యాగజైన్ యొక్క 'జీనియస్' జాబితాలో చేర్చబడ్డారు
• 2017లో, ఒక ఆన్‌లైన్ మీడియా సంస్థ ఆమెను వారి '10 మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్' జాబితాలో చేర్చింది.

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట:

ఒకరోజు లక్షి మీనన్ సెలవుదినంలో త్రిస్సూర్‌లోని ఆయుర్వేద బీచ్ రిసార్ట్‌ సందర్శన సందర్భంగా  అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు కొబ్బరిచెట్లు ఆమెని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తుండగా తోటమాలి ఎండిపోయిన కొబ్బరి ఆకులను తొలిగించడం ఆమె మదిలో ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది.  పల్లెటూళ్ళలో ఎండు కొబ్బరి ఆకులతో చీపురు తయారుచేయడం సాధారణ విషయం. ఆమె తన చిన్నతనంలో తన తల్లి మరియు అమ్మమ్మతో చీపుర్లు తయారు చేసిన సంఘటనలను గుర్తుచేసుకొని అక్కడున్న కొబ్బరి ఆకు పుల్లలతో చీపురు తయారుచేసే ప్రక్రియను ప్రారంభించారు. అలా ఆమె రోజుకు ఐదు చీపుర్లను సులభంగా తయారు చేయగలమన్న విషయాన్ని గ్రహించింది. అయితే చీపురు కట్ట మొదళ్ళను దగ్గరగా అదిమిపెట్టి ఉంచడానికి సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్‌కు బదులుగా టైలర్ షాపులోని తుక్కు గుడ్డ ముక్కలను ఉపయోగిస్తే బాగుంటుందని నిర్ణయించుకుంది. దీని వెనుక ప్రధాన కారణం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడడం. ఇలా తయారైన ఒక్కో చీపురు 250 రూపాయలకు అమ్మగలమనిపించింది ఆమెకు.  
ఆమె తయారుచేసిన మొదటి రెండు చీపురుర్లనూ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిని తన ఇంటి ఆవరణంలోని గోడకు అమర్చి ఆ చీపురు కట్టల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా తన మిత్రులకు, బంధువులతో పంచుకున్నారు. అవి చూసిన ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అనుచరులు వెంటనే వాటికోసం ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత కేరళ అంధుల ఫెడరేషన్ గురించి తెలుసుకున్న ఆమె అంధ మహిళలకు సహాయపడే కార్యాచరణ గురించి ఆలోచన చేయమని తన స్నేహితురాలు చేసిన సూచనపై దృష్టి సారించింది. ఆ మరుసటి రోజే ఫెడరేషన్ ను  సందర్శించి చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి తన ప్రతిపాదనను వారికి సవివరంగా వివరించగా చూపులేకపోయినప్పటికీ వారు దృఢసంకల్పంతో సానుకూలంగా స్పందించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. "చూల్" అంటే మలయాళం భాషలో చీపురు అని అర్థం. అలా సంగీతపరంగా సరికొత్త అక్షరాన్ని జోడించి "చూలాల" అని పేరు పెట్టారు.  దంలోని ప్రతి వ్యక్తి సగటున ర్లను తయారుధీమా ఏర్పడ్డాక అందుకుకల్పించడం ముమ్మరంగా ప్రయత్నించి ఈ చీపురు కట్టలను ఆర్టిసానల్ చీపురు విభాగంలో భాగంగా ఉంచాలని నిర్ణయించుకుంది. 
చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి ఆమె చొరవ తీసుకుని కేరళలోని విమానాశ్రయ అధికారులతో పాటు ఇతరులతో చర్చలు జరిపి అన్ని షాపుల్లో ఈ చీపుర్లు అందుబాటులో ఉండేలా చూసి "ఇది మన రాష్త్రం నుండి మీకు ఇవ్వబడుతున్న ఉత్తమ జ్ఞాపకం" అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజానికి ఇవి దృష్టి లోపం ఉన్న మహిళలచే ఎంతో కళాత్మకంగా తయారుచేయబడిన వెలకట్టలేని చీపురుకట్టలు. వైకల్యం మనిషికి తప్ప మనుసుకు కాదని నిరూపించిన ఈ మహిళా బృందానికి మరియు ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన లక్ష్మి మీనన్ కృషి బహుదా ప్రశంసనీయం.     

పెన్ విత్ లవ్:

 పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి చెట్లను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో “పెన్ విత్ లవ్” అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఆమె పెన్ తయారీకి ప్లాస్టిక్ బదులుగా కాగితాన్ని ఉపయోగించి పెన్ చివరభాగాన అగస్త్య చెట్ల విత్తనాలను అమర్చేలా డిజైన్ చేశారు. ఈ తరం వాళ్ళకి అగస్త్య వృక్షం గురుంచి అంతగా తెలియదనే చెప్పొచ్చు. ఆమె సుదీర్ఘ అన్వేషణ మరియు కృషి తర్వాత ఈ విత్తనాలను సేకరించారు.
అగస్త్య వృక్షాలలో ఔషధ గుణాలు అధికంగా ఉండటమే గాక ఆ చెట్టు ఆకులు మరియు పువ్వులు థైరాయిడ్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఎంతో ప్రత్యేకతలున్న ఈ పెన్ ఒకసారి వాడి పడేస్తే పెన్ చివరి భాగంలో ఉండే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయనే ఉద్దేశంతో రూపొందించారు. ఎదిగిన చెట్టు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుందని,  పర్యావరణాన్ని కాపాడడంకోసం మీరు ఒక పెన్ కొంటే సరిపోతుందని ఆమె నినాదం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మంది దృష్టి వైకల్యమున్న మహిళలు జీవనోపాధి పొందుతున్నారు.
2016 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మెగాస్టార్ మమ్ముట్టి చేత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. తొలి ఏడాది లక్ష పెన్నులు విక్రయించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, కేవలం నాలుగు నెలల్లోనే ఆ లక్ష్యాన్ని సాధించడం కొస మెరుపు.
ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది మహిళలలో ఒకరిగా ఎంపిక చేయబడటం గొప్ప విషయం. 

వరద బాధితులకు అండగా:

2018 వరదల కారణంగా అతలాకుతలమైన చేనేత కార్మికుల గ్రామమైన చేందమంగళంలో పుట్టిన 'చెక్కుట్టి' బొమ్మలు ఐక్యరాజ్యసమితి వరకు ప్రయాణించి ప్రేమ, కరుణ సందేశాన్ని ప్రపంచం నలుమూలల తెలిసేలా చేశాయి. చెందమంగళంలో వరదల కారణంగా చెడిపోయిన చేనేత వస్త్రాలతో తయారైన 'చెక్కుట్టి' బొమ్మలు భారత్‌లో రూ.25కు అమ్ముడుపోగా, విదేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా వసూలైన మొత్తాన్ని వరదలలో సర్వస్వం కోల్పోయిన నేత కార్మికులకు పంచారు. లక్షి మీనన్ వరద బాధితులకు అండగా నిలిచింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే గాక వారికి ఆర్ధిక   సహాయం అందించడం గొప్ప విషయం. 

మత్స్యకారులకు అభినందనల వెల్లువ:

వరదల సమయంలో రక్షకులుగా మారిన మత్స్యకారుల కోసం ఆమె ప్రవేశపెట్టిన బీమా పథకం విజయవంతమైంది. కేవలం రూ. 24 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా ఎవరైనా మత్స్యకారులను స్పాన్సర్ చేయవచ్చు. దీనిని ప్రోత్సహించడానికి, కేరళలోని వివిధ క్యాంపస్‌ల విద్యార్థులు మత్స్యకారులపై ప్రేమ అనురాగాలతో కూడిన సందేశాలను తెలియజేయడానికి పేపర్ బోట్‌లను తయారు చేశారు. ఆ పేపర్ బోట్‌లను ఇప్పుడు కొచ్చిలోని నిఫ్ట్ క్యాంపస్‌లో ప్రదర్శించడం గమనార్హం. 

లక్షి మీనన్ ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ద్వారా ఎందరో దృష్టి లోపం గల మహిళలు జీవనోపాధిని పొందుతున్నారంటే అందుకు కేరళ రాష్ట్రమే గాక భారతదేశం గర్వించదగ్గ విషయం.
 
రచన:
కోట దామోదర్ 
మొబైల్: ⁨+91 93914 80475⁩







13, డిసెంబర్ 2022, మంగళవారం

రైతుని రాజుల చూడాలి




దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవాడు జవాన్.. (సైనికుడు),

మనిషి ఆకలిని తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించేవాడు కిసాన్ (రైతు)..

దేశాన్ని కంటికి రెప్పలా రక్షించే జవాన్ ఎంత ముఖ్యమో, దేశ ప్రజల క్షుద్బాధ (ఆకలి) నుండి మనల్ని రక్షించే అన్నదాతకూడా అంతే ముఖ్యం.

