15, జూన్ 2025, ఆదివారం

శూన్యం

3, మే 2025, శనివారం

కవన చంద్రికలు – సమీక్ష

కవన చంద్రికలు

స్వర్గాన్ని దివి నుండి భువికి చేర్చే శక్తి సంగీతానికి ఉందని నానుడి. ఆంగ్ల రచయిత  "ఎమిల్ లుడ్విగ్" చెప్పినట్లుగా భూలోక వాసులను స్వర్గానికి ఎగరేసుకుపోయే శక్తి సంగీతానికి ఉందన్న నిజం సంగీత ప్రియులకు మాత్రమే తెలుస్తుంది.  *సంగీతమే కాదు కవిత్వం* కూడా ఆ కోవకు చెందినదనే విషయం కవితాప్రియులకు మాత్రమే తెలుస్తుంది. అన్ని కవిత్వాలకు ఆ శక్తి ఉంటుందో లేదో తెలియదు గానీ పాఠకుల హృదయాలను దోచుకునే కవిత్వాలకు అలాంటి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. భావాత్మక కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే అందులో లీనమై అలౌకికానందాన్ని, తాదాత్మ్యాన్ని పొందుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నే ‘రసానందం’ అంటారు. సంగీతానికే కాదు భూలోక పాఠకులను స్వర్గంలొ విహరింపజేసేశక్తి కవిత్వానికి కూడా ఉందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

 కవిత్వం (కవిత) చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్లు కవితా వస్తువు ఏదైనా, అమ్మజోల పాట పాడితే చంటిపాప నిద్రలోకి జారుకున్నట్లుగా పాఠకుడు కవిత్వాన్ని తనివితీరా ఆస్వాదించేలా కవి ప్రతిభాశైలి ఉండాలి. అలాంటి కవిత్వం రాసేవారు ఈమధ్యకాలంలో చాల అరుదుగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వేలకొద్దీ కవితా సంపుటులు వెలువడుతున్నా వాటిలో కొన్ని మాత్రమే పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. కవిత్వం పట్ల పాఠకుడికి రసజ్ఞత కలగాలంటే, కవి సందర్భానుసారంగా కథావస్తువును  కళ్లకు కట్టే విధంగా , మనసును రంజింపజేసే విధంగా కవిత్వీకరించాలి. అప్పుడే కవి పాఠకుల హృదయాంతరాలాల్లోకి చేరుకోగలడు. ఇటీవల “మహతీ  సాహితీ కవిసంగమం”, కరీంనగరం వారి “ధనుర్మాస కవితోత్సవం 2024-25” సందర్భంగా వైవిధ్య వ్యాస రచయిత యేచన్ చంద్ర శేఖర్ మస్తిష్కం నుండి పురుడుపోసుకున్న "కవన చంద్రికలు" ఆ కోవకు చెందినవే. కమ్మనైన అమ్మపాట ఎంత మధురమో "కవన చంద్రికలు"లో  రచయిత "యేచెన్ చంద్రశేఖర్" రాసిన  అమ్మ కవిత్వం కూడా అంతే మధురంగా అనిపిస్తుంది. చంటిపిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ అమ్మ చందమామను చూపించగానే కడుపు నిండా భోజనం చేసినట్లు, చందమామ పాటవలె మృదుమధురంగా అమ్మ కవితకు అక్షరరూపం కల్పించారు చంద్ర శేఖర్.  ఈ పుస్తకంలో “జీవన సౌరభాలు”  మరియు “స్వాతంత్ర్య సమరయోధులు” అని రెండు భాగాలున్నాయి.

“జీవన సౌరభాలు” లోని "సకల సౌభాగ్యాల పరమావధి కన్నతల్లి" అన్న కవితలో "అడగకుండా బిడ్డ ఆకలిని తెలుసుకునేది తల్లి.. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులుండేది తల్లి" అని, ప్రపంచంలో అడగకుండానే బిడ్డ ఆకలిని గుర్తించే ఏకైక వ్యక్తి కన్నతల్లి మాత్రమే అనే అక్షర సత్యాన్ని అందమైన పదాల పొందికతో పాఠకుడికి పసందైన విందును అందించారు. ఈ కవిత చదివిన ప్రతి పాఠకుడి మదిలో కన్నతల్లిపై మమకారం ఉప్పొంగేలా, తల్లిప్రేమను వివరించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. మరో కవితలో "జీవం పోసేది అమ్మ అయితే.. జీవితం ఇచ్చేది నాన్న", "జీవితపు నాణేనికి అమ్మ బొమ్మ అయితే.. బొరుసు నాన్న" అని కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించే ‘నాన్న’ గురుంచి ఎంతో అద్భుతంగా చెప్పారు. కవన చంద్రికలు లోని ఒక్కో కవిత చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా కవిత్వం రాయాలన్న ఉద్విగ్నతకు లోనవుతాడు. పాఠకులను మంత్రముగ్దులను చేసే ప్రాసతో కవిత్వం రాయడమంటే అది యేచెన్ చంద్రశేఖర్ గారికే సాధ్యం అనే భావన ఏర్పడుతుంది. ఈ పుస్తకంలోని 49 కవితలు సరళమైన తెలుగు భాషలో సామాన్య పాఠకులకు సైతం కవిత్వంపై అనురక్తి  కలిగించే విధంగా ఉన్నాయి.

"సుఖం మరిగిన మనిషి" కవితను గమనిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఆధునికత’ పేరుతో మనిషి సుఖాలకు అలవాటుపడుతూ యాంత్రికంగా మారుతున్న విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మనిషి సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక రోగాల పాలవుతున్నాడు. సమాజంలో మార్పు రావాలి. కానీ, ఆ మార్పు వలన మనిషికి ప్రయోజనం కలగాలి తప్ప పరాభవం, పతనం కాకూడదన్న విషయాన్నీ కవిత రూపంలో చెప్పడమనేది చాల గొప్ప విషయం. "కాయకష్టం మరిచాడు మనిషి.. సోమరిగా మారిపోయాడు మనిషి" అని అయన వాపోవడం ముమ్మాటికీ వాస్తవమే కదా! ఒకానొకప్పుడు మనిషి మూడుపూటల అన్నంకోసం కష్టపడి పనిచేసేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.  ఉచితాలకు అలవాటుపడి కష్టాన్ని మరిచిన మాట వాస్తవమే. సుఖం మరిగిన మనిషి గురుంచి ఎన్నో విషయాలను  ఈ కవితలో ప్రస్తావించారు.

"ఛిద్రమవుతున్న బతుకు చిత్రం" కవితలో , ‘కరోనా’ నేపథ్యంలో బడుగుల బతుకు కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ రచయిత ఇలా అన్నారు ...

"ఛిద్రమవుతున్నాయి బడుగుల బతుకులు..
మానలేదింకా కరోనా రేపిన గాయాలు"
"అంతలోనే విరుచుకుపడ్డ ధరల శరాఘాతాలు.. ఆకాశాన్నంటే ధరలతో తప్పట్లేదు వెతలు"

కరోనా ప్రభావంతో సామాన్యుడు చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని, అరకొర సంపాదనతో జీవితాలు కుదేలవుతున్నాయని అయినా బడుగు జీవులు సంసారసాగరమీదడానికి భగీరథప్రయత్నాలు చేస్తున్నారని ఈ కవిత ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.

"స్నేహం" ఈ కవితలో "అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తమే స్నేహం.. చెమర్చిన కన్నులలో చెదిరిపోని జ్ఞాపకమే స్నేహం" అంటూ, ఈ సృష్టిలో స్నేహానికి మించిన గొప్ప వరం మరొకటి లేదంటాడు రచయిత. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషికి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. అందుకే మంచి స్నేహితున్ని మించిన ఆస్తి లేదంటారు. మన జీవితంలో లక్షలు, కోట్ల సంపదకన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప వరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతాలుండవు.  “స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా” అనే అక్షర సత్యాన్ని స్పష్టంగా వివరించారు.

రెండవ భాగం “స్వాతంత్ర్య సమరయోధులు”లో 37 కవితలు చరిత్రలో అట్టడుగు పుటలలో శిధిలావస్థలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గురుంచి రాశారు. వారిలో చాలా మంది గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. చరిత్ర మరిచిన అలాంటి మహనీయుల గాధలను భవిష్యత్‌ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా, ఆ యోధుల త్యాగాలను విశ్లేషిస్తూ క్లుప్తంగా వివరించారు.

"కవన చంద్రికలు" లోని ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవిత కూడా పాఠకుడిని భావుకతకు గురిచేసేలా రాయడం  ఆయన రచనాశైలికి కలికితురాయిగా నిలుస్తాయి. చదివిన ప్రతి పాఠకుడు, కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది యేచెన్ చంద్రశేఖర్ “కవన చంద్రికలు”. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు యేచెన్ చంద్ర శేఖర్ గారి కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ  ఆకాంక్ష.

“కవన చంద్రికలు” ప్రతుల కోసం రచయితను నేరుగా మొబైల్ నెంబర్ +91 8885050822 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా లేదా chandrashekar.achen@gmail.com కు ఈమెయిల్ పంపడం ద్వారా సంప్రదించవచ్చు. 

వ్యాస రచయిత
కోట దామోదర్
మొబైల్: 9391480475



12, ఏప్రిల్ 2025, శనివారం

జలం వినా జీవం నాస్తి:

 జలం వినా జీవం నాస్తి:


నీరు లేకుండా ఏ జీవి కూడా బ్రతకజాలదు, అందుకనే “జలం వినా జీవనం నాస్తి” అంటారు. మనం నీటిని పొదుపుగా ఉపయోగిస్తే, ప్రతి నీటి చుక్క మన భవిష్యత్తు తరాలను కాపాడుతుంది. మనం నీటిని వృధా చేస్తే, మన భవిష్యత్తు తరాలు అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిపోతున్న నీటి ఎద్దడికి నిదర్శనం గత సంవత్సరం బెంగళూరులో జరిగిన తీవ్ర నీటి కొరత పరిస్థితులు. జనాభాకు తగినట్టు నీటి సరఫరా ఉండడంతో,  కొన్నేళ్ళ క్రితం వరకు  ప్రధాన నగరాల్లో నీటి కొరత అంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యధికంగా భూగర్భ జలాల వినియోగం, పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ కారణంగా యధేచ్చగా అటవీ నిర్మూలన వంటి అంశాలతో  నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. పర్యావరణ అసమతుల్యత కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, వర్షపు నీటి సంరక్షణ మరియు మెరుగైన సరస్సు నిర్వహణ లేకపోవడం వల్ల నీటి సమస్య గణనీయంగా పెరిగింది. నీటి సమస్యను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సుజల దీప్తికి బాటలు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాల్యం నుంచే నీటి పొదుపు జీవన శైలిలో ఒక భాగంగా మార్చాల్సి ఉంది. బెంగళూరు నీటి సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు “రెయిన్ రీచ్” కార్యక్రమం ద్వారా పర్యావరణవేత్త హరిహరన్ చంద్రశేఖర్ చేప్పట్టిన చొరవ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.

చాలా నగరాలలో ఏటా కురిసే వర్షపాతంలో దాదాపు 90 శాతం వృధా అవుతుంది. నగరాలలో సరస్సులు కనుమరుగవడం, వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్ల నిర్మాణం చేపట్టడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నగరాలలో కురిసే వర్షపునీరు డ్రైనేజీ గుండా నేరుగా నదుల్లోకి చేరడం వల్ల భూగర్భజలాల పునరుద్ధరణకు అవకాశం లేదు. నీటిని సంరక్షించడానికి మన జీవనశైలిలో మార్పులు అవసరమని భావించి, పిల్లలలో సరైన అవగాహన కల్పిస్తే తద్వారా నీటిని ఆదా చేయడం చిన్నప్పటి నుండే అలవాటుగా మారుతుందని పర్యావరణవేత్త డాక్టర్ హరిహరన్ చంద్రశేఖర్ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి “రెయిన్ రీచ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బెంగళూరు నీటి సంక్షోభం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం వంటిది. నీటి సమస్యను అధిగమించడానికి పొదుపు మంత్రాన్ని జపించాల్సిందేనని రెయిన్ రీచ్ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పాఠశాలల్లో వర్షపు నీటిని సురక్షితమైన తాగునీటిగా మార్చడానికి వడపోత వ్యవస్థతో కూడిన వర్షపు నీటి సేకరణ (RWH) వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది కాకుండా, వర్షపాతాన్ని మరియు డేటా-లాగ్‌ను ఎలా కొలవాలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం, వర్షపు నీరు శుద్ధి చేసే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడే “రెయిన్ గేజ్” వాతావరణ స్టేషన్‌ను ఏర్పాటు చేసి తద్వారా పిల్లలకు పూర్తి అవగాహన ఏర్పడేలా అనుభవం కలిగిన నిపుణులతో వారికి శిక్షణ ఇస్తారు. ప్రతి నెలా పిల్లలకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ, నీటి దుర్వినియోగంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థమయ్యేలా, వ్యవస్థలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పిస్తారు. ఈ కార్యక్రమం ఫలితంగా బెంగళూరులోని 40 పాఠశాలలు ఇప్పటివరకు 34 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయడం గర్వించదగిన విషయమే. విద్యార్థుల ఈ కృషిని స్ఫూర్తిగా తీసుకుని దీనిని  ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే నీటికి డోకా ఉండదు.