ఈ ఇద్దరి శ్లాఘనీయ సేవలకు గుర్తింపుగా“జై జవాన్”, “జై కిసాన్”నినాదాలతో మన దేశం వారిని కీర్తిస్తుంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు. మనిషి జీవనానికి ఆహారం అత్యవసరం, ఆహారాన్ని సృష్టించే రైతన్నే లేకుంటే మనిషి జీవించడం అసాధ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక అని రైతుల‌ను అభివ‌ర్ణిస్తారు. అందుకే  'రైతే రాజు' అన్నారు.

రైతు నాయకుడు (రైతు బంధు):  

భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత కర్షక నాయకుడు చౌదరి చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1902న ఉత్తరప్రదేశ్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం జరిపిన అహింసా పోరాటంలో చరణ్ సింగ్ మహాత్మా గాంధీని అనుసరించడమే కాక అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1930లో, ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ వారు అతన్ని 12 సంవత్సరాలు జైలుకు పంపారు. స్వాతంత్య్రానంతరం అయన రైతు ప్రయోజనాలకోసం, రైతు చట్టాలకోసం ఎనలేని కృషిచేశారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై పరిభ్రమించేవి. ఆయన ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో కీలకపాత్ర పోషించి రైతులకు మేలు చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కరణ చట్టాలలో మార్పుల కొరకు జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలనీ అనేక ఉద్యమాలు చేపట్టి జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని చౌదరి చరణ్ సింగ్.  రైతు చట్టాల మార్పు కోసం కృషి చేసిన చరణ్ సింగ్ “రైతు బంధు” గా పేరుగాంచిరైతుల మనస్సులలో ప్రత్యేక ముద్ర వేశారు.  రైతుల కోసం చరణ్‌సింగ్ చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం “జాతీయ రైతు దినోత్సవం" గా ప్రకటించింది. కర్షక లోకానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనసమాధికి“కిసాన్ ఘాట్”గా నామకరణం చేసారు.

హరిత విప్లవం:

హరిత విప్లవం 1961లో ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్న సమయంలో ఈ విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని "రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్" ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించేందుకు కృషి చేసింది. అప్పటి భారత వ్యవసాయ మంత్రి MS స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. భారత ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉన్నప్పటికీ, గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుండి దిగుమతి చేసుకున్నారు మరియు పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. అది భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.

హరిత విప్లవంలోని ప్రధానాంశాలు:

1 . అధిక దిగుబడి వంగడాల వినియోగం.

2 . రసాయన ఎరువుల క్రిమిసంహారక మందుల వినియోగాన్ని పెంచడం.

3 . నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి.

4 . వ్యవసాయ యాంత్రికీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్దతులను అమలు చేయడం.

ఇవే కాకుండా భూసంస్కరణల అమలు, గ్రామీణ విద్యుతికరణ, మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపనలాంటివి కూడా హరిత విప్లవంలో భాగమే..  
హరిత విప్లవం కారణంగా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులతోపాటు పంటల దిగుబడి పెరిగింది. ఆహారధాన్యాలల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.

బ్రహ్మ కంటే గొప్ప:

రైతుని చిన్నచూపు చూస్తున్న ప్రతిఒక్కరు అన్నంలేనిదే మనం బ్రతకలేమన్న విషయాన్నీ గమనించాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మనిషికి ఎన్ని కోట్లరూపాయలున్నాఅన్నంతినే బ్రతకాలి తప్ప అన్నంలేనిది బ్రతకలేడు. మనిషి బ్రతికున్నంతవరకు అన్నం తప్పనిసరి. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నం పండించే రైతులు బ్రహ్మ కంటే గొప్పవారు. ప్రపంచానికి అన్నం పంచే రైతును "అన్నదాత" గా అభివర్ణించారు మన పూర్వీకులు.

రైతు చట్టాలు మారినా, రైతు కష్టాలు మారలే..

మన దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తున్నాయి కానీ ఒక వ్యవసాయరంగం మాత్రమే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయం. సారవంతమైన భూములు, తగినంత నీరు, సకల సౌకర్యాలన్నీ ఉన్నా గిట్టుబాటు ధరలేక రైతు మనుగడ సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వాలు చెబుతున్నా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో మాత్రం క్రియాశూన్యంగా ఉంటున్నాయి.  ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణమాఫీలు కేవలం వ్యవసాయం చేయని భూస్వాములకుఅందుతున్నాయి తప్ప భూమిలేక ప్రత్యక్షంగా దుక్కి, దున్ని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు మాత్రం అందడంలేదు. 10 ఎకరాలకంటే ఎక్కువఉన్న రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలు అందుతున్నాయి కానీ గుంట భూమిలేని కౌలురైతుకి రుణాలందకపోవడం శోచనీయం. ఒక వైపు గిట్టుబాటు ధరలేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వంనుండి వచ్చే రుణాలందక కౌలురైతు వ్యవసాయంపట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాణ్యమైన విత్తనాల కొరత వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. రైతు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతుధర గిట్టుబాటుధరలేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చడంకొరకు రైతులు  కూలీలుగా మారుతున్నారు.  కొందరు ఇతర పనులమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరికొందరు రైతులు భూములను కౌలుకిచ్చి పట్టణప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది రైతులు ప్రభుత్వ రుణాలందక పంట పండించడానికి  అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 

 

కోట దామోదర్

మొబైల్ : 9391480475


5, డిసెంబర్ 2022, సోమవారం

చెదిరిన "క్షౌరవృత్తి"




చెదిరిన "క్షౌరవృత్తి":

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి) కి ప్రాచీన చరిత్ర ఉంది.

మనుషులను జంతువులనుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తి కి ఉందనడంలో అతిశయోక్తిలేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు.
భారతదేశంలో కులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందునుండే ఈ వృత్తి ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని “నాయీ బ్రాహ్మణులు” (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి చేసే వారిని ఒక్కొక్క ప్రాంతంలోఒక్కో పేరుతో ప్రత్యేకంగా పిలుస్తారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపరంగా ఈ వృత్తిని నిర్వహించేవారిని "నాయీ" లుగా పిలుస్తుంటారు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.

తొలివైద్యుడు:

చారిత్రక ఆధారాల ప్రకారం క్షురకులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యులు శస్త్రచికిత్సప్రారంభించడానికి వైద్యుడి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లేడ్లు ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.

మొదటి వైద్యురాలు (మంత్రసాని):

గతంలో ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్టు) బదులుగా ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశువు జననం వరకు ‘మంత్రసాని’గా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం.
అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు.
కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది.
వైద్య, విద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
 
మంగళ వాయిద్యాల ప్రత్యేకత:

ప్రాచీన కాలం నుండి నాయీ బ్రాహ్మణులు(మంగళి) క్షౌరవృత్తి తో పాటు సంగీతం (మంగళ వాయిద్యాలు వాయించడం), వైద్యం కూడా వృత్తిగా నిర్వహించేవారు.
మంగళ వాయిద్యాలువాయించడంలో వీరు నిష్ణాతులు. మంగళ వాయిద్య సంగీతంలో భాగంగా వీరు సన్నాయి (నాదస్వరం),డోలు(శృంగభేరి) వాయించడం ఆనవాయితీగా వస్తోంది.
నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగంగా కొనసాగుతోంది. హిందూ దేవాలయాలలో దైవారాధనకువేదాలలోఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకుకూడా అంతే ప్రాధాన్యత ఉంది.నాదోపాసన చేయడం సాక్షాత్తూఆ పరబ్రహ్మను పూజించడమేనని భగవద్గీత పదవ అధ్యాయం 22వ శ్లోకంలో ప్రస్తావించబడింది.

హిందూ దేవాలయాలలో, నాదస్వరం వినిపించడం సర్వసాధారణ విషయం. గర్భాలయంలో ప్రతిష్టమైన దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనకు ముందు మంగళ వాయిద్యాలను వాయించడం మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహం, నూతనగృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు బ్రాహ్మణుడివేద మంత్రాలకుఎంత ప్రాముఖ్యత ఉందో మంగళ వాయిద్యాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

పుణ్యక్షేత్రాలలో నాయీ బ్రాహ్మణుల పాత్ర:

హైందవ సాంప్రదాయంలో పుట్టు వెంట్రుకల తొలగింపుకు చాలా ప్రాధాన్యముంది. ఈ ప్రక్రియను ఒక వేడుకగా నిర్వహించడం మనందరికీ తలుసు. అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం కలగడం సహజమే. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం ఒక ఆచారంగా మారింది. దైవ క్షేత్రాలలో “కళ్యాణ కట్ట” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో భక్తుల తలనీలాలను దేవునికి సమర్పించేందుకు తమ సేవలందిస్తారు కేశఖండనకారులు.
మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో అంతర్లీనంగా ఎన్నో శాస్త్రీయ అంశాలు దాగి ఉంటాయనేది నిర్వివాదాంశం. ఈ ఆచారవ్యవహారాలలో భాగమే "పుట్టువెంట్రకుల" వేడుక ఒకటి.

వివాహంలో నాయీ బ్రాహ్మణులపాత్ర:

సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత పందిట్లో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తాడు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు తొలగించి శుభ్రం చేస్తారు.

కేశాలంకరణ(క్షౌరవృత్తి):

మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉంచడానికి శుభ్రపరచడంశుభ్రంగా మరియుమరియు అందంగా మార్చడం "నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తి". పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి "కేశఖండనకేశఖండనం". మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. "ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచక తప్పదుాలి" అనేది జగమెరిగిన నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం . ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళానైపుణ్యం అనివార్యంఎంతో ప్రత్యేకం.

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో ఈ వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
 
రచయిత:

కోట దామోదర్
మొబైల్: 9391480475

14, నవంబర్ 2022, సోమవారం

వింతలెన్నో చూడ రండి




ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, అంతుపట్టలేని వింతలు, విశేషాలు ఉన్నాయి. మానవుడికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బుర పరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మలేని అద్భుతాలెన్నింటినో పరిశోధనలు చేసినప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు సరైన ఆధారాలు కనిపెట్టలేకపోతున్నారు . 

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఒకరోజు చెట్టు నుంచి రాలిన ఆపిల్ ను గమనించి, ఆపిల్ క్రింద పడటానికి గల కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందో వివరిస్తూ  విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు. 

ఒక వస్తువును పైకివిసిరినపుడు తిరిగి ఆ వస్తువు కిందకు పడటానికి కారణం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటంవల్లనే అని మనం చిన్నపుడు పాఠ్యపుస్తకాలల్లో చదువుకున్నాం.

కానీ పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే ..

గురుత్వాకర్షణ శక్తి ధిక్కరించిన చోట పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమే అని చెప్పొచ్చు. ఈ భూగోళం అంతా  గురుత్వాకర్షణ శక్తి కలిగివుందని మనకు తెలుసు. కానీ  ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాల గురుంచి మాత్రం చాలా మందికి తెలియదు


ప్రపంచంలో కేవలం ప్రదేశాలలోమాత్రమే గురుత్వాకర్షణ శక్తి  పనిచేయదని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు.


 1 . మాగ్నెటిక్ హిల్, లేహ్, లడక్, ఇండియా (Magnetic Hill, Leh Ladakh, India)

భారత దేశంలోని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో గల ప్రదేశాలు సుందర మనోహరమైన దృశ్యాలతో పర్యాటకులనుఆకర్షిస్తాయి. అటువంటి అద్భుతమైనఆకర్షణలలో “మాగ్నెటిక్ హిల్” (అయస్కాంత కొండ)ఒకటి. ఇది సముద్రమట్టం కంటే 14,000 అడుగుల ఎత్తులో ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతంలో లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. మాగ్నెటిక్ హిల్ తూర్పున సింధు నది ప్రవహిస్తుంది. మాగ్నెటిక్ హిల్ ప్రాంతం చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఒక పసుపు రంగు సైన్ బోర్డు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.  "అయస్కాంత కొండ, గురుత్వాకర్షణను ధిక్కరించే దృగ్విషయం. మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్‌తో గుర్తు పెట్టబడిన పెట్టెలో పార్క్ చేయండి" అని రాయబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో మోటారు వాహనాల ఇంజన్లు ఆపేసినా సరే అవి కొండ వైపు గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంటాయి.. ఈ ప్రాంతం యొక్క లేఅవుట్ మరియు చుట్టుపక్కల వాలులు కొండ యొక్క ఆప్టికల్ భ్రమను సృష్టిస్తాయి. కొండ రహదారి నిజానికి లోతువైపు ఉన్న రహదారి. కొండ రహదారిపై ఉన్న వస్తువులు మరియు కార్లు నిజానికి లోతువైపుకు దొర్లుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి ధిక్కరించి ఎత్తుపైకి దొర్లినట్లు కనిపిస్తాయి. అలా వెనక్కి ఎందుకు వెళ్తున్నాయో ఎవ్వరికి అర్ధంకాని వింత. ఇటుగా వచ్చే టూరిస్టులు మాత్రం విచిత్రమైన ఈ అయస్కాంత కొండని చూసి అబ్బురపడుతుంటారు.ఈ కొండ సమీపంలోకి రాగానే హెలికాప్టర్ల వేగంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని అంటారు. జూలై మరియు అక్టోబర్నెలలు ఈ మాగ్నెటిక్ హిల్ సందర్శించడానికి అనువైన సమయం.

సిద్ధాంతాల ప్రకారం:

ఈ కొండకి అయస్కాంత శక్తి  ఉండటంవల్ల ఇలా జరుగుతుందని కొందరి నమ్మకం, మరి కొందరు మాత్రం ఈ కొండ ప్రాంతంలో కంటికి కనిపించని అదృశ్యశక్తులు ఉన్నాయని, మరికొందరు మాత్రం ఆప్టికల్ ఇల్యూషన్ ( దృశ్య భ్రమ) అని . ఇది చుట్టుపక్కల భూమి యొక్క లేఅవుట్ ఆప్టికల్ భ్రమను ఉత్పత్తి చేసే ప్రదేశం , ఇది కొంచెం లోతువైపు వాలుగా కనిపిస్తుంది. ఎత్తుపైకి వాలు. అందువల్ల, గేర్‌ వదిలివేయబడిన కారు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి దొర్లుతున్నట్లు కనిపిస్తుందని అంటుంటారు.

2 . సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (Saint Ignace Mystery Spot, Michigan, USA).

 అమెరికా, మిచిగాన్ లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో మిస్టరీ స్పాట్‌ గొప్ప టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. మొదటగా ఈ ప్రాంతంయొక్క ప్రత్యకతలను ఎవరు గుర్తించలేకపోయారు.
1939 లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా కొందరు సర్వేయర్లు మిస్టరీ స్పాట్‌ ప్రత్యేకతలని గుర్తించారు. సర్వేయర్లు మొట్టమొదటి సారిగా సెయింట్ ఇగ్నాస్ వచ్చినప్పుడు వారిదగ్గరున్న పరికరాలన్నీ పనిచేయకుండా స్తంభించి పోయాయి.  సర్వేయర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పరికరాలన్నీ ఒకేసారి నిలిచిపోవడానికి గల కారణాలేంటి అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేయగా  ఆ ప్రాంతంలోని కేవలం300 అడుగుల డయామీటర్ సర్కిల్ లో మాత్రమే ఇలా జరుగుతుందని తేలింది. . ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటారని. ఆ ఇద్దరూ వేర్వేరు సైజులో ఉన్నా... అక్కడి ఓ రాయి ఎక్కి... అటూ ఇటూ మారగానే ఇద్దరి సైజూ ఒకేలా ఉంటారని. అంతేకాదు... మనిషి గోడపై వాలుగా నిలబడటం అసాధ్యం కానీ అక్కడి గోడలపై వాలుగా నిల్చోవచ్చు. అయినా కింద పడరు. మిస్టరీ స్పాట్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వందల వేల మంది సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ మరియు కలవరపరుస్తోంది. శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసిన తరువాత ఆప్టికల్ ఇల్యూషన్ (దృశ్య భ్రమ) తప్ప మరొకటి లేదని చెప్పడమే గానీ కచ్చితమైన కారణాలు చెప్పలేకపోడవం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

3 . మిస్టరీ స్పాట్, శాంతాక్రజ్, కాలిఫోర్నియా (Mystery Spot, Santa Cruz, California)

 ఇది సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ లాంటిదే. అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని. శాంతాక్రజ్ సమీపంలో ఉన్న ఓ అడవి ప్రాంతంలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన అద్భుతమైన చిన్న ప్రాంతం అది కేవలం 150 అడుగుల వ్యాసార్థం కలిగిన ప్రదేశం. ఆ ప్రాంతంలో ఉన్నవారు పక్కకు వంగగలరు. వంకరగా నడవగలరు. వాళ్లు ఓ కొండను వాలుగా ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచూ వెళ్తుంటారు. ఎందుకంటే. ఎన్నిసార్లు చూసినా గానీ ఆ మిస్టరీ ఏంటో అర్థం కాదు. శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఇలా జరగడానికి ముఖ్య కారణం ఆప్టికల్ ఇల్యూషన్ వలనే అనిచెపుతున్నారు కానీ  కచ్చితమైన కారణం ఏంటన్నది తెలియట్లేదు.. ఈ అరుదైన ప్రాంతానికి పర్యాటకుల సందడి ఎక్కువ.   