రెయిన్ రీచ్ సిస్టమ్ మాత్రమే కాదు, మిలియన్ వెల్స్ ఫర్ అనే సంస్థ కూడా బెంగళూరులో నీటి సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో కీలకమైన చొరవను చేపట్టింది. బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల బోర్డుకు మద్దతుగా ఉన్న ఈ ప్రాజెక్ట్, సాంప్రదాయ బావి మైనింగ్ పద్ధతులను ఉపయోగించి నగరం అంతటా పది లక్షల లోతు బావులు నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. బావి నిర్మాణం యొక్క పురాతన పద్ధతులను ఉపయోగించడం ద్వారా, భూగర్భజల వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది, 2025 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిన మిలియన్ వెల్స్ ఫర్ బెంగళూరు ప్రాజెక్ట్ బెంగళూరుకు నీటి భద్రతను నిర్ధారించే దిశగా ప్రయత్నిస్తోంది.

బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ లో కూడా  నీటి సంక్షోభం ఏర్పడే అవకాశం లేకపోలేదు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడానికి ఎన్నో కారణాలున్నప్పటికీ, అధిక నీటి వినియోగంతో పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకింపచేయడంలో నగర వాసులు విఫలం కావడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే వర్షం నీటిని భూమిలోకి ఇంకింపచేయడంలో  నగరవాసుల అలసత్వం ఒక కారణమైతే, ఈ అంశంపై ప్రభుత్వం తగిన ఆసక్తిని చూపకపోవడం మరో కారణం. ప్రతిచోటా సిసి రోడ్ల నిర్మాణం కారణంగా నగరంలో ఏటా కురిసే వర్షం నీరు  భూమిలోకి ఇంకే అవకాశం చాలా తక్కువ. వర్షం నీరు భూమిలోకి ఇంకాలంటే అందుకు ఇంకుడు గుంత ద్వారానే సాధ్యం అని గ్రహించి మొదటిసారిగా ఇంకుడు గుంతల ఆలోచన ద్వారా జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసిన వ్యక్తి బాకారం వద్ద గల పద్మశాలి కాలనీ వాస్తవ్యులు రాజాపేట ఆంజనేయులు. 1997లో ఒకసారి ఆయన అధికారిక పనుల నిమిత్తం గుజరాత్ లోని రాజ్ కోట్ సందర్శించిన సందర్భంగా అక్కడ కొందరు స్త్రీలు రోజంతా తలపై బిందెలు పెట్టుకుని నీళ్లు మోసే దృశ్యం ఆయనకు తీవ్ర బాధ కలిగించింది. అంతేకాక అప్పటికే తమ కాలనీలో కూడా భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడి ట్యాంకర్లపై ఆధారపడవలసి రావడంతో ఆయన మస్తిష్కంలో మొదటి సారి “ఇంకుడు గుంతల” ద్వారా జలయజ్ఞం చేపట్టాలనే సంకల్పానికి బీజం పడింది. వెంటనే ఆయన తమ కాలనీలోని భావసారూప్యత గల ఐదుగురు మిత్రులతో కలిసి 31 జూలై 1997 న ప్రయోగాత్మకంగా పూర్తి శాస్త్రీయ ప్రమాణాలతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. తొలి ప్రయత్నంలోనే ఆంజనేయులు శ్రమ ఫలించి భూగర్భజల మట్టం పెరగడంతో కాలనీలోని మిగతా వారు కూడా ఆయన సారధ్యంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందారు. భూగర్భ జలాలు పెరగడానికి, నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంత తప్పనిసరని నిరూపించిన రాజాపేట ఆంజనేయులు ఇంకుడు గుంత ఆలోచనను ప్రతి ఒక్కరూ పాటిస్తే నగరంలో నీటి చింత ఉండబోదు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ IAS అధికారిణి శాంతా షీలా నాయర్ యొక్క వ్యూహాత్మక ప్రణాళిక మరియు విధాన రూపకల్పన నైపుణ్యం వల్ల చెన్నై తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దోహదపడింది. 2001లో ఆమె తమిళనాడు బోర్డు కార్యదర్శిగా ఉన్నప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్షపు నీటి సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించి, మొత్తం బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె అన్ని భవనాల్లో వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. నాయర్ సూచనమేరకు  చెన్నైలోని ప్రజలందరూ ఇంటి అవసరాల కోసం ప్రత్యేక ట్యాంకులు మరియు పైపులను ఏర్పాటు చేసుకొని వర్షపు నీటి సంరక్షణకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ చొరవ నీటి సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా నగరంలో స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులకు ఒక ఉదాహరణగా నిలిచింది.

నీటి కొరత పరిస్థితులు మరింత తీవ్రరూపందాల్చకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ  ఇంకుడు గుంతల నిర్మాణం మరియు నిర్వహణ ఒక ఉద్యమంలా చేపడితే, భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

29, మార్చి 2025, శనివారం

మేలుమరువని "బికాష్ చౌదరి"

మేలుమరువని "బికాష్ చౌదరి"


ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు అతనికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. వారు అందించిన సహాయాన్ని గుర్తుంచుకొని వారిని చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటాం. సహాయం అందించిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడమనేది విద్యుక్త ధర్మం అనుకునేవారు కొందరైతే, కనీసం వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయని వారు మరి కొందరు. సాయం చేసినంత మాత్రాన వారికి ధన్యవాదాలు చెప్పి వారిని గుర్తుపెట్టుకుంటామా, మన జీవితంలో ఎంతో మంది  సాయం  చేస్తుంటారు ఎంతమందినని గుర్తుపెట్టుకుంటామనేవారు కూడా ఉంటారు. కొందరైతే సాయం పొందిన వెనువెంటనే మర్చిపోతుంటారు. అతి కొద్దిమంది మాత్రమే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాకుండా సమయం వచ్చినప్పుడు వారిపట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటారు. ఈ తరహా కోవకు చెందిన వ్యక్తే JSW ఎనర్జీ లిమిటెడ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ "బికాష్ చౌదరి". 

భారత మాజీ క్రికెటర్ అయిన అరుణ్ లాల్, భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు, 1982లో అరంగేట్రం చేసి 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 93 అత్యధిక స్కోరుతో 729 పరుగులు చేశాడు. కాగా అరుణ్ లాల్ ఇంటి పక్క వీధిలో చిన్న గుడిసెలో చాకలి వృత్తిలో నిమగ్నమైన బికాష్ చౌదరి తండ్రి నివసించే వాడు. అతను అరుణ్ లాల్ కుటుంబం యొక్క బట్టలు ఉతికే వాడు. తన తండ్రితో పాటు బికాష్ చౌదరి అరుణ్ లాల్ ఇంటికి తరచుగా బట్టలు ఉతకడానికి వెళ్లేవాడు. కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న బికాష్ కి టీచర్స్ చెప్పే పాఠాలు సరిగా అర్థం కాకపోవడంతో ఆంగ్లంలో కొంత శిక్షణ అవసరం అని తెలుసుకొని, ఆంగ్లంలో నిష్ణాతులుగా ఉన్న అరుణ్ లాల్ భార్య దేబ్జాని వద్దకు ట్యూషన్ కోసం అతను రోజుకు ఒక గంట పాటు వచ్చేవాడు. దేబ్జాని బికాష్ కి ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా మెళకువలు నేర్పించి తరగతిలో ఉత్తమ ర్యాంక్ పొందడానికి శిక్షణ ఇచ్చింది. ఆమె మార్గదర్శనం లో  బికాష్ 10వ తరగతి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అరుణ్ లాల్ దంపతులకు సంతానం లేకపోవడం మరియు దేబ్జానికి పిల్లలంటే చాలా ఇష్టం కావడంతో, వారు బికాష్ ను తమ సొంత కుమారుడిగా చూసుకోవడంతో పాటు అతని చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. బికాష్ కూడా వారితో ఒక కుటుంబ సభ్యుడిగా గడిపేవాడు. సాయంత్రం వారింట్లో అందరితో కలిసి భోజనం చేసేవాడు. దేబ్జాని శిక్షణలో బికాష్ స్కూల్ విద్య ముగిసే నాటికి ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించాడు. అరుణ్ లాల్ దంపతులు అతనికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని అందుకు ఆర్ధికంగా ఎంతైనా సాయం అందిస్తామని  ప్రోత్సహించడంతో బికాష్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత సెయింట్ జేవియర్స్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ఐఐటీ కలకత్తా లో పూర్తి చేశారు. చదువు పూర్తియైన తర్వాత ఉద్యోగ అవకాశాలు బికాష్ ను  వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన  డ్యూయిష్ బ్యాంక్, HDFC బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ లకు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం JSW ఎనర్జీ లిమిటెడ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అతను తన విజయం కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంతో ఉన్నత  ఉద్యోగం చేస్తున్నప్పటికీ తనకు ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా తనని ఒక కుటుంబ సభ్యుడిగా అక్కున చేర్చుకున్న అరుణ్ లాల్ దంపతులను అతను ఎప్పటికి మరిచిపోలేదు. అరుణ్ లాల్ బికాష్ సోదరీమణుల చదువుకు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధపడ్డప్పటికీ, అది వారికి భారమవుతుందని  భావించిన బికాష్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. 

దైనందిన జీవితంలో ఒకరి సాయం లేకుండా ముందుకు సాగడమనేది అసాధ్యం. ఎవరి నుండి అయినా చిన్న సాయం పొందినా వెంటనే కృతజ్ఞతలు చెప్పడం విజ్ఞత. మనకు సహాయం చేసిన వారు మనల్ని మరచి పోయినా ఫర్వాలేదు, మనం వారిని మరువకూడదు,  నిజమైన కృతజ్ఞత అంటే ప్రయోజనం పొందిన వారు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా జీవితాంతం గుర్తుంచుకుని, అవసరమైనప్పుడు తిరిగి వారికి చేతనైన సాయం చేయడమే. అరుణ్ లాల్ దంపతుల పట్ల బికాష్ చౌదరి నిజమైన కృతజ్ఞత చాటుకున్నారు. అత్యంత హృదయ విదారక పరిస్థితులలో ఆ దంపతులకు సొంత ఇల్లు కూడా లేదని తెలుసుకొని వారు ఇల్లు కొనుగోలు చేయడానికి అతను ఆర్థికంగా సహాయం అందించారు. అంతేకాకుండా అతను సాధారణమైన వోక్స్వ్యాగన్ కారు వాడుతూ వారికి మాత్రం మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఎవరైనా మనకు సహాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో, మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుకుంటాం. జీవితాంతం గుర్తు పెట్టుకునేవారు అతి తక్కువ మంది అందులో బికాష్ చౌదరి ఒకరు అని చెప్పొచ్చు. అరుణ్ లాల్ కుటుంబం పట్ల తన కృతజ్ఞతను జీవితాంతం చాటుకునేలా తన కుమార్తెకు ‘అరుణిమ’ అని అరుణ్ పేరు పెట్టుకున్నాడు.

మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం బికాష్ చౌదరి లాంటి వ్యక్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని నేటి యువతరం కృతజ్ఞతాభావంతో నడుచుకుంటే వారు కూడా తమ తమ జీవితాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.  ఒక సందర్భంలో, బికాష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అరుణ్ లాల్ దంపతులు నాకు సహాయం చేయడమే కాక మరియు జీవితంలోని ప్రధాన విలువలు నేర్పించారు. ప్రతి అడుగులోనూ, ఆయన నన్ను మంచి వ్యక్తిగా ఎదగడానికి ప్రేరేపించారు. వారి సహాయం లేకుండా, నేను ఈ రోజు ఉన్న స్థితిలో నిలబడే వాడిని కాదు, అని బికాష్ భావోద్వేగంతో పంచుకున్నాడు.  కష్టకాలంలో మీకు సహాయం చేసినవారు సామాన్యుడే కావచ్చు కానీ మనకు దేవుని తో సమానం. చేసిన సాయం, దానం ఎప్పటికీ వృధా కాదనటానికి చక్కటి ఉదాహరణ బికాష్ చౌదరి జీవితం.   