 4  . జలపాతం, ఫారో ఐలాండ్స్ (Waterfall, Faroe Islands)

స్కాట్లాండ్, ఐలాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం ఇది.
సాధారణంగా జలపాతంలోని నీరు పైభాగం నుండి కిందకు పడటం సహజం. ఇక్కడమాత్రం  నీరు కిందకు కాకుండా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని కొందరంటుంటే  మరి కొందరు మాత్రం  జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తోంది గంటకు 75 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలి వీయడం అటువంటి దృగ్విషయాలకు కారణమవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

5  . హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా (Hoover Dam, Nevada, USA)

ఈ డామ్ అమెరికా లోని అరిజోనా, నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ గా పిలిచేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. లాస్ వేగాస్ నుండి హూవర్ డ్యామ్ వరకు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హూవర్ డ్యామ్ కి వెళ్లిన వారికి అక్కడున్న అద్భుతాలనుచూస్తే  ఆశ్చర్యంకలిగిస్తుంది. హూవర్ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్ తో నీటిని కిందకు జార విడిస్తే, ఆ నీరు కిందకు పడకుండా. పైకి ఆకాశంవైపు వెళ్తుంది. ఎన్నిసార్లు నీరు జార విడిసినా. నీరు పైకే వెళ్తుంది. నమ్మశక్యం కానీ ఈ అద్భుతాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్య పోకుండా ఉండలేరు.  శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత వారు చెప్పిన సమాచార ప్రకారం  ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తోందని. ఆ గాలి నీటిని పైకి తోసేస్తుందని. అందుకే ఇలా జరుగుతోందని వెల్లడించారు. అయినా పర్యాటకులకు ఇదొక వింత లాగే అనిపిస్తుంది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com

8, నవంబర్ 2022, మంగళవారం

అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

 

 మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

2, నవంబర్ 2022, బుధవారం

అందరికి ఆదర్శం అంధురాలు "పయ్యావుల కొమురమ్మ"




సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.
మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.
మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన అవయవం కన్ను. మానవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగల్గుతున్నాడంటే దానికి కారణం కళ్ళు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కళ్ళు లేనివారు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. మనోస్థైర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని అధిగమించడమేగాక ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇది అక్షరాలా నిజం. అలాంటి స్ఫూర్తివంతమైన అంధురాలి యదార్థ జీవిత గాధ ఇది. ఆమె పేరు "పయ్యావుల కొమురమ్మ". ఆమె పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కొమురమ్మది సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లి. ఆమె నిరుపేద యాదవ కుటుంబంలోబొర్రయ్య, ముత్తమ్మలకు జన్మించింది . ఆమె జన్మతః అంధురాలు అవటంవల్ల సవాలక్ష సవాళ్ళు ఎదుర్కొంది. జీవితంలో ఏ పనిచేయలేని కొమురమ్మకు తల్లి ముత్తమ్మ తొలి గురువు. ప్రపంచంలోని అమ్మలందరికీ పిల్లలపై ఆకాశమంత ప్రేమ ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ముత్తమ్మ కు బిడ్డ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అంధకారం అలుముకున్న తన బిడ్డ జీవితాన్ని చూసి ఆ తల్లి రోదించిన సందర్భాలెన్నో. కొమురమ్మను అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కానీ అది అంధుల పాఠశాల కాకపోవడంతో ఆమె గురువులు చెప్పేపాఠాలు సరిగా అర్ధం చేసుకోలేకపోయేది. చుట్టుప్రక్కల ఎక్కడ కూడా అంధుల పాఠశాలలు లేనందున ఆమె ఇంటికే పరిమితమయింది.
కొమురమ్మను తల్లి కూలిపనులకు, పొలం పనులకు ఎక్కడికి వెళ్లిన తన వెంటే తీసుకుకెల్లేది, అంతేగాక తన తల్లి మాట్లాడే బంధుత్వ వరుసలను , మాట్లాడే విధానాన్ని పరిశీలించి కొద్దికొద్దిగా నేర్చుకోవడం ప్రయత్నించింది.ప్రతిఒక్కరి గొంతును గుర్తుంచుకునేది. ఎవరైనా ఇంటికి వస్తే వారి గొంతువిని వారి పేరు వెంటనే చెప్పేది అంత జ్ఞాపకశక్తి కొమురమ్మది. మానవత్వానికి మరో పేరు "పయ్యావుల ముత్తమ్మ". ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు ఆమెది. బిడ్డ ఎదిగేకొద్దీ తల్లికి అనుకోని బాధ వెంటాడేది.తానుఆరోగ్యంగా ఉన్నంతవరకు బిడ్డను చూసుకుంటాను కానీ తన తరువాత తన బిడ్డ ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా పనులు ఎలా చేసుకుంటుంది అనే ఆలోచనే బాధించేది ఆ తల్లికి. లచ్చమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా ముందుఆలోచనతో తన బిడ్డకు అందరిలాగే వంట, ఇంటి పనులు చేసుకోవడానికి మంచి శిక్షణ ఇచ్చింది. కొమురమ్మ శ్రద్దగా వింటూ ఓపికగా నేర్చుకోసాగింది. ఆలా కొమురమ్మ జీవితాన్ని ఆమె చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగలిగింది. మొదట బిడ్డ జీవితంచూసి చలించిపోయేది. ఆమె మంచి భవిష్యత్తు కోసం తపించేది. తల్లీ నీకు పాదాభివందనం.
బిడ్డపట్ల తల్లి ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది. పనులు నేర్పించడమేగాక ఊరిలో ఎవరింటికి ఎలా వెళ్లాలో తీసుకొనివెళ్ళి చూపించేది చాలా సార్లు. తల్లి చూపించిన ఇంటి దూరాన్ని అడుగుల లెక్కతో మరియు సమయాన్ని బట్టి ప్రతిఒక్కరి ఇంటికి వెళ్లగలదు. అది చూసేవారికి ఆశ్చర్యం, అనుమానం కూడా కళ్ళు కనిపిస్తాయేమోఅని. కానీఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది.
కళ్ళు లేవని కలత చెందలేదు. నాకు భవిష్యత్తు లేదని ఆగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుసాగింది. ఆమె విజయం వెనుక తల్లి ఉంది.
అలా తల్లి ముత్తమ్మ కొమురమ్మను 43 ఏళ్ళు వరకు అన్నీతానే దగ్గరుండి చూసుకుంది. ఒడిదొడుకులతో సాగుతున్న కొమురమ్మ జీవితం లో అనుకోకుండా తీవ్ర అనారోగ్యం కారణంగా తల్లి మరణించింది. తల్లి మరణవార్తవిన్న కొమురమ్మ కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటన చూసిన ఊరి జనానికి ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించిన సందర్భం.. తల్లి మరణాంతరం తండ్రి (బొర్రయ్య) కూడా అనారోగ్యానికి గురైనారు. ముత్తమ్మ ముందుఆలోచనతో కొమురమ్మ తన పనులు తానే చేసుకునేలా తర్ఫీడునిచ్చింది.
నిరుపేదరాలైన కొమురమ్మకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. పాత మట్టిగోడలమద్యే ఆమె నివాసం. ఎన్ని ప్రభుత్వాలు మారిన కొమురమ్మ గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం కొమురమ్మపట్ల ప్రత్యేక చొరవ చూపాలని కోరుకుంటున్నాం.
ఈరోజుల్లో అన్నిఅవయవాలుండి పనిచేయటానికి బద్ధకం ఉన్నవాళ్ళకి కొమురమ్మ ఒక ఆదర్శం కావాలని కోరుకుంటూ..
కొమురమ్మ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనందరం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.


✍

కోట దామోదర్
మొబైల్ : 9391480475

24, అక్టోబర్ 2022, సోమవారం

మల్లు స్వరాజ్యం




పల్లె ప్రాంత పలకరింత. పల్లె ప్రజల పులకరింత.
భూమికోసం.. భుక్తికోసం.. జమీందారుల బానిసత్వం నుంచి విముక్తికోసం పోరాడిన వీర, ధీర వనిత మల్లు స్వరాజ్యం. 
తడి ఆరని మట్టి సుగంధపు పాటల పూదోట, పదునెక్కిన ప్రజా పాట మల్లు స్వరాజ్యం. 
కత్తిమొనకుండే సురుకుదనం.. ఆమె మాటల్లోఉండే గరుకుదనం. గర్జించిన సింహమోలే ఘాటైన మాటల మర ఫిరంగి మల్లు స్వరాజ్యం..  
ఉద్యమ పాటల వాడి.. ఉద్యమ విప్లవ వేడి, ఎలుగెత్తిన ఎర్రని ఎర్రదనం ఎర్రజెండా.
పెత్తందారీ వ్యవస్థమీద ఎక్కుపెట్టిన తూటా.. మల్లు స్వరాజ్యం మాట..
అక్రమ, అన్యాయాలను అణగదొక్కే అగ్నికణాల ఆట.. మల్లు స్వరాజ్యం పాడిన పాట. 
ఆమె పాటలు ప్రజలను ఊగిస్తాయి. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తాయి..
తాడిత, పీడిత, బీదసాదలకు నిలువెత్తు ఊతం.. మల్లుస్వరాజ్యం గీతం..

మీ 
కోట దామోదర్ 
మొబైల్ 9391480475

అంతరించిపోతున్న కల్లుగీత వృత్తి




కల్లు గీత వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి

పురాతన కాలంనాటి గ్రంథాలన్నీ తాళపత్రాలే... అంటే తాటాకులమీద రాసినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ ఆకులోని వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది.
పురాణాలు మరియు ఇతిహాసాలలో తాటిచెట్టు గురుంచి ఎంతో గొప్పగా వివరించబడింది.