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

7, మార్చి 2025, శుక్రవారం

ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".

 ధీరవనిత "కెప్టెన్ రీనా వర్గీస్".

అదొక మావోయిస్టుల ఉనికి ఉండే అత్యంత కఠినమైన దండకారణ్యం. సాధారణంగా దండకారణ్యంలోకి అడుగుపెట్టాలంటేనే ఒకరకమైన వణుకు పుడుతుంది. అందులోనూ అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఏ క్షణాన ఎటువైపునుండి తూటాల వర్షం కురుస్తుందో తెలియని అతి భయంకరమైన ప్రాంతమది. మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కీలక స్థావరం అయిన అబుజ్‌మర్ ప్రాంతం 21 అక్టోబర్ 2024న మావోయిస్ట్ మరియు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణంలో కాల్పులతో ఎనిమిది గంటలపాటు దద్దరిల్లిపోయింది. ఆ కాల్పుల్లో క్షతగాత్రుడైన C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోగా, తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు కొట్టుమిట్టాడుతున్న ఆయనను ధైర్యవంతురాలైన మహిళా హెలికాప్టర్ పైలట్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నిలిపి అందులో నుండి దూకి సమయస్ఫూర్తితో, అత్యంత సాహసోపేతంగా ఆ కమాండో ప్రాణాలను కాపాడింది. ఆ ధీరవనిత పవన్ హన్స్ హెలికాప్టర్ పైలట్ "కెప్టెన్ రీనా వర్గీస్" నిబద్ధతను మరియు అసామాన్య ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది.  

బూబీ-ట్రాప్డ్ మావోయిస్టు ప్రధాన కార్యాలయమైన అబుజ్‌మర్ ముట్టడిలో అక్టోబర్ 21, 2024 న పక్కా వ్యూహంతో పోలీస్ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లతో దాడులు, బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆ భీకరపోరులో C-60 కమాండో శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావంతో మూడు గంటలపాటు అడివిలో ఎలాంటి సదుపాయంలేక తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కమాండో ను కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసినప్పటికీ సీఆర్పీఎఫ్‌ బలగాలకు అండగా బ్యాకప్‌ ఫోర్స్‌ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎటు వెళ్లలేని పరిస్థితి కావడంతో, ఆ సమయంలో తోటి జవాన్లు అత్యవసర SOS కి కాల్ చేశారు. కెప్టెన్ వర్గీస్ SOS కాల్‌కు స్పందించి, తన సిబ్బందితో కలిసి గడ్చిరోలి నుండి తన 13 సీట్ల డౌఫిన్-ఎన్ పవన్ హన్స్ హెలికాప్టర్‌ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) 100 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 35 నిమిషాల్లో చేరుకుంది. అటవీ ప్రాంతంలో గాయపడిన కమాండో ను వెతకడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కెప్టెన్ వర్గీస్ ప్రాణాంతక పరిస్థితుల్లో భూమికి చాల తక్కువ ఎత్తులో నావిగేట్ చేస్తూ గాయపడిన జవాన్‌ ఆచూకీ కనిపెట్టింది. దట్టమైన అడవిలో లాండింగ్ చేసే అవకాశం లేదు. ఒకవైపు మావోయిస్టుల కాల్పులు మరోవైపు పోలీసుల కాల్పుల మధ్య గాయపడిన కమాండో ను హెలికాప్టర్‌ లోకి ఎక్కించడం అసాధ్యమని భావించింది. ఎలాగైనా జవాన్ ప్రాణాలు రక్షించాలనే సంకల్పంతో తన కో ఫైలట్ సహాయంతో కాప్టర్‌ను భూమికి వీలైనంత దగ్గరగా దించి కాప్టర్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో తిరుగుతుండగా ఆమె కాక్‌పిట్ నుండి దూకింది. కమాండోల సహాయంతో గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లోకి వేగంగా ఎత్తగలిగారు. ప్రమాద స్థలం నుండి కేవలం 30 నిమిషాల్లోనే గడ్చిరోలి కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ సరైన సమయంలో హాస్పిటల్ కి చేర్చడంతో కమాండో ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా ఆమె ఓఖీ విపత్తు సమయంలో కూడా సహాయక చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం. కోవిడ్ కాలంలో లక్షద్వీప్ నుండి చాలా మందిని విమానంలో తరలించడంలో కూడా ఆమె సహాయపడింది.

ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అంత సులభం కాదన్న విషయం మనందరికీ తెలిసిందే, ఆమె ధైర్యసాహసాలు ప్రదర్శించి కమాండో ప్రాణాన్ని కాపాడిన ధీర వనితగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో కెప్టెన్ రీనాను సత్కరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఆమె సాహసోపేత సేవను అభినందించారు.

కూంబింగ్ ఆపరేషన్ లలో పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా  దైర్యంగా పోరాడగలగడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో కాపాడగలరనే విషయాన్ని "కెప్టెన్ రీనా వర్గీస్" నిరూపించారు. భయమే అత్యంత క్రూరమైన శత్రువు. భయంతో వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతుంది గానీ ముందుకు పోలేము. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే వారికి ఏదైనా సాధ్యమే.  


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్: 9391480475  



4, మార్చి 2025, మంగళవారం

అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".

అవరోధాలే అవకాశాలు "గోరుకంటి జయప్రద".

సరిగ్గా పాతికేళ్ళక్రితం నర్సంపేట బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సందర్భం. కొద్దిసేపటికి ఓ బస్సు ఫ్లటుఫార్మ్ మీదకు వచ్చింది. అప్పటికి బస్సు కోసం ఎదురుచూస్తున్న జనం సీట్ దొరకాలన్న ఆశతో ఎగబడి బస్సు ఎక్కేస్తున్నారు. కాలు పెట్టేంత స్థలం కూడా లేదు. బస్సు నిండా మగవారే తప్ప, మహిళ ప్రయాణికులు లేరు. ఇంతలో బస్సులోనుండి ఒక మహిళ  రైట్ రైట్ అని అరుస్తూ డ్రైవర్ గారికి సూచనలిస్తుంది. ఎవరిది ఆ ఆడ గొంతు బస్సులో మహిళలు లేరు కదా అని అందరూ ఆశ్చర్యపోతూ ఎవరని అటుఇటు చూస్తున్నారు ప్రయాణికులు. కొద్దిసేపటికి ప్రయాణికుల మధ్యలోనుండి సైడ్ ఇవ్వండి , సైడ్ ఇవ్వండని అనుకుంటూ ఆరడుగులు ఎత్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమె ఎవరో కాదు నర్సంపేట డిపోలో మొదటి మహిళ కండక్టర్ "గోరుకంటి జయప్రద".

ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కొన్ని రంగాలలో మాత్రమే జాబ్ చేయడానికి ఇష్టపడేవారు. అందులో ఆర్టీసీ బస్సు కండక్టర్ గా పనిచేయుటకు మాత్రం చాలామంది ఇష్టపడేవారుకాదు. ఎందుకంటే వారికి అసౌకర్యం ఉంటుందన్న భావన ఒక కారణమయితే మరోకారణం బస్సులో రద్దీ కారణంగా ఎక్కువసేపు నిల్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న భయం, సాహసోపేతమైన సంఘటనలు కూడా ఎదురవుతాయన్న అపోహ. అందుచేత మహిళ కండక్టర్ జాబ్స్ కి దరఖాస్తు చేసేవారు కూడా చాల తక్కువనే చెప్పొచ్చు. అలాంటి సమయంలో సాహసోపేతమైన జాబ్ ను ఎంచుకొని మహిళ కండక్టర్లు లేని  నర్సంపేట బస్సు డిపోలో మొదటి మహిళ కండక్టర్ గా పనిచేస్తూ 25 సంవత్సరాల విధి నిర్వహణలో ఎన్నో బదిలీలు అయినా పిల్లల భవిష్యత్ కోసం, వారిని ఉన్నత విద్య చదివించాలనే పట్టుదలతో, మొక్కవోని దీక్షతో మహిళలలో చైతన్యాన్ని కలిగించేలా ఆమె ఉద్యోగ ప్రస్థానం కొనసాగింది. "గోరుకంటి జయప్రద" గారు గత రెండురోజులక్రితం పదవి విరమణ పొందారు. ఈ సుదీర్గ ప్రయాణంలో మహిళ కండక్టర్గా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె అవరోధాలను అవకాశాలుగా మార్చుకున్నారు అంతేతప్ప వెనుతిరగలేదు. 1988 లో డిగ్రీ పూర్తి చేసిన జయప్రద గారు 2000 సంవత్సరము లో 90/- రూపాయలకే డేలీ వైజ్ కండక్టర్ గా ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేయడమేంటని అందరికి అశ్వర్యం కలుగకమానదు. 

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం:  

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో గోరుకంటి సుశీల - సత్యనారాయణ దంపతులకు జయప్రద గారు 1 మార్చి 1965లో జన్మించారు. వృత్తిరీత్యా తండ్రి సత్యనారాయణ ఉపాధ్యాయుడు, వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. జయప్రద గారు గుమ్మడవెల్లి స్వంత గ్రామంలోనే 1వ, తరగతి నుండి 7వ, తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆతర్వాత పై చదువులు చదవడానికి  గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ప్రతిరోజు గుమ్మడివెళ్లి నుండి గోరెంట్లకు 8 కి.మీ. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన 8 నుండి 10వ, తరగతి వరకు గోరెంట్ల గ్రామంలో 1981లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంకా పై చదువులు చదవాలనే కోరిక బలంగా కలిగింది. తండ్రి సంపాదనతో ఐదుగురు అక్కచెల్లెలను చదివించడం ఎంత కష్టమో, ఇల్లు గడవడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు తన చిన్నతనంలోనే ఎదుర్కొంది. అయినా పట్టుసడలని ప్రయత్నంతో పై చదువులు చదవాలనే కోరికతో    జయప్రద గారి పెద్ద సోదరి నిర్మల మహబూబాబాద్ మల్యాలలో ఉంటుండగా అక్కడే ఉంటూ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో 1983లో CEC కోర్సు పూర్తి చేశారు. ఆతర్వాత ఇంకా చదవాలనే పట్టుదలతో హనుమకొండ పట్టణంలో ఉంటున్న నాలుగవ అక్క అనంతలక్ష్మి  ప్రోత్సాహంతో వరంగల్ ఆంధ్ర బాలిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1988లో B.Com., పూర్తి చేశారు.

ఆతర్వాత వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిగాల వెంకటేశ్వరరావుతో 18 ఫిబ్రవరి 1989లో వివాహం జరిగింది. భర్త వెంకటేశ్వరరావు గారు ఓ ప్రవైట్ కళాశాలలో అడ్మిన్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. వారికీ ఇద్దరు అమ్మాయిలు, భర్త కు వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడవడం అతికష్టంగా భావించి జయప్రద కూడా భర్తకు సహాయం అందించాలనే ఆలోచనతో ఓ ప్రవైట్ స్కూల్ లో చాలాకాలం పాటు టీచర్ గా పనిచేశారు. ఐదుగురు అక్కచెల్లల్ను చదివించడానికి తండ్రి పడ్డ కష్టాన్ని భవిషత్తులో మేము కూడా పడకూడదు అనే గొప్ప ఆలోచనతో తన పిల్లల చదువుకోసం 22 జనవరి 2000 సంవత్సరంలో డైలీ వైజ్ 90/- రూపాయలతో క్యాజువల్ కండక్టర్ గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆమె ఉద్యోగంలో చేరేనాటికి వారి పిల్లలది చిన్న వయస్సు అయినాసరే ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రారంభించారు. ఒకవైపు పిల్లలను చూసుకునేవారు లేక మరోవైపు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. నర్సంపేట డిపోలో మహిళలకు కనీస సదుపాయాలు లేకపోయినప్పటికీ స్టాఫ్ మెంబెర్స్ ఎంతో గౌరవిస్తూ, తన ఉద్యోగానికి ఎలాంటి ఆటకం కలుగకుండా అందరూ సహకరించడంతో జయప్రద గారికి ఇక ఉద్యోగం కొనసాగించవచ్చు అన్న నమ్మకం కలిగింది. 7 సంవత్సరాల తరువాత ఉద్యోగం రెగ్యులర్ కావడం. ఆతర్వాత మహిళ కండక్టర్ గా ఉండి సంస్థ ఆదేశాల మేరకు ఏకంగా 7 డిపోలలో తన సేవలను అందించడం అభినందనీయం.

7 డిపోలలో సేవలు అందించడం గొప్పవిషయం.