అన్నమయ్య కీర్తనలు , పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లాంటి అమూల్యమైన విషయాలెన్నో తాళపత్ర గ్రంధాల పైనే రాయబడింది. అలాగే తాటిచెట్టు నుండి లభించే కల్లును ప్రకృతి ఔషధంగా పురాణాలలో సురాపానంపేరుతో ప్రస్తావించటం చాల గొప్ప విషయం. స్వర్గలోకంలో అమృతభాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళ వృక్షమై మొలిచిందట. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ. మానవ జాతి మనుగడలోను కల్లు పాత్ర కీలకమైనది.

తాటి చెట్లు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కల్లు. ఆది మానవుని నుంచి ఆధునికమానవుని వరకు కల్లు సేవించటం ఆనవాయితీగా వస్తుంది.  తాటి  కల్లు అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం.  ఒకప్పుడు ప్రజలు పొద్దున్న నుండి సాయంకాలం వరకు చేసిన శ్రమ నుండి ఉపశమనం పొందడానికి కల్లు ని సేవించేవారు. ఒకప్పుడు ఇంటికి బంధువులొస్తే కల్లు, గుగ్గిలతో మర్యాద చేసేవారు.  శ్రమ జీవులకు , కల్లుకు విడదీయరాని బంధం ఉండేది.

అలాంటిది కాలక్రమేపి నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్‌,బీర్‌, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్‌, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి ఏ విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్‌ టైజ్‌మెంటుల  రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో ఆ వృత్తి దెబ్బతింటోంది.  ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు.

పూటగడవటం కోసం గౌడన్న పొద్దుపొద్దుగాల కత్తుల పొదితో, మోకేసుకొని తాళ్లల్ల ప్రత్యేక్షమవుతాడు. సుమారు 10 నుండి 18 మీటర్ల ఎత్తున్న చెట్లని తన ప్రాణాలను సైతంలెక్కచేయకుండా అవలీలగా ఎక్కడంతోపాటు పెద్ద పెద్ద కల్లు కుండలను వెదురుబద్దల సహాయంతో ఎర్రటి ఎండలో ఒంటినిండా చెమటతో వాటిని మోయగలిగే  అసలైన బాహుబలి అంటే గౌడన్నే. వెదురుబద్దతో కుండలను మోయటంకేవలం గౌడన్నకే సాధ్యం. చెట్టెక్కిన  తరువాత ఏదైనా అకస్మాత్తుగా సంభవిస్తే ఇక తన ప్రాణాలు గగనమే. తాటిచెట్టు పైన కొన్ని విషపూరితమైన పాములు, తేలు, ఉడుములు వంటి ప్రమాదకరమైన జీవులతో పోరాడుతాడు. అనుకోకుండా అవి కాటేస్తే  క్రిందకు దిగేవరకు తాను బ్రతికే అవకాశం ఉండదు. అడవిలో అప్పటికప్పుడు చికిత్స అందించేవారు కూడా ఉండరు.  ఇలాంటి వృత్తిని ఎంతో ధైర్యంతో కొనసాగిస్తున్న గౌడన్నని అభినందించాల్సిందే. నిజానికి వీరి వృత్తి చావుతో పోరాటమే అనటంలో అతిశయోక్తిలేదు.

కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే  మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాబోవురోజుల్లో ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకోవాలని, వారి వృత్తికి సరిపడా నూతన పరికరాలకోసం అధ్యయనం చేసి వృత్తి కొనసాగించేవిధంగా మరియు నీరా కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరుకుందాం..

ముఖ్యంగా తెలంగాణ లోని గ్రామాలలో శుభకార్యాలకే గాక అన్ని రకాల కార్యాలకు మరియు వేసవి కాలంలో కల్లు సేవించేవారి సంఖ్య ఎక్కువ. విందు, వినోదాలకు స్నేహితులతో కలిసి తాళ్లల్ల ముచ్చటిస్తూ కల్లుతాగే మధురమైన జ్ఞాపకాలు పల్లెవాసులు ఎన్నటికీ మరువలేనివి మరుపురానివి. గ్రామాలలో కల్లు మాత్రమే కాకుండా తాటి ఆకులను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు.  పేదవాడి గూటికి పైకప్పుగా ఈ తాటికమ్మలు వాడేవారు. వేసవికాలంలో విలాసవంతమైన భవంతులకంటే పూరిగుడిసెల్లో వేడితీవ్రత తక్కువ. పెళ్లిపందిరికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి తాటాకులు ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాటి మొద్దులతో ఇళ్ల నిర్మాణంసర్వసాధారణం. అంతేగాక వేసవిలో తాటి ముంజలు అమితమైన చలవనివ్వడంతో పాటు తక్షణ శక్తిని మరియు దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. 

కల్లు గురించి వైద్యుల కితాబు:

ఇది ప్రకృతి సిద్ధమైన సహజ పానీయం. దీనిని ఎవరైనా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
  • ·         తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.
  • ·         డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
  • ·         అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలనుదూరం చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ·         కంటిచూపును, జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ·         నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తుంది.
  • ·         లీవర్ లేదా కాలేయసంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
  • ·         కిడ్నీలో రాళ్లను నివారించడంతో పాటు అప్పటికే ఏర్పడిన రాళ్లను కరిగిస్తుంది.
  • ·         తాటిబెల్లం, తాటి పంచదార వల్లకూడా మంచి ప్రయోజనాలున్నాయి.
  • ·         తాటిక‌ల్లుకు క్యాన్సర్కార‌క క‌ణాల‌ను న‌శింప‌జేసే శ‌క్తి కూడా ఉందని వైద్యనిపుణులు తెలియ‌జేస్తున్నారు.
ఇంతటి విశిష్టత కలిగిన తాటిచెట్లు కనుమరుగవుతున్నాయి. కొందరి స్వార్థప్రయోజనాలకోసం చెట్లని నరికేస్తున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటిచెట్లు కనుమరుగు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది.

వంద సంవత్సరాలకు పైగా జీవించే తాటిచెట్టు పేదవాడి కల్పతరువు. గౌడన్నల బతుకుదెరువు..

ఈ విషయం ప్రభుత్వం గుర్తిస్తే గౌడన్నలకు ఆదరువు ...



మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

17, అక్టోబర్ 2022, సోమవారం

సరిలేని చిత్రకారుడు

https://drive.google.com/uc?export=view&id=12y87LzCVKpCTUeivmcWnUnY-71kvLgnh 


దేవుడు మనిషిని సృష్టిస్తే! అసలు దేవుడు ఎలా ఉంటారో తెలియని ప్రపంచానికి ఆ దేవుడి రూపాన్ని సృష్టించిన గొప్ప చిత్రకళాకారుడు "రాజా రవి వర్మ "

తాను చదివిన పురాణేతిహాస గ్రంథాల్లోని దేవతామూర్తులను, వారి ఆకారాలను ఎంతో గొప్పగా ఊహించుకొని అద్భుతమైన ఆలోచనతో తన కుంచె ద్వారా దేవుళ్లు, దేవతల రూపాలకి ప్రాణంపోసిన కళాకారుడు. మనం నిత్యం పూజించే దేవుళ్ళు దేవతల విగ్రహాలన్నీ అయన గీసిన చిత్రాల ఆధారంగానే రూపొందించారంటే చిత్రకళ ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. భారతదేశ చిత్రకళను ప్రపంచవ్యాప్తి చేయటమే కాకుండా ఆ కళకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు.

అనబత్తుల కుంచె నుండి జాలువారిన చిత్రాలు ఖండాంతర ఖ్యాతి పొందాయి. ఆయనది వృత్తి బోధన అయినా, చిత్రకళే ప్రవృత్తిగా కళాఖండాలను ఆవిష్కరిస్తున్న "అనబత్తుల వెంకన్న" తన బాల్యమునుండి చిత్రకళపై మక్కువతో అవిశ్రాంత సాధనతో ప్రపంచ స్థాయిలో గొప్ప చిత్రకళాకారుడిగా  గోల్డ్ మెడల్, జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో సాధించిన "అనబత్తుల వెంకన్న" తెలంగాణకు చెందినవారు కావడం గర్వించదగ్గ గొప్ప విషయం. 

  • 2012 లో KVS National Incentive Award”  కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India  వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
  • 2021 సంవత్సరం అంతర్జాతీయ ఆర్ట్ సొసైటీ, ఫైన్ ఆర్ట్స్, అస్సాం, వారిచేత గోల్డ్ మెడల్ సాధించారు.
  • 2022 సంవత్సరంలో Magic Book of Records, ఫరీదాబాద్, న్యూ ఢిల్లీ వారిచేత అత్యున్నతమైన Honorary Doctorate Award అవార్డు సాధించారు. 
  • 2022 సంవత్సరంలో లలిత్ కళా కేంద్ర, Guwahati, అస్సాం వారిచే  "Diamond Award" పొందారు.
  • 2021 సంవత్సరంలో "కళ రత్న" అవార్డు సాధించారు. 
  • 2005  లో ఆఫ్రికా దేశం తన ప్రతిభకు ఆ దేశ అత్యున్నతమైన "ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.