ఎలాంటి రిమార్క్స్ లేకుండా తమ ఉద్యోగాన్ని కొనసాగించడం కొందరికే సాధ్యం. అలాంటి వారిలో జయప్రద గారు ఒకరు. నర్సపేట్ డిపోలో ఉత్తమ కండక్టర్ గా పేరుపొందిన ఆమెకు బదిలీలు బాధ తప్పలేదు. ఎప్పుడు బదిలీలతో పిల్లల చదువులకు కూడా తీవ్ర ఆటంకం కలిగినప్పటికీ డ్యూటీ మాత్రం సక్రమంగా నిర్వహించింది. 

ఆమె పని చేసిన డిపోలు: నర్సంపేట, కామారెడ్డి, రాణిగంజ్, హుజురాబాద్, మేడ్చల్, వరంగల్, పరకాల. 

అమ్మ కష్టం వర్ణించలేనిది:

రిటైర్మెంట్ సందర్బంగా వారి పిల్లలు అమ్మ పడిన కష్టాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ మాతో ఎప్పుడు గడిపేది కాదు. పండగొచ్చిన సమయంలో కూడా డ్యూటీ అంటూ వెళ్ళేది మా స్నేహితులందరూ వారి తల్లిదండ్రులతో గడిపితే మేము మాత్రం ఒంటరిగా అమ్మ వచ్చేంతవరకు దిగులుగా కూర్చున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అమ్మ మాకోసం మా భవిష్యత్తు కోసం తన విలువైన సమయాన్ని మాకోసం త్యాగం చేసింది. అమ్మ కష్టానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని వారి పిల్లలు అంటుంటే జయప్రదగారి తోటి ఉద్యోగులు చలించిపోయారు.

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్న జయప్రద ఎంతోమంది మహిళలకు  ఆదర్శం.

కాలంతో కలిసి నడిస్తే కానిది ఏముంది. ధైర్యంతో ముందడుగు వేస్తె సాదించనిది ఏముంది.

సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో ప్రతిఒక్కరు తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 


21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్:

అటెండర్​ టూ అసిస్టెంట్​ ప్రొఫెసర్:

కోర్టు లో క్లాస్ ఫోర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల బాలుడి జీవిత కథ ఇది.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అతను ఓ జానపద గాయకుడు, రచయిత, "ఇక్ తారా" తుంబి అని పిలువబడే పంజాబీ సాంప్రదాయ సంగీతకారుడు కూడా. చిన్నతనం నుండే రచనలపై ఆసక్తి కారణంగా ఎన్నో రచనలు చేస్తూ, జానపద గాయకుడిగా, సంగీత కళను భారతీయ రేడియో మరియు టెలివిజన్ లో ప్రదర్శించేవాడు.  కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 9 వ తరగతి వరకు మాత్రమే చదివి, ఉన్నత విద్యనభ్యసించ లేక ప్రదర్శనల ద్వారా వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో ఏదో ఒక పని చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. తన మొదటి ప్రయత్నం తో కోర్టులో అటెండర్ ఉద్యోగం సంపాదించాడు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి న్యాయమూర్తి వద్ద ఎంతో కష్టించి పనిచేస్తున్నప్పటికీ, తన స్థాయి కారణంగా న్యాయమూర్తి తనకు సరైన గౌరవం ఇవ్వడంలేదన్న భావన కలిగింది. రోజంతా విధినిర్వహణలో సమయం వెచ్చిస్తున్నందున తన నైపుణ్యాలను కోల్పోతున్నాన్న భాద ఉన్నప్పటికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాడు. ఓరోజు న్యాయమూర్తి ప్రవర్తనతో విసుగుచెంది, అటెండర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ సంఘటన తర్వాత ఆ బాలుడు తన ఆత్మకథను "మై సాన్ జడ్జ్ డా అర్ధాలి" అని తన మాతృ భాష అయిన పంజాబీ భాషలో రాసుకున్నాడు. అతనే "నిందర్ ఘుగియాన్వి". నిందర్ ఘుగియాన్వి ఒక అటెండర్ స్థాయి నుండి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, ఘుగియాన్వి 69 పుస్తకాలు రాశారు. తన ఆత్మకథలో భారత న్యాయ వ్యవస్థలో క్లాస్ ఫోర్ ఉద్యోగులను వ్యక్తిగత సేవకులుగా ఎలా ఉపయోగిస్తారో చిత్రీకరించబడింది. ఈ పుస్తకం ప్రజాదరణ పొందడమే కాదు అతని ఆత్మకథ "ఐ వాజ్ ఏ సెర్వెన్ట్  టు ఏ  జడ్జ్" అని ఆంగ్లంతో పాటు 15 భారతీయ భాషలలోకి అనువదించబడింది. గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, పంజాబీ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం తో సహా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను వారి పాఠ్యాంశాల్లో చేర్చాయి. 12 విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్ మరియు పిహెచ్‌డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు నిర్వహించారు.

అటెండర్ నుంచి ప్రొఫెసర్ గా ఎలా ఎదిగారు తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా చదవాల్సిందే..

కోర్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ భాషా విభాగంలో తోటమాలి గా చేరారు. అక్కడ అతని పని మొక్కలకు నీరు పెట్టడం తోటను చూసుకోవడం మాత్రమే. ఘుగియాన్వి "ఇక్ తారా" తుంబి వాయించడంలో ప్రావీణ్యత కలిగినందున సాహిత్య విభాగంలో జరిగే కార్యక్రమాలలో ఇక్ తారా వాయించేవాడు. అతి తక్కువ సమయంలోనే సంగీత వాయిద్య కళాకారుడిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఒక తోటమాలి ఇంత ప్రజాదరణ పొండటమేంటని కొంతమంది అధికారులు అసూయపడి అతన్ని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించారు. టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేరు అన్నట్లు అతనికి పంజాబీ భాషపై పట్టున్నందున కాలక్రమేణా అతను ప్రభుత్వ భాషా శాఖ సభ్యుడిగా ఎంపికైనారు. మొదటిసారిగా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనిని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించిన అదే అధికారి, అతన్ని మిస్టర్ నిందర్ ఘుగియాన్వి జీ అని పిలవడం ప్రారంభించాడు. నిందర్ ఘుగియాన్వి సాధారణ జీవితం నుండి సాహిత్య ఔన్నత్యానికి ఎదగడం పంజాబీ సంస్కృతి, భాష మరియు సాహిత్యం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. పంజాబీ సంస్కృతికి ఆయన చేసిన కృషి ని గుర్తించి పంజాబ్ విశ్వవిద్యాలయం 'సాహిత్య రతన్' అవార్డుతో సత్కరించింది.

అటెండర్ గా తన కెరీర్‌ను ప్రారంభించి, తన ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాడు, చివరికి పంజాబీ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచి, 69 కంటే ఎక్కువ పుస్తకాలు రాయడానికి దోహదపడింది. ఆయన రచనలపై అనేక లఘు చిత్రాలు నిర్మించబడ్డాయి మరియు ఆయన పంజాబ్ జానపదాలు మరియు సంస్కృతిపై పరిశోధనలు చేశారు. ఆయన నైపుణ్యాన్ని గుర్తించి, IAS మరియు PCS అభ్యర్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి ఆయనను ఆహ్వానించారు. ఇటీవల, ఆయన బటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిందర్ ప్రపంచవ్యాప్తంగా USA, UK, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటించి విదేశీ సంస్కృతుల గురించి నేర్చుకుంటూనే తన సొంత సంస్కృతిని విదేశాలకు ప్రచారం చేశారు.

1994లో భారత రాష్ట్రపతి ఎస్.గియాని జైల్ సింగ్, 2001లో కెనడా ప్రధానమంత్రి శ్రీ జి. క్రెచియన్ మరియు 2005లో యుకె ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ వంటి ఉన్నత స్థాయి ప్రముఖులచే సత్కరించబడిన గౌరవం నిందర్ ఘుగియాన్వికి లభించింది.

నిందర్ ఘుగియాన్వి యొక్క ఆత్మకథను ‘‘నేను జడ్జిగారి సేవకుడ్ని’’ అన్న పేరుతో డా. రహీమ్ పఠాన్ ఖాన్ తెలుగులోకి అనువదించారు.

జీవితం తరచుగా ఊహించని మలుపులు తీసుకుంటుంది మరియు విజయం కొన్నిసార్లు తీవ్ర ప్రతికూల క్షణాల నుండి ఉద్భవిస్తుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. 

 

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475



6, ఫిబ్రవరి 2025, గురువారం

ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"


విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్నికూడా మించి పోయాడు.

అలాంటి అభినయ ఏకలవ్యుడిలాంటి స్ఫూర్తిదాయకమైన యధార్థ విజయ గాథ నిజామాబాద్, నాందేవ్ గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతుల కుమార్తె హారికది.

హారిక తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.చిన్నప్పటినుండి చదువులో అందరికంటే ముందుండే హారిక ఏడవతరగతిలో ఉన్నపుడే తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పట్టుదలతో చదివిన ఆమె పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. తన చిన్ననాటి ఆశయ సాధన కోసం నీట్ పరీక్ష రాయాలనుకుంది. కానీ నీట్ కోచింగ్ కోసం ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ నిరుత్సాహం చెందక తల్లి ప్రోత్సహంతో ముందడుగు వేసింది.  నిరుపేదరాలైనప్పటికీ,మనుసుంటే మార్గాలెన్నో అన్నట్లు హారిక పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ప్రతిరోజూ యూట్యూబ్ లో దీక్షగా వీడియో క్లాసులు చూస్తూ పరీక్షకు సిద్ధమైంది. కోచింగ్ కు  డబ్బులు లేవని ఆగిపోకుండా తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకొని ఘోర తపస్సు చేసి నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కాలేజీలో సీట్ వచ్చిన తరువాత ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కలిపి మొత్తం 2 లక్షలవరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలేనిరుపేదరాలైన హారిక  డబ్బు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతూ తన చదువుకోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకోగా  అందుకు ఎంతోమంది దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.

నేటి యువతకు ఇంటర్నెట్ (మొబైల్) నిత్యవసర వస్తువులా మారిపోయింది.కొంతమంది ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా వృధాచేసుకుంటున్నారు.సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభం, నష్టం అనేది వినియోగదారుడిమీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని మంచికి వాడితే మాత్రం ఈ భూమిమీద తెలియని విషయాలెన్నోతెలుసుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలల్లో దొరకని సమాచారం కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో క్లాసులు వింటూ నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్ సాధించిన హారిక విజయమేఇంటర్నెట్ ని మంచికి ఉపయోగిస్తే విద్యార్థులకు ఎంత ప్రయోజనకరమో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ.       

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్నిఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్నహారిక ఎందరికో ఆదర్శం.

సాధించాలనే తపన ఉంటేఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

అసాధ్యమనే పదంలో"అ" అనే అక్షరాన్ని పక్కనే పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

ప్రతి విద్యార్థి అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.

 

మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com


https://www.ntnews.com/editpage/a-mind-has-a-way-when-you-constantly-work-towards-an-ambition-what-you-think-will-come-true-858966

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

విమర్శ

విమర్శ:

విమర్శ అనేది ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి దారి తీస్తుంది. ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని చెడగొడుతుంది. విమర్శించే వారిని కొంతమంది ఇష్టపడరు. విమర్శించేవారు లేకపోతే మనిషి ఏమి సాధించ లేడన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు. నేను సున్నిత విమర్శకుడినే. కొన్నిసార్లు విమర్శ కుసంస్కారికి ఆయుధం లాగా పనిచేస్తుంది. ప్రతి స్పందన సంస్కారి సవరణ.