బాల్యం, విద్యాబ్యాసం:

సూర్యాపేట జిల్లా, మారుమూల గ్రామమైన మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబం చేనేత కార్మికుడైన అనబత్తుల నారాయణ, నాగలక్ష్మి దంపతులకు 08.03.1969 లో జన్మించారు. నారాయణ చేనేత వృత్తినే కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వెంకన్న అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి  7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయనకి 7 వ తరగతిలోనే చదువుతో పాటు చిత్రకళపై ఆసక్తి కలగటం జరిగింది. వెంకన్న గీసిన చిన్న చిన్న చిత్రాలను చూసి తల్లిదండ్రులు సంతోషించేవారూ మరియు అభినందించేవారు కూడా. తన తల్లిదండ్రుల ప్రోత్సాహముతో మరింత ఉత్సహంతో కళకు పదునుపెట్టగలిగారు. అప్పట్లో గుమ్మడవెల్లి గ్రామంలో 8 వ తరగతి చదివే సదుపాయంలేక వెంకన్న చిన్నమ్మ గారి ఊరు నెల్లికుదురులో స్థిరపడి అక్కడే 8 వ తరగతి నుండి 12 వరకు జూనియర్ కళాశాలలో విద్య పూర్తిచేశారు.  8 వ తరగతి చదివే సమయంలో వారి గురువు చిత్రకళ నైపుణ్యం కలిగిన అక్కెర కరుణ సాగర్ గారి దగ్గర శిక్షణతో పాటు నైపుణ్యం పొందగలిగారు. ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ లో శ్రీ టీ.సుధాకర్ రెడ్డి గారి దగ్గెర గ్రాఫిక్స్ లో శిక్షణ పొందినారు వెంకన్న ఈ స్థాయికి చేరుకున్నారంటే  గురువులే కారణం, గురువులే ఆదర్శం. వెంకన్న చిన్నతనం నుండి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ  తన కళను విడిచిపెట్టకుండా విద్యను మరియు చిత్రకళను రెండింటిని కొనసాగించారు. నెల్లికుదురులో విద్య అనంతరం. అయన విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచ్లర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ విభాగం లో డిగ్రీతో పాటు  డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ (నటన మరియు దర్శకత్వం) పూర్తిచేశారు. తరువాత ఎం. ఎస్. యూనివర్సిటీ, బరోడాలో ఎం. ఏ. గ్రాఫిక్స్ పూర్తి చేశారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెంకన్నచదువుతోపాటు గొప్ప చిత్రకళాకారుడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. తండ్రి నేత కళాకారుడైతే, తనయుడు మాత్రం గొప్ప చిత్రకళాకారుడిగా అవార్డులు పొందడం గొప్ప విషయం.

ఉద్యోగ ప్రస్థానం :

  • 1995 లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ టీ.జి .టీ  ఆర్ట్ టీచర్ గ హైదరాబాద్ లోని కే .వి 2  ఎయిర్  ఫోర్స్ అకాడమీ లో చేరారు. 
  • 2000 - 2004 వరకు కే .వి 1  గోల్కొండ, లంగర్ హౌస్ పనిచేసి 2004 ఫిబ్రవరి లో బోట్స్వానా ( ఆఫ్రికా ) కు భారత ప్రభుత్వం తరుపున డెప్యూటేషన్ పై  వెళ్లి ఐదు సంవత్సరాలు అక్కడి విద్యార్థులకు చిత్ర కళలో మెళకువలు నేర్పిచారు . వెంకన్న చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆఫ్రికా దేశంలోని అత్యున్నతమైన " ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.
  • 2009 లో తిరిగి కే .వి,1  ఉప్పల్ హైదరాబాద్ లో చేరారు.
  • 2011 నుండి కే .వి వరంగల్ లో చిత్ర కళ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు.

వెంకన్న సాధించిన అవార్డులు:

  • 1987 లో ఇంటర్  కాలేజ్ యూత్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
  • 1988 లో భారతిదాసన్ యూనివర్సిటీ, తిరుచిరాపల్లి సౌత్ జోన్  ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.,
  • 1989 లో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టర్ తయారీ కాంపిటీషన్ లో మొదటి బహుమతి.    
  • 1990 లో కాలికట్ యూనివర్సిటీ - కేరళ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.
  • 1990 లో REC,వరంగల్ అల్ ఇండియా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
  • 1991 లో  మదురై కామరాజ్ యూనివర్సిటీ లో అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్  సందర్బంగా రెండవ బహుమతి.
  • 1992 లో  Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
  • 1993 లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి "దాసరి నారాయణరావు - "గోల్డ్ మెడల్" అవార్డు పొందారు. 
  • 1997 లో  Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
  • 2011 లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 324C 2 ఆచార్య సేవ పురస్కార్” హైదరాబాద్, వారిచేత పొందారు. 
  • 2011 లో KVS Regional Incentive Award”  కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India  వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
  • 2015 లో “Best Teacher award” by రోటరీ  క్లబ్  హన్మకొండ  , వరంగల్  - తెలంగాణ స్టేట్ వారి చేత పొందారు 
  • 2016 లో “Active Teacher award” కళాభారతి చైల్డ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్, ఔరంగాబాద్ వారిచేత పొందారు.
  • 2017 లో “Best Artist” కళ వైభవం ఆర్ట్ ఎక్సిబిషన్ - వరంగల్ వారిచేత పొందారు.
  • 2017 లో తెలంగాణ స్టేట్ Rs. 51,116 నగదు తో పాటు “District Artist Award"  డిప్యూటీ  చీఫ్ మినిస్టర్ శ్రీ  కడియం శ్రీహరి గారిచే పొందారు.
  • 2019 లో యంగ్  ఎంవోయిస్  ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారిచే బాపూజీ స్మృతి  పురస్కార్ అవార్డు పొందారు.
  • 2021 లో గ్రాఫిక్ డిజైన్- న్యూ ఢిల్లీ వారి చేత గోల్డెన్  ఫ్రేమ్ అవార్డు పొందారు.  
ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకున్న వెంకన్న "తెలంగాణ విముక్తి" చిత్రాన్ని గీసి తెలంగాణ వాదాన్ని చాటుకున్నాడు. అలాగే అనబత్తుల కుంచెనుండి జాలువారిన భద్రాచలంలో పవిత్రస్తానం అనే చిత్రాన్ని గోదావరి పుష్కర సమయంలో తిలకించని వారులేరు. ప్రకృతి పై పర్యావరణ పరిరక్షణపై తను గీసిన చిత్రాలకు ఎందరో ప్రముఖులు ఆకర్షితులైనారు. 
రాబోవు రోజుల్లో అనబత్తుల కుంచెనుండి మరిన్ని చిత్రాలను గీయాలని కోరుకుందాం..

వ్యాసకర్త :

కోట దామోదర్ 
మొబైల్: 9391480475 


                      

19, సెప్టెంబర్ 2022, సోమవారం

సమానత్వం కోసం పోరాటం





ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఈ దేశం నాది అని గర్వంగా చెప్పుకునే ఈ దేశ పౌరిడిని నేను. ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించటానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తిరస్కరిస్తారా ? ఎందుకు ప్రవేశం లేదు? కారణం నా వర్ణమా? అయితే విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? అయితే నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని ఉద్యమ వీరుడు. నడవరా ముందుకని నడిపించిన నల్ల వీరుడు. 

ఓక్లహామా యూనివర్సిటీలో నల్లజాతీయులకు సమానత్వ విద్యకోసం తిరగబడ్డ అక్షర యోధుడు  ప్రొఫెసర్ 'జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ ". 

ఓక్లహామా యూనివర్సిటీలో మొట్ట మొదటి నల్లజాతి విద్యార్థిగా చరిత్రలో నిలిచారు. 

వివక్ష చూపించినా:

కాన్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందిన తరువాత ఆయన లాంగ్‌స్టన్ విశ్వవిద్యాలయం లో అత్యధిక కాలం ప్రొఫెసరుగా పనిచేసి జనవరి 28, 1948న రిటైర్మెంట్ తీసుకున్నారు. మొదటినుండి చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంవల్ల అయన ఉద్యోగ విరమణ తరువాత 61 సంవత్సరాల వయసులో కూడా మరొక డిగ్రీ కోసం ఓక్లహోమ యూనివర్సిటీ లో ప్రవేశం కొరకు సెప్టెంబర్ లో దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 20, 1948 న ఆయన ధరఖాస్తుని నిరాకరించింది ఓక్లహోమ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిరాకరిస్తారా? ఎందుకు ప్రవేశం లేదు? నేను ఈ దేశ పౌరిడిని కాదా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను నల్లజాతీయుడనే కారణంతో దరఖాస్తుని నిరాకరించినట్లు యూనివర్సిటీ వారు తెలిపారు. విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? తెల్లజాతీయులే చదవాలి గాని నల్లజాతీయులు చదువకూడదా? అయితే ఈ విషయాన్నీ  నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి మెక్‌లౌరిన్ ఫెడరల్ కోర్టుకి వెళ్లారు. అక్టోబర్ 14, 1948న తరగతులు ప్రారంభం కానున్నాయి. తక్కువ సమయం ఉండటంవల్ల తన ప్రవేశానికి అనుమతి దొరుకుతుందా అన్న సందేహంతో సతమతపడుతున్న సందర్భంలో ఫెడరల్ కోర్టు వారు సెప్టెంబరు 29, 1948, తీర్పులో అతనికి ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడంతో అతను విజయం సాధించాడు. అతనికి కోర్టు తీర్పు అనుకూలంగా ఉండటంతో ఓక్లహోమ స్టేట్ రీజెంట్‌లు అక్టోబరు 11, 1948న అతనిని అడ్మిషన్‌కు ఆదేశించక తప్పలేదుఅక్టోబర్ 14, 1948న మెక్‌లౌరిన్ తరగతులకు హాజరైనారు.

అసమానత విద్యకు గురైనారు:

అడ్మిషన్‌కు ఆదేశించినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తరగతి గదిలో అకృత్య రూపాన్ని చూశారు. అతను చదువుతున్న తరగతి గదిలో తెల్లజాతీయుల విద్యార్థులకు దూరంగా వేరు డెస్క్ మరియు చైర్ తో తరగతి గది వెలుపల తలుపు ప్రక్కన కూర్చొని పాఠాలు వినేలా ఏర్పాటుచేశారు. అలా తరగతులన్నింటికీ హాజరవుతూనే తెల్లజాతి విద్యార్థులకు దూరంగా ఉంటూ తన అసమానమైన విద్యాబ్యాసాన్ని కొనసాగించారు. అంతేకాకుండా విద్యార్థులు తినే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ప్రత్యేక టేబుల్స్ వద్ద భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసేవారు; అతను చదువుకోవడానికి కూడ లైబ్రరీలో వేరే టేబుల్‌ని ఉపయోగించాలని మరియు క్రీడా కార్యక్రమాలలో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు మరియు ప్రత్యేక విశ్రాంతి గది అలా అసమానత విద్యకు గురైనారు. అలా జరిగినప్పటికీ శ్వేతజాతీయులకంటే కూడా చదువులో ముందుడేవాడు. ఆయన ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికి దృఢమైన సంకల్పంతో తన విద్యను కొనసాగించారు. ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే వర్ణ వివక్షత పోరాటానికి పదునుపెట్టగలిగారు. ఆయన ఎన్నో నల్లజాతీయుల విద్యార్థుల సంఘలని కూడగట్టి వర్ణ వివక్షత నిర్ములన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.  

జీవితంలో మరిచిపోలేని రోజు:

అసమానత విద్య షరతులు వల్ల తాను సమానత్వాన్ని కోల్పోయానని పేర్కొంటూ దావా వేశారు. అయితే ఈసారిమాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ అతని వాదనతో ఏకీభవించలేదు మరియు జాతి విభజన అనేది "ఓక్లహోమ రాష్ట్రం యొక్క సామాజిక విధానం" అనే కారణంతో అతను వేసిన దావాను తిరస్కరించింది. అయినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తన పోరాటాన్ని కొనసాగించటానికి తన కేసును ఏకంగా U.S. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాడు.సుప్రీం కోర్టు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని అతని జాతి ఆధారంగా ఇతర విద్యార్థుల నుండి భిన్నంగా చూడగలరా అనే ప్రశ్నపై దృష్టి సారించింది.జూన్ 5, 1950 న తన కేసును విచారించి ప్రధాన న్యాయమూర్తి ఫ్రెడ్ విన్సన్, న్యాయస్థానం కోసం వ్రాస్తూ, మెక్‌లౌరిన్‌కు అందించబడిన భేదాత్మకమైన చికిత్స పద్నాల్గవ సవరణ యొక్క సమాన రక్షణ నిబంధన ప్రకారం, రాష్ట్ర అధికారులు ఇతర జాతుల విద్యార్థుల మాదిరిగానే వాదిని పరిగణించాల్సిన చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటారని సుప్రీం కోర్టు వాదించింది.ఇలాంటి పరిమితులు అతని విద్యాబ్యాసం  మరియు చర్చలలో పాల్గొనటం ఇతర అబిప్రాయాలు మార్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని మరియు నిరోధిస్తాయని. విద్యార్థులు, మరియు, సాధారణంగా, తన వృత్తిని నేర్చుకోవడానికి ఇలాంటి పరిమితులు అనుకూలించవని సూచించారు. ఇకపై న్యాయస్థానం ఇలాంటి పరిమితులను సహించదని ఓక్లహోమా స్టేట్ రీజెంట్స్ ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో మెక్‌లౌరిన్ ఆశ నెరవేరినట్లైంది. అక్టోబర్ 14 తనకి సంతోషకరమైన రోజు అని ఆయన డైరీ లో రాసుకున్నారు. నిజంగా నల్లజాతియులకు అక్టోబర్ 14 సంతోషకరమైన రోజు అనే చెప్పొచ్చు.  నల్లజాతి విద్యార్థులకు నడవరా ముందుకని దారిచూపిన మార్గదర్శి మెక్‌లౌరిన్. 

నల్లజాతీయుల కోసమే అయన పోరాటం:

దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రభుత్వం నల్లజాతీయుల పట్ల వివక్ష పాటిస్తూ, వారిని సామాజికంగా అన్ని రంగాల్లోనూ వేరు చేస్తూ అధికారికంగా విధానాలను అమలుచేసింది. ఆ వర్ణ వివక్షా విధానాలను, వారి విద్యపట్ల వివక్షతను అంతం చేయటానికి ఎంతగానో పోరాడిన వీరుడు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి మనుసులో చిరకాల ముద్రవేసుకున్నారు. అమెరికావంటి అగ్రదేశాలల్లో నల్లజాతీయులు స్వేచ్ఛగా విద్యను కొనసాగిస్తున్నారంటే దానికి కారణం జార్జ్ మెక్‌లౌరిన్ చేసిన పోరాటమే.

కుటుంబ నేపథ్యం:

జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ 16 సెప్టెంబర్ 1894 న మిస్సిస్సిప్పి, USA లో జన్మించాడు. అతని భార్య పెనినా మెక్‌లౌరిన్, వాన్ కెనడా లో జన్మించింది. పెనినా మెక్‌లౌరిన్ ఉపాధ్యాయ వృత్తిలో 33 సం, విద్యనందించింది. ఆమె 1954లో ఓక్లహోమ యూనివర్సిటీలో హోమ్ ఎకనామిక్స్ లో మూడు డిగ్రీలు, లాంగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ మరియు బి.ఎస్ పట్ట పొందారు. అతని కుటుంబం 1910లో ఓక్లహోమాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  మెక్‌లౌరిన్ కి ఇద్దరు కుమారులు, డన్బార్ ఎస్. మెక్ లారిన్, న్యూయార్క్ లో లాయర్, జోఫ్రే సి. మెక్ లారిన్, లాస్ ఏంజిల్స్ టీచర్, ఆయనకు ఒక కుమార్తె కార్డెజా మెక్ లారిన్ లాస్ ఏంజిల్స్ ఉంటుంది. మెక్‌లౌరిన్ అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 4, 1968న 74 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయన మరణం నల్లజాతీయులు తీరని లోటు.


మీ 

కోట దామోదర్

Mobile: 9391480475


 .         

అంగవైకల్యం ఆశయసాధనకు అవరోధం కాదు


అంగవైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు:

అవయవాలు అన్నీ సరిగా ఉన్నా చదువుల పట్ల మక్కువ చూపని ఎంతో మంది విద్యార్థులకు ఆయనొక ఆదర్శం. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప. అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "వరిపెల్లి యాకయ్య సార్". అయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.
 
జననం, విద్యాబ్యాసం:

సూర్యాపేట జిల్లాలోని మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లిలో నిరుపేద కుటుంబంలో వీర సోమయ్య, బుచ్చమ్మ దంపతులకు 1-3-1944న జన్మించారు. ఆ దంపతులకు మొదటి సంతానమైన కుమారుడిని చూస్తూ ఎంతో సంతోషించేవారు. ఎంతో అల్లారుముద్దుగ సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా అయన 4 వ ఏటా పోలియో కారణంగా అంగవైకల్యానికి (నడవలేని పరిస్థితి) గురియైనారు. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, ప్రాపంచిక జ్ఞానంతో కుమారుడిని (యాకయ్య సార్) చదివించాలన్న తపనతో వారి స్వగ్రామమైన గుమ్మడవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 
 
1949 కాలంలో (యాకయ్య సార్ చదివే రోజుల్లో) గుమ్మడవెల్లి గ్రామంలో కరెంటు మరియు రవాణా సౌకర్యం  వంటి సదుపాయాలేనప్పటికీ అయన చదువు పట్ల ఉన్న సంకల్పం, కృషి, నిర్దిష్ట ప్రణాళికతో నాల్గొవ తరగతి పూర్తి చేశారు. గుమ్మడవెళ్లిలో నాలుగో తరగతి వరకే  సదుపాయం ఉన్నందున అయన గుమ్మడవెల్లి నుండి 8 కిలోమీటర్ల దూరప్రాంతమైన తుంగతుర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరో తరగతులు పూర్తి చేశారు.    