యధార్థ సంఘటన;

నేను సుభాష్ నగర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, సంస్థ యజమాని ఒక రోజు డిజైన్ చేయమని దాని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విని అందులో ఉన్న లోపాన్ని ఆయనకు అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన యజమాని అనే గర్వంతో నేను చెప్పిన విషయాన్ని గ్రహించక వాగ్వాదానికి దిగాడు. అతనికి చాలామంది నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు వితండవాదానికి దారి తీసింది. ఆ తర్వాత నేను జాబ్ కోల్పోవడం జరిగింది. నేను మానేసిన తర్వాత వేరే అతనికి కూడా అదే పరీక్షా అతను ఎవరో కాదు నా మిత్రుడే. అతను ఓపికగా ఆయన చెప్పిన దాన్ని చేసి చేతులు దులుపుకున్నాడు. అతను చేసిన డిజైన్ ప్రాక్టికల్ గా చేసి చూస్తే అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు అందుకు కంపెనీ యజమాని 20 లక్షలు నష్టపోయాడు. నష్టపోయిన సరే యజమాని గర్వం దిగలేదు. నా మిత్రుడు మాత్రం నెల నెల జీతం తీసుకుంటూ యజమాని చెప్పిన పని చేసేవాడు. అలా ఎన్నో ప్రాజెక్టులు చేసి నష్టపోతూ నష్టపోతూ మొన్న ఈమధ్య కంపెనీ మూతపడింది. కంపెనీలో పనిచేసే వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఒక విమర్శకుడి వల్ల లాభమే తప్ప నష్టం మాత్రం ఉండదు అనేది నిజం. అసలు విమర్శ లేకపోతే మనిషి వృద్ధి చెందలేడనేది ముమ్మాటికీ నిజం. అందుకు పైన చెప్పిన ఉదాహరణ ఒకటి. నేను విమర్శించి చెడ్డవాడిని అయ్యాను కానీ నేను నష్టపోలేదు. విమర్శకుడు ఎప్పుడు నష్టపోడు. విమర్శకుడి మాటను అర్థం చేసుకోలేకపోతే ఎదుటివారి నష్టపోతారు. నేను విమర్శించడం వల్ల జాబ్ కోల్పోయాను అందుకు ఒక సంవత్సరం పాటు జాబ్ కొరకు చాలా ఇబ్బందులు పడ్డాను కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి నాది. ఒకరోజు హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా లో ప్రభుత్వ ఉద్యోగి అయినా జగదీశ్ సార్ ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ లో ఒక చిన్న పని చేయమని వర్క్ ఇచ్చారు అలా పరిచయం ఏర్పడి నేను కోల్పోయిన జాబ్ గురించి అసలు జరిగిన విషయం గురించి చెప్పాను. ఆయన నా బాధను అర్థం చేసుకొని నీకు జాబ్ వచ్చేవరకు నేను రూమ్ రెంట్ కడతాను జాబ్ వచ్చాక నాకు జాబ్ వచ్చిందని చెప్తే చాలు బాబు నువ్వు ఏమి బాధపడకు అన్నారు. అన్నట్లే ఆయన నా జాబ్ వచ్చేవరకు రూమ్ రెంట్ కట్టినారు. నాకు జాబ్ వచ్చాక మొదటి సారి ఆయనకు ఫోన్ చేసి చెప్పాను సంతోషించాడు. ఆయన కట్టిన రూమ్ రెంట్ డబ్బులు ఇవ్వబోతే అస్సలు వద్దన్నాడు. జగదీశ్ సార్ చేసిన మేలు నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను. ఇప్పటికి జగదీశ్ సార్ కి అప్పుడప్పుడు కాల్ చేస్తే జాబ్ ఎలా ఉంది ఏమైనా సహాయం కావాలంటే అడుగు దామోదర్ అంటారు. ఇలాంటివారికంటే నా జీవితంలో కావాల్సింది ఏముంది. విమర్శ వల్ల నేను కోల్పోయింది ఏముంది ఏమీ లేదు జాబ్ మాత్రమే కానీ విమర్శను అర్థం చేసుకోలేని యజమాని మాత్రం కంపెనీ కోల్పోయాడు. అతను కంపెనీ కోల్పోవడమే కాకుండా అందులో ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు కారకుడయ్యాడు. యజమాని ధనవంతుడు, శక్తివంతుడు కావొచ్చు కానీ కాలం అంతకంటే శక్తివంతమైనది. ఒక చెట్టు నుండి లక్ష అగ్గిపుల్లలు తయారవుతాయి కానీ ఒక అగ్గి పుల్లతో లక్షల చెట్లు బూడిద అవుతాయి అన్నట్లుగా విమర్శకుడి వల్ల మంచి జరుగుతుంది కానీ మౌనం గా ఉండే వారి వల్ల అన్ని కోల్పోవాల్సి వస్తుంది.

మరో యదార్థ సంఘటన:

మౌనంగా ఉండే నా మిత్రుడికి మరో మిత్రుడొకరు ఫోన్ చేసి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని అడిగారు. ఆయన రెండు మూడు కోర్సులు చెప్పి మిత్రుడి సలహా కోరారు. నా మిత్రుడు బయట ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దొరకని ఒక కోర్సు పేరు చెప్పి చేయమన్నారు. పాపం అతని మిత్రుడు గుడ్డిగా నమ్మి వారి అబ్బాయిని మిత్రుడు చెప్పిన కోర్స్ చేయించారు. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయి రెండు సంవత్సరాలు అయింది ఉద్యోగం లేదు. నా మిత్రుడి కంటే ముందు ఒకతను సలహా అడిగారట ఆయన సున్నితంగా విమర్శించి ఆయన చెప్పిన కోర్స్ ఏవి బాగాలేవు ఇంకా ఏమైనా కోర్స్ చేయించు అన్నారంట. ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా ఇంకో మిత్రుడి సలహా తీసుకొని ఆయన ఇబ్బంది పడటమే కాకుండా అబ్బాయి ఇబ్బందికి కారకుడైనాడు. 

విమర్శ ఎదుటివారిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది, విమర్శ ఒక గొప్ప స్నేహాన్ని బంధుత్వాన్ని నేలరాసే ఆయుధం. విమర్శ అనేది మోటార్ సైకిల్ కి ఇంధనం లాంటిది. ఇంధనం లేకపోతే ముందుకు పోవడం అసాధ్యం, మనిషి కూడా విమర్శ లేకపోతే పైకి ఎదగలేరు. మంచి విమర్శ, మానవులకు ఎదగడానికి కాకుండా సంపూర్ణంగా జీవించడానికి తోడ్పడుతుంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 

        


  

    

26, జనవరి 2025, ఆదివారం

డబ్బు తో ఏదైనా కొనగలంగానీ సుఖశాంతులు మాత్రం కొనలేము

డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు' అనుకుంటాం కానీ కేవలం సంపద ఉన్నంత మాత్రాన మనశ్శాంతిని పొందలేము. ఈ సృష్టిలో డబ్బు తో ఏదైనా కొనగలంగానీ సుఖశాంతులు మాత్రం కొనలేము. డబ్బు ఉన్నవాడు కోట్లు పెట్టి బంగారు మంచం కొనుక్కోవచ్చు. కానీ కంటికి నిండైన

నిద్రను కొనలేడు. అదే డబ్బులేనివాడు నేలపై పడుకునైనా కంటినిండా నిద్రపోగలడు. డబ్బే లోకం చాలామందికి. డబ్బులేనిదే మనిషి బ్రతకలేడు అనుకునేవారికి ఈ ఫొటోలోని వ్యక్తి గురుంచి  తెలుసుకోవడం చాలా అవసరం. 

ఈఫోటోలోని వ్యక్తి పేరు తెలియదుగానీ. ఇతను హైద్రాబాద్ లోని నాచారం రోడ్ నెంబర్. 07 లో చిరిగిపోయిన బట్టలతో కప్పిన చిన్న గుడిసెలో ఉంటాడు. చూడటానికి పిచ్చివాడిలాగా ఉంటాడు కానీ పిచ్చివాడు కాదు. అతనికి రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి లేచి నడవలేని స్థితి. రెండు చేతులతో ప్రాకులాడుతూ అతి కొద్దీ దూరం మాత్రమే కదలగలడు. ఆయనది సొంతూరు ఎక్కడో కూడా తెలియాని మతిస్తిమితంలేని పరిస్థితి.  

నేను పనిచేస్తున్న కంపెనీ దగ్గర్లోనే ఇతని గుడిసె ఉంటుంది. గత 13 సంవత్సరాలనుండి ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను. ప్రతిరోజు ఉదయం నాచారం రోడ్ నెంబర్. 07 మెయిన్ రోడ్ పక్కన కూర్చొని ఉంటాడు. అయితే ప్రతి రోజు ఇతనికి ఎవరు భోజనం పెడతారన్న సందేహం కలిగింది నాకు. ఒకరోజు ఉదయం ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఒకతను కారు నుండి దిగి టిఫిన్ ఇస్తుండగా చూశాను అలా ప్రతిరోజు అతనే టిఫిన్ ఇస్తున్నాడు. కొన్నిరోజుల తరువాత టిఫిన్ ఇచ్చే అతన్ని ప్రతిరోజు మీరే టిఫిన్ ఇస్తున్నారు అతని గురుంచి ఏమైనా తెలుసా అని అడిగాను. ఇతని గురుంచి నాకు ఏమి తెలియదు అన్నాడు. ప్రతి రోజు ఇతనికి టిఫిన్ ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు జీవితాంతం కూర్చొని తినగలిగే ఆస్తులున్నాయి కానీ మూడు పూటలు తిని అరిగించుకునే శక్తి లేదు. కొన్ని సందర్భాల్లో తినడానికి సమయం కూడా ఉండదు. డబ్బు ఎంత ఉంటె ఏమి లాభం. ఆస్తులు బాగుండాలి అని కోరుకోవడంకన్నా ఆరోగ్యం బాగుండాలి అని ఆలోచించినవాడే అస్సలైన మనిషి అన్నాడు అతను. నేను తినలేక బాధపడుతున్నాను మరొకరు తిండిలేక భాదపడుతున్నారు. నేను తినే ఒక పూట టిఫిన్ ఇలాంటి పేదవారికి అందించడంతో డబ్బుతో కొనలేని మనశ్శాంతిని పొందగలుగుతున్నాను అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన మాట విన్నాక డబ్బుతో కొన్నే కొనగలము ఈ సృష్టిలో డబ్బుకంటే విలువైనది ఆరోగ్యమే అని తెలుసుకున్నాను.

మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు టిఫిన్ కోసం ఎదురుచూస్తున్న అతనికి నేను 500 రూపాయలు ఇవ్వబోయాను కానీ అతను నాకు వద్దని నిరాకరించాడు. మళ్ళీ ఇవ్వబోయాను అయినాసరే వద్దు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, మరోరోజు వర్షం పడుతుంది అతను మొత్తం వర్షంలో తడిసిపోయాడు అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న అతన్ని చూడగానే నాకెందుకో న దగ్గర ఉన్న రైన్ కోట్ ఇవ్వాలనిపించింది వెంటనే అతని దగ్గరకు వెళ్లి ఇవ్వబోయాను అయినా తీసుకోలేదు. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకుంటారు కానీ ఇతను డబ్బు వద్దు అంటున్నాడు ఎందుకని అని సందేహం కలిగి పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని అడిగాను డబ్బు ఇస్తే తీసుకోవడంలేదు ఎందుకని అని అతను ఆయనికి డబ్బు, వస్తువులు ఇస్తే తీసుకోడు భోజనం లేదా తినే పదార్ధాలు మాత్రమే తీసుకుంటారు అన్నాడు. సెక్యూరిటీ గార్డ్ చెప్పాక నేను చాల బాధపడ్డాను. ఈ లోకంలో డబ్బే ప్రధానం అందరికి కానీ ఇతనికి మాత్రం బోజనమే ప్రధానం. అలా మరుసటి రోజు టిఫిన్ అందించాను తీసుకొని చాల ఆనందించాడు. అప్పుడు అనిపించింది డబ్బుతో సుఖాలను కొనుక్కోవచ్చు కానీ ఆనందాన్ని కొనలేము, డబ్బుతో మంచి వైద్యులను కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము. 

 మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తారు. అది

వారి మనస్తత్వాల మీద, ఆలోచనా విధానాల మీద ఆధారపడి ఉంటుంది. లోకంలో ఎంత మంది మనుషులున్నారో, అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి' అంటాడో ఫ్రెంచి శాస్త్రవేత్త.

'మంచి చేయకపోయినా సాటివాడికి చెడుచేయకు' అంటారు కొందరు. భగవంతుడు మానవజన్మ అనే గొప్ప వరాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఇవ్వడం తెలుసుకొమ్మని, సాటి జీవిని ప్రేమించడం అలవరచుకొమ్మని ఆపదల్లో ఉన్నవారిని ఆదుకొమ్మని, సమస్యలతో సతమతమవుతున్నవారికి తగిన సలహాలివ్వమని. మన జ్ఞానాన్ని పంచమని, మన సంపదలో కొంతయినా నిస్సహాయులకు దానం చెయ్యమని. ఈ పరమసత్యాన్ని గ్రహించి, ఆచరించలేని జన్మ వ్యర్ధం.

మీరు ఎప్పుడైనా మల్లాపూర్ వైపు వెళ్తే అతనికి టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా తినే పదార్ధాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. మూడు తిని అరిగించుకోలేనివారు ఒక పూట భోజనం అతనికి అందించండి మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు..