ఆతరువాత పై చదువులు చదవటానికి సూర్యాపేటలోని మల్టీ పర్పస్ స్కూల్ లో చేరి 7 వ తరగతి నుండి  12 వ తరగతి వరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు, ఆ రోజుల్లో 12వ తరగతి చదవడం గొప్ప విషయం. అయితే చదువుకోవాలనే తపన అతనిలో ఇంకా ప్రబలంగా ఉండడంతో పై చదువులకోసం ప్రయత్నిచడం కొనసాగించారు. మనుసుంటే మార్గాలెన్నో అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి యాకయ్య సార్, అనుకున్న ఆశయం కోసం అహర్నిశలు కష్టపడి ఆసాద్యన్ని సుసాధ్యం చేయగలిగే వారు. చదువు పట్ల అతని ఏకాగ్రతను గమనించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఉపాధ్యాయ శిక్షణా కోర్సు చేయాలని సూచించారు. పట్టుదలతో ప్రయత్నిచి ఇల్లందులోని టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి 10 - ఆగస్టు - 1970లో ప్రభుత్వ టీచర్ గా నియమితులైనారు. అయన జీవితంలో ఆశయం కోసం  ఎన్నో సాధనాలు , శోధనలు , పరిశోధనలు ఎన్నో పట్టుసడలని ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధించిన ఘనుడు యాకయ్య సర్. 

క్యాన్సర్ తో పోరాడిన ధైర్యవంతుడు:

అంగవైకల్యాన్ని జయించిన యాకయ్య సార్. టీబీ వ్యాధి ఆయన్ని చాలా కాలం పాటు బాధించింది. అయినా టీబీ వ్యాధి కూడా ఆయన్ని వెంటాడి వెనుతిరిగింది. 
అంతేగాక టీబీ వ్యాధి తర్వాత భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి కూడా అతనికి పరీక్ష పెట్టింది. 

దైర్యం క్యాన్సర్ ఉన్నోడినికూడా బతికిస్తుంది..
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది..  అన్నట్లుగా యాకయ్య సార్ ధైర్యంతో భయంకరమైన క్యాన్సర్ ని కూడా జయించారు. క్యాన్సర్ ని జయించటం అంటే మృత్యువుతో పోరాటమే.. యాకయ్య సార్ అన్నింటిని జయించిన ధైర్యశాలి..    

గురువుగారి జ్ఞాపకాలు :
  
అయన స్వగ్రామమైన గుమ్మడవెళ్లిలోనే ఉపాధ్యాయుడిగా పనిచేయటం మా అందరి అదృష్టంగా భావిస్తు, అయన నా గురువుగా చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ఇంకా సంతోషకరమైన విషయమేమిటంటే ఆయన తనయుడు అంజయ్య సార్ కూడా నాకు గురువు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
యాకయ్య సార్ లో ఉన్న గొప్ప ప్రత్యేకతయేంటంటే అయన చిరునవ్వు. ఆ చిరునవ్వెప్పుడు అయన ముఖారవిందాన్ని అలంకరిస్తూనే ఉంటుంది.  కొన్నిసందర్భాలలో సార్ ఎక్కడైనా బయట కనిపిస్తే "నమస్తే సార్ అంటే " సార్ దానికి బదులుగా గాలం విసిరినట్లు చిరునవ్వు విసురుతారు. చిరునవ్వు సార్ కి గొప్ప ఆస్తి, మరియు ఆయుధం కూడా ఆ ఆయుధానికి అందరం ఆకర్షితులమే..
సార్ పిల్లలందరిని తన కుటుంభ సభ్యులుగా భావించి, వారి భవిష్యత్తుని దృష్టిలోపెట్టుకుని విద్యార్థుల యొక్క విద్యానైపుణ్యాన్ని, వారియొక్క సామర్ధ్యాన్ని, చురుకుదనాన్ని గ్రహించటంలో యాకయ్య సార్ కి వెన్నతోపెట్టిన విద్య. 
ఆయన దగ్గర శిష్యరికం పొందిన వారిలో చాలా మంది విద్యావేత్తలు, ప్రముఖులు, నాయకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే యాకయ్య సార్ బహుముఖప్రజ్ఞాశాలి. అయన చదువు చెప్పేవిధానంలో ఎంత ప్రత్యేకత ఉందొ, బ్లాక్ బోర్డుమీద చక్కటి బొమ్మలు గీయటంలో కూడా అంత ప్రావీణ్యత ఉంది. అంతేకాకుండా అయన స్వరం, ఆయనకి దేవుడిచ్చిన గొప్ప వరం, మంచి మంచి పాటలు పాడేవారు,  ఒక వృత్తాకారం సర్కిల్ గీస్తే అది ఎంత గుండ్రంగా వస్తుందంటే అది చూస్తే గానీ మాటలతో వర్ణించలేనిది. అంత అందమైన బొమ్మలు గీయటంలో సార్ దిట్ట. 
పాఠంచెప్పిన మరుసటి రోజు ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు, ఎంతవరకు పాఠం అర్ధంచేసుకున్నారు అనే పరీక్షా పర్యవేక్షణ అన్ని మాకు తెలియకుండానే. నొప్పిలేకుండా సూదివేయటం అనే సూత్రం సార్ ది. అది మా భవిష్యత్తుకి పునాది రాయి. 
పాఠం చెప్పేటైంలో పిల్లలతో గరుకుగా ఉండేవారు, పాఠం అయిపోయినాక చురుకుగా, చిలిపిగా నవ్వుతు మాతో గడిపేవారు, చురుకుగా, గరుకుగా కాలానికనుగుణంగా ఒదిగిపోయే వ్యక్తిత్వం యాకయ్య సార్ ది.  అది అందరికి అసాధ్యం అనే చెప్పాలి.
నేను 5 వ తరగతి చదివేటపుడు మాకు సామాన్య శాస్త్రం చెప్పేవారు సార్, అందులో ఒక అబ్యాసం ఆరోగ్యం గురుంచి ఉండేది. ఆ అబ్యాసం యాకయ్య సార్ చెప్పిన విధానం ఒక అద్భుతం అంత బాగా చెప్పినారు. అందులో ఆరోగ్యమే మహా భాగ్యం అనేదాని గురించి ఎంతబాగా వర్ణించారంటే అది వర్ణణనాతీతం. ఆరోగ్యమే మహా భాగ్యం అని చదవటం చాలా సులభమే కానీ దాన్ని ఆచరించటం, దాన్ని ఆచరణలో పెట్టటం మన జీవితకాలం సరిపోదు, అది అర్ధం కాదు మనకి. అది అర్ధం చేసుకునేలోపే ఆకాశంలో మబ్బులు మాయమైపోయినట్లు, భూమిమీద మన ప్రాణం మాయమైపోతుంది అది అంతుచిక్కని రహస్యం. స్కూల్లో టీచర్స్ కొరత ఉన్నపుడు యాకయ్య సార్ దశావతారాలలో ప్రత్యక్షమైయేవారు విద్యార్థులకు వేరే సబ్జక్ట్స్ చెప్పటానికి. ఆయనొక దశావతారమూర్తి. 
ఏందేందు వెతికిన అందందు కలదు, ఇందులేదని అందులేదని సందేహం లేదనే పదానికి నిర్వచనం.  అయన అన్ని సబ్జక్ట్స్ లో ప్రావీణ్యత కలవారే.  పొద్దునే పేపర్ చదివే అలవాటుంది. ఆ అలవాటుని మాకూడా అంటించాలనే ముఖ్యఉద్దేశంతో ప్రేయర్ సమయంలో మాతో పేపర్ చదివించే కార్యక్రమం మొదలెట్టారు. యాకయ్య సార్ దయవల్ల మాకు పేపర్ పరిజ్ఞానం పెరిగింది. జనవరి 26 ,  ఆగస్టు 15 ల కార్యక్రమాలకు విద్యార్థులందరికీ     ఆటలపోటీలు నిర్వహించేవారు. అందులో యాకయ్య సార్ పాత్ర ఎక్కువగా ఉండేది. పిల్లలు ఆటలాడే సమయంలో ఉత్తేజపరిచేందుకు, ఉత్సాహపరిచేందుకు వారి ప్రయత్నం అపురూపమైనది. యాకయ్య సార్ వారి శిష్యుల మనసులో విశిష్ట ముద్రవేసుకున్నారు.

జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేయాలి, కానీ విజయం మనదే. అడ్డంకుల వద్ద ఆగిపోవడం లక్ష్యాన్ని చేరుకోలేమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.


మీ శిష్యుడు 

కోట దామోదర్ 
మొబైల్ : 9391480475

సంపద కన్నా… సంస్కారం గొప్పది.

  సంపద కన్నా… సంస్కారం గొప్పది. మనిషి జీవితంలో కొన్ని వృత్తులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావు. అవి ఇతరుల జీవితాలపై బాధ్యతను మోసేవి. అలాంటి...