కోట దామోదర్ 

మొబైల్: 9391480475    

18, జనవరి 2025, శనివారం

నమ్మకం:

నమ్మకం:

‘‘నిన్ను పొగిడే ప్రతి ఒక్కరినీ నీ స్నేహితుడిగా, దూషించే ప్రతి ఒక్కరినీ నీ శత్రువు గా భావించడం నీ కన్ను నువ్వే పొడుసుకున్నట్లు. పొగిడిన ప్రతివాడిని నమ్మి మోసపోవడం ఎంత తప్పో, తిట్టిన ప్రతివాడిని శత్రువు అనుకోవడం కూడా అంతే తప్పు అది స్నేహితులైనా, బంధువులైనా. నిజానిజాలు అందరికీ తెలుసు కానీ ఎవరికి ఏదైతే నాకేంటనే  నిర్లక్ష్యం వల్లే తనకు తానే తవ్వుకుంటున్న గొయ్యి. మన చాపకిందకు నీరు వస్తే గాని చెమ్మను గుర్తుపట్టం అన్నట్లుగా ఏదైనా మన దాకా వస్తే గాని మనం మేల్కోలేము. అందుకేనేమో పడవ మునగకముందే ఒడ్డు చేరుకోవాలనే నానుడి పుట్టింది. 

ఒక్కోసారి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇన్ని సందేహాలతో మనుషులు బతుకుతున్న పరిస్థితులు చూస్తుంటే అసలు మనిషన్నవాడు ఉన్నాడా అనే సందేహం కలగక మానదు. నమ్మి మోసపోయినప్పుడు మనిషి పడే బాధ వర్ణనాతీతం. మరి మనిషి నమ్మకం లేకుండా ఎలా బతకగలడు? నమ్మకం అనివార్యం. నమ్మకం ప్రతిసారీ ఆనందాన్ని ఇస్తుంది. నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు, అది నిరాశ ను కలిగిస్తుంది. మరియు ఎవరిని నమ్మాలి మరియు ఎవరిని నమ్మకూడదు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు కానీ అనుభవించిన తర్వాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో విశ్వాసులు ఉన్నారు. నమ్మి చెడిపోయిన వారూ ఉన్నారు. నమ్మి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జమైకా పాప్ సింగర్ బాబ్ మార్లే ఒకరు. చిన్న వయసులోనే తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాటల యోధుడు. ఒకప్పుడు మైఖేల్ జాక్సన్ కు అభిమానులు ఎంతమంది ఉండేదో అంతకంటే ఎక్కువ అభిమానులను సంపాదించిన గొప్ప గాయకుడు. అలాంటి బాబ్ మార్లేకు బిల్ ఆక్స్లీ అనే  అభిమాని పరిచయం అయ్యాడు. మార్లే అంటే వీరాభిమానం ఒక్కమాటలో చెప్పాలంటే పిచ్చి.  పరిచయం ఏర్పడిన తర్వాత, మార్లేతో ఉండటానికి తన ఇంట్లోనే ఉంటానని చెప్పాడు. మార్లే తనపై చూపిన అభిమానాన్ని కాదనలేక చివరకు సరే అన్నాడు.

బాబ్ మార్లే మరియు బిల్ ఆక్స్లీ కొన్ని రోజుల్లోనే విడదీయరాని స్నేహితులు అయ్యారు. అనుకోకుండా ఓ రోజు మార్లీకి క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పారు. అది విన్న బాబ్ స్నేహితుడు 

బిల్ తట్టుకోలేకపోయాడు. పలు ఆసుపత్రులను సందర్శించారు. పక్కనే ఉన్న బిల్ ఆక్స్లీ వేదనకు గురయ్యాడు. చిరుతిళ్లు, భోజనం మానేసి తన సేవలు చేస్తున్నాడు. కానీ క్యాన్సర్ మాత్రం తగ్గలేదు. సార్, బ్రిటన్ వెళ్దాం, అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారని నాకు తెలుసు, అన్నాడు. కానీ తగ్గలేదు. నా దేశం అమెరికా వెళ్ళాలి అన్నాడు. అయినా.. ప్రయోజనం లేకపోయింది. క్యాన్సర్ ముదిరిపోయింది. బాబ్ చావుబతుకుల్లో ఉన్నాడు.

అప్పుడు బాబ్ మార్లే బిల్ ఆక్స్లీని పిలిచాడు. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు, దండం పెట్టి కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు. ఇటు బిల్ కూడా ఏడ్చేశాడు. నా ఆరాధ్యుడు చనిపోతున్నాడని బోరుమన్నాడు. అలా.. బిల్ చేతుల్లోనే బాబ్ మార్లే ప్రాణాలు వదిలాడు.

ఇంతకీ.. బాబ్‌కి క్యాన్సర్‌ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఒకరోజు షూస్ వేసుకుంటుండగా కుడికాలికి ఏదో సూది లాంటిది గుచ్చుకుంది. ఇది కనిపించనంత పరిమాణంలో ఉంది. అది  క్యాన్సర్ కారక రసాయనాలతో పూత పూయబడింది. ఆ షూస్ ఎవరివి కావు.. బిల్ బహుమతిగా ఇచ్చాడు!

అంతకు ముందు, అతను బాబ్ మార్లే ఇంటిపై తుపాకులతో దాడి చేసి అతని భార్య మరియు కార్మికులను చంపిన ఒక సమూహానికి నాయకుడు. మార్లే బుల్లెట్ గాయంతో బతికి. కొంతకాలం తర్వాత అభిమానిగా పరిచయం ఏర్పరచుకొని బాబ్ ఇంట్లో చేరి మెల్లగా పని పూర్తి చేశాడు. బాబ్ పక్కనే ఉంటూ అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందకుండా చూసుకున్నాడు. మరి, అతను ఎవరు అనుకుంటున్నారు? అతను అమెరికాకు చెందిన C*I*A ఏజెంట్. 

దీన్నిబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ! నమ్మకం తేనె పూసిన కత్తి లాంటిది. అందుకే తియ్యని మాటలెప్పుడు చేదు సంఘటనలకు దారితీస్తాయి. అలా అని ఎవ్వరిని నమ్మకుండా మనుగడ సాధించలేము. నమ్మకం లేకుండా ఏదైనా చేయడం అసాధ్యం. నమ్మకం రకరకాలుగా వివిధ కోణాలలో ఉంటుంది. ఎవరూ పూర్తిగా విశ్వాసం లేకుండా ఉండలేరు. అసలు విషయానికి వస్తే మనిషి నమ్మేవాటిని నమ్మటంలేదు నమ్మకూడనిది నమ్ముతున్నాడు. మనిషి అనునిత్యం అనుమానంతో బతుకుతున్నాడు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 


31, డిసెంబర్ 2024, మంగళవారం

వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :

వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణవార్త ప్రపంచ సంగీత ప్రియులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందిన తబలా పై కమనీయ ధ్వనులు పలికించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన గొప్ప కళాకారుడు.

తబలా పై తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తాయి.
తబలా పై అతని చేతి మునివేళ్ళు అలల్లా ఓలలాడుతూ మధుర మృదంగాలై మోగుతుంటాయి.

అతని మనం ఎలా మర్చిపోగలం:

తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే తబలా విద్వాంసుడు గుర్తుకు రాకపోవచ్చు కానీ తాజ్ మహల్ టీ యాడ్ లో తబలా వాయించిన వ్యక్తి అంటే అందరికీ తెలుసు. నిన్న ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో, అతను ఎవరా అని చాలా మంది సందేహించారు. కాసేపటి తర్వాత జాకీర్ హుస్సేన్ మరణాన్ని తెలియజేస్తూ తాజ్ మహల్ టీ యాడ్ చూపించింది అప్పటివరకు ఆయన పేరు  చాలా మందికి తెలియదు. చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు తన పేరుతో అందరికి పరిచయమవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం తన పేరుతో కాకుండా తన ప్రతిభతో  పరిచయమయ్యేవారు అతి కొద్దిమంది ఉంటారు అందులో జాకీర్ హుస్సేన్ ఒకరు. మొదటగా మన దేశంలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీని 1966లో కోల్‌కతాలో నటీనటులు జీనత్ అమన్ మరియు మాళవిక తివారీ తాజ్ మహల్ టీ యాడ్ తో ప్రారంభించారు కానీ తయారీదారులు ఆశించినంత ప్రజాధారణ పొందలేకపోయిందని గమనించారు. ఆతర్వాత హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ (HTA) ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడానికి భారతీయతను పాశ్చాత్య ఎక్స్‌పోజర్‌తో సమతుల్యం చేసే బ్రాండ్ అంబాసిడర్ అవసరం వచ్చింది. తబలా అభిమాని అయినా (HTA) కాపీ రైటర్ KS చక్రవర్తి జాకీర్ హుస్సేన్ పేరు ఎంపిక చేశారు. ఎంపిక సమయానికి హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండటంతో KS చక్రవర్తి అతన్ని సంప్రదించి తాజ్ మహల్ టీ యాడ్ మీరే చేయాలనీ పట్టుపట్టడంతో అందుకు హుస్సేన్ విముఖత చూపలేక సరే అని తాజ్ మహల్ టీ దేశ నలుమూలల వ్యాప్తిచెందాలనే సంకల్పంతో యాడ్ కొరకు తన సొంత ఖర్చుతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ కి వచ్చారు. ప్రకటన యొక్క స్క్రిప్ట్  కొరకు గంటల తరబడి సాధన అనంతరం విజయవంతంగా పూర్తి చేశారు. దీన్నిబట్టి దేశంపై జాకిర్ హుసేన్ ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ వాణిజ్య ప్రకటన తర్వాత తాజ్ మహల్ టీ బ్రాండ్ హుస్సేన్ ఇంటి పేరుగా మారింది. అయితే ఈ ప్రకటనలో హుస్సేన్ కప్పు టీ తాగుతూ కనిపిస్తున్న దృశ్యాన్ని మరియు తబలా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ప్రసిద్ధ స్వరకర్త హరీష్ “వాహ్ ఉస్తాద్, వాహ్!” చెబుతుండటం దానికి బదులుగా పెర్కషన్ వాద్యకారుడు, "అర్రే హుజూర్, వాహ్ తాజ్ బోలియే"  ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది. తాజ్ మహల్ టీ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అంతేకాకుండా "వాహ్ తాజ్" అనే పదం చాలా సందర్భాలలో తరచుగా ఉపయోగించే బజ్‌వర్డ్‌గా మారింది. ప్రతి రోజు ఉదయాన్నే తాజ్ మహల్ టీ తాగే ప్రేమికులు మాత్రం ఆయనను ఎలా మరిచిపోగలరు. సంగీత ప్రియుడైన నేను తన మధురమైన ధ్వనులను ఎలా మరిచిపోగలను చెప్పండి. ఆయన ప్రతిభకు ఎవరైనా “వాహ్ ఉస్తాద్, వాహ్ అనాల్సిందే.

నాలుగు గ్రామీ అవార్డు లతో పాటు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, USA నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ మరియు ఫ్రాన్స్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌లో అధికారితో సహా లెక్కలేనన్ని అవార్డులు మరియు గౌరవాలు అందుకున్నారు.
2024 లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్‌ చరిత్ర సృష్టించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో, మన దేశంతోపాటు ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది.

ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం:

మన నిత్యజీవితంలో ఒక చిన్న అవార్డు వస్తే ఉప్పొంగి పోయే వాళ్ళని చూస్తుంటాము. కానీ కొంతమంది ఎన్ని అవార్డులు సంపాదించినా నేనే గొప్ప అనే భావన ప్రస్తావించరు అలాంటి వారిలో జాకిర్ హుస్సేన్ ఒకరు. "ఎన్ని అవార్డులు వచ్చినా, ఎప్పుడూ నేర్చుకోగలగడం ఎంతో ముఖ్యం అని చెపుతుంటారు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన ఒకేఒక మాట "మనల్ని మనం బెస్ట్‌ అని అనుకోకూడదని" తండ్రి చెప్పిన మాటే ఇప్పటివరకు  ఈస్థాయిని చేర్చగలిగిందని పలు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు.

అసలు సిసలు హిందుస్తానీ రాగాల ఉస్తాద్ హుస్సేన్ ఇక లేడన్న విషయం సంగీత ప్రియులందరికీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తూనే ఉంటాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...


ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఒక నాయకుడిగా ఎదగాలంటే అసాధారణమైన విషయం, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే తన ప్రతిభా పాటవాలతో అత్యున్నత పదవులు అధిష్టించి అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) మరణ వార్త యావత్ దేశాన్ని  దిగ్భ్రాంతికి గురి చేసింది. గొప్ప  ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినప్పటికీ, తన విజయాన్ని తన ఘనతగా చెప్పుకోకుండా, పేరు ప్రతిష్టలకు పాకులాడకుండా, అప్పగించిన పనిని నిబద్దతతో చేసి సాదాసీదా జీవితాన్ని గడిపిన నాయకులలో మన్మోహన్ సింగ్ ఒకరు. చేసినవి చెప్పుకోలేదు. హంగు ఆర్భాటాలకు పోలేదు. అవమానాలు, అడ్డంకులు అన్నీ సమానంగా స్వీకరించగలిగిన  గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం:

ఆయన దేశ ఆర్థిక మంత్రి పదవిలో ఉండగా, ఒక సారి ఆయన భార్య, గురుశరణ్ కౌర్ చపాతీ పిండి తీసుకురమ్మని  సింగ్ వ్యక్తిగత సిబ్బందిని పురమాయించడంతో ఆ విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ వెంటనే తన భార్యను పిలిచి సిబ్బంది ఉన్నది ఇంటి అవసరాల కోసం కాదని, కేవలం ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మాత్రమే అని  చెప్పారట. ఇలాంటి నాయకులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? అలంటి వారిని మనం చేతి వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఈ రోజుల్లో మండల మరియు జిల్లా స్థాయి నాయకులు ప్రభుత్వ సిబ్బందిని తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి అయినప్పటికీ వ్యక్తిగత అవసరాలకు వారిని వినియోగించుకోకపోవడం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటివి విషయాలు ఎక్కడా బహిర్గతం కాకపోవడం ఆయన నిరాడంబర జీవితానికి నిదర్శనం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఆయన కూతురు కాలేజీకి వెళ్ళడానికి ప్రభుత్వ బస్సు లోనే వెళ్ళేదన్న విషయం. ఈ రోజుల్లో చిన్న స్థాయి నాయకుడైన తమ పిల్లలకు మంచి ఖరీదైన కార్లు కొనేస్తున్నారు అంతేకాకుండా వారికి ప్రత్యేక సెక్యూరిటీ ని కూడా నియమిస్తున్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారు మాత్రం తన పిల్లలను క్రమశిక్షణ తో పాటు నిజాయితీగా జీవించమని సూచనలు ఇచ్చే గొప్ప మానవతావాది.

మన్మోహన్ సింగ్ ఎక్కువ కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుండి లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు, ఆతర్వాత అతను ట్యాక్సీలు అద్దెకు తీసుకున్నందుకు రచయిత కుష్వంత్ సింగ్ నుంచి తీసుకున్న రూ.2 లక్షలు తాను ఉపయోగించలేదని చెప్పి వెంటనే తిరిగి ఇచ్చాడట. మన్మోహన్ సింగ్ దగ్గర 2 లక్షల రూపాయలు లేకపోవడమేంటని ఆశ్చర్యపోయిన ఖుష్వంత్ సింగ్, ఇదే విషయాన్నీ తాను రాసిన "Absolute Khushwant: The Low-Down on Life, Death and Most Things in-Between" అనే పుస్తకంలో డా. మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధి ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఉన్న ప్రధానులలో మన్మోహన్ సింగ్ గొప్ప ప్రధాని, ఎలాంటి మచ్చలేని నాయకుడు అని ప్రత్యేకంగా రాశారు.

నిబద్ధత కలిగిన నాయకుడు:

ఇప్పటి వరకు ఏ దేశ ప్రధాని కూడా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మనం కనీ, వినీ ఉండకపోవచ్చు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం తన లంచ్ బాక్స్ ఇంటి నుండి తెచ్చుకొని తినేవారట. ఈ విషయాన్నీ అప్పటి లోక్ దళిత్ ఫోరమ్ సెక్రటరీ ఆర్ రవికుమార్ ప్రత్యేకంగా చూశానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా తాను తీసుకున్న నిర్ణయాలు ఆయన నిబద్ధతకు నిదర్శనం. మనను ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయమేమిటంటే, మన్మోహన్ సింగ్ లండన్ లో చదువుకునే రోజుల్లో తన తండ్రి సర్దుబాటు కాక సమయానికి డబ్బులు పంపించని సందర్భాలలో ఆయన తన వద్ద ఉన్న మొత్తం డబ్బులతో ఫేజు చెల్లించి కేవలం  మంచినీళ్ళు తాగేవారని ఆయన కూతురు తెలిపింది.

దారి చూపిన దార్శనికుడు:

దేశం ఆర్థిక సంక్షేమంతో కొట్టుమిట్టాడుతున్న వేళ, అత్యంత సాహసోపేతంగా విప్లవాత్మకంగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, జవసత్వాలుడిగిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దార్శనికుడు మన్మోహన్ సింగ్. భారత్‌తో అమెరికా అణు ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య కొన్ని అడ్డంకులు వచ్చినా మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం దృష్ట్యా అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో డాక్టర్ మన్మోహన్ సింగ్ చర్చల అనంతరం పౌర అణు ఒప్పందంలో సహకరిస్తామని ప్రకటించారు. అణు ఒప్పందం ప్రకటన తర్వాత మన్మోహన్ సింగ్ యొక్క ప్రధాన మంత్రిత్వానికి కీర్తి కిరీటం గా నిలిచింది. రెండు దేశాల మధ్య ఒప్పందం అణు వర్ణవివక్ష అంతం చేయడమే కాకుండా అనుకూలమైన భౌగోళిక రాజకీయ ఆకృతీకరణ సృష్టించింది. విదేశీ వ్యవహారాల్లో, ముఖ్యంగా అమెరికా తో సంబంధాలు మెరుగుపరచడంలో మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధానికి అమెరికాలో గౌరవం లభించింది:
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌ను అధికారిక పర్యటనకు ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు చెప్పబోతుంటే, "మీరు నాకు గురువులాంటి వారు మీలాంటి వారిని కలవడం నా అదృష్టం" అని వినమ్రంగా చెప్పారు ఒబామా. 
అంతేకాదు అణు ఒప్పందం కుదుర్చుకున్న రెండేళ్ల తర్వాత కెనడాలోని టొరంటోలో జరిగిన జీ20 కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ. మన్మోహన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేసారని కొనియాడుతూ, ఆయన రాసిన ‘ఎ ప్రామిస్ ల్యాండ్’ పుస్తకంలో మన్మోహన్ గురించి ప్రస్తావిస్తూ, భారత ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ తన సంస్కరణలతో అనేక మందిని పేదరికం నుంచి బయట పడేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనాపరుడు మరియు నిజాయితీపరుడు అని కొనియాడారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో అత్యున్నత విలువలు పాటిస్తూ వ్యక్తిగత దూషణలకు ఆమడ దూరంలో ఉన్న అతి కొద్ది మంది ప్రముఖులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంజలి ఘటిద్దాం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

29, నవంబర్ 2024, శుక్రవారం

కరెంట్ కార్మికుల కన్నీటి గాథలు

కరెంట్ కార్మికుల కన్నీటి గాథలు:

విశాఖపట్నం రోడ్డు ప్రమాద ఘటన మరిచిపోకముందే మరో ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. గురువారం అంటే 21.11.24 సాయంత్రం వాట్సాప్ చూస్తుండగా ఓ మిత్రుడు పంపిన వీడియో చూసి ఓపెన్ చేశాను. అది ఒళ్లు గగుర్పొడిచే వీడియో. సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న విద్యుత్తు ఉద్యోగి ఒక్కసారిగా షాక్‌కు గురై శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ  ధైర్యంతో ప్రాణాలతో బయటపడిన ఘటన అది. మరో విషయం చెప్పడం మరిచిపోయాను ఆ వీడియో లో ఉన్న వ్యక్తి మరెవరోకాదు నా స్నేహితుడే. శరీరం కాలిపోవడం వల్ల నా స్నేహితుడే అని తెలుసుకోవడానికి కూడా చాల సమయమే పట్టింది. తెలిసిన మరోక్షణమే మిత్రుడొకరు కాల్ చేసి తెలియజేసిన వార్త పని ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని. కరెంట్ పని అంటేనే ప్రాణాలతో చెలగాటం. అందులో ఉద్యోగి కి పని ఒత్తిడి అంటే మరణంతో కుస్తీ చేయాల్సిందే.

కరెంట్ కార్మికుల కన్నీటి గాధ. వెలుగులు అందించే అన్నలకు బతుకంతా బాధ. ప్రపంచానికి వెలుగునందిస్తారు కానీ వారి జీవితాలలో వెలుగులు నింపుకోలేని నిస్వార్ధ కార్మికులు "కరెంటు కార్మికులు".

ఒక్క క్షణం కరెంటు లేకపోతేనే అల్లాడిపోయే మనం. మన సుఖం కోసం కరెంటు కార్మికులు పడే కష్టం. ఎండనక వాననకా, పగలనక రాత్రనక ఎల్లవేళలా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి వెలుగునందించడం కోసం కరెంటు ఉద్యోగుల కష్టాల గురుంచి ప్రతిఒక్కరు తెలుసుకోవడం తప్పని సరి.

అసలు 21వ తేదీన ఏం జరిగిందంటే. ప్రమాద బాధితుడి పేరు కృష్ణ. నర్సంపేట 132 కేవీ సబ్ స్టేషన్‌లో గ్రేడ్ 1 ఉద్యోగి. అంటే సబ్ స్టేషన్‌లో విద్యుత్ సంబంధిత పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారుల పని ఒత్తిడి కారణంగా కృష్ణ ఆ రోజు పెయింటింగ్ పని చేశాడు. పెయింటింగ్‌ పని చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అతని శరీరం (చర్మం) 70 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. చేసేపని ఒకటైతే చేయించేపని మరొకటి అన్నట్లు ఆయన విద్యుత్ ఉద్యోగి అయితే అతనితో పెయింటింగ్ పని చేయించడమేంటి? పెయింటింగ్‌లో ప్రావీణ్యం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యుత్ కార్మికులు చెప్పడం నిజం కాదా? అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రమాదానికి కారణం ఎవరు? బాధ్యులెవరు? అనే విషయం పైనే మనం మాట్లాడుకోవాలి.  అతనికి సంబంధంలేని పని చేయించడానికి కారణం ఏంటి? పెయింటింగ్ పని అతనికి సంబంధంలేనప్పుడు అతనిపై పై అధికారులు ఒత్తిడి చేయాల్సిన అవసరమేంటి?.

కరెంటు ఉద్యోగుల కష్టాలు:

వానాకాలం వచ్చిందంటే కరెంటు ఉద్యోగుల గుండెల్లో గుబులు, ఎందుకు అంటారా? అధికారులు ఎప్పుడు విధుల్లోకి పిలుస్తారో తెలియని పరిస్థితి. అయినా ఎలాంటి ఆటంకం లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. వర్షాకాలంలో 12 గంటలు, పదమూడు గంటలకు పైగా శ్రమించినా పనులు పూర్తి కానీ పరిస్థితులెన్నో విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఏఈ, ఏడీలపై భారం పడటమేకాకుండా. సిబ్బంది కొరతతో ఉన్న ఉద్యోగులపై పెనుభారం పడుతోంది. ఇంకో విషయం ఏమిటంటే విద్యుత్ ఉద్యోగుల్లో రెండురకాల రూల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూల్, ఆర్టిజెన్స్ ఉద్యోగులకు ఒక రూల్ (పర్మినెంట్ కానీ ఉద్యోగులు). పని విషయానికివస్తే అంత ఆర్టిజెన్స్ ఉద్యోగులపైనే భారం. పైనపటారం  లోన లొటారం అన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎక్కువ పని తక్కువ. అదే ఆర్టిజెన్స్ ఉద్యోగులకు జీతం తక్కువ పనిమాత్రం చాల ఎక్కువ. జీతంలోనే కాదండోయి, సెలవులలో కూడా రెండు రూల్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు పెడితే జీతం కటింగ్ ఉండదు. అదే ఆర్టిజెన్స్ వారికీ మాత్రం జీతం కట్ చేస్తారు. ఇదేమి రూల్ అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా అని సందేహం ప్రతిఒక్కరికి రావొచ్చు కానీ ఇదంతా ప్రభుత్వం చేయాల్సిన పని. అందరికి సమాన అవకాశాలు, అందరికి ఒకటే రూల్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ వేర్వేరు రూల్స్ వల్ల ఆర్టిజెన్స్ వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్న కార్మికుల గురుంచి పట్టించుకునే నాధుడు లేదు. ఒక్కో సబ్ స్టేషన్ లో నలుగురు ఆర్టిజెన్స్ ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిఉన్నప్పటికీ ఇద్దరు ముగ్గురితో పని చేయించడంవల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురివుతున్నారు.  రూల్స్ విషయమే కాకుండా ఐదేండ్లు దాటినా పదేండ్లు దాటినా వారికీ ప్రమోషన్లు ఉండవనేది జగమెరిగిన సత్యం. విద్యుత్ కార్మికులకు పనిభారం పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాకు ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. రాత్రనక పగలనక ఎంతో కష్టం చేస్తున్నాగాని సరైన జీతం రాక కుటుంబాన్ని పోషించలేక సతమతపడుతున్నారు. అంతేకాదు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబానికి దిక్కు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఒకవైపు ఉద్యోగం పర్మినెంట్ గాక మరోవైపు పని భారంతో తట్టుకోలేక కరెంటు కార్మికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

ఒకేరకమైన పని చేసేవారికి రెండు రకాల సర్వీస్ రూల్స్ అవసరమా? అనే విషయం పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి సేవలందిస్తున్న ఆర్టిజెన్స్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



 



16, నవంబర్ 2024, శనివారం

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్"

అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రపంచ బాక్సింగ్ క్రీడా రంగానికి రారాజు. సింహం వేటాటడం మొదలెడితే ఎంత పెద్ద జంతువైనా వణికిపోవాల్సిందన్నట్లుగా, ఆయన రింగ్ లోకి అడుగు పెడితే  ఎంతటివారైనా వణికిపోవాల్సిందే. ఆయన కొట్టే పంచులకు ప్రత్యర్థుల గుండెలు అదరాల్సిందే, బాక్సింగ్ పంచ్ లకు పాఠం నేర్పిన గురువు ఆయన. ప్రపంచ ఛాంపియన్ గా తిరుగులేని బాక్సర్ గా చరిత్ర సృష్టించి ఎంతో మంది ఆటగాళ్లను మట్టికరిపించిన యోధుడు. బాక్సింగ్ చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తిగా పేరుగాంచిన వరల్డ్ హెవీ వెయిట్ బాక్సర్ " మైఖేల్ గెరార్డ్ టైసన్ (మైక్ టైసన్)".

మైక్ టైసన్ ఆటంటే అభిమానులకు పెద్ద వేడుక. టైసన్ బరిలోకి దిగగానే స్టేడియం ఈలలు మరియు ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. టైసన్‌ని చూస్తే ప్రత్యర్థుల్లో భయం ఏమోగానీ అభిమానుల చేసే హర్షధ్వానాలు వింటుంటే ప్రత్యర్థుల గుండెల్లో ఒక రకమైన భయం పుడుతుంది. టైసన్ పంచ్ పులి పంజాలా శక్తివంతమైనది. ఓ పంచ్ వేస్తే ప్రత్యర్థుల ఆశలు గల్లంతైనట్లే అలా మొదటి రౌండ్ లోనే వెనుదిరిగిన వారెందరో ఉన్నారు. అంతేకాదు ఆయన వేసిన పంచ్‌ల వల్ల ఎముకలు విరిగి రక్తం కారడంతో కొందరు కోమాలోకి వెళ్ళిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టైసన్‌తో ఆట అంటే మృత్యువును ఎదుర్కోవడం లాంటిది.

1985లో అరంగేట్రం చేసిన టైసన్ 2005 వరకు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత 58 ఏళ్ల వయసులో నవంబర్ 15, 2024న 59వ సారి పోటీ చేయనున్నాడని తెలిసి అభిమానులు అతని విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అతను ప్రత్యర్థి 27 ఏళ్ల జేక్ పాల్‌తో 7 రౌండ్ల పాటు వీరోచితంగా పోరాడాడు మరియు 8వ రౌండ్‌లో, అతని శరీరం సహకరించక ఓటమిని చవిచూశాడు. అతని ఓటమి టైసన్ కంటే అభిమానులకే ఎక్కువ భాద కలిగించింది. 39 సంవత్సరాల పాటు ప్రపంచ ఛాంపియన్ గా ఎన్నో రికార్డులు సృష్టించి బాక్సింగ్ క్రీడారంగంలో ధీరుడిగా నిలిచిన టైసన్ ఓడిపోవడమేంటి ఇది కలా లేదా నిజమా అని అభిమానులకు నమ్మశక్యం కానీ  విషయం. కానీ ఇది నమ్మలేని నిజం.

గెలిచిన ప్రతివాడికి ఏదో రోజు ఓటమి తప్పదన్నట్లు 59 సార్లు పోటీలో పాల్గొని 50 సార్లు  ఎదురులేని విజయాలు సాధించి బాక్సింగ్ రారాజుగా చరిత్ర సృష్టించాడు కానీ 59 వ పోటీలో ఓటమిపాలై అభిమానులకు గెలుపు ఎప్పుడు ఓటమి కొరకే అనే పాఠాన్ని నేర్పాడు.

ప్రపంచంలోని బాక్సింగ్ క్రీడాకారుల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన టైసన్ ఓటమి అనంతరం అభిమానులతో ఇలా అన్నారు "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒకరోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతివాడికి ఏదో ఒకరోజు గెలుపు తప్పదు, నేను ఓటమితో కుంగిపోను గెలుపుతో పొంగిపోను అని అభిమానులకు ఒక గొప్ప సందేశం అందించారు.

ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ, తుమ్ముకు తమ్ముడు లేడన్నట్లు గెలిచిన ప్రతివాడిని భుజాన ఎత్తుకొని ఉరేగించేవారున్నారుగాని, ఓడిపోయినవారి భాదను అర్థం చేసుకొని ఓదార్చే వారు ఉండరు. టైసన్ గురించి తెలియని పిల్లకాయలు కూడా టైసన్ ఓడిపోయాడని తెగవాగేస్తున్నారు కానీ మనం గమనించాల్సింది ఒకటి. టైసన్ వయసుకు ప్రత్యర్థి వయసుకు సగం తేడా 58 సంవత్సరాల వయసులో కూడా 27 వయసులో ఉన్న బాక్సర్ తో పోటీకి సిద్దమయ్యాడంటే, ఒకరకంగా చెప్పాలంటే టైసన్ గెలిచినట్లు.  

చిన్నతనంలో ఎన్నో కష్ట నష్టాలను చవిచూసిన టైసన్ 13 ఏళ్ల వయసులో 38 సార్లు బాల నేరస్థుడిగా అరెస్టయ్యాడనే విషయం ఎంతమందికి తెలుసు? మైక్ టైసన్ నేరస్థుడి నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడో తెలుసుకోవాలంటే ఈ కథనం తప్పక చదవాల్సిందే.

1966లో న్యూయార్క్ నగరంలో జన్మించిన మైక్ టైసన్ బాల్యం కష్టాలు, కన్నీళ్లతో సాగింది. పేదరికం మరియు వ్యక్తిగత కారణాలతో ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరిగేది. ఎప్పుడు గొడవలు జరిగినా టైసన్‌కు కోపం వచ్చేది. ఓ రోజు పెద్ద గొడవ రావడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడం తో కుటుంబ భారం అంతా తల్లిపైనే పడింది. కుటుంబ పోషణ కోసం తల్లి ఆర్థికంగా, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. టైసన్ చూడటానికి అసహ్యంగా ఉండటంవల్ల అతని స్నేహితులందరూ అతన్ని ఏడిపించేవారు. అందువల్ల అతనికి అంతులేని కోపం వస్తుంటుంది. స్కూల్ లో జరిగిన విషయాలేమి తల్లితో చెప్పకుండా ఎదురు దాడికి దిగి స్నేహితులను రక్తం వచ్చేలా కొట్టాడు అంతే తప్ప ఇతరులకు చెప్పి బాధ పడేవాడు కాదు. తండ్రి భయం లేనందున తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎప్పుడు  స్నేహితులతో గొడవ పడేవాడు. అతనికి ఎప్పటినుంచో పావురాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు, టైసన్ తన కంటే పెద్ద వ్యక్తి పావురాన్ని హింసించడాన్ని చూడకుండా ఉండలేకపోయాడు. చివరకు అతనితో గొడవపడి చితకబాదారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులో చిన్న చిన్న నేరాలకు పాల్పడి 38 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒకరోజు మాజీ బాక్సర్ బాబీ స్టీవర్ట్ అతని కోపాన్ని మరియు అతను విసిరిన పంచ్‌లను చూసినప్పుడు అతని బాక్సింగ్ సామర్థ్యాన్ని గమనించాడు. చిన్నచిన్న దొంగతనాలు చేసే టైసన్‌ని గొప్ప క్రీడాకారుడిని చేయాలనే ఆలోచన వచ్చింది. స్టీవర్ట్ టైసన్‌ను అద్భుతమైన బాక్సర్‌గా భావించాడు. అతనికి కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చి బాక్సింగ్ ట్రైనర్ కస్ డి'అమాటోతో పరిచయం చేశారు. 16 సంవత్సరాల వయస్సులో అతని తల్లి మరణించిన తరువాత, అతను అమాటో వద్ద ఉంటూ బాక్సింగ్ శిక్షణలో మెలకువలను నేర్చుకున్నాడు. టైసన్ తన బాక్సింగ్ అరంగేట్రం 1985లో న్యూయార్క్‌లోని అల్బానీలో చేశాడు అప్పుడాయన వయసు 18 సంవత్సరాలు. తొలి ఆటలోనే TKO ద్వారా హెక్టర్ మెర్సిడెస్‌ను మొదటి రౌండ్లో ఓడించాడు. KO లేదా TKO ద్వారా నిర్వహించిన 28 పోటీలలో 26 గెలవడమే గాక అందులో 16 పోటీలలో మొదటి రౌండ్లోనే ఓడించి ప్రేక్షకులను దిగ్భ్రాంతుల్ని చేసి, అభిమానులను ఆనందోత్సాహాలతో ఉర్రుతలూగించారు. అతి తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

గొరిల్లా తో పోటీకి సిద్ధపడిన టైసన్:

1980 లో న్యూయార్క్ లోని ఓ జూ పార్క్ సందర్శించినప్పుడు జూలో చాలా గొరిల్లాలు ఉండగా అందులో ఒక గొరిల్లా ఇతర గొరిల్లాలను కొడుతుండటం చూశారు. జంతు ప్రేమికుడైన టైసన్ ఎలాగైనా ఆ గొరిల్లా అంతు చూడాలని పట్టుబట్టి అక్కడ ఉన్న సిబ్బందితో ఎంత డబ్బైనా ఇస్తాను కానీ నేను ఆ గొరిల్లాతో పోరాడాలని చెప్పగా అతనికి టైసన్ గురించి తెలిసి ఏమాత్రం ఒప్పుకోలేదట. చావుకు కూడా భయపడని వ్యక్తిత్వం ఆయనది. చిన్నతనంలో పావురం కోసం పోరాడి చివరకు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌గా ఎదగడం గొప్ప విషయం కదా!

ప్రమాదకరమైన జంతువుల పట్ల మైక్ టైసన్‌కు ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఎవరైనా పులిని చూడగానే వణికిపోతారు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ టైసన్ మాత్రం పెంపుడు కుక్కలు పెంచుతున్నట్లు పులులను పెంచుకుంటాడు. వాటితో సరదాగా ఆడుకుంటాడు కూడా. ఒకసారి మూడు పులులను కొనుగోలు చేశాడంట, వాటికోసం ఏకంగా ఎక్స్ఛేంజ్లో దాదాపు $71,000 ఖర్చు చేశాడంట అంతేకాకుండా ఆయన బెడ్ రూంలో    పులులతో నిద్రించిన సందర్భాలు ఉన్నాయంట దీన్నిబట్టి టైసన్ ఎంతటివాడో తెలుస్తుంది కదూ!. కొన్నాళ్ళకు పులులను పెంపుడు జంతువులుగా చూడకూడదని గ్రహించి, 14 సంవత్సరాల తర్వాత వాటిని అభయారణ్యంలో వదిలేశాడు. కానీ పులులంటే ఆయనకు అమితమైన ప్రేమేనంట.

ఆయన సాధించిన విజయాలు:

WBC, WBA మరియు IBF ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన బాక్సర్‌గా టైసన్ చరిత్ర సృష్టించారు. అతను WBA, WBC మరియు IBF టైటిళ్లను ఏకకాలంలో సాధించిన మొదటి హెవీ వెయిట్ బాక్సర్.

టైసన్ స్ఫూర్తి ఎవరంటే:

టైసన్ యొక్క ప్రేరణ మహమ్మద్ అలీ అని చాలా మంది అనుకుంటారు, అయితే టైసన్

ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్న పేర్లను విని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. అలీ నాకు బాక్సింగ్‌పై ఆసక్తి కలిగించాడు కానీ నాకు స్ఫూర్తిని కలిగించలేదని టైసన్ చెప్పాడు. రాబర్టో డ్యూరాన్ మరియు షుగర్ రే లియోనార్డ్ నన్ను గొప్ప బాక్సర్‌గా మార్చడానికి ప్రేరేపించారని అన్నారు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి… ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి… కానీ… అల ఎంత ఉప్పొంగినా